March 29, 2024

కవి పరిచయం – రాజ్ రెడ్డి

పేరు..రాజ్ రెడ్డి.
నివాస స్థలం బెంగళూరు.

ప్రవృత్తి పరంగా కవిత్వాన్ని రాయడాన్ని ఎక్కువ ఇష్టపడతారు. సాహిత్యాన్ని ఔపాసన పడుతుంటారు. కొత్త ప్రదేశాలు చూడటం,అవసరమైనప్పుడల్లా మానవత్వంగా ప్రతిస్పందిస్తూంటారు.
ఆశకీ శ్వాసకీ మధ్య సంబంధం తెలియాలంటే ఈయన కవిత్వం చదవాల్సిందే. మనసులు మాట్లాడుకునే ఊసులన్నీ కాగితాన్ని కౌగిలిస్తే వారు రాసినట్టే. “కన్మణీ” అంటూ కమ్మని గారాన్ని ఒలికిస్తూ చదువరులను ఇట్టే కట్టిపడేస్తారు. వసంతమంతా సన్నజాజులై పూసే అమృతహేల, మోహనరాగ పరిమళం మనసుని మీటే వేళ, కొమ్మారెమ్మా ఊహలు గుసగుసలాడినట్టే ఉంటుందీయన “పదసుతారం”..
తొలివలపు తరంగాలు సందోహాలై ఆల్లుకుంటూ, గలగల పారుతున్న గోదావరి ఆత్మగతమైన ఆనందం, పదచిత్రాలుగా కళ్ళముందుకొచ్చిన వారి కావ్యసిరి “కన్మణి”. అందానికి కదలికలుంటే ఆ సౌకుమార్యమూ, పవిత్రతా, పాత్రతా, మమకారమూ, మాధుర్యమూ, పరిపక్వమూ, ఔన్నత్యమూ, అమృతత్వమూ అన్నీ కలగలిసిన అద్భుతమైన యువతి కన్మణి కదా అనిపిస్తుంది. ఎంతగానో ఆమెని ఆరాధించి పరిపూర్ణత్వం సాధించినట్లు వీరి కవిత్వం చదువుతూండగానే అర్ధమవుతుంది.
ప్రేమకవిత్వమే కాక సమకాలీన సమస్యలపై అంతే తీవ్రంగా స్పందించడం తెలుస్తుంది. జీవన ఇతిహాసాలు, సంస్కృతికి శకలాలు వంటి నమూనా దృశ్యాలు, సార్వజనీనమైన నీతిబోధలు, సామాన్య ప్రజల కష్టాలు, నిరాడంబర ఆదర్శాలు ప్రతీదీ అనుభవించినంత హృద్యంగా అనిపిస్తాయంటే అతిశయోక్తి లేదు.
“నీ చిరునగవుల చిత్ర స్పందన
మూసి ఉన్న కళ్ళలో పూసిందంటే..
దృశ్యం.. రాగమవుతున్నట్లుంటుంది.!
ఈ మేలుకొలుపులో, ఏటవాలు చూపుల తొలి కిరణం
వచ్చీ రాగానే.. వనంలో ఏం వెదుకుతుందో మరి..
నా దాహపు కళ్ళకు మాత్రం
నీ తలపుల చెలమలో.. మోహం తీరినట్లుంటుంది.! ” ఇలా రాగరంజితమయ్యే చక్కని ఊహలు నిద్ర లేపాయంటే ఆరోజెంత తీయగా గడుస్తుందోననిపిస్తుంది కదూ.
“బృందగానంలో ఆలాపనొకటి.. అంతరాత్మను మీటిందని
అదేదో దేవరాగమనుకుని
హృదయాన్ని అరాలు తీస్తే తెలిసింది
నీ పెదవులంటిన నా పేరు..
పులకింతల పాలైన చినుకnలా
క్షణానికో మురిపాన్ని తడుపుతుంటే.. అనిపించింది..
సౌందర్యలహరి నీలోంచి నాలోకి ప్రవహించిందని..!” అంతులేని ఆనందం స్వరజతులై మదిని ఊపితే ఆ భావనెంత హృద్యమో ..
“మనోలోకానికి తెరలు కట్టి నేను లోపలా బయటా ఉంటూ కాలంతో దాగుడుమూతలాడతానని నా కవిత్వాల్లో స్పష్టంగా తెలియాలంటే..అందరూ నీ గురించి నేను రాసిన మాటలు చదివి ఎవరికి వారే మనసులో ఓ ప్రేమలోకాన్ని సందర్శించుకోవాలని అనుకుంటే చాలు.. ఎంతో మధురమైన మాటలు అవంతటవే పుట్టుకొస్తున్నాయి.! ” నిజమే కదూ..ఇంత ఆత్మీయతను చవిచూసి పాఠకులకు పారవశ్యాన్నిలా పంచుతుంటే, ప్రేమించబడాలనే కోరిక జనించకుండా ఉంటుందా..?!
కన్మణి అనేది కంటిపాపై తనలో ఒక భాగమైనట్టు అతని నిత్యపోషణ చేయడంలో నూరుపాళ్ళు సఫలీకృతమయ్యింది. ఊహాతీతమైన చిత్త సంచలనాన్ని ఆమె ఉనికిగా మనకి పరిచయించి హృదయబంధానికున్న విలువను ఆసాంతం అనుభూతించేలా చేసారు.
అక్షరసత్యాలన్నీ ముత్యాలసరాలుగా పేర్చడమే ఈయనకి మక్కువేమోనన్నట్టు కొన్ని చదువుతుంటే మౌనభాష్యానికి అర్ధం చేకూర్చేందుకే రాసారనిపిస్తుంది. తనతో తను పంచుకున్న ఆవేదనకి అక్షరరూపమిచ్చి ఓదార్చుకునే ప్రయత్నం చేస్తుంటారనిపిస్తుంది.
“చాటు కోసం రెప్పల వెనుక చేరి
రాత్రంతా మాటు వేసిన స్వప్న సంచలనాలు,
నీ ఆలింగనాలను చూపులకు జత చేసి పంపాయేమో..
ఈ ఉదయం విరహంలో పడిపోతున్నట్లుంటుంది.! ” ఇంతటి మోహవిషాదాన్ని వర్ణించగలవారెవ్వరు

“లోకం
దుఃఖాన్ని హెచ్చించి
సంతోషాన్ని భాగించే పథకాలను వెదుకుతోంది .,” అంటూ ఒక్కోసారి లోకం తీరుకి తల్లడిల్లుతారు.

“సొంతూరు, ఎన్ని కోసుల దూరమైతేనేం..
ధరిత్రి పరచిన దారులు తెరిచే ఉన్నాయ్
నడిపించే సంకల్పాలు, మాలో బ్రతికే ఉన్నాయ్.!
ఎవడో ఏదో బండి, పంపకపోతేనేం..
అరి కాళ్లలో మాకందరికీ చక్రాలున్నాయ్
మజిలీ మజిలీకి, మాకిన్ని ఆపన్న హస్తాలున్నాయ్.!” అంటూ ఇటీవల పాదచారులుగా పయనిస్తున్న ఎందరి ఆక్రోశాన్నో తన కలంలో గర్జించారు.
ఒక్కోసారి గతజీవితపు పుటల్ని తిరగేస్తూ కలత చెందుతారనిపిస్తుంది. చాలాసార్లు మౌనానికి ఉనికిగా తన ఆనవాళ్ళను విడిచి మరీ మాయమవుతారు.
మనసు ముట్టుకు రాయించిన కవిత్వం కనుకనే అందులో అనుభూతి..జీవదాహాన్ని తీర్చేసినట్టనిపిస్తుంది.
చెప్పేదేముంది..
ప్రతి కవితలోనూ వైవిధ్యం..జీవితంతో మమేకమైన సృజనానుభవం..
ఇదంతా ఒక ఎత్తైతే..ఇన్ని భావాలను అపురూపంగా ఆలింగనం చేసుకొనేందుకు నిస్స్వార్ధమైన నేస్తాలు..మాటలకందని ఉత్సాహాన్ని ప్రోత్సాహంగా గుప్పించి కేరింతలు కొట్టే చందన హృదయాలు. ఎన్నో మనోభావాల వెల్లువలు ఇష్టంగా ముంచెత్తినప్పుడు మునకేయాలని కోరుకోని సమ్మోహనులెవ్వరు..?!
ఒక్కో కవనాన్ని విప్పార్చి చూసేకొద్దీ నిండే హృదయపు బరువు తూచుకొనేందుకు అదో సంక్లిష్టం..ఇప్పటికిదో సశేషం.. మరిన్ని చక్కని భావాల సందడితో త్వరలో పుస్తకరూపంలో విచ్చేయగలరని ఆశిస్తూ..మనఃపూర్వక అభినందనలు..💐

2 thoughts on “కవి పరిచయం – రాజ్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *