April 25, 2024

గిలకమ్మ కతలు – “య్యే..నన్నంటే..నేనూరుకుంటానా?“

రచన: కన్నెగంటి అనసూయ

“ ద్దా..ద్దా..గమ్మున్రా..! నీకోసవే సూత్నాను ఇందాకట్నించీని..!”
మజ్జానం అన్నానికని బణ్ణించి ఇంటికొత్తా అప్పుడే గుమ్మాలోకొచ్చిన గిలకమ్మన్జూసి కంగారుకంగారుగా అంది సరోజ్ని.
“య్యేటి? అమ్మిలా కంగారు పెట్టేత్తింది ఇంకా ఇంట్లోకి రాకుండానేని? ఏ వడియాల పిండన్నా రుబ్బిందా యేటి? లేపోతే ఏ పిండొడియాలన్నా పోత్తానికని పిండుడికిచ్చిందా ఏటని మనసులో అనుకుంటా సుట్టూ సూసింది గిలక.
ఎటుకేసి సూసినా అలాటిదేదీ ఆపడాపోయేతలికి..
“ ఏటలా కంగారు పెట్టేత్నావేటే అమ్మా..! ఇప్పుడే గదా ఇంటికొత్తా? ఇదొరకంతా కాల్లు కడుక్కురా సుబ్బరంగాను అనీ దానివి. ఇప్పుడేటి..ఇలా మాట్తాడతన్నావ్? “ అంది గిలక పుస్తకాల సంచిని వాల్చున్న మంచమ్మీదడేసి లంగా పైకంటా ఎత్తి పట్టుకుని తూవులోకెల్లి సెంబుతో సెంబుణ్ణీల్లు కాళ్ళ మీద కుమ్మరిచ్చుకుంటా..
“పనుందిలే..నువ్ బేగిని వణ్నం తినేసి బళ్ళొకెల్తే…తలుపేసుకుని అవతల దొడ్లోకెల్లి పన్జేసుకుందావని..”
రెండు పళ్ళేల్లో అన్నం పెట్టి కాతంత కూరేసి తెచ్చి పిల్లలిద్దరికీ అందిత్తా..అదోలా ఉన్న సరోజ్ని కేసి తెల్లపోయి సూసింది గిలకమ్మ.
ఇంతలో…
“ సరోజ్నే…దిగడ్డారా ఈల్లు..?” బయట్నించి లోపలకంటా ఇనపడేట్తు సందులో సూరేసాయం కేక.
దాంతో సరోజ్ని గుండెలు బేజారెత్తిపోయేయేమో..ఒక్కుదుటున పిల్లల రెక్కలట్టుకుని వంటింట్లోకి నెట్టి ఆధాటున గుమ్మాలోకెల్లి..
”ఇంకా రాలేదు స్సూరేసాయం వదినే..! నేనూ ఆళ్లకోసవే సూత్నన్నాను. దిక్కులు సూసుకుంటా అందరూ బళ్ళొకెళ్ళే యేలకి వత్తారు ఎప్పుడూను. దిక్కులు సూడకండల్లా అని సెప్తానే ఉంటాను. ఇన్రు. గబుక్కునొచ్చి ఓ ముద్ద నోట్లో ఏసుకుని ఎల్లే దానికి ..అంతంత సేపు సేత్తారు. ఈల్లు గుమ్మాలొకొచ్చే తలికి మేస్టార్లు వణ్నం తినేసి మళ్ళీ బళ్ళోకి ఎల్తా ఉంటారు. దిక్కులు సూత్తా వత్తారేమో..కాళ్లకి ఒకటే గొప్పులు. సెప్తానే ఉంటానక్కడికీని. వత్తారు. వచ్చీ రాగానే సూరేసాయం మామ్మ నిన్నెంతుకో రమ్మంటందని నీకాడికి అంపిత్తాలే…..” అంటం ఇన్న..గిలక తింటన్న పళ్లాన్నక్కడ పడేసి గబుక్కున గుమ్మం కాడికొచ్చేసింది దూసుకుంటాను..”ఏటే..అమ్మా..” అంటా..
తెల్లబోతం సరోజ్ని వంతైంది..
సుర్రా సుర్రా సూసింది సూరేసాయం సరోజ్నొంక ..గిలకొంక. దాంతో..తప్పు సేసినట్టు కుదేలైపోయి..సందులో సూరేసాయం వంక సూత్తా..
“ మరేంజెయ్యమంటావు సూరువొదినే..! పిల్లేంజేసిందో..నువ్వెంతుకొత్నావో..ఏటో..నువ్వేదన్నా అన్నాకాణ్ణించీ అదేడుత్తా ఆళ్ల నాన్తోజెప్తే ..అదేమో మగాళ్లాదాకా ఎల్లి ఎంత గొడవవుద్దో…ఏటోనని నా దుడుకు నాకుంటది మరి. ఎంతైనా సేన్నాల్లకి పూజల్జెయ్యగా సెయ్యగా పుట్టిన పిల్ల..నా బిడ్దనెవరైనా ఏదైనా అన్నారంటే నా పేనం మాత్రం ఎలాగుంటజ్జెప్పు..”
“ ఓసోస్ నువ్వేగన్నావ్ మరి ..మాగ్గాల్లోంచొచ్చేరు మరి. ” అంటా ఇంత పొడుగున సాగదీత్తన్న సందులో సూరేసాయాన్ని..
“ ఏటమ్ముమ్మా….ఎంతుకడిగేవు మాయమ్మన్నాగురించ్చీ…..?” నడుంమీచ్చెయ్యేసుస్కోని నిఠ్రాడల్లే నిలబడి మరీ అంది గిలక ఆళ్ళిద్దర్నీ మార్సి మార్సి సూత్తా..
“ ఎంతుకడగను..? నువ్వలా ..నేల్లో కుదేసిన దుంగలా నిలబడి నిల్దీసినంత మాత్రాన నేనేం బెదిరిపోను..గానీ దాన్నెంతుకలా కొరికేసేవు..ముక్కూడొచ్చేతట్టు. అదేవందన్నిన్ను. పిలకా అన్నానన్జెప్పింది. పిలకా అన్నంత మాత్తరాన ఆమట్ని కొరికేత్తావా? ..అవ్వ,,పిల్లన్దీసుకొచ్చి నీకు సూపిత్తే సరిపొయ్యేదే సరోజ్నే! ర్త్తందేరిపోయి ఇంతెత్తున వాసిపోయింది. అదీగాకుందాను..వాచ్చీ పెట్టుకునేకాడ ..కొరికేసిందేవో….దీన్దుంపదెగ..పిల్లెనక్కి సూత్తా ఉంటే ముందదే ఆపిత్తంది. రేప్పెల్లీ పెటాకులవ్వాలంటే ఇలాటియ్యన్నీ ఎంతడ్డొత్తాయో నీకు మాత్తరం తెల్దా? అయినా అక్కడసలే య్యెముకదప్ప కండేవుంటాది..కొరుకుతాకి? ఎలా దొరకబుచ్చుకుందోగానీ దీని రాచ్చసి పల్లతో..…అవ్వ..అవ్వ..ఆల్లమ్మా ..పిల్లని ఒల్లో ఏసుకుని ఒకటే గోల..” నా కూతురు ఊల్లో వాల్లకింతలుసయ్యిందాని. కోడలు కల్లనీల్లెట్టుకునేతలికి మాంగారు ఒహటే ఇదైపోయి..పంచె పైకెగ్గట్టి ..ఊళ్లో పెద్ద మడుసుల్దగ్గర పెడదాం ..లేపోతే..దీనారాసకాలు..ఇలాగేసాగి బళ్ళొవోళ్లందర్నీ కొరుక్కుతింటదంటే..నేనే అడ్దంపడి ..ఆపి ఆ మడిసికి టీపెట్టిచ్చి అడిగొత్తానని ఇటొచ్చేను. తెల్లారి లేత్తే మొకామొకాలు సూస్కోవాల..ఎంతుకొచ్చిన గొడవని..ఆపేన్గానీ..లేదంటే..” అంటా ఝాడిచ్చేసింది..సూరేసాయం..
పెద్ద మడుసులన్నమాట ..ఇని జావగారిపోయిందేవో సరోజ్నీ..గిరుక్కునెనక్కి తిరిగి గిలకెనక్కి కల్లెర్రజేసి మరీ సూత్తా..
“ ఏటే..గిలకా ? కొరికేవా? మమ్మల్నింట్లో ఉండనిత్తావాంట..” అందో లేదో..
సర్రున తాసుపావల్లే లేసింది గిలక ఆల్లమ్మ మీద్కి..ఇంతెత్తున..
“ య్యే..కొరకరా? నన్నంటే..నేనూరుకుంటానా? “ ఇంతెత్తున ఎగిరింది గిలక..
“ అయ్యమ్ముమ్మ..సెప్పింది ఇన్నావ్. తిట్టేత్తన్నావ్..మర్నే జెప్పొద్దా..?” ఎదురడిగిన గిలకతో సరోజ్ని ఏదో అంటాకని నోరిప్పిందో లేదో..సూరేసాయం అమ్మాకూతుల్లిద్దరి మజ్జలోకి సొచ్చుకొచ్చేసి..
“ అంటే..నువ్వూ అనే కుర్రముండకానా. అంతే కానీ నీక్కాబట్టి పళ్ళున్నయ్యలాగని..కొరికేత్తావా? పైగా ఎదిరిత్తన్నావా? పెద్దంత్రం సిన్నంత్రం లేదేటే ముండా నీకు? దాన్ని డాట్రు గారి దగ్గర్కి తీసుకెల్లేం. సూది మందేసేడు..నువ్విత్తావా ఆ డబ్బులు..లేపోతే మియ్యమ్మిత్తదా..మీనానిత్తాడా? సెప్పు ..ఎవరిత్తారు? మాకేవన్నా రూపాయల్ని పాతరేత్తే ఊరతన్నయ్యా..మేవూ కట్తపడి సంపాదిచ్చుకున్నయ్యే..” సిన్నపిల్లని కూడా సూడకుండా గిలకమ్మ మీదకంటా వచ్చేసింది సూరేసాయం..
నదర్లా బెదర్లా గిలక. అదే సూపు…అలా సూత్తానే ..
“ ఇదిగో మామ్మా..! డబ్బులెంతుకియ్యాలంట. మాయమ్మివ్వదు. మానానివ్వడు. ఇక్కడ డాట్రారిక్కాపోతే ..ఇంకో ఊరు తీస్కెల్లి సూపిచ్చు..ఇంజక్షన్ సేపిచ్చు. ఇంకోసారి నన్ను పిలకని పిల్సిందనుకో.. ఆల్లముందూ ఈల్లముందూను..రెండో సేతినిగూడా కొరికేత్తాను..”
“ ఆసి ముండకనా..నీకెంత దైర్నవే..! ఏంజూసుకునోగానీ ఈ గీర్మాణం..! ఒక సేతికి ముక్కదీసింది కాక..రెండో రెండో సేతిని కొరికేత్తావా? నీ ముందు పళ్ళూడి మూకుంట్లో ఏగా..దేవుణ్ణీకు బయవెట్లేదేటే..”
పేట్రేగిపోయింది సూరేసాయం కుండలో ఏసి ఏపితే ఎగిరెగిరి పడ్డ ఉప్పుగల్లల్లే..
“ మరీ నువ్వలా నోరు పారేస్కోకు సూరేసాయవొదినే..! నా పిల్ల తప్పు సేత్తే నేన్జాడిత్తాదాన్ని. అదో పక్క మొత్తుకుంటంది గదా..నన్ను పిలకాని పిల్వద్దని. పెట్టు..పెద్ద మడుసుల్లో పెట్టెల్లి. మాకూ ఉన్నారు పెద్ద మడుసులు. మేవూ సెప్పగలం ఊరుకుంటాం అనుకోకు. నా పిల్ల కర్సిందే కనిపిత్తంది. నీ మ్న్రాలు అన్నది కనిపిచ్చదు మరి నీ పచ్చ కల్లకి. అసలేవందో ఇనచ్చు గదా..ఊరికే నోరిచ్చుకుని పడిపోపోతే..” అని సూరేసాయాన్ని నాలుగు సీవాట్లేసి గిలకమ్మెనక్కి తిరిగి..
“ ఏవయ్యిందే..ఒట్టిగా పిలకన్నంతుకే కొరికేసెనట్టు మాట్తాడతండి మామ్మ..పిలకే అందా ఇంకేవన్నా అందా? ఇన్నావ్ గదా పెద్దమడుసుల్లో పెడతానంటన్నాడంట..తాత. అదేంజేసిందో సెప్పు. ఉట్టి పుణ్ణాన మీదబడి కొరికేత్తాకి నువ్వేవన్నా ఊరట్టుకు తిరిగే ఊరకుక్కవా? అదేటో సెప్పు..ఇయ్యాల అటో ఇటో తేలిపొవ్వాల. పిల్లలియ్యాలనుకుంటారు. రేపు కలుత్తారు. ఎందర్ని సూళ్లేదు. సూసీ సూడ్నట్టు ఒదిలేత్తే..అయ్యే సర్దుకుంటాయనుకోక..ఈధిలో కొచ్చి ఈరంగం తొక్కుకుంది..పెద్ద మడుసుల్దగ్గరెడతారంట..పెద్దమడుసులు..సెప్పు అదేటో ఇవరంగా సెప్పు..మీ నాన్నకి సెప్పాలి..పొలాన్నించొచ్చాకా..” రెచ్చిపోయింది సరోజ్నీ..
దాంతో కాతంత బలవొచ్చినట్టయ్యిందేవో గిలక్కి..
‘” కాదమ్మా ..! అస్లేంజరిగిందంటే .. నన్నేవో అందరూను.. గిలకా అని పిలుత్తారా ఇంటికాడ..? మా బళ్ళోను..కొత్తగా ఒకమ్మాయొచ్చి సేరిందమ్మా..దాని క్లాసులోను. ఈళ్ళిద్దరూ జతయ్యేరు..తప్పులొత్తే సెరుగుతుల్లేదు , రబ్బరు కొనుక్కుంటానంటే నువ్వు నిన్న డబ్బులిచ్చావా? రబ్బరు కొనుక్కున్నాకా మిగిల్న డబ్బుల్తో ఏదన్నా కొనుక్కుందావని సంద్రెమ్మ కొట్టుకాడికెల్తే ఈల్లిద్దరూ కూడాను ఏదో కొనుక్కుంటున్నారు…
కొనుక్కునెల్లచ్చు కదా..అమ్మా..! నువ్వేజెప్పు. ఎల్లకుండా..ఆ కొత్తపిల్లకి నన్ను జూపిత్తా..
‘’ దీన్నే ..గిలకంటారు..నేనేమో.. గిలకా..గిలకా.. మా తాత పిలకా.. నల్లటి ఎలకా..పగిలిన పలక..
నూతి మీది గిలక..” అంటా ఏడిపిత్తాను..అని సెప్తుందమ్మా…అదేదో పేద్ద ఈరోయిన్నయినట్టు. ఇదిలా సెప్తుంటే ఆ కొత్తదేమో..నవ్వుతుందమ్మా నన్జూసి. నాకొల్లుమండదా..?‘”
“ మండుద్ది….ఎంతుకు మండదు..ఎర్రటెండలో కారం రాసుకున్నట్టుంటాది.. ఆమట్ని కొరికేవా?”
“ ముందు కొరకలేదమ్మా..! ఎంతుకలా సెప్తున్నావే ? కొత్తోళ్లతో అలా సెప్తారా ఎవురైనా..” అనడిగేనమ్మా.. నేన్జెప్పేదినకుండా..ఇద్దరూ..కల్సి గిలకా…పలకా..ఎలకా..తోకా..” అంటా..పెద్ద పేద్దగా అరుసుకుంటా పరిగెత్తేసేరమ్మా.! “
గిలకిలా సెప్తున్నంత సేపూ.. నిట్రాళ్లా అక్కడే నిలబడి ఇంటందేవో అయ్యన్నీ మనవరాల్జేసింది తప్పనుకుందో ఏవోగానీ ఆమట్నే నీరుగారిపోయినట్తయిపోయి..
“ సర్లే..రేపుటెల్నించీ కొట్టుకోకండి..మీకుఉ మీకూ ఏదన్నా ఉంటే పెద్దోళ్లం మేవున్నాంగదా మాకు సెప్పండి..సర్లేవే సరోజ్నే..ఏవనుకోబాక..” అంది ఎనక్కి తిరుగుతా..సూరేసాయం..
“ సెప్పను..నన్నెక్కడంటే..అక్కడే సెప్తా..” నిఖార్సుగా అన్న గిలక భుజమ్మీద సెయ్యేసి ..
“ నడూ ..లోపలికి ..అన్నాల్దినండి..” అంటూ గిలక భుజమ్మీద చెయ్యేసి లోపలికి తీసుకెల్తుంటే
వెయ్యేనుగుల బలమొచ్చేసింది..గిలక్కి.
లంగా పైకెత్తుకుని గుండెలు విరుచుకుని మరీ లోనికడుగేసింది గిలక..దెబ్బకి దెబ్బ తీస్తానేతప్ప..ఎనకడుగేయనన్నట్టు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *