March 29, 2024

ప్రజ్ఞ

రచన : సోమ సుధేష్ణ

చెట్ల ఆకులతో దాగుడు మూతలు ఆడుతున్న లేత ఎండను చూస్తూ అర్జున్ పచార్లు చేస్తున్నాడు. ప్రతి రోజూ చూస్తున్నదే అయినా ఎప్పటికప్పుడు మొదటి సారి చూస్తున్నంతగా ఆనందిస్తుంటాడు. ప్రకృతిలో వచ్చే మార్పులు ఆయన మనసును తాకకుండా వెళ్ళలేవు. అర్జున్ ప్రకృతి ప్రియుడు. ప్రకృతిలోని ప్రతి జీవిని ప్రేమించే మనసు ఉంది. వాకింగు పూర్తి చేసుకొని పక్కనే ఉన్న ఇంట్లోకి వెళ్తూ ఎదురుగా వస్తున్న జగదీష్ గారిని చూసి నవ్వాడు. ఉదయం నాలుగింటికే లేచిన అర్జున్ ప్రతి రోజులాగే యోగ, మెడిటేషన్ చేసి కాసేపు అలా చెట్లకింద నడిచాడు.
“అర్జున్! ఈ రోజు కుసుమ దీది వస్తోంది. మెడిటేషన్ చేయించిన తర్వాత రాజయోగ మెడిటేషన్ గురించి మాట్లాడుతానంది.”
“అవును నాన్నగారు. దీది వచ్చేసరికి ఉదయం రెండు కరాటే క్లాసులు అయిపోతాయి. దీది కోసం నిన్ననే పతాంజలి హాలు సిద్ధం చేసారు మన వాలంటీర్లు. ఈ రోజు కొంత మంది ముందుగానే వచ్చి ఆఖరి నిమిషంలో చేయాల్సినవి చూసుకుంటారు. ఈ సారి చాలా మంది పెద్దవాళ్ళు వస్తున్నారు.” నవుతున్న జగదీష్ గారిని చూస్తూ అర్జున్ ఇంట్లోకి వెళ్ళాడు.
జగదీష్ గారు చెట్ల మీద పక్షుల కిచ కిచలు వింటూ పలకరిస్తున్నట్టుగా వాటి వేపు చూసి నవ్వుతూ వాకింగు మొదలు పెట్టారు. ఉషం కాల ప్రకృతి సౌందర్యం నలువేపులా గోచరిస్తోంది. గేటు పక్కనుండి నడుస్తూ అక్కడే బోర్డు పై ఉన్న “ప్రజ్ఞ” అని తెలుగు, ఇంగ్లీషు, హిందీలో పెద్దగా ఉన్న అక్షరాలను గర్వంగా చదువుతూ ముందుకు కదిలారు.
మధ్యహ్నం రావేలపిండి రఘువర్మ జగదీష్ గారిని ఇంటర్వ్యూ చేయడానికి వస్తున్నాడు. ఇంటర్వ్యుకు కనీసం ఓ గంట అయినా కావాలన్నాడు. ఈవినింగ్ అర్జున్ తో నిదానంగా మాట్లాడటానికి ఇంటర్వ్యూ కు సమయం కేటాయించు కున్నాడు. రఘువర్మ మంచి పేరు గడించిన రచయిత. నవలలు, కథలు రాసేవాళ్ళే రచయితలు కారు, మనుషులను ఉపేసే రచనలు రాస్తూ మనసులో ఆలోచనలు రేకెత్తించే రఘువర్మ కూడా రచయితే. ఆధునిక జీవిత పరిభ్రమణలో ఆహుతి కాకుండా మనుశులలో అత్యద్భుతమైన మార్పు తెచ్చిన అర్జున్ జీవితాన్ని పుస్తక రూపంలో తీసుకురావడం చాల అవసరం అంటూ ముందడుగు వేసాడు. ఇప్పటి వరకు వేల మంది జీవితాలను మార్చి, ఇంకా ఎంతో మందిలో పరివర్తన తెచ్చిన అర్జున్ అంటే అపరిమితమైన ఇష్టమని రఘువర్మ అనేక పత్రికల్లో రాయడం, టివి ఇంటర్వ్యూలలో చెప్పడం అందరికి తెలిసిందే.
రఘువర్మ గేటు లోపలికి వస్తూనే బిల్డింగు ద్వారంపై పెద్దగా చెక్కి ఉన్న“ప్రజ్ఞ” బోర్డును ఒక ఫోటో తీసుకున్నాడు. జగదీష్ గారు, రఘువర్మ ఇద్దరూ వెళ్లి చెట్ల కింద కుర్చీల్లో కూర్చున్నారు.
“నమస్కారమండి జగదీష్ గారు! ఇండియాకు వచ్చిన పదేళ్ల నుండి అర్జున్ అవిరామంగా కృషి చేస్తూ ఎంతో మంది యువతీ యువకులకె కాక అన్నివయస్సుల వారికి ముఖ్యంగా స్త్రీలకు తమను తాము రక్షించుకునే పద్ధతులు నేర్పుతూ వాళ్ళ జీవితాలనే మార్చేసాడు, ఇంకా మారుస్తూనే ఉన్నాడు. మీరు కార్డియాలజీ స్పెషలిస్టు, మీ ప్రాక్టిస్ నుండి త్వరగా రిటైర్ అయి అమెరికా నుండి ఇండియా వచ్చి కొడుకు ప్రాజెక్టులో సహకరిస్తున్నారు. అతనిలో ఈ సంకల్పానికి ముఖ్య కారణ మేమిటి? విద్యార్ధి దశలో అర్జున్ జీవితం ఎలా గడిచింది? ఇతరులకు సహాయ పడటం అతని సహజ స్వభావమా?” ప్రశ్నల వర్షం కురిపించాడు.
జగదీష్ గారు ప్రశాంతంగా నవ్వుతూ రఘువర్మ వై పు చూసి,
“అర్జున్ ఇండియాలో ప్రాజెక్ట్ మొదలు పెట్టాక ప్రతి సంవత్సరం అమల, నేను వచ్చి నెలరోజుల పాటు ఇక్కడ గడుపు తున్నాం. అమల నాకంటే ముందుగానే ఇండియాకు మకాం మార్చేసింది. అర్జున్ ఒక్కగా నొక్క కొడుకు, ఇండియాలో ఉన్నాడు. కన్నతల్లి కదా వదిలి ఉండలేక పోయింది. దశరథుడు రాముణ్ణి వదిలి నిర్జీవి అయ్యాడు మేము వదలలేక అర్జున్ వెనకే వచ్చాం. అర్జున్ ఇక్కడ స్వర్గం నిర్మించి అందులోకి మమ్మల్ని తీసుకొచ్చాడు. తండ్రిగా నేను గర్వ పడు తున్నాను. అమల సంగతి చెప్పక్కర్లేదు కొడుకు ఆలోచనలను వింటూ అమల తనను తానే మరిచి పోతుంది.
ఇతరులకు సహాయం చేయడం గురించి మీరడిగారు కదూ! ఇతరులకు సహాయ పడటం గురించి- అదిమి పెట్టకుండా ఉంటె ప్రతి మానవునిలోను ఇతరులకు సహాయ పడాలనే స్వభావ సహజంగా
ఉంటుంది. అర్జున్లో కొన్ని పాళ్ళు ఎక్కువగా ఉంది. అర్జున్ లోని దీక్ష చూసి నేను, అమల ‘కారణ
జన్ముడేమో’ అనుకుంటాము.
అర్జున్ పెద్ద బుర్రతో పుట్టాడు. పదిహేడేళ్ళు నిండక ముందే మెరిట్ స్కాలర్ షిప్ తో స్టాన్ఫోర్డ్ కాలేజి నుండి బిజినెస్ మాస్టర్స్ ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. తర్వాత సంవత్సరంలో ఐ.టి. ప్రోగ్రామింగు చేస్తూ కాలేజీలో డిపార్ట్మెంటుకు ప్రోగ్రామ్స్ రాసాడు. అప్పుడు నేను చాలా గర్వ పడ్డాను. ఆ తర్వాత పెద్ద కంపెనీల నుండి మంచి జాబ్ ఆఫర్స్ వచ్చాయి. అంత చిన్న వయస్సు నుండి ఉద్యోగం చేయడం కంటే ప్రపంచ జ్ఞానం పొందడం మంచిదని ఉద్యోగం వద్దని నేనే ఆపేసాను.
స్కూల్లో, కాలేజిలో ఉన్నప్పుడు క్లాసులో అందరి కంటే చిన్న వయసు వాడవడం మూలాన జరిగే ఆటల్లో అనుకున్నంతగా పాల్గొనలేక పోయేవాడు. చిన్నప్పటి నుండి కరాటే అంటే ఇష్టం. స్కూల్లో ఉండగానే కరాటేలో బ్లాక్ బెల్ట్ తెచ్చుకున్నాడు. కాలేజీలో ఉన్నప్పుడు కూడా వేసవి సెలవులకు తన స్నేహితులు అన్జప్ప, కులదీప్ సింగ్, నింగ్ లీ, హృతిక్ అహుజా, జాన్ రిచర్డ్సన్ తో కలిసి బీజింగ్ లోని ‘క్వూన్ కరాటే స్కూల్’ కు వెళ్లి కరాటే నేర్చుకున్నాడు. ఇప్పటికి కరాటే మీద మక్కువ తగ్గలేదు.”
“వార్తల్లో చదివాక అర్థమయింది. ప్రతి సంవత్సరం నలుగురు విద్యార్థులను ఎన్నుకొని వాళ్ళను చైనాలోని కరాటే స్కూలుకు ఒక సవత్సరం పాటు పంపుతాడని, ఆ ఖర్చులన్నీ తానే భరిస్తాడని తెలుసు కున్నాను. దాన్ని బట్టే తెలుస్తోంది అర్జున్ కు మర్శియాల్ ఆర్ట్స్ అంటే ఎంత ఇష్టమో. మీరు అర్జున్ కు తగినట్టుగా ప్రోత్సాహ మిచ్చినట్టున్నారు.” ఉత్సుకతో అన్నాడు రఘువర్మ.
జగదీష్ గారు నవ్వుతూ తలను ఊపి మళ్ళీ చెప్పడం మొదలు పెట్టారు.
“చదివే రోజుల్లో అవసరమనిపించి నపుడు కొంత చాలెంజ్ కొంత ఊటం ఇచ్చాము అంతే. బిజినెస్ మేనేజ్ మెంటులో మాస్టర్స్ పూర్తి చేసాక బహుమతిగా ఇండియా ట్రిప్పు తీసికెల్తాం అంటే అర్జున్ ఎగిరి గంతేసాడు. ఆ ప్రయాణం మా అందరి జీవితాల్లో ఒక పెద్ద మార్పుకు కారణ మవుతుందని అప్పుడు మా అవగాహనకు రాలేదు. ఒక నెల పాటు చాలా ప్రదేశాలు తిరిగాం. అమల అక్క ప్రమీల కొడుకులు ఆర్నవ్, అశ్విన్ తో అర్జున్ కు చాలా చనువు ఏర్పడి, మరో రెండు నెలలు వాళ్లతో ఇండియాలోనే ఉండి పోయాడు. ఇండియాలో బంధువుల సాంగత్యాన్ని ఎంజాయ్ చేస్తూ, కజిన్స్ తో పాటు టూర్లు చేస్తూ, చుట్టు పక్కల ఉన్న పల్లెటూళ్ళను పలకరిస్తూ గడిపాడు. ఆ రోజుల్లోనే అర్జున్ కు నేహతో పరిచయమయ్యింది. అర్జున్ మనసులో సంఘ సేవ చేయాలనే బీజం పడింది కూడా అప్పుడే. నేహ ఆలోచనలు కూడా అర్జున్ ఆలోచనలాగే ఉంటాయి. ఇండియా ట్రిప్ పూర్తి చేసుకుని అమెరికా చేరగానే ఏపిల్ కంప్యూటర్ కంపెనీలో ఐదేళ్ళు ఉద్యోగం చేసి మంచి పదవిలోకి వచ్చాడు. అర్జున్ మనసులో సదా మెలిగే ఆలోచన, ‘మన దేశంలో మనుషులు తమ తోటి వారిపై చేసే దౌర్జన్యాన్ని, దుర్మార్గాన్ని ఎలా దూరం చేయాలి? స్త్రీకి తన శక్తిపై తనకు నమ్మకం, ధైర్యం ఎలా కలిపించాలి?’ ఇలాంటి సబ్జక్టుల గురించి ఎక్కువగా సంభాషించేవాడు. ప్రతి పౌరుడు తనలోని జ్ఞానం, శక్తిని గుర్తించి సద్వినియోగం చేయడంలోనే సంఘ పురోభివృద్ది ఉన్నది.
అర్జున్ చాలా పెద్ద ప్లాను వేసాడు. దాన్ని ఎలా అమలు పరచాలి అనే ధ్యాసలోనే చాలా సమయం గడిపాడు. ఉద్యోగం చేసినప్పుడు ఏంతో పొదుపుగా ఖర్చు చేసే అర్జున్ను చూసి మేము చాలా నేర్చు కున్నాము. ప్లాను వెయ్యడమే కాదు దానిని అమలు పరచడానికి అన్ని సమ కూర్చు కుంటూనే ఉన్నాడు. జాన్ యఫ్ కేన్నేడి అన్నట్టుగా ఎంత పెద్ద ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది అన్నట్టు అర్జున్ మొదటి అడుగు వేసాడు. కృషి చేసే స్వభావం నా కొడుకుది. తన ప్లాను గురించి, దాని కోసమై చేతులు కలిపిన స్నేహితుల గురించి మీరు అర్జున్తో మాట్లాడి నపుడు చెప్తాడు.
కంపెనీలో పని చేస్తున్నపుడు అ కంపెని సి.ఇ.ఓ. రాజన్ అర్జున్ తెలివికి అబ్బుర పోయాడు. ఇండియాకు వెళ్లి సంఘ సేవ చేయాలనే తన ప్లాను గురించి చెప్పినపుడు బిలియనీరైన రాజన్ విని తనకు ఆసక్తిగా ఉందని తాను ఆ ప్లానులో ఇన్వాల్వ్ అవుతానని, ఎటువంటి సహాయం కావాలన్నా చేస్తానంటూ ఒక కూటి రూపాయలు వీళ్ళ గ్రూపుకు ఇచ్చాడు. అర్జున్ ప్లానును అడుగడుగునా ప్రోత్సహించే వారిలో రాజన్ ముఖ్యమైన వాడు. ప్రారంభోత్సవానికి అమెరికా నుండి వచ్చాడు. నేను అడగ్గానే సంతోషంగా ఈ సెంటరుకు పేరు పెట్టింది కూడా అతనే. అడగడం అయిపోతే – ఆఫ్టర్ స్కూల్ సెషన్కు విద్యార్థులు వచ్చే వేళ్ళయింది నేను వెళ్ళాలి.” జగదీష్ గారు లేచి నిలబడ్డాడు.
“సర్! మరో ప్రశ్న ప్లీజ్…కరాటే నేర్పడం సెల్ఫ్ డిఫెన్స్ కోసమని తెలుసు. నిబంధనలు పాటిస్తారు.
కాని ఇక్కడ చేరిన వాళ్ళను చూస్తె వాళ్ళ ఇళ్ళల్లో, స్కూల్లల్లోను చాల మంచి మార్పు స్పష్టంగా
కనిపిస్తోందని చాలా మంది అభిప్రాయం. వాళ్ళ జీవితాల్లోనే మార్పు కనిపిస్తోందని తెలుపుతోంది సర్వే. మార్షల్ ఆర్ట్స్ తో కాస్త ఉద్రేకం రాక మానదు మరి ఇక్కడ అందరూ ఎప్పుడూ ఇంత ప్రశాంతంగా… ఎలా సాధ్యం?”
“అది అర్జున్ ఆలోచనే. “ప్రసన్న చేతసో హ్యాశు, బుద్ధిహ్ పర్య వతిష్టతే.” భగవద్గీతలో చెప్పినట్లు ప్రసన్న చిత్తుని యొక్క బుద్ధికి సత్వరమే స్తిరత్వ మేర్పడుతుంది. ప్రసన్న చిత్తం ఉండేట్టు చేయడానికే అర్జున్ బ్రహ్మ కుమారి సెంటర్ కెళ్ళి తన పిల్లలకు మెడిటేషన్ నేర్పించమని రిక్వెస్ట్ చేసాడు. ప్రజ్ఞ సెంటరు బౌతిక రక్షణకు మాత్రమే అనుకుంటున్నారా! ఊహు..(తల అడ్డంగా ఆడించాడు జగదీష్గారు) వారి మనస్సులో ప్రసన్నత, వారి జీవితంలో పరివర్తన రావడం ముఖ్యం. ఈ సెంటర్లో ఎవరు చేరాలనుకున్నా మొదటి రోజున కుటుంబం సభ్యులు అందరూ సెంటరుకు రావాలి. వాళ్ళ జీవిత పద్ధతులు చెప్పాలి. ఇంటర్వ్యూలో ఇక్కడ నేర్పే పద్ధత్తులు, నిబంధనలు వివరిస్తాము. ముందుగా ఇక్కడ నేర్చుకునేది మెడిటేషన్, సత్ప్రవర్తన. పిల్లలు తమ మనసులోని అలజడిని పైకి చెప్పలేరు. ఎంతో మంది పెద్ద వాళ్ళు కూడా వాళ్ళ మనసులో సుడిగుండాలు ఉన్నా పైకి మామూలుగా గడపడానికి ప్రయత్నిస్తారు. ఆ తీక్షణ భావాలు ఎప్పుడు ఎలా విజ్రుంభి స్తాయో వాళ్ళకే తెలియదు. అందుకే సంఘంలో ఎన్నో అవినీతులు, దౌర్జన్యాలు జరుగు తున్నాయి. తనను తాను రక్షించుకునే ఆయుధం ఉన్నవాడు ఆ ఆయుదంతోనే మరొకరిని దెబ్బ తీయవచ్చు. అందుకే కరాటే నేర్చుకునే ముందుగా మనసును అదుపులో ఉంచుకునే శిక్షణ పొందితే వాళ్ళు వివేకవంతులు అవుతారు. ఆవేశం, అవివేకం తగ్గి మనసు అదుపులో ఉంటుంది.
ఎన్నో విద్యలలో ఆరితెరినా వివేకం లేని మనసు దానిని సక్రమంగా వినియోగించక పోవచ్చు.”
కళ్ళు పెద్దవి చేసి చూస్తున్న రఘురాం వైపు నవ్వుతూ చూసి మళ్ళి చెప్పడం మొదలు పెట్టారు.
“‘ప్రజ్ఞ’ తెరిచిన కొత్తలో చాల మంది చేరడానికి ఇష్ట పడేవాళ్ళు కారు. సంఘంలో కొత్తదాన్ని చేరదీయడానికి దానిమీద పరిజ్ఞానం కావాలి. ప్రజలకు ‘ప్రజ్ఞ’ గురించి తెలియ చేయాలని అర్జున్ చాలా చోట్ల ప్రకటనలు వేయించాడు, ఉపన్యాసాలు ఇచ్చాడు. అర్జున్ కష్టపడ్డమే కాదు అనేక నిందలకు గురయ్యాడు. అయినా వెనుకంజ వేయలేదు. రాజకీయాల గురించి మాట్లాడ మంటే పెదవి కదపడు కానీ సంఘ సంస్కారం గురించి మాట్లాడమంటే మాత్రం అన్ని గ్రందాలలోంచి ఉల్లేఖితాలిస్తూ ఉపన్యసించడంలో ఘటికుడు నా కొడుకు. మొదట్లో కొద్ది మంది ముందుకు వచ్చారు. కుటుంబ సభ్యులలో మానభంగం జరిగిన వాళ్ళు పలకడానికి కూడా భయ పడేవారు. ఆ తర్వాత చాల మంది రావడం మొదలు పెట్టారు. నాలుగేళ్ళకే స్థలం సరిపోక మరో రెండు చోట్ల ‘ప్రజ్ఞ’ సెంటర్లు తెరిచారు. “ప్రయత్నేన లభతే ఫలం” అని నిరూపించాడు అర్జున్. గృహిణులు ధైర్యంగా సెంటరుకు వస్తున్నారు. కొందరు స్త్రీలు వారిని హింసించే భర్తల ప్రవృత్తిని మార్చాలని భర్తలను తమ వెంట తీసుకొచ్చారు. మొదట్లో ఉచితంగానే నేర్పించాడు. ఇప్పుడు చిన్న పిల్లలకు, డబ్బు కట్టలేని వాళ్ళకు ఉచితమే. ప్రస్తుతం తెలంగాణాలో ఆరు సెంటర్లున్నాయి. అది విజయానికి మొదటి మెట్టు. కొంత కాలం నుండి స్కూళ్ళల్లో వ్యాయామాలు ఉండటం లేదు. స్కూల్ ఆవరణలో ఖాళీ స్థలం ఉంటె మరో బిల్ద్దింగు కట్టి మరి కొన్ని క్లాసులు పెంచుతున్నారు. అర్జున్ ఎడ్యుకేషన్ బోర్డుతో సంప్రదించి వారికి ఒక గంట యోగ, మెడిటేషన్ పెట్టమని ప్రపోస్ చేసాడు. వాటికీ ఎక్కువ స్థలం అవసరం లేదు. రాబోయే సంవత్సరం నుండి సిలబస్ లో పెడ్తున్నామని అర్జున్కు ధన్యవాదాలు చెబుతూ లెటరు పంపారు. విజయమంటే అదండీ.” తృప్తిగా పలికాడు జగదీష్గారు.
“మహానుభావులు కూడా మనుషుల్లో కలిసి పోయి మామూలుగా జీవిస్తుంటారు. వారి మాటల లో, వారి చేతలలోనే మహాత్మ్యం కనిపిస్తుంది.” అంటూ రఘువర్మ లేచి చేతులెత్తి జగదీష్ గారికి నమస్కరించాడు.
“రఘువర్మా! నా కొడుకు అర్జున్ మహానుభావుడే కాదు స్థితప్రజ్ఞుడు కూడా. పిల్లలు ఉంటె ‘నేను-నాది’ అనే స్వార్థ భావనకు పరిమితమై పోతామని వారికి పిల్లలే వద్దనుకుంటున్నారు అర్జున్, నేహ. వీళ్ళంతా మన పిల్లలే నాన్నగారు అంటాడు. నేహ కూడా అదేమాట అంటుంది.” జగదీష్ గారి గొంతు మరోలా ధ్వనించింది.
నెమ్మదిగా భవనం వేపు వెళ్లి పోతున్న జగదీష్గారికి చెమ్మగిల్లిన కళ్ళతో మనసులోనే మరోసారి నమస్కారం చేసాడు రఘువర్మ. ఇవన్ని విన్నాక తనలో కూడా ఏదో తెలియని మార్పు వస్తోంది’ అనుకున్నాడు రఘువర్మ.
ఆ సాయంత్రం – ఆవరణకు వెనకగా ఉన్న పెద్ద భవనంలో నుండి క్రమ బద్ధంలోని యువ సైన్యంలా అన్ని వయస్సుల బాల, బాలికలు ముందు ఉన్న మెట్లు దిగి బయటికి వస్తున్నారు. నెమ్మదిగా మాట్లాడుతూ నవ్వుతూ వస్తున్న యువతను చూస్తూ తన్ను తానె మరిచి పోయాడు రఘువర్మ. అ పక్కనే ఉన్నఇంట్లోంచి అమలగారు, నేహగారు భవనంవేపు వెళ్ళడం చూసి దేవతలు తిరిగే దేవలోకం అంటే ఇదే అనుకున్నాడు. వారి మొహాల్లో కనిపించే ప్రశాంతత, వాళ్ళను చూస్తూంటే ఎంత హాయిగా ఉంది అనుకున్న రఘువర్మ గేటు వేపు చూసాడు. కొంతమంది స్త్రీలు లోపలికి వస్తున్నారు. ఆ కొంతమంది వెనక మరి కొంతమంది, వారి వెనక చాల మంది ఆడ, మగ అన్ని వయస్సుల వాళ్ళు వస్తున్నారు. వయోవృద్దులు కూడా నవ్వుతూ ముందుకు కదలడం విభ్రమంగా చూస్తూ ఉండి పోయాడు. కొంత మంది గేటులోకి రాగానే కారులోంచి దిగి అందరితో కలిసి నడుస్తున్నారు. పోటీ పడుతూ దౌర్జన్యంతో పరుగులిడే ప్రపంచం అవతలి వైపు, స్వర్గంలా ప్రశాంతంగా ఉన్న ప్రపంచం ఇవతలి వైపు. ‘అర్జున్ నీలాంటి వాళ్ళే ఈ సంఘంలో దుశ్చర్యలను ఆవిరి చేసి స్వర్గం సృష్టించగలరు.’ మనసులో జోహార్లు అర్పించాడు రఘువర్మ.
కాసేపటికి ఇంటర్వూ చేస్తూ – అర్జున్ వేపు చూస్తూ రఘువర్మ,
“నమస్కారమండి అర్జున్ గారు. మొదటగా నాకు ఇంటర్వూ ఇస్తున్నందుకు మీకు థాంక్స్.”
“నమస్కారమండి. కూర్చోండి.”
“ఇలా సెంటర్ తెరవాలని మీకెలా ఆలోచన వచ్చింది? ఈ ప్రాజెక్టు మొదలు పెట్టి నపుడు మీరు ఎదుర్కొన్న సమస్యలు, వాటిని దాటి ఎలా ముందుకు వెళ్ళారు చెప్పండి?”
“జాబులో చేరే ముందు ఇండియా టూర్ నాకు బహుమతి అన్నారు నా పేరెంట్సు. పెరెంట్సుతో నెల రోజులు కొంత సైట్ సీయింగు చేసాను. అ తర్వాత ట్రావెల్ చేస్తూ నా కజిన్స్ తో గడిపాను. ఆ రోజుల్లోనే నా పిన్ని కూతురు సాహితి నాకు చాలా స్న్నిహితురాలైంది. ఒక రోజు తన క్లోజ్ ఫ్రెండు నిషితకు జరిగిన మానభంగం జరగడం, సంఘంలో అందరూ నిషితను చులకన చేసి మాట్లాడటం భరించలేక నిషిత విషం తిని చనిపోవడం గురించి చెప్పింది. అప్పుడప్పుడే జరిగిన సంఘటన కావడం మూలాన అందరి మనస్సుల్లో విషాద చ్చాయలు కనిపిస్తున్నాయి. అమ్మాయిని ఆదుకోక పోవడం పైగా అందరూ అమ్మాయిని హీనంగా చూడటం చాల దారుణం అనిపించింది. ‘అందులో నిషిత చేసిన తప్పు ఏమిటి?’ అని మనస్సు పెట్టి ఆలోచించలేక పోవడం వల్లనే కదా! అలాంటివి సంఘటనలు చాలా జరుగుతున్నాయని విన్నాను. ఇక్కడ స్త్రీలకు రక్షణ లేదని, ఎప్పుడు ఎవరు ధాడి చేసి దారుణంగా హింసించడమో,
మానభంగం చేయడమో, కిడ్నేప్ చేసి కొన్నాళ్ళకు చంపేయడం లేదా అవినీతి పరమైన వృత్తిలోకి దింపడం లాంటివి ఎక్కువగా జరుగుతున్నాయని చాలా బాధ పడింది. నిషిత, నేహా కూడా మంచి స్నేహితులు. అప్పుడే నా భార్య నేహాను కలిసాను. నేహ అక్క కూడా నాలుగేళ్ల క్రితం మాయ మయింది. ఎంత వెదికినా దొరకలేదు. పోలీసులు కేసు మూసేసారు. అలజడిని మనస్సుల్లో దాచుకుని మామూలుగా జీవించాలని ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ మనసులో భయం పాతుకు పోయింది. అలాంటి ఆలోచనలతో నిస్సహాయంగా ఫీలవుతున్నారని నాకు బాధ అనిపించింది. అప్పుడే వారిలో మార్పు తేవాలనే నిర్ణయం తీసుకున్నాను. నేహ, నేను చాల రకాలుగా ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాము.
‘ప్రజ్ఞా’ సెంటర్లలో నా బంధు మిత్రులే కాక అన్ని వయస్సుల వాళ్ళు టీచర్ ట్రెయినింగ్ తీసుకున్నారు. చాల మంది కుటుంబ సభ్యులు కూడా ట్రెయినింగ్ కావాలని ముందుకు వస్తున్నారు. కరాటేలో బాగా పైకి వచ్చేవాళ్ళను చైనాలో నేను వెళ్ళిన క్వూన్ కరాటే స్కూల్కు ఒక సంవత్సరం పంపుతాను. ఇప్పటి వరకు చాలా మంది ఆడ, మగ పిల్లలు వెళ్ళారు.
ఏ పని అయినా మొదట కష్టంగానే ఉంటుంది. ఈ సెంటరు తెరిచే ముందు కూడా అలాగే ఉండింది. నేను చాల అదృష్ట వంతుణ్ణి కాబట్టి నా పేరెంట్సు, స్నేహితులు, బంధువులు చాల సపోర్టు చేసారు. నాన్నగారు ప్రజ్ఞ కోసం చాల డబ్బు ఖర్చు పెట్టారు. ఇక్కడ భూమి కొన్నారు. నా ప్లాను నచ్చి మిస్టర్ రాజన్ గారు మా అందరకు డబ్బు డొనేషన్ ఇచ్చారు. నేను నా స్నేహితులు కొన్ని సిటీల్లో సెంటర్లు తెరిచాము. నాకు అన్ని విధాల సహకరిస్తూ నాతో పాటు ఉన్న స్నేహితులు-నంజప్ప బెంగుళూరులో, హృతిక్ అహుజా, నింగ్ లీ కలిసి మంబైలో- కుల్దీప్ సింగ్ డిల్లీలొ, పాల్ వర్గీస్ కేరళలో ఇలాంటి సెంటర్స్ తెరిచారు. జాన్ ఇక్కడే మాదాపూర్ సెంటరులో ఉంటాడు. మేము ఒకరి కొకరం సలహాలిస్తూ, అవసరాలు కనుక్కుంటూ ముందుకు వెళ్తున్నాము. మా అందరికి పేరెంట్సు సహకారం ఉంది. ఇప్పుడు చాలా మంది పెద్దలు కూడా సహకారం ఇస్తామని ముందుకు వస్తున్నారు. తెలంగాణలోనే పదివేలకు పైగా మించి వస్తున్నారు. ఇప్పుడు నాకు సంఘ సహకారం కూడా చాలా ఉంది. గవర్నమెంటు కూడా సహాయం చేయడానికి ముందుకు వస్తోంది.”
అప్పుడే అక్కడకు వచ్చిన ఓ పెద్ద మనిషిని చూపిస్తూ,
“వీరు గోపాలంగారు. నిషిత నాన్నగారు. చాలా మంచి మనిషి. ఇతరులకు వచ్చిన కష్టాన్ని భూతద్దంలో చూపించి భయ పెద్తుంది సంఘం. ఆ కష్టంలోనే ధైర్యాన్ని వెతుక్కుని తెలిక పడేవారు కొంతమంది. ఆ తండ్రి మంచి నిద్ర పోయి ఎన్నాళ్ళయిందో! బిడ్డ పోయిన తర్వాత మరమనిషిలా బతుకుతున్నాడు. వారిలో చితికి పోయిన ఆశను, నమ్మకాన్ని ఇప్పుడే కూడగట్టు కుంటు న్నాడు. వారితో మాట్లాడండి. వీరి అబ్బాయి రోహన్ ప్రజ్ఞకు కుడి భుజం లాంటి వాడు.” నమస్తే అంటూ వెళ్లి పోయాడు అర్జున్.
“మీరేం చేస్తుంటారండి?” గోపలంగారిని అడిగాడు రఘురాం.
“గవర్నమెంటు ఆఫీసులో చేతికి మూతికి సరిపడా సంపాయిస్తూ ఆదర్శాలను అరువు పెట్టి బతుకు తున్నాను. అన్నిబలాలు కొడుకు వైపు కేంద్రీకరించి నా ఆశల్నివాడి నెత్తిమీద గుమ్మ రించి నేను స్వయంగా ఏమి చేయలేక వాడు మా అందరిని ఉద్ధరించాలని కోరుకుంటున్నాను. అర్జున్ బాబు దేవుడు. భారత్ భూషణ్ అవార్డు ఇస్తున్నారు. అతను చేసే మంచి పనులు ఈ అవార్డులతో కొలవగలమా!” ముక్తసరిగా మూడు ముక్కల్లో చరిత్ర చెప్పిన గోపాలం వైపు రఘువర్మ ముస్కురాహట్తో చూసాడు.
“అవును అర్జున్కు అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. మనుషుల్లో కూడా దేవుల్లుంటారు. మీ బిడ్డకు జరిగిన అన్యాయం గురించి ఏమైనా మాట్లాడ గలరా!”
“నా బిడ్డను కాపాడుకోలేక పోయాను కానీ అర్జున్ బాబు ఏంతో మంది ఆడ బిడ్డలకు ధీరత్వాన్ని నేర్పిస్తున్నాడు. స్కూల్ నుండి ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్లి హోమ్ వర్కులో సాయం చేసి ఇంటికి వస్తోంటే దుర్మార్గులు నా బిడ్డ బతుకును దోచుకున్నారు బాబు. ఆ అవమానం భరించలేక, ఎవరికీ మొహం చూపించలేక నా బిడ్డ ప్రాణం తీసుకుంది. ఇక్కడ బిడ్డలను చూసి నా బిడ్డ లేదనే బాధ మరిచి పోవాలని ప్రయత్నిస్తున్నాను బాబు. ఇప్పటికైనా ఆడ పిల్లల్లో అధైర్యం, భయం పోయి హాయిగా జీవిస్తారని ఆశిస్తున్నాను.” కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు.
రఘురాం దగ్గరగా వెళ్లి సానుభూతిగా భుజంపై చేయి వేసాడు. అతను కళ్ళు తుడుచుకుని,
“ఈ అవార్డులు అర్జున్ బాబులోని మంచి తనానికి సరిపోతాయా బాబు!” అంటూ వెళ్లి పోయాడు.
నిజమే మహాత్ములు చేసే మంచి పనులను అవార్డులతో కొలవగలమా!

సమాప్తం –

1 thought on “ప్రజ్ఞ

  1. Inspirational story. I like Brahma kumaris classes. I attended that course. It was a spiritual and divine experience.It changes our mindset.The selfless devotion of the teacher’s truly appreciable.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *