April 24, 2024

బర్బరీకుడు

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు

మహాభారతములో మనకు అనేక పాత్రలు తారస పడతాయి, కానీ మనము చాలా తక్కువగా వినే పేరు “బర్బరీకుడు”. యుద్దము ప్రారంభము అవటానికి ముందు ప్రతి యోధుడిని యుద్దాన్ని ఎన్ని రోజులలో ముగించ గలవు అని శ్రీకృష్ణుడు ప్రశ్నిస్తే, భీష్ముడు 20 రోజులని, 25 రోజులని ద్రోణాచార్యుడు, 24 రోజులని కర్ణుడు, 28 రోజులని అర్జునుడు చెపుతారు. దూరముగా ఉండి ఇవన్నీ
గమనిస్తున్న బర్బరీకుడుని శ్రీ కృష్ణుడు బ్రాహ్మణుని వేషములో దగ్గరకు వచ్చి”ఈ ప్రశ్నకు నీ సమాధానము ఏమిటి? “అని అడుగుతాడు “నేను బరిలోకి దిగితే ఒక నిముషములో యుద్ధము ముగిసిపోతుంది”అని చెప్పగా, శ్రీకృష్ణుడు ఆశ్చర్యపోయి ఎలా అని అడుగుతాడు. అంటే మహాభారతములోని యోధన యోధులకన్నా బర్బరీకుడు చాలా గొప్పవాడు అన్నమాట.
అంత గొప్పవాడు అయిన బర్బరీకుడు ఎవరు, అతని పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి అని ముందు తెలుసుకుందాము. బర్బరీకుడు భీముని మనమడు అంటే ఘటోత్కచుని కుమారుడు. ఘటోత్కచుడు యాదవ రాజు కూతురు మౌర్విని వివాహమాడితే వారికి
పుట్టిన సంతానమే ఈ బర్బరీకుడు. బర్బరీకుడు నిజానికి శాపవశాన మానవవుడిగా జన్మించిన ఒక యక్షుడు. ఒకసారి బ్రహ్మాది దేవతలు వైకుంటానికి వచ్చి భూలోకములో పాపులు పెరిగారని అధర్మము పెచ్చు మీరినదని, కాబట్టి విష్ణువు అవతారమెత్తి దుష్ట శిక్షణ ధర్మ రక్షణ చేయవలసిన సమయము ఆసన్నమయినదని శ్రీ మహా విష్ణువును వేడుకుంటారు. ఆ సమయములో వైకుంఠములో ఉన్న యక్షుడు భూమి మీద ఉన్న దుష్టులను సంహరించటానికి తానూ ఒక్కడిని చాలని విష్ణువు భూమి మీద
అవతరించవలసిన అవసరము లేదని గర్వముగా అంటాడు.
అది విన్న బ్రహ్మ కోపముతో “నీవు భూలోకములో మానవుడిగా జన్మిస్తావు. దుష్ట శిక్షణకోసము శ్రీ మహావిష్ణువు అవతరించి దుష్ట సంహారము నీతోనే మొదలు పెడతాడు” అని శపిస్తాడు.
శాపవశాన యక్షుడు బర్బరీకుని గాజన్మించి కురుక్షేత్ర యుద్దానికి ముందు తన శిరస్సును బలిదానముగా శ్రీ కృష్ణునికి సమర్పిస్తాడు. బర్బరీకుడు బాల్యములోనే తల్లి దగ్గర రణతంత్రాలను నేర్చుకుంటాడు ఇతనికి అష్టదేవతలు మూడు శక్తివంతమైన బాణాలను బహుకరిస్తారు అందువల్లే అతనిని “త్రి బాణ దారి “అంటారు.
పాండవులకు కౌరవులకు యుద్ధము అనివార్యము అని తెలిసినప్పుడు బర్బరీకుడు ఆ యుద్దాన్ని చూడాలని ఆకాంక్షిస్తాడు. ఆసందర్భములో తల్లి నుండి అనుమతిని కోరినప్పుడు, మహాభారత సంగ్రామాన్ని వీక్షించేటందుకు వెళ్లినా తాను యుద్దములో పాల్గొనని, పాల్గొనవలసి వస్తే బలహీనుల పక్షమే ఉంటానని అంటే ఓడిపోయేవారిని గెలిపిస్తానని తల్లికి మాట ఇస్తాడు. ఆ విధముగా మాట ఇచ్చిన బర్బరీకుడు తన మూడు బాణాలు, విల్లుతో నీలము గుర్రాన్ని అధిరోహించి బయలు దేరుతాడు. యుద్దాన్ని ఒక్క నిముషములో ఒక్కడివే ఎలా ముగిస్తావని శ్రీ కృష్ణుడు అడుగుతాడు. దానికి తన దగ్గర మూడు బాణాలు యుద్దాన్ని ఒక్క నిముషములో ముగిస్తాయని బర్బరీకుడు చెపుతాడు. తానూ ప్రయోగించే మొదటిబాణము ఎవరెవరిని సంహరించాలో గుర్తిస్తుంది. రెండవ బాణము రక్షించవలసినవారిని గుర్తిస్తుంది. మూడవ బాణము గుర్తించినవారిని చంపుతుంది. ఆ తరువాత మూడు బాణాలు బర్బరీకుని అమ్ములపొదిలోకి చేరుతాయి అని చెపుతాడు.
అప్పుడు శ్రీకృష్ణుడు తాను నుంచున్న రావి చెట్టు ఆకులన్నింటిని రాల్చగలవా? అనిఅడుగుతాడు దానికి బర్బరీకుడు తన బాణాన్ని ప్రయోగించటానికి సిద్దము అవుతుంటాడు. శ్రీకృష్ణుడు ఒక ఆకును తుంపి తన కాలుక్రింద ఉంచుతాడు. బర్బరీకుడు వదలిన మొదటి బాణము చెట్టు మీది ఆకులన్నిటిని గుర్తించి శ్రీకృష్ణుని పాదము దగ్గరకు వచ్చి ఆగుతుంది. అప్పుడు బర్బరీకుడు శ్రీకృష్ణుని పాదము తీయమని లేకపోతె ఆ బాణము పాదాన్ని చీల్చుకొని పోతుందని హెచ్చరిస్తాడు. శ్రీకృష్ణుడు పాదము తొలగించిన వెంటనే ఆ ఆకును కూడా బాణము గుర్తిస్తుంది ఆ విధముగా శ్రీ కృష్ణుడు బర్బరీకుని శక్తి అతని బాణాల గొప్పతనాన్ని గ్రహిస్తాడు.
శ్రీకృష్ణుడు ముందుచూపుతో యుద్ధము జరిగేటప్పుడు బర్బరీకుడు కౌరవుల పక్షనా ఉంటే తానూ పాండవులను రక్షించలేనని నిర్ణయానికి వస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు బర్బరీకుడిని యుద్ధము చేయవలసి వస్తే ఎవరి పక్షాన యుద్ధము చేస్తావు అని అడుగుతాడు దానికి బర్బరీకుడు తన తల్లికి ఇచ్చిన మాట ప్రకారము బలహీనుల పక్షానే యుద్ధము చేస్తానంటాడు. పాండవులకు ఏడు అక్షౌహిణుల సైన్యము ఉంటె కౌరవులకు పదకొండు అక్షోహిణుల సైన్యము ఉంది. కాబట్టి పాండవుల పక్షమే యుద్ధము చేస్తాను అని అంటాడు. కానీ శ్రీకృష్ణుడు తానూ ఎటువైపు ఉంటే ఆ పక్షమే గెలుస్తుంది, రెండవవైపు బలహీనపడుతుంది అని చెపుతాడు. అలాంటప్పుడు తానూ కౌరవ పక్షానే ఉండీ యుద్ధము చేస్తాను అని అంటాడు.. కాబట్టి యుద్దములో ఒకవైపు స్థిరముగా వుండడు అని అందరికి అర్ధము అయింది. అలా గనుక జరిగితే ఇరుపక్షాల సైన్యము హతులవుతారు ఎవ్వరు మిగలరు. కాబట్టి శ్రీ కృష్ణుడు బర్బరీకుడిని యుద్దములో పాల్గొనకుండా చేయాలని నిర్ణయించుకుంటాడు.
యుద్దానికి ముందు ఒక బలవంతుడు, ధైర్యవంతుడు అయినా క్షత్రియుని బలిగా యివ్వాలనీ, ఆ బలికి నీవు తప్ప మరెవ్వరు సాటి రారు అని శ్రీకృష్ణుడు బర్బరీకునితో అంటాడు . దానికి బర్బరీకుడు సంతోషముగా అంగీకరిస్తాడు. తన తలను త్యాగము చేయటానికి అంగీకరిస్తాడు కానీ తాను యుద్దాన్ని వీక్షించటానికి వచ్చానని తనకు ఆ ఆవకాశము ఇవ్వవలసినదిగా బర్బరీకుడు శ్రీకృష్ణుని కోరుతాడు. బర్బరీకుడు కోరిన విధముగా బర్బరీకుని తలను యుద్ధము జరిగే ప్రదేశము అంతా స్పష్టముగా కనిపించేటట్లు ఒక కొండపై ఉంచి, మొత్తము యుద్దాన్ని వీక్షించే శక్తిని శ్రీకృష్ణుడు బర్బరీకుని తలకు ప్రసాదిస్తాడు.
కురుక్షేత్ర యుద్ధము ముగిసినాక గెలిచినా పాండవులు వారిలో వారు విజయానికి భాద్యులు ఎవరు అన్న విషయముపై వాదించుకుంటూ ఉంటారు. అప్పుడు శ్రీ కృష్ణుడు వారిని బర్బరీకుని తల ఉన్నకొండమీదకు తీసుకొని వెళ్లి, “యుద్ధము అంతటిని
ప్రత్యక్షముగా చూసిన వాడు బర్బరీకుడు కాబట్టి విజయానికి బాధ్యులు ఎవరు అని ఖచ్చితముగా చెప్పగలడు” అని అంటాడు అప్పుడు బర్బరీకుని తల, ” యుద్దములో నిస్సందేహముగా విజయానికి శ్రీ కృష్ణుడొక్కడే బాధ్యుడు శ్రీ కృష్ణుని సుదర్శన చక్రము యుద్దభూమి మీద తిరుగుతూ ధర్మము వైపు లేని వారినందరిని సంహరించటము చూశాను. అలాగే యుద్ధ విజయానికి కారకురాలు ద్రౌపది కూడా. ఆవిడా మహాకాళి రూపములో పాపులను శిక్షించింది “అని చెపుతాడు. అది విన్నటువంటి పాండవులు కురుక్షేత్ర యుద్ధ విజయానికి నారాయణుడు, మహాకాళి కారణమని గ్రహిస్తారు.
తన మనుమడు బర్బరీకుడు యుద్దానికి ముందు తన తలను త్యాగము చేయటాన్ని తెలుసుకున్న భీముడు బాధపడతాడు. శ్రీ కృష్ణుడు బర్బరీకుడే ఆ విధమైన త్యాగము చేయకపోయి ఉంటే మిమ్ములను నేను కాపాడలేకపోయేవాడిని అని భీముడిని ఇతర
పాండవులను ఓదార్చి బర్బరీకుని తలను శరీరానికి అతికిస్తాడు. ఆ తరువాత బర్బరీకుడు కమ్రునాగ్ అనే పేరుతొ దేవతగా శ్రీ కృష్ణుని ఆశీస్సులతో వెలుస్తాడు. ఆ విధముగా బర్బరీకుని కథ భారతములో గుర్తింపు పొందని విలుకాడుగా ముగుస్తుంది ప్రస్తుతము హిమాచల్ ప్రదేశ్ లోని మండి జిల్లాలోఈ గుడి ఉన్నది. ఈ గుడికి దగ్గరలోనే కమ్రు కొండ ఉన్నది ఈ కొండపై నుంచే
బర్బరీకుని తల కురుక్షేత్ర యుద్దాన్ని వీక్షించింది అందుచేతనే ఈ కొండను ఖాటు ష్యామ్ గుడిగా వ్యవహరిస్తారు. గుజరాత్ రాజాస్థాన్ లలో కూడా బర్బరీకునికి గుడులు ఉన్నాయి. అక్కడి ప్రజలు బర్బరీకుని పూజిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *