April 19, 2024

సీతాదేవి పుట్టిన జనకపురి

 

రచన: నాగలక్ష్మి కర్రా

 

 

రాముడు అయోధ్య లో పుట్టేడు సరే మరి సీతాదేవి ఎక్కడపుట్టింది అని ఆలోచిస్తే జనకమహారాజు పరిపాలించిన మిధిలానగరం ప్రస్తుతం యెక్కడ వుంది అని పరిశోధిస్తే నేపాలులో “జనకపురి” అని పిలువబడుతోందని తెలిసింది, ఎక్కడుందో తెలిసిందికదా, ఆలస్యమెందుకని టూరిజం వారిని కనుక్కొని యాత్ర బుక్ చేసుకున్నాం.

ఆ యాత్రా వివరాలు మీక్కూడా తెలియజేస్తాను.

ఢిల్లీనుంచి ఖాట్మండు వెళ్లేం, ఆరోజు పశుపతినాధుడిని దర్శించుకొని మరునాడు ఒంటిగంటకు మా జనకపూర్ ప్రయాణం. ఖాట్మండు డొమెస్టిక్ విమానాశ్రయం చాలా చిన్నది. సెక్యూరిటీ కూడా అంతంత మాత్రమే, ‘యతి’ వారి బోర్డింగు పాసులు తీసుకున్న తరువాత సిబ్బంది గబగబా రండి అని మమ్మలని వరుసలో నిలబెట్టి విమానం రాగానే అందులోంచి మనుష్యులు దిగడం వెంటనే మమ్మల్ని యెక్కించడం విమానం బయలుదేరడం అంతా అయిదు నిముషాలలో జరిగిపోయింది. బోర్డింగు పాసులమీద మన పేరు కూడా లేదు, సీటు నంబరు మాత్రం వేసివుంది. విమానంలో 25 మంది మాత్రమే కూర్చోగలరు. చాలా కిందనుంచి వెళుతున్న విమానం, చాలా చిన్నగా వుండడం కాస్త వుక్కిరి బిక్కిరికి గురిచేసింది. విమానకాంత ముందుగా చాక్లెట్లు, తరువాత పల్లీలు, కూల్ డ్రింక్స్ యిచ్చింది. తలవంచుకునే యీ పనులన్నీ చేసింది, తలయెత్తే యెత్తు లేదు విమానం పాపం, నేపాల్ వనితలే తలవంచవలసిన పరిస్థితి ఆ విమానంలో.  కుదుపులు రాగానే నోట్లోంచి నారాయణ మంత్రం రావడం ఖాయం.  యెలాగైతేనేమి మా 25 నిముషాల ప్రయాణం ముగించి దిగేం. రాజధాని విమానాశ్రయమే  అంత దీనావస్థలో వుంటే మరి మిగతా విమానాశ్రయాలు మన ఊహకు కూడా అందవు.

జనకపూరులో దిగగానే ‘ ప్రధాన మంత్రి ‘ గారు వస్తున్నారని మమ్మల్ని పక్కగా నిలబెట్టేరు. ఓ మూడు కారులు ఓ పోలీసు కారు, ఆంబులెన్స్ వచ్చి ఆగేయి, అందులోంచి ప్రధానమంత్రి గారు మిగతా వంది మాగదులు దిగి విమానాశ్రయానికి వెళ్లిపోయేరు. మేం మా టూరు జీపులో హోటలు చేరుకున్నాం.

జనకమహారాజు పరిపాలించిన మిధిల ప్రస్తుతం నేపాలు, భారతదేశంలోని బీహారు రాష్ట్రాలకు చెందింది. సీతమ్మ పుట్టిన ప్రదేశం, రాముడు శివధనస్సు విరచిన ప్రదేశం, సీతారాముల వివాహ వేదిక, శివధనస్సు భాగాలు పడ్డ ప్రదేశాలు నేపాలులో జనకపూర్ ప్రాంతంలో వున్నాయి. జనకపూరులో బిహారీలు యెక్కువ, బలవంతుడిదే రాజ్యం అన్నతీరులో వుంటుంది  యిక్కడ లా ఎండ్ ఆర్డరు.

మేం హోటలు చేరేసరికి మధ్యాహ్నం మూడయింది. నాలుగింటికి బయలుదేరి జనకపూర్ రాజ భవనం చూడ్డానికి వెళ్లేం. యేదో లోకల్ మేళా జరుగుతుండడం వల్ల ఆ ప్రదేశమంతా యిసుకవేస్తే రాలనంత జనం వున్నారు. ముందుగా మా హోటలు మేనేజరు హెచ్చరికతో నాలుగయిదు పదులు మాత్రమే జేబులలో పెట్టుకొని, ఆడవారం పైటలు నిండుగా కప్పుకొని పర్సులు ఫోనులు హోటలులో వుంచి  బయలుదేరేం. ఇక్కడ జేబుదొంగలు చాలా యెక్కువట.

ముందుగా రామమందిరం చూడ్డానికి వెళ్లేం, రామమందిరంలో రాముడు సీతా లక్ష్మణ భరత శతృఘ్నులతో యెదురుగా హనుమంత సమేతుడై వున్నాడు. ఓ పక్కగా రాధా కృష్ణులు వెనుకగా అమ్మవారి కోవెల వుంది.

అక్కడనుంచి జానకి మందిరానికి వెళ్లేం. ఆ రోజు యేదో మేళా జరుగుతోంది. ఇసుకవేస్తే రాలనంత జనం.

రాజభవనం హిందూ నేపాల్ శిల్ప కళతో కట్టబడింది. చూస్తేనే తెలుస్తోంది యీ మధ్యన కట్టిందని. భవనం తలుపులపై నగిషీలు చాలా బాగున్నాయి, ఈ భవనంలో సుమారు 60 గదులున్నాయి. దీనిని జనకపూర్ ధామ్ అని వ్యవహరిస్తారు. ఈ భవనం లోనే సీతా జననం జరిగిందని అంటారు. జనక మహారాజు సీతను యీ భవనంలోకి తెచ్చిన ఘడియను సీతాజనన సమయమని అంటారు.  సీతా స్వయంవరం జరిగిన ప్రదేశం కూడా యిదే.

బయట వేదిక మీద పిల్లలు రామాయణం నాటకం ప్రదర్శిస్తున్నారు. లోపల సీతాసమేత రామలక్ష్మణులు మొదలైన పాలరాతి విగ్రహాలు వున్నాయి. మొత్తం భవనం పాలరాయితో నిర్మించేరు.

అక్కడకి దగ్గరగా వున్న ‘ గంగాసాగర్ ‘ హారతి రాత్రి యేడు గంటలకు మొదలయింది. ఆరున్నరకల్లా వచ్చి గట్లమీద కూర్చున్నాం. గంగా సాగర్ గా పిలువబడుతున్నా సముద్రం కాదు  ఓ చిన్నకొలను. గంగా హారతి బనారసు లో యెంత ప్రసిధ్ద పొందిందో గంగాసాగర్ హారతి నేపాలులో అంత ప్రసిధ్ద పొందింది.

రామాయణం ప్రకారం రాముడు సీతను వివాహమాడగోరి శివధనస్సు యెత్తగా అది విరిగిపోతుంది. ధనస్సులోని క్రింద భాగం పాతాళంలోకి చొచ్చుకుపోయి అక్కడనుంచి గంగ బయట పడిందట. ఆ ప్రదేశమే యీ ‘ గంగా సాగర్ ‘. ధనస్సు పై భాగం రామేశ్వరం దగ్గర ధనుష్కోటి లోను,  మధ్యభాగం నేపాలులోని ‘ ధనుషా ధామ్ ‘ లోనూ పడ్డాయట.

శివుని ధనస్సు నుంచి వుద్భవించిన గంగకు ప్రతిరోజూ హారతులివ్వడం యిక్కడి ఆచారం.

ప్రొద్దున్నే వివాహమండపానికి వెళ్లేం, జానకి మందిరానికి నాలుగడుగుల దూరంలో వుంది. పాలరాతి కట్టడం, లోపల సీతా రామలక్షణులతో పాటు జనకమహారాజు విశ్వామిత్రుడు, వశిష్టుడు, దశరధుడు మొదలయిన విగ్రహాలు వున్నాయి. మండపం బయట చిన్న మందిరాలలో సీతారాములు, లక్ష్మణ ఊర్మిళ, భరత మాండవి, శతృఘ్న శ్రుతకీర్తి ల విగ్రహ హాలు వున్నాయి. చుట్టారా పెద్ద ఉద్యానవనం పెంచుతున్నారు.

అక్కడ నుంచి జనకపూర్ కి సుమారు 20 కిలోమీటర్ల దూరం లో వున్న ధనుషా ధామ్ బయలుదేరేం. దారిలో చిన్న ఉద్యానవనంలో వున్న చిన్న సీతారాములమందిరం దగ్గర ఆపేడు మా డ్రైవరు, ఇది సీతారాముల అసలైన వివాహవేదిక అని రాసి వుంది, ఆ మందిరాన్ని కూడా చూసుకొని మా ప్రయాణం సాగించేము. చిన్నచిన్న పల్లెలు దాటుకుంటూ వెళుతున్నాం, మట్టిరోడ్లు, యెక్కువగా వరి పండిస్తున్నారు. మట్టి రోడ్డు దిగిన మా వాహనం ఓ రెండు మూడు కిలోమీటర్లు మామిడి తోపులలోంచి ప్రయాణించి ధనుషా ధామ్ చేరింది.

పెద్దగేటులోంచి లోపలకి వెళ్లేం. మర్రి చెట్టు క్రింద పెద్ద కొండ విల్లు మధ్యభాగాన్ని పోలి వుంది. ఆ మర్రిచెట్టు రాముడు కాలం నుంచి వుందట, ప్రతీ యేడాది యీ కొండ పెరుగుతోందట, మధురలో వున్న గోవర్ధనగిరి ప్రతీ యేడాది యెత్తు తగ్గుతోందట.

బయట సీతారాముల మందిరం, శివమందిరం వున్నాయి. వాటిని చూసుకొని తిరుగు దారిలో పరశురామ ఆశ్రమాన్ని చూసుకున్నాం. పురాతనమైన శివమందిరం నది వొడ్డున వుంది, యింకా మందిరాలు నిర్మాణంలో వున్నాయి. పరశురామునిచే స్థాపించబడిన లింగమని మా డ్రైవరు  కమ్ గైడ్ చెప్పేడు. దీంతో మా జనకపూర్ యాత్ర పూర్తయింది. ఆరోజు సాయంత్రం బయలుదేరి మేం ఖాట్మండు చేరేం.

వచ్చే సంచికలో మరో యాత్రా విశేషాలు చదువుదాం, అంత వరకు శలవు.

 

1 thought on “సీతాదేవి పుట్టిన జనకపురి

Leave a Reply to Aruna Cancel reply

Your email address will not be published. Required fields are marked *