May 19, 2024

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 49

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య

అన్నమయ్య మనకు జ్ఞానయజ్ఞం అంటే ఏమిటో దాని స్వరూపం ఎలా ఉంటుందో భగవద్గీతలోని శ్లోక రహస్యాలను మనకీ కీర్తనలో అందిస్తున్నాడు. సుఖ-దుఃఖాలను ఒకేలా పరిగణిస్తూ, కేవలం ఒక యజ్ఞం లాగా భగవంతుని ప్రీతి కోసం తమ కర్మలను ఆచరించేవారిని గూర్చి చెప్తున్నాడు.. యజ్ఞం అనేది చాలా విధాలుగా ఉంటుంది, అందులో చాలా రకాలు చెప్పబడ్డాయి. యజ్ఞం అనేది సరిగ్గా అర్పణ చేయబడ్డప్పుడు దాని అవశేషం అమృతంలా అవుతుంది. అలాంటి అమృతం స్వీకరించినప్పుడు, కర్తలు మలిన శుద్ధి చేయబడుతారు. కాబట్టి యజ్ఞం అనేది ఎప్పుడైనా సరియైన దృక్పథంతో, సరియైన జ్ఞానంతో చెయ్యబడాలంటున్నాడు. ఈ జ్ఞానమనే నావ సహాయంతో మహా పాపాత్ములు కూడా లౌకిక దుఃఖ సాగరాన్ని దాటవచ్చు. పరమ సత్యాన్ని ఎరిగిన ఒక నిజమైన ఆధ్యాత్మిక గురువు ద్వారా, ఇటువంటి జ్ఞానాన్నినేర్చుకోవాలి. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడి గురువుగా, అతన్ని జ్ఞానమనే ఖడ్గం తీసుకుని తన హృదయంలో జనించిన సందేహాలని ముక్కలుగా ఖండించి, లేచి తన కర్తవ్యాన్ని నిర్వర్తించమన్నాడు శ్రీకృష్ణుడు. అలాగే మనహృదయంలో ఉన్న అజ్ఞాన్ని తొలగించడానికి కూడా ఒక ఆధ్యాత్మిక గురువు కావాలంటున్నాడు అన్నమయ్య.

కీర్తన:

పల్లవి: జ్ఞానయజ్ఞ మీగతి మోక్షసాధనము
నానార్థములు నిన్నే నడపె మాగురుఁడు ॥పల్లవి॥

చ.1. అలరి దేహమనేటి యాగశాలలోన
బలువై యజ్ఞానపు పశువు బంధించి
కలసి వైరాగ్యపు కత్తులఁ గోసి కోసి
వెలయ జ్ఞానాగ్నిలో వేలిచె మాగురుఁడు ॥జ్ఞాన॥

చ.2. మొక్కుచు వైష్ణవులనే మునిసభ గూడపెట్టి
చొక్కుచు శ్రీపాదతీర్థ సోమపానము నించి
చక్కఁగా సంకీర్తనసామగానము చేసి
యిక్కువతో యజ్ఞము సేయించెఁబో మాగురుఁడు ॥జ్ఞాన॥

చ.3. తదియ్యగురుప్రసాదపు పురోడాశ మిచ్చి
కొదదీర ద్వయమను కుండంబులు వెట్టి
యెదలో శ్రీవేంకటేశు నిటు ప్రత్యక్షముచేసె
యెదివో స్వరూపదీక్ష యిచ్చెను మాగురుడు ॥జ్ఞాన॥

(రాగం ధన్నాసి; సం.2 సంకీ.148 – రాగిరేకు – 136-1)

విశ్లేషణ:

పల్లవి: జ్ఞానయజ్ఞ మీగతి మోక్షసాధనము
నానార్థములు నిన్నే నడపె మాగురుఁడు
అన్నమయ్య జ్ఞానయజ్ఞమీగతి అని అంటూ ప్రబోధిస్తున్నాడు. జ్ఞాన యజ్ఞం చెప్పబోవు రీతిగా మోక్షమునకు ఉపాయమగుచున్నది. ఈ యజ్ఞమునకు సంబంధించిన వివిధ కార్యములు మా ఆచార్యుడు నిర్వహించినాడని అంటున్నాడు.

చ.1.అలరి దేహమనేటి యాగశాలలో
బలువై యజ్ఞానపు పశువు బంధించి
కలసి వైరాగ్యపు కత్తులఁ గోసి కోసి
వెలయ జ్ఞానాగ్నిలో వేలిచె మాగురుఁడు
శరీరం అనెడి యాగశాలలో బలమైన అజ్ఞానమను పశువుని బంధించి, వైరాగ్యమనెడు కత్తులతో కోసి జ్ఞానమనెడు అగ్నిలో మా గురువు వేసినాడoటున్నాడు.

చ.2. మొక్కుచు వైష్ణవులనే మునిసభ గూడపెట్టి
చొక్కుచు శ్రీపాదతీర్థ సోమపానము నించి
చక్కఁగా సంకీర్తనసామగానము చేసి
యిక్కువతో యజ్ఞము సేయించెఁబో మాగురుఁడు
నమస్కార ఉపచారములు గావించుచూ పరమ భాగవతులైన మునుల సభను చేర్చి, ఆనందించుచూ మాకెల్లరకూ శ్రీపాద తీర్థము అను సోమపానం అందించి, రమణీయముగా సంకీర్తమనెడు సామగానం ఒనర్చి వేదవిహితమైన పద్ధతిలో మా ఆచార్యుడు జ్ఞాన యజ్ఞము చేయించినాడoటున్నాడు.

చ.3. తదియ్యగురుప్రసాదపు పురోడాశ మిచ్చి
కొదదీర ద్వయమను కుండంబులు వెట్టి
యెదలో శ్రీవేంకటేశు నిటు ప్రత్యక్షముచేసె
యెదివో స్వరూపదీక్ష యిచ్చెను మాగురుడు
ఇంకా ఇలా అంటున్నాడు. మా గురుడు తనకు సంబంధించిన గురుప్రసాదమను యజ్ఞఫలం ఒసంగి కొరత తీరునట్లుగా “ద్వయం” అను కుండలములు పెట్టినాడు. హృదయములో శ్రీ వేంకటేశ్వరుని ప్రత్యక్షము గావించినాడు. ఇదిగో మాకు స్వరూప దీక్ష ఇచ్చినాడు అంటున్నాడు అన్నమయ్య.

ముఖ్యమైన అర్ధాలు: మోక్షసాధనము = మోక్షమును చేరుకునే మార్గము; అజ్ఞానపు పశువు = అజ్ఞానములో కొట్టుకుంటున్న దేహం అనే విచక్షణలేని జంతువు; వైరాగ్యపు కత్తులు = వైరాగ్యమునకు సంబంధించిన విషయాలను తెలియజేయడమనే బోధనలు; శ్రీపాద తీర్ధ సోమపానము = శ్రీనివాసుని దివ్యపాదోదకం చక్కగా సేవించడం; సంకీర్తన సామగానము = సంకీర్తనలతో సామవేదం పఠించడం అని పరోక్షంగా చెప్పడం; పురోడాశము = యజ్ఞార్థమైన అపూపము, సోమలత రసము; కొసదీర = కొరత తీరునట్లు; ద్వయమను కుండలములు = రెండు కుండలములు.

******

1 thought on “అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 49

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *