April 18, 2024

అమ్మ కోసం

రచన: వంజారి రోహిణి

చెల్లికి డెలివరీ టైమ్. అమ్మకి ఆరోగ్యం బాగాలేదు. దూర ప్రయాణాలు చేసే ఓపిక అసలే లేకపోవటంతో చెల్లెలు గీత తనను పదే పదే బతిమాలడం తోటి తప్పనిసరి పరిస్థితుల్లో కావ్య చెల్లెలి ప్రసవ సమయంలో సాయంగా ఉండేందుకు తన ఇద్దరు చిన్నారులు లిఖిత, నిఖితలను వాళ్ళ నాయనమ్మ, తాతల దగ్గర వదిలి, వారికీ, తన భర్త విశ్వానికి పిల్లల గురించి లక్ష జాగ్రత్తలు చెప్పి అమెరికా విమానం ఎక్కింది కావ్య.
పెద్ద కూతురు లిఖిత రెండవ తరగతి, చిన్న పిల్ల యూకేజీ చదువుతున్నారు. అమ్మ అమెరికా వెళుతుంది, అక్కడ నెల రోజులు ఉండి వస్తుంది అని నెల రోజుల ముందు నుంచే పిల్లలను మానసికంగా సిద్ధం చేసినా కావ్య విమానం ఎక్కగానే అమ్మ కావాలి, అమ్మ కావాలి అంటూ చిన్నది నిఖిత పెద్ద పెట్టున ఏడుపందుకుంది. నిఖితని చూసి పెద్ద పిల్ల లిఖిత కూడా అమ్మ కోసం ఏడుపు రాగం తీసింది. వాళ్ళిద్దరినీ బుజ్జగించి, ఓదార్చి,అమ్మ వచ్చేటప్పుడు అమెరికా నుంచి బోలెడు బొమ్మలు, చాకోలెట్స్ మీకోసం తెస్తుందని చెప్పి, అమ్మ గురించి ఆలోచించకుండా మైమరపు మాటలు చెప్పే దానికి వాళ్ళ నాన్న, నానమ్మ,తాతలకు తల ప్రాణం తోకకు వచ్చింది.
అక్కడ కావ్య అమెరికా వెళ్ళిన వారానికి ఆమె చెల్లెలు గీతకి డెలివరీ అయి పండంటి పాప పుట్టింది. పదిరోజుల పురుటి స్నానం, బిడ్డకి స్నానం చేయించటం, పత్యం అన్నం వండి పెట్టడంలో గీతకు అన్నీ తానై అమ్మలా దగ్గరుండి చూసుకుంది కావ్య. అంతా సక్రమంగా జరిగిపోయింది. కావ్య చేసిన సాయానికి ఆమె చెల్లెలు గీత,మరిది శ్రీకర్ లు పదేపదే కావ్యకి కృతజ్ఞతలు చెప్పారు. ఇక అమెరికా నుంచి ఇండియా కు వచ్చేయాలని, తన చిన్నారి లిఖిత, నిఖితలను ఒడి చేర్చుకోవాలని కావ్య మనసు తహ తహ లాడింది.
ఇక్కడ ఇండియాలో అమ్మ రాక కోసం ఎదురు చూస్తూ మారే కాలెండర్ తేదీలను లెక్క పెట్టుకుంటూ నాన్న, నానమ్మ, తాతలు ఎంత ప్రేమగా చూసుకున్నా ఆ పసి మనసులు తల్లి రాక కోసం క్షణమొక యుగంగా గడుపసాగారు.
కాలం దేనికోసం, ఎవరికోసం ఆగదుగా. తీరా కావ్య ఇండియాకి తిరిగి వచ్చేరోజు రానే వచ్చింది. దాని కంటే ముందే ప్రపంచం మొత్తాన్ని కర్కశంగా కబళిస్తున్న కరోనా వైరస్ చాపకింద నీరులా మొదలై చాలా కొద్ది రోజులలోనే దావానంలా కర్కశ జ్వాలలను విశ్వమంతా వ్యాపింపచేస్తోంది. రవాణా వ్యవస్థలు ఎక్కడికక్కడ దిగ్బంధం అయిపోతున్నాయి. విదేశాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళపై ఆంక్షలు ఎక్కువైనాయి.
పిల్లల కోసం అమెరికాలో బొమ్మలు, బట్టలు, కొని పిల్లలను చూడాలని ఎంతో ఆశతో, ఆత్రుతగా విమానం దిగిన కావ్య ఉత్సాహం పాలపొంగు మీద నీళ్ళు చిలకరించినట్లు అణిగిపోయింది విమానాశ్రయంలోని పరిస్థితి చూసి. దాదాపు విమానాశ్రయం అంతా నిశ్శబ్దంగా, నిర్మానుష్యంగా ఉంది. తన కోసం భర్త, పిల్లలు ఎవరు రాలేదని కావ్యకి అర్థమైంది. విమానాశ్రయంలోనే కావ్యకి వైద్య పరీక్షలు చేసారు. శల్య పరీక్షలు అన్నీ జరిగాక, కరోనా వైరస్ సోకిన లక్షణాలు ఏవీ లేవని నిర్దారణకు వచ్చిన తర్వాత ఇంటి దగ్గర పద్నాలుగు రోజులు ఒక గదిలో ఒంటరిగా ఉండాలి, కుటుంబ సభ్యులను తాకరాదు వంటి జాగ్రత్తలు చెప్పి కావ్యను ఇంటికి పంపించారు విమానాశ్రయ అధికారులు. విమానాశ్రయం బయట కావ్య కోసం ఎదురుచూస్తున్న ఆమె భర్త విశ్వం కారులో ఆమెను ఇంటికి తీసుకుని పోయాడు.
అమ్మ వస్తుంది. తమకు అమెరికా నుంచి ఆడుకోను ఏమెమో తెస్తుంది అని ఆశగా ఎదురు చూసిన లిఖిత, నిఖితలకు ఇంటికి వచ్చిన అమ్మతో మాట్లాడకూడదు, అమ్మని తాకకూడదు అని చెప్పేసరికి, అమ్మకు ఏమైందో తెలియక ఆ పసి ప్రాణాలు అమ్మ ఒడిని చేరాలని తపించిపోయాయి.
ఎక్కడో ఉండటం వేరు. అమ్మ ఇంట్లోనే ఉన్నా ఓ గదిలో ఒంటరిగా, నేరస్తురాలిగా, బందిగా ఉండాల్సి రావటం ఆ పసిబిడ్డలు జీర్ణించుకోలేక పోయారు. కావ్య కూడా బిడ్డలు, భర్త, అత్త,మామల ఆరోగ్య దృష్ట్యా, ముందు జాగ్రత్త చర్యగా తనకు తానుగా ఇంటిలోని ఓ గదిలో బందీగా మారింది. గదిలోపల ఉన్న కావ్యకు అమ్మను చూడాలి, అమ్మ దగ్గరకు పోతాము అంటూ బిడ్డలు ఏడుస్తుంటే కావ్య తల్లి మనస్సు తల్లడిల్లిపోయేది. గది తలుపులు తెరుచుకుని వెళ్ళి వాళ్ళని అక్కున చేర్చుకోవాలనే కోరికని బలవంతంగా ఆపుకునేది. ఓ రోజు మధ్యాహ్నం అన్నాలు తిని అంతా నిద్రపోతున్నారు. పిల్లలిద్దరూ హాల్లో ఆడుకుంటున్నారు. గదిలో ఉన్న కావ్యకి మాత్రం నిద్ర రాలేదు. అత్తా, మామయ్యలు వాళ్ళ గదిలో, ఆమె భర్త విశ్వం తన గదిలో తలుపేసుకుని నిద్రపోతున్నారు. పిల్లల మాటలు కావ్యకి వినిపిస్తూనే ఉన్నాయ్. ఇంతలోనే చిన్న పిల్ల నిఖిత అమ్మా, అమ్మా రక్తం అంటూ పెద్దపెట్టున ఏడుస్తోంది. ఉలిక్కి పడి కావ్య తలుపు తీసి చూసింది. నికిత చూపుడువేలు తెగి రక్తం కారసాగింది. గుండె ఆగినంత పనైంది కావ్యకి. గబా గబా హాల్లోకి పరుగెత్తింది నిఖితను ఎత్తుకోవాలని. అంతలోనే ” ఆగు కావ్య… ఏంది నువ్వు చేస్తున్న పని ” అంటూ ఆమె అత్తయ్య వచ్చి పెద్దగా అరిచి నిఖిత ని ఎత్తుకుని వాష్ బేసిన్ దగ్గరకు తీసుకెళ్లింది. ఇంతలో విశ్వము కూడా వచ్చి ” కావ్య పాపని మేము చూసుకుంటాం. నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో అన్నాడు ఆజ్ఞ జారీచేస్తునట్టు.” నిన్ను హౌస్ క్వారంటైన్ లో ఉండమంది మన జాగ్రత్త కోసమే కదా. ఇంకో పదిరోజులు ఆగలేవా కావ్య ” అంటూ మామయ్య మాటలు మరో పక్కనుంచి. దుఃఖం ముంచుకొచ్చింది కావ్యకి. “నా బిడ్డల నుంచి నన్ను వేరు చేయడానికి మీరు ఎవరు” అని గట్టిగా అరవాలనిపించింది. మళ్ళీ కరోనా భూతం గుర్తుకు వచ్చి కళ్ళనిండా నీళ్ళు నింపుకుని గదిలోకి వెళ్ళి మంచం మీద బోర్లా పడి ఏడవసాగింది. తను అమెరికాకి పోకుండా ఉంటే ఎంత బాగుండేది. చెల్లికి రాలేనని ఏదో ఒకటి సర్దిచెప్పి ఉండే సరిపోయేది. అయినా ఇప్పుడు అనుకుని ఏం లాభం. తనకు కరోనా లేదు.అయినా ఈ హౌస్ అరెస్ట్ తప్పలేదు తనకు. గది బయట నుంచి నిఖిత ఏడుపు వినిపించేకొద్దీ గది లోపల కావ్య గుండె కన్నీటి చెరువౌతోంది.
గది లోపల కావ్య, గది బయట తల్లి కోసం లిఖిత,నిఖితలు తమను ఇలా దూరం చేసిన కనపడని కరోనాని తలచుకుని దుఃఖిస్తూ, కరుణించి తమని కలపమని ఆ భగవంతుడిని అనుక్షణము ప్రార్థిస్తూ క్షణమొక యుగంగా గడపసాగారు.
కావ్య అమెరికా నుంచి వచ్చిఅప్పటికి పద్నాలుగు రోజులు అయింది. ఆ రోజు కావ్య వాళ్ళ ఇంటికి పోలీసు అధికారులు, వైద్య బృందం వచ్చారు. మరలా కావ్యకి అన్నీ రకాల వైద్య పరీక్షలు చేసి ఆమెకు కరోనా వైరస్ సోకలేదు అని నిర్ధారణ చేసారు. ఇక కుటుంబ సభ్యులను కలవవచ్చు అని చెప్పి వెళ్ళిపోయారు.
ఎన్నో యుగాల ఎడబాటు అనంతరం తల్లీబిడ్డలు కలసుకున్నట్లు కావ్య తన చిన్నారి లిఖిత, నిఖితలను అక్కున చేర్చుకుని ముద్దులు కురిపించింది. అమ్మ ఒడిని చేరిన ఆ బిడ్డల మనసులు ఆనందంతో ఉరకలేసే చిరుజల్లులైనాయి. తల్లి, బిడ్డల అనురాగానికి విశ్వం మనస్సు రాగరంజితమైంది. నానమ్మ, తాతలు నిశ్చింతగా చూసారు. ఆ ఇంట మళ్ళీ ఆనందపు హరివిల్లు వెల్లివిరిసింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *