June 19, 2024

గిలకమ్మ కతలు – ఆల్లదేదో ఆల్లదన్నట్టు ..మందేదో మంది. అంతే..!

రచన: కన్నెగంటి అనసూయ

బళ్ళో బెల్లిలాక్కొట్టేరో లేదో తన పొస్తకాలు ఎనకమాల వత్తా వత్తా సుబ్బలచ్చాన్ని తెమ్మని లంగా కాళ్లకడ్డంబడద్దేవోనని రెండు సేతుల్తోనూ పైకెత్తి పట్టుకుని ఏదో ములిగిపోతందన్నట్టు పెద్ద పే..ద్దంగ లేసుకుంటా ఇంటికేసి నడుత్తుందేవో.. అడుగడ్దప్పుడల్లా..సిమ్మిల్లో దబక్కన పడ్డ రోకలి పోటల్లే , కురుత్తాకి ముందరిసిన మేఘపురంకెల్లే.. సౌండొత్తుంటే..
అంతకు ముందే అన్నాల్దిని ..పొద్దుటేల్నుండీ సేసీ సేసీ ఉన్నారేవో నడాలు పట్టేసి కునుకుదీద్దావని మంచాలెక్కినోళ్ళు కాత్తా టీయేలయ్యే తలికి సేట్లల్లో అయిదారు తవ్వల బియ్యాలేసుకుని మట్టి బెడ్డలూ, వండ్ల గింజలూ ఏరదావని ఈధరుగుల్మీదకి సేరి ముచ్చట్లల్లో మునిగితేల్తన్న .. అమ్మలక్కలంతా.. తలెత్తి సూత్తం ఆలీసం ఇట్టే కనుమరుగయ్యిన గిలకమ్మని తల్సుకుంటా..
“సరోజ్నీ..కూతురు గందా..! కాతంత సాగింది..ఇంతుండేది..” అందోకావిడి..
“ఈడొత్తంది. ఏడెనిమిది నెల్లుంటే సాపెక్కుద్దిగూడాను..సాక్క..ఆమట్నే ఉంటదేటే..! నువ్ మరీ సెప్తావ్..” అందింకొకావిడి.
“ఊరుకోవే ..కోవలే..! నిన్న గాక మొన్నటి పిల్లది. సుతామతా ఉండాలి ఏదన్నా అన్నావంటేని..! మా పెద్దోడికెన్నేళ్ళు. మొన్న దీపాళామాసకి ఆడికి ఎనిమిదెల్లి తొమ్మిదొచ్చినియ్యి. ఆడికంటే అయిదునెల్లు సిన్నదది. నేను పిల్లోణ్ణి సంకనేసుకుని పసుపూ, పిండితో..అత్తారింటికెల్లిన్నాడు ఆ రేత్రి సరోజ్నికి పురుడొచ్చిందని, ఆడపిల్లని సెప్పేరు..అప్పుడే ఎక్కడాడద్ది..ఇంకో మూణ్నాలుగేల్లన్నా పట్టుద్ది. “ అంటా సేట్లో మట్టిబెడ్డన్దీసుకుని నోట్లో ఏసుకుంది..
“ఆ..ఇయ్యాల రేపూ..అన్నేల్లెవరుమ్తన్నార్లే..మా సిన్నప్పుడు పద్దాలుగు..పదేనేల్లోచ్చాకా అయ్యీవోల్లు..ఇప్పుడు పదేల్లకే సాపెక్కుతున్నారు..’’
“ఆ మాట్రైటే..మా పెద్దొదిని సెల్లెలు..అలాగే పదేల్లకే ఆడేసింది..మా వదినాల్లమ్మా ఒకటే ఇదైపోయింది పాపం..సిన్న పిల్ల. దానికేం తెలుసుద్ది..అని. “
“ ఆ..ఎంతుకు దెలవదులే..ఇయ్యాలా రేపూ..ఆల్లకే బాగా తెలుత్తున్నాయ్..సబ్బడే దాకానే జిడ్డు ఏసాలని..అయితేనే గానీ ఆల్లకీ తెలవదు..ఆటలనీ..అరికతలనీ..అక్కడికీ ఇక్కడికీ దిరుగుతుం తప్ప..సదువా ఏవన్నానా..?..ఇప్పుడెల్లింది సూడు సరోజ్నీ కూతురు గిలక..అదెంత గడ్డు రాకాసోనంట బళ్ళో..ఎవ్వర్నీ నొరెత్తనివ్వదింట బళ్ళో. మేస్టార్లని గూడానమ్ట. మా సిన్నోడు సెప్తున్నాడు..”
..ఇక్కడీల్లిలా సెప్పుకుంటుంటే…అంత అడావిడిగానూ.. ఇల్లు సేరిన గిలక ఆల్లమ్మమీద నోరెత్తనియ్యకుండా ఇంతెత్తున ఎగురుతుంది..
“కాదేమ్మా..ఏడుత్తున్నాడలాగని ఆడడిగినియ్యన్నీ..కొనేత్తావా..?” సుర్రా సుర్రా ఆల్లమ్మకేసి సూత్తా అంది గిలక.
“నన్నడిగితే నేనేంజెప్తానే..మీ నాన్ననడుగు..”
“ఏరీ ..నాన్న..?” గుడ్డురిమి సూసింది..గిలక..
“ఎక్కడేటి..సూర్రావుగారింటికెల్లేరు..ఆ బేగ్గెక్కడ కొన్నారో..అడిగొత్తాకి..”
“ఐతే..కొనేత్తారా? “ అరిసింది..గిలక.
“ఆడేడుత్తుంటే..కొనకేంజేత్తారు? “
“నేనేడుత్తాను.. కొంటారా?” సరోజ్ని మొకలో మొకవెట్టి నిల్దీసింది గిలక..
“కన్నాకా తప్పుద్దా..కొనక సత్తామా?. “ పన్జేసుకుంటానే బదులిచ్చింది సరోజ్ని..
ఆ మాటతో..రుస్సా..రుస్సా..ఈధిలోకి బోయింది గిలక.
“ గిలకా…ఒసే గిలకా..మజ్జిగరొట్టేసేను..తినెల్లు..” ఎనకనించరిసింది సరోజ్ని..ఈధి గుమ్మంకేసి సూత్తా..
“నూదిను. నాకక్కాలేదు.” ఇసుక్కుంటా వచ్చరుగు మీద కూకుంది..
ఒల్లు మండిపోతంది గిలక్కి ఆల్లమ్మ తీరుకి..
బళ్ళో..జరిగిందంతా గేపకవొచ్చింది గిలక్కి.
అప్పటికే బళ్ళు తెరిసి వారవయ్యిందేవో..అంతకు ముందు రోజు పొరుగూరెల్లి పట్టుకొచ్చిన బేగ్గేసుకుని బళ్ళోకొచ్చేడు శీను, గిలక తమ్ముడు.
అప్పటికే బళ్ళోవోళ్లంతా కొత్త పొస్తకాలూ, పెన్సిళ్ళూ, లబ్బరూ, పెన్సిలు సెక్కుకునేది..అన్నీ అందరూ కొనేస్కున్నారేవో..ఆల్లందర్నీ సూత్తంటే శీనుకి అదేదోలాగా ఉంది..
రేత్రుల్లు పొలాన్నించొచ్చేకా నీళ్ళోసుకుని వణ్నందిని మంచవెక్కిన ఆల్ల నాన్న పక్కన్జేరి..గునుత్తానే ఉన్నాడు..ఎవరెవరూ ఎలాటియ్యి కొనుక్కున్నారో సెప్తా..
వరి నారు నూరుపుల్లతో అడావిడిగా ఉన్న నాగేస్రావ్…బడిదీసేకా..పదిపదేన్రోజులు బల్లో ఏమ్ సెప్తారో తెల్దా ఏటి అన్నట్టు..సరోజ్ని..లబో దిబోమంటన్నా.. దగ్గరుండి సూస్కోపోతే ఎల్లేం, వొచ్చేవనే కూలోల్లతో మా ఇబ్బందని పెడసెవినెట్టేడు.
సేతికిందో మడిసుంటే..ఇంతిబ్బందుండాపోననెన్నిసార్లనుకున్నాడో తన్లో తాను..
“పిల్లోడెదిగే దాకానే..ఆడు సేతికందొత్తే..ఇక సూస్కొవక్కల్లేదు..” అనుకోపోనూ లేదు..
అంతేనేటి..
సందలడే ఏల, సల్లబాటేల..డక్కామొక్కెల్దిన్న కాయవేవో..ఏణ్ణీల్లతో..సేద్దీరి..నిండాకాశం కింద కాలు మీద కాలేసుకుని మంచమ్మీద పడుకునుంటే పిల్లోడు పక్కలోజేరి..తనేపుదిరిగి పొట్టమీచ్చెయ్యేసి..నానా..బొక్కులెప్పుడు కొంటావని గునుత్తావుంటే..కొత్తగా కూతవొచ్చిన కోలిలపాటింటన్నట్టుంటాది నాగేస్రావ్ కి.
అంతుకే..నాట్లయ్యాకా..ఏవేంగావాల్నో..మేస్టార్తో సిట్టీ రాయించుకు రమ్మని..ఎల్లి తెచ్చేడోనాడు. సిట్టీలో ఉన్నయ్యన్నీ కొన్నాకా..అక్కడున్నోల్లంతా కొంటన్నారన్జెప్పి..పిల్లోడికన్జెప్పి..కొత్త్గగా వత్తన్నయ్యంటే బేగ్గోటి దీస్కున్నాడు.
దాన్జూసి పిల్లోడి మురిపం అంతా ఇంతాగాదు. నాగేస్రావ్ కొడుకున్జూత్తుంటే..సరోజ్నీకి మొగుడి సంబరం సూత్తవే సరిపోయింది..
ఏవనుకుంటదో ఏటోనని..” మరి గిలక్కో? దానిక్కూడా ..తేపోయారా?” అంది అక్కడే కూకుని బేగ్గెనక్కి అదే పనిగా సూత్తన్న గిలక్కేసి సూత్తా..
“ ఏటే..అమ్మా..నేనేవన్నా అడిగేనా? లేపోతే..శీనుగాడికి తెచ్చేరని నేనేవన్నా ఏడుత్తున్నానా? నీతో సెప్పేనా నాగ్గావాలని. నా పొస్తకాలకి ఇదసలు సాల్నే సాల్దు..” అంది.
“ అమ్మయ్య…బతికిచ్చింది..” అనుకుంది సరోజ్ని మనసులో..
సమస్య గిలకనించొత్తాదనుకుంటే..శీనుగాణ్ణించే వచ్చేసింది..మజ్జానం అయ్యేతలికల్లా..
రాత్రే..కొత్త బేగ్గులో బొక్కులూ…కొత్త పెన్సిలూ…లబ్బరూ..అన్నీ సర్ధేసుకుని భుజాన్నేసుకుని కాసేపు ఈధిలో తిరిగి ఆల్లూ ఈల్లూ అందరూ సూసేసాకా..లోపలికొచ్చి నీళ్ళోసుకుని వణ్నందిని బేగ్గునలాగే పక్కలోబెట్టుకుని పడుకున్నాడేమో..రోజూ కంటే ముందలే లేసేసి తానవాడేటప్పుడు కూదా ఎవరన్నా బేగ్గుని ముట్తేసుకుంటన్నారేవోనని దానెనక్కే సూత్తా తానం సేసేడేవో..సద్దన్నం తిని రోజూ కంటే ముందే సంకలు ఎగరేసుకుంటా బళ్ళొకెల్తన్న కొడుకుని ఒల్లంతా కల్లు సేసుకుని సూసినంతసేప్పట్తలేదు.. మజ్జానం ఆడేడుత్తా ఇంటికొచ్చేతలికి.
బళ్లో..ఎవరో “ ..ఇంటికెల్లిపోతానని మీ తమ్ముడేడుత్తున్నాడని..” సెప్తే శీను దగ్గరికెల్లిందేవో..అప్పటికే ఆణ్ణింటికి పంపేసేరంట. ఏటి ..ఎందుకేడుత్తున్నాడని..గిలకడిగిందానికి..
“పొద్దున్న మీ తమ్ముడు బేగ్గేసుకొచ్చేడుగదా బళ్ళోకి. అంతా ..సేలా బాగుంది సేలా బాగుంది అని సుట్టూ సేరి ముట్టుకుని, ఏసుకుని సూసేరు. మీ తమ్ముడేవో..తెగ మురిసిపోయేడు. మజ్జానం ఉండిల్లోరి కిష్న…ఇంకో బేగ్గేసుకొచ్చేడు..దాని మీద కుందేలు బొమ్మగూడా ఉంది..దాన్నందరూ సూత్తన్నారని..
మీవోడూ ఏడ్సేడు..ఆ బేగ్గొందంట. కుందేలున్న బేగ్గు కావాలాంట..”
గిరుక్కునెనక్కి దిరిగింది గిలక మేస్టార్ని కలుత్తాకి ” శీనుగాడింతే” అనుకుంటా..
“ మేస్టారండి..మా తమ్ముడేడిత్తే నాతో సెప్పొచ్చుగదండీ..మీకెదెల్దా ఆడు నాతమ్ముడని? ఇప్పుడేవో మా నాన పొలానుంటారు. ఈడు ఏడుత్తా ఇంటికెల్లి మాయమ్మని ఏడిపిత్తాడు..పాపం మాయమ్మ..” అనుకుంటా..బెల్లెప్పుడు కొడతారా అని స్సొసిందేవో..బెల్లిలా కొట్తేరో లేదో..ఉరుకెత్తిందింటికి.
అప్పటికే ఆడేడుత్తుంటే, ఆణ్ణూరుకోబెట్టలేక సరోజ్ని మొగుడిక్కబురంపుతుంది, నాగేస్రావ్ వచ్చేత్తం..అతనొచ్చేతలికే ఏడ్సీ ఏడ్సీ పిల్లోడు సొమ్మసిల్లిపోయినట్టు మంచమ్మీదడి నిద్రోటం..ఆణ్ణలా సూత్తా..మనసిదయిపోయి..దాన్ని ఎక్కడ కొన్నారో కనుక్కునొత్తానని..అదే సైకిలు మీద ఉండిల్లోరి కిష్నింటికి ఎల్తం..
ఇయ్యేయీ నచ్చలేదు గిలక్కని గిలక ముక్కుల్లోంచొత్తన్న ఏడి ఏడి ఆవిర్లే సెప్తున్నాయ్.
ఆయాసంతో గట్టిగా రొప్పుతుందేవో..గిలక గుండెలు ఇంతెత్తున ఎగిరెగిరి పడతన్నాయ్..
గిలకిలా ఆలోసిత్తన్నంతలోనే దూరంగా వత్తా ఆపిచ్చేడు గిలకాల్ల నాన్న నాగేస్రావ్..
గుమ్మాలో సైకిలాపుతూనే అరుగు దిగి గబుక్కునెల్లి సైకిల్ పట్టుకుని..
“ ఎక్కడికెల్లేవ్ నానా..?”
“ అదే..ఆ కిష్నగాడికేదో ఆల్ల నాన్న..కుందేలు బొమ్మున్న బేగ్గు కొన్నాడంటగదా..ఎక్కడ కొన్నాడో అడిగొద్దామని “ అన్నాడు..గిలకమ్మనే తేరిపార సూత్తా..
“ సరే నానా.. ఆడు ఏడుత్తున్నాడని..కుందేలు బొమ్మున్న బేగ్గు తెత్తావ్. నిన్న కొన్న కొత్తది ఎవరోడతారు? నాకు సరిపోద్దా? పోదుగదా?”
“ …దాన్నలాగుంచేత్తవే మరి ఏంజేత్తాం. ఏడుత్తున్నాడు గదా..!”
“ ఏడుత్తున్నాడని కుందేలు బొమ్మున్న ఇంకో కొత్తది కొంటావు నాన్నా..రేపు ఇంకోడు కుక్క బొమ్మున్నది తెత్తాడు. శీను గాడికి అప్పుడు కుందేలు బొమ్మున్నది నచ్చదు..అప్పుడేమ్జేత్తా నానా? మల్లీ కుక్కబొమ్మున్నాది కొనుక్కొత్తావా..సెప్పు..?”
కూతురికేం సమాధానం సెప్పాలో తోసలేదు నాగేస్రావ్ కి..
“..ఈధిలో సెట్తంత మడిసినట్టుకుని ఏంటే ఆ నిల్దీత్తం గిలకా..? “ అరిసింది సరోజ్ని..అప్పుడే మొగుడి మాటినపడి గుమ్మాలోకొచ్చిందావె.
“నిల్దీత్తం ఏవుంది. గిలక సెప్పిందీ రైటే..” అంటా గిలకని పక్కకి లెగమని సైకిల్ని అరుక్కి జేరేత్తా ఆలోసించేడేవో నాగేస్రావ్..
“ ఏం సెయ్యమంటావో గూడా నువ్వే సెప్పు..” అన్నాడు సైకిల్కి తాళవేత్తా..
అతనికసలే సిరాగ్గా ఉంది..వత్తా వత్తా..రేపు బేగ్గు కొంటాకి ఊరెల్లాల్సొత్తాదని మాట్టాడుకున్న కూలోల్లనే వద్దని సెప్పేసొచ్చేడు..సందలడ్దాకా సెప్పేడని..ఇక ఆ టయానికి పన్లోకెవళ్ళు పిలుత్తారని..ఆళ్ళ సణుగుళ్ళూ, గొణుగుళ్ళూ ఇనేతలికి నాగేస్రావ్ కి తలకొట్టేసినట్తయ్యిందిగూడాను.
నిజంగూడాననుకున్నాడు వత్తా వత్తా.. మరేంజేత్తాడు..పిల్లోడు ఏడ్సిన ఏడుపుకి దవళ్ళు సారికల్గట్తేసి ఉన్నాయ్ ..ఏ తండ్రికి బాదెయ్యదు..పిల్లలలా ఏడుత్తుంటే..
అంతుకే..గిలక సెప్పిందేటో ఇందావని గిలకనే అడిగేడేమో..ఏంజెప్పుద్దాని..
గిలకెనక్కే సూత్తన్నారిద్దరూను..
“ సెప్పు నాన్నా ఆడికి. మన బేగ్గు మనది. ఆళ్ల బేగ్గు ఆల్లదని. అందరూ ఒక్కసోటే కొంటారా?
అంతుకే అందరియ్యీ ఒకేలాగుండవని. ఆ కిష్నగాడి అమ్మా, నానా మీ ఇద్దర్లాగా ఉన్నారా? మీరిద్దరూ ఆ కిష్నగాడి అమ్మా, నాన్నాలాగా ఉన్నారా? ఎవరి అమ్మ,నాన్నాఆల్లే..అలాగే బేగ్గులూ, బట్టలూ, అన్నీని. “
తెల్లబోయేరిద్దరూ గిలకమ్మ మాటలకి..
“పోన్లెండి..ఏదో సెప్తుంది గదా..! అంతగా ఇనాపోతే అప్పుడే సెప్దాం..ఆ కుక్కలూ, కుందేల్లూ ఉన్న బేగ్గుల కంటే..నున్నగా నీ బేగ్గే బాగుందమ్మా…అని..”
అన్న సరోజ్నీ మీదకి ఒక్కురుకురికింది గిలక..
“ అలా ఎంతుకు సెప్పాలమ్మా..? నీకోసారి సెప్తే అర్దం అవదా? ఆల్లదానికంటే బాగుందనీ, బాగోలేదని సెప్పాలా..? మన నాన్న కొన్నదేదో మనది .అంతే..అంతే కదా నానా?”
“ అంతేనమ్మా..అంతే..! “ అన్నాడు నాగేస్రావ్..సైకిల్ తాళం తీసి..కూలోళ్ల కోసం ఎల్తా..
మెల్లగా వచ్చి కూతురెనక్కి సేరింది సరోజ్ని..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *