May 19, 2024

చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి దేవాలయము (చేబ్రోలు-గుంటూరు జిల్లా)

రచన: అంబడిపూడి శ్యామసుందరరావు

త్రిమూర్తులలో ఒకడైన బ్రహ్మకు భృగుమహర్షి శాపము వలన దేవాలయాలు ఉండవు. ఉన్న దేవాలయాలు కూడా శివలింగాకృతిలో ఉంటాయి. అటువంటి దేవాలయాలు బ్రహ్మ, శివుడు పేర్లను కలిపి ఉంటాయి. అందుచేతనే శివుడిని పూజించేటప్పుడు ముందుగా బ్రహ్మను తలచుకుంటాము, అటువంటి దేవాలయాలలో గుంటూరు జిల్లా లోని చేబ్రోలు గ్రామములో వెలసిన చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర స్వామి దేవాలయము చాలా ముఖ్యమైనది.
ఈ దేవాలయాన్ని రాజా వాసిరెడ్డి వెంటాద్రి నాయుడు గారు 200 ఏళ్ల క్రితము అంటే 1817 ప్రాంతములో నిర్మించిన ఈ దేవాలయములో బ్రహ్మ, శివునితో పాటు పూజలు అందుకుంటాడు. ఈ దేవాలయ ప్రాంగణములో చోళులకాలం నాటి శిలాశాసనలు కనిపిస్తాయి దీనిని బట్టి చోళ నాయకులైన వెలనాడు చోళులు ఈ దేవాలయాన్ని దర్శించి నట్లు చారిత్రాత్మకాధారాలు ఉన్నాయి.కాశీలో బ్రహ్మదేవుడి గుడి తరువాత చేబ్రోలులో బ్రహ్మకు గుడి ఉండటం వలన చేబ్రోలును దక్షిణ కాశీగా పిలుస్తారు. పద్మాకారంలోని నల్లరాతి శివలింగము చుట్టూ బ్రహ్మ నాలుగు ముఖాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ వెలసిన బ్రహ్మను చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర స్వామి అనే పేరుతొ పూజిస్తారు కాబట్టి భక్తులకు ఏకకాలములో శివుడిని, బ్రహ్మను పూజించిన ఫలితము దక్కుతుంది. అందువల్లే లింగాష్టకములో, “బ్రహ్మ మురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం”అని ప్రార్ధిస్తారు.
ఈ దేవాలయము కోనేరు మధ్యలో ఉంటుంది. చుట్టూ రెండు చిన్న శివాలయాలు, తూర్పున చంద్రమౌళీశ్వరుడు పడమర సహస్ర లింగేశ్వరుడి ఆలయము, 999 చిన్న చిన్న శివలింగాలతో ఉన్నపెద్ద శివలింగముతో ఉంటుంది. ఉత్తరంలో వేణుగోపాలస్వామి దక్షిణాన రంగనాథస్వామి కొలువై ఉంటారు. నాలుగు దిక్కుల తరువాత నాలుగు మూలలలో అమ్మవారి నాలుగు శక్తి ఆలయాలు ఉంటాయి.ఆలయానికి దక్షిణాన గాలిగోపురం, ఎర్ర రాయితో
నిర్మించిన నందీశ్వరుడి విగ్రహము ఉంటాయి.
పూర్వము ఇక్కడ 101 దేవాలయాలు, 101బావులు ఉండేవిట కాలక్రమేణా చాలా దేవాలయాలు అంతరించిపోయాయి. ఈ ఆలయ దగ్గరలోనే దక్షిణముగా చోళులచే నిర్మింపబడ్డ పురాతనమైన శ్రీ ఆదికేశవ స్వామి ఆలయము ఉంది ఇక్కడ కొలువై ఉన్న విష్ణుమూర్తి కుడిచేతిలో శంఖము, ఎడమ చేతిలోచక్రము అపసవ్యముగా ఉండటం విశేషము.ఈ ఆలయానికి వెనుక వైపున తిరుమలలో ఉన్నట్లు విమాన ఆది కేశవ స్వామి విగ్రహము ఉంటుంది. ఆలయము మూసి ఉన్న సమయములో భక్తులుఈ విమాన స్వామిని దర్శించుకోవచ్చు ఈ దేవాలయముతో పాటు శ్రీ నాగేశ్వర స్వామి, శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాలు కూడా దగ్గరలోనే ఉన్నాయి.
ఈ దేవాలయాలయాలు అన్ని 9 – 14 శతాబ్దాల కాలములో నిర్మింపబడ్డాయి అని పురావస్తు శాస్త్రజ్ఞుల అంచనా. వేయిస్తంభాల మండపముతో నటరాజస్వామి దేవాలయము ప్రస్తుతము నాగేశ్వరస్వామి ఆలయానికి దగ్గరలో శిధిలావస్థలో ఉన్న నంది విగ్రహానికి ఎదురుగా ఉండేది అని చెపుతారు.పన్నెండు అడుగుల పొడవు ఉన్న నటరాజ విగ్రహము వేల సంవత్సరాల క్రితము ముఖ్య ఆకర్షణగాఉండేది.
భక్తులు శ్రీ బ్రహ్మ లింగేశ్వరస్వామి ఆలయములో చతుర్ముఖుడి దర్శనానికి చెరువు మధ్యగల మండపానికి వంతెన మీదుగా వెళతారు. ఈ దేవాలయములో ముఖ్యముగా నాలుగు పూజనీయం స్థలాలు నాగేశ్వర, ఆదికేశ్వర, భీమేశ్వర, బ్రహ్మలింగేశ్వర , కలిగి ఉండటం వలన చాలా ప్రశస్తమైన పుణ్యక్షేత్రముగా విరాజిల్లుతుంది. భీమేశ్వర స్వామి ఆలయము రూపకల్పన నిర్మాణము చాల భాగము చాళుక్య రాజు, కృష్ణ దేవరాయలు కాలము నాడే జరిగింది. మిగిలిన భాగము పది పద్నాల్గవ శతాబ్దాల మధ్య జరిగింది.ఈ ప్రాంగణములోనే ప్రసన్నంజనేయ స్వామి ఆలయము నుండి ఈ ఆలయ గోపురము పిరమిడ్ ఆకృతిని పోలి ఉంటుంది. ఇన్ని ప్రతేకతలు ఉన్న చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వరస్వామి దేవాలయము తప్పనిసరిగా దర్శించవలసిన పుణ్యక్షేత్రము.

4 thoughts on “చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి దేవాలయము (చేబ్రోలు-గుంటూరు జిల్లా)

  1. నా జిల్లా లో ఇంత పేరు ఉన్న గుడి ని ఈ రచయిత ద్వారా తెలుసు కోవటం చాలా ఆనందం కలిగింది. తప్ప కుండా ఇండియా వచ్చినప్పుడు ఈ గుడి ని దర్శనం చేసుకుంటా .

  2. చాలా చక్కగా ,అసక్తికరంగా,వివరంగా చెప్పారు . విష్ణు మూర్తి కి శంఖు చక్రాలు అపసవ్యంగా ఉండటం వంటి ఎన్నో తెలియని విషయలు తెలియచేసారు.మొత్తం వ్యాసం చాలా బాగుంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *