May 19, 2024

తెగింపు

రచన: చివుకుల పద్మజ

స్టాఫ్ రూమ్ లో కూర్చుని మాటి మాటికి గడియారం కేసి చూపులు సారిస్తోంది రమ్య. ఏంటి, ఇంకా నిర్మల క్లాస్ వదలలేదు అని ఎదురు చూస్తోంది.
లాస్ట్ అవర్ ఈ రోజు నిర్మలది. చివరి గంట క్లాస్ తీసుకోవటం చాలా కష్టం. పొద్దుటినుంచి విని విని ఉంటారేమో విద్యార్థులు అస్సలు కూర్చోలేరు, వినలేరు చివరి దాకా. అలాగని ముందు వదిలితే ప్రిన్సిపాల్ గారు ఊరుకోరు. అందరికీ ఇది కత్తి మీద సామే. నిర్మల మాత్రం చాలా శ్రద్ధగా తీసుకుంటుంది. తన సబ్జెక్టు ఇంగ్లీష్. మాములు సిలబస్ లో పాఠాలతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, గ్రూప్ టాస్క్స్ లాంటివి ఇంటరెస్టింగ్ గా కలిపి చేయిస్తుంది. ఎక్కువ సార్లే సక్సెస్ అవుతూంటుంది ఈ ప్రయత్నంలో.
టైం దాటిపోవటం గమనించి, క్లాస్ ముగించి స్టాఫ్ రూమ్ కు వచ్చి ఉస్సురని కూలబడింది నిర్మల.
“బాగా అలసి పోయావు” వాటర్ బాటిల్ అందించింది రమ్య.
“అవును” నీరసంగా నవ్వింది నిర్మల.
బాగ్ తీసుకుని లేస్తూ “పద, వెళ్తూ మాట్లాడుకుందాం” అంటూ బయటకు దారి తీసింది రమ్య.
రమ్య కంప్యూటర్స్ , నిర్మల ఇంగ్లీష్ చెప్తారు, పార్ట్ టైం బేసిస్ మీద. కాలేజీ ఒక అర కిలోమీటర్ దూరంలో ఉంటుంది మెయిన్ రోడ్ నించి.
“ఇప్పుడు చెప్పు, ఏంటి ఆలా వున్నావు” అనునయంగా అడిగింది రమ్య.
“ఏముంటుంది కొత్తగా. రొటీన్ ఇంటి కధ, అంతే” నిట్టూర్చింది నిర్మల.
“అది తెలుస్తూనే వుంది లే. ఏంటా కొత్త కధ. కాదు, కాదు.. ఈ రోజు కధ” నిర్మల కళ్ళలోకి చూస్తూ అంది రమ్య.
“రోజు ఏం చెప్పమంటావు రమ్యా నా తిప్పలన్నీ” విరక్తి నిర్మల గొంతులో.
“అబ్బా. నీ తిప్పలేంటో తెలిస్తే కాస్తయినా తెప్ప దాటించగలనేమోనని” అంది రమ్య తేలికపరుస్తూ.
“అది కరెక్టే.. నువ్వే లేకపోతే నా పరిస్థితి ఎలా ఉండేదో”
“అంత లేదులే. కాస్త స్థిమిత పడు. అవసరమైతే ఫోన్ చెయ్యి. లేదంటే రేపు మాట్లాడుకుందాం” అంది రమ్య తన ఆటో ఎక్కేస్తూ.
“ఒకే, బై” అని రోడ్ క్రాస్ చేసి తన వైపు వెళ్లే షేర్ ఆటో కోసం చూడసాగింది.
***
నిర్మల చిన్నప్పటినుంచి చదువు లో చాలా చురుకు. తల్లి తండ్రులు, అన్నయ్య తో కలిసిన చిన్న కుటుంబం. నిర్మల టీచర్ పేరు జయలక్ష్మి. ఆవిడ సాయంత్రాలు ఇంటి దగ్గర ట్యూషన్స్ చెప్పేవారు. నిర్మల రోజూ సాయంత్రం అక్కడికి వెళ్తుండేది. నిజానికి తనకు ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. స్వంతంగానే చక చకా చదివేసేది. అక్కడే రమ్య కూడా ట్యూషన్ కి వచ్చేది. నిర్మల రోజూ వెళ్ళటానికి కారణం, హోమ్ వర్క్ ల కన్నా జయా టీచర్ వాళ్ళింట్లో వుండే బుక్స్. నిర్మల చురుకుదనం చూసి టీచర్ రోజూ బుక్స్ ఇచ్చి ప్రోత్సహించేవారు. స్వతహాగా మంచి తెలివి తేటలున్న నిర్మలకి మంచి ఇంగ్లీష్ పరిజ్ఞానం అలవడింది అక్కడే.
కాలం ఎల్లకాలం అలాగే నడవదుగా. నిర్మల సీనియర్ ఇంటర్, అన్నయ్య హైదరాబాద్ లో బి.టెక్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. ఒకరోజు నిర్మల తండ్రికి ఆక్సిడెంట్ ఐంది. అందరు గుమికూడారే గాని, ఆయన్ని కాపాడే ప్రయత్నం ఎవరూ చేయలేదు. ఒక ఆయన ముందుకి వచ్చి చొరవ తీసుకుని పోలీస్ కి ఇన్ఫార్మ్ చేయటంతో పాటు త్వరగా హాస్పిటల్ కి తీసుకువెళ్లేలా చేసారు.. కానీ లాభం లేక పోయింది.
నిర్మల తల్లి భోరున విలపిస్తుంటే, తాను దగ్గర ఉండి ధైర్యంగా ఓదార్చింది. వయసుకు మించిన పెద్ద పిల్లగా వ్యవహరించింది. అన్నయ్య వచ్చేలోపు అన్నీ తానై చేసింది.
కాస్త కలిగిన చిన్న కుటుంబం అయినప్పటికీ, సంపాదించే పెద్ద తలకాయ ఐన తండ్రి పోవటంతో పరిస్థితులు తారుమారు అయ్యాయి. ఎదుగుతున్న ఆడపిల్ల, చదువు ఇంకా పూర్తిగాని కొడుకు, తనకా చదువు లేదు, ఎలా ఈదాలి ఈ సంసారం అని నిర్మల తల్లి నైరాశ్యంలో కూరుకుపోయింది.
ఈ పరిస్థితుల్లో ఒక రోజు ఉదయం నిర్మల ఇంటికి ఒక పెద్దాయన వచ్చారు.
“ఎవరు కావాలండి” మర్యాదగా అడిగింది నిర్మల.
“అమ్మ లేరామ్మా” అడిగారు అయన.
“వున్నారండి, పిలుస్తాను” అంటూ లోపలికి వెళ్ళింది.
నిర్మల తల్లి బయటకి వచ్చి, “మీరు” అంటూ అర్ధోక్తి తో ఆగిపోయింది.
“నమస్కారమమ్మా. నా పేరు రమణయ్య. మీకు నేను తెలియకపోవచ్చు గాని నాకు మీరు తెలుసమ్మా” అన్నారు.
“కూర్చోండి” కుర్చీ చూపిస్తూ అంది నిర్మల తల్లి.
“మీవారిని ఆ రోజు హాస్పిటల్ కి తీసుకువెళ్ళింది నేనేనమ్మా”
ఇది వినగానే ఆమెకు దుఃఖం ముంచుకొచ్చింది.
“బాధపడకండమ్మా. ఆ దైవం ఎలా రాస్తే అలానే జరగుతుంది” స్వాంతనగా పలికారాయన.
కాస్సేపటికి నెమ్మదించింది. నిర్మల ఇంతలో మంచినీళ్లు తెచ్చి రమణయ్యగారికి ఇచ్చింది.
నిర్మలకేసి చూసి చిరునవ్వు నవ్వి “ఇంటిలో ఇటువంటపుడు శుభకార్యం జరిగితే మంచిది అంటారు” అన్నారు.
నిర్మల గ్లాస్ తీసుకుని వెళ్ళబోయేది ఆగి వెనక్కి తిరిగి చూసింది.
“ఆ రోజు హాస్పిటల్ లో చూశానమ్మా. ఎంతో పెద్దరికంగా అన్ని తానే నిలబడి నడిపించింది. చక్కని గుణవంతురాలు. మీరేమైనా ఇష్టపడితే నా కోడలిని చేసుకోవాలని అడగటానికి వచ్చానమ్మా” అన్నారు.
“మీరు పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు అని కర్ణాకర్ణిగా విని వచ్చాను. మాకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. ఆడపిల్లల పెళ్లిళ్లు చేశాను. అబ్బాయి డిగ్రీ పూర్తి చేసి నేను చేసే కంపెనీ లోనే వుద్యోగం చేస్తున్నాడు. నేను ఇంకా నాలుగు ఏళ్ళు వుద్యోగంలో వుంటాను”.
“మీరు ఆలోచించుకుని ఏ సంగతి చెప్పండి” అని తన ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్లారు.
నిర్మల తల్లి ఆలోచనలో పడింది. ఇరుగు పొరుగువారు, బంధువులు అందరు పెళ్లి చెయ్యమనే ప్రోత్సహించారు. కొడుకు చదువు అయ్యి, వుద్యోగం వచ్చి, డబ్బు చేతికి అంది, అప్పుడు చూడాలంటే పరిస్థితులు ఎలా వుంటాయో, పిల్ల పెళ్లి చెయ్యలేనేమో అని దడ పట్టుకుంది ఆవిడకు. చక్కటి సంబంధం చేతికి వస్తే చెయ్యటం మంచిది కాదా అనుకుంది. నిర్మల తల్లి మనసు అర్ధం చేసుకుని “నువ్వెలా చెప్తే అలాగే అమ్మా” అంది. తన చదువు మధ్యలోనే ఆగిపోతుందా అని చెప్పలేని వేదన కలిగింది మనసులో, కానీ పరిస్థితులకి తల ఒగ్గింది.
పెళ్లి జరిగింది. సంవత్సరం తరవాత బాబు పుట్టాడు. నిర్మలకున్న ఇంటరెస్ట్ చూసి మామగారు డిగ్రీ కి కట్టించారు. డిగ్రీ అయ్యే సరికి ఇద్దరు పిల్లలు. తర్వాత ఇంగ్లీష్ లో పి.జి. కూడా చేసింది. నిర్మల అన్నయ్య చదువు పూర్తయి వుద్యోగంలో కుదురుకోవటంతో తల్లి అతని దగ్గరే ఉంటోంది. పి.జి. రెండో సంవత్సరం పరీక్షలవుతుండగా హటాత్తుగా మామగారు పోయారు.
ఇంక తాను, భర్త పిల్లలు, అత్తగారు. పిల్లలు పెద్ద అవుతున్న కొద్దీ, భర్త ఒక్కరి సంపాదన సరిపోవట్లేదని అని అర్ధం కాసాగింది నిర్మలకి. మామగారు వున్నప్పుడు ఆ లోటు తెలియలేదు. ఇద్దరు ఆడపడుచులు, వాళ్ళ పురుళ్ళు, పుణ్యాలు, రాకపోకలతో కాస్త ఖర్చు బాగానే కనిపిస్తోంది. అత్తగారు నిదానస్తురాలు ఐనా కాస్త ఖర్చు మనిషి. భర్త వున్నప్పుడు బాగానే బతికింది కావటంతో పెట్టు పోతలు, మర్యాదలు బాగా చెయ్యాలనుకుంటుంది.
వున్నట్లుండి ఒకరోజు సాయంత్రం నిర్మల భర్త రవికాంత్ బాగా కోపంగా వచ్చాడు ఇంటికి. షూస్ మూలకి విసిరి, చేతి లోని బాగ్ హాల్లో గిరాటు కొట్టి సోఫాలో తల పట్టుకు కూర్చున్నాడు. ఇంత కోపం ఎప్పుడూ చూడని నిర్మల నెమ్మదిగా కాఫీ తెచ్చి ఇచ్చింది.
“ఏమయిందిరా?” కాస్సేపయ్యాక చిన్నగా అడిగింది అత్తగారు.
“ఏమైందా. వుద్యోగం పోయింది” విసురుగా చెప్పాడు.
“ఆ!..” నిర్ఘాంతపోయారు అత్తా కోడళ్ళిద్దరూ.
“ఎందుకని” కాస్త తేరుకుని అడిగింది అత్తగారు.
సమాధానం లేదు రవికాంత్ నుంచి, లేచి మళ్ళీ బయటకి వెళ్ళిపోయాడు.
తర్వాత తేలిన విషయం ఏంటంటే, రవికాంత్ చేసే డిపార్ట్మెంట్ కి కొత్త మేనేజర్ వచ్చాడు. వచ్చిన మొదలుకుని ఆయనకు, రవికాంత్ కు బేధాభిప్రాయాలు వస్తూనే వున్నాయి. ఇన్నేళ్లుగా చేస్తున్నాను నాకు తెలీదా అని రవికాంత్, పై పొజిషన్ లో వున్నాను నా మాట వినడా అని ఆ మేనేజర్ ఇద్దరికిద్దరు పంతం పట్టుకున్నారు. ఆ రోజు ఆ గొడవ పెద్దదై మానేజ్మెంట్ దాకా వెళ్ళింది. రవికాంత్ కి నోటీసు ఇచ్చారు మూణ్ణెల్లలో వుద్యోగం లోంచి వెళ్లిపొమ్మని.
కాస్త కోపం తగ్గాక వెళ్లి రిక్వెస్ట్ చేసి రాజీ పడమని అందరు సలహా ఇచ్చారు. కానీ లొంగలేదు రవికాంత్.
నోటీసు ఇచ్చాక ఈ మూణ్నెల్లు వెళ్ళేదేంటి అని తర్వాత రోజు నుంచే మానేసాడు. ఇది కాకపోతే ఇంక లేదా అని బింకం పోయాడు.
ఈ ఉద్యోగ ప్రయత్నాల మధ్య కొన్ని నెలలు ఖాళీగానే ఉండాల్సి వచ్చింది. వుద్యోగం టెర్మినేషన్ అవ్వటంతో పెద్దగా బెనిఫిట్స్ రాలేదు. వచ్చిన వాటితోనే ఇల్లు నడుపుతున్నారు. చిన్నగా ఇబ్బందులు తెలిసివస్తున్నాయి. పిల్లలకి ఏదో ఒకటి జలుబో, జ్వరమో రావటం, డాక్టర్స్ దగ్గరికి వెళ్లి మందులకు పోస్తే కానీ తగ్గేవి కావు.
స్వంత ఇల్లు కాబట్టి, అద్దె ఖర్చు లేదు, కానీ మిగిలినవి ఏవి తగ్గేవి కాదు కదా. స్కూల్ ఫీజులు, పాలు, కిరాణా, ఫోన్లు, కరెంటు బిల్లులు … నిర్మలకి గాభరా అవుతోంది. ఇదిగో చూస్తున్నా, అదిగో చూస్తున్నా అంటాడే గాని ఎందులోనూ కుదురుకున్నట్లు కనబడడు రవికాంత్. అడపా దడపా కాస్త డబ్బులు మాత్రం ఇస్తున్నాడు. అంతా ఆటోమేషన్ ఐన ఈ రోజుల్లో, మామూలు డిగ్రీ మీద వచ్చే ఉద్యోగాలేం కనపళ్ళేదు. చిన్నవి చెయ్యలేడు, చేయగలిగేవి లేవు. పైకి చెప్పుకోలేక సతమతమవుతున్నాడు రవికాంత్ కూడా.
ఇటువంటి పరిస్థితుల్లో ఒక రోజు మార్కెట్ లో రమ్య కనపడింది. తానే గుర్తు పట్టి వచ్చి పలకరించింది నిర్మలను. పెళ్లి తర్వాత ఎప్పుడు కలవలేదు రమ్య, నిర్మల. తాను కంప్యూటర్ సైన్స్ లో బి.టెక్. చేసిందిట. వాళ్ళ బావతో పెళ్లి కుదిరింది కానీ సంవత్సరం టైం ఉందిట పెళ్ళికి, వాళ్ళ తాతయ్య సంవత్సరీకం అయ్యాక చేస్తారు అని చెప్పింది. ఈ లోపు ఖాళీ ఎందుకు, టీచింగ్ కూడా ఇష్టం కదా అని ఒక కాలేజీ లో పార్ట్ టైం చేస్తున్నాను అని చెప్పింది. నిర్మల పి.జి. చేసిందని విని సంతోషపడింది రమ్య.
నిర్మల వుద్యోగం చేసేందుకు చూస్తోందని తెలిసి తన కాలేజీలోనే ఇంగ్లీష్ లెక్చరర్ గా ఇప్పించింది. అప్పట్నుంచి కాస్త డబ్బులు వస్తున్నా, సరిపోక ఇబ్బంది పడాల్సి వచ్చింది నిర్మలకు. చాలాసార్లు తప్పనిసరి పరిస్థితుల్లో రమ్య దగ్గర డబ్బు తీసుకోవాల్సి వచ్చింది. స్కూల్ ఫీజులు కట్టాలి, ఇంటి ఖర్చులు.. తల పగిలిపోతోంది నిర్మలకు.
***
ఆ సాయంత్రం ఇంటికి వచ్చిన నిర్మలకు, ఇల్లంతా చిందర వందరగా, ఎక్కడివక్కడ దొర్లుతూ కనపడ్డాయి. పిల్లలిద్దరూ గోలగోలగా ఆడుతున్నారు, కొట్టుకుంటున్నారు.
లోపలికొస్తూ పిల్లల్ని అడిగింది “నాన్నమ్మ ఏదిరా?”
“నాన్నమ్మ బాగోలేదని పడుకుని వుంది” ఎగురుతూనే సమాధానం చెప్పింది కూతురు.
“ఏంటి అత్తయ్యా, బాగోలేదా, పడుకున్నారు?” ఆత్రం గా దగ్గరికి వెళ్లి అడిగింది నిర్మల.
“ఏం లేదులే, కాస్త బాగోలేదు” విసురుగానే చెప్పి అటు తిరిగి పడుకుంది అత్తగారు.
ఇది పొద్దున్న ఎఫక్టేనని అర్ధం అయిపోయింది నిర్మల కు.
ఉదయం చిన్న ఆడపడుచు ఫోన్ చేసి వచ్చే ఆదివారం గృహప్రవేశం ముహూర్తం కుదిరింది అని చెప్పింది.
“మధూ, చిన్నక్క వాళ్ళ గృహప్రవేశం అట వచ్చే ఆదివారం” కొడుకుతో చెప్పింది కాఫీ తాగుతూ.
“వూ” పెద్దగా ఏం మాట్లాడలేదు కొడుకు.
సంభాషణ వింటూ పిల్లలని రెడీ చేస్తూ బాక్స్ లు సర్దుతోంది నిర్మల.
“చిన్నక్కకి పెళ్ళిలో వెండి కంచం ఇస్తామని చెప్పాము. నాన్నగారికి అప్పుడు కుదరక తర్వాత ఇస్తామన్నారు. తర్వాత మనం పట్టించుకోలేదు. ఎలాగైనా రేపు గృహప్రవేశానికి కంచంలో బట్టలు పెట్టి ఇవ్వాల్రా”.
ఒక్క చూపు చూసాడు రవికాంత్.
చిర్రుమంది నిర్మల అత్తగారికి. “నువ్వేమైనా చెయ్. ఇది మాత్రం ఈసారికి తప్పటానికి వీల్లేదు” ఖరాఖండీ గా చెప్పింది.
ఆమె క్కూడా ఈ ఆర్ధిక బాధల మధ్య నిస్సహాయతతో విసుగు, చిరాకు ఎక్కువయ్యాయి.
ఏమి చెప్పకుండా విసురుగా లేచి చెప్పులేసుకుని బయటకు వెళ్ళిపోయాడు రవికాంత్.
నిర్మల గుండెల్లో రాయి పడ్డది. కంచం, కొత్త బట్టలు వగైరా ఖర్చులు కలిపితే 40 వేలకు తక్కువ కావు. చాల పొదుపుగా నెట్టుకువస్తున్నారు తాము. పుట్టింటికి కానీ, ఆడపడుచులకు కానీ తమ విషయాలేమి తెలియనివ్వలేదు. ఇంత గండం ఎలా దాటాలి అని ఒకటే ఆలోచన అయిపోయింది నిర్మలకి. బంగారం కూడా చాల ఖర్చయిపోయింది. తాడు, నల్లపూసలు, ఒక నెక్లెస్ మాత్రమే మిగిలాయి. ఇక నెక్లెస్ తాకట్టు పెట్టాలి. ఈ ఆలోచనతోనే సతమతమై పోతూ ఈ రోజు కాలేజీకి వెళ్లి వచ్చింది. రమ్యకి కూడా ఏమి చెప్పలేకపోయింది.
***
మర్నాడు పొద్దున్న కాలేజీ పర్మిషన్ తీసుకుని బ్యాంకుకి వెళ్లి నెక్లెస్ మీద లోన్ తీసుకుంది నిర్మల. మధ్యాహ్నం లంచ్ టైం లో రమ్యకి జరిగింది అంతా చెప్పింది.
రమ్య నిర్మల చేతిని పట్టుకుని “నేనొకటి చెప్తాను వింటావా?” అనడిగింది.
“ఏంటది, చెప్పు” తలెత్తి చూసింది నిర్మల.
“మా బావకు హైదరాబాద్ లో ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ వుంది. దాన్ని ఇంకా పెద్దదిగా చేస్తున్నారు. TOEFL , IELTS లాంటి ఎగ్జామ్స్ కి వీళ్ళే ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. వాటికి మంచి సబ్జెక్టు ఎక్స్పర్ట్ కోసం చూస్తున్నారు. నీ గురించి నిన్న చెప్పాను. నీకిష్టమైతే అక్కడ ఫాకల్టీ గా చేరచ్చు. మంచి డబ్బు వస్తుంది” కాస్త ఆపింది చెప్పటం.
“ఎన్నాళ్లని ఈ పార్ట్ టైం చేస్తావు. రెగ్యులర్ వాళ్ళు వస్తే ఇదీ ఉండదు. ఈ వూళ్ళో వేరే కాలేజీలకు వెళ్లినా ఎంత ఇస్తారు? ఎలా లాక్కు రాగలవు ఈ పడవ చెప్పు” అంది.
“నిజమే. నువ్వు చెప్పింది బాగానే వుంది. కానీ హైదరాబాద్ అంటే కష్టమే. ఇక్కడ అంటే స్వంత ఇల్లు కాబట్టి, కాస్త ఇబ్బందైనా నడుస్తోంది. అక్కడ అద్దెలంటే ఆమ్మో” భయపడింది నిర్మల.
“ఇప్పుడే మారద్దు. పిల్లల్ని మీ అత్తగారిని చూసుకోమను. రెండు మూడు నెలలు చూస్తే నీకు ధైర్యం వస్తుంది. అప్పుడే తీసుకు వెళ్ళచ్చు. మీ వారిక్కూడా అక్కడ అవకాశాలు ఎక్కువ కాబట్టి నీకు ఇంకా దిగులుండదు. ఏమంటావ్?” మరీ మరీ చెప్తోంది రమ్య.
“అదొక్కటే కాదు. చదువుకున్న మనలాంటి వాళ్ళం కూడా పట్నాలకేసి వెళ్తే ఇంకేముంటుంది ఇక్కడ అభివృద్ధి?” సందేహం వెలిబుచ్చింది నిర్మల.
“అలా అనుకుంటే, ఒక పని చెయ్యి. ఒకటి లేదా రెండు సంవత్సరాలు చెయ్యి, అన్నీ ఆకళింపు చేసుకుని నువ్వే ఇక్కడ ఒక కన్సల్టెన్సీ పెట్టు. మన చుట్టుపక్కల వూళ్ళకి అందుబాటులో ఉన్నట్లు కూడా ఉంటుంది” కాదనలేని ఐడియా ఇచ్చింది రమ్య.
ఆలోచనలో పడింది నిర్మల.
***
నిర్మల అనుకున్నట్లుగానే భర్త నుంచి, అత్తగారి నుంచి వ్యతిరేకత వచ్చింది. ఆ సాయంత్రం ఇంట్లో పని చేసుకుంటూ పిల్లల హోమ్ వర్క్ చేయిస్తోంది నిర్మల. మధ్యలో రమ్య నుండి ఒక వాట్సాప్ వీడియో. ఒక విమెన్ డెవలప్మెంట్ NGO వాళ్ళు తయారు చేయించిన వీడియో అది. ఒక ఐదుగురు ఆడవాళ్లు తమకు ఎదురైన అతి క్లిష్టమైన సమస్యల్ని ఎలా ఎదుర్కొన్నారో స్వయంగా నటించి షార్ట్ ఫిలిం చేసారు. ఎవరో ఏదో చెయ్యరు, మన సమస్యలకు మనమే సొల్యూషన్ వెతుక్కోవాలనే నిజం తెలియచెప్పే వీడియో అది. చాలా మోటివేషనల్ గా వుంది. అది చూసి ఆలోచిస్తూ వుంది నిర్మల.
ఇంతలో బాబు”అమ్మా, present continuous tense” చెప్పవూ నోట్స్ పట్టుకొచ్చాడు.
“అంటే ఒక మొదలైన యాక్షన్ ఇంకా ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటే దాన్ని present continuous tense అంటాం నాన్నా.” ఉదాహరణలతో వివరించింది నిర్మల.
ఒక్కసారిగా అదేదో తనకు తగిలినట్లయి ఉలిక్కిపడింది నిర్మల. ఈ ఇబ్బందులు, కష్టాలు ఇలా present continuous tense గా మిగిలిపోవాల్సిందేనా? మెదడు అల్లకల్లోలం అయిపోయింది.
లాభం లేదు. . తెగించాల్సిందే. . పిల్లల ఫ్యూచర్ కోసం, నేను వీటిని past tense లోకి నెట్టాయాల్సిందే… తనవాళ్లకు సర్ది చెప్పుకోగలదు. స్థిర నిర్ణయం తీసుకున్నాక నవ్వుతూ పిల్లల్ని దగ్గరకి తీసుకుంది నిర్మల.
*****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *