June 19, 2024

దివి నుండి భువికి

రచన: చెంగల్వల కామేశ్వరి

“రేపేనా నువ్వు వెళ్లేది? అడిగాడు శర్మ “అవునండీ! కొంచెం హుషారుగా బదులిచ్చాడు ఈశ్వర్, వచ్చాకా విశేషాలు చెప్పు! అంటున్న మామగారి మాటలకు ‘ఉండేది ఒకరోజు! ఏముంటాయి. ?’ మళ్లీ ఇక్కడికే రావాలి. ఇలాగే ఉండాలి. వాళ్లక్కడ మనమిక్కడ” ఉదాసీనంగా అంటున్న ఈశ్వర్ మొహం చూసి, ఒకసారి దీర్ఘంగా నిట్టార్చారు శర్మగారు .
“నిజమే! కాని ఏం చేయగలం? మనకి మాత్రం ఇష్టమా! మనవాళ్లందరిని వదిలి ఇలా ఉండటం . “వలస పక్షుల్లా చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్లు ఒకరి తర్వాత ఒకరు కట్టగట్టుకుని వచ్చాము. ‘మనం దూరమై అలమటిస్తున్న మనవారి బాధ తెలిసినా వెళ్లలేము ఉండలేము. ‘ఏదో ఏడాదికి సారి అలా వెళ్లడం ఇలా రావడం. అంటున్న శర్మ గారి మాటలకు అవునన్నట్లుగా తలూపాడు ఈశ్వర్.
“పెదనాన్నా నన్ను కూడా తీసుకెళ్లవా పెద్దమ్మని చూసి చాలా రోజులయింది. అర్చుకుంటూ వచ్చాడు. అనిల్. ‘మొన్నే కదా వెళ్లొచ్చావు. ఇలా అందరూ అడిగితే ఎవరినీ వెళ్లనివ్వరు. వెళ్లు మీ బామ్మతో కబుర్లు చెప్పుకో!అని అనిల్ తాతగారు విశ్వేశ్వర్రావు గారు కేకలేసారు.
‘ఆ బామ్మ వాళ్లంతా బిజీ తాతగారూ! కమలమ్మమ్మ కొత్తగా వచ్చింది కదా! ఆడవాళ్లందరూ , రిలాక్సింగ్ గా కూర్చుని కబుర్లు చెప్పేసుకుంటున్నారు. పిల్లలందరిని వదిలేసి వచ్చానని కమలమ్మమ్మ బాధపడుతోంటే మందలిస్తున్నారు. ‘మనం వచ్చేస్తేనే కదా ! వాళ్లకి బాద్యతలు తెలిసేది. అక్కడ మన పని అయిపోయింది. అయినా ఎన్నాళ్లుంటాము ఈ ఏడంతా నెల నెలా వెడతావు వస్తావు. మేమయితే ఏడాదొకోసారే వెడతాము. అని చెప్తున్నారు. అక్కడి విశేషాలు తాము చూసే టీవీ సీరియల్స్ గురించి వంటలు వార్పులు పూజలు నోములు గురించి తెగ మాట్లాడేసుకుంటున్నారు తాతగారూ!1అన్నాడు అనిల్.
‘అవునా పాపం! ఇప్పుడే కదా వచ్చింది ఇక్కడ అలవాటయితే అక్కడ కన్నా ఇక్కడే హాయిగా ఉంటుందని తెలుస్తుందిలే !అన్నారాయన.
‘ అవును తాతగారు మొదట నేను ఇక్కడకొచ్చి అలాగే బెంగపడ్డాను. కాని శివరామ్ మామయ్యే ధైర్యం చెప్పాడు. రోజూ నన్ను అక్కడా ఇక్కడా తిప్పి అన్నీ చూపించాడు. ‘ఆ తర్వాత మీ అందరూ వచ్చేసారు. ఇక్కడ ఇంకా చాలా మందే ఉన్నారు మనవాళ్లు ఎప్పుడొచ్చారో! ఎంతమందున్నారో! మన చుట్టాలు. బాబూరావు తాతగారు, నందా బావగారు, మా అమ్మ వాళ్ల పెద్దమ్మక్కయ్య, పెదనాన్నగారు, అమ్మమ్మ గారు తాతగారు బామ్మ తాతయ్యలు అత్తయ, మామయ్యలు అత్తయ్యలు, శివరామ్ మామయ్య సత్యం మామయ్య చిన్న బాబూరావు ఇంకా ఎవరెవరో ఉన్నారు వీళ్లంతా!
అన్నట్లు సినిమా యాక్టర్లు కూడా చాలా మందే వున్నారు . నేను అందరినీ కలిసాను కూడా వాళ్ళంతా ఎప్పుడొచ్చారో! అయిన మనమంతాఇక్కడ ఎందుకు? హాయిగా ఇండియాలోనే ఉండొచ్చుగా ! అన్నిఊర్ల నుండి, ఇక్కడికే వస్తున్నారు ” అని అంటున్న అనిల్ మాటకి ‘వాళ్ల ల్లో కొందరు నాలాగా బెర్తు కన్ఫర్మ్ అయొచ్చారు, ‘మరికొందరు నీలాగా తత్కాల్ టికెట్ లో ఊడిపడ్డారు. ‘ ఇంకా ఆర్ ఏ సి, వెయిటింగ్ లిస్ట్ వాళ్లెందరున్నారో! ఎవరైనా ఇక్కడికి రావాల్సిందే! ఆఖరి గమ్యం ఇదే !నిట్టూర్చారు కృష్ణమూర్తి గారు. పేపర్ లో న్యూస్ చూస్తూ. ఆ మాటకి పకపకా నవ్వారందరూ
“భలేవారే మొతానికి రైల్వే వారనిపించుకున్నారు రైల్వే భాష బాగా ఒంటపట్టింది. అని శర్మ గారు అనగానే మళ్లీ నవ్వేసారు. ‘అవునూ’ఇక్కడ కూడా చుట్టలు సంపాదించేరే మీరు! ఎవరిచ్చారేమిటి? ఆశ్చర్యంగా అడుగుతున్న శర్మ గారిని చూసి “పాపం ఆ సూరిభాబు ఆ తాడేపల్లి గూడెం నుండి లంక చుట్టలు తెచ్చి ఇచ్చేవాడు!. అవంటే నాకు ఇష్టం అని, వాటి సువాసనే వేరు. నిన్నే ఆ తాడేపల్లిగూడెం షావుకారెవడో వచ్చాడు కదా! ఆయనే కొన్ని ఇచ్చాడు. లెండి! అన్నారు విశ్వేశ్వర్రావు గారు.
మామయ్యగారూ!రేపు వెడుతున్నాగా! అన్నాడు ఈశ్వర్ . పర్వాలేదు ఈశ్వర్ జాగ్రత్త !జాగ్రత్త నాయనా! మా అమ్మాయి పిల్లలు ని దైర్యంగా ఉండమని చెప్పి అ అందరి ఆశీశ్సులు ఇచ్చి రా!ఏదున్నా మనతో చెప్పుకోమను. దగ్గర లేకున్నా మనకి అన్ని తెలుసని చెప్పు ” అన్నారు శర్మ గారు.
“మనం ఏదో ఇంకా ఏదో ఉందని భ్రమతో వెళ్లడమే కాని మనదంటూ ఏదీ లేదు. ఆ రూపాలు లేవు మన జ్ఞాపకాలు మరుగునపడి ‘మన ఆనవాళ్లు లేని ఇళ్లల్లో’ అక్కడ ఉండలేక, వాళ్లను ఒదలలేక, తిరిగివస్తాము. ఇక్కడ ఇలా యధాతధంగాఉండటమే! అంతా మాయ ! అన్న శర్మ గారి మాటలకు అవునంటూ, తలూపి అక్కడినుండి మెల్లగా బయల్దేరాడు. తనవాళ్లందరిని చూడొచ్చని ఈశ్వర్ సంతోషంగా ఉన్నాడు. ఎన్ని సార్లు వెళ్లినా ఎప్పటికప్పుడు కొత్తే!
‘తెల్లారింది ఊళ్లో అడుగెట్టిన దగ్గరనుండి ఈశ్వర్ మనసు శరీరం గాల్లో తేలిపోతునట్లు అనిపిస్తోంది, కొత్తగా రెక్కలు వోచ్చినట్లుగా ఉంది. ‘ తనవారందరినీ చూసుకోవచ్చని ఆనందంగాఅనిపిస్తోంది. ఏడెనిమిదేళ్లవుతోంది తను ఈ ప్రాంతాలు ఒదిలేసి, ఎప్పుడో ఏడాది కోసారి వచ్చినా, ఉండడానికి అవదు . వెళ్లిపోతుంటే దుఃఖమాగదు. కాని తన సంతోషం కోసమే తమ ఇంటిల్లపాదీ తానుండే ఆ ఒక్కరోజు కోసం కళ్లల్లో వత్తులు వేసుకునిఎదురు చూస్తారు. తనకిష్టమయినవన్మీ చేసి పెడతారు. తనకే కాకుండా, తన తండ్రిని, తాతగారిని కూడా తలుచుకుని అగ్గగ్లాడుతారు. అందుకే కదా ఇలా రెక్కలు కట్టుకుని వాలేది.
ఇదిగో హమ్మయ్య! తమ ఇల్లు వచ్చేసింది. బయటనుండే తను కట్టుకున్న ఇల్లుని చూసుకుని కళ్లు సజలమయ్యాయి. అది కట్టుకోవడానికి ఎంత బాధపడ్డాడు . తన అడుగుజాడల్లోనే తన ఇల్లాలుగా తాను కూడా కష్టపడింది. ఇంటిని నందనవనంగా మార్చింది. ‘ తామిద్దరు నీరు పోసి పెంచిన మామిడి చెట్టునిండా కాయలు . కొబ్బరిచెట్టు, దాని పక్కనే దానిమ్మ చెట్టు, మందార చెట్టు, తనని గుర్తు పట్టినట్లు కొమ్మ లను ఊపుతూ నవ్వుతున్నాయి. తన కిష్టమని నర్సరీ నుండి తెచ్చి వేసిన గోరింట ఆకుపచ్చగా విరబూసింది. ‘ఆకుని కోసి ఇస్తే రుబ్బుకుని, తన చేతే డిజైన్లు పెట్టించుకుని, మహారాణీ సేవలు చేయించుకునేది. తను ఊరుకునేవాడా! అదే అదను అని, కితకితలు పెట్టి, సతాయించేవాడు. కాళ్లకు, చేతులకు, గోరింటాకు పెట్టినట్లే పెట్టి, తనాడే సరాగాలకు, తనని వారించడానికి ప్రయత్నిస్తూ, సిగ్గుపడుతూ, కోప్పడుతూ, ఎంత మనోహరంగా ఉండేది. ఒకోసారి, ఇద్దరి ఒంటి మీద పండిన గోరింటాకు రంగు ఎవరికీ ఉండేందుకు కనపడకుండా, తెగ అవస్త పడాల్సి వచ్చేది.
తాను ఈ రోజు వస్తాడని ఎందరికి చెప్పిందో తను తన స్నేహితులు, ఆఫ్తులు చుట్టాలు అందరూ ఉన్నారు. ఇంట్లోకి వెళ్లి అటూఇటూ పచార్లు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవటంలేదు. ఎవరి హడావిడి వారిది. ” పాపం కరుణేమిటి ?అలా అయిపోయింది. తన కోసం ఏడ్చిందేమో! అందుకే మొహం వాడిపోయింది పిచ్చిపిల్లకి!. కొన్నాళ్లకి తనూ వచ్చేస్తుందిగా! బెంగెందుకూ! తనతో పాటే తీసుకెళ్లలేదని తనతో పోట్లాడుతో ఏడుస్తుంటుంది. ఇద్దరూ ఒకసారే వెళ్లిపోతే పిల్లలేమవుతారు! కొంచెం ముందు వెనకా అంతేగా! ఎంత చెప్పినా అర్ధం చేసుకోదు.
అయినా అందమయిన మొహంలో ఆ బొట్టు చూసేవాళ్లను ఇట్టే ఆకర్షిస్తుంది. ఆ కళ్లకు ఆ కాటుక ఉంటే చాలు !వేరేనగలు అక్కర్లేదు. అంత కళకళలాడుతుంది. తనంటే ఇష్టం కాబట్టే, తనకిష్టమయినట్లే ఉంటుంది. అది గిట్టని కుళ్లుమోతోళ్లు , ఎన్ననుకున్నా, తనకిచ్చిన మాట కోసం పట్టించుకోదు. పిల్లలు కూడా అమ్మ అలా ఉంటేనే సంతోషంగా ఉండగలరు. ఈ విషయం ఎందరికి అర్ధమవుతుంది?
మనసులో బాధలను, బెంగలను, మొహం మీద చూపించకూడదని, తద్వారా సానుభూతి కోరుకోకూడదని, తనెన్ని సార్లో అనేవాడు. తను కూడా ఏకీభవించేది. కాని ఈ ప్రపంచం లో ఎలా ఉన్నా తప్పే! అన్ని బాధలు లోలోనే దిగమింగి నవ్వుతూ తుళ్లుతూ ఉంటే అది చూడు దానికేమయినా దిగులుందా ? బెంగ ఉందా? బాధ ఉందా? అంటారు . అలాగని నిస్తేజంగా, నిర్వికారంగా ఉంటే, ” దాని ఏడుపు మొహం చూస్తే పాపం! అంటారు.
తను మామూలుగానే , తానిచ్చిన ధైర్యాన్ని కూడగట్టుకుని ఉంటోంది. కాని, భర్త దగర లేడని, రకరకాలుగా ఈ ఆడంగులు చేసే అవమానాలు అన్ని ఇన్ని కావు. తనకి అన్ని తెలిసి ఏమీ చేయలేక చూసి బాధ పడుతూ వుంటాడు. తనేమయిన కావాలని వెళ్ళాడా? తనేమయినా కావాలని పంపిందా? లోలోన ఎంత కుంగుబాటుకి లోనవుతోందో! . ఇదివరకటి గలగలలు మిలమిలలు లేవు అది తనకలవాటే!
తన వియోగం అస్సలు భరించలేడతను. అది తెలుసు తనకి!’ తను క్యాంప్ కెడితే చాలు! చాలా నిరాశక్తంగా ఉండేది. తిండి కూడా సరిగ్గా తినేదే కాదు. ‘అలాంటిది’ ఇంత దూరంలో తానుంటే ఇలా కాక మరెలా ఉంటుంది? తనున్నప్పుడు ఒక చిన్న పిల్లలాగా చూసుకునేవాడు. ‘ తనెలా అంటే అలాగే సాగనిచ్చేవాడు. అదేంటో అదిఎంత తిట్టినా, అంత బాగుండేది. కోపమొస్తే తినేదే కాదు. తమలో ఎవరి తప్పున్నా తనే , ‘సారీ’ చెప్పాలి. తనే కలిపి తినిపించాలి.
ఒఠ్టి తిక్కమేళం! ఏంచేస్తాడు తప్పదు కదా! గారం నయగారాలు ఎక్కువే మరి !అన్నీ తనే నేర్పుకున్నాడు. ‘ఇప్పుడో’ ‘తను సానపట్టిన వజ్రం !’అది తనవలనే అని తనేఅందరికి గర్వంగా చెప్తుంది. ‘కాని’ తనమాట మాత్రం సాగనివ్వదు. “జగజ్జాణ” ముద్దుగా తిట్టుకున్నాడు. ఈశ్వర్. ఇపుడూ ఇంకా ఘోరం?సమయానికి తినదు నవ్వదు, తయారవదు. “ఏమన్నా అంటే నా బెంగ మీకేం తెలుసు అని కన్నీరు పెడుతుంది. “ఇలా అయితే ఎలా!
అరే! ఆ మధుగాడు ఎందుకు విషాదంగా పెట్టాడు ఫేసు?” తనిక్కడ ఉన్నన్నాళ్లు తనెవరో పట్టనట్లు ఫోజ్ కొట్టేవాడు. ఇప్పుడు తన మంచితనం గురించి లెక్చర్స్ దంచేస్తున్నాడు. అంతే” చచ్చినవాళ్ల కళ్లు చారెడేసి” అని ఎదురుగా ఉన్నప్పుడు మనుష్యులు అక్కరలేదు ఇలాంటి వాళ్లకి, వాళ్లు దూరమయ్యాక మొయ్యో కుర్రో అంటారు.
ఇంట్లోంచి కమ్మని సువాసనలు వస్తున్నాయి. తన కి స్వాగతం పలకడానికి కాబోలు పురోహితుల మంత్రాలు వినవస్తున్నాయి. “దేనికయినా ఏర్పాట్లు చేయడంలో కరుణని మించినవారులేరు. అదేమిటి? కొడుకులు తనతో ఏదో వాదిస్తున్నారు. కోడళ్లు కూడా వంత పాడుతునారు. ‘ఆమె ఎంత చెప్పినా వినకుండా ఏదో అనేసి, విసురుగా వెళ్లిన పెద్ద కొడుకుని, అతని వెనకాలే వెళ్లిన మిగతావారి వంకే చూస్తూ, నిలబడి పొంగి ఒస్తున్న దుఃఖ్ఖాన్ని ఆపుకుంటు, కొంగులో మొహం దాచుకున్న కరుణని చూస్తే గుండెని పిండినట్లయింది. తను వెళ్లి , ఓదారుద్దామనుకుంటే . పక్కింటి పిన్నిగారు తన దగ్గరకు వెళ్లి ఓదార్పుగా తల నిమురుతూ, “వాళ్లకేమి తెలీదు కరుణా!. నువ్వు చెప్పింది అర్ధం కాదు బాధపడకమ్మా! నీ రక్తమే నిన్నంటోంది. అయినా”భర్త రాజ్యం మన రాజ్యం! పిల్లల రాజ్యం పరరాజ్యం! మనమే సర్దుకు పోవాలి. అని చెప్తోంది.
హా ! తన పిల్లలకింత కింత ధైర్యం ఎలా వచ్చింది?ఈ మధ్య చూస్తున్నాడు. అందరు కలిసి కాల్చుకు తింటున్నారు. . తను లేకపోతే మాత్రం తనకు తెలియదనుకుంటున్నారా! ! తను లేడనా! ఇలా దాన్ని ఏడిపిస్తే ఒక్క క్షణం ఉంచను ఇక్కడ. తను దగ్గర లేకున్నా వెయ్యికళ్ల తల్లిలా” కాపాడుకోస్తోంది. ఆ మాత్రం కుడా దయ లేదా! వాళ్ళని ‘తల్లి లేని పిల్లలను చేయాలంటే నిముషం పట్టదు” కోపం ఎగతన్నింది ఈశ్వర్ కి
ఇంతంత పిల్లలని అంతంత చేసి మొగుడు దూరమయితే ఇలా దాష్టీకమా! పున్నామ నరకాలు దాటించే కొడుకయినా, ప్రేమగా చూసే కూతురయినా, తల్లితండ్రుల ని గౌరవించాల్సిందే! కంటిరెప్పలా కాపాడవలసిందే! తండ్రి, సోదరులు, భర్తల, తర్వాత తమ తల్లిని కడదాకా ప్రేమగా లేనివారిని మరిపించేలా చూసుకోవాల్సిన బాద్యత పిల్లలదే!అలాంటిది దాన్ని బాధపెడుతూ నన్ను పిలవడం ఎందుకూ నేను ఇంట్లోకే పోను. ఏమి పెట్టినా తినను”అని భీష్మించుకుని బయట చెట్టుకిందే వేసిన పడకుర్చీలో నడుం వాల్చాడు ఈశ్వర్
లోపలనుండి మంత్రాలు అగ్నిహోత్రంతో హోమం ముగించుకుని బైటకు వచ్చిన పెద్దకొడుకు కుర్చీలో ఉన్న తనని చూసి’ అదిగో నాన్నగారు వచ్చేసారు’. ఆనందంగా అంటున్న వాడిని చూసి కోపంగా తలతిప్పుకున్నాడు. వాడితోపాటు మిగతాపిల్లలు కూడా “అవునురా! డాడీకి మనమంటే ప్రేమ ఎదురు చూడనివ్వరు ‘అంటుంటే “ఏడిసారు !ఎవరైనా మీ అమ్మ తరవాతేరా! ఎవరైనా! మీ పొగడ్తలకు నేనేమి పొంగిపోను’. అన్నాడు ఈశ్వర్. ఈ లోగా లోపలున్న వారంతా బయటకు వొచ్చారు అయిదు నిముషాలు, పది నిముషాలు పావు గంటయింది, అయిన వాళ్ళ వైపే చూడకుండా కూర్చున్నాడు .
‘రా నాన్నా! నీకెలా ఇష్టముంటే అలాగే చేస్తాము”. అని, పిల్లలు, అందరూ పిలుస్తున్నా కుర్చీలోనుండి ఇసుమంతయినా కదల్లేదు. ఈశ్వర్. వాళ్ళంతా గోల గోల గా మాట్లాడుతూ వున్నా కోపంగా కళ్ళు మూసుకుని అలాగే ఉన్నాడు. అతని హృదయం భగ్గుమంటోంది .
ఎప్పుడొచ్చారో తాతయ్య, నాన్న వాళ్లు వాళ్ల మాటలు విని”ఏంటిరా నీ అలకతో మమ్మల్ని కూడా పస్తు పెడతావా “పదరా పాపం ఇప్పటికే పొద్దుపోయింది. పిల్లల మీద పంతం ఏంటి? వాళ్లకి తను తన కి వాళ్లు తప్ప ఎవరున్నారు?. తల్లీ పిల్లలన్నాక ఇలాంటివేవో ఉంటాయి. ” అని అనునయిస్తున్నారు. ఈ లోగా ఎవరూ చెప్పారో !
కరుణ వచ్చింది. తనని చూసి ఆమె కనులు వర్షిస్తున్నాయి , పిల్లల వెనకాల నిల్చున్న తను చేతులు జోడించి” మా తప్పేమయినా ఉంటే క్షమించండి. ! “పిల్లలు మన పిల్లలు వాళ్లు! తెలియక తప్పు చేస్తే , వాళ్ల తప్పులను మన్నించి రండి” అని కళ్ల నీళ్లతో వేడుకుంటుంటే, మరి ఉండలేక, కుర్చీలోనుండి దిగి, మెల్లగా అడుగులో అడుగేసుకుంటూ, వచ్చి, వాళ్లు పెట్టిన ముద్ద అందుకుని, ఆబగా తిన్నాడు. తనతోపాటే తాతయ్య, నాన్న కూడా వచ్చి తిన్నారు. అదేంటో వాళ్లు పెట్టిన పిడికెడు ముద్ద తినగానే , ఏదో ఆర్తి తీరినట్లు ఎద నిండిన శాంతి. తన కోపమంతా ఎక్కడికి పాయిందో, ఎవరి మీద కోపం లేదు. ఎక్కడికో వెళ్ళాలన్న తపన మొదలయింది.
“మీ అమ్మని ప్రేమగా చూసుకోండిరా! మీ నాన్నకే కోపం ఉండదు”. అనంటున్న పిన్నిగారి మాటకు “అమ్మను బాగా చూసుకుంటాము నాన్నగారూ ! అని పిల్లలందరూ ముక్త కంఠంతో అనగానే, తేలికయిన మనసుతో, ఎవరి భావాలతో సంబంధంలేని నిర్వికార భావన నిండిన దైవత్వం ఆవరిస్తుండగా “సరే వెళ్లొస్తా! జాగ్రత్తగా ఉండండి అని చెప్పి తన మొహాన్ని తనివి తీరాచూసి, తిరుగు ప్రయాణం కట్టాడు ఈశ్వర్. అతని వెన్నంటే తండ్రి తాతయ్య కూడా వెంబడించారు. తమ వారసులని చూసిన సంతృప్తితో ఆత్మ శాంతితో తమ అమరలోకానికి తిరిగి వెళ్లిపోతున్న ఆ ముగ్గురు కల్సి రెక్కలోచ్చినంత వేగంగా కదిలారు .

“మూడుతరాలు వచ్చి సంతుష్టిగా తిని మిమ్మల్ని దీవించి వెళ్లారయ్య !వంశాకురాలను కోరుకునేది ఇందుకే !పితృదేవతలను సంతుష్ట పరిస్తే , వాళ్ళు పై నుండే తమ వాళ్ళను కాపాడుతారు. వాళ్లకి నచ్చని పనేదో చేసినట్లున్నారు, అందుకే, మెతుకు ముట్టకుండా భీష్మించుకున్నారు . మీ అందరు బ్రతిమాలేక కాని రాలేదు అని పురోహితుడు చెప్పిన మాటలు నమ్మకంతో వింటూ, తల్లి భుజం చుట్టు చేతులు వేసి లోపలకి తీసుకెళ్ళారు పిల్లలు నిజంగా కాకి రూపములో ఆయనొచ్చారా? అంత అందమయిన మనిషిని ఇలా కాకి రూపంలో చూసుకోవాలా ? మిగతా కాకులు రెండు మామగారు అయన తండ్రేనా !అంతటి మనుష్యులని ఇలా కాకుల రూపములో చూసుకోవాలా ?నిజమే అయితే ఆ పితృ దేవతలు అలా తమతోనే వుంది పోవొచ్చు కదా ! కంటికి రెప్పలా చూసుకుందును కదా ! అని ఆలోచిస్తూ గాల్లో ఎగిరిపోతూ కనుమరుగవుతున్న కాకుల్నిచూసి వెక్కి వెక్కి ఏడిచింది ఆ పిచ్చితల్లి.
END. .

1 thought on “దివి నుండి భువికి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *