June 25, 2024

రింగుల జీవన వలయం

రచన: – పిడపర్తి భారతి

కాళ్ళు టపాటపా నేల కేసి కొడ్తూ, రెండు చేతులూ బాగా ఆడిస్తూ, ఇంట్లో కొచ్చి, సోఫాలో నాన్న పక్కన బుంగ మూతి పెట్టుకుని కూర్చుంది, కల్యాణి. కల్యాణి కూర్చున్న జోరుకి, గోపాల్రావు గారు చదువుతున్న పేపర్ని కొంచెం పక్కకి జరిపి, కూతురి వైపు చూసి, “ ఏం. తల్లీ.? “ అని, యధాలాపం గా అన్నట్టుగా అంటూ, మళ్ళీ పేపర్ లో దూరిపోయారు. ఒక్క రెండు నిమిషాలు ఆగి, ఇంక లాభం లేదనుకుని, “ నాన్నా. “ అంటూ గట్టిగా అంది, కల్యాణి.
“ ఏమయింది. తల్లీ .? “ అంటూ గోపాల్రావు గారు పేపర్ మడిచి పక్కన పెట్టి, కూతురి వైపు తిరిగారు.
“ నాకు ఈ రింగులు వద్దునాన్నా. “ తన చెవులకున్న బంగారు రింగుల్ని చూపిస్తూ, గారంగా అంది, కల్యాణి.
“ ఏం తల్లీ. ఏమయింది.? చూడు. ఎంత బావున్నాయో.”నవ్వుతూ అన్నారాయన, ఐదో తరగతి చదువుతున్న కూతుర్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటూ.
“ మరి అందరూ దుద్దులు, జూకాలు పెట్టుకుంటుంటే, నేనెందుకు రింగులు పెట్టుకోవాలి.?” అడిగింది, కల్యాణి.
“ ఏం. ? ఈ రింగులకి ఏమయింది.? ఎంత బావున్నాయో. చూడు.” అన్నారాయన.
ఇంతలో కల్యాణి తల్లి, రుక్మిణమ్మ లోపల్నిండి వచ్చి, “ ఏమయిందే వాటికి. అసలు మీ నాన్నకి నీకు చెవులు కుట్టించడమే ఇష్టం లేదు. నీకు చిన్న దెబ్బ తగిలితేనే ఓర్చుకోలేరాయె. చెవులు కుట్టిస్తే నీకు చాలా నెప్పి కలుగుతుందని మీ నాన్న బాధ. మంచి రోజు చూసి, నీకు చెవులు కుట్టిద్దామంటే. అయ్యో. ఆరోజు చూడాలి, మీ నాన్నని. అసలు చెవులు కుట్టించొద్దని గొడవ. నా చిట్టితల్లికి నెప్పి పెడుతుంద” ని ఒకటే సనుగుడు. ఆ రోజు చూసాను. మీ నాన్న కళ్ళల్లో నీళ్ళు. “ అంది.
కొంచెం ఆలోచనలో పడింది, కల్యాణి. నిజమే. రింగులు తనకి కూడా ఇష్టమే. అంతే కాకుండా చూసిన వాళ్ళెవరైనా సరే వాటిని మెచ్చుకోకుండా వుండరు. అదే కాదు, ” నీకు చాలా బాగా నప్పాయి, కల్యాణీ!” అనకుండా వుండరు. ఈ రింగులు, మామూలుగా సాదా బంగారు రింగులు లాగా కాకుండా, ఆ సాదా రింగులకి మొత్తం చిన్న చిన్న బంగారు పూసలు చాలా దగ్గరగా అంటించి ఉన్నాయి. కానీ కల్యాణి బాధ ఏమిటంటే. ఆ రింగులు తన చెవులుకి పుట్టినప్పుడే చుట్టించేసారు. అవి తీయడానికి రావు. అందరూ రోజుకొకటి లాగ ఇది మార్చి అది, అది మార్చి ఇదీ పెట్టుకుంటున్నారు. తను మటుకు మార్చడానికి లేదు. అదే చెప్పింది. నాన్నతో. “ ఎందుకు నాన్నా. ఇలా చెవులుకి చుట్టించేసారు.” అంది గారంగా.
గోపాల్రావు గారికి కూతురంటే వల్లమాలిన ప్రేమ. నలుగురు మగపిల్లల మధ్యలో ఆడపిల్లని చాలా గారం చేస్తారు. కల్యాణికి ఇద్దరన్నయ్యలు, ఇద్దరు తమ్ముళ్ళు. కూతురు అలా బాధ పడుతుంటే చూడలేకపోయారు, గోపాల్రావు గారు. “ నా బంగారు తల్లి అందం గా వుంటుంది కదా. అందుకే రింగులు పెట్టించాను నేనే. నువ్వు పుట్టినప్పుడు బొద్దుగా వుంటే, నీ మొహం గుండ్రం గా, ముద్దుగా వుండేది.. ఆ రోజుల్లో హిందీ సినిమా హీరోయిన్, మీనాకుమారి ఇలా రింగులు, అంటే ఇంకా పెద్దవి పెట్టుకునేది. అప్పుడు మీనాకుమారి చాలా పెద్ద హీరోయిన్. అందుకే నా కూతురు కూడా అంత అందం గా ఉంటుందని ఇలా రింగులు పెట్టించాను. నా కూతురు బంగారు తల్లి. చూడు ఎంత అందంగా ఉందో. “ అంటూ నవ్వుతూ, కల్యాణిని ముద్దు పెట్టుకున్నారు. అంతే. కల్యాణి సంతోషపడిపోయింది. ఆ చిన్ని మనసులో నాన్నకి తనంటే ఎంత ఇష్టమో బాగా నాటుకు పోయింది. నాన్నని గట్టిగా పట్టేసుకుని, కిలకిలా నవ్వేసింది.
అలా కల్యాణికి రింగులతో అనుబంధం ఏర్పడిపోయింది. నాన్న కోసం మళ్ళీ ఎప్పుడూ రింగుల గురించి నాన్నని అడగలేదు.
కల్యాణి తొమ్మిదో క్లాస్ కి వచ్చాక, ఒక రోజు కల్యాణి తల్లి రుక్మిణమ్మ గారు కంసాల్ని పిలిపించి, ఆ రింగుల్ని తీయించేసి, కొంచెం పెద్ద రింగులు, సాదాగా ఉండేవి చేయించి కల్యాణి చెవులకి పెట్టించారు.
అవి ఎప్పుడైనా తీసుకోవచ్చుకాని, ఇంట్లో ఉన్న బంగారు దుద్దులేమీ కల్యాణికి పట్టటం లేదు. మళ్ళీ ఉక్రోషమొచ్చేసింది, కల్యాణికి.
ఇంక అప్పటినుంచి కల్యాణి దుద్దులు పెట్టుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. చిన్నప్పటినుండి రింగులు పెట్టుకోవడమువలనేమో చెవుల కన్నాలు పెద్దవి కాలేదు. రింగులుకి సన్నకాడ వుంటుంది కాబట్టి అవే పట్టేవి. ఏళ్ళు గడచిపోతున్నా కల్యాణి చెవుల కన్నాలు పెద్దవి కాలేదు. ఆ కన్నాలు పెద్దవి కావడానికి ఎవరు ఏం చెప్తే అదే చేసింది.
ఒకళ్ళు చెప్పేరు. “ కొన్నాళ్ళు ఏమీ పెట్టుకోకుండా ఉంటే అవి మూసుకు పోతాయి. అప్పుడు కొంచెం పెద్దగా కుట్టించవచ్చు, “ అని. దీనికి గోపాల్రావు గారు అస్సలు ఒప్పుకోలేదు. “ నా కూతురుకి మళ్ళీ చెవులు కుట్టిస్తే చాలా నెప్పి పెడుతుంది. అది నేను చూడలేను. “
కల్యాణితో సహా అందరూ ఆ పద్థతిని పక్కకి పెట్టేసారు.
ఇంక మిగిలినవి మొదలు పెట్టింది కల్యాణి.
కొన్నాళ్ళు పొగాకు కాడలు పెట్టుకుంది. ఈ పొగాకు కాడలు అలా రోజూ పెట్టుకుంటే నీళ్ళు పడి బాగా ఉబ్బి చెవుల కన్నాలు పెద్దవవుతాయన్నమాట. ఎన్ని నెలలు పెట్టుకున్నా కొంచెం కూడా పెద్దవవలేదు.
కొన్నాళ్ళు లవంగాలు పెట్టుకుంది. రోజూ మంచి పువ్వుల్లా వున్న లవంగాలు ఏరుకుని కాడల దగ్గర చాకుతో సన్నగా చెక్కి, అవి పెట్టుకుని కాలేజ్ కి వెళ్ళేది.
కొన్నాళ్ళు రామ బాణం పూల గుత్తుల్లో రెండు పూవులు తీసికుని వాటి పొడుగు కాడల్ని చిన్నగా కట్ చేసి రెండు చెవులుకి పెట్టుకుని వెళ్ళేది. స్నేహితులందరూ అది చూసి, “లవకుశ సినిమాలో సీతాదేవి లాగా చెవులకి ఈ పూవులేమిటే. బాబూ. “ అంటూ నవ్వేవారు.
చెవుల కన్నాలు చిన్నవేమో, చక్కగా ఆ కన్నాల్లో అమరిపోయేవి.
కొన్నాళ్ళు రోల్డ్ గోల్డ్ దుద్దులు, జూకాలు కొని పెట్టు కునేది. అందులో బాగా భారం గా ఉండేవి కొని చెవులుకి వేళ్ళాడేసుకునేది. ఆ బరువుకి చెవుల కన్నాలు సాగుతాయని కల్యాణి ఆశ.
కల్యాణి అన్నలిద్దరికీ కల్యాణి డిగ్రీ చదువుతుండగానే పెళ్ళిళ్ళు అయిపోయాయి. పెద్దన్నకి ఒక కొడుకు కూడాను.
ఇద్దరు అన్నలూ కలిసి కల్యాణిని బాగా ఆట పట్టించేవారు. “ లవంగం అత్త వస్తోందిరా. “ అంటూ నవ్వేవాడు పెద్దన్న కొడుకుని ఎత్తుకుని, కల్యాణిని చూపిస్తూ.
“ ఆ చెవులకి రింగులు పెట్టుకున్నావా. లేక గాజులు పెట్టుకున్నావా. “ అంటూ నవ్వేవారు, కల్యాణి పెట్టుకున్న రోల్డ్ గోల్డ్ వి, పెద్ద గాజుల సైజు లో ఉన్న రింగుల్ని చూసి.
చిన్నన్న ” ఆ చెవులకి అంత బరువువి, పెద్దవి పెట్టుకుంటావేమిటే. బాబూ. అలా చేస్తే కొన్నాళ్ళకి నీ చెవులు బుద్ధుడి చెవుల్లా అయిపోతాయి. “ అంటూ నవ్వేవాడు. కల్యాణి అలిగి వాళ్ళ నాన్నకి రోజూ అన్నల మీద ఫిర్యాదు చేసేది. “ తప్పర్రా. చెల్లిని అలా ఏడిపించకూడదు, “ అంటూ నవ్వేసేవారు, గోపాల్రావు గారు. మొత్తంమీద ఏం చేసినా చెవుల కన్నాలు మాత్రం పెద్దవి కాలేదు. రోజూ బంగారు రింగులే పెట్టుకోవడం తప్పలేదు, కల్యాణికి. డిగ్రీ పాసైన కల్యాణికి అనుకోకుండా మంచి పెళ్ళిసంబంధం కుదిరింది. స్నేహితుడి పెళ్ళికి వచ్చిన శ్రీనివాస్ కి, పెళ్ళికూతురి మేనమామ కూతురు చాలా నచ్చి, మాటలు కలిసి, వెంటనే నిశ్చితార్ధం అయిపోయింది. ఆ రోజున కాబోయే కోడలికి, తన అత్తగారు తనకి ఇచ్చిన, రవ్వల దుద్దులు ఇచ్చి పెట్టుకోమని బలవంతం చేసారు శ్రీనివాస్ తల్లి, వర్ధనమ్మగారు. రుక్మిణమ్మ గారు, కల్యాణికి దుద్దులు పట్టవని ఎంత చెప్పినా వినలేదు. శ్రీనివాస్ వైపు పెద్దవాళ్ళైన ఆడవాళ్ళందరూ వచ్చి ఎలాగైనా ఆ దుద్దులు కల్యాణికి పెట్టాలని చూసారు. ఆఖరకి కల్యాణి చెవులు ఎర్రబారిపోయాయి. అటు ఒకళ్ళు, ఇటు ఒకళ్ళు కూర్చుని, తమతమ బల ప్రదర్శనలు చూపించారు. ఎందుకో అటు వైపు వచ్చిన శ్రీనివాస్ చూస్తే, కల్యాణి చుట్టూ జనాలు, అంతా గోలగోలగా వుంది. కల్యాణి తల వంచుకుని కూర్చుని వుంది. పరిశీలనగా చూసేసరికి, కల్యాణి కళ్ళమ్మట నీళ్ళు కారిపోతున్నాయి. చేతిలోవున్న రుమాలుతో కళ్ళు తుడుచుకుంటోంది. పక్కన వాళ్ళ అమ్మగారు, కూతురి చేయి పట్టుకుని, జాలిగా చూస్తున్నారు. ఒక్కసారిగా కోపమొచ్చేసింది, శ్రీనివాస్ కి. వాళ్ళ అమ్మని పిలిచి, ఆ కార్యక్రమాన్ని వెంటనే ఆపమని గట్టిగా చెప్పాడు. ఆవిడ ఏమి చెప్పారో. ఒక్కక్కళ్ళే అక్కడనుంచి వెళ్ళిపోయారు. కొందరు నవ్వుకుంటూ, కొందరు మూతులు తిప్పుకుని. ఒక బామ్మ గారయితే. “ మా కాలం లో లేవమ్మా ఇలాగ. “ అని పైకి అనుకుంటూనే.
ఆ తర్వాత రుక్మిణమ్మ గారు కల్యాణి ఎప్పుడూ పెట్టుకునే రింగుల్ని చెరిపించి, తమ కంసాలికి చెప్పి, కాడ చాలా చిన్నగా ఉండేలా దుద్దులు, జూకాలతో చేయించి, కల్యాణికి పెళ్ళిలో పెట్టారు.
కల్యాణి శ్రీనివాస్ ఉద్యోగం చేస్తున్న ఊరికి కాపరానికి వచ్చిన తర్వాత ఒక రోజు శ్రీనివాస్ మాటల్లో కల్యాణికి తెలిసింది, అతనికి తను రింగులు పెట్టుకుంటేనే ఇష్టమని. “ ఏమిటి. అస్తమానం ఈ దుద్దులే పెట్టుకుంటావు. “ అని ఒకసారి, “ నీ రింగులేమయ్యా “యని ఒకసారి అనడం. ఒకసారి ఏదో ఫంక్షన్ కి వెల్తే ఎవరో ఒకావిడ చెవులకి పెట్టుకున్న హాంగింగ్స్ చూసి బావున్నాయని అనడం. తన పుట్టిన రోజుకి గోల్డు హాంగింగ్స్ కొని పెట్టడము.
అసలే పెళ్ళైన కొత్త. ఏమంటే. ఏమవుతుందో. అని కల్యాణి మౌనం గా ఉండిపోయింది. శ్రీనివాస్ కి కూడా కొత్తే కదా. అందుకే అతను కూడా కొన్నాళ్ళు ఊరుకున్నాడు. ఆఖరికి ఉండలేక ఒక రోజు ” నీ రింగులేవీ. ? తెచ్చుకోలేదా. “ అని అడిగేసాడు. అడ్డం గా బుర్ర ఊపింది, కల్యాణి. “ ఏం. ఎందుకని.? “ అన్నాడు. ” అదే మీరం తా దుద్దులు అంటున్నారని. మా అమ్మ నా రింగులు చెరిపించి, ఈ దుద్దులు చేయించింది. “ అంది, కల్యాణి. అంతే. అసలు విషయం అప్పుడు బైట పెట్టాడు. “ నేను అసలు ఆ రింగులు చూసే నిన్ను ఇష్టపడ్డాను. నువ్వేమో వాటిని చెరిపించేసావా. నాకు దుద్దులు అస్సలు ఇష్టముండదు. “ అంటూ మూతి బిగించాడు.
శ్రావణమాసం నోములకెళ్ళిన కల్యాణి, “ అమ్మా! నాకు రింగులు చేయించు. అచ్చు నేను ఇదివరకు పెట్టుకునే రింగుల్లాగే వుండాలి. “ అంది. రుక్మిణమ్మగారు ” అదేమిటే. చిన్నప్పటినుండి దుద్దులు, జూకాలు అంటూ ఏడ్చేదానివి. “ అంటూ ఆశ్చర్య పోయారు.
“ఇప్పుడు రింగులే కావాలంటున్నాను. నాకు ఇవ్వవా.” అంటూ బుంగమూతిపెట్టింది.
“ నే చెప్పానా. నా బంగారు తల్లికి రింగులే ఇష్టం. నువ్వే అనవసరంగా ఆ రింగులు చెరిపించి దుద్దులు చేయించావ్.” అన్నారు గోపాల్రావు గారు, కల్యాణిని దగ్గరగా తీసుకుని నవ్వుతూ. “దానికేమే. తల్లీ. అలాగే. రింగులు చేయిస్తాలే. “ అంటూ అసలు విషయం కనుక్కున్నారు. సరి. అల్లుడికి ఇష్టమైనది. కాదంటారా.!?
రోజులు గడిచాయి. కల్యాణికి ఇప్పుడు ఒక కూతురు, ఒక కొడుకు. వాళ్ళకి చెవులు కుట్టించేటప్పుడు కల్యాణికి తన తండ్రి గుర్తుకువచ్చారు. కళ్ళల్లో నీళ్ళూరాయి. ఇప్పుడు బాగా తెలిసింది, తల్లితండ్రులు పిల్లల కోసం ఎంత ఆలోచిస్తూవుంటారో.
ఎవరేమనుకున్నా సరే. భర్తకిష్టమని రింగులు మాత్రం తీయలేదు, కల్యాణి.
పెళ్ళయి పాతికేళ్ళయిందని, బహుమతి ఇవ్వాలంటూ నగల కొట్టుకి కల్యాణిని తీసికెళ్ళాడు, శ్రీనివాస్. రవ్వల దుద్దులు చూపించమని సేల్స్ మాన్ ని అడుగుతున్న భర్తవైపు ఆశ్చర్యంగా చూసింది, కల్యాణి. “ రోజులు మారాయి, కల్యాణీ! ఇప్పుడు ఇదివరకులా కాకుండా సన్నకాడలతో కూడా చేస్తున్నారు అన్నీ. ఆ రోజుల్లో అయితే అత్తగారు మీ ఆస్తాన కంసాలి తో నీకు దుద్దులు, జూకాలు ప్రత్యేకంగా చేయించారు. ఇప్పుడు ఇక్కడ ఎన్ని వెరైటీలో చూడు. నీకు నచ్చింది తీసుకో. నీకు దుద్దులంటే ఇష్టంకదా. “ అన్నాడు, శ్రీనివాస్.
రవ్వల దుద్దులు కొనుక్కున్నా ఎప్పుడైనా పెట్టుకునేది. కానీ. రోజూ మాత్రం రింగులే పెట్టుకునేది, భర్తకి ఇష్టమని.
పిల్లల పెళ్ళిళ్ళయి ఎవరి తీరున వాళ్ళు వెళ్ళారు. కల్యాణీ, శ్రీనివాస్ సంతోషంగా రిటైర్డ్ లైఫ్ ని గడుపుతున్నారు.
అమ్మాయికి ఒక కూతురు, కొడుకు. అబ్బాయికి ఒక కొడుకు.
కల్యాణికి మోకాళ్ళ నెప్పులు ఎక్కువై ఆపరేషన్ చెయ్యాలనేసరికి, పిల్లలు వచ్చారు.
ఆపరేషన్ బాగా జరిగి, అమ్మ కొంచెం కోలుకోగానే పిల్లలు వెళ్ళిపోయారు. అమ్మ, నాన్నకి కావలసిన ఏర్పాట్లన్నీ చేసి, మంచి పనిమనిషిని, వంటమనిషిని పెట్టి వెళ్ళారు.
పిల్లలకి శెలవులిచ్చారంటూ కూతురూ, కొడుకు పిల్లలతో వస్తే చాలా సంతోషించారు, శ్రీనివాస్, కల్యాణి.
కల్యాణి మనవడు, ( కొడుకు కొడుకు ) ఆదిత్య కి కల్యాణి దగ్గర బాగా అలవాటు. నాలుగేళ్ళ పిల్లాడు, కల్యాణిని యక్ష ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. కూతురి కొడుకు, కిరణ్ వీడికన్నా రెండేళ్ళు పెద్ద. వాడు ఆదిత్యకి పెద్ద తరహాగా సలహాలు ఇస్తూవుంటాడు. కూతురి కూతురు, షణ్ముఖి, కిరణ్ కన్నా నాలుగేళ్ళు పెద్ద. తను ఒక పెద్ద ఆరిందాలాగా ఆదిత్యకి, కిరణ్ కి చదువు చెప్పడం, పనులు చెప్పడం చేస్తూవుంటుంది.
పిల్లలతో ఆనందంగా గడుపుతున్నారు, శ్రీనివాస్ కల్యాణీలు.
ఒక రోజు ఆదిత్య, నానమ్మతో ఆడుకుంటూ, “ నానమ్మా! నీ చెవులకి ఉండేవి. ఏవి ? “ అని అడిగాడు.
కల్యాణి గబుక్కుని, చెవులు తడుముకుంది. అవును. ఏవీ.
శ్రీనివాస్ ని పిల్లలని పిలిచింది. అప్పుడు శ్రీనివాస్, “ నీకు ఆపరేషన్ అప్పుడు నీ నగలన్నీ తీసి లోపల పెట్టాం. తర్వాత అమ్మాయి నీ చెవులవి మాత్రం వదిలేసి, మిగిలినవన్నీ పెట్టింది. “ అన్నాడు.
“ అవును. నాన్నా! గుర్తొచ్చింది. ఆ రోజు అన్నీ పెట్టి, చెవులకి పెడుతుంటే. అమ్మ ” అబ్బా. “ అంది. ఇంతలో పిల్లలు ఎందుకో గొడవ పడుతుంటే వెళ్ళిపోయాను. చేతిలో ఉన్న ఆ రింగుల్ని, తర్వాత పెట్టచ్చులే అనుకుంటూ బీరువాలో పెట్టేసాను. “ అంది.
” ఇన్ని రోజులయింది. ఇంతమందిమి రోజూ అమ్మని చూస్తున్నాము. మనకి తెలియలేదు. వీడు చూడు ఎలా కనిపెట్టేసాడో.” అన్నాడు శ్రీనివాస్.
“ అయినా. అదేమిటి నాన్నా! నువ్వు ఎలా చూడలేదూ ?!. “ అంది, కూతురు నవ్వుతూ.
“ లేదమ్మా. నేనూ ఒక రోజు అనుకున్నాను. మళ్ళీ ఇంకోటేదో ధ్యాసలోకి వెళ్ళిపోయాను. “ అన్నాడు.
“ అమ్మా! నీ కేమయింది? “ అంది కూతురు తల్లి కేసి చూస్తూ.
“ ఏమోనే. తెలియనే లేదు. “ అంది, కల్యాణి అమాయకంగా.
“ సరే. ఇప్పుడు ఆ రింగులు తెచ్చి మీ అమ్మకి పెట్టమ్మా! “ అన్నాడు, శ్రీనివాస్.
గబగబా వెళ్ళి రింగులు తెచ్చి, పెట్టడానికి చూసింది.
“ మొత్తం పూడుకుపోయినట్లుంది, నాన్నా! “ అంది, కూతురు. “ అయ్యో! ఎలాగమ్మా ఇప్పుడు. అందరం కలిసి, అమ్మ చెవుల రంద్రాలు పూడుకు పోయేలా చేసాము, “ అన్నాడు, శ్రీనివాస్.
“ అమ్మకి మళ్ళీ చెవులు కుట్టించాలి, నాన్నా! మంచి రోజు చూడాలి,” నవ్వుతూ అంది కూతురు.
“ తాతా! హాస్పిటల్ కి వెళ్ళి చెవులు కుట్టిద్దాం అమ్మమ్మకి. “ అంది, షణ్ముఖి. షణ్ముఖికి ఈ విషయంలో ఈ మధ్యనే మంచి నాలెడ్జ్ వచ్చింది. తన క్లాస్ మేట్ ఒక అమ్మాయికి చిన్నప్పుడు చెవులు కుట్టించకపోతే హాస్పిటల్ కి వెళ్ళి చెవులు కుట్టించుకుని వచ్చింది. అందుకే వెంటనే తాతకి సలహా ఇచ్చేసింది.
“ అమ్మకి నెప్పిపుడుతుందేమో అమ్మా!. “ అన్నాడు, శ్రీనివాస్.
కల్యాణికి వెంటనే తన తండ్రి గుర్తుకువచ్చారు. కళ్ళల్లో నీళ్ళూరాయి.
డాక్టర్ తో మాట్లాడి, ఒక రోజు అప్పాయింట్మెట్ తీసుకుని, హాస్పిటల్ కి వెళ్ళారు.
కల్యాణి రెండు చేతులూ ఇద్దరు మనవలు పట్టుకుంటే, షణ్ముఖి తో సహా అందరూ హాస్పిటల్ కి వచ్చారు.
ఆదిత్యా, కిరణ్ ఇద్దరూ ” జాగ్రత్తగా మెట్లు ఎక్కు. నెమ్మదిగా ఎక్కు.” అంటూ జాగ్రత్తగా కల్యాణిని హాస్పిటల్ మెట్లు ఎక్కించారు.
“ అమ్మమ్మా! నెప్పి పెడుతుందేమో. ఎలా. “ అంటూ షణ్ముఖి బేలగా చూస్తూ అంటోంది.
“ కల్యాణీ! ఏమీ భయపడకు. డాక్టర్ తో మాట్లాడాను. ఎక్కువ నెప్పి ఏమీ ఉండదన్నారు. “ అంటూ శ్రీనివాస్ అందరికన్నా ఎక్కువ ఖంగారు పడుతున్నాడు.
భర్తా, కూతురూ, అల్లుడు, కొడుకు, కోడలూ, మనవరాలు, మనవలు ఇంతమంది తన చుట్టూ చేరి, వాళ్ళ ఆతృత చూపిస్తుంటే, కల్యాణికి ఇంతమంది చుట్టూ ఉన్నా, తన తండ్రి గుర్తుకొచ్చి మనసంతా ఏదోలా అయిపోయింది. చిన్నప్పటి తన మాటలూ, తండ్రి తనకి నచ్చ చెప్పటం. అంతా గుర్తుకొచ్చి, చిన్నగా నవ్వొచ్చింది. అది చూసి, అల్లుడు, “ ఆంటీ! చిన్నప్పుడు మీకు ఊహ తెలియనప్పుడు మీకు మీ నాన్నగారు మీకు చెవులు కుట్టించి వుంటారు. కానీ ఇప్పుడు చూడండి. మీకు ఎంత మందిమి ఉన్నామో. గట్టిగా నవ్వేసేయ్యండి. “ అంటూ నవ్వేసాడు, అందర్నీ తేలిక చేద్దామని. కల్యాణి గట్టిగా నవ్వుతూ, ఆదిత్యనీ, కిరణ్ నీ దగ్గరకి తీసుకుంది. అందరూ ఒక్కసారిగా నవ్వేసారు. పిల్లలు, ఏమీ అర్ధం కాకపోయినా అందరూ నవ్వుతుంటే వాళ్ళూ గట్టిగా నవ్వేసారు.

*****

11 thoughts on “రింగుల జీవన వలయం

 1. చాలా బాగుంది కధ ఆంటీ మీము కోమలి ఆంటీ నాకు online tambola లో friends ఈ రోజు మా కోమలి పుట్టినరోజు సందర్భంగా ఈ కధ group lo పట్టారు. చాలా బాగుంది బాగా నవ్వుకొన్నాము..

 2. కథబాగుంది. నేను కొన్ని నెలలనుంచి చెవులకేమీ పెట్టుకోవటం లేదు నా చెవులు పూడుకుపోతాయా అమ్మో

  1. ధన్యవాదాలు, మాలా గారూ! మా ఫ్రెండ్ కి పూడుకుపోయాయిట. అది వాళ్ళ వంటి తీరుని బట్టి కూడా ఉంటుందనుకుంటా.. ఎందుకంటే.. ఈ కథలో చెప్పినట్లు నాకు ఎంత కష్టపడినా చెవి రంధ్రాలు పెద్దవి కాలేదు.

 3. కథ చాలా బాగుంది. మనవలు మనవరాలు కలిసి చెవులు కుట్టించటానికి వెళ్లటం వాస్తవంగా ఉంది. చక్కటి కథ.

   1. మీలాంటివాళ్ళ ప్రోత్సాహామే కావాలి మాకు.

 4. కధ బాగుంది.‌‌చెప్పిన శైలి కూడా….పెద్దవాళ్లూ చిన్న పిల్లలు ఒకటేనంటారు….పెద్దప్పుడు చెవులుకుట్టడం అన్నమాట…పిల్లలు, మనవలు, మనవరాళ్ళు చుట్టూ చేరి అమ్మమ్మని/ బామ్మని చిన్నపిల్లని చేసి ఆప్యాయంగా, ప్రేమతో, గౌరవంతో, చనువుతో ఆడుకుంటూ ఉంటే జీవితం రంగుల వలయం కూడా కదా…..బాగా అందించారు అందరి అనుబంధం….ధన్యవాదములు….

  1. ధన్యవాదములు, అన్నయ్య గారూ! మీరు బాగా చెప్పారు… మనువలు, మనవరాళ్ళతో బంధం అంతే కదా ..

 5. హమ్మయ్య.. మొత్తానికి మనవలంతా కలిసి చిన్నప్పటి తండ్రిని గుర్తు చేస్తూ కల్యాణికి చెవులు కుట్టించేసారన్న మాట. బాగుంది భారతీ, రింగుల జీవనవలయం..

  1. Thanks, చిన్నక్కా! అసలు దీని అయిడియా కోమలి, నా స్నేహితురాలు ఇచ్చింది. ఆ మధ్య తను వేరే ధ్యాసలో పడి చెవులకి ఏమీ పెట్టుకోకపోతే అవి కాస్తా పూడుకు పోయాయిట. దాంతో వాళ్ళ అబ్బాయి అమెరికా నుండి వచ్చినప్పుడు హాస్పిటల్ కి తీసికెళ్ళి, చెవులు కుట్టిస్తే, వాళ్ళతో వచ్చిన వాళ్ళ అబ్బాయి స్నేహితులు నవ్వుతూ ” బావుందిరా.. ఆంటీకి చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు కుట్టిస్తే, ఇప్పుడు నువ్వు కుట్టిస్తున్నావు. ” అంటూ నవ్వుకున్నారుట. తను నాకు ఈ విషయం చెప్పి,” కథ రాయి, భారతీ! ” అంది. అలా వచ్చింది అది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *