May 25, 2024

హరిలో రంగ హరీ.. జలజం పని హరీ

రచన: గిరిజారాణి కలవల

” ఇదిగో.. చెపుతున్నది కాస్త ఓ చెవిన పడేసుకోండి.. ఆనక మళ్లీ.. నాకు ఎప్పుడు చెప్పావు అంటే ఊరుకోను” .. అంది జలజం .
” అసలు నువ్వు ఏం చెప్పాలనుకున్నావో చెప్పకుండా ఈ నిందా స్తుతేంటే.. ఏం కావాలో చెప్పు.. ఒక్క చెవిలో ఏం ఖర్మ.. రెండు చెవుల్లోనూ గరాటు వేసుకుని మరీ పడేసుకుంటా.. ” అన్నాడు జలజాపతి .
” అబ్బో, మీ ఎకసెక్కాలు చాల్లెండి.. మొన్న కొన్న పుస్తకాల షెల్ఫ్ కి అరకీ, అరకీ మధ్య గేప్ ఎక్కువగా ఉంది… అక్కడ ఇంకో చెక్క కొట్టించాలి. మీ ఆఫీసు దగ్గర ఉన్న బీహారీ కార్పెంటర్ కి చెప్పండి.. ఓసారి వచ్చి ఆ పని చేసి వెళ్ళమని.. అసలే మీరు మతిమరుపు మాలోకం… మర్చిపోకుండా చెప్పండి “.
” ఇంత మాత్రం పనికి బీహారీ వాడెందుకే ! చిన్న పనికే బోలెడు డబ్బులు అడుగుతాడు. మన నీలకంఠం చాలడూ… ఎంత ఇస్తే అంత కాదనకుండా తీసుకుంటాడు… ఎప్పటినుండో మనింటి వడ్రంగి పనులు వాడేగా చేసేది… ”
” ఓయబ్బో! మీ ఆస్థాన కార్పెంటర్ కదూ నీలకంఠం… వాడూ సరే.. వాడి పనీ సరే… ఇదంతా కాదు కానీ… మీరు చెపుతారా.. చెప్పరా.. బీహారీ పనివాడికి.. పక్కింటి పేరిందేవమ్మ ఇంట్లో వుడ్ వర్క్ చూడండి… ఇంద్రభవనంలా ఉంటుంది ఆ ఇల్లు… బీహారీ వాళ్ళతోనే చేయించింది మొత్తం చెక్క పని.ఎంత నైసు వర్కో.. ఎక్కడా ఒక్క మేకు కూడా బయటకి కనపడదు. మీరూ ఉన్నారు.. ఎందుకూ? చిన్న ఫోటోకి చిన్న మేకు కొట్టాలన్నా ఇంతింత గుబ్బ మేకులు కొట్టి, ఈసారి కి ఇట్టా కానిచ్చేద్దాం అమ్మా అంటూ గోడంతా పగుళ్లు చేసే ఆ నీలకంఠాన్ని వదిలిపెట్టరు ” అంది నిష్టూరంగా.
” మరి నీకు బీహారీ భాష రాదు కదే.. ఎలా అర్ధం చేసుకుంటావూ.. వాడు చెప్పేది? నువ్వేం చెపుతున్నావో వాడికీ తెలియాలిగా? ” అంటూ లాజిక్ లేవదీసి.. ఎలాగోలా నీలకంఠాన్నే పిలుద్దామనుకున్నాడు.
” వాళ్ళ కి కాస్త హిందీ వచ్చట… పేరిందొదిన చెప్పింది…
‘ ఇదరావో.. ఉదర్ జావో.. ఉదర్ ఏక్ మేక్ కొట్టూ.. ఇదర్ స్క్రూ టైట్ కరో.. ‘ ఈ మాత్రం హిందీ నాకూ తోఢా తోఢా వచ్చు.. ఎలాగోలా మేనేజ్ చేసుకుంటా లెండి. మనం కొత్తగా ఇల్లు కట్టి పూర్తిగా వర్క్ చేయించేటప్పటికి ముఫై రోజుల్లో బీహారీ భాష బుక్ కొనుక్కుంటాను.
” సరే.. సరే.. అడిగి చూస్తాను. వాడో వెయ్యో, రెండువేలో అడిగితే మాత్రం ఒప్పుకోను..
నీలకంఠాన్నే పంపిస్తాను.. చెప్పి చేయించుకో.. నాకు ఆఫీసు టైమవుతోంది.. బయలుదేరుతున్నా.. ” అంటూ స్కూటర్ స్టార్ట్ చేసాడు.
వెనకే గేటు దాకా వచ్చిన జలజం… ” అదంతా నాకు తెలీదు… బీహారీ పనివాడు కాకుండా మరోడు వచ్చాడంటే నేను పని చేయంచను… నీలకంఠాన్ని పంపితే గుమ్మంలోకి కూడా రానీయను.. ” వెళ్లిపోతున్న భర్త వినిపించుకున్నదీ లేనిదీ గ్రహించకుండానే వీధి చివర దాకా వినపడేలా గట్టిగా అరిచి మరీ చెప్పింది.
పక్కింటి పేరిందేవమ్మ… జలజం కేక విని బయటకి వచ్చి..
” ఏంటి, జలజా! .. ఊరంతా వినపడేలా మరీ బీహారీ పనివాడంటున్నావు? ఏం పనుందేంటి? మంచాలూ, డ్రస్సింగ్ టేబుల్ ఏవైనా చేయిస్తున్నావా? ” అంది.
” అంత పెద్ద పనులేంకాదు పేరిందొదినా! చిన్న పనే.. బీరువా మధ్య లో అర కొట్టించాలి… బీహారీ పనివాడిని పంపించమని చెపుతున్నా.. ఈయనేమో ఆ నీలకంఠమో అని.. చచ్చిపోతారు… వాడి పని ఉట్టి నాటు పని.. ఆ మధ్య వాడి మూలంగా ఎంత గందరగోళం అయిందో నీకు తెలుసా? ”
” ఏం జరిగిందో నువ్వు చెపితేగా తెలిసేదీ.. ఏమైందేంటి? అంది ఉత్సాహంగా మూడడుగులు ముందుకేసి మరీ అడిగింది.
” ఏం చెప్పమంటావూ.. ఓ సారి బట్టలు ఆరేసుకుందికి దండెం కట్టిద్దామని నీలకంఠాన్ని పిలిచాము. గోడకి మేకు ఇలా కొట్టాడో లేదో… పేద్ద గావుకేక ‘ అమ్మగారో! ఓ పాలిటురండి..’ అంటూ… నా పై ప్రాణాలు పైకి పోయాయి.. ఏదో చేసేసుంటాడు.. అనుకుంటూ గాభరా గా పరిగెత్తుకుని వచ్చి చూసేసరికి.. గోడకి మేకు కొట్టిన చోట… లోపల కన్ సీల్డ్ వాటర్ పైపు ఉన్నట్టుంది… టపక్ మని దాని మీద కొట్టినట్టున్నాడు… ప్లాస్టిక్ పైపేమో అది పగిలి అందులోనుండి నీళ్లు ఫౌంటెన్ లాగా నీలకంఠం నెత్తి మీద నుండి… నిజంగా గంగలాగా, మెడలో వేసుకున్న టేప్.. పాములాగా.. చుట్టుకున్న టవల్ పులి చర్మంలాగా కనపడి…. ‘ నీలకంఠరా! దేవా! నన్ను బ్రోవరా!’ అని చేతులు జోడించి పాడేద్దామనించేలా ఉంది వాడి వాలకం. నవ్వాలో, ఏడవాలో అర్థం కాలేదు వాడు చేసిన పనికి. కానీ తర్వాత నిజంగానే ఏడిపించాడు. ఎందుకని అడగవేం పేరిందొదినా! ఈ హడావుడి కి ఈయన కూడా గబగబా రావడం, ఆ నీళ్ళ తడికి జర్రున జారి పడి చెయ్యి ఫ్రాక్చర్ అవడం… ఖర్చు ఓ పాతిక ముఫై వేలు… ఆ వాటర్ పైపు రిపేరుకి మరో మూడు వేలు వదిలాయి మాకు. ఇంతయినా కూడా ఈయన ఆ నీలకంఠాన్ని మాత్రం వదలరు… ఈరోజు ఖచ్చితంగా చెప్పేసాను.. బీహారీ పనివాడే కావాలని… పోనీ మీ ఇంట్లో చేసిన బీహారీ వాడికైనా చెప్పు పేరిందొదినా రమ్మని.. ” అంది.
“అమ్మో.. ఇంత జరిగిందా.. ఆ నీలకంఠం పనితో.. భలేవాడే.. అయినా ఏమో, జలజా .. ఫోన్ చేస్తాలే బీహారీ వాడికి.. ఇంత చిన్న పనికి వస్తాడో రాడో మరి… ” అంటూ లోపలికి వెళ్లి పోయింది పేరిందేవమ్మ.
జలజం కూడా ఇంట్లోకి వచ్చి ఇలా కూర్చుందో లేదో… కాలింగ్ బెల్ మోగింది.
తలుపు తీసేసరికి .. చేతిలో సంచీ.. వడ్రంగి సామానుతో..బీహారీ వడ్రంగి కనిపించాడు.
భర్త చెప్పినట్టున్నాడు అనుకుంది.
” ఆవో.. ఆవో.. యే షెల్ఫ్ దేఖో.. ఇస్ మే మధ్యా మే పార్టీషన్ కరో..” అంటూ తన హిందీ భాషలో ఏవేం పనులు చేయాలో చకచక చెప్పేసింది.
ఏ పని చేయాలో ఏంటో చూసుకున్నాడు ఆ బీహారీ… “బజార్లో కావలసిన సరంజామా తెచ్చుకుని వస్తా.. ఓ వెయ్యి రూపాయలు ఇవ్వండి” . అని హిందీలోనే చెప్పి.. ఓ గంటలో సామాను తెచ్చుకుని పని మొదలెట్టాడు.
వాడు వచ్చేసరికి జలజం పనులు ముగించుకుని, వాడు చేసే పని చూస్తూ అక్కడే కూర్చుంది.
ఇంతలో చెల్లి వజ్రం దగ్గర నుంచి ఫోను…
” అక్కా! ఏంటి సంగతులు? ఎలా ఉన్నావు?”
” ఆ.. బావున్నాను, వజ్రం… నువ్వెలా ఉన్నావూ? ఔనూ, కాసులపేరు ఆర్డర్ ఇచ్చానన్నావు, వచ్చిందా? ”
” వచ్చిందక్కా!అది చెపుదామనే వీడియో కాల్ చేసాను.. ఇదిగో చూడు.. బావుందా?
” బావుందే.. ఇంకొంచెం పొడుగు పెట్టాల్సింది.. కాసు కూడా ఇంకా పెద్దగా ఉంటే బావుండేది… నా కెంపుల సెట్ చూపిస్తా ఉండు… కరెక్ట్ పొడుగు వచ్చింది..” అంటూ ఫోన్ హోల్డ్ లో పెట్టి.. బీరువాలో నుండి తన కెంపుల సెట్ మెడలో వేసుకుని.. వీడియో కాల్ లో చెల్లెలికి చూపిస్తూ… ఓ అరగంట సేపు బీరువాలో ఉన్న తన నగల ముచ్చట్లు చెప్పుకుంది.
ఇంతలో బీహారీ వడ్రంగి…”పని అయింది.. ఓసారి చూసుకుంటే తనింక వెళ్లి పోతాను… ” అని చెప్పేసరికి… ” ఇక ఉంటానే, తర్వాత మళ్లీ చేస్తాలే” అంటూ ఫోన్ పెట్టేసింది.
బుక్ షెల్ఫ్ చూసింది.. ఎంతైనా బీహారీ పనితనమే వేరు అనుకుంటూ.. ఎంత బాగా చేసాడో అనుకుంటూ… షెల్స్ దగ్గర కి వెళ్ళేసరికి… ఏదో వాసన… ఆచెక్క తాలూకు పెయింట్ కాబోలు.. జలజం ముక్కుపుటాలకి ఘాటుగా తగిలింది. ఏదో మత్తులాగా ఆవహించి… కళ్ళు మూతలుపడుతూండగా, నెమ్మదిగా కిందకి వాలిపోయింది.
ఆగకుండా మోగుతున్న కాలింగ్ బెల్ మోతకి.. మెలకువ వచ్చి, మెల్లగా కళ్ళు తెరిచింది .’ ఏంటి ఇంత సేపు నిద్ర పట్టేసింది? తలంతా దిమ్ముగా ఉందేంటి? బీపీ పెరిగినట్టుంది కాబోలు… బెల్ మోగుతోంది.. ఈయన వచ్చినట్టున్నారు’ అనుకుంటూ లేచింది.
అంతే.. మళ్లీ.. ఢాం.. పడిపోయింది.. కారణం… బార్లా తెరిచి ఉన్న బీరువా తలుపులు… అస్తవ్యస్తంగా, గజిబిజిగా బట్టలు… నగల పెట్టెలు అన్నీ ఖాళీగా బయటపడి ఉండడం కనిపించింది. ఫోన్ లో చెల్లికి చూపించడానికి మెడలో వేసుకున్న కొత్త కెంపుల సెట్ గుర్తొచ్చి.. మెడ తడుముకునేసరికి బోసి మెడ చేతికి తగిలింది.. కెంపుల సెట్ తో పాటుగా.. రెండుపేటల నానుతాడు, రెండుపేటల నల్లపూసల గొలుసు,చేతికి ఉండాల్సిన ఆరుజతల గాజులు.. మొత్తం హాంఫట్.. వజ్రంతో ఫోన్ లో మాట్లాడిన నగల సంగతి మొత్తం విన్నట్టున్నాడు… మాయదారి వెధవ.. మత్తు జల్లి వెనక వాకిలి గుండా దోచుకుపోయాడు.
నిద్ర లో నడుస్తున్నదానిలా తలుపు తీసి… లోపలకి వచ్చిన భర్తని పట్టుకుని బావురుమంది.
” ఏమైంది.. జలజం? ఎందుకు ఏడుస్తున్నావు?” అంటూ కంగారు పడిపోయాడు.
” ఏవండీ! ఘోరం జరిగిపోయిందండీ.. ఆ బీహారీ పనివాడికి తెలుగు వచ్చుకాబోలండీ! నిలువు దోపిడీ చేసేసాడూ.. ” అంటూ జరిగిన సంగతి చెప్పేసరికి..
” హరి, హరీ.. బీహారీ.. ఎంత పని చేసావురా? అయినా నేను పంపలేదు కదే.. ఎవడిని పిలిపించి చేయించావు పనిని. ” అన్నాడు ఆగ్రహావేశాలతో..
“మీరే పంపారేమో అనుకున్నా.. మీరు కాకపోతే పేరిందొదిన పంపుండవచ్చు..అయినా.. ఇదరావో.. ఉదర్ జావో ఇలా తోఢా హిందీ వచ్చు కానీ.. నిన్ను ఎవరు పంపారూ? అనేది హిందీ లో ఎలా అనాలో నాకు తెలీలేదు… వీడికి తెలుగు వచ్చుననే సంగతి ముందే తెలిస్తే.. తెలుగులోనే అడిగేదాన్ని. మా వజ్రంతో మాట్లాడిన మాటలన్నీ విని, కెంపులు, పచ్చలు, పగడాలు, ముత్యాలు సెట్లు అన్నీ మూటలు కట్టుకని పోయాడండీ… ఇప్పుడు నేనేం చేయాలిరా భగవంతుడా! ”
” ఏంటి చేసేది… నెత్తిన ముసుగేసుకుని ఓ మూల కూర్చో… రోడ్డు మీద కి వచ్చి మరీ అరిచావుగా! బీహారీ వాడిని పంపమని… ఎవడో వినుంటాడు.. బీహారీ వాడిది నైస్ వర్క్ అన్నావుగా! చూడు ఎంత నైస్ గా వాడి వర్క్ చేసుకున్నాడో… నీలకంఠాన్ని పిలుస్తానే అంటే తెగ నీలిగావు… తిక్క కుదిరింది బాగా ”
” అదిగో, మళ్లీ నీలకంఠం పేరు ఎత్తుతారూ! వాడూ సరే.. వాడి పనీ సరే.. ఇదిగో ఇప్పుడు ఈ బీహారీ చూడండి… ఎంతబాగా చేసాడో…దొంగతనం మాట అటుంచండి.. ఈ పుస్తకాల షెల్ఫ్ కి ఎంతందం వచ్చిందో వాడు చేసి పనికి..
” ఛస్.. ఆపు ఇంక.. జరిగిన భాగోతం చాల్లే. పోలీసు రిపోర్టు ఇద్దాం.. తగలడు.. వాడెవడో, వాడి గుర్తులూ.. పోయిన నగల లిస్టూ చెపుదువుగాని..” అంటూ లేచాడు జలజాపతి .

. సమాప్తం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *