March 29, 2024

అమ్మమ్మ – 15

రచన: గిరిజ పీసపాటి

పీసపాటి తాతయ్య దగ్గర నుండి అమ్మమ్మకు వచ్చిన ఉత్తరంలో ‘నాగకు కొంచెం ఆరోగ్యం క్షీణించిన కారణంగా నా స్నేహితుడైన డా. నౌడూరి శ్రీరామమూర్తి గారికి (మక్కువ అనే ఊరిలో వీరు ఉంటున్న కారణంగా అందరూ వీరిని మక్కువ డాక్టర్ గారు అంటారు) చూపించగా, చాలా చిన్న వయసులోనే గర్భవతి కావడం వలన రక్తహీనత బాగా ఉందనీ, మందులు రాసి ఇచ్చారని రాస్తూ…’
‘డెలివరీ కష్టం కావచ్చు కనుక డెలివరీ సమయానికి ఏదైనా హాస్పిటల్ లో జాయిన్ చెయ్యమన్నారని, రాముడువలస నుండి ప్రయాణ సౌకర్యం లేదు కనుక, మక్కువలో వారి ఇంటి వద్దే నాగను ఉంచమంటే ఉంచామని, డెలివరీ సమయానికి వారే హాస్పిటల్ లో చేర్చి పురుడు పోస్తామన్నారు’ అని,
‘అదీ కాక భర్త పోయిన ఆరునెలల లోపు వియ్యపురాలిని తీసుకురాకూడదని శాస్త్రం చెప్తోంది కనుక, నాగ డెలివరీ సమయానికి మీరు రావడానికి వీలు కాదని, ఆరు నెలలు దాటాక మంచి ముహూర్తం చూసి కబురు చేస్తాము. అప్పుడు రమ్మని’ రాసారు.
ఉత్తరం చదివిన అమ్మమ్మ నిశ్చేష్టురాలైపోయింది. కూతురికి ఆరోగ్యం ఎలా ఉందోనన్న ఆందోళన ఒకవైపు, పదమూడేళ్ళ పిన్న వయసులోనే మరో బిడ్డకు జన్మనివ్వబోతున్న కూతురి దగ్గర ఉండలేని పరిస్థితి మరోవైపు.
మనసు దిటవు చేసుకుని ‘నాగ ఆరోగ్యం గురించి తాను కలత చెందతున్నానని, మీ రక్షణలో నా బిడ్డ క్షేమంగా ఉంటుది కనుక ధైర్యంగా ఉంటానని, డెలివరీ కాగానే తనకు తెలియజేయమని, మీరు ఎప్పుడు మంచిరోజని చెప్తే అప్పుడే వస్తానని’ తిరుగు టపాలో ఉత్తరం రాసింది.
మక్కువ డాక్టర్ గారు చాలా మంచివారే కాక హస్తవాసి గల డాక్టర్. ఆ చుట్టుపక్కల గ్రామాల వారు కూడా ట్రీట్‌మెంట్‌ కోసం ఆయన దగ్గరకు వచ్చేవారు. ఆయన సరిగ్గా రోగనిర్ధారణ చేసి, మందులు రాసి పంపేవారు.
ఆయనకు ఇద్దరు భార్యలు. ఇద్దరూ సొంత అక్కచెల్లెళ్ళే కనుక ఒకే ఇంట్లో చాలా అన్యోన్యంగా ఉండేవారు. ఇద్దరికీ సంతానమూ ఎక్కువే. అందరూ నాగని ‘అక్కా’ అని పిలుస్తూ బాగా చేరిక అయిపోయారు. ముఖ్యంగా ఆడపిల్లలు నాగని చాలా అభిమానించేవారు.
పాలు, పళ్ళు, కూరలు, ఆవు నెయ్యి, ఇలా శుభ్రమైన తిండి, మందులతో నాగ త్వరగానే కోలుకుంది. రోజూ సాయంత్రం అయేసరికి మల్లెలు, జాజులు మాలలు కట్టుకుని పెట్టుకునేవారు. ఇంటి పక్కనే ఉన్న టూరింగ్ టాకీస్ కి వెళ్ళి సినిమా చూసేవారు.
వీళ్ళు సినిమాకి వెళతారనే విషయం తెలియగానే వీళ్ళ ఇంటి నుండి కుర్చీలు పంపించి, వేయించేవారు డాక్టర్ గారు. అందులో ఒక సినిమా వారం రోజులు మాత్రమే ఆడేది. సినిమా నచ్చితే మళ్ళీ వెళ్ళి చూసేవారు.
కొత్త సినిమా రాగానే ఆ సినిమాకి మళ్ళీ వెళ్లాల్సిందే. ఇలా నాగకి రోజులు హాయిగా, సందడిగా గడిచిపోతున్నాయి. అప్పుడప్పుడు రాముడువలస నుండి పెద్ద బావ, పీసపాటి తాతయ్య, నాగ అత్తగారు వచ్చి చూసి వెళుతూ ఉండేవారు. నాగకు మాత్రం పుట్టింట్లో ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో అలాగే ఉంది డాక్టర్ గారి ఇంట.
నాగ ఎప్పటికప్పుడు విషయాలన్నీ అమ్మమ్మకి ఉత్తరం ద్వారా తెలియపరుస్తూ ఉండేది. నాగ డాక్టర్ గారి ఇంట సంతోషంగా ఉన్నందుకు, ఆరోగ్యం చక్కబడినందుకు అమ్మమ్మ కూడా సంతోషించింది.
ఈలోగా నాగకు నెలలు నిండి నొప్పులు మొదలయ్యాయి. డాక్టర్ గారు ఎవరికో ఆపరేషన్ చెయ్యాలని విజయనగరం వెళ్ళారు. సమయానికి హాస్పిటల్ కి ఎలా తీసుకువెళ్ళాలో తెలియక డాక్టర్ గారి భార్యలు, కోడలికి నెలలు నిండాయని సాయంగా వచ్చిన నాగ అత్తగారు కంగారు పడసాగారు.
ఇన్నాళ్ళు ఆ ఊరిలో ఉంచడానికి కారణమే ప్రసవ సమయానికి హాస్పిటల్ లో జాయిన్ చెయ్యాలని కదా! ఇప్పుడు అదే కుదరడం లేదు. మొత్తానికి ఆరోజు (ఆదివారం) రాత్రి ఒంటిగంట సమయంలో ఏకాదశి ఘడియల్లో, శతభిషా నక్షత్రంలో పెద్ద పెద్ద కళ్ళతో బొద్దుగా ఉన్న ఆడపిల్లకు డాక్టర్ గారి ఇంటి వద్దే జన్మనిచ్చింది నాగ. తొలికాన్పులో లక్ష్మీదేవి పుట్టిందని అందరూ చాలా సంతోషించారు.
ఆడవారు హమ్మయ్య అనుకుని, దేవుడికి దండం పెట్టుకున్నారు. వెంటనే డాక్టర్ గారి పెద్దబ్బాయి చేత రాముడువలస తాతయ్య పేరున టెలిగ్రామ్ ఇప్పించారు. తెలతెలవారుతుండగా డాక్టర్ గారు కూడా వచ్చి, సమయానికి తను లేకపోయినందుకు నొచ్చుకుని, నాగను, పాపను పరీక్షించి ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు.
మర్నాడు మధ్యాహ్నానికి పీసపాటి తాతయ్య, పెద్ద బావ వచ్చారు. వారు బయలుదేరే ముందే అమ్మమ్మకి విషయం తెలిపరుస్తూ రాముడువలస నుండే టెలిగ్రామ్ ఇచ్చారు. పీసపాటి తాతయ్య, పెద్దబావ కూడా పిల్లను చూసి చాలా సంతోషించారు.
టెలిగ్రామ్ అందుకున్న అమ్మమ్మ ఆనందానికి అవధులు లేవు. విషయం అందరికీ చెప్పి లాడూలు చేసి పంచింది. ఇక వరలక్ష్మమ్మ గారు, పెద్దన్నయ్య వాళ్ళ ఇంట్లో మిగతా సభ్యుల ఆనందానికి అంతే లేదు. మరి నాగ పుట్టింది అమ్మమ్మ కడుపునైనా పెరిగింది వారి ఇంటే కదా!
అమ్మమ్మ రాజేశ్వరమ్మ గారికి కూడా విషయం చెప్పి, తను చేసిన లడ్లు, కొన్ని పళ్ళు ఆవిడకి ఇచ్చి “మీరు పురుడు పోయగా పుట్టిన పిల్ల. ఇప్పుడు మరో ఆడపిల్లకి తల్లి అయింది. తల్లి, పిల్ల చల్లగా ఉండాలని దీవించండి” అని కోరుకుంది.
ఆవిడ కూడా మంచి మనసుతో అక్కడి నుండే నాగను ఆశీర్వదించారు.
నాగ పురుడు ఎలాగూ తమ ఇంట్లోనే అయింది కనుక, నాగకు తండ్రి లేరు కనుక, తల్లి చేసే పరిస్థితి కాదు కనుక, నాగ కూతురికి బారసాల కూడా తామే చేస్తామన్నారు డాక్టర్ గారు, వారి భార్యలు.
కానీ అందుకు పీసపాటి తాతయ్య ఒప్పుకోలేదు. తన పెద్ద కొడుకు తొలి సంతానం బారసాల బంధుమిత్రులందరినీ ఆహ్వానించి తమ ఇంట్లోనే ఘనంగా చెయ్యాలనుకుంటున్నామని ఖచ్చితంగా చెప్పేసారు.
అంతగా మీకు ముచ్చట తీరాలనుకుంటే మీరు మూడు రోజుల ముందుగానే రాముడువలస వచ్చి, ఫంక్షన్ అయిన రెండు రోజుల వరకు నాగతో ఉండమని చెప్పారు. వారు చేసేది లేక సరేనన్నారు. పేరున్న డాక్టర్ కనుక అన్ని రోజులు పేషెంట్స్ కి దూరంగా ఉండడం జరిగే పని కాదు.
పీసపాటి తాతయ్య రాముడువలస వచ్చి పురిటి మైల తీరాక, పంచాంగం చూసి ఇరవై ఒకటవ రోజున బారసాల చేద్దామని నిర్ణయించి, కుటుంబ పురోహితుడైన అవధాని గారికి కబురు చేసారు.
అవధాని గారు కలవరాయి అనే ఊరి కాపురస్తులు. వారు వచ్చాక విషయం చెప్పి బారసాల సంప్రదాయ బధ్ధంగా మీరే చేయించాలని చెప్పి, తాంబూలంలో కొంత డబ్బు పెట్టి ఇచ్చారు. వారు సరేనని ఇచ్చిన డబ్బు పుచ్చుకుని సంతోషంగా వెళ్ళారు.

******* సశేషం ********

1 thought on “అమ్మమ్మ – 15

Leave a Reply to మాలిక పత్రిక జులై 2020 సంచికకు స్వాగతం – మాలిక పత్రిక Cancel reply

Your email address will not be published. Required fields are marked *