March 28, 2024

అల

డా.తంగిరాల మీరాసుబ్రహ్మణ్యం

” అమ్మా! కమల ఆంటీ సిల్వర్ జుబిలీ పెళ్ళిరోజు వేడుకకి నాన్న వస్తున్నారా ” తను వేసుకున్న గులాబి రంగు గాగ్రా చోళీ ఒంటిమీద సరిగ్గా అమిరిందా అని అద్దం ముందు నిలబడి చూసుకుంటున్న అనుపమ అద్దంలో నుండే అమ్మను చూస్తూ అడిగింది.
” నాకెలా తెలుస్తుంది? నేను నా తమ్ముడి ఇంట్లో వున్నాను. మీ నాన్న ఎక్కడో తన ఇంట్లో వున్నాడు. పైగా కమల నాతో బాటు పనిచేస్తున్న నా స్నేహితురాలు. మీ నాన్న ఫ్రెండ్ కాదు. ” నగల పెట్టెలో నుండి మూడు పేటల ముత్యాల హారం తీసి మెడలో అలంకరించుకుంటున్న మానస కొంచం చిరాకుగా జవాబిచ్చింది.
అనుపమ ముఖం లో చిరునవ్వు స్థానంలో దిగులు తొంగిచూసింది.
” ఎందుకమ్మా ఈ మధ్యన నాన్న మాట తెస్తే చాలు అంత కటువుగా మాట్లాడుతావు?” అంటున్న అనుపమ మాటలు తుంచేస్తూ
” ఇపుడు ఈ చర్చ అవసరమా అనూ. అందరూ వచ్చేసి వుంటారు. పద వెడదాం.” సౌమ్యంగా మాట్లాడడానికి ప్రయత్నించింది మానస .
” అసలు నువ్వు ఇక్కడికి వచ్చి వుండడం దేనికి? అత్తయ్య ఇండియాకు వెళ్ళింది సరే. మావయ్య పిల్లలు చిన్నవాళ్ళు. నిజమే. వాళ్ళనే మన ఇంటికి తీసుకు వెళ్ళితే సరిపోయేది కదా. వారాంతం సెలవు కోసం ఎదురు చూసి, చూసి అమ్మా, నాన్నలతో గడపాలని వస్తే మీ ఇద్దరూ చెరో చోటా వున్నారు.అన్నయ్య చదివేది న్యుయార్క్ లో కనుక వాడిని ఏ ఆరునెలలకో చూడ్డం. ఇంటికి దగ్గరగా ఉంటూ మిమ్మల్ని వారం వారం చూడొచ్చు అనేకదా నేను కష్టపడి జార్జియా టెక్ యూనివర్సిటీ లో సీట్ తెచ్చుకుంది. ఇలా నాన్న లేకుండా మనం ఫంక్షన్ కు వెళ్ళడం నాకు అస్సలు బాగలేదు. “ బేలగా అంటూ, వచ్చి మానసను వెనుకవైపు నుండి రెండు చేతులతో చుట్టేసింది అనుపమ.
” అనూ ఈ విషయం మనం మళ్ళీ మాట్లాడుకుందాము. నా తల్లివి కదూ . పోదాం పద.” చెమ్మగిల్లిన తన కన్నులు కూతురు చూడకూడదని , ఆ చేతులు సున్నితంగా విడిపించుకుని ముందుకు నడిచింది మానస.
కారు పార్కింగ్ ఏరియా లో పెట్టి, వాళ్ళిద్దరూ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ హాలు లోపలికి అడుగు పెట్టే వేళకు వేడుక మొదలై పోయింది.
రజతోత్సవ పండుగ జరుపుకుంటున్న దంపతులను వేదిక మీదకి తీసుకెళ్ళిన స్నేహితులు చుట్టూ చేరి వాళ్ళిద్దరికీ పూల హారాలు అందించి దండలు మార్చుకోమని ప్రోత్సహిస్తున్నారు.
విశాలంగా వున్న ఆ హాలంతా రంగుల దీపాలు, పూల గుత్తులు, బెలూన్లతో శోభాయమానంగా అలంకరించి వుంది.
వేదికకు కుడివైపున పెద్ద తెర మీద పాతికేళ్ళ క్రిందట జరిగిన కమల, కోదండరాం ల పెళ్ళి విడియో నడుస్తోంది. మరొక వైపు ఇరవై ఏళ్ళలోపు అబ్బాయిలు,అమ్మాయిలు హిందీ సినిమా పాటలకు హుషారుగా నాట్యం చేస్తున్నారు.
అది చూడగానే అనుపమ అటు పరుగు తీసింది.
ఆడవాళ్ళంతా ,పెద్దవాళ్ళు చీరలలోను, చిన్న వాళ్లు పరికిణీ వోణీలు, గాగ్రా చోళీలు ధరించి మెరిసి పోతున్నారు. కూతుళ్ళతో కొడుకులతో వచ్చిన ముసలి తలిదండ్రులకు తాము అమెరికాలో అట్లాంటా లో వున్నామా ఆంద్ర ప్రదేశ్ లో విజయవాడలో వున్నామా అని సందేహం కలిగేలా వుంది అక్కడి వాతావరణం.
మానస వేదిక మీద వున్న స్నేహితులతో కలవడానికి అటు దారి తీసింది.
పాతికేళ్ళ దాంపత్య జీవితం గడిపిన జంట ముసిముసి నవ్వులతో దండలు మార్చుకున్నాక మెల్లిగా తప్పించుకుని వేదిక దిగి రాబోతుంటే ” పేర్లు చెప్పి మరీ వెళ్ళండి అంటూ ఆపేసారు. ” నేనూ నా భార్య కమల” అంటూ అతను, నేను మా వారు కోదండరాం” అని ఆమె చెప్పాక దారి వదిలారు.
మానస మరో ఇద్దరితో కలిసి వెళ్ళి తెర వెనుక దాచి వుంచిన చిన్న బిందెను తీసుకువచ్చి కుర్చీలలో కూర్చున్న కమల కోదండరాం ముందు వున్న బల్ల మీద పెట్టింది.
” ఇదిగో మీకు మా బహుమతిగా ఈ వుంగరం ఇస్తున్నాము. మీ ఇద్దరిలో ఎవరు గెలుచుకుంటారో” అంటూ రంగు రంగుల పూవులతో అందంగా అలంకరించివున్న ఆ బిందెలోకి వుంగరాన్ని వేసింది కమల టీం లీడర్ సుధ.
ఈ సంబరంలో ఉత్సాహంగా పాలుపంచుకుంటున్న మానస కళ్ళు అప్పుడప్పుడు గుమ్మం వైపుకు చూస్తున్నాయి ఎవరి రాక కోసమో ఎదురు చూస్తున్నట్టు.
“కజరారే “ అంటూ హోరెత్తిస్తున్న హిందీ సినిమా పాటకు హుషారుగా అడుగులు వేస్తున్న అనుపమ కూడా అప్పుడప్పుడు గుమ్మం వైపు చూస్తూనే వుంది.
ఇద్దరు స్నేహితులతో కలిసి లోపలికి వస్తున్న మధుకర్ ని చూడగానే అటు పరుగెత్తింది అనుపమ.
మధుకర్ ముఖంలో ఎప్పుడు కనబడే ప్రసన్నత స్థానంలో ఏదో దిగులు తొంగి చూస్తోంది. కాస్త చాయ తగ్గి, వడలిపోయి వున్నాడు. పదిహేను రోజుల తరువాత అతన్ని చూస్తున్న మానస మనసులో ముల్లు గుచ్చుకున్న బాధ. నాన్న , కూతురు కలిసి ఇటే వస్తుండడం చూసి మెల్లిగా పక్కకు తప్పుకుంది మానస.
వివాహ రజతోత్సవ వేడుక జరుపుకుంటున్న జంటకు శుభాకాంక్షలు తెలిపి, పూల గుచ్చం అందించాక మానస కోసం చూట్టూ చూసాడు మధుకర్.
” అదిగో అక్కడ వుంది అమ్మ” అంటూ తండ్రిని చేయి పట్టుకుని అటు లాక్కు వెళ్ళింది అనుపమ.
” ఈ చీర లో చాలా బాగున్నావు మనూ.ఇంతకీ మీ మరదలు ఎప్పుడు వస్తూంది? వాళ్ళ అమ్మ హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చేసారు కదా .” భార్య చేతిని తన చేతిలోకి తీసుకుని అన్నాడు మధుకర్.సున్నితంగా చెయ్యి విడిపించుకుంది మానస.
అమ్మనీ, నాన్ననూ మురిపంగా చూస్తూ” నాన్నా వచ్చే సంవత్సరమే కదూ మీ వెడ్డింగ్ సిల్వర్ జుబిలీ? ఇంతకన్నా గొప్పగా జరిపిస్తాం నేను అన్నయ్య కలిసి. వేచి చూడండి ” ఇద్దరిని చెరో చేత్తో చుట్టేసి ఉత్సాహంగా అంది అనుపమ.
మధుకర్ మానస కళ్ళలోకి చూసాడు.
మానస అతని చూపులతో తన చూపులు కలపకుండా మరోవైపుకు చూసి ” అదిగో గీత వచ్చింది. మాట్లాడి వస్తా. మీరు భోజనం చేసేయండి. నేను వాళ్ళతో తింటాను.” అంటూ కూతురు చేతిని తప్పించి అటు నడిచింది.
ఎగసి వస్తున్న నిట్టూర్పు ప్రయత్నం మీద ఆపుకున్నాడు మధుకర్.
మానస, అనుపమ పార్టీ నుండి ఇంటికి రాగానే కొత్త కబురు చెప్పాడు మానస తమ్ముడు శివ.
” అక్కా! పెద్దన్నయ్య ఫోన్ చేసాడు. ఈ నెలాఖరున నాన్నగారి సహస్రచంద్ర దర్శనం పూర్తి అయిన సందర్భంలో మూడురోజులు విశేష పూజలు, హోమాలు, పుర్ణాహుతి పెట్టుకున్నారట. మనం ఎలాగో వీలు చేసుకుని వెడితే నాన్నగారికి సంతోషంగా వుంటుంది అన్నాడు.”
“వావ్ నాకు అప్పుడు వెకేషన్ వుంది. నేనూ ఇండియాకు వస్తాను మామయ్యా ” ఉత్సాహంగా అంది అనుపమ.
“ రేపు బావతో మాట్లాడి టికెట్స్ బుక్ చేద్దాము అక్కా. వసు ఎలాగు ఇండియాలోనే వుంది. పిల్లలకు సెలవులు గనుక వాళ్ళనూ తీసుకు వెళ్ళితే బావుంటుంది. ఇటువంటి ఫంక్షన్ పిల్లలు తప్పక చూడాలి”. శివ అప్పుడే ప్రయాణం గురించి ప్రణాళిక వేసేస్తూ అన్నాడు.
” మీ బావ రాలేడు అనుకుంటాను శివా. పైగా మనం పదిరోజుల ముందే వెళ్ళాలి కదా.” ఏమాత్రం ఉత్సాహం చూపించకండా అనేసి తన గదిలోకి నడిచింది మానస.
ఇండియా ప్రయాణం అంటే ఎంతో సంబరపడే అమ్మ నిరుత్సాహమైన స్పందన చూసి ఇదేమిటి? అన్నట్టు మామయ్య వైపు చూసింది అనుపమ.
శివాకు ఆశ్చర్యంగానే వుంది. మానస ఇక్కడకు వచ్చినప్పటినుండి స్తబ్ధంగా వుండడం గమనిస్తూనే వున్నాడు. ఆమె ఇక్కడకు వచ్చాక ఈ పదిహేను రోజుల్లో మధుకర్ ఇక్కడకు రావడం గానీ మానస అటు వెళ్ళడం గానీ జరుగలేదు. అక్క ఇంటికి తన ఇంటికీ మధ్యన నలభై మైళ్ళే. కారులో ముప్పావు గంట ప్రయాణం.
సాలోచనగా తన గదివైపు దారి తీసాడు శివ.
మానస ఊహించినట్టే మధుకర్ ” నాకు వీలయితే ఆ రోజుకు రావడానికి ప్రయత్నిస్తాని శివా” అనేసాడు.
మధుకర్ ఆఫీస్ కు వెళ్ళిన సమయంలో ఇంటికి వెళ్ళి తనవి, అనుపమవి బట్టలు సర్దుకుని తెచ్చుకుంది మానస.
వాళ్ళు బయలుదేరే రోజు ఎయిర్ పోర్ట్ కి వచ్చిన మధుకర్ తో ముభావంగా వుండిపోయింది మానస.
శంషాబాద్ లో దిగాక,శివ అక్కను, అనుపమను విజయవాడ విమానం ఎక్కించి, తను హైదరాబాద్ వెళ్ళాడు ఆపరేషన్ అయి, కోలుకుంటున్న అత్తగారిని మాట్లాడించి, భార్యను తీసుకు రావడానికి.
విజయవాడలో ఇంటికి చేరాక అమ్మమ్మ తాతయ్యల పాదాలకు నమస్కారం చేసింది అనుపమ. అక్కా చెళ్ళెళ్ళు, అన్నదమ్ములు,పిల్లల సందడిలో అమ్మ ముఖంలో మళ్ళీ సంతోషం చూసింది అనుపమ .
తాము క్షేమంగా చేరినట్టు నాన్నకు ఫోన్ చేసి చెప్పింది అనుపమ. ” అమ్మా! నాన్న లైన్ లో వున్నారు” అని ఫోన్ అందివ్వబోతే “ మళ్ళీ మాట్లాడుతాలే” అని వెళ్ళిపోయింది మానస.
ఆ మాటలు విన్న మధుకర్ “పనిలో వుందేమో!తరువాత ఫోన్ చేస్తాలేమ్మా” అని పెట్టేసాడు.
అనుపమకు ఎదో తెలియని భయం కలిగింది. “ ఏం జరుగుతోంది? ఎందుకు అమ్మా నాన్నా పరాయివాళ్ళ లాగా వుంటున్నారు? తెలుసుకోవడం ఎలా?” అనే బెంగ మొదలయ్యింది.
పురోహితులను, వంటవాళ్ళను ఏర్పాటు చేయడం, కావలసిన సరకులు తెప్పించడం, అందరికీ కొత్త బట్టలు కొనడం, స్నేహితులను, బంధువులను పిలవడం వంటి పనులు చకచక జరిగిపోయాయి. ఇంటిముందు పందిరి వేయడం ,మామిడి తోరణాలు కట్టడం కూడా అయ్యింది.
రోజు కొకరుగా దిగుతున్న చిన్నాన్నలు, అత్తయ్యలు వారి పిల్లలకు అవసరమైన ఏర్పాట్లు చూస్తూ బొంగరంలా తిరుగుతోంది మానస. ఇంటికి పెళ్ళికళ వచ్చింది గానీ మానస ముఖంలో కళ లేదు.
” మీ ఆయన ఎప్పుడు వస్తాడే? అన్నయ్య ఫోన్ చేస్తే చూస్తాను అన్నాట్ట.నువ్వు గట్టిగా చెప్పలేదూ రావాల్సిందే అని?” రొక్కించి అడుగుతున్న పెద్దక్కకి జవాబు చెప్పలేనట్టు లోపలికి వెళ్ళిపోయింది మానస.
ఆ రోజు రాత్రి అమ్మ కోసం వచ్చిన అనుపమకు చిన్నగా అమ్మ వెక్కిళ్ళు వినిపించాయి. చప్పుడు చేయకుండా చీకటిగా వున్న గదిలోకి ప్రవేశించింది.
” పాతికేళ్ళ నా నమ్మకాన్ని మధు వమ్ము చేసాడు అక్కా. ఎంతో ఇష్టపడి ఏడాది ప్రేమించుకుని పెళ్ళి చేసుకున్నాము. ఇరవై నాలుగేళ్ళ వైవాహిక జీవితం ఆనందంగా గడిపాము. ఈ వయసులో అతను మరొక స్త్రీతో…దుఖంతో అవమాన భారంతో మానస గొంతు పూడుకు పోయింది.
ఆ మాటలు విన్న అనుపమ కాళ్ళు వణికాయి. చీకటిలో గోడకు అతుక్కుపోయింది.
” నువ్వు అపార్థంచేసుకున్నావేమో మనూ. మధుకర్ కి నువ్వంటే ప్రాణం.” పెద్దమ్మ గొంతు పలికింది.
” పోయిన నెల మధు కంపెనీ పని మీద ఆస్త్రేలియా వెళ్ళాడు అక్కా. అతను తిరిగి వచ్చాక అతని ఫోన్ కి వచ్చిన మెసేజ్ అనుకోకండా నా కంట పడింది.
“ఏముంది అందులో.”
“మీతో ఒక రాత్రి సాన్నిహిత్యం నా అదృష్టం. ఆ మత్తులో మీరు నన్ను మనూ అంటూ పిలిచారు.మనూ ఎవరు మీ భార్యనా?” అని.” మానస ఏడుస్తోంది.
మధుని నిలదియ్యాల్సింది” పెద్దమ్మ గొంతు.
“ అడిగాను.నన్ను చాలా మిస్ అయ్యాడట. ఆఖరి రోజు పార్టీలో ఎక్కువ తాగాడట. పదిహేను రోజులు తన అసిస్టెంట్ గా పనిచేసిన లిండా అనే ఆమె తనను తన గదికి తీసుకువెళ్ళిందట.తరువాత ఏం జరిగిందో తెలియదు అని చాలా బాధపడి కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు . ఇంక అతనితో కలిసి వుండలేనని చెప్పేసాను అక్కా.” మానస ఏడుస్తోంది.
అనుపమకు మోయలేని భారమేదో తనని భూమిలోకి తొక్కేస్తున్నట్టు ఊపిరి ఆడలేదు.నోటి మీద చేయి నొక్కి పట్టుకుని, ఎలాగో గది బయటకు వచ్చింది.
మరునాడు ఉదయాన్నే తొమ్మిది మంది బ్రాహ్మణులు వచ్చేసారు. విశాలమైన ముందు గదిలో ఇరవై ఒక్క కలశాలు పెట్టి ప్రాణ ప్రతిష్ట చేసారు. ముందుగా గణపతి హోమం, ఆపైన నవగ్రహ పూజ చేసి, గ్రహ శాంతికై జపం మొదలుపెట్టారు.
వంట ఇంటి వాసనలు నోరూరిస్తున్నాయి.
ఆలస్యంగా నిద్ర లేచిన అనుపమ, మానస వంటవాళ్ళతో మాట్లాడుతుంటే దగ్గరగా వచ్చి అమ్మను కౌగలించుకుంది.
“చిన్న పిల్లలా ఏమిటిది? అక్కడ వచ్చిన వాళ్ళకు ఏమి కావాలో వెళ్ళి చూడు.” కూతురు చెంపలు నిమిరి అంది మానస.
” నాకెవ్వరూవద్దు. నువ్వే కావాలి.” అమ్మ కళ్ళలోకి చూస్తూ అంది అనుపమ.
తన కళ్ళలాగే ఎర్రబడి వున్న కూతురి కళ్ళు చూసి మానస గుండె ఝల్లు మంది.
“ఈ పిల్ల తమ మాటలు వినలేదు కద?” భయం తో చెమట పట్టింది.
” ఇక్కడ వేడిగా వుంది పద.”అంటూ పూజ జరుగుతున్న గదిలోకి నడిచింది.
తలంటి పోసుకుని పట్టు బట్టలు కట్టుకుని ముఖాన కుంకుమ బొట్టుతో పీటల మీద కూర్చున్న అమ్మమ్మ, తాతయ్యలను చూసిన అనుపమకు ఆనందమో దుఖమో తెలియని స్థితిలో కళ్ళలో నీరు నిండింది.
” నువ్వు మీ అమ్మా నాన్నలకు ఈ సహస్ర చంద్ర దర్శనం పండుగ జరిపిస్తున్నట్టే నేను ,అన్నయ్య, మా పిల్లలు నీకు,నాన్నకు అమెరికాలో ఈ వేడుక చేస్తాము కదమ్మా? ఆర్తిగా అమ్మ వైపు చూస్తూ అడిగింది అనుపమ.
వులికిపడి కూతురు ముఖంలోకి చూసింది మానస.
వేడుకకై వచ్చిన ఆత్మీయులు పండుటాకుల వంటి ఆ దంపతులకు ప్రేమతొ, భక్తితో పట్టు చీర ,పంచలు , కానుకలు చదివిస్తున్నారు.
అనుపమ లాగే మానస పెద్దక్క కళ్ళు కూడా మానస మీదే వున్నాయి.
ఆరోజు రాత్రి అందరూ భోజనాలు ముగించి నిద్రకు పడే వేళకు ఆలస్యం అయ్యింది. ” మీ గుంపు పిల్లలు ఇంకా మేలుకుంటారేమో అంత్యాక్షరి అదీ ఇదీ అంటూ . నేను పడుకుంటున్నా” అని అనుపమకు చెప్పి మేడ ఎక్కింది మానస. అలాగేనంటూ తల ఊపిన అనుపమ పావుగంట తరువాత చప్పుడు చేయకుండా మేడమీది గదిలోకి వెళ్ళింది.
” పెద్దవాడు కాస్త అర్థం చేసుకోగలడు గానీ అను చాలా సున్నితం. తనకు ఎలా నచ్చచెప్పాలో. మొన్న మా స్నేహితురాలి వివాహ రజితోత్సవ వేడుక చూసి అను వచ్చే ఏడు తన అమ్మ నాన్నలకు అలా జరపాలని ముచ్చట పడుతోంది.అది జరగని పని అని ఎలా చెప్పను అక్కా?” మానస గొంతులో దుఖ్ఖపు జీర.
” మధుని క్షమించగలవేమో ప్రయత్నం అయినా చేయకుండా తొందరపాటు నిర్ణయం వద్దు మనూ. మీరు విడిపోవడం అనేది కేవలం మీ ఇద్దరి జీవితాలకు సంబంధించిన విషయం కాదు. పిల్లల భవిష్యత్తు ,వాళ్ళ మానసిక భావోద్వేగాలు,వాళ్ళ వైవాహిక జీవితాల మీద నీ నిర్ణయం ప్రభావం ఇలా ఎన్నో ఆలోచించాలి. నువ్వు బాధలో, ఆవేశంలో వేసిన అడుగు ఒక్క నీ పిల్లల జీవితాలనే కాదు నీ పుట్టింటి , మెట్టినింటివాళ్ళను కూడా చేదుగా తాకుతుంది.” పెద్దక్క మాటలకు బదులు పలుకలేదు మానస.
” ఇంత ప్రపంచం చూసినదానివి నీకు తెలియదని కాదు. వ్యక్తి కుటుంబం కోసం,కుటుంబ సమాజం కోసం సమాజం దేశం కోసం, దేశం విశ్వ శ్రేయస్సు కోసం కొంత స్వార్థాన్ని వదులుకోవాలంటారు. నీది స్వార్థం కాదు స్వాభిమానం అంటావు. నిజమే. అయినా అది నీకు మాత్రమే సంబంధించినది. నువ్వెంతో ప్రేమించే నీ వాళ్ళకోసం కాస్త క్షమను చూపలేవా?
” నేను ఈ తప్పు చేసి వుంటే మధు క్షమిస్తాడా అక్కా?” మానస ఆవేశపడింది.
“జీవితం వాదనలకు నిలబడదు మనూ. నిర్ణయం తీసుకునే ముందు పరిణామాలేమిటో ఆలోచించు. ఒక బలహీన క్షణంలో మధు తప్పు చేసి వుండవచ్చు.కానీ ఆ క్షణాన అతని మనసులో నువ్వే వున్నావని ఆ మెసేజ్ ద్వారా తెలియడం లేదూ?”
“మీ ఇద్దరూ మీ జీవితాలను మళ్ళీ నిర్మించుకోవచ్చు. కానీ పిల్లలు? వాళ్ళకు కలిగే నష్టం పూడ్చలేనిది కదా. నిదానంగా ఆలోచించి అడుగు ముందుకు వేయి. స్త్రీ క్షమకు ప్రతిరూపం కనుకనే క్షమయా ధరిత్రీ” అన్నారు. నిర్ణయం నీదే.”
పెద్దమ్మ మాటలు విన్న అనుపమకు ఆమెను గట్టిగా కౌగలించుకోవాలని అనిపించింది. నెమ్మదిగా గదిలో నుండి బయటకు వచ్చేసింది .
మరునాడు ఉదయం ఆరింటికే వచ్చి ఏకాదశ రుద్రాభిషేకం మొదలు పెట్టారు విప్రులు. మధ్యాహ్నానికి పూజ ముగిసింది. భోజనాలకు ఆకులు వేస్తుండగ లోపలికి వచ్చాడు మధుకర్.
మానస ముఖంలో సంభ్రమాశ్చర్యాలు గమనిస్తూ అత్తగారికి, మామగారికి పాద నమస్కారం చేసాడు. బావమరదులను ఆప్యాయంగా పలుకరించాడు
“నాన్నా అంటూ తండ్రిని అల్లుకుపోయిన అనుపమ కళ్ళలో తడి చూసి మానస మనసు కరిగి నీరయ్యింది.
శిక్ష కోసం ఎదురు చూస్తున్న అపరాధిలా మానస వైపు ఆర్తిగా చూస్తున్నాడు మధుకర్.
మౌనంగా లోపలికి వెళ్ళిపోయింది మానస. అంతా గమనిస్తున్న పెద్దక్క ముందుకు వచ్చింది.
ఇంతలో వచ్చిన మానస, తను తెచ్చిన తువాలు మధుకర్ కి అందించి ” స్నానం చేద్దురు పదండి. భోజనానికి వేళవుతోంది.” అంటూ అతని చేయి పట్టుకుని లోపలికి తీసుకు వెళ్ళింది.
మెరుస్తున్న కళ్ళతో అనుపమ పెద్దమ్మ వైపు చూసింది. పెద్దక్క కళ్ళలో అక్షింతలు రాలుతున్నట్టు ఆనంద భాష్పాలు.
మరుసటి రోజు సత్యనారాణ వ్రతం, తరువాత పుర్ణాహుతి ముగిసాక పార్వతీ పరమేశ్వరుల వంటి ముసలి దంపతులను జంటగా కూర్చోబెట్టి వెండి జల్లెడ వారి తలపైన పట్టుకుని నీళ్ళు ఆ జల్లేడకుండా వారితలపై పడేలా పోసి అవభ్రుత స్నానం చేయించారు పురోహితులు.
ఈ కార్యక్రమం చూడడమే శుభకరం అన్న నమ్మకంతో కనుల పండుగగా చూస్తున్నారు బంధు మిత్రులు.
“నాన్న, అమ్మ తమ కడుపున పుట్టిన నలుగురు పిల్లలతో ,నాన్నకు చెళ్ళెళ్ళ బాధ్యతలతో ఇన్నేళ్ళు ఈ సంసార సాగరం లో ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కున్నారో! అలల తాకిడికి కొట్టుకుపోకండా నిలదొక్కుకుని ఇంతదాకా నడిచారు.సంసార సముద్రంలో అలల తాకిడిని తట్టుకుని నిలబడడానికి ఒకరికొకరు తోడుగా ప్రయత్నం చేస్తూనే వుండాలి మనూ.” పెద్దక్క మంద్ర స్వరంతో మను చెవిలో అంది.
మానస అక్క అరచేతిని మెత్తగా నొక్కింది.
“నాన్నా ! మీ ఇద్దరికీ కూడా ఇలాటి పండుగ జరిపిస్తాము.” అంటూ తండ్రి భుజం మీద తలవాల్చింది అనుపమ.
మధుకర్ మానస కనులలోకి చూసాడు. ఆమె చూపులలో తప్పు చేసిన బిడ్డని దండించి, దగ్గరకు తీసుకున్న తల్లి కనులలోని దయ.
“అలాగే చేద్దువుగానీ ముందు అతిధుల సంగతి చూద్దాం పద” పెద్దక్క చేయి పట్టుకుని ముందుకు నడిచింది మానస.
——————. —————— ———

2 thoughts on “అల

  1. కథ చాలా బావుంది సున్నితమైన అంశం, మనోవేదనను చాలా చక్కగా వ్యక్త పరిచారు. భావాలు చాలా అందంగా పరిణితి తో వెల్లడి చేశారు.

Leave a Reply to Ravi vadra Cancel reply

Your email address will not be published. Required fields are marked *