April 19, 2024

జానపదబ్రహ్మ బి.విఠలాచార్య

రచన: శారదాప్రసాద్

‘జురాసిక్ పార్క్’లో రాక్షస బల్లుల్ని చూసి స్పీల్‌బర్గ్‌ ని బ్రహ్మాండంగా మెచ్చుకున్నాం! వాళ్లకు హైటెక్ కెమెరాలు, అడ్వాన్స్ గ్రాఫిక్సులున్నాయ్!మిలియన్ డాలర్ల డబ్బులున్నాయి ! విఠలాచార్య దగ్గర ఇవేవీ లేవు. ఆయన దగ్గర ఉందల్లా ఓ మిఛెల్ కెమెరా,మూణ్ణాలుగు లక్షల బడ్జెట్టు మాత్రమే ! వీటితోనే వెండితెరపై పరకాయ ప్రవేశాలు… గుర్రపు స్వారీలు… కత్తి ఫైటింగులు… వింత పక్షులు, జంతువులు… పుర్రెలు, అస్థిపంజరాలు… సృష్టించాడు. బి.విఠలాచార్య ‘జానపద బ్రహ్మ’ అని పేరు పొందిన తెలుగు సినిమా దర్శకులు మరియు నిర్మాత. తెలుగు, తమిళ, కన్నడ బాషలలో 70 చిత్రాలను రూపొందించిన ఈయన 1920 జనవరి 28 న కర్ణాటకలో ఉడిపిలో జన్మించారు.మొదట్లో ఆయన ఒక ఉడిపి హోటల్ నడిపారు . ఆ హోటల్లో అల్పాహారం తీసుకుంటే, ఇక భోంచేయనవసరం లేదు. ఆయనది ఉడిపి పక్కనున్న బెల్లి అనే పల్లెటూరు.
విఠలాచార్యకు చదువు అబ్బలేదు కానీ, లోకజ్ఞానం ఎక్కువ .ఓ పక్క హోటల్ బిజినెస్‌లోఉంటూనే,మరో పక్క నాటకాల్లో వేషాలు వేసేవాడు. ఆ ఊళ్లోనే బ్రూక్ బాండ్ ఏజెన్సీ నడిపే శంకర్‌సింగ్, విఠలాచార్యకు మంచి దోస్త్. శంకర్‌సింగ్‌ కి సినిమా ఫీల్డ్‌తో టచ్ ఉంది. శంకర్‌సింగ్, విఠలాచార్య ఇంకొంతమంది కలిసి మైసూర్‌లో రెండు టూరింగ్ టాకీసులు అద్దెకు తీసుకున్నారు.టూరింగ్ టాకీస్ వ్యాపారంలో లాభాలు రావడంతో వీరి దృష్టి సినిమా రంగం మీద పడింది. కొంతకాలం సర్కస్ కంపెనీలో జంతువుల ఆలనా పాలనా చూశారు.ఆయన ఎన్నో జానపద చిత్రాలకు అద్భుతమైన దర్శకత్వం వహించారు.వాళ్లు తీసిన ‘నాగ న్నిగె’ సినిమా కాసుల వర్షం కురిపించింది. అప్పటి పరిమితమైన సాంకేతిక పరిజ్ఙానముతో ఆయన చూపించిన ప్రతిభ అసామాన్యమైనది.చాలా కొద్ది ఖర్చుతో ఆయన కనులకింపైన జానపద కళా ఖండాలను రూపొందించారు.
1942 లో చిత్రరంగ ప్రవేశము చేసిన ఈయన నిర్మాతగా డి.శంకర్ సింగ్ తో కలిసి దాదాపు 18 చిత్రాలను తమ మహాత్మా పిక్చర్స్ పతాకముపై నిర్మించారు. వీటిలో సాంఘీక చిత్రాలే అధికము.విఠలాచార్యకు జాతకాలంటే బాగా నమ్మకం! తన జాతకంలో పరభాషలో సినిమాలు చేస్తేనే ఫలితం అని రాసిపెట్టి ఉంది. దాంతో తన మకాం మొత్తం మద్రాసుకు మార్చేశారు. ఆ తరువాత తొలిసారిగా తెలుగులో 1953లో షావుకారు జానకి ప్రధాన పాత్ర పోషించిన కన్యాదానం చిత్రానికి దర్శకత్వము వహించాడు. కాంతారావు, రాజనాలతో తీసిన ‘జయ విజయ’ బాగా ఆడింది. క్రమంగా తెలుగులో నిర్మాతగా, దర్శకునిగా కూడా రాణించి అనేక జానపద చిత్రాలను తీశాడు. జనాలు విఠలాచార్య సినిమా అంటే విరగబడి చూశారు. విఠలాచార్యకు ఎన్టీఆర్ ప్రభంజనం తోడయింది .అప్పటికే ఎన్టీఆర్‌ కున్న మాస్ ఇమేజ్‌ని విఠలాచార్య మరింత ముందుకు తీసుకెళ్ళాడు . రకరకాల మారువేషాలు, ఒళ్లు గగుర్పొడిచే పోరాటాలు … మాస్ జనానికి పండగే .ఈయన దర్శకత్వము వహించిన చిత్రాలలో 16 చిత్రాలు నందమూరి తారక రామారావు నటించినవే అందులో 5 చిత్రాలను విఠలాచార్యే స్వయంగా నిర్మించాడు. వీరిద్దరూ కలిసి చేసిన తొలి సినిమా ‘బందిపోటు’ ఘన విజయాన్నిచవిచూసింది . ఆ తర్వాత అగ్గిపిడుగు’. ఇద్దరు ఎన్టీఆర్లతో ప్రేక్షకులను రంజింప చేసారు! ‘మంగమ్మశపథం’లో ఎన్టీఆర్‌ తో తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేయించారు.
కాంతారావుతో కూడా విఠలాచార్య ఎక్కువ సినిమాలు చేశారు. కాంతారావుకు కూడా మాస్ ఫాలోయింగ్ వచ్చింది ఆ సినిమాలతోనే.శృంగార నర్తకి జయమాలినితో ‘జగన్మోహిని’ తీసాడు, నరసింహరాజు హీరో. ‘జగన్మోహిని’ బాగా హిట్టయింది . ఇదే ఆయన ఆఖరి సూపర్ హిట్. 33 ఏళ్ల కెరీర్‌లో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 60కు పైగా సినిమాలు చేశారు. వీటిల్లో తెలుగు సినిమాలే సుమారు 40 వరకూ ఉన్నాయి. కాశీమజిలీ కథలు, అరేబియన్ నైట్స్, కాశ్మీర రాజకుమార కథలు, చైనీస్ ఫోక్ స్టోరీస్, రష్యన్ ఫోక్ టేల్స్… ఇలాంటివన్నీ వంటపట్టించుకున్న ఆయన రకరకాల కథలు సృష్టించేవాడు. ‘చందమామ’ పుట్టుక దగ్గరనుంచీ కన్నడ, తెలుగు ప్రతులన్నీ బైండ్ చేయించి పెట్టుకున్నాడు. వాటిల్లోని బొమ్మలతోటే పాత్రల మీసాలు, విగ్గులు, దుస్తులు చేయించేవాడు. ఒక ప్రముఖ హీరో కాల్షీట్ ఇచ్చి షూటింగ్‌కి రాలేదు.ఇంకొకరైతే కంగారుపడిపోయి షూటింగ్ రద్దు చేసుకునేవారు . విఠలాచార్య మాత్రం తాపీగా ఆ సీన్ మార్చేసి హీరో పాత్రకు ముని శాపం ఇస్తే, పక్షిగా మారిపోయినట్టుగా షాట్ తీసారు. కెమెరామాన్‌ని మాత్రం గట్టివాణ్ణే తీసుకునేవారు. ఎందుకంటే ఆయన సినిమాల్లో ట్రిక్‌వర్క్ ఎక్కువ. రవికాంత్ నగాయిచ్, హెచ్.ఎస్. వేణు లాంటి ఛాయాగ్రాహకులు విఠలాచార్య సినిమాలతోనే బాగా పాపులరయ్యారు. విజయావారు తీసిన గుండమ్మ కథకు మూలం విఠలాచార్య తీసిన కన్నడ సినిమా ‘మనే తుంబెద హెణ్ణు’. గుండమ్మ అనే పేరు కన్నడ దేశంలోని పేరు.
ఆయనది చాలా పెద్ద కుటుంబం. నలుగురు మగపిల్లలు, నలుగురు ఆడపిల్లలు, పెద్దబ్బాయి బి.వి. శ్రీనివాస్‌ని ‘అగ్గిదొర’తో దర్శకునిగా పరిచయం చేశారు. అగ్గివీరుడు, నిన్నే పెళ్లాడుతా, రైతే రాజు సినిమాలు డెరైక్ట్ చేసిన బీవీ శ్రీనివాస్ పెద్దగా రాణించలేదు .ఇంకో అబ్బాయి రాజన్ కూడా ఓ సినిమాకు దర్శకత్వం చేశారు గానీ, గుర్తింపు రాలేదు.చాలా మంది పిల్లలు విదేశాల్లో స్ధిరపడ్డారు. ‘ట్రిక్‌వర్క్‌’ ఆయన చిత్రాలకు ప్రాణం .‘లాజిక్‌’ అక్కర్లేదు,‘అదెందుకు జరిగింది?’అని అడగడానికి లేదు. ‘ఏమీ అక్కర్లేదు. ప్రేక్షకుల్ని ఆహ్లాదపరచడమే ముఖ్యం.ఇది ‘కమర్షియల్‌ ఆర్ట్‌’ అనబడే సినిమా. మన ప్రేక్షకులు క్లాస్‌ సినిమాలు చూడరు. మాస్‌ చిత్రాలు అనబడేవాడినే ఎక్కువగా చూస్తారు. అందుకే అవే ఎక్కువగా తీశాను. ‘తక్కువ ఖర్చు పెట్టి, ఎక్కువ లాభం పొందాలి’ అన్న సూత్రం కూడా నమ్ముకున్నాను’ అని విఠాలాచార్య చెప్పేవారు.సినిమా నిర్మాణంలో ‘పొదుపు’ ఎలా చెయ్యాలి? అన్న దారి చూపించిన వ్యక్తి కూడా ఆయనే. ఒకే పెద్ద మందిరం సెట్టు వేస్తే, దాన్నే రకరకాల సెట్లుగా మార్చేవారు ఆయన. అంత:పురం రాజుగారి రహస్యమందిరం, విలన్‌ ఇల్లూ, ఇంకొక రాజుగారి ఇల్లూ – అన్నీ ఒకే ఒక సెట్లో ఇమిడిపోయేవి.
సామాన్య జనానికీ, సినిమా చూట్టంలో లీనమైపోయే ప్రేక్షకులకీ ఈ తేడాలు అక్కర్లేదని విఠలాచార్య విశ్వసించేవారు. అలాగే కాస్ట్యూమ్స్‌, ఆభరణాలూ, ప్రతి సినిమాకీ మార్చవలసిన అవసరం లేదు ముఖ్యపాత్రకి తప్ప. సినిమా ఆరంభించకముందే – విడుదల తేదీ ఇవ్వడం ఆయనకే చెల్లింది!విఠల్ సంస్థలో పని చేసిన చాలా మంది ఆ తరువాత కాలంలో ఉచ్చస్థితికి చేరుకున్నారు. దర్శకులు ఎస్.డి.లాల్, వైకుంఠరామశర్మ, సిద్ధలింగయ్య, ఎడిటర్ మోహన్, మేకప్‌మేన్ ఏఎమ్ రత్నం లాంటి వాళ్లు ఆ సంస్థలో పని చేసిన వారే.విఠలాచార్యకు జ్యోతిష్యం మీద మంచి పట్టుంది. ‘‘అశ్వనీ నక్షత్రం రెండోపాదం, మేషరాశి, మూడోసారి ఏలిననాటి శని ప్రవేశించి జన్మ శని జరుగుతుండగా విఠలాచార్య అనే నేను చనిపోతాను’’ అని తన డైరీలో రాశారు. 1999 మే 28న అదే జరిగింది.జానపదబ్రహ్మ 1999, మే 28 న 80 యేళ్ల వయసులో మద్రాసులోని తన స్వగృహములో కన్నుమూశారు.
విజయం అనేది విజ్ఞానశాస్త్రం లాంటిది. మనకంటూ కొన్ని సూత్రాలు ఉంటే ఫలితం వస్తుంది!

5 thoughts on “జానపదబ్రహ్మ బి.విఠలాచార్య

  1. నిజంగా విఠలాచార్య అద్భతమయిన సృష్టి కర్త
    దర్శకుడు. అప్పట్లో ఆయన తీసి న సినిమా లు
    తర్వాత కాలంలో వేరే వాళ్ళు తీయటానికి
    కోట్లలో ధనం అవసరమైంది.అయినా,ఆయన సినీ మా ల అనుభూతి ఇవ్వలేదు.
    ఓ గొప్ప వ్యక్తి ని గుర్తు చేసి నందుకు
    ధన్యవాదములు

  2. “జానపదబ్రహ్మ బి.విఠలాచార్య” గారి గురించి సరస్వతి పుత్రుడు ఎన్నో విషయాలు తెలియ చేశారు . నిజమే తెలుగు వారు మెచ్చిన సినీ ప్రముఖలలో వీరొకరు .

  3. Dear Sastry,
    Very nice. Vittalacharya was an eminent cine director, producer and promoter. Brief autography of sri Vittalacharya penned by you is very worth reading. Thank you for giving such a nice essay about a prominent director.
    ….VSKHBABURAO.

Leave a Reply to SKHBABURAO VUNNAVA Cancel reply

Your email address will not be published. Required fields are marked *