March 28, 2024

నిష్క్రమణ…

రచన: చిత్రపు లక్ష్మీ పద్మజ

సుమతీ కాఫీ తీస్కురా ఎన్ని సార్లు చెప్పాలి. వినబడట్లేదా లేక విననట్టున్నావా అరిచాడు విశ్వం.
అదిగోండీ అక్కడే పెట్టాను. చూస్కోండి, మీకు కాఫీ ఇచ్చే ఇటొచ్చాను సంజాయిషీగా చెప్పింది సుమతి.
“సర్లే” కసిరాడు విశ్వం
ఇంతలోపే మమ్మీ బాక్సు అయ్యిందా.. ఇంకా పావు గంటే టైం ఉంది అరిచాడు రాజా, సుమతి కొడుకు.
అయిపోతుందిరా ఒక్క నిమిషం గబగబా కూరలో ఉప్పు, కారం వేసి అన్నం పెట్టి బాక్సు మూత పెట్టింది. గబగబా బైటికి రాబోతుంటే తల తిరిగి పోయినట్లైంది సుమతికి
ఒక్క నిమిషం నిలబడిపోయింది. అప్పుడు గుర్తొచ్చింది తనింకా కాఫీ కూడా తాగలేదని
బాక్సు రాజాకి ఇచ్చి వంటింటికి వెళ్లింది కాఫీ పెట్టుకుందామని
“మమ్మీ” పక్కమీద నుంచే అరుస్తోంది కూతురు అపర్ణ.
“ఏమోయ్‌ చూడు దానికేం కావాలో ఆలస్యం చెయ్యకు ” అన్నాడు విశ్వం
ఉండండి కాఫీ తాగుతున్నా అంది సుమతి
ఉన్నట్టుండి ఏసీ రిమోట్‌ వాయు వేగంతో హాల్లోకి వచ్చి పడి రెండు ముక్కలైంది
దెబ్బకి సుమతి , విశ్వం ఇద్దరు పరుగెత్తారు అపర్ణ దగ్గరకి
నేను ఈ రోజు కాలేజీకి వెళ్లను. మమ్మీ గారెలు చెయ్యి తినాలనుంది అంది అపర్ణ.
దానికి రిమోట్‌ పగలగొట్టాల్సిన అవసరమేంటో అర్థం కాలేదు సుమతికి.. ఈ మాటే నెమ్మదిగా కూడా చెప్పొచ్చుగా ఆడపిల్ల కదా అణుకువ లేకపోతే ఎలా మనసులోనే మథనపడి అక్కణ్నుంచి బైటికి వచ్చింది.
నోరు నొక్కుకుని వంటింట్లోకి వెళ్లింది.
వెనకాలే వెళ్లాడు విశ్వం
“దాంతో గోలెందుకు గారెలు చేసేయ్‌…లే..లే.. నాకు అన్నం పెట్టేసెయ్యి ఆఫీసుకు టైం అయిపోతుంది మళ్లీ అన్నాడు .
కూతురు ప్రవర్తనకి కళ్లలో నీరు వచ్చింది సుమతికి
దీనంగా చూసింది భర్త వైపు.
**********
మినపప్పు నానబోసి నానేలోపు దేవుడి దగ్గర కూచుందామని వెళ్లింది
దీపం పెడుతుండగా బ్రష్‌ నోట్లో పెట్టుకుని వచ్చింది అపర్ణ
ఇక్కడున్నావా మమ్మీ లే, ఫస్ట్‌ నువ్విక్కణ్ణించి కాఫీ ఇవ్వు… లేలేలే అంది అపర్ణ
“ఒక్క నిమిషం అపర్ణా అలా బ్రష్‌తో దేవుడి దగ్గరికి రావచ్చా, ఇవాళ శుక్రవారం, ఆడపిల్లవి అలాగేనా
ఉండేది.. నువ్వు కూడా స్నానం చేసి రామ్మాఈలోగా కాఫీ చేస్తాను ఇద్దరం అమ్మవారి పూజ చేద్దాం
సరేనా బంగారు కదా.. తర్వాత నీకు గారెలు ఓకేనా.. ప్రేమగా అంది సుమతి
“చెప్పావులే, ఈ పన్లన్నీ నావల్ల కాదు.. ఆ పూజేదో నువ్వే చేస్కో .. వచ్చే జన్మకైనా నీకు దేవుడు బుద్ధిని ప్రసాదిస్తాడు.. లే లే కాఫీ… ఇవ్వు… గారెలు అయ్యాకే నీ పూజలు.. .అంటూ వెళ్లింది..
మనసు మెద్దుబారిపోయింది సుమతికి.
**********
పూజ ముగించుకుని గారెలు చెయ్యసాగింది సుమతి.
ఫుల్‌ సౌండ్‌ పెట్టి టీవీ చూస్తోంది అపర్ణ
ప్లేట్లో పెట్టుకుని తీసుకెళ్లింది సుమతి
“వావ్‌ మమ్మీ సూపర్‌ టేస్ట్‌ వెరీ గుడ్‌ అని కాంప్లిమెంట్‌ ఇచ్చింది అపర్ణ.
మాట్లాడలేదు సుమతి
ఒకే మమ్మీ నేను నా ఫ్రెండ్‌ ఐమాక్స్‌కు వెళ్తున్నాం. లంచ్‌కి రాను నువ్వు తినేసేయ్‌… అంది అపర్ణ. వెళ్లిపోయింది
చూస్తుండి పోయింది సుమతి.
కాసేపు పడుకుందామని సుమతి గదిలోకి వెళ్లగా… అస్తవ్యస్తంగా ఉన్న అపర్ణ రూం కంటపడింది అదంతా సర్ది, నీటుగా చేసి ఏదో ఇంత భోజనం
చేసి మంచం మీద నడుం వాల్చింది.
**********
కాలింగ్‌ బెల్‌ మోగింది .. లేచెళ్లి చూసింది సుమతి.
పోస్ట్‌ మ్యాన్‌ అమ్మా రిజిస్టర్‌ పోస్ట్‌ అన్నాడు.
సంతకం పెట్టి తీస్కుంది సుమతి
తనకే వచ్చినట్టు చూసి చింపింది
లోపల తన తండ్రి మరణానికి ముందు అమ్మేసిన ఇంటి తాలూకు డబ్బుకు చెక్కు, ఇంకా లెటరు రాసి ఉంది
గడువు పూర్తయ్యేలోపు వచ్చి రిజిస్ట్రేషన్‌ చెయ్యమని సారాంశం.
చెక్కు 35 లక్షలకు ఉంది. తలుపేసి లోపలికి వెళ్లి చెక్కుని దేవుడికి చూపించి బీరువాలోని బ్యాగులో పెట్టింది. సుమతి కాసేపు సంతోషంగా అయిపోయింది మనసు
**********
సాయంత్రమయ్యింది…. అందరూ ఇంటికి వచ్చే వేళ.. వంటింట్లోకి వెళ్లింది సుమతి గేటు చప్పుడవటంతో తొంగి చూసింది. ఆమె మొహంలో హుషారు మాయమైంది. రాజా తన బండి మీద ఎవరో అమ్మాయిని కూచోబెట్టుకుని లోపలికొచ్చాడు.
” రాజా ” అంది సుమతి
“యస్‌ మమ్మీ షి ఈజ్‌ మై కొలీగ్‌ రీటా… మేమిద్దరం పెళ్లి చేస్కోవాలని నిర్ణయించుకున్నాం” అన్నాడు రాజా
ఆఖరి మాటలు గుండెల్ని తాకాయి సుమతికి
“కానీ” అంది సుమతి
“ఏమిటీ నీ అడ్డంకులు.. మేము నిర్ణయించుకున్నాక…నేనింకా సంస్కారవంతున్ని కాబట్టి నీకు చెప్పి చేసుకుంటున్నా.. నువ్వు ఫీల్‌ అవగూడదని… పెళ్లయ్యాక మేము అమెరికా వెళ్లిపోతాం. రీటా పేరెంట్స్‌ అక్కడే ఉంటారు.” అన్నాడు రాజా చాలా క్యాజువల్‌గా
సుమతికి ఏదీ అర్థం కానట్టుంది
ఇంతలో సుడిగాలిలా వచ్చింది అపర్ణ
” హాయ్‌ రీటా హౌ ఆర్‌ యూ ”
“ఫైన్‌ డార్లింగ్‌, మీ మమ్మీ , డాడీని చూద్దామని వచ్చాను ” అని చెప్పింది రీటా
“దట్స్‌ గుడ్‌ రీటా వన్‌ మినిట్‌ ఫ్రెష్‌ అయి వస్తాను అంటూ వెళ్లింది అపర్ణ
పరుగులాంటి నడకలో అపర్ణని చేరింది సుమతి
“ఏయ్‌ ఎవరే ఆ అమ్మాయి నీకు తెలుసా.. పెళ్లంటున్నాడు వాడు నాతో చెప్పలేదు నువ్వైనా” ఆవేశంగా అంది సుమతి
“ఏమిటా ఆవేశం.. పిచ్చెక్కిందా.. వారిద్దరూ కాబోయే భార్యాభర్తలని అందరికీ తెలుసు.. నీకే ఇప్పుడు తెలిసింది పాపం అయినా అత్తగారినన్న అహం తగ్గించుకుని వారిని అని మాట పూర్తి చేసే లోపు…
అపర్ణ చెంప చెళ్లుమనిపించింది సుమతి
“ఏమిటే వాగుతున్నావు ఎవరికి పిచ్చి మీకా నాకా, అహంకారం మీకా నాకా.. వూర్కుంటున్నాని తెగ వాగుతున్నావ్‌… అంత పొగరా నీకు ” అంటోంది సుమతి
“నన్నే కొడతావా నీకంత లేదు… చూడు రీటా కజిన్‌ బ్రదర్ని నేను కూడా చేస్కుందామని అనుకున్నా.. నీ పర్మిషన్‌ ఎవడిక్కావాలి అంటూ వెళ్లి పోయింది అపర్ణ..
మ్రాన్పడి పోయింది సుమతి…
తన గదిలోకి వెళ్లిపోయింది సుమతి. మనసంతా కోసేసినట్టైంది భర్త సెల్‌కి ఫోన్‌ చేసింది “నాట్‌ రీచబుల్‌ ” అని వస్తోంది. పిల్లలు ముగ్గురూ బైక్‌ స్టార్ట్‌ చేస్కుని వెళ్లారని అర్థమైంది.
ఏదో ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా లేచి నిలబడింది.
బైట తినేసొచ్చి పడుకున్న పిల్లలు. రాత్రి దాకా తప్పతాగి వచ్చి పడుకున్న విశ్వానికి గానీ ఎంత విలువైంది పోగొట్టుకున్నారో జీవితంలో తెలియలేదు.. ఇంకా తెల్లార్లేదు.. వాళ్లకు తెలివి రాలేదు…పనమ్మాయి తలుపులు దబదబలాడిస్తోంది. ముందుగా అపర్ణకి మెలకువ వచ్చింది.. మమ్మీ తీస్తుందిలే అని అటు తిరిగి పడుకుంది.. ఐదు నిమిషాలైనా సుమతి జాడ లేదు. విసుక్కుంటూ, తిట్టుకుంటూ లేచెళ్లి తలుపు తీసింది. పనమ్మాయి లోపలికి వచ్చింది.
ఈ లోపు విశ్వం కూడా లేచాడు. ప్రక్కన సుమతి లేదు.. ఏదో కాయితం శబ్ధం చేస్తుంటే చూసి తెరిచాడు… చదవడం మొదలెట్టాడు.
“నా అదృష్టమో ఇంకోటో కొద్దీ దొరికిన నా కుటుంబ సభ్యులకు వ్రాయునది నేను వెళ్లి పోతున్నాను. నా జీవితం తప్ప ఇంకెవరి గోల నేను పట్టించుకోదల్చుకోలేదు. నా పిల్లలకు వయసే వచ్చిందనుకున్నా కానీ జ్ఞానం రాలేదు..
ఇంకా రాదు కూడా…
నా భర్తకి ఆఫీసు, త్రాగుడు మిగతావి చెప్పకు.. తప్ప రెండోది పట్టదు..
నేను చాకిరీకి తప్ప ఎందులోనూ మీకు అవసరం లేదు.
పిల్లలు పెద్ద వాళ్లయ్యారు గానీ అందనంత ఎత్తులో ఉన్నారని రాత్రే తెలుసుకున్నాను.
మీ జీవితాలు మీరు చూస్కున్నపుడు నాతో సంబంధం లేదనుకున్నపుడు నిర్ణయాలు తీస్కున్నపుడు ఇంకా నేను మీతో కలిసి ఉండడంలో అర్థం లేదు. నాకు సంబంధించి వస్తువులన్నీ తీస్కున్నాను అంతే ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు బ్రతకండి. నేనింకా రాజీ పడలేను. మరణించిన తర్వాత కూడా మా నాన్నగారే ఆదుకున్నారు. నాకోసం వెతక్కొద్దు.
ఎప్పటికీ మీకు కనపడని (ఏమీ కాని)
సుమతి

విశ్వం పెద్దగా రోదిస్తూ కుప్పకూలిపోయాడు.
ఇక అపర్ణ, రాజా స్థాణువులై పోయారు..
అప్పటికే భవిష్యత్తు రంగులు రంగులుగా కన్పిస్తోంది అందరికీ.
తిక్క కుదిరింది అందరికీ… అమ్మగారు మంచి పని చేశారు.. రేపట్నించి నేను కూడా రాను… అంటూ గేటు వేస్తూ పనమ్మాయి మాటలు పిల్లల చెవులకు సోకుతున్నాయి.
**********

1 thought on “నిష్క్రమణ…

Leave a Reply to మాలిక పత్రిక జులై 2020 సంచికకు స్వాగతం – మాలిక పత్రిక Cancel reply

Your email address will not be published. Required fields are marked *