March 29, 2024

లోవరాజు కధలు – సూర్రావు లెక్కల పుస్తకం

రచన: రవీంద్ర కంభంపాటి

తిరిగి ఊరెళ్లిపోవాల్సిన రోజొచ్చేసింది. ఏంటో నిన్న గాక మొన్నొచ్చినట్టు ఉంది. అప్పుడే వెళ్ళిపోతున్నావా అని మా అమ్మ ఒకటే గొడవ. ‘సరేలే. నువ్విలా ఏడుపు మొహం పెట్టేవంటే. ఇంకెప్పుడూ రానని’ తనతో అంటూంటే, లోవరాజుగాడొచ్చేసేడు. కారేసుకుని !
స్టేషన్ దాకా దింపడానికి కారెందుకని అడిగితే, డిక్కీ తీసి చూపించేడు. ఓ పెద్ద క్యాను నిండా ఆవు నెయ్యి, తేగల కట్టలు, సంచీడు మొక్కజొన్నపొత్తులూ, ఓ పెద్ద కరకజ్జం ప్యాకెట్టు. ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి.
‘ ఇవన్నీ ఎందుకు?’ అని అడిగితే. ‘ఎందుకో తెల్దేటి ?. ఎదవ మోమాటం కొచ్చన్లూ నువ్వునూ. పద పద ‘ అంటూ బయల్దేరదీసేడు
స్టేషన్ కి వెళ్లి, సామాన్లన్నీ ప్లాట్ఫారం మీదెట్టించేక తెలిసింది. రైలు గంట లేటని !
బెంచీ మీద కూచున్నాక అడిగేడు. ‘అవునూ. ఇంతకాలం చెప్పిన కథలేం చేద్దామనుకుంటున్నావు ?. అసలు నీకు నచ్చేయా?’
‘నచ్చకేం? బ్రెమ్మాండంగా ఉన్నాయి.’
‘మరి. ఇవన్నీ ఏ పుస్తకంలోనో. పత్రికలోనో. రాస్తావా ?’
‘ఏమో. అదే ఆలోచిస్తున్నాను. ఈ రోజుల్లో పుస్తకాలు కొనేవాళ్లే లేరు ‘ అన్నాను
‘ఎందుకు లేరు ? సరిగ్గా రాయాలే గానీ జనాలు కొనుక్కుని మరీ చదూతారు. సర్లే. రైలు రావడానికి ఇంకా టైముంది. ఈలోపు. నీకో కథ చెప్పాలి. ‘
‘మరింకేం. చెప్పు. చెప్పు’ అన్నాను ఉత్సాహంగా !
నూకారపు సూర్రావని. నీకు తెల్దులే. మన ఊరే. కానీ కాకినాడ రాజమండ్రీ దాకా ఫేమస్సు. రోజూ ఉదయాన్నే తన ఎన్ఫీల్డు బండికి క్యాష్ బ్యాగు తగిలించుకుని. చుట్టుపక్కల ఊళ్లు బయల్దేరేవోడు. సంతల్లోనూ, మార్కెట్లలోనూ రోజువారీ వడ్డీకి డబ్బులన్నీ తిప్పి. రాత్రికి వడ్డీతో సహా తీసుకుని, రాత్రి ఎప్పటికో ఇంటికి చేరే ఆ సూర్రావంటే ఆళ్ళింట్లో జనాలకి మా చెడ్డ చిరాకు. ఆళ్ళు అలా చిరాకు పడ్డానికి కూడా ఓ కారణం ఉందిలే. సూర్రావంత డబ్బు మనిషిని ఎప్పుడూ జన్మలో చూసుండవు !
ఇంట్లో ఖర్చులకి పైసా విదిల్చేవాడు కాదు. పైగా. ఆళ్ల ఆవిడ ఇంట్లో ఖర్చుకి డబ్బులడిగిందంటే. ‘మీకెప్పుడూ ఖర్చులే. నేను కష్టపడుతూంది ఎవరి కోసం ? మీ కోసమేగా. నేను సంపాదించిన డబ్బులన్నీ నేనెత్తుకుపోతానా ఏమిటీ ? నా తర్వాత మీకేగా ‘ అంటూ కసిరేసేవోడు. దాంతో ఆళ్ళ ఆవిడే ఇక్కడా అక్కడా పనులు చేసుకుంటూ ఇల్లు నెట్టుకొచ్చేది.
పైగా ఎవరైనా ‘అదేంటండీ సూర్రావు గారూ. ఇంత డబ్బుండీ మీ యావిడగోరి చేత పన్జేయిస్తున్నారూ ?’ అని అడిగితే ‘మరదే . . మాకు డబ్బెక్కడ ఉందీ ? అందరి దగ్గిరా వడ్డీకి తిరుగుతూంది. నిజంగా మాకంత డబ్బే ఉంటే . ఈ రోజు కోసం మా యావిడ కష్టపడే అవసరం వచ్చేదా ఏంటీ ?’ అనో తింగరి లాజిక్కు లాగి తప్పించుకునేవాడు !
సూర్రావు పిల్లలిద్దరూ పెరిగి పెద్దయ్యేరు. ఎవడి ఉద్యోగం ఆడు చేసుకుంటున్నాడు. తండ్రి మీద ఆధారపడాల్సిన పని లేదు. చిన్నప్పటి నుంచీ కష్టపడి పెంచిన తల్లిని వాళ్ళతోనే ఉంచుకుని, తండ్రిని ఇంట్లోంచి పొమ్మన్నారు.
‘సరే. నాదేం పోయింది. కానీ నేను ఇంట్లోంచెళ్ళిపోయిన తర్వాత. నేను వడ్డీకి తిప్పుతున్న పాతిక లక్షల సంగతి మీకనవసరం మరి ‘ అని వెళ్ళిపోబోతూంటే, కొడుకులిద్దరూ పరిగెట్టుకునొచ్చి ఆపి. ‘అంటే. నువ్వు వడ్డీకి తిప్పుతున్న పాతిక లక్షలూ మాకేనా ?’ అని అడిగితే, ‘మరి మీకోసం కాపోతే ఎవరికోసం కష్టపడుతున్నానూ ?. నా తర్వాత మీరు దర్జాగా బతకాలనే నా కష్టం అంతానూ. ఎవరెవరు మనకెంత ఇవ్వాలో లెక్క రాసుంచేను కూడా’ అంటూ చంకలోని లెక్కల పుస్తకం చూపించేడు సూర్రావు !
‘అయ్యో. నీ కష్టం మేమర్ధం చేసుకోలేకపోయేము. తప్పైపోయింది. నువ్వు మాతోనే ఉండు నాన్నా ‘ అంటూ సూర్రావు కాళ్ళ మీద పడి మరీ ఇంట్లోకట్టుకెళ్ళిపోయేరా కొడుకులు.
ఎప్పుడూ జాగ్రత్తగా దాచుంచుకునే ఆ లెక్కల పుస్తకం మటుకు ఎవరికీ చూపించేవాడు కాదు. దాంతో. రోజురోజుకీ కొడుకులిద్దరికీ ఆత్రుత పెరిగి పోతూంది. అసలు ఆ పాతిక లక్షల సంగతేంటీ ? ఎవరెవరికి అప్పిచ్చేడూ ? ఎక్కడెక్కడ దాచేడూ అని ఆ ఇద్దరూ వాళ్ళ పెళ్ళాల తో సహా తెగ ఆలోచించేస్తున్నారు.
ఎన్నిసార్లు తండ్రిని అడిగినా. ‘నా తర్వాత ఇదంతా మీకేననీ. సమానంగా పంచుకోవాలనీ చెప్పేను కదా. నన్ను బలవంతం చేసేరంటే పుస్తకం చింపేసి నేను చచ్చిపోతాను ‘ అని సూర్రావు బెదిరింపులకి దిగేసరికి. ఇంకేం చెయ్యలేక ఊరుకున్నారు.
ఆ రోజు రాత్రి సూర్రావు చిన్నకొడుకు నాగబాబు వెళ్లి పెద్దాడు బోసుని లేపేడు ‘ఒరేయ్. నాన్న భోజనంలో నిద్ర మాత్రలు కలిపించేను . ఆ లెక్కల పుస్తకంలో ఏముందో చూద్దాం పద ‘ అని చెబితే, ఇద్దరూ తండ్రి పక్క దగ్గిరకి వెళ్లి సూర్రావు దిండు కింద భద్రంగా పెట్టుకున్న ఆ డబ్బు లెక్కల పుస్తకం తీసి, వసారాలో లైటేసుకుని కూచుని, పేజీలు తిరగేస్తున్న కొద్దీ ఆళ్ల మతులు పోతున్నాయి. పేజీ పేజీకి తండ్రి మీద కోపం పెరిగిపోతూంది, ఇంక లాభం లేదు. ఉదయాన్నే తండ్రిని దులిపెయ్యాలని గట్టిగా నిర్ణయించేసుకుని పడుక్కున్నారిద్దరూ. తెల్లవారుజామున సూర్రావు భార్య పిల్లలిద్దరినీ నిద్ర లేపింది. ‘ఒరే బాబులూ. మీ నాన్న నిద్రలోనే పోయేర్రా ‘ అంటూ. ఆళ్ళిద్దరికీ నోటమాట రాక ఉన్నచోటే కళ్ళుతిరిగి పడిపోయేరా కొడుకులిద్దరూ !
‘ఇంతకీ ఆ లెక్కల పుస్తకంలో ఏముందీ ?’ టెన్షన్ గా అడిగేను
‘ఏముందీ. చింత చెట్టున్న ఇంట్లో ఉండే పోలినాయుడి బాకీ ఇరవై వేలు. కల్లుపాక దగ్గిర నీలవేణి బాకీ పదిహేను వేలు. సోడా కొట్టు పక్కన చెప్పులు కుట్టుకునే చందర్రావు తొంభై రూపాయలు. ఈ టైపులో ఉన్నాయా లెక్కలు. ఆ బాకీ ఉన్నవాళ్ళవి ఇంతకు మించి వివరాలు లేవు. ఏ ఊరని వెళ్తారు ? ఎవర్నని అడుగుతారు ?అసలే ఆ సూర్రావు. గొల్లప్రోలు నుంచి రాజమండ్రి దాకా అప్పులిస్తూ తిరిగేవాడు ‘ అంటూ ముగించేడు
ఎదురుకుండా నేనెక్కాల్సిన రైలొస్తూంది. దాన్ని చూస్తూ. ‘నీ కథలకి సూర్రావు లెక్కల పుస్తకం లాంటి గతి మటుకు పట్టించనని ‘ లోవరాజుకి మాటిచ్చేను !

2 thoughts on “లోవరాజు కధలు – సూర్రావు లెక్కల పుస్తకం

  1. చాలా బాగుంది రవీ! అలా ఆవారా తిరిగే వాడన్నమాట మహానుభావుడు!

Leave a Reply to మాలిక పత్రిక జులై 2020 సంచికకు స్వాగతం – మాలిక పత్రిక Cancel reply

Your email address will not be published. Required fields are marked *