August 11, 2022

అర్చన 2020 – అమ్మ నిర్ణయం

రచన: శారదా పోలంరాజు

“అమ్మా స్టేషన్ వచ్చింది. పదపద దిగాలి.” కంపార్ట్‌మెంట్‌లో అందరూ గాఢనిద్రలో ఉన్నారు. “ఇదిగో ఈ బెంచీ మీద కూర్చో. ఇక్కడ మరో రైలు ఎక్కాలి. నేనెళ్ళి టికెట్లు కొనుక్కొస్తాను.” వెళ్ళబోతున్న కొడుకు వైపు జాలిగా చూస్తోంది సుగుణమ్మ.
ముందరే అన్నీ అనుకుంటున్నటే జరుగుతున్నాయనేమో మనసు రాయి చేసుకొని నిర్లిప్తంగా ఉంది.
హటాత్తుగా ఏదో గుర్తు వచ్చినట్టు, “బాబూ! ఇవిగో నా బీరువా తాళాలు. హడావుడిలో వెంట తీసుకొని వచ్చేసాను.” తల్లి చేతుల్లోంచి తాళాలు అందుకుంటూ పెద్దపెద్ద అంగలు వేస్తూ కదిలి పోయాడు.
“ఏమిటో! లోకం ఎటు పోతోందో?” వాడికి ఏమి తక్కువ చేసాను? పుట్టిన కాడి నుండి కళ్ళల్లో పెట్టుకొని పెంచుకున్నామే?
ఆయన మాత్రము….వాడు అడిగింది అడిగినట్టు ఇస్తూ పెంచారు. కోరిన వస్తువులు వాహనాలు…..అనుకున్న చదువు కావాలనుకున్న అమ్మాయితో పెళ్ళి…. చివరకు అప్పు చేసి ఒక చక్కటి ఇల్లు కూడా కొని తన పెన్షన్ తో తీర్చారు. ఈ నాటికి మనవల చదువులకు ఫీజులు గాని అవసరాలు గాని తామే తీరుస్తున్నామే!
ఆరునెలల నాడే ఆయన ఎంత ముందు చూపుతో వాళ్ళ వైఖరి తెలుసుకున్నారో కదా! తనకే మాతృ ప్రేమ కళ్ళకు పొరలు కమ్మేసింది.
రాత్రి విన్న మాటలు చెవిలో గింగురుమనసాగాయి.”ముసలాడిని సాగనంపాము. కాని ఈవిడను వదిలించుకుంటే గాని నాక్కావలసినట్టు ఉండే వీలు లేదు. ఆయన ఎప్పుడో కొని పడేసిన ఐదెకరాల భూమి ఈ రోజు కోట్లలో ఉందట. బంగారమే పండుతోంది. ఈవిడేమో చూడబోతే పిడిరాయిలా ఉంది. ఆవిడ ఉన్నన్నాళ్ళూ మనమనుకున్న పనులు సాగవు. ”
ఆ పై మాటలు గుసగుసగా సరిగ్గా వినిపించలేదు. చివరలో కాజీపేట ఆశ్రమాలు అన్న మాటలు మాత్రం వినిపించాయి.
“డబ్బులదేముందే. ఆ నాటికి రెడీ. సరే ఉంటానింక. పుటుక్కున మాటలు వినిపిస్తే లేనిపోని రచ్చ.”
నిద్రపట్టక బాల్కనీలోకి వచ్చినప్పుడు చెవులో పడుతున్న మాటలను త్రోసిపారేయ లేకపోయింది.
************
“అమ్మా! చిన్నపిన్ని నిన్ను చూడాలని కలవరిస్తోందట. ఒకసారి వెళ్ళి వస్తే బాగుంటుందేమో!” అన్న కొడుకు మాటలకు సుగుణమ్మ గుండెలో ఒక్కసారి కలుక్కుమంది.
“మిమ్మల్నే. అత్తయ్యగారూ…. ఒకసారి వెళ్ళి రండి. మీక్కూడా కాస్త మార్పు ఉంటుంది. మామయ్యగారు పోయిన కాడి నుండి ఇంటికే అంకితమైపోయినారు. మీ బట్టలు సర్దుకుంటే రాత్రి ట్రైన్‌కు బయలుదేరవచ్చు. ” తేనెలాంటి మాటలు చురకల్లాగా తగిలాయి.
తల ఊపి గదిలోకి వెళ్ళింది సుగుణమ్మ.
ఎంత మూర్ఖురాలు తను. అంత ముందుచూపుతో చెప్పినప్పుడు ఆయన మాటలు కొట్టిపారేసింది…ఆస్పత్రిలో …
“అమ్మీ! ఒకసారి అబ్బులుని రమ్మని ఫోన్ చేయవోయ్”,
“అబ్బులా? వాడెందుకయ్యా ఇప్పుడు? చూద్దామని ఉందా?”
“కాదులే వాడితో పని ఉంది. అర్జెంటుగా రమ్మను. రేపు నువ్వు వచ్చేటప్పుడు.బీరువాలో కింద లాకర్‌లో పెట్టిన ఆకుపచ్చ బ్రీఫ్ కేస్ జాగ్రత్తగా తీసుకొనిరా. జాగ్రత్తగ.అంటే ఎవరి కంటపడకుండా” సంధి ప్రేలాపన కాదు కదా! అనుమానం పొడచూపించింది.
ఆమె ముఖ కవళికలు గమనిస్తూ…”అమ్మీ! అంత అనుమాన పడకే. పొయ్యే లోపల కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు చక్కబెట్టాలి. అంతే. ఎక్కువగా ఆలోచించకు. నాలుగేళ్ళనాడు అందరమూ కలిసి అరకు చూసి వస్తూ విశాఖపట్టణం రైల్వే వెయిటింగ్ రూంలో చూసిన సంఘటన మర్చి పోయావుటే అమ్మీ.”
ఒక్కసారి ఆ దృశ్యం గుర్తుకు వచ్చి వెన్నులోంచి వణుకు లాగా మొదలయింది.
“నిజమేనండి…అయినా ఇప్పుడా సంగతి దేనికి?”
“ఆ సమయము వచ్చిందే అమ్మీ. దానికి అబ్బులైతేనే సరైన వాడు. అందుకే వాడిని పిలిపించమంటున్నాను.”
************
“ఏరా అబ్బులూ! బాగున్నావా? ”
పొద్దున్నే ఆయనకు ఆహారం తీసుకొని వచ్చిన సుగుణమ్మకు అబ్బులును చూడగానే కాస్త ప్రాణం లేచొచ్చినట్టయింది. గత పదిరోజులుగా రాత్రింబవళ్ళు తానొక్కతే బిక్కుబిక్కుమంటూ అక్కడే ఉండటము, ఇంటికి వెళ్ళి తానింత తిని ఆయనకు కావలసినవి తేవడంతోటే సరిపోతోంది. కొడుకు కోడలు చేర్చినప్పుడు రావడమే. మళ్ళీ మొహం చూపించలేదు. అదేమంటే, ఆస్పత్రిలో ఒకరి కన్నా రానియ్యరు అని చెప్పి తప్పించుకుంటూ ఉన్నారు.
అప్పటికే ఏమేమి చర్చలయ్యాయో ఏమో, “అబ్బులూ! నేను చెప్పింది బాగా గుర్తుందిగా. మీ అమ్మగారిని ఇంక నీ చేతుల్లొ పెడుతున్నాను.”
ఆయన మాటలకు చర్రున, “చాల్లేండి మీరూ మీ మాటలు. ఒక నాలుగు రోజుల్లో ఇంటికి పంపిస్తామని చెప్పారు. తొమ్మిది నెలలు మోసి కన్న కొడుకు. మనల్ని కళ్ళల్లో పెట్టుకొని చూసేవాడుండగా మీరూ మీ చోద్యపు మాటలూ.”
“సరేలేవే…. నువ్వేమో తొమ్మిది నెలలు మోసి కన్నావు. నేను తొమ్మిదేళ్ళు వచ్చేదాకా భుజాల మీద ఎత్తుకొనిపెంచాను. మరి ఇప్పుడో తొమ్మిది తొమ్మిది పజ్జెనిమిదేళ్ళగా కోడలి బొటనవేలి కింద ఉన్నాడు కదే. నువ్వు కోరుకున్నట్టే జరిగితే సరే సరి. అదృష్టవంతురాలివి. నన్ను చూసుకోవడానికి నువ్వు ఒళ్ళు హూనం చేసుకుంటున్నావు. మరి నిన్ను చూసుకొనే వాళ్ళు ఎవరే?”
*****************
ఆరునెలలు ఎట్లా గడిచాయో! ఆయన మాటలలో ఒక్కటి కూడా పొల్లుమాట లేదనిపిస్తోంది. ఏదొ ఒకరోజు ఈ స్థితి రాబోతుందని అర్థమౌతూనే ఉంది.
“ఇదిగోనండి అత్తయ్యగారూ ఈ పెట్టెలో సర్ది పెడతాను మీ బట్టలు మందులు తెచ్చేయండి.” ఎప్పుడెప్పుడు సాగనంపుదామా అని ఆరాటం స్పష్టంగా వినిపిస్తున్నది.
“అంతపెట్టె వద్దులేమ్మా. నాలుగు చీరల భాగ్యానికి ఈ చేతి సంచీ చాల్లే.” కొన్నాళ్ళగా పాత చీరతో కుట్టుకున్న సంచీ తిసుకొని వచ్చి, నాలుగంటే నాలుగు చీరలు అందులో పెట్టుకొని జిప్ వేసి కొసలో తాళం పెట్టేయడం చూసిన కోడలి మొహం వికసించింది.
“అమ్మయ్య బంగారం డాక్యుమెంట్స్ ఏమీ వాల్యుబుల్స్ తీసుకోలేదన్న మాట.” అనుకుంటూ ఆనందం దాచుకోవడానికి తంటాలు పడటం సుగుణమ్మ కొనచూపుతో గమనిస్తూనే ఉంది.
“కాస్త ఈ కాగితాల మీద సంతకాలు పెట్టేయమ్మా.. నాన్న పెన్షన్‌లో ఏవో మార్పులు వచ్చేట్టున్నాయట. ఈ లోగా అవసరానికి ఉంటాయి. ఇవిగో వీటన్నిటిమీద ….ఇక్కడ ఇక్కడ.” అంటూ బొత్తి కాగితాలు ముందర పెట్టాడు.
“అమ్మీ జాగ్రత్తే. ఎక్కడంటే అక్కడ సంతకాలు పెట్టించుకోవచ్చు. సంతకం పెట్టేటప్పుడు నేను చెప్పిన మాట గుర్తు చేసుకో.”
“అత్తయ్యగారూ జాగ్రత్తగా పెట్టండి. అసలే మీ చేతుల్లో పట్టులేక వణుకు వస్తోంది. మళ్ళీ సంతకాలు టాలీ అవక పోతే ఇబ్బంది.”
మనసారా నవ్వుదామనిపిస్తున్నది. బలవంతంగా అదిమి పెట్టుకొని చూపించిన చోటల్లా గిలికేసింది.
************
రాత్రే అబ్బులుకు ఫోన్లో చెప్పింది. “అరే అబ్బులూ ఏమిటోరా నాకు అనుమానంగా ఉంది. కాజీపేట రైల్ స్టేషన్ అంటున్నారు…”
తన ఇంట్లో పాలేరు. జారిపోతున్న నిక్కరు ఒక చేత్తో పట్టుకొని మరో చేత్తో కర్రపుల్ల పట్టుకొని గొడ్లంబడి తిరుగుతూంటే తానే పాపం అని జాలి తలచి, బళ్ళో వేసింది. వాడి తల్లితండ్రుల పుణ్యమాని చక్కగా చదువుకుంటూ డిగ్రీనో ఇంకా పై చదువో పూర్తి చేసాడు.
ఏదో గుమాస్తా ఉద్యోగం చేసుకునే ఒక బక్క ప్రాణం. వాడు మాత్రం తనని ఏమని పోషిస్తాడు?
అయినా ఆయన చెప్పారు కదా అని ఫోన్ చేసి చెప్పడం అయితే చెప్పింది.
************
రైల్వే స్టేషన్ లో ఒక్కతే కూర్చొని….
“ఎందుకైనా మంచిది మరొక్కమారు గుర్తు చేయాలి” అనుకుంటూ ఫోన్ తీసి చూడగానె ఒక్కసారి గుండె ఝల్లుమంది.
ఫోన్ మొత్తం ఖాళీ. నంబర్లు వాట్సాప్ మెసేజీలు అన్ని తుడిచేసి ఉన్నాయి.
“ఇదిగో ఇందులో నీకు ముఖ్యమైన నంబర్లన్నీ రాసి ఉంచాను. జాగ్రత్తగా పెట్టుకో. అత్యవసర సమయంలో ఉపయోగ పడవచ్చును.” జాకెట్టులో దాచుకున్న చిన్న పర్సు తెరిచింది.
ఆయన ఫోటో తనను చూసే నవ్వుతున్నట్టు కనిపించింది. “ఏమి జరుగుతున్నదో చూసావా అమ్మీ.?” అంటూ వెక్కిరించినట్టుగా చూస్తున్నాడు.
టకటకమంటూ బూట్ల చప్పుడు వినిపించి వంచిన తలకు మొదట పోలీసు బూట్లు కనిపించి మెల్లిగా తల పైకెత్తింది. ఎదురుగా ఉన్న వ్యక్తిని మొదట గుర్తించ లేదు. మెల్లిగా తేరుకొని, “అబ్బులూ” అని గొణిగింది.
పోలీసు ఇన్స్పెక్టర్ గబగబ వచ్చి సెల్యూట్ కొట్టి ఎటెన్షలో నిలబద్డాడు.
వెనుకనే ముగ్గురు కానిస్టేబుల్స్.
“థాంక్యూ ఇన్స్పెక్టర్.” సుగుణమ్మ పక్కన బెంచీ మీద కూర్చున్నాడు. ఆవిడకు అంతా అయోమయంగా ఉంది.
************
అవతల ప్లాట్‌ఫాం మీదకు వెళ్ళిన మాధవ్ తల్లి వైపే ఒక కన్ను వేసి మధ్యలో నిద్ర మత్తు వదిలించుకోవడానికి టీ తాగి మళ్ళీ వచ్చి చూసేటప్పటికి ఒక్క క్షణం గుండె ఆగినట్టయింది.
ఫుల్ సూట్‌లొ ఉన్న వ్యక్తి చంటిబిడ్డను పొదివి పట్టుకున్నట్టు తల్లిని పట్టుకొని నడిపిస్తున్నాడు. ఆవిడ అతని నడుము చుట్టూ చేయి వేసి ఆసరా కోసం వాలిపోయి మెల్లిగా అడుగులు వేస్తున్నది. వెనుక అమ్మ సంచీ అపురూపంగా పట్టుకొని నడుస్తూన్న కానిస్టేబుల్. ఎవరు వాళ్ళు? అమ్మను ఎక్కడకు తీసుకెళ్తున్నారు?
ఆలోచనలో తన తిరుగు ప్రయాణపు ట్రైన్ వచ్చేయడంతో ఎక్కేసాడు.
“మాధవ్! బీరువా తాళాలు కనిపించటం లేదు.” ఇంట్లోకి పూర్తిగా కాలు పెట్టక ముందే ఎదురైన భార్య చేతిలో తాళాలు పెట్టి,
“అవి తరువాత చూద్దువు కాని, నాకు కాస్త కాఫీ తెచ్చి పెట్టు రాత్రంతా నిద్ర లేదు. మళ్ళీ బాంక్ వైపు వెళ్ళి రావాలి.” టవల్ తీసుకొని బాత్రూంలోకి వెళ్ళీన అతనికి ఒక్కసారిగా, “మాధవ్.” అన్న కేక వినిపించగానే హడావుడిగా బయటకు వచ్చేసాడు.
బీరువా ముందర నిలువు గుడ్లేసుకొని నిలబడ్డ భార్య, ఖాళీ బీరువా ఎక్కిరిస్తూ కనిపించాయి. లాకర్ నుండి రెండు వెండి కంచాలు నాలుగు గ్లాసులు మరి కొన్ని పూజ సామాగ్రి తొంగి చూస్తున్నయి.
“అదేమిటి అమ్మ నాలుగు చీరలు మాత్రమే కదా సంచీలో పెట్టుకెళ్ళింది. బీరువా ఖాళీగా ఉన్నదేమిటి?”
“అయ్యో అయ్యో అన్ని నగలు ఏమయ్యాయండి? పలకసరులు, అరడజను గాజులు, చంద్రహారము, ఇంకా ఇంకా అన్నీ కలిపి ఓ యాభై తులాల నగలు ఉండాలి. అక్కడి ఐదెకరాల భూమి కాగితాలు. ఎన్ని కోట్ల విలువయ్యేవి.” ఏడుపు ఒక్కటే తక్కువ.
“సరే. గోల చేయవాక ఎక్కడికి పోతాయి. వేరే అలమారలో పెట్టిందేమో తరువాత చూద్దాము. ముందర అమ్మ సంతకాలు పెట్టిన కాగితాలు నీ దగ్గరే ఉన్నాయి కదా. తీసి పెట్టు.బాంకుకు వెళ్ళి వస్తాను”
************
ద్వారం పక్కన “అభినందన్” ఐ ఏ ఎస్ అన్న పేరు చూసి ఒక్క క్షణం ఆగింది సుగుణమ్మ.
“అమ్మా అబ్బులుగాడికి రిజిస్టర్ లో పేరేమి రాయమంటారమ్మా?”
హెడ్మాస్టర్ గారి ప్రశ్నకు సమాధానంగా, “అభినందన్ అని రాసుకోండి మాస్టారూ. బాగా చదువుకొని అందరి అభినందనలు పొందాలని ఆశీర్వదింఛండి.”
“అమ్మీ! నీ బంగారు చేతులతో ఏ ముహుర్తాన బళ్ళో చేర్పించావో కాని, వాడు ఎంత అభివృద్ధిలోకి వచ్చాడో చూడవే. మంచి ఉద్యోగంలో చేరాట్ట.” భర్త మాటలు చెవిలో గింగురుమన్నాయి.
అబ్బులు రెండు చెంపలూ ఆప్యాయంగా నిమిరింది.
“అమ్మా రాత్రంతా సరిగ్గా నిద్రలేక అలసిపోయినట్టున్నావు. గదిలో విశ్రాంతి తీసుకోమ్మా”. అతని భార్య అందజేసిన కాఫీ ఫలహారాలు చేసాక అనునయంగా అన్న అబ్బులు మాటలకు,
“ఒక్క నిమిషం నాయనా. నా బరువు నీ మీద పెట్టేస్తే నాకు స్థిమితం.” సంచీ తీసుకొని…..
అడుగున తను ఎంతో జాగ్రత్తగా కుట్టిన రహస్యపు అరకు ఉన్న జిప్ తెరిచి కొడుకు కోడలికి తెలియకుండా దాచి పెట్టిన ఫైల్, మధ్యలో ప్లాస్టిక్ కవర్‌లో పెట్టిన బంగారు నగలన్నీ అతని చేతిలో పెట్టింది.
“నాయనా, మహానుభావుడు, “కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి” అన్న మాట నేను అబద్ధం చేస్తున్నానని భయంగా ఉందిరా. ఈ విధంగా కన్న కొడుకును మోసబుచ్చి నే చేస్తున్న పనులను భగవంతుడు కూడా క్షమించడేమోరా?”
“అమ్మా! తల్లి ఏ నాటికీ కుమాత కాదమ్మా. బాబుగారు, మీరు చేయవలసినదంతా చేసారు. కావలసినంత ఆస్థి సమకూర్చారు. అయినా మిమ్మల్ని వదిలించుకోవడానికి ప్రయత్నం చేసారు కదమ్మా. ఇంక నీ భవిష్యత్తు కూడా చూసుకొమ్మని కదమ్మా బాబుగారు చెప్పినట్టు చేస్తున్నావు. ఇంక ఎటువంటి ఆలోచనలూ పెట్టుకోకుండా హాయిగా విశ్రాంతి తీసుకోమ్మా.”
పడుకున్నదే గాని మళ్ళీ ఆలోచనలు…….
“నాలుగేళ్ళనాడు అరకువేలీ చూసి వస్తూ రైల్వే రిటైరింగ్ రూములో దృశ్యం గుర్తు ఉందిటే అమ్మీ…….?”
కుటుంబమంతా కలిసి ట్రైన్ కోసం ఎదురు చూస్తూండగా కనిపించిన ఆ దృశ్యం తలుచుకుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తూంది.
సామాను వేసే ట్రాలీ లాక్కు వస్తూ కనిపించారు కూలీలు. వెనకాలే రైల్వే నర్సుడ్రెస్‌లో ఇద్దరు.
ఒగ్గులాగా ముడుచుకొని ఉన్న వృద్ధురాలిని ఒక కూలీ ట్రాలీ మీద నుండి ఎత్తుకొని బెంచి మీద పడుకోబెట్టారు. ఆవిడ ఏమిటో తెలిసీ తెలియని స్థితిలో గొణుగుతూ ఉన్నది. అంత ముసలావిడ ఎవరూ లేకుండా ఒంటరిగా ప్రయాణం చేయడం ఏమిటో? ఆరాటం పట్టలేక అటుగా పోతున్న కూలీని ఆపి అడిగింది. అతను చెప్పిన వివరాలు బట్టి…..
ట్రైన్ ఖాళీ అయ్యాక శుభ్రం చేద్దామని వెళ్తే ఈవిడ కనిపించింది. కొడుకు వెంట వచ్చాడని, కూతురు ఈ వూళ్ళోనే ఉంటుందని చేతిలో ఒక కాగితంలో అడ్డదిడ్డమైన ఫోన్ నంబరు చూపించింది.
“అవునండి…ఆ వృద్దురాలి గతి తలుచుకుంటేనే కడుపులో తరుక్కు పోతుంది. ఆ సంతానం అంత దౌర్భాగ్యులేంటండీ మరీనూ? అయినా మీకు ఈ సమయంలో ఆవిడ ఊసు దేనికట?”
ఆయాసపడ్తూనే చాలా విషయాలు చర్చించాడు ఆయన.
“అమ్మో! ఆయన అంత ముందు చూపుతో వ్యవహరించబట్టి తనకు ఈ అండైనా లభించింది. లేకపోతే తాను కూడా ఆ ముసలావిడ లాగా రైల్వ్ ప్లాట్‌ఫాం మీద…” తలుచుకుంటేనే ఒళ్ళు జలదరిస్తోంది.
“సుమా అమ్మను జాగ్రత్తగా చూసుకో. ఏ నిమిషమైనా మాధవ్ నుండి ఫోన్ రావచ్చు., నేను చెప్పినట్టుగా మాట్లాడు.” ” అబ్బులు ఆమెను భార్యకు అప్పగించాడు.
**********
అమ్మ చేత ఎంతో ముందుచూపుతో సంతకాలు పెట్టించుకున్న కాగితాలు పట్టుకొని హుటాహుటిగా బాంక్ వద్దకు చేరాడు మాధవ్. ఎంత కాదన్నా నాన్న పెన్షన్‌లో ఎఫ్.డిలలో దాచిన మొత్తం యాభై లక్షల పైమాటే ఉంటాయి.
మేనేజరు తాను పరిచయం చేసుకొని, “మా అమ్మగారికి ఆరోగ్యం బాగా క్షీణించి పవారాఫ్ ఎటార్నీ నాకు ఇచ్చేసారండి. మా నాన్నగారి అమ్మగారి ఎకౌంట్ నాకు ట్రాన్స్ఫర్ చేసే ఏర్పాట్లు…..”
చేతిలో కాగితాల మీద ఉన్న సంతకాలను పరిశీలనగా చూసి, “మీరు సుగుణమ్మగారి అబ్బాయేనా?” అనుమానంగా అడిగాడు.
“అవునండీ, ఇవిగో నా ఆధార్ కార్డ్ ఇంకా ఇతర ఐడెంటిటీ…”
“ఆగండాగండి. సారీ, ఇవి సుగుణమ్మగారి సంతకాలు కావండి. ఏవో ఫోర్జరీ…”
“ఫోర్జరీ ఏమిటండీ? మా అమ్మ స్వయంగా సంతకాలు పెట్టి ఇచ్చిన డాక్యుమెంట్స్. పెద్ద వయసు వల్ల కాస్త తేడా వచ్చిందేమో మరొక్కసారి చూడండి.. కనీసం ఎంత ఎమౌంట్ ఉందో చెప్పగలుగుతారా?”
“ఆవిడ మా రెగ్యులర్ కస్టమర్. ఆవిడ సంతకం నేను చాలా సులభంగా గుర్తించగలుగుతాను. అయినా అట్లా ఎవరికంటే వారికి పర్సనల్ ఎకౌంట్ డిటెయిల్స్ చెప్పగూడదని రూల్ ఉంది కదా ఆ మాత్రం తెలియదా.”
సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్తే అమ్మీ. నే చెప్పిన మాటలు గుర్తు పెట్టుకో….. భర్త మాటలు తలుచుకుంటూ తల్లి చేతికొచ్చినట్టు గిలికి పారేసిందన్న వాస్తవం గమనించలేదు పాపం ఆ కొడుకు.
మొహం వేళ్ళాడేసుకొని ఇలు చేరిన మాధవ్ చెప్పిన సమాచారం విన్న అతని భార్యకు కాళ్ళూ చేతులూ ఆడలేదు.
“ఇంట్లో డాక్యుమెంట్స్ బంగారం మాయం. బాంక్‌లో ఎకౌంట్ ఎక్కడిదక్కడ లాక్ అయిపోయింది. ఇంక ఇప్పుడేమి చేయాలి.
ఫోన్ ఉంది కదా ఒకసారి చేసి మాట్లాడు. నెమ్మదిగా ఎక్కడ ఉన్నదో తెలుసుకో. పోయి పిలుచుకు రా.”
*******
“అమ్మా సుమా. ఇదిగో నా మొబైల్ మోగుతోంది. మాధవ్ నంబరే. ”
“అలో….నేను కాజీపేట్ టేషన్లో పని చేత్తానండే. ఈడ బల్ల కాడ ఊడుత్తా ఉంటే ఈ ఫోన్ కనబడింది సారూ. పోలీసులకు అప్పచెప్పేదానికి ఎత్తుకెళ్తుండానండే.”
“అయ్యో. ఫోన్ కూడా అక్కడే పడిపోయిందట. అమ్మను కాంటాక్ట్ చేసే మార్గమే లేదు.”
*******
తండ్రి ఆబ్ధికం ముగించాననిపించి భోజనాలు చేసి టివిలో చానెల్స్ మారుస్తున్న మాధవ్ హఠాత్తుగా వెనక్కు ఒక తెలుగు వార్తల చానెల్ వద్దకు వచ్చి ఆగిపోయాడు. రిబ్బన్ కట్ చేసి ఒక బిల్డింగ్ ప్రారంభోత్సవం. లైఫ్ సైజులో ఉన్న ఫోటోకు దండవేసి ఉంది. కింద స్క్రోల్… కరుణాలయం ఆశ్రమం ప్రారంభోత్సవ కార్యక్రమం. రిబ్బన్ కట్ చేసిన కలెక్టర్ అభినందన్.
కనిపిస్తున్న దృశ్యం చూసి అవాక్కయ్యారు.
మైకు ముందర చిన్న అంచు ఉన్న గద్వాల్ చీరలో నిండుగా కనిపిస్తోంది సుగుణమ్మ. పక్కన కుర్చీలో దర్జాగా ఉన్న అభినందన్.
“కారణాలు ఏవైనా కాని, ఆర్ధికంగా భారం కావచ్చు, వారి స్వేచ్చకు ఆటంకం అనిపించవచ్చు. దానికి మార్గంగా తీర్ధయాత్రలని తీసుకొని వెళ్ళి రైళ్ళల్లో దూరప్రాంతాలలో వదిలేయడం చాలా సాధారణం అయింది. మన రైల్వేస్ వారి లెక్కల ప్రకారం నెలలో కనీసం పదిమందైనా వృద్ధులు అనాథలగా వదిలేయబడుతున్నారు. చేతనైన వారు వృద్ధాశ్రమాలలో చేరటమో, అదీ చేతకాని వారు బిక్షగాళ్ళగానో మారుతున్నారు.
కొంతకాలం క్రితం విశాఖపట్టణం ప్లాట్‌ఫాం మీద ఒక అభాగ్యురాలిని చూసాక అటువంటివారికి ఏదైనా మన చేతనైనంత సహాయం చేద్దామన్న కలిగిన ఆలోచన ఫలితమే ఈ కరుణాలయం. పెళ్ళిళ్ళు అవగానే సంసార బాధ్యతలు, ఆ తరువాత పిల్లల పెంపకం వాళ్ళ పెళ్ళిళ్ళు మనమళ్ళు అదే ఊబిలో చిక్కుకొని చాలామంది వృద్ధాప్యం వచ్చేదాకా తమ సంగతి ఆలోచించను కూడా ఆలోచించడం లేదు. తమ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలి. మధ్యతరగతి కుటుంబాల్లో వృద్దాప్యం గడ్డుకాలం. ప్రశాంతంగా మరణించేవారు అదృష్టవంతులు. అట్లా కాకుండా ఏదైనా రోగాల బారిన పడ్డప్పుడు పడే నరకయాతన కన్నా ఆర్ధికంగా తట్టుకోవడం దుర్భరం అవుతోంది.ఆ పరిస్థితి రాకుండా చూసుకోవలసిన భాధ్యత ఎవరిది వారికే. ఒకరి మీద ఆధార పడవలసిన అవసరం లేకుండా చూసుకోవాలి……………….
కొనసాగుతున్న ప్రసంగము వింటూన్న కళ్ళల్లో నుండి ధారాపాతంగా కారుతున్న నీటిని తుడుచుకునేందుకు కూడా శక్తి లేక కూలబడిపోయిన అతని వైపు భార్యా అత్తగారూ చూస్తూ ఉండి పోయారు.

తప్పు ఎవరిదైనా… వెనక్కు తిప్పలేని గతము….

4 thoughts on “అర్చన 2020 – అమ్మ నిర్ణయం

  1. katha chala bagundi saradakkaya. old agelo financialga okari mida bharam kakumda jagratapadite manchide. ending bagundi.

  2. చాలా చాలా బావుంది శారదగారు. వృద్ధాప్యం లో మనకంటూ కొంత మిగుల్చుకుని..ఏవరిమీద ఆధారపడకుండా వుండడం అక్షర సత్యం…

  3. కథ చాలా బావుంది.జీవితమంతా కష్టపడి కూడబెట్టి సంతానానికి ధారపొయ్యడం,
    అంత్యకాలంలో జీవశ్చవాల్లా వారి దయా దాక్షిణ్యాలమీద ఆధారపడటం.. ఇలాంటివి చదివినప్పుడైనా కొంచెం జాగ్రత్త పడతారు పెద్దలు.చక్కటి ముగింపు నిచ్చారు. శారద గారికి అభినందనలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *