April 18, 2024

అర్చన 2020 – అర్థనారీశ్వరం

రచన: ములుగు లక్ష్మీ మైథిలి

“అమ్మా… టవల్ మర్చిపోయాను..ఇవ్వమ్మా” బాత్రూంలో నుండి కేకేసాడు గోపి.
“ఇదుగో… అయినా నువు బయటికి వచ్చి తీసుకోవచ్చు చొక్కా మాత్రమేగా విప్పావు ..ఇంకా స్నానం చేయలేదు కదా”అంటూ టవల్ అందించింది తల్లి వాణి.
గోపి ఏమీ మాట్లాడకుండా టవల్ తీసుకొని స్నానం చేసిన తర్వాత ..ఆ టవల్ ను వళ్ళంతా చుట్టుకుని ..తన గదిలోకి వెళ్ళిపోయాడు.
“గోపి..రారా .. ఎంతసేపు ఇక్కడ టిఫిన్ పెట్టాను తిను.”అంటూ గది తలుపు తట్టింది వాణి.
“వస్తున్నా అమ్మ “అంటూ బయటకు వచ్చిన కొడుకుతో “ఏంట్రా.. తలుపులు వేసుకున్నావు.ఇక్కడ ఎవరూ లేరు, నాన్న ఆఫీసుకు వెళ్ళారు.నేనేమో వంటింట్లో ఉన్నాను”అంటూ అడిగింది.
“ఏం లేదమ్మా… ఊరికే అని చెపుతూ టిఫిన్ తిని, తల్లి ఇచ్చిన క్యారేజీ తీసుకుని స్కూల్ కి బయలుదేరాడు.
స్కూల్ బస్ కోసం బస్టాప్ దగ్గర నిలబడ్డాడు గోపి.
అప్పుడే అక్కడికి వచ్చిన కొందరు ఫ్రెండ్స్ “ఏంట్రా.. ఈ మధ్య అదోలా ఉంటున్నావు.ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉంటావు “అంటూ భుజంపై చెయ్యి వేసారు.
గోపి వాళ్ళను ఛీదరించుకున్నట్లు చూస్తూ “చెయ్యి వెయ్యకుండా మాట్లాడలేరా “అడిగాడు కోపంగా.
” అబ్బో… నువ్వు పదహారేళ్ళ అమ్మాయివైనట్టు, మేమంతా అబ్బాయి లైనట్టు బిహేవ్ చేస్తావేమిట్రా” అడిగారు.
“సరే రా.. బస్ వచ్చింది.పోదాం రండి,వాడు చాలా మెతక,ఏమీ అనకండి.”అంటూ ఒక విద్యార్థి గోపిని తీసుకొని బస్ ఎక్కాడు .
వారితో కాకుండా వేరే సీట్లో కూర్చున్నాడు గోపి.
బడిలో కూడా చివరి బెంచీలో కూర్చోవడం,అబ్బాయిలతో మాట్లాడం మానేసి,అమ్మాయిలతో చదువు గురించి
డిస్కస్ చేయడం చూసి”ఏరా ..గోపి పొద్దున మేము నీ దగ్గర కి వస్తే నెట్టేసాను. ఇప్పుడేమో ఆడపిల్లలతో కబుర్లు… ఏంటి కథ.. గర్ల్స్ కి లైన్ వేస్తున్నావా”అడిగారు స్నేహితులు.
“ఛీ‌…అలా అనటానికి సిగ్గు లేదా .. ఇంకోసారి ఇలా మాట్లాడితే టీచర్ తో చెపుతాను.”అంటూ అక్కడినుంచి వెళ్ళిపోయాడు గోపి.
రాత్రి భోజనం అయ్యాక ‌.. రూం లో కి వెళ్ళి బుక్ తీసి చదువుతున్నాడే కానీ ,
పుస్తకం పై మనసు నిలవటం లేదు.
‘ ఏమైంది తనకు… నాకు నేనే కొత్తగా కనబడుతున్న.నాకు ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలియటం లేదు.రోజు రోజుకు ఫ్రెండ్స్ పెట్టే ఇబ్బందులు భరించ లేక పోతున్నాను.అలా అని అమ్మాయిలతో మాట్లాడుతుంటే, కొన్ని రోజులకు వాళ్ళు ఏమనుకుంటారో ! ఈ స్కూల్ అంటే చిన్నప్పటి నుంచి చదివింది కాబట్టి అందరికీ నేనంటే ఏమిటో తెలుసు.కానీ, రేపు కాలేజీ లో చేరితే అక్కడ గర్ల్స్…వీడేంటి… మా వెంట పడుతున్నాడనీ , బ్యాడ్ ఒపీనియన్ తీసుకుంటారు…
ఏమిటో లోకమంటే భయం వేస్తోంది.ఈ ఆడవారు బయటికి వెళ్లి ఎలా ఉద్యోగాలు చేసుకుంటున్నారో .. ఈ మగతోడేళ్ళ మధ్య ఎలా బ్రతుకుతున్నారో ఇపుడిపు డే అర్థం అవుతోంది. శరీరం ఒకటి,మనసు
మరొకటి. మనసు చెప్పిన మాట వింటే సమాజం విచిత్రంగా చూస్తుంది.సమాజంలో కనీస గౌరవం ఉండదు.సాటి మనిషి గా చూసే మానవత్వం లేదు.కానీ ఏది ఏమైనా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయిపోతే
తనకు ఒక ఆధారం దొరుకుతుంది.’ అనుకుంటూ పడకుంది(కున్నాడు).గోపి.
కొద్ది రోజుల తర్వాత టెన్త్ రిజల్ట్స్ వచ్చాయి.తన సంతోషానికి అవధులు లేవు. ఫస్ట్ ర్యాంక్ సాధించాడు గోపి.
“నెక్స్ట్ ఏంటి ” అర్థం కాని ప్రశ్న మళ్లీ మైండ్ లో తిష్ట వేసింది.
ఆ రోజంతా ఆలోచించి… తల్లి తండ్రు లకు లెటర్ రాసాడు గోపి.
“అమ్మా… నాన్నా.. నేను ఇంటి నుంచి వెళ్లి పోతున్నందుకు క్షమించండి.ఇది మీరు సరిదిద్దలేని సమస్య.ఇప్పటి వరకు చాలా పరీక్షలు ఎదుర్కొన్నాను. నాకు ప్రతి రోజు ఈ సమాజంతో యుధ్ధమే
నా వల్ల మీరు ఇబ్బంది పడటం, బాధ పడటం నాకు ఇష్టం లేదు.నా మదిలోని భావాలు మీతో ఎప్పుడైనా చెప్పాలని అనిపించేది.కానీ దిగులు పడటమే కాకుండా, ఇరుగుపొరుగు వారితో సూటి పోటి మాటలు పడాల్సి వస్తుంది. అందుకే నేను వెళ్లి పోతున్నాను.ఎవరైనా అడిగితే నన్ను పట్నం కాలేజీలో చేర్పించామని చెప్పండి. హాస్టల్ లో ఉన్నాడని చెప్పండి. మీరు తట్టుకోలేని విషయం ఏమిటంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆడవాళ్ళ ఫీలింగ్స్ ఉండేవి.మీకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు.ఇప్పటిదాకా నేనే
ఏమిటో తేల్చుకోలేక పోతున్నాను.అబద్దం
నిజాల మధ్య నలిగిపోతూ బతుకుతున్న పిరికివాడిని.నేను అమ్మాయో, అబ్బాయో తెలియని అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నా.నాలాంటి శాపగ్రస్తమైన జీవితం ఎవరికీ రాకూడదు.నేను ఒక దశకు వచ్చాక… బ్రతకటానికి అవకాశం ఉంటే .. మళ్లీ కలుస్తాను.మిమ్మల్ని వదిలి పెట్టి వెళుతున్నందుకు చాలా బాధగా ఉంది. మీరు నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు.నేను పెద్ద చదువులు చదివి గొప్ప జాబ్ సంపాదించి, పెళ్లి చేసుకుని , మీకు మనవళ్ళను ఇచ్చి, మీ వంశం నిలబెడతాననీ కొండంత ఆశతో ఎదురు చూస్తున్నారు.మీ కోరికలను తీర్చలేని అసమర్థుడినో ,అసమర్థురాలినో ,ఎటూ కానివాడినో నాకేమీ తోచటం లేదమ్మా. కానీ నేను ఏదో ఒకటి సాధించి తీరుతా . ఎప్పుడో ఒకరోజు వచ్చి.. మీ సేవ చేసి మీ ఋణం తీర్చుకుంటాను.నా కోసం దిగులు పడకండి.నాకు కొన్నాళ్ళు టైం ఇవ్వండి. ఈ ప్రపంచం నన్ను ఎగతాళి చేసినా, నాకు నేనే ఆత్మస్థైర్యం తో బ్రతికిన రోజున తిరిగి వస్తాను‌.ఈ పుట్టుక మీరు, నేను నిర్ణయించింది కాదు.తెల్లవారబోతోందమ్మ ప్రపంచానికి, కానీ నా బ్రతుకు లో రాబోయే వెలుగు కోసం వెళ్లి వస్తానమ్మా.
ఇట్లు
అమ్మా నాన్నకు
పాదనమస్కారాలతో
మీ గోపి.”
అని ఉత్తరం రాసి తల్లి రోజూ పూజించే దేవుడి దగ్గర పెట్టి , తనకు ఇలాంటి జన్మ ఇచ్చిన దేవుని ఒకసారి చూసి బయటికి కదిలాడు గోపి.

దూరం గా ఉంటేనే మంచిది అని హైదరాబాద్ వెళ్ళే ట్రైన్ ఎక్కాడు గోపి.
రైల్వే స్టేషన్ లో దిగగానే … మొదట ఏదైనా చిన్న పని లో చేరాలనుకున్నాడు.
ఈ మహానగరంలో తాను బ్రతకటానికి ఉపాధి చూసుకుని తర్వాత ప్రైవేటు గా చదువుకుని … మంచి ఉద్యోగం చూసుకో వచ్చు అనుకుని… ఒక షాపింగ్ మాల్ లోకి వెళ్ళాడు గోపి.
కొద్ది రోజులు గోపి ప్రవర్తన గమనించి యజమాని “నువ్వు ‘కొ’ లా ఉన్నావు. వెళ్ళు వెళ్ళు నీలాంటి వాళ్ళు ఇక్కడ ఉంటే మాకు కలిసిరాలేదు.”అని పంపించేసాడు.
మళ్ళీ రోడ్డున పడ్డాడు గోపి. ఇలా కాదనీ తన దగ్గర ఉన్న డబ్బుతో అతి తక్కువ ధరలో చూడీదార్ కొని వేసుకున్నాడు. దారిలో నడుస్తుంటే కొందరు గేలీ చేయసాగారు.’గే’ అంటూ మరికొందరు ఏవేవో పిలుపులతో పిలుస్తూ ఉన్నారు.ఎవరూ తన వెనుక ఎగతాళి చేసినా పట్టించుకోలేదు గోపి.
‘తన లక్ష్యం వైపు పయనించాలంటే ఇలాంటి అవమానాలు భరించాల్సిందే. ‘ అనుకుంటూ… టిఫిన్ చేయడానికి ఒక హోటల్ కి వెళ్ళింది గోపి.
ఆకలికి తాళలేక తింటుందే కానీ తర్వాత బిల్లు ఎలా చెల్లించాలో తెలియటంలేదు. తెచ్చుకున్న డబ్బులు అయిపోయాయి.
చేతులు కడుక్కుని మెల్లగా లేచి కౌంటర్ దగ్గరకు వెళ్ళింది (డు).
“సారీ అండీ నా దగ్గర క్యాష్ లేదు.ఏ పని అయినా చేస్తాను చెప్పండి” అంది గోపి.
“నేను ఇస్తాను “అంటూ ఒక అమ్మాయి..గోపి బిల్లు కౌంటర్ లో చెల్లించింది.
గోపి ఆశ్చర్యం గా చూస్తుంటే… “పద బయటికి వెళ్లి మాట్లాడుకుందాం” అంటూ కదిలింది ఆమె.
“చాలా థాంక్సండీ..మీరెవరో కానీ” అని గోపి అడుగుతూ ఉండగానే …
“నువు ఎలాగో… నేను అలాగే..గే”చెప్పింది ఆమె.
“అంటే”
“నేను నిన్ను గమనించాను.నీది నాది ఒకే జాతి. ఇంతకూ నీ పేరు”
“గోపి”
“నా పేరు షాలిని, నీ పేరు చాందినీ గా మార్చుకో.మనం థర్డ్ జెండర్ వాళ్ళమనీ ఈ ప్రపంచం చిన్న చూపు చూస్తుంది. మనం ఆత్మ గౌరవంతో నిలబడాలంటే పోరాటం చేయాలి.ఇప్పటిదాకా ఏ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర లోనో, చౌరస్తా లోనో ట్రైన్ లో నో … అడుక్కుంటూ బతుకుతున్న మనలాంటి వారికి మార్గనిర్దేశం చేస్తూ..
‘కిరణ్’ అనే ఒక ట్రాన్స్ జెండర్ “వింగ్స్ రెయిన్ బో”అనే క్యాబ్ కంపెనీ పెట్టింది. అందులో మనలాంటి వారికి మాత్రమే డ్రైవర్లు గా ట్రైనింగ్ ఇస్తుంది.
నేను అక్కడే పని చేస్తున్నా.ఎందుకంటే మనకు ఏదైనా ఉద్యోగం కావాలి. ఆర్థికంగా నిలదొక్కుకోవాలి. మనల్ని పిలిచి ఎవరూ జాబ్ లు ఇవ్వరు. దానికి నేనే ఉదాహరణ.నా క్వాలిఫికేషన్ కు బెటర్ జాబ్స్ వచ్చాయి. ఎన్నో హేళనలు, వెకిలి చేష్టలు, అసభ్య ప్రవర్తన తో విసిగిపోయిన నాకు బ్రతుకు తెరువు దొరికింది అని సంబర పడ్డాను.కానీ అక్కడికి వెళ్ళాక వాళ్ళు నన్ను చూసి జాయిన్ చేసుకోలేదు.
చాలా దేశాల్లో ఎల్జిబీజీటీ (లెస్బియన్,గే, బై సెక్సువల్ అండ్ ట్రాన్స్ జెండర్) కమ్యూనిటీ వారు గౌరవం గా ఉద్యోగం చేసుకుంటారు.ప్రత్యేకించి థాయిలాండ్ లాంటి చోట్ల అయితే అన్ని సెక్టార్ల లో పని చేస్తున్నారు.మన దేశంలో మార్పు రావాలి
ఇంతకాలం ట్రాన్స్ జెండర్లంటే కేవలం సెక్స్ వర్కర్లగా గానీ, బిచ్చగాళ్ళగా కానీ చూసిన ప్రజల మైండ్ సెట్ మారాలి.2014లో సుప్రీం కోర్టు ట్రాన్స్ జెండర్లను .. థర్డ్ జెండర్ గా గుర్తించాలని, పౌరహక్కులన్నీ వారికి వర్తిస్తాయని చెప్పటంతో ఇపుడిపుడే మార్పు కనిపిస్తుంది.పద.. నిన్ను కూడా మా ఆఫీసు కు తీసుకు వెళతాను.” చెప్పింది షాలిని.
చాందినీ (గోపి) చాలా సంతోషించింది.
‘తాను జీవితంలో ఎన్నో కష్టనష్టాలను చూడాల్సి వస్తుందనీ… ఫుట్ పాత్ పై బిచ్చమెత్తుకోవాల్సి వస్తుందేమో అని భయపడింది. షాలిని దేవతలా అందుకుంది.తాను ఉద్యోగం లో జాయిన్ అయ్యాక ..‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అమ్మ నాన్న లను తన దగ్గర ఉంచుకోవాలి అని మనసులో గట్టిగా అనుకుంది’.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *