March 28, 2024

అర్చన 2020 – ఇంతింతై..

రచన: గరిమెళ్ల వెంకట లక్ష్మీనరసింహం

ఆకాశానికి చిల్లులు పడ్డాయా, అని భ్రమ కల్పిస్తూ, ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం, కరుణ అరుదయిందా వరుణునకు అని అనుమానం కలుగజేస్తూ, ప్రళయతాండవం చేస్తున్న బంగాళాఖాతం, ప్రకృతి ప్రకోపమా అన్నట్లు, గంటకు సుమారు 130 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఈదురుగాలుల తాకిడికి, నేలమట్టమవుతున్న చెట్లు, పెనుగాలులతో కూడిన వర్షానికి, అతలాకుతలమవుతున్న ప్రభావిత ప్రాంతాలు, పల్లపు ప్రాంతాలలోని జనాన్ని, దగ్గరలోనున్న పట్నంలోని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో నిమగ్నమయిన, ప్రభుత్వ మరియు స్వచ్చంద సంస్థల నిర్విరామ కృషి, ఇదీ, ఆ రేవుపట్నంలో ఆనాటి మధ్యాహ్న పరిస్థితి. సంధ్యా సమయమయింది. వాతావరణంలో, ఎట్టి మార్పు లేదు. జాలారిపేటనుండి, చేపల వేటకు, తీరానికి బహుదూరంగా సముద్రంలోనికి వెళ్లిన, ఇరవై ఆరుగురు జాలర్ల రాకకై, వారి కుటుంబాలు, వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాయి. వారిలో, ఎల్లయ్య రాకకొరకు, ఎదురు చూస్తున్న భార్య నూకాలమ్మ, కొడుకు పైడయ్య, కూడా ఉన్నారు. సిగ్నల్స్ పనిచేయక, సెల్ ఫోన్ల ద్వారా, వారి ఆచూకీ తెలిసే అవకాశం కోల్పోయింది. చేయగలిగినది లేక, గంగమ్మతల్లికి, గ్రామదేవతకు, పరిపరి విధాల, మ్రొక్కుకొంటున్నారు, వారంతా. ఆ రాత్రి, ఆ కుటుంబాలకు కాళరాత్రి అయింది.
మరునాడు తెల్లవారింది. పరిస్థితి యధాతధం.వేటకు వెళ్లిన జాలర్ల జాడ కొరకు, నేవీ రంగప్రవేశం చేసింది. తప్పిపోయిన జాలర్ల కుటుంబాలలో, ఆశలు చిగిరించేయి. సాయంత్రం అయిదు గంటల ప్రాంతంలో టీ వి , రేడియోలలో శుభవార్త ప్రసారమయింది. వేటకు వెళ్లిన జాలర్లలో ఇరవయి ముగ్గురు క్షేమంగా ఉన్నారని,మరో రెండు మూడు గంటలలో తీరం చేరుకోగలరని, మిగిలిన ముగ్గురి జాడకై, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, పదేపదే ప్రసారమవుతున్నాది. ఆ ముగ్గురి పేర్లు వెల్లడయ్యేయి. వాటిలో, ఎల్లయ్య పేరు లేకపోవడంతో భార్య నూకాలమ్మ, కొడుకు పైడయ్య, లాటరీలో కోటి రూపాయిలు వచ్చినట్లు, సంబరపడ్డారు.
సుమారు ఏడుగంటల సమయానికి, తుఫాను యొక్క మార్గం మళ్లడంతో, వాతావరణంలో అనూహ్యమైన మార్పు వచ్చింది. నిర్మలమైన ఆకాశాన, మేమెక్కడికీ పోలేదని పలకరిస్తూ, చుక్కలు అక్కడక్కడ ప్రత్యక్షమయ్యేయి. జనం ఊపిరి పీల్చుకొన్నారు. మరిక్రొద్ది సమయానికి, నేవీ వారి నౌకనుండి ఇరవైముగ్గురు జాలర్లు తీరం మీద అడుగు పెట్టేరు. అంతులేని సంతోషంతో వారి కుటుంబ సభ్యులు, మంగళహారతులతో వారికి స్వాగతం పలికేరు. సురక్షితంగా, తమవారిని తీరానికి చేరవేసిన నేవీ బృందానికి, పాదాభివందనాలు చేస్తూ, ‘కోటికోటి దండాలు సార్లూ, మా పసుపుకుంకాలు కాపాడినారు’ అని తమ కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

రాత్రి భోజనం చేస్తూ, ‘నూకాలూ, ఏటి మన బతుకులిట్టా అయిపోనాయి.’ అని, ప్రక్కనే ఆసీనురాలయిన భార్యతో, నిస్పృహతో అన్నాడు, ఎల్లాజీ.
‘ఏటయిందేటి’ నూకాలు ప్రశ్న.
‘ఏటి సెప్పేది, నూకాలూ. నీకు తెల్దా ఏటి. గమెంటోళ్ళేమో, డీజిలు దర పెంచేత్తున్నారు. ఆ ట్రాలరోల్లొచ్చి, మన కడుపులు కొట్టేతున్నారు. ఇఏయి కాక, ఈ తుపాన్లు. నీ కుట్టు మెసీను తిండెడుతున్నాది కానీ, వేటకెళితే ఏటి ఒత్తున్నది.’ విరక్తి వెలగబోస్తూ, మరో పిడచ మింగేడు, ఎల్లాజీ.
‘మావా, మనమేటీ సేయనేం. నీకెప్పుడో సెప్పినాను, ఈ జాలరి బతుకులిట్టాగే ఉంటాయని.’ గతాన్ని జ్ఞాపకం చేసింది, నూకాలు.
‘మా అయ్యా, తాతా జాలారోళ్లేనా. ఆల్ల బతుకులెట్టా ఉండేయి. మా అయ్య కట్టిందేగా ఈ ఇల్లు.’ అలనాటి రోజులు స్మృతిపథంలోకి తెచ్చుకొన్నాడు, ఎల్లాజీ.
‘మావా, ఆల్ల రోజులేరు. ఈయ్యాలా రేపూ, పతిదానికి మసీన్లోచేసినాయి. సదువుల్నేకపోతే బతుకుల్లేవు.’ అని ప్రస్తుత పరిస్థితులను, భర్తకు అవగాహన చేసింది, నూకాలు.
‘అవును నూకాలూ. కరట్టుగా సెప్పినావు. పైడయ్యను, సదువులో ఎట్టి, మంచి పని సేసినావు.’ భార్య వివేకానికి, కితాబిచ్చేడు, ఎల్లాజీ.
భోజనంతోబాటు, సంభాషణ కూడా ముగిసింది. అలసి ఉన్న ఎల్లాజీ, నిద్రాదేవి కౌగిట్లోకి చేరుకొన్నాడు.

జాలారిపేటలో ముఫై కుటుంబాలు నివసిస్తున్నాయి. వారిలో కొందరు గృహిణులు, పెండ్లి కాని ఆడపిల్లలు, దగ్గరలో ఉన్న ఇళ్లలోను, అపార్ట్మెంట్స్ లోను ఇంటిపనులు చేస్తూ, వేన్నీళ్ళకు చన్నీళ్ళు కలుపుతూ గుట్టుగా వారి సంసారాలను గట్టెక్కిస్తున్నారు. ఆ విషయంలో, నూకాలమ్మ మరో మార్గం ఎంచుకొంది. తాను స్కూలు ముఖం ఎప్పుడూ చూడలేదు. కాని తెలివైనది. ఆత్మాభిమానం గలది. ఒకరి దగ్గర పని చేస్తూ, వారు తినగా మిగిలిన మెతుకులకు ఆశపడుతూ, జీవనం గడపడం, సుతరామూ ఇష్టం లేదు. అందుచేతే పది సంవత్సరాల క్రితం, ఒక స్వచ్ఛన్ద సంస్థ ఏర్పాటు చేసిన శిబిరంలో, కుట్టుపని నేర్చుకొంది. సెకండుహేండ్ కాళ్ళతొక్కుడు మెషీను కొనుక్కొని, ఇంటిదగ్గరే జాకెట్లు, పరికిణీలు కుడుతూ, ధనార్జన ప్రారంభించింది. వృత్తిలో మంచి పేరు తెచ్చుకొంది. వ్యాపారం పెరగడంతో, క్రిందటి సంవత్సరమే, బేంకులో అప్పు తీసుకొని, క్రొత్త ఎలక్ట్రిక్ మెషీను కొనుక్కొంది.
పెరిగిపోతున్న డీజిలు ధరలు, నావలకు, వలలకు పెడుతున్న రిపేరు ఖర్చులు కూడి, చేపల వేట ద్వారా జాలరులకు వచ్చే ఆదాయానికి, గండి పెడుతున్నాయి. వారికి ఆదాయం కన్నా, ఖర్చులు ఎక్కువవుతున్న రోజుల సంఖ్య పెరుగుతోంది. ఈ నిత్యసత్యాన్ని గ్రహించి, నూకాలమ్మ, తన ఏకైక సంతానం పైడయ్యను, చదువులో పెట్టింది. పైడయ్య కూడా, పట్టుదలతో తెలివిగా చదువుకొని, చెప్పుకోదగ్గ మార్కులతో, పది పాసయ్యేడు .
తండ్రి ఆదాయం నామమాత్రమే గనుక, తల్లి ఇంటిపని, కుట్టుపనులతో రాత్రింబగళ్లు కష్టబడవలసి వస్తోందని గ్రహించి, పైడయ్య ఉద్యోగప్రయత్నాలు మొదలు పెట్టేడు. ఫలించ లేదు. ప్రక్క ఇంట్లోనే ఉంటున్న, మేనత్త సీతాలుతో, విషయం చర్చించేడు. సీతాలుకు ఓ ఆలోచన తట్టింది. సుమారు పది సంవత్సరాల నుండి, సీతాలు పట్నంలో పేరుబడ్డ కార్డియాలజిస్ట్, డాక్టర్ వివేక్ రెడ్డిగారింట్లో, ఇంటిపనులు చేస్తోంది. అంకితమైన సేవ, సత్ప్రవర్తనల మూలన్న, సీతాలు డాక్టరు గారి కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలు చూరగొంది. డాక్టరు గారికి, పట్నంలోని పెద్దవాళ్ళతో బాగా పరిచయాలున్నాయని తెలిసిన సీతాలు, తన మేనల్లుడికి ఉద్యోగవిషయంలో సహాయం చెయ్యమని, ఆయనని వేడుకొంది.
డాక్టరుగారు చెప్పినట్లు, ఆదివారం సాయంత్రం, మేనల్లుడు పైడయ్యతో బాటు, డాక్టరుగారిని కలిసింది సితాలు.
డాక్టరుగారి ఎదుట సీతాలు, పైడయ్య వినయంగా నిలబడ్డారు. డాక్టరుగారు, పైడయ్య చదువు వివరాలు అడిగి తెలుసుకొన్నారు.
‘నువ్వు ఎక్కడైనా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవా’
‘పోయిన నెల, గవర్నమెంటులో ప్యూను పోస్టు ఇంటర్వూకి వెళ్ళేను సార్.’
‘ఏమిటయింది’
‘లక్ష రూపాయలడిగేరు సార్. నా వద్ద అంత సొమ్ము లేదంటే, అప్పోసప్పో చేస్తే ఏడాదికల్లా ఆ సొమ్ము ఒసూలయిపోతాదన్నారు సార్. ఏటి చెయ్యలేక ఊరుకున్నాను సార్’
వ్యంగ్యంగా ఓ చిరునవ్వు నవ్వేరు డాక్టరుగారు.
‘సీతాలూ, నాకు తెలిసినంత వరకు లంచాలివ్వకుండా గవర్నమెంట్ ఉద్యోగాలు దొరకవు. నా సలహా అడిగితే వీడు ఏదయినా వృత్తివిద్య అంటే, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్ వంటివి నేర్చుకొంటే వాడి కాళ్ళమీద వాడు నిలబడగలడు. లంచాల గొడవ ఉండదు. మరొకరి దగ్గర తలవంచి పనిచెయ్యవలసిన అవసరం ఉండదు. అదృష్టం కలిసొస్తే కొన్నాళ్ళకి వాడే మరో నలుగురికి ఉద్యోగాలివ్వగలడు. ప్రస్తుతం ప్రభుత్వం కూడా వీడివంటి వాళ్ళకి, అదే దారి చూపిస్తోంది.’
‘ఏరా, అయ్యగారు సెప్పిందిన్నావుగదా, పెద్దోళ్ళు. ఆళ్ళకన్నీ బాగా ఎరిక. అయ్యగారు సెప్పినట్టూ సెయ్యి.’
‘ మీరేమిటి చెయ్యమంటే అదే చేస్తాను సార్.’
‘ సీతాలూ, బెడ్రూములో నా సెల్ ఫోనుంటుంది, తీసుకురా.’ రెడ్డిగారు రంగంలోకి దిగేరు.
కొద్దిసేపట్లో, సితాలు డాక్టరుగారికి సెల్ ఫోన్ వినయంగా అందించింది.
డాక్టరుగారు ఫోన్లో ఎవరితోనో మాట్లాడిన తరువాత ….
‘ నువ్వు లక్కీ ఫెలోవిరా, మన ఊళ్ళో, స్కిల్ డెవలెప్మెంట్ సెంటర్ వాళ్ళు, నాలుగు పెద్ద కంపెనీ వాళ్ళ సహాయంతో, వచ్చే ఒకటో తారీఖునుండి, నీ వంటి వాళ్ళకి వృత్తివిద్యల్లో ట్రైనింగ్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారట. ఎలక్ట్రికల్ పనులు, ప్లంబింగ్, వెల్డింగు, కార్పెంట్రీ …ఇంకా ఏవో చెప్పేరాయన. వాటిలో, నాలుగు నెలలు ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తారట. ట్రైనింగ్ అయిన తరువాత వాళ్ళకి, గవర్నమెంట్, సర్టిఫికెట్లు ఇస్తుందిట. పెరఫార్మన్స్ నచ్చిన వాళ్ళకి ఆ కంపెనీలలో ఉద్యోగాలిస్తారట. లేదా, స్వంతంగా పని చేసుకోవచ్చు. మంచి అవకాశం. పని బాగా నేర్చుకొంటే, ఎంత కష్టబడితే, అంత ఆర్జించగలవు. నీ ఒంట్లో శక్తి ఉన్నన్నాళ్ళు ఆర్జించగలవు. గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఏముంది. గుర్రాలికి, గాడిదలికి, తేడా ఉండదు. అదీగాక, ప్యూన్ పోస్టులో, ఎదుగు బొదుగూ ఉండదు. అంచేత, ఆ విషయం మర్చిపో. నీ విషయం ఆయనికి చెప్పేను. పంపించమన్నారు. ఎడ్రస్ రాసిస్తాను. రేపు ప్రొద్దున్న తొమ్మిది గంటలికి ఆయన్ని కలిస్తే ఏమిటి చెయ్యాలో చెప్తారు. Good luck.’
‘చాలా థేంక్స్ అండి అయ్యగారు.’ అని వినయంగా, రెడ్డిగారికి పాదాభివందనం చేసి, పైడయ్య, మేనత్తతోబాటు ఆయన శలవు తీసుకొన్నాడు.

పైడయ్య, ఆఫిసరు గారిని కలిసేడు. కార్పెంటరీలో శిక్షణకు ఎంపికయ్యేడు. శిక్షణా తరగతులు ప్రారంభమయ్యేయి. శ్రద్ధగా, అంకితభావంతో వడ్రంగి పని నేర్చుకొంటూ, తన వినయవిధేయతలతో, పైడయ్య బోధకుల ప్రశంసలనందుకొన్నాడు. కేలెండరులో నాలుగు పేజీలు తిరగబడ్డాయి. శిక్షణకు తెరపడ్డాది. పైడయ్యకు ఒక కంపెనీలో ఉద్యోగావకాశం లభించింది. కానీ, తల్లి నూకాలమ్మ సలహా మేరకు, స్వయం ఉపాధికే నిర్ణయించేడు. కావలిసిన పనిముట్లు కొనుగోలు చేసి, గ్రామదేవత గుడిలో వాటికి తల్లిదండ్రులు, మేనత్తల సమక్షంలో, పూజలు జరిపించేడు. సీతాలుతో వెళ్లి, డాక్టరుగారి ఆశీర్వచనాలు అందుకొన్నాడు.
ముందుగా, దగ్గరలో ఉన్న ఎపార్ట్మెంట్స్ ల వాచ్మెన్ లను, తన వృత్తిలో సహాయం అర్థిస్తూ, వారందరకు పైడయ్య తన సెల్ ఫోన్ నెంబరు ఇచ్చేడు. పరాయి ఇళ్లలో పని చేస్తున్న జాలారిపేట మహిళల సహకారం కూడా వేడుకొన్నాడు. సీతాలు, తెలిసినవారందరి చెవిలో, మేనల్లుడి మాట వేసింది.
ఒక శుభముహుర్తాన్న పైడయ్య సెల్ ఫోన్ మ్రోగడం ప్రారంభమయింది. ఫోన్లో విషయం తెలుసుకొన్నాడు. ఆనందోత్సాహాలతో, ఎదురుగా గోడకు వ్రేలాడుతున్న గ్రామదేవత ఫోటోకు తలవంచి నమస్కరించి, ఆరోజు ఇంటివద్దే ఉన్న తండ్రికి, తల్లికి పాదాభివందనం చేసి, మేనత్త సీతాలు ఆశీర్వచనాలు ఫోనులో అందుకొని, చిన్న గోనెసంచిలో పనిముట్లు భద్రపరచి, పైడయ్య సైకిలు మీద హనుమాన్ ఎపార్ట్మెంట్స్ చేరుకొన్నాడు. వాచ్మెన్ వెంట, పదహారో నెంబర్ ఎపార్టుమెంటులో కాలు మోపేడు. వారం రోజుల్లో అమెరికానుండి కూతురు, అల్లుడు వస్తున్నారని ఈ లోగా సోఫాసెట్, డైనింగ్ సెట్లకు కావలిసిన కొద్దిపాటి రిపేర్లు చేసి, పోలిష్ చెయ్యాలని ఇంటాయన చెప్పేడు. ఎంతవుతుందని అడిగేడు.
‘పని చూసేక తమరెంత ఇస్తే అంతే పుచ్చుకొంటానయ్యగారూ. బేరమాడను.’ వినయంగా చెప్పేడు, పైడయ్య.
‘సరే, పని మొదలుపెట్టు.’ అన్నారాయన.
ఎదురుగా గోడకు చక్కగా అమర్చిబడిఉన్న వెంకటరమణమూర్తి ఫోటోకు నమస్కరించి, పని ప్రారంభించేడు పైడయ్య. అతి శ్రద్ధతో తన నైపుణ్యాన్ని వినియోగించి, సోఫా సెట్, డైనింగ్ సెట్లను సరికొత్తవా, అని భ్రమింప జేస్తూ తయారు చేసేడు. ఆ వార్త, వాచ్మెన్ ద్వారా తెలిసిన కొందరు ఇతర ఎపార్ట్మెంట్స్ వారి పిలుపుతో, పైడయ్యకు హనుమాన్ ఎపార్ట్మెంట్స్ లోనే, వరసగా పది రోజులు పని ప్రాప్తించింది.
నైపుణ్యం గల వడ్రంగిగా పేరు నాలుగు ప్రక్కల ప్రాకడంతో, అతి త్వరలో పైడయ్య చాలా బిజీ కార్పెంటరయ్యేడు. పాతబడిన డైనింగ్ సెట్స్, సోఫాలను, సరిక్రొత్త వాటివలె తయారు చేయడంలో, పైడయ్య పేరుబడ్డాడు. అతని చేతుల మీదుగా, చాలా అపార్ట్మెంట్స్ లోని పాత ఫర్నిచర్, క్రొత్త అవతారం ఎత్తేయి. వృత్తిలో, అభివృద్ధి త్వరితగతిన విస్తరిస్తున్న మూలాన్న, పైడయ్య తన జాలారిపేటలోనే ఉన్న, మరో యువకుడుని, తన దగ్గర సహాయకునిగా చేర్చుకొన్నాడు.
అటు ఇంటివద్ద, నూకాలమ్మ కుట్టుపని వ్యాపారం జోరందుకొంటోంది. చీరలకు ఫాల్స్, చిన్న పిల్లల దుస్తులు కూడా కుట్టడం ప్రారంభించడంతో, ఇద్దరు తోటి మహిళలకు పని నేర్పి సహాయకులుగా పని కల్పించింది. ఫలితం. జాలారిపేటలో ఓ రెండు కుటుంబాల ఆదాయం పెరిగింది.
ఒకరోజు, పైడయ్య అగర్వాల్ గారింట్లో పనిచేస్తుండగా, ముంబై నుండి వచ్చిన ఆయన బంధువు జితేంద్ర, ‘నీ పని నైపుణ్యంతో ముంబై లో లక్షలు, లక్షలు ఆర్జించగలవు. నాతో రా. కొన్నాళ్లవరకు నా దగ్గరుండొచ్చు. నీకు పనులు నేను చూపిస్తాను.’ అని ఆశ చూపడంతో, ఆ మరుచటి వారం, ఆయనతో బాటు, ఆ మహానగరంలో అడుగు పెట్టేడు పైడయ్య. నూకాలమ్మకు, ఎల్లయ్యకు అంత నచ్చకపోయినా, అడ్డు చెప్పలేదు.
జితేంద్ర, ప్రపంచంలో గల, అతిపెద్ద మురికివాడలలో, మూడవ స్థానంలో ఉన్న ధారావీలో, ఉంటున్నాడు. మధ్యవర్తి వృత్తిలో, లక్షలు ఆర్జిస్తున్నాడు. పైడయ్యను, ఒక గదిలో మరో ముగ్గురితో బాటు ఉంచి, ఒక పావుగా వాడుకోడం ప్రారంభించేడు. ఆ మురికివాడలో, దుర్భరమైన దైనందిన జీవనం తో అసంతృప్తి చెందుతున్న పైడయ్య మనోభావాలు గ్రహించి, పంజరం లోని చిలక పారిపోతుందేమో అని, త్వరలో సౌకర్యమైన నివాసానికి మారుస్తానని ఒక హామీ పారేసేడు. కాని, జితేంద్ర నిజస్వరూపం తెలుసుకోడానికి, పైడయ్యకు అట్టే రోజులు పట్టలేదు. కొద్ది రోజులలోనే పైడయ్య, కిటకిటలాడుతూ రాత్రింబగళ్లు పరుగులు తీస్తున్న జనాలు, ప్రాణాలకు తెగించి, బయటకు వ్రేలాడుతున్న ప్రయాణీకులతో, శరవేగంతో దూసుకుపోతున్న లోకల్ ట్రైన్లు, మానవత్వం కరువై, యాంత్రిక జీవనం గడుపుతున్న ముంబైవాసులను, దగ్గరగా చూసి, తన జాలారిపేటలో, మనుషులమధ్య ఉండే ఆప్యాయత,సంఘీభావం, అక్కడి జీవనంలో ఉండే సుఖసంతోషాలు, సంతృప్తి, ఇక్కడ ఎంత లోపిస్తున్నాయో, తెలుసుకొన్నాడు. ఇక్కడ, సగటున ‘ప్రతి మనిషీ, మరి ఒకని దోచుకొనేవాడే’ అని అతి త్వరలోనే గ్రహించేడు. ‘ముష్కిల్ హై జీనా యహా’ అన్న నిశ్చయానికొచ్చి, ముంబైకి గుడ్ బై చెప్పేడు.

పైడయ్య తిరిగి జాలారిపేటలో అడుగు పెట్టేడు. ఆరువారాలకు పైగా మూలబడిఉన్న, అతని సైకిలు మళ్ళీ రోడ్డెక్కింది. వృత్తి త్వరలోనే జోరందుకొంది. ఆదాయం బాగా పెరగడంతో, సైకిలు స్థానాన్ని స్కూటరు ఆక్రమించింది. సుమారు, రెండేళ్లకు పైబడి పైడయ్యకు సహాయకులుగా పనిచేస్తున్న, ఇద్దరు యువకులూ, పనిలో కొంత నైపుణ్యం సంపాదించేక, వేరు కుంపటి పెట్టేరు. పైడయ్య, మరో ఇద్దరిని చేర్చుకొన్నాడు.
ఓ శుభ ముహుర్తాన్న, పైడయ్యకు, బంధువుల పిల్ల పోలమాంబతో, వివాహమైంది. పెళ్లినాటికి, పోలి, జూనియర్ కాలేజీలో ఉంది. భర్త, అత్తమామల ప్రోత్సాహంతో, బి.కామ్.చేసింది.
పైడయ్య స్నేహితుడు సింహాద్రి, ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఒకరోజు, Fevicol కంపెనీ వారు ప్రచురించిన, Furniture making పుస్తకాలు, బజారులో అతని కంట బడ్డాయి. అవి చూస్తూంటే, స్నేహితుడు పైడయ్య, జ్ఞాపకమొచ్చేడు. వాడికి పనికివస్తాయని అలోచించి, ఆ పుస్తకాలు కొని, పైడయ్యకు పంపించేడు. పైడయ్య, ఉన్నత ఆశయాలు గల వ్యక్తి. ఆ పుస్తకాలు అందుకొన్నాక స్వంతంగా ఫర్నిచర్ తయారుచెయ్యడం వేపు, దృష్టి సారించేడు పైడయ్య. బేంకు రుణంతో, నలుగురు సహాయపు పనివారితో, వర్క్ షాపు ప్రారంభించేడు. చేపల వేటకు వెళ్లని రోజుల్లో, ఎల్లయ్య వర్క్ షాప్ లో పైడయ్యకు చేతనైన సాయం చేసున్నాడు. పైడయ్య తయారు చేసిన సోఫా సెట్లు, డైనింగ్ సెట్లు, మొదలైనవి పట్నంలో పేరు బడ్డాయి. ఆ పేరుప్రతిష్టలు, పట్నంలో నడిబొడ్డున, ఒక ఆధునిక షో రూమ్ వెలియడానికి, పునాదులు వేసేయి. పైడయ్య వర్క్ షాప్ నడిపిస్తుంటే,, భార్య పోలమాంబ షో రూమ్ బాధ్యతలు నిర్వహించడానికి నిశ్చయమైంది. పెద్దలు ఎంచిన ఓ రోజున, గ్రామదేవత పూజలనంతరం, డాక్టర్ వివేక్ రెడ్డి గారి చేతులమీదుగా, ‘ మారుతి ఫర్నిచర్స్’ ప్రారంభోత్సవం జరిగింది. పైడయ్య, ఏ స్థాయినుండి ఏ స్థాయికి, ‘ఇంతింతై’ ఎంతగా ఎదిగేడో, మీడియా విశదీకరించింది. పండ్రెండు సంవత్సరాల క్రితం, చిన్న గోనెసంచిలో పనిముట్లు పెట్టుకొని, సైకిలు మీద హనుమాన్ అపార్ట్మెంట్స్ కు పోయి, వడ్రంగి వృత్తి ప్రారంభించిన పైడయ్య, నేడు ఒక వర్క్ షాపు, మరియు ఒక అధునాతనమైన ఫర్నిచర్ షో రూముకు, యజమానిగా ఎదిగిన, అతని జీవిత విశేషాలు ప్రధనాంశాలయ్యేయి. మీడియా పైడయ్యను ఒక ఆదర్శ యువకునిగా సమాజం ముందు నిలబెట్టింది.

* * * * *

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *