April 25, 2024

అర్చన 2020 – క్రొత్త జీవితం

రచన: మారోజు సూర్యప్రసాద్

”మీకు పెళ్ళి అయిందా?” మీడియా యాంకర్ సూటిగా ప్రశ్నించింది.
”పెళ్ళి అయింది!” తాపీగా జవాబు చెప్పాను.
”పిల్లలెంతమంది?” ఆమె మరో ప్రశ్న సంధించింది.
”నలభైమంది!” అంతకంటే ధీమాగా సమాధానమిచ్చాను.
”నలభైమందా? సాధారణంగా ఇద్దరో ముగ్గురో పిల్లలుంటారుగానీ… ఎక్కడైనా ఇంతమంది పిల్లలుంటారా?” అసలే పెద్దకళ్ళను మరింత పెద్దవి చేస్తూ చక్రాల్లా త్రిప్పుతూ మరింత అందంగా ఆశ్చర్యార్థకంగా ఎక్స్ప్రెషన్ ఇచ్చింది.
”అందరూ… నా పిల్లలే! సందేహం లేదు!”
”అంటే… అందరూ మీరుకన్న వాళ్ళేనా? మీకు పుట్టిన వాళ్ళేనా?”
”ఎవరైనా అంతమందిని కనగలుగుతారా?” తిరిగి ఎదురు ప్రశ్న వేశాను.
యాంకర్ క్షణకాలం నిర్ఘాంతపోయింది. అయినా మరుక్షణంలో తేరుకొంది.
”నలభై మంది పిల్లలు! సంఖ్య బాగుంది! మండలం రోజుల్లాగా… మండల దీక్షలాగా… మండల వ్రత విధానంలా! ఇంతకూ మీకు పుట్టిన వారెంతమందో… చెప్పలేదు!”
”నాకెవరూ పుట్టలేదు! ఎవరినీ కనే అవకాశం రాలేదు!” నిట్టూర్చాను.
”అంటే… మీ భర్త….” యాంకర్ ప్రశ్నార్ధకంగా చూసింది.
”నా భర్త బ్రతికే ఉన్నాడు! నాకు పదునాలుగేళ్ళకే పెళ్ళి చేశారు. అప్పుడు మా నాన్న ఆర్ధికంగా చిదికిపోయాడు. వ్యాపారంలో బాగా నష్టపోయాడు! అప్పుల పాలయ్యాడు. ఇవ్వవలసిన అప్పుక్రింద, వడ్డీక్రింద నన్ను ఓ అయ్యచేతిలో పెట్టాడు. ఒక్కగానొక్క ఈ కూతురి జీవితం బాగుంటుందని పెళ్ళి చేశాడు!” నా స్వరం గద్గదమైంది.
అంతకు ముందే రికార్డు చేయబడిన ఆ టీవీ ప్రోగ్రామ్ ఆరోజు ప్రసారమౌతున్న సమయంలో మా సేవాసంస్థ సభ్యులందరం కూర్చుని చూస్తున్నాము.
”మంచిదేగదా! మీ పెళ్ళి చేయడం వలన మీ బాధ్యత తీరిపోయిందిగదా!” యాంకర్ సంతృప్తి ప్రకటించింది.
”మా నాన్న నా బాధ్యత తీరిపోయిందనుకున్నాడు. అప్పుడే నా జీవిత సమస్య మొదలైంది?” నిట్టూర్చాను.
ఓ పాప్యులర్ టీవీ ఛానెల్ వాళ్ళు నిర్వహిస్తున్న ‘వనితారత్న’ ఎవార్డు కోసం ఫైనల్ సెలక్షన్స్ జరుగుతున్న ఓపెన్ ఇంటర్వ్యూ అది! ఆ అవార్డు డిక్లరేషన్ ప్రోగ్రామ్లో ఎంతో మంది ప్రేక్షకులు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. వారి కామెంట్లు, చెణుకులు బెణుకులు, చమత్కార కారాలు మిరియాలు అవార్డు కోసం పోటీపడే అభ్యర్థులను ఇంటర్వ్యూలో ఇబ్బంది పెడుతున్నాయి, కలవరపెడుతున్నాయి!
”సమస్య మొదలైందని అంటున్నారు… అంటే… ఏమైంది?” యాంకర్ అడిగింది.

”ఏమై ఉంటుంది? భర్త ఆమెను వదలేసి ఉంటాడు!” ఓ ప్రేక్షకుడు అన్నాడు.
”భర్త నన్ను వదిలేయడం కాదు! నేనే భర్తను వదిలేశాను!” స్థిరంగా అన్నాను.
”మీరు భర్తను వదిలేశారా?” యాంకర్ ఆశ్చర్యం ప్రకటించింది.
”అవును! వదలివేయాల్సి వచ్చింది? నా పెళ్ళి నాటికే అతడి మొదటి భార్యపోయి రెండు సంవత్సరాలైంది! రెండేళ్ళుగా అతడికి సంబంధం కుదరలేదు. నా దురదృష్టం కొద్దీ రెండవ భార్యనైనాను” క్షణం గొంతు వణికింది.
కొద్ది క్షణాలు నిశ్శబ్ధంగా ఉన్న యాంకర్ మళ్ళీ ప్రశ్నించింది.
”అతడి మొదటి భార్యకు పిల్లలెవరైనా ఉన్నారా?”
”ఉన్నారు! ముగ్గురు మగపిల్లలున్నారు. మొదటి అబ్బాయి నా కంటే ఆరేళ్ళు చిన్నవాడు. రెండవ వాడికి, మూడవ వాడికి మధ్యన మూడు సంవత్సరాల తేడా ఉంది! వాళ్ళకు తల్లిగా పనిమనిషిగా, సేవ చేయడానికి మాత్రమే నన్ను పెళ్ళి చేసుకున్నాడు. సమాజానికి నన్ను భార్యగా పరిచయం చేసేవాడు. ఇంట్లో అంతకంటే అధ్వాన్నంగా ఓ వంట మనిషిగా ఓ మరమనిషిగా చూసేవాడు. నాలుగు గోడల మధ్యనే నేను జీవితం గడపాల్సి వచ్చేది! ఎండ కన్నెరుగని దానిలా చీకటిలోనే జీవించాల్సి వచ్చేది!”
నేను క్షణకాలం తమాయించుకోవడాన్కి నిశ్శబ్దంగా ఉండిపోవలసి వచ్చింది.
”పోనీ! పిల్లలెవరైనా మిమ్మల్ని ‘అమ్మా’ అని పిలిచేవారా? కనీసం ‘పిన్ని’ అంటూ పలకరించేవారా?” యాంకర్ ఉత్సుకత ప్రదర్శించింది.
”ఎందుకు చూడరూ?” పిన్నిలా ఆదరించే ఉంటారు!” మరో ప్రేక్షకుడు కామెంట్ చేశాడు.
”తల్లికాదు… సోదరా! కనీసం పేరు పెట్టి కూడా పిలిచేవారు కాదు!” ‘ఏమే’ అనేవారు. ‘ఓయ్’ అనో.. ‘ఒసేవ్’ అనే పిలిచేవారు. వాళ్ళు ముగ్గురూ ఒకరి తరువాత మరొకరు నా కదలికలపై గూఢచర్యం జరిపేవారు. ఒకరు లేకపోతే మరొకరు ఇంట్లోనే నన్ను అంటిపెట్టుకొని ఉండేవారు. తండ్రి ఇంటికి తిరిగి రాగానే గూఢచారి సమాచారం అందించేవారు!” నా కళ్ళల్లో నీళ్ళు తళుక్కుమనడం టీవీ తెరపై స్పష్టంగా కనిపించింది.
”ఆ గూఢచర్య ప్రభావం మీ జీవితాన్ని అతలాకుతలం చేసి ఉండాలే!” యాంకర్ సందేహంగా నావైపు చూసింది.
”చాలా ప్రభావం చూపించింది! నా భర్త నావైపు చూసేవాడు కాడు! పలకరించేవాడు కాడు. బయటకు వెళ్ళనిచ్చేవాడు కాడు. ఇరుగూ పొరుగు వాళ్ళెవరినీ మా ఇంటికి రానిచ్చేవాడుకాడు. నన్నెవరి ఇళ్ళకూ వెళ్ళనిచ్చేవాడు కాడు. ఎవరినీ కలవనిచ్చేవాడుకాడు. వంట ఇంటి కుందేలులా అక్కడే చచ్చిపోతాననిపించేది. ఒంటరిగా నాలో నేను కుమిలిపోయేదాన్ని! అనారోగ్యంగా ఉన్న నాన్న ఆరోగ్యంగా తిరిగి వస్తాడని ఎదురు చూచేదాన్ని! ఎన్నోసార్లు చచ్చిపోదామనుకున్నా! నాకు చావడానికి కూడా స్వతంత్రం లేదు. ఇంట్లో ఎప్పుడూ ఎవరో ఒకరు ఉండేవారు! అప్పుడే చదువుకోవాలని ఓ నిర్ణయానికి వచ్చాను!’ నిబ్బరంగా అన్నాను.
”మంచి నిర్ణయమే తీసుకున్నారు!” యాంకర్ మెచ్చుకుంది.
”చదివి ఏం వెలగబెడదామనుకుందో!” ఒక ప్రేక్షకుడు ఎద్దేవా చూశాడు.
”చదివి ఉద్యోగమేలాలా? ఊళ్ళేలాలా!” మరొకరు ఎగతాళిగా అన్నాడు.
”సోదరా! ఉద్యోగమే చేయాలనుకున్నాను. అయినా ఉద్యోగం చేయడానికే చదువుకోనవసరం లేదు. చదువు సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది! అంధకారంలో ఉన్న జీవితానికి వెలుగు ప్రసాదిస్తుంది. ఆత్మవిశ్వాసం వస్తుంది! జీవనగమన విధానానికి సరియైన మార్గం దొరుకుతుంది! ఔనంటారా?” యాంకర్ను ప్రశ్నించాను.
యాంకర్ ‘ఔనన్నట్లు’ తలాడించింది!
”ఒకప్పుడు కోడలు నలుపైతే… కులమంతా నలుపుఔతుందని అనేవారు. అంటే ఎవరైనా అర్థం చెబుతారా?” ప్రేక్షకులకో సవాల్ విసిరాను.
”ఏముందీ! ‘నల్లపిల్ల’ అయితే… పుట్టబోయే సంతానమంతా నల్లగా ఉంటుందంటారు!” ఒకరు జవాబిచ్చారు.
”అది తప్పు సోదరా! ‘నలుపు’ అంటే అజ్ఞానం! అజ్ఞానం వలన మూర్ఖత్వము వలన మంచీ చెడూ విచక్షణా జ్ఞానముండదు! చిన్నా పెద్దా తారతమ్యాలు తెలియవు. పరిసరాల పరిశుభ్రత తెలియదు. గృహావసరాల ఆవశ్యకత అంతకన్నా తెలియదు. అత్తవారి కుటుంబ గౌరవ మర్యాదలు అర్థం చేసుకునే సంస్కారముండదు! అటువంటి నలుపు అనే అజ్ఞానమున్న కోడలు వస్తే కుటుంబ గౌరవ మర్యాదలు మంట గలిసిపోతాయి! అందుకే జ్ఞానమున్న అమ్మాయి కోడలుగా వస్తే వంశాభివృద్ధి జరుగుతుంది! కోడలి రంగు కంటే జ్ఞానమనే గుణమే మిన్నని అలా అన్నారు!”
నా విశ్లేషణకు కొంతమంది ప్రేక్షకులు చప్పట్లతో సంబరం చేసుకున్నారు. నా పట్ల వారిలో ఆరాధనా భావం మొదలై విసుర్ల కారాలు మిరియాలు తగ్గిపోయాయి!
”అలా… ఎంతకాలం నిరీక్షించాల్సి వలసివచ్చింది!” యాంకర్ అడిగింది.
”సుమారు ఆరు సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పటికి నాన్న ఆరోగ్యపరంగా, ఆర్ధికంగా కుదుటబడి అమ్మతో మా ఇంటికి వచ్చారు. నా పరిస్థితి చూచి అమ్మ కంటతడి పెట్టింది. నాన్న నిర్విణ్ణుడయ్యాడు. అప్పుడు వారికి ఒకటే విన్నవించుకున్నాను.
”నాన్నా! ఈ ఇంటి పనిమనిషిగా చనిపోవడం నాకిష్టం లేదు. ఇప్పుడు నా వయస్సు ఇరవై రెండు! ఇంకా చాలా జీవితం ముందుంది. నాకు మూడు పూటలా తిండి పెట్టకపోయినా మీ ఇంట్లో నాకింత చోటివ్వండి! నా బ్రతుకు నేను బ్రతుకుతాను. మీ ఇంటి పనిమిషిగానైనా జీవితం ప్రారంభిస్తాను. చచ్చిపోతే… మీ ఇంట్లోనే చచ్చిపోతాను. నాకు ఈ చెఱనుండి విముక్తి ప్రసాదించండి! నాకు స్వేచ్ఛ ప్రసాదించండి!”
నా కన్నీళ్ళతో ఆయన కళ్ళు అభిషేకించాను. నాన్నకు అర్థమైంది. నా భర్తతో ఈ విషయం చెప్పాడు.
”అయితే… వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నావన్న మాట!” నిష్ఠూరంగా అన్నాడు.
నేను ఔనని తలూపాను!
”ఈ స్థితిలో చిల్లిగవ్వ దక్కదు!” ”అక్కర లేదు!”
”తిరిగి వస్తే ఇంటి గడప త్రొక్కనివ్వను!” ”తిరిగిరాను!”
”నీకక్కరలేని ఆ మంగళసూత్రాలు, మెట్టెలు తిరిగి నాకు ఇచ్చేయి!” హెచ్చరించాడు.
వాటిని దగ్గర ఉంచుకోవాల్సిన అవసరం లేదనిపించింది. మంగళసూత్రాలు, మెట్టెలు వాడి ముఖాన విసిరి కొట్టడంతో జీవితఖైదు నుండి విడుదలైనంత హాయిగా ఫీల్ అయ్యాను. స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నాను!” హాయిగా అప్పుడు వేదిక మీద ఊపిరి పీల్చుకున్నాను.
నేను చెప్పడం పూర్తి చేయడం ఆలస్యం… వేసవికాలం కావడం చేత విద్యుత్కోత అమలులో ఉన్న కారణాన కరెంట్ పోయింది. ప్రోగ్రాం ప్రసారం ఆగిపోయింది.
”తరువాత ఏం జరిగిందమ్మా?” నలభై మంది పిల్లలు ఒక్కసారిగా అడిగారు.
”తరువాత తీరికగా చెబుతానుగానీ… అందరూ బ్రేక్ఫాస్ట్కు రండి!” అందరినీ డైనింగ్ హాల్లోకి దారి తీయించాను.
సరిగ్గా అప్పుడే గతం గుర్తుకురాసాగింది.
భర్త చెఱనుండి విముక్తి లభించిన తరువాత దూరవిద్యలో డిగ్రీ చదవడానికి ఎంట్రన్స్ రాశాను. అందులో సెలక్టయి డిగ్రి పూర్తిచేయడానికి ఫీజుకట్టాను. అమ్మా నాన్నకు భారం కాకూదని ఓ షాపింగ్మాల్లో సేల్స్గర్ల్ జీవితం ప్రారంభించాను.
ఉదయం తొమ్మిదింటికి ఉద్యోగం ప్రారంభమైతే తిరిగి రాత్రి తొమ్మిదికి ఇంటికి చేరేదానిని. రెండవ శనివారం, ఆదివారం దూరవిద్య క్లాసులు జరిగేవి. ఉద్యోగం చేస్తుంటే… షాపింగ్మాల్కు వచ్చిన తెలిసినవారు చెవులు కొరుక్కునే వారు. నన్నదోలా చూసేవారు! వారినెవరినీ పట్టించుకోదలుచుకోలేదు.
సరిగ్గా అప్పుడే జరిగిన ఓ సంఘటన నా జీవితాన్ని మార్చేసింది.
ఓ రోజు విచారంగా నాన్న నా దగ్గరకు వచ్చి ఓ విషయం వివరించారు.
‘అమ్మా! మనకు తెలిసిన భార్యాభర్తలిద్దరూ అనారోగ్యంతో చనిపోయారు. వారికి ఇద్దరు చిన్న ఆడపిల్లలున్నారు! చూడడానికి ఎవరూ లేరు వారిని పోషించడానికి, వారి బాధ్యత తీసుకోవడానికి బంధువులెవరూ ముందుకు రావడం లేదు. వాళ్ళు భారమని భావించి ఏదో అనాధశరణాలయంలో చేర్పించాలని చూస్తున్నారు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఆ భార్యాభర్తలిద్దరూ మనకు చాలా సహాయం చేశారు. నువ్వు వాళ్ళను చూసుకుంటానంటే మన ఇంట్లో ఉంచుకుందాం! మనం తినేదానిలోనే ఇద్దరూ గుప్పెడు మెతుకులు తింటారు!”
నా జవాబు కోసం నాన్న ప్రశ్నార్ధకంగా నావైపు చూశాడు.
”అలాగే నాన్నా! అలాగే చూద్దాం! నా జీవితంలో అటువంటి వారి సేవ చేసే అదృష్టం కలిగిందనుకుంటాను!” వారిని చేరదీసి పెంచనారంభించాను.
”మొగుడు కన్న ముగ్గురు పిల్లల్ని చూసుకోవడం చేతకాలేదు. ఇద్దరూ పిల్లల్ని ఎలాసాకుతుందో?” బజారులో తెలిసిన వారెవరో ఒకరు హేళన చేసేవారు.
”ఉద్యోగం చేస్తుందిగా! పోషిస్తుంది!” సూటీపోటీ మాటలనేవారు.
”సేల్స్గర్ల్ ఉద్యోగమూ ఒక ఉద్యోగమేనా!” ఎకసక్కేలు విసిరేవారు!
అన్నింటికీ చిరునవ్వుతోనే సమాధానం చెప్పాను. మౌనంగానే సమస్యకు పరిష్కారం చేసి చూపించాలనుకున్నాను.
ఆ సమయంలోనే కొద్దిగా స్థిమితపరులైన నలుగురు ఆత్మీయులు పరిచయమైనారు. నేను కష్టపడి పెంచుతున్న ఇద్దరు పిల్లలతో బాటు మరికొందరు అనాధలను చేరదీసి పెంచగలిగే ఆర్ధిక స్తోమత కలిగించారు. నాకు మరో మంచి ఉద్యోగం చూపించారు. ఆ మనసున్న మహారాజులకు మరికొందరు కలిశారు. నలుగురు పిల్లలూ చేరారు.
అమ్మానాన్నలకు భారం అనిపించకుండా వేరే ఇల్లు తీసుకొని ఆరుగురు పిల్లలను పెంచడం ప్రారంభించాను. అలా ప్రారంభమైన సేవా కార్యక్రమం మరో పదిమందిని చేర్చుకొంది.
‘తల్లి శీలాన్ని శంకించి చంపి జైలుకెళ్ళిన తండ్రికి చెందిన వారిద్దరు! నాకు పుట్టిన బిడ్డలు కాదని బలవంతంగా ఇంటినుండి గెంటి వేయబడిన తల్లికి చెందిన వారు ఇద్దరు! కరువుతో అల్లల్లాడుతూ పిల్లల్ని వదలి వెళ్ళిపోయిన తల్లిదండ్రుల తాలూకు వారిద్దరు! వరదల్లో తల్లిదండ్రులను కోల్పోయిన వారిద్దరు! ఇలా రకరకాల కారణాలతో తల్లీ దండ్రులకు దూరమైన వారు కొందరు! అందులో ఎక్కువ మంది ఆడపిల్లలే!
గోరుచుట్టు మీది రోకటి పోటులా ఆత్మీయులైన నలుగురు స్నేహితురాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోయారు. వేరే ఊర్లు వెళ్ళిపోయినా ఆర్ధిక సహాయం అందించడం మానలేదు. ఉద్యోగం చేస్తూ పిల్లల్ని పెంచడం కష్టమనిపించింది. అందుకోసం ఆయా కమ్ వంట మనిషిని కుదుర్చుకున్నాను. పెంపకంలోని సాధక బాధకాలను అధిగమించగలిగాను.
నేను పుట్టి పెరిగిన ఊరుగనక నా నిస్వార్ధ సేవగమనించి సహాయసహకారాలు అందించడానికి చాలా మంది ముందుకు రావడంతో పిల్లల సంఖ్య ముప్ఫై మందికి చేరుకుంది.
”ముగ్గురు పిల్లలను పెంచలేనిది ముప్పై మంది పిల్లలనెలా పెంచుతుందో చూద్దామన్న నా వెనకాలే విసిరిన చెణుకులు వినిపించకపోలేదు.
అప్పుడే అమ్మానాన్న నా దగ్గరకు వచ్చారు.
”అమ్మా! మాకున్న ఒక్కగానొక్క సంతానానివి నువ్వు! మాకు ఆసరా, ఆధారం కూడా నీవే. మేము కూడా నీతోనే ఉంటాం! మమ్మల్ని కూడా నీ పిల్లల్లా చూసుకో! వాళ్ళ ఆలనా పాలన బాధ్యత తీసుకుంటాం! మాతో కలిసి ముప్పై రెండు మంది పిల్లలమనుకో!లిలి
అమ్మా నాన్న మాతోనే ఉండిపోయారు.
అమ్మ వంట పనులు చూస్తే నాన్న బయట వ్యవహారాలు చక్కబెట్టేవాడు. ఆయనకు వచ్చిన కొద్దిపాటి ఆదాయం కూడా పిల్లల కోసమే వినియోగించేవారు. మరో పదిమంది వచ్చి చేరడంతో సంఖ్య నలభైకి వచ్చింది. అసలు ప్రాబ్లెమ్స్ అప్పుడే మొదలైనాయి.
స్వచ్ఛంద సంస్థల వారు నలుగురు అనాధలను చేర్పిస్తే… పోలీసుశాఖ వారు ఇద్దరిని మాకు అప్పగించారు. సీ.డబ్ల్యూ.సి. నుండి ఇద్దరు వస్తే గ్రామ సర్పంచ్లు ఇద్దరిని మాకు బహూకరించారు. తక్కువ మంది పిల్లలను పెంచుతున్న ఆ ఇల్లు సరిపోలేదు. అంతకంటే పెద్ద ఇల్లు తీసుకోవాల్సి వచ్చింది.
పిల్లలను చేర్పించిన వారు కొద్దో గొప్పో ఆర్ధిక సహాయం అందిస్తూనే ఉన్నారు. పిల్లల సంఖ్య పెరగడంతో అద్దె ఇల్లు దొరకడం గగన కుసుమమైపోయింది. నాలుగు సంవత్సరాల నుండి పన్నెండేళ్ళ మధ్య ఉండే వాళ్ళల్లో ఎక్కువ మంది ఆడపిల్లలే ఉన్నారు. వారికి సర్వసాధారణమైన అనారోగ్యం చికిత్స కోసం గవర్నమెంట్ హాస్పటల్ను ఆశ్రయించాల్సి వచ్చేది! మందులు ఉచితంగా తీసుకోవలసి వచ్చేది!
ఇంతలో నాన్నకు బాగా పరిచయమున్న వ్యక్తి భార్య అకస్మాత్తుగా పరమపదించింది. ఆయన కుమారులిద్దరూ విదేశాలలో ఉన్నారు. వారు తండ్రిని తమతో తీసుకువెళ్ళిపోతూ లంకంత ఇంటిని సక్రమంగా నిర్వహించుకోమని ఏభై సంవత్సరాల లీజుకు ఇవ్వడంతో మా అనాధాశ్రమానికి చక్కని ఆశ్రయం లభించినట్లయింది. పిల్లల పెంపకంలో అవరోధాలన్నీ అంతరించిపోయాయి.
అప్పటికి మా ఇంటికి ఓ స్వతంత్ర ప్రతిపత్తి లభించింది. విశాలమైన కాంపౌండ్లో పూలమొక్కలు నాటి ఇంటిని మా అవసరాలకనుగుణంగా తీర్చిదిద్దుకున్నాము.
”అమ్మా! టీవీలో కరెంట్పోయిన తరువాత జరిగిన కధ చెప్పనేలేదు!” ఆదివారం ఆటవిడుపు సమయంలో హాల్లో సమావేశమైన పిల్లలంతా ముక్తకంఠంతో అడిగారు.
సరిగ్గా అదే సమయానికి మొట్టమొదట నాకు ఆర్ధిక సహాయం చేసి వెన్నుతట్టి ప్రోత్సహించిన నలుగురు ఆత్మీయులు కుటుంబాలతో అరుదెంచారు. మేమెలా ఉన్నామో చూడాలని వచ్చిన వారితో మా పిల్లలు సమావేశమయ్యారు. వచ్చిన వారు పంచిపెట్టిన స్వీట్స్, బిస్కట్స్, చాక్లెట్స్, డ్రెస్లతో అందరూ సంబరాలు పూర్తి చేసుకునే సరికి గంటకు పైగా సమయం పట్టింది.
”మీరెలా ఉన్నారండి?” పిల్లలంతా ముక్తకంఠంతో వారిని పరామర్శించేసరికి వాళ్ళు ఎదురు ప్రశ్నవేశారు.
”మేమెలా ఉన్నామో…. ముఖ్యంకాదు! మీరెలా ఉన్నారో చెప్పండి! వింటాం!” కుటుంబాలు నాలుగూ వారి ఉత్కంఠతను ప్రదర్శించాయి.
”మాకందరికీ చక్కని రుచికరమైన, శుచికరమైన భోజనం పెడుతున్నారు!”
ఒకరి తరువాత ఒక్కొక్కరుగా అనుభవాలు వివరించనారంభించారు.
”ఎటువంటి ఆహారం ఇస్తున్నారు?” ఒక ఆత్మీయుడడిగాడు.
”ఉదయాన్నే టిఫిన్, సాయంత్రం స్నాక్స్ ఇస్తున్నారు”.
”పప్పు, కూర, రసం, మజ్జిగ, వారానికోసారి గ్రుడ్డు ఇస్తున్నారు!”
”మేము దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా చదువుకుంటున్నాము”.
”నేను ఆరవ తరగతి, నేను ఏడు, నేను ఎనిమిది, నేను తొమ్మిదవ తరగతులు చదువుతున్నాము!” ఒక్కొక్కరుగా చదివే తరగతుల పేర్లు చెప్పారు.
వాళ్ళు చదువుతున్న తరగతుల సంఖ్య విశేషాలు తెలుసుకొని దాతలు, ఆత్మీయులు సంతోషం ప్రకటించారు.
”అంతేకాదు… అంటీ, సాయంత్రం ఇద్దరు ట్యూషన్ టీచర్లు వస్తారు. మేమేమి చదువుతున్నది తెలుసుకొని పాఠాలలో ఉన్న డౌట్స్ క్లియర్ చేస్తారు!”
”అలాగే శని, ఆదివారాలలో మ్యూజిక్ టీచర్ కూడా వస్తుంది. లలిత సంగీతం, మంచి సినిమా పాటలు నేర్పిస్తుంది!” ఒకరు అనగానే ఓ ఆత్మీయురాలు తన సందేహం తీర్చుకోవాలనుకొంది.
”ఓ పాట పాడతారా?” అనగానే పిల్లలంతా ఆలపించారు.
”దయాశాలులారా… సహాయమ్ముకారా… భరించాలి మీరు… తరించాలి మేము…
కూటికైనా నోచని నిర్భాగ్యుల దయ చూడరా… ఆదరించేవారు లేని ఈ దీనుల కరుణించరా…
దాతలారా… ధర్మతండ్రులారా! కన్న బిడ్డల కన్న తీరున చల్లగా మము సాకరా….!
కోరస్లో పిల్లలంతా కలిసి పాడిన అనాధబాలల దీనగాధలను హృదయం ద్రవించేలా ట్యూన్ చేయబడిన ఆ పాట వినేవారి హృదయాలను ద్రవీభూతం చేసింది. వారి కనుకొలకుల్లోకి కన్నీటి బిందువులు రప్పించింది!
క్షణకాలం నిశ్శబ్దం ఆ వాతావరణంలో రాజ్యమేలింది.
”మరి… మీకు అనారోగ్యం కలిగితేనో… ” ఒక ఆత్మీయురాలు అడగగానే పిల్లలు సమాధానం చెప్పారు.
”ఇద్దరు డాక్టర్లు వారానికోసారి వచ్చి వెళ్తుంటారు. ఉచితంగా పరీక్షిస్తారు. మందులు కూడా ఉచితంగానే ఇస్తారు. అందుకే మేమయంతా ఎంతో ఆరోగ్యంగా ఉన్నాము!” వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యవంతమైన నవ్వు నవ్వేశారు.
తరువాత నాలుగు ఆత్మీయ కుటుంబాలు పనివాళ్ళను, వంట వాళ్ళను, ఆయాలను తదితర సిబ్బందిని పరామర్శించారు.
”నిర్మలా! యూ ఆర్ డూయింగ్ ట్రెమండెస్ జాబ్! కీప్ ఇట్ అప్! ఈ ఇల్లే శాశ్వతంగా అనాధ బాలల సదనానికి వచ్చే ఏర్పాట్లు చేస్తాం! నువ్వేమీ రాజీపడకు! తగిన ఆర్ధిక సహకారం అందిస్తాం! స్వచ్ఛంద సంస్థల నుండి, ప్రభుత్వం నుండి అవసరమైన ఆర్ధిక వనరులు సమకూరేలా చూస్తాం!”
వాళ్ళు నన్ను ఆత్మీయ ఆలింగనం చేసుకొని వెన్నుతట్టి ప్రోత్సహించారు.
”ఇదండీ! నిర్మలగారి అనాధాశ్రమ కధాకమామిషు! నలుగురు ఆత్మీయ కుటుంబాలలో కలిసిపోయి అద్భుతమైన ఆమె ప్రొఫైల్ను తెలియకుండా చిత్రీకరించి ప్రెజెంట్ చేసిన మా టీవీ బృందాన్ని అభినందించకుండా ఉండలేము!”
టీవీ యాంకర్ కెమేరా బృందాన్ని అభినందించింది.
అవార్డు ప్రదానోత్సవానికి నలభై మంది పిల్లలతో ప్రత్యేకమైన బస్సులో హైద్రాబాద్ వచ్చిన నా కుటుంబానికి అపూర్వమైన ఆదరణ లభించింది.
ఫైనల్లో పాల్గొన్న వారి ప్రొఫైల్ వీడియోలన్నీ టీవీ తెరలపై ప్రత్యక్షమైన తరువాత ‘వనితారత్న’ బిరుదు గ్రహీత ఎవరో, విన్నర్, రన్నర్లు ఎవరో ప్రకటించడానికి చాలాటైమ్ పట్టింది.
‘నేను అవార్డు కోసం రాలేదు’. ‘వనితరత్న’ బిరుదు కోసం రాలేదు. నా నలభై మంది పిల్లలకు మంచి భోజనం పెట్టగల సహాయ సహకారాల అన్వేషణ కోసం అవార్డు ప్రదానోత్సవానికి వచ్చాను. ఆ ఫంక్షన్కు ఎందరో పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలు వస్తారు. ఎందరో దయగల బిజినెస్మన్ వస్తారు. వారు నా నిస్వార్ధ సేవా కార్యక్రమాలు గుర్తిస్తే చాలు! ఆర్ధికమైన వెసులుబాటు కలిగిస్తేచాలు! నా పిల్లలకు చక్కని భోజనం పెట్టవచ్చు! కనీస సౌకర్యాలు కలిగించవచ్చు. మెరుగైన వైద్యం అందించవచ్చు! అంతకంటే చక్కని చదువు చెప్పించవచ్చు!
అలా చదువుకున్న వారంతా పెరిగి పెద్దవారౌతారు. ఉన్నతస్థాయి నందుకుంటారు. ఆర్ధికంగా పుంజుకొని తిరిగి సహాయం చేసే స్థాయికి చేరుకుంటారు. వాళ్ళే తమను పెంచి పెద్దవారిని చేసిన అనాధాశ్రమానికి చేయూతనిస్తారు!’.
నా ఆలోచనలు పూర్తికాకముందే ఆడిటోరియంలో లైట్లు ఆరిపోయాయి! ‘వనితారత్న’ బిరుదు ప్రదానమెవరికి జరుగుతుందో చెప్పే కౌంట్డౌన్ మొదలైంది! క్షణక్షణానికి నరాలు తెగిపోయే ఉత్కంఠతలో మొదట ‘రన్నర్ అప్’ ఎవరో ప్రకటింపబడింది. ఆమెకు సభ జేజేలు పలికింది!
కొన్ని క్షణాల తరువాత ‘విన్నర్’ ఎవరో, ‘వనితారత్న’ బిరుదు గ్రహీత ఎవరో టీవీ స్క్రీన్పై దర్శనమిచ్చింది!
”ఆమె తల్లి కాని తల్లి! ముగురమ్మలకే అత్తయ్య! మూల పురుషులైన ముగ్గురు అయ్యలను కనకుండా పెంచిన మూలపుటమ్మ! ఆమె ప్రసవవేదన పడలేదు. నడికట్టు అంతకన్నా కట్టలేదు. పురుడు పోసుకోకుండానే బ్రహ్మ విష్ణు మహేశ్వరులైన ముగ్గురు మూర్తులను ముద్దుబిడ్డలు చేసికొన్న ఆమ్మే… అమ్మలగమ్మ అమ్మే… నేటి ఆధునిక అనసూయ అనదగ్గ శ్రీమతి నిర్మలే… నేటి మన వనితారత్న!”
నా పేరు వనితారత్న బిరుదుకోసం ప్రకటించగానే ఒడలంతా జలదరించింది. శరీరం కంపించింది! అడుగులు తడబడ్డాయి. నాలుక పొడి ఆరిపోయింది.
ఎలా స్టేజీ ఎక్కానో… ఎలా అవార్డు అందుకున్నానో… నాకే తెలియదు!
”ఈమె నలభై మంది పిల్లల కోసం తన సంసార జీవితాన్ని త్యాగం చేసింది. నాలుగు సంవత్సరాల వైవాహిక జీవితంలో నరకం అనుభవించింది. ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసింది. రాక్షసుడైన భర్త ముఖాన అతడు కట్టిన మంగళసూత్రాలు అతడు పెట్టిన మెట్టెలు విసిరికొట్టింది! తన జీవితాన్ని అతలాకుతలం చేసే ఎన్నో కామెంట్లకు, ఎకసక్కెలకు, హేళనలకు మౌనంగానే సమాధానం చెప్పింది!
”నలభై మంది పిల్లల కోసం నిస్వార్ధంగా జీవిస్తోంది. తాను తినే పచ్చడి మెతుకులనే పది మందికీ పంచిపెడుతోంది! అటువంటి అనసూయమ్మకు… శ్రీమతి నిర్మలకు మా టీవీ ఛానెల్ వారు ఈ అవార్డు క్రింద ‘అనాధాశ్రమ నిర్వహణార్ధం పది లక్షల రూపాయలు బహూకరిస్తున్నారు. దయాశాలులంతా, దాతలంతా ముందుకు వచ్చి ఈ ఆశ్రమ నిర్వహణకు ఆలంబన కలిగించవలసిందిగా, ఆర్ధికపుష్ఠి సమకూర్చవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము!”
టీవీ ఛానెల్ వారి విజ్ఞప్తికి ఎందరో మహానుభావులు స్పందించారు.
విరాళాల వెల్లువ నా కనులవెంట ఆనందబాష్పాలు తెప్పించింది.
మాచిరంజీవులను దత్తత తీసుకోవడానికి ఎందరో ముందుకు వచ్చారు. చదువు చెప్పిస్తామని కొందరు… ఉచితంగా దుస్తులు అందిస్తామని కొందరు… ఆహారము సమకూరుస్తామని కొందరు… వైద్యసహాయం అందిస్తామని మరికొందరు సభాముఖంగా వాగ్దానం చేశారు.
వారి వాగ్దానాలకు, సహాయ సహకారాలకు పులకించిన నలభై మంది ప్రేక్షకులలోంచి లేచి కేరితంలు కొట్టారు!
వారిని చూచి సభ కరతాళధ్వనులతో దద్దరిల్లిపోయింది.
నేనాశించిన ధ్యేయం సిద్ధించింది. నేననుకున్న లక్ష్యం నెరవేరింది!
తృప్తిగా, ఆర్తిగా, ఆప్యాయంగా లభించిన ఆ అవార్డును అందుకొని హృదయానికి హత్తుకొని స్టేజీదిగబోతుంటే మా పిల్లలు పాడిన ఆర్ద్రమైన పాట టీవీ స్క్రీన్లపై ప్రత్యక్షమైంది.
”మహోదారులారా! మహాదాతలారా! ఎండకెండే జీవితాలకు ఏరుగడ మీరే కదా
ఏరుగడ మీరేగదా… ఏరుగడ మీరేగదా…
దయాశాలులారా… సహాయమ్ముకారా… భరించాలి మీరు… తరించాలి మేము….’
స్టేజీమెట్లు దిగుతుంటే ఆడిటోరియంలోని ప్రేక్షకులంతా నిలబడి ‘స్టాండింగ్ ఒవేషన్లో చప్పట్లతో అభినందనలు తెలిపారు. చుట్టూ మసకబారిన కళ్ళతో తేరిచూతునుగదా… ఆడిటోరియం టీవీలన్నింటిలోంచి దేదీప్యమానంగా ‘మా అనాధ బాలసదనం’ పేరు కనులు మిరుమిట్లు గొలిపింది.
దానిపేరే… ‘క్రొత్తజీవితం!’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *