April 19, 2024

అర్చన 2020 – చలి భయపడింది

రచన: రంగనాథ్ సుదర్శన్

ధనుర్మాసపు చలి కాలం. .
రాత్రంతా చలిచెలి కౌగిలిలో ఒదిగిపోయి, మంచు బిందువుల దుప్పటి కప్పుకున్న పచ్చని ప్రకృతి. . తొలి కిరణాల నులి వెచ్చదనం కోసం ఎదురు చూస్తోంది.
రాత్రంతా. . చెట్టుకొమ్మల్లో ముడుచుకొని పడుకున్న పక్షులన్నీ అప్పుడప్పుడే తమ రెక్కలను విదిలిస్తూ. . తమ కువ . . కువ. . నాదలతో
జగన్నాథునికి స్వాగత గీతాలు పాడుతూ వెచ్చదనం కోసం ఎదురుచూస్తున్నాయి.
నారాయణ మాస్టారు. . . తన మంకి క్యాప్ సరి చేసుకుంటూ. . వాకర్స్ గ్రౌండ్లో
తన మినీ సౌండ్ సిస్టం ఆన్ చేసి వాకింగ్ మొదలు పెట్టాడు.
మానవుడే మహనీయుడు. . . ఘంటసాల మాస్టారు పాట గ్రౌండ్ అంత వినిపిస్తుంది.
నడుస్తున్న. . . వాకర్స్ ఆప్యాయoగా
నమస్తే నారాయణ సార్. . అని
అన్నా. . నమస్తేనే అని. .
బాబాయ్. . గుడ్ మార్నింగ్. .
అంటూ నారాయణ ను పలకరిస్తు సాగి పోతున్నారు. . .
బాబాయ్ నువ్వోస్తేనే గ్రౌండ్ లో సందడి . . ఆ పాత పాటలు వింటూ. . నడుస్తూ ఉంటే నడిచినట్లే ఉండదు బాబాయి అని. . . . ఒకరు
అవునే నారాయణన్నా. .
పాట మోగిందంటే. .
తెలియకుండానే కాళ్ళ జోరు పెరుగుతుంది
అని,. మరొకరు
నువ్వొక్కపూట రాకుంటే గ్రౌండ్ చిన్నబోతుందన్న అని. . . ఇంకొకరు అంటుంటే. . .
అందరిని ఆత్మీయంగా పలకరిస్తూ. . విష్ చేస్తూ. . చిరునవ్వుతో . . . ముందుకు నడుస్తున్నాడు నారాయణ.
వాకింగ్ ముగించుకొని బైటకి వస్తున్నాడు. .
ఒక యాభై . . అరవై సవత్సరాల అవ్వ,తలకు గుడ్డ కట్టుకొని,ఒంటినిండా పవిట చెంగు కప్పుకొని చలికి వణుకుతూ. . ప్లాస్కోలో టీ పట్టుకొని బాబు అల్లం టీ బాబు. . పంచదార వెయ్యంది కుడా ఉందయ్యా . . . చలికాలం ఒంటికి మంచిదయ్యా వేడి వేడిగా తాగండయ్యా. . అంటూ నారాయణ దగ్గరికి వచ్చింది.
నారాయణకు టీ తాగలని లేదు . . వద్దులే అమ్మ అని రెండడుగులు ముందుకు వేసాడు. .
కానీ. . .
వెనకకు తిరిగి ఆ అవ్వను చూసి. . అయ్యో పాపం ఇoత చలిలో . . ఏం అవసరమో. . ఏ పరిస్థితులు అవ్వను. . ఇక్కడికి తీసుకొచ్చాయో. . ఒక్క క్షణం మనసు బరువెక్కింది. . అడుగులు ఆగిపోయాయి.
వెనుకకు వచ్చి
సరే అవ్వా. . . ఒక టీ ఇవ్వు. . .
అంటూ. . . జేబులో ఉన్న వంద కాగితం చేతిలో పెట్టాడు. . నారాయణ .
నారాయణ మాస్టారును చూసి మరికొందరు. . అవ్వ దగ్గరకు వచ్చి టీ తీసుకున్నారు.
అంతటి చలిలో కూడా రోడ్డు పక్కన చిన్న చిన్న గుడారాలు వేసుకొని
మండుతున్న కొలిమిలో ఇనుమును కాల్చి సమ్మెటతో. . కొడుతూ కత్తులు కొడవళ్లు తయారు చేస్తున్నారు. . . కొందరు రాజస్థానీలు.
వారి ఆడవాళ్లు లయ బద్దంగా బలంగా ఇనుము పై సమ్మెట దెబ్బలు వేయటం చూస్తే , స్త్రీలు బలహీనలని అనటం ఎంత తప్పో అనిపిస్తుoది. అంతటి చలిలో కూడా కారుతున్న వారి చెమటలు నేలను తడుపుతున్నాయి.
అవ్వ బొడ్లో ఉన్న సంచి తీసి చిల్లర డబ్బులు తిరిగి ఇవ్వబోయింది. వద్దంటూ. . అవ్వను. . వారించి,
అవ్వ . . . వీళ్ళందరికి కూడా టీ ఇవ్వు అని ఆ రాజస్థాని వాళ్లందరికీ టీ ఇప్పించాడు నారాయణ.
అవ్వా. . రోజు వీళ్ళందరికి టీ ఇవ్వు డబ్బులు నేనిస్తాను అన్నాడు నారాయణ .
అవ్వ బోసిగా నవ్వితూ రెండు చేతులెత్తి మొక్కింది.
ఆ చలిలో వేడి వేడిగా టి త్రాగిన రాజస్థానీలంతా. . చేతులెత్తి నారాయణ గారికి. . . ధన్యవాద్ . . భయ్యా అని దండం పెట్టారు.
ఇంటి కొచ్చిన నారాయణ
స్నానాదులు ముగించుకొని. . పూజాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని. . . టిఫిన్ చేసి లంచ్ బాక్స్ కోసం హడావిడి చేస్తున్నాడు.
ఓ . . ఆరాటం . .
మీరు రిటైర్ అయిన నా ప్రాణానికి మాత్రం సుఖం లేదు. . ఉద్యోగం చేసేటోళ్లకన్నా లేదు ఇంత తొందర. . చంపుక తింటున్నావయ్యా. . అంటూ చీదరించుకుంటూ శకుంతల వాగుతూనే ఉంది. .
ఇది రోజు నారాయణ గారికి అలవాటైన సనుగుడే . . .
వంటింట్లో కసురుకుంటూ విసురుకుంటూ. . గిన్నెలు చప్పుడు చేస్తూ వంట పూర్తి చేసి లంచ్ బాక్స్ అందించింది నారాయణ భార్య శకుంతల.
రోజు అలవాటైన వ్యవహారమే కావడంతో. . .
మారు మాట్లాడకుండా లంచ్ బాక్స్ తీసుకొని స్కూటీ ఎక్కి ఎప్పటిలాగే స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు చేరుకున్నాడు నారాయణ.
నారాయణ సింగరేణి సంస్థలో ఆఫీస్ సూపరెంటెండెంట్ జాబులో ఉన్నప్పటి నుండి సెలవు రోజు ఓ గంట బ్యాoక్ దగ్గర కూర్చొని. .
అవసరమైన వారికి విత్ డ్రాయల్ ఓచర్స్ ,డిపాజిట్ వోచర్స్ వగైరాలు రాస్తూ సహాయం చేస్తూ ఉండేవాడు.
ఇప్పుడు రిటైర్ అయ్యాక. . పూర్తి టైం బ్యాంకులో ఉండి. . ఒక్క పైసా ఆశించ కుండా తన సహాయాన్ని అవసరమైన అందరికి అందిస్తున్నాడు నారాయణ.
అందరూ నారాయణ సార్ అని గౌరవంగా పిలిచేవాళ్ళు. . చుట్టుపక్క పల్లెలనుండి వచ్చిన చదువురాని వారికి. . నెల నెలా పించనుకోసం వచ్చే వృద్ధులకు, వికలాంగులకు,పేదవారికి బ్యాంకుకు వచ్చే అందరికి సహాయం చేస్తూ ఉండేవాడు నారాయణ.
అంతేకాదు వూర్లో వుండే ప్రముఖులు కూడా బ్యాంకులో ఏ అవసరం వచ్చినా నారాయణ గారిద్వారా చేయించుకునే వారు.
బ్యాంకుకు కొత్తగా వచ్చే స్టాఫ్ కు కూడా నారాయణ గారు గైడ్ చేస్తూ ఉండేవారు.
ఒక్క మాటలో చెప్పాలంటే నారాయణ సార్ వల్ల ఆ బ్యాంక్ రేపుటేషన్ పెరిగిందనవచ్చు.
ఉదయం వాకింగ్, తరువాత సాయంత్ర వరకు బ్యాంక్ డ్యూటీ. . సాయంత్రం. . స్నేహితులతో ఓ గంట కాలక్షేపం. . ఇది నారాయణ గారి దిన చర్య.
అప్పుడప్పుడు బ్యాంక్ కు వచ్చే పల్లె ప్రజలు ప్రేమతో తెచ్చిన మొక్క జొన్న కంకులు,కూరగాయలు,తేనె ,జున్ను. . పిండి వంటలు. . బలవంతంగా నారాయణను మోహవాటపెట్టి మరి ఇచ్చేవారు.
ఇక నారాయణ ఎక్కడికి వెళ్లినా సార్ సార్ అంటూ ఆప్యాయతగా పలకరింపులు, మార్కెట్లో కూరగాయల మొదలు, సరుకులు వగైరా అన్ని తక్కువ ధర చేసి. . నారాయణ గారి కి ప్రత్యేకంగా ఇచ్చేవారు.
అందుకే నారాయణ గారు ఏది కొనేవారు కాదు. . ఆయనకు తనను ప్రత్యేకంగా చూడటం ఇష్టం ఉండేది కాదు.
అందుకే అన్నింటికీ. . భార్యనే వెళ్ళమనేవారు. .
కానీ శకుంతలకు భర్త ప్రవర్తన నచ్చేది కాదు. . ఇచ్చినప్పుడు తీసుకోవడంలో తప్పేంటి అనేది. . . అలాగే దాన ధర్మాలకు తన చెయ్యి ముందుకు వచ్చేది కాదు. ఎంగిలి చెయ్యితో కాకిని కొట్టని గుణం ఆమెది. భర్త పనికి రాని పనులు చేస్తున్నాడని చులకనగా చూసేది.
ఒక రోజు. . . నారాయణ గారు వాఁకింగ్ కు వెళ్లి వస్తూ స్కూటీ స్కిడ్డయి క్రింద పడిపోయారు. . . చాలా దెబ్బలు తగిలాయి. . చూసిన వారు వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేశారు.
ఈ వార్త వూరంతా పాకింది. . హాస్పిటల్ జనాలతో కిక్కిరిసింది. .
పెద్ద అపాయం మేమి లేక పోయినా నారాయణ గారి కుడి చెయ్యి ఫ్రాక్చర్ అయ్యింది. . కట్టు కట్టి ఇంటికి పంపారు డాక్టర్లు.
ఇంటికి వచ్చిన దగ్గరనుండి జనాలు తండోప తండాలుగా నారాయణ గారిని పరామర్షిoచడానికి వస్తూనే వున్నారు.
నారాయణ దగ్గరకొచ్చి . .
అయ్యా. . మాకు బ్యాంకులో దిక్కెవరయ్యా. . మాకు సాయం చేసే చెయ్యికి ఇలా అయిందేంటయ్యా. . అంటూ కుటుంబ అభ్యులకన్నా. . ఎక్కువ బాధపడే వాళ్లను చూసి శకుంతల ఆశ్చర్యపోయింది. .
ఎక్కడెక్కడినుండో వచ్చే జనాలు సొంత మనిషిలా. . భావించి ఏడుస్తున్నారు.
పెద్ద పెద్ద అధికారులు. . రాజకీయ నాయకులు ఇంటికి వచ్చి పరామర్శిస్తూ ధైర్యం చెపుతున్నారు.
వాళ్ళు తెచ్చే పండ్లు. . ఫలాలతో ఇల్లంతా నిండిపోయింది.
ఇవన్ని చూసి శకుంతల చలించి పోయింది. . ఆమె హృదయం ద్రవీభవించింది.
అలా తామరాకుపై నీటి బొట్టులా. . రోజులు జారిపోయాయి. .
నారాయణ యదా విధిగా దినచర్య ప్రారంభించాడు. .
ఆశ్చర్యంగా. . శ్రీమతి సనుగుడు . . దెప్పిపొడుపులు తగ్గిపోయాయి. . లంచ్ బాక్స్ కట్టి తాను నారాయణ గారితో బయలు దేరింది శకుంతల. .
నారాయణ ఒకింత ఆశ్చర్యంగా చూసాడు.
అవునండి. . ఇంత కాలం మీ మంచితనాన్ని గుర్తించలేకపోయాను.
ఈ రోజునుండి నేను మీతో వస్తాను. .
మీతో పాటు ఉండి, కొందరికి సహాయం చేస్తాను. . ఇంత మంది దీవెనలే. . నా పసుపు కుంకుమను కాపాడాయి. . వారి రుణం కొంతైనా తీర్చుకుంటాను అంటూ భర్త అడుగులో అడుగు వేసింది. . శకుంతల.
ఆ తెల్లవారి ఉదయం శకుంతల కొన్ని దుప్పట్లు. . . స్వేట్టర్లు తీసు కొని నారాయణతో పాటు వాకింగ్ కు బయలు దేరింది.
అవ్వకు తాను తెచ్చిన చలి కోటు ఇచ్చింది.
అవ్వ దానిని అపురూపంగా చేతులలోకి తీసుకొని వేసుకొని చూసుకుంటూ. . మురిసిపోయింది.
అవ్వా ఎలా ఉంది అని అడిగింది శకుంతల.
చలి పెట్టట్లేదమ్మా. . ఎచ్చగా ఉంది, అంది బోసిగా నవ్వుతూ. .
రాజస్థానీలకు ఇచ్చిన . . దుప్పట్లు తీసుకొని కళ్లకద్దుకుంటూ ఆనందపడ్డారు.
చలికోట్లు వేసుకున్న రాజస్థాని మహిళలు మురిసిపోతూ. . శకుంతల. . పాదాలకు నమస్కరించారు మురికై పోతూ.
తన భార్యతో వచ్చిన ఈ మార్పు ను చూసి. . . నారాయణ ఎంతగానో సంతోషించాడు.
సూర్యుడు . . కొత్త కిరణాలతో నులివెచ్చగా బైటికి వస్తున్నాడు.
పచ్చని పచ్చికపై నిలిచిన మంచు బిందువులు ఆవిరై. . . ఆకాశానికి ఎగిరిపోతున్నాయి.
పక్షులన్నీ. . . రెక్కలు విదిలిస్తూ. . . ఆకాశంలోకి రెక్కలు చాచుకొని ఎగురుతున్నాయి. . వెచ్చని వేడిని ఆస్వాదిస్తూ. .
చలి. . భయం భయంగా. . దూరంగా జరిగి పోతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *