April 19, 2024

ఉన్నది ఒకటే జిందగీ

రచన: ఉమా కల్వకోట

ఆదివారం … సమయం ఉదయం ఎనిమిది గంటలు కావస్తోంది. అప్పుడే వంశీ, అతని స్నేహితుడు రణధీర్ జాగింగ్ చేసి వచ్చి వంశీ వాళ్ళింటి ముందు వరండాలో కూర్చొని అలసట తీర్చుకుంటున్నారు . ఇంజనీరింగ్ చేస్తున్న వంశీకి స్నేహితులు ఎక్కువ. స్కూల్ ఫ్రెండ్స్, ఇంటర్ ఫ్రెండ్స్, ఇంటి చుట్టుపక్కల ఉన్న స్నేహితులు, ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ ఇలా ఊరంతా స్నేహితులే వంశీకి. వంశీ చూడడానికి బాగుంటాడు, మంచి చురుకైనవాడు, చదువులో కూడా ముందుంటాడు. అందులో వంశి వాళ్ళ కుటుంబం సంపన్న కుటుంబం కావడంతో అతనితో స్నేహం చేయడానికి అందరూ ఇష్టపడుతుంటారు. ఇప్పుడు వంశీతో పాటు వచ్చిన రణధీర్ వాళ్ళ నాన్న గారు, వంశీ వాళ్ళ నాన్న గారు భాస్కర్ గారు స్నేహితులు. చిన్నప్పటినుండి పరిచయం ఉన్నవారే అయినా వంశీ, రణధీర్ చదువుకున్నది వేరే వేరే స్కూళ్ళు కావడంతో కలవడం తక్కువే. ఇంటర్ కూడా ఇద్దరూ వేరే వేరే కాలేజీల్లో చదివారు. ఇప్పుడు ఇంజనీరింగ్ మాత్రం ఒకటే కాలేజ్. అదీకాక ఈ మధ్యనే రణధీర్ వాళ్ళు వంశీ వాళ్ళుంటున్న పేరున్న లొకాలిటీ లో ఇల్లు కొనుక్కోవడంతో ఇద్దరి మధ్య చనువుపెరిగి, రణధీర్ ని రాణా అని పిలిచే దాకా వచ్చింది.
వంశి లోపలికెళ్ళి ఫ్రిజ్ లో నుండి వాటర్ బాటిల్ తెచ్చి, తాను త్రాగి బాటిల్ రణధీర్ కి ఇచ్చాడు.
“ఇక నేను బయల్దేరతానురా,” అంటూ లేచి నిలుచుని “మళ్లీ రేపు కాలేజీ లోనేగా మీటయ్యేది” అన్నాడు రణధీర్.
“ఆ… అంతేరా, ఈవినింగ్ వేరే ఫ్రెండ్స్ వస్తామన్నారు. వాళ్లొస్తే కాస్సేపు బయటకెళ్తానేమో, లేదంటే ఇంట్లోనే. ఆదివారం కూడా తిరుగుళ్లేనా అంటూ అమ్మా, అమ్మమ్మా తెగ షంటుతార్రా బాబు. ఇక ఇప్పుడు అక్క కూడా లేదుగా, నేనే వాళ్ళ టార్గెట్” అంటూ నవ్వేసాడు వంశీ.
“మా ఇంట్లో ఆ బాధలేదురా, నా గురించి పట్టించుకునేంత టైమూ, లీజరు ఎవరికీ లేదు, ఎవరి దారి వాళ్లదే, అందరూ బిజీనే. అందుకే నాకు ఆదివారం లేదూ, సోమవారం లేదు. ఎప్పుడూ బిందాస్” అన్నాడు రణధీర్.
ఇంతలో గేట్ తీసుకుని వస్తున్న అందమైన అమ్మాయిని చూసి “వావ్! ఎవర్రా ఆ అమ్మాయి?” అడిగాడు రణధీర్.
“మా ఇంట్లో పనిచేసే లక్ష్మీ ఆంటీ కూతుర్రా” జవాబిచ్చాడు వంశీ.
“పేరేంటో?” అడిగాడు రణదీప్ ఆసక్తిగా.
“స్వప్న రా” మామూలుగా జవాబిచ్చాడు వంశీ.
స్వప్న ప్రక్క నుండి లోపలికి వెళ్ళిపోయింది.
“పనమ్మాయి కూతురా! అస్సలు అలా లేదురా. పిల్ల కత్తి లాగుందిరా. ఎప్పుడైనా గోకావారా?” చిలిపిగా కన్ను గీటుతూ అడిగాడు రణధీర్.
“ఒరేయ్.. ఒరేయ్ రాణా! ఏవిట్రా ఆ మాటలు. నీ పిచ్చి మాటలు మా ఆమ్మో, అమ్మమ్మో గానీ వింటే న నా పనయిపోతుంది, ఇక నువ్వెళ్ళరా రా బాబు” కంగారుగా అన్నాడు.
“ఊరుకోరా. ఇలాంటివన్నీ అమ్మ, అమ్మమ్మ లకు చెప్పి చేస్తార్రా ఎవరయినా, ఆలోచించు… మంచి ఛాన్స్. నేనెళ్తున్నాను” అంటూ చిలిపిగా నవ్వుతూ వెళ్ళిపోయాడు రణధీర్.
వీళ్లిద్దరి మాటలు హాల్లో కూర్చుని పేపర్ చూస్తున్న వంశీ అమ్మమ్మ జయమ్మ గారి చెవిన పడనే పడ్డాయి. “ ఏం పిల్లలో ఏమో, ఈ కాలం పిల్లలు హూ.. అయినా మా వంశీ అలాంటివాడు కాడులే” అని తనను తాను సమాధాన పరుచుకుంది జయమ్మ.
ముందు రోజు ఆరేసిన బట్టలు మడత పెట్టి ఎవరివి వాళ్ళ గదిలో పెడ్తూ వంశీ బట్టలు తీసుకుని అతని గదిలోకి వచ్చింది స్వప్న.
“చిన్న బాబు! మీ బట్టలు” అంది స్వప్న వంశీ బట్టలు మంచం మీద పెడ్తూ.
సెల్ ఫోన్ చూసుకుంటున్న వంశీ తలెత్తి చూసాడు స్వప్నని.
పచ్చని పసిమి ఛాయ, చక్కని కనుముక్కు తీరు, పెద్ద పెద్ద కళ్ళు, చిన్ని నోర ఒత్తయిన జుట్టుతో చాలా అందంగా ఉంటుంది స్వప్న. అసలు మనిళ్లలో పుట్టాల్సిన పిల్ల అని ఎన్నోసార్లు అమ్మా, అమ్మమ్మ అనుకోగా విన్నాడు వంశీ.
స్వప్న ఎక్కువగా మాట్లాడదు, చదువులో కూడా చురుకైనది, మంచి పిల్ల, అందుకే స్వప్న అంటే అందరికీ చాలా ఇష్టం. స్వప్నకి పద్నాలుగేళ్ళుంటాయేమో. తొమ్మిదో తరగతి చదువుతుంది. కానీ తన అసలు వయసుకంటే ఓ రెండేళ్లు పెద్దమ్మాయిలా కనిపిస్తుంది. స్వప్న బట్టలు మంచంమీద పెట్టి వెళ్తుండగా “ఇలా ఇవ్వు బట్టలు” అన్నాడు వంశీ. బట్టలు ఇస్తుండగా కావాలనే ఆమె వేళ్ళు తాకాడు. రాణా మాటలు పని చేస్తునట్లున్నాయి. ఓ కొత్త ఫీలింగ్ వంశీలో. కానీ స్వప్న మాత్రం ఇదేమి పట్టించుకోనట్లు ఆ గదిలో నుండి వెళ్ళిపోయింది.
మరుసటిరోజు హాల్లో సోఫాలో కూర్చున్న వంశీ, టేబుల్ శుభ్రం చేస్తున్న స్వప్నని “స్వప్నా! కొంచెం ఆ న్యూస్ పేపర్ ఇలా ఇవ్వు” అన్నాడు. పేపర్ ఇస్తున్న స్వప్న చెయ్యిని పేపర్ తో పాటు పట్టుకున్నాడు. స్వప్న అనుమానంగా చూసింది వంశీ వైపు, వంశీ కూడా కొద్దిగా కంగారుపడ్డాడు. అంతలోనే సర్దుకొని, మాములుగా ఉండడానికి ప్రయత్నిస్తూ “స్వప్నా! నీకు ఇంగ్లీషు కష్టంగా ఉంటోందని, మార్కులు తక్కువగా వస్తున్నాయని చెప్పింది లక్ష్మీ అంటి . ఇప్పుడు నీకు సెలవలేగా, రోజూ కాసేపు నా దగ్గరకు రా, నీకు ఇంగ్లీషు చెప్తాను, ఎలాగూ రోజూ పనికి వస్తూనే ఉన్నావుగా” అన్నాడు.
“ఇక్కడ పనీ, మా ఇంట్లో పనీ… ఇప్పుడు కుదరదులే చినబాబు” అంటూ గబగబా వెళ్ళిపోయింది అక్కడి నుండి స్వప్న. చిన్నబాబేంటి ఇలా కొత్తగా మాట్లాడుతున్నాడు అనుకుంది మనసులో.
అసలు స్వప్నని తనకు సాయంగా కూడా ఎప్పుడూ పనికి తీసుకురాదు లక్ష్మి. స్వప్నని బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేయాలని చెపుతూంటుంది. స్వప్నతో ఏ పనీ పెద్దగా చేయించదు. కానీ పది రోజుల నాడు వంశీ వాళ్ళింట్లో పనిచేస్తున్నప్పుడు లక్ష్మి కి జరిగిన ఓ ప్రమాదం వల్ల స్వప్న పనికి రావలసిన అవసరం ఏర్పడింది.
పది రోజుల క్రితం ఏం జరిగిందంటే రోజూ లాగానే లక్ష్మి ఇల్లు తుడుస్తుండగా డోర్ కాలింగ్ బెల్ మ్రోగింది. హాల్లో ఎవరు లేకపోవడంతో వచ్చిందెవరో చూడడానికి లక్ష్మి వెళ్ళింది. వచ్చిన వాళ్లకి జవాబు చెప్తుండగా నే లోపలినుండి వచ్చిన వంశీ తల్లి అపర్ణ తొందరగా నడుస్తూ హాల్లో ఉన్న తడికి జారిపడడం తో, పడకుండా ఉండడానికి చేసే ప్రయత్నంలో చేతులు నేలపై ఆన్చడంలో ఆమె బరువంతా చేతి పై పడి అమ్మా! అని బాధగా అరిచింది. అది చూసిన లక్ష్మి, ఆమెని లేపడానికి వచ్చి, తానూ పడిపోయింది. వాళ్ళిద్దరినీ హాస్పిటల్ కి తీసుకెళ్లారు, అపర్ణ కి కుడి చేయ్యి కీ, లక్ష్మి కి కుడికాలికీ ఫ్రాక్చర్ అయిందని చెప్పారు డాక్టర్లు. ఇద్దరికీ సిమెంట్ క ట్లు కట్టి ఆరు వారాలు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు.
పడడంలో అపర్ణ కి ఎడమ చేయి కూడా నొప్పి చేయడంతో ఏ పని చేసుకోలేక పోతుంది. లక్ష్మి పరిస్థితి మరీ ఘోరం. నడవడానికి కూడా లేదు. లక్ష్మి ఆ ఇంట్లో పదిహేను సంవత్సరాల నుండి ఎంతో నమ్మకంగా పనిచేస్తూ, ఇంట్లో అందరి అభిమానాన్ని సంపాదించుకుంది. అపర్ణ, ఆమె భర్త భాస్కర్ కూడా లక్ష్మి కుటుంబానికి ఎంతో సహాయం చేస్తూ ఉంటారు. స్వప్న, ఆమె తమ్ముడు సురేష్ ల స్కూలు ఫీజులూ, పుస్తకాలు అన్నీ భాస్కర్ వాళ్లే చూసుకుంటారు, అపర్ణ వద్దన్నా వినకుండా, స్వప్న కి సెలవులు కావడంతో, ఆమెని పనికి పంపిస్తోంది లక్ష్మీ. సురేష్ వాళ్ళమ్మని చూసుకుంటున్నాడు.
మరునాడు మామూలుగానే ప్రొద్దున్నే స్వప్న పనిలోకి వచ్చింది. వంశీ తన గదిలోనుండి “అమ్మా! నా బ్లూ జీన్స్ ప్యాంటు ఎక్కడుంది? కనబడడంలేదు ” అని అరిచాడు.
“నిన్న స్వప్న ఉతికిన గుడ్డలు నీ గదిలో పెట్టిందిగా . అందులో ఉండుంటుంది చూసుకో అన్నది అపర్ణ.
అప్పుడే అక్కడికి వచ్చిన స్వప్నతో అపర్ణ “స్వప్నా ! ఒకసారి వెళ్లి చూడు ” అన్నది.
స్వప్న, వంశీ గదిలోకి వెళ్ళింది అఇష్టంగానే. అలమార్లో ముందరే ఉన్న జీన్స్ తీస్తుండగా వెనకనుండి వంశీ వచ్చి ఆమెకు రెండువైపులా కబోర్డుపై చేతులుంచి “అరే! ఇక్కడే ఉందా? కనబడలేదే !” అన్నాడు అదోరకంగా నవ్వుతూ. స్వప్న వంశీ చేతుల క్రిందుగా వచ్చి, గబగబా బయటకు వచ్చింది. హాల్లో కూర్చున్న జయమ్మ, స్వప్న మొహంలోని గాబరాని గమనించింది . ఏదో పనుందని స్వప్నని తన గదిలోకి పిలిచి విషయం అడిగింది. ఆవిడ ఎంతో అనునయంగా అడిగేసరికి , అంతా చెప్పి బావురుమంది స్వప్న . “నాకు భయంగా ఉంది పెద్దమ్మగారు! నేను రేపటినుండి రాను” అంది ఏడుస్తూ స్వప్న.
“ఏయ్ స్వప్నా ! ఆలా ఏడవకూడదూ… భయపడి పోకూడదు . ధైర్యంగా ఎటువంటి పరిస్థితినయినా ఎదుర్కోవాలి. ఏంచేయాలో నేను చెప్తాగా’ అని ఎం చేయాలో స్వప్నకి చెప్పింది జయమ్మ.
మరుసటి రోజు కూర్చొని పేపర్ చూస్తున్నాడు వంశీ. మరో సోఫాలో జయమ్మగారు కూర్చున్నారు. స్వప్న, వంశీ దగ్గరకు వచ్చి “అన్నయ్యా! పెద్దమ్మ గారు చిన్న పేపర్ ఇవ్వమంటున్నారు” అన్నది.
వంశీ చివాలున తలెత్తి “అదేంటి? కొత్తగా అన్నయ్య అని పిలవడం,” కంగారుగా, చిరాగ్గా అన్నాడు వంశీ.
“స్వప్నా! నువ్వెళ్లు” అన్నది జయమ్మ. “వంశీ! ఇలా రా” అని పిలిచి “నేనే అలా పిలవమన్నాను” అన్నది.
“అదే ! కొత్తగా అదేం పిలుపనే అడుగుతున్నాను” చిరాగ్గా అన్నాడు వంశీ.
“చూడు వంశీ! గత నాలుగురోజులుగా నేను గమనిస్తూనే వున్నాను, స్వప్న పట్ల నీ ప్రవర్తన, ఇదేం బాలేదు” అన్నది జయమ్మ.
“నేనేం చేసానమ్మమ్మా? నేనేం చేయలేదు” తడబడుతూ అన్నాడు వంశీ.
“చూడు వంశీ! ఒక ఆడపిల్లని తప్పని సరి పరిస్థితుల్లో బయటకు పంపించినప్పుడు, తిరిగి ఆ పిల్ల క్షేమంగా ఇంటికొచ్చేదాకా ఆ తల్లిదండ్రుల మనసు ఎంత ఆందోళనగా ఉంటుందో నీకు తెలియదు. రెండేళ్ల పసిపిల్లనుండి ఎనభైఏళ్ల పండు ముసలి స్త్రీ వరకు ఎవరికీ ఇంటా రక్షణ లేదు… బయటా భద్రత లేదు. పేపర్ చూడాలంటే భయం. వార్తలు వినాలంటే భయం. ఏ మృగాడి దుశ్చర్య గురించి వినాల్సి వస్తుందోనని ఆందోళనగా ఉంటుంది” ఆవేదనగా అన్నది జయమ్మ.
“ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావమ్మామ్మా ” అన్నాడు వంశీ.
“మళ్ళీ అదే ప్రశ్న. ఎందుకో నీకు తెలియదా? స్వప్నా పట్ల నీ ప్రవర్తన ఎలా ఉందో నేను గమనిస్తునే ఉన్నాను, ఈ విషయం మీ అమ్మా నాన్నలకి తెలిస్తే మా పెంపకం ఇదా? అని ఎంత బాధపడతారో ఆలోచించు . స్వప్నకి మనింట్లోనే రక్షణ లేకపోతే ఇంకెక్కడ దొరుకుతుంది? ఈ మధ్య నువ్వు చాలా డబ్బులు ఖర్చు చేస్తున్నావని మీ అమ్మ అంటే నువ్వేమన్నావు? గుర్తుందా! ఉన్నది ఒకటే జిందగీ, నాకు నచిన్నట్లు నేననుకున్నట్టు బ్రతకాలి అన్నావు కదా! మరి స్వప్నకి , స్వప్నలాంటి ఆడపిల్లలం దరికీ కూడా ఉన్నది ఒకటే జిందగీ కదా, వాళ్లకు మాత్రం ఆశలు ఆశయాలు ఉండవా. అవి తీర్చుకునే లోగానే మీలాంటి మగాళ్లు వారి జీవితాన్ని, ఆశల్ని చిందరవందర చేస్తే ఎలా? ఇంతెందుకు, మీ అక్క శ్రావణి అమెరికాలో ఎమ్మెస్ చేస్తోంది కదా, ఆమె పట్ల ఎవరైనా ఇలాగే ప్రవర్తిస్తే ఎలా ఉంటుంది మనకు?” ఆవేశంగా అన్నది జయమ్మ.
“అలా అనకమ్మమ్మా! అక్కకేమీ కాదు, ఎవరూ అక్కనేమీ అనరు” కంగారుగా, భయంగా ఉన్నాడు వంశీ.
“చూసావా! ఆ ఊహే భరించలేకున్నావు నువ్వు. ఏ ఆడపిల్లయినా ఆ ఇంటి దీపం నాన్నా. దాన్ని ఆరిపోనీకూడదు . ఆడపిల్లలను భద్రంగా కాపాడుకోవడం, ఆమె మాన ప్రాణాలను కాపాడడం సమాజంలోని అందరి బాధ్యత. ఆమెను చక్కగా ఎదగనివ్వాలి, చదవనివ్వాలి, బాగుపడనివ్వాలి. నువ్విలా ప్రవర్తిస్తున్నావని మీ అమ్మకీ, మీ అక్కకీ తెలిస్తే ఎంత భాధపడతారో ఆలోచించు.” అనునయంగా చెప్పింది జయమ్మ.
“సారీ అమ్మమ్మా! ప్లీజ్ ఈ విషయం అమ్మానాన్నలకు చెప్పకు. ఇంకెప్పుడూ ఏ ఆడపిల్ల పట్లా ఇలా ప్రవర్తించాను. ఛ.. ఎంత తప్పు చేశాను” అంటూ ఆవేదనగా జయమ్మ చేతులు పట్టుకున్నాడు వంశీ పశ్చాత్తాపంతో.
“సారీ నాకు కాదు స్వప్నకి చెప్పు” అన్నది జయమ్మ. “స్వప్నా! ఇలా రా” అని పిలిచింది.
అక్కడికి వచ్చిన స్వప్నతో “సారీ స్వప్నా! నన్ను క్షమించు” అన్నాడు వంశీ.
“అలాగే చిన్నబాబు! మీరు చాలా మంచివారు. ఇంకెప్పుడూ అలా చేయరు” అన్నది స్వప్న చిరునవ్వుతో.
“చిన్న బాబు కాదు, ఇకనుండి నన్ను అన్నయ్యా అనే పిలువు” అన్నాడు వంశీ.
అందరి మనసులతో పాటు, ఆ ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా మారిపోయింది.

!!శుభం!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *