March 28, 2024

చిన్న బతుకులు

రచన -డా. లక్ష్మీ రాఘవ

రామయ్య కాలుచాపి దారం పేడుతూ కూర్చున్నాడు.
“ఎన్ని దారాలు పేడుతావు? బయట పోయేది లేదు, పైసా సంపాదనా లేదు. ఇంట్లో పొయ్యి ముట్టించి ఎన్నాళ్ళయిందో… రోజువారీ ఎవరో ఒకరు రోడ్డు మీద పంచినప్పుడు తినడమే. రాత్రిపూట అదీ గతిలేదు”
భార్య శివమ్మకు ఏడుపు ఆగటం లేదు.
“ఏడ్చినా పని దొరుకుతుందా? బయటకే పోకూడదాయే ఏమి చెయాల?” అన్నాడు చెప్పులు కుట్టే రామయ్య శివమ్మను జాలిగా చూస్తూ.
రోడ్డు మీద చెప్పులు కుట్టి, రోజువారీ వచ్చే డబ్బులతో బతికే వాళ్ళు రామయ్య దంపతులు.
అది లాక్ డౌన్ కాలం.
ఆ బస్తీ లో అందరూ అలా రోడ్డుమీద బతికే వాళ్ళే.. ఒక పెద్ద అపార్ట్మెంట్ వెనకగా వున్న ప్రభుత్వ ఖాళీ స్థలం లో గుడిసెలూ, గుడారాలూ వేసుకుని బతుకుతున్న బతుకులు. కరోనా లాక్ డౌన్ అంటూ ఎక్కడా గుంపులుగా వుండకూడదు. రోడ్డుమీద కనిపించకూడదు అన్న ఆంక్షలతో రోడ్డు మీదనే చిన్నివ్యాపారాల మీదే బతికే వీరి బతుకులకు గండిపడింది.
సినిమా పోస్టర్ల బట్టతో వేసుకున్న చిన్న గుడారం ముందు కూర్చున్న రంగి, మనవడు ఏడుస్తూ వుంటే సముజాయిస్తూవుంది. ‘ఇబ్బుడే వచ్చేస్తారు రా… నేను తెచ్చి తినిపిస్తాను’ అంటూ రోడ్డువైపు చెయ్యెత్తి చూపింది. చింపిరి జుట్టుతో వున్న మూడేళ్ళ వాడు ఇంకొంచెం ఏడుపు ఎక్కువ చేసినాడు..
ఆ పక్కగా వున్న పీచుమిటాయి సాయిబు లోపలకు పోయి సీసా అడుగున వున్న కొంచెం మిటాయి తీసుకొచ్చి వాడి చేతులో పెడితే వాడు ఆన౦దంగా పీక్కుని తినసాగాడు. వాడిని చూస్తూ కన్నీళ్ళ పాలైంది రంగి. మూడు నెలల ముందు వీడి అమ్మ, నాయనా ఆక్సిడెంట్ లో చనిపొయినారు. అప్పటి నుండీ వీడిని పెంచే భారం రంగిమీద పడింది. వీడిని ఎలా పోషించడమో తెలయటం లేదు.. అడుక్కోవడానికి పంపాలా? ఎక్కడైనా పనికి వేసే వయసు వరకూ ఆగాలా… అనుకుంటూ వుంటే ‘బిడ్డలను దత్తత తీసుకుంటారు. అక్కడికి తీసకపోతా’ అని ఆ బస్తీ లోనే వున్న ఓబులేసు చెప్పితే ఆశతో చూస్తావుంటే ఈ కరోనా కష్టకాలం ఎదురైంది.
ఆ బస్తీలో వున్నఒకే ఒక రేకుల షెడ్డులో నుండీ సరోజ బయటకు తొంగి చూసింది. సరోజకు ఆకలి ఎక్కువైపోతూ వుంది. సరోజ సినిమాల్లో ఎక్స్ ట్రా వేషాలకు వెళ్ళుతుంది. బ్రోకరు వచ్చిఅవసరాన్ని బట్టి ఆటోలో తీసుకపోయేవాడు. ఇప్పుడు షూటింగులూ లేవు, పనీ లేదు. సినిమా లో పెద్దవేషాలు వేసేవారికి డబ్బులు వుంటాయి గానీ సరోజలా చిల్లర గుంపుకు ఏది ఆధారం? ఎవరైనా ఆలోచిస్తారా?
అలా ఆ బస్తీలో వున్న చెప్పులు కుట్టే వాళ్ళు, బండిమీద పీచు మిటాయి అమ్మే సాయుబు, ఎక్ష్త్రా వేషాలు వేసే సరోజే కాకుండా, కూరగాయల బండి వాడు, లేత టెంకాయలు అమ్మే వెంకటేసు, అందరూ వాళ్ళ గుడిసెల ముందు కూర్చుని ఎదురు చూసేవాళ్ళే. పని లేదని ఆకలి ఆగదు కదా.
ఈ రోజు ఏ దాతలూ ఇంకా రాలేదు. వాళ్ళు ఒక వ్యానులో వచ్చి భోజనం పాకెట్స్, నీళ్ళ పాకేట్లు, బిస్కట్ పాకెట్స్ అందచేస్తారు. దూరంగా నిల్చుని తీసుకోవాలి. ఒకపూట దొరికే ఆ ఆహారం రాత్రికి కొంచెం దాచుకుంటారు.
ఇంతలో ఒక బండిఆగింది బస్తీ ముందు. అందరూ ఆశగా లేచినారు,.
ముఖానికి మాస్కు వేసుకుని ఒకాయన కిందికి దిగినాడు. ఆయన వెంట ఇంకోమనిషి కూడా..
కొంచెం ముందుకు వచ్చి “మీరు అందరూ రేపు ఒకసారి గవర్నమెంటు ఆస్పత్రికి రావాల. ఇక్కడికి బండి వస్తుంది. అందులో ఎక్కి రండి. బస్తీలోఅందరికీ కరోనా టెస్టు చేస్తాము. ”అన్నాడు
“అయ్యా రేపటి సంగతి సరే పోద్దుట నుండీ ఏమీ తిండి లేక ఆకలికి చస్తున్నాము. ముందు ఏదైనా తింటే రేపు వస్తాము. ” అన్నాడు వెంకటేశు.
“ఈ రోజు దాతలు ఎవరూ రాలేదా? నేను వెళ్లి ఒక గంటలో మీకు పాకెట్స్ పంపుతాను. రేపు అందరూ రావాల. కరోనా సోకిందని తెలిస్తే అటే వేరే చోటికి పంపుతాము. కొన్నాళ్ళు అక్కడే వుండాల్సివస్తుంది అందరూ రండి. అన్నట్టు మీకు అందరికీ మాస్కులు ఇచ్చినాము కదా. ఎందుకు ఎవరూ వేసుకోకుండా వున్నారు? మేము చేసేదంతా అంతా మీ మంచికోసమే. ప్రభుత్వం మీకు తోడుగా వుంటుంది. రేపు అక్కడికి వచ్చేటప్పుడు మాస్కులు వేసుకుని రండి. ” అని బండి ఎక్కాడు.
మాస్కులకంటే కడుపులో ఆకలే ఎక్కువ అవసరమని చెప్పాలని వున్నా ఊరకుండి పోయినారు. ఎందుకంటే రేపు టెస్టు లో ఎవరికైనా వుందని వస్తే ఇంకా వెనక్కి వచ్చేది లేదు అన్న మాట వాళ్ళందరికీ గుబులు పట్టించింది.
******
దేశంలో కరోనా ధనిక, కులం మతం అనే తేడా లేకుండా అందరి జీవితాలనూ అతలాకుతలం చేసింది పేదల బతుకులు మరీ దయనీయంగా తయారైనాయి. ముఖ్యంగా రోడ్లమీద వ్యాపారం చేసుకునే వారిని నిలువునా కూల్చేసింది. చాలా రోజులు ఇంట్లోనే ఉండాల్సి రావడంతో ఆదాయం లేక ఆకలికి అలమటి౦చాల్సిన దుస్థితి దాపురించింది. రోజు గడవటమే కష్టమైపోయింది.
ఎక్కడ వున్నామధ్యతరగతి కుటుంబాలు బండిమీద అమ్మే కూరగాయలు, రోడ్డుమీద తట్టిలో పెట్టుకుని అమ్మే పండ్లు కొనుగోలు చేస్తారు. బహుశా ధరలు బేరం చెయ్యచ్చు అనీ, లేదా ధరలు షాప్ కంటే తక్కువ అని కావచ్చు, కాస్తంత కొసరు కూడా వేస్తారు బండివారు. అందుకే బండిమీద వ్యాపారస్తులకు గిరాకీ.
అందుకే ప్రతి సిటీ లోనూ చిన్న వ్యాపారస్తులు చిన్న బస్తీలలో ఉంటూ వ్యాపారాలు చేస్తారు.
ఇప్పుడు కరోనా తో వ్యాపారాలు నిలిచిపోయి, వీరందరూ కష్టాలపాలైనారు. ఇక పోలీసులు కొన్ని చోట్ల రెడ్ జోన్ లలో దారికి అడ్డంగా పెట్టడానికి ఈ బండ్లు అడిగి తీసుకు పోతున్నారు.
ప్రభుత్వం వీరికోరకై ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఉచిత రేషన్, వడ్డీ లేని రుణాలను చేపట్టినా మధ్యలో లాక్కుని తినేసేవారు ఎందఱో!
వీధి వ్యాపారులను గుర్తించి వివరాలను ఆన్లైన్ లో నమోదు చేశారు. గుర్తింపు కార్డులు చేసి ప్రధాన మంత్రి స్వనిది పొంద కలుగుతున్నారు. అయినా అన్ని బస్తీలకూ అన్నీ అందడం లేదు.
******.
కాస్సేపట్లో ఒక వ్యాను వచ్చి అన్నం పాకెట్లు ఇస్తే తిని తొంగున్నా అందరికీ భయం వదలలేదు.
రామయ్య కు శివమ్మకు జబ్బు వస్తే ఎలాగా అని బాధగా వుంది. మెల్లిగా శివమ్మ తో అన్నాడు “రేపు నేను ఒకపనిచేస్తా. టెస్టుకు ఎల్లెకాడ ఆయనకు నీ పేరు చెప్పి ఇద్దరిలో ఒకరికి వస్తే రెండో మనిషి వుందని రాయమంటా అట్లాగైతే ఇద్దరూ ఒకదగ్గరే ఉంటాము. నీవు ఏమీ మాట్లాడద్దు. ” అన్నాడు.
‘సరే’ అని శివమ్మ పండుకుంది కొంచెం తేలికైన మనసుతో. ఒక మూలగా వేలాడుతున్నమాస్కులు చూస్తూ కళ్ళు మూసుకున్నాడు రామయ్య.
ముసలమ్మకు దిగులుపట్టుకుంది. ‘నాకు వచ్చిందంటే నా మనమడు ఎలాగా ’ అని. వాడిని నిద్దరూపి బయటకు వచ్చి అక్కడే కూర్చున్న వేంకటేశు, ఓబులేషు తో “నాయనలారా, నాకు ఏమైనా వస్తే నా మనమడి ని చూసుకోవాలిరా… పొతే మళ్ళీ వస్తానో లేదో.. ”అని ఏడ్చింది.
“నువ్వు బాధపడకే ముసలీ. బస్తీలో ఎవరికి వచ్చినా మిగిలినవాల్లని అందరూ చూసుకుంటాము. మనమందరమూ ఒక్కటే. దిగులుపడితే ఏమాయే. పోయి ప౦డుకో.. ”అన్నాడు వెంకటేసు ధైర్యం చెబుతూ.
నిజానికి సరోజా, వెంకటేసు, ఓబులేషు అందరికీ ఇదే దిగులు కానీ బయటపడి చేసేదేముంది అని అంతే.
వెంకటేశు అందరినీ ఒకసాఆరి పలకరించి తొందరగా ప౦డుకోమని చెప్పినాడు.
మరురోజు ఒక బండిలో తిండి వచ్చినాక, కరోనా టెస్టు కోసం వచ్చిన బండి ఎక్కి అందరూ వెళ్లారు
నాలుగు రోజులకు మళ్ళీ రిజల్టు అని చెప్పినారు.
నిముష, నిముషమూ చేతులు కడుక్కోలేదు. బయట కూర్చున్నప్పుడు కూడా మాస్కులు ధరించలేదు, సామాజిక దూరం పాటించలేదు. ఆలోచన చేసిందంతా ఆకలి ఎవరు తీరుస్తారా అని. అందుకేఅందరికీ మనసంతా దిగులు, ఎవరు ఉంటామో, ఎవరు వుండమో అని.
ఆరోజు వచ్చి రిజల్టు చెప్పి, ఎవరికీ వచ్చిందో వారిని తీసుకు వెళ్ళిపోయే రోజు!
అందరూ ఎదురు చూస్తున్న బండి రానే వచ్చింది. అందులో మనిషి దిగగానే రామయ్య, శివమ్మ చెయ్యిపట్టుకున్నాడు. ముసలిది మనమడి ఎత్తుకుంది దగ్గరగా అదుముకుంటూ. బస్తీ లో అందరూ ఉత్కంట తో చూశారు ఆ మనిషి ఒక పేపరు తీసి చూసి చెప్పాడు.
‘ఆశ్చర్యకరంగా ఆ టెస్టు అందరికీ నెగటివ్ వచ్చింది ఈ బస్తీలో’ అని… అందరి కళ్ళల్లో నీళ్ళు ఆనందంతో…
రామయ్య శివమ్మ దగ్గరగా జరిగాడు. ముసలి మనవడిని ముద్దుపెట్టుకుంది.
అందరూ సంతోషంగా చేతులు పైకి ఎత్తి నవ్వసాగారు గుంపుగా కూడుతూ.
ఒక్కోసారి దేవుడు ఆశ్చర్యంగా సాయం చేస్తాడు అవసరం వున్నచోట !!!!!

*******.

2 thoughts on “చిన్న బతుకులు

  1. బాగుందికథ.బస్తీ బతుకులు బాధలు..సమాజం స్పందన ..వాస్తవాన్ని అక్షరీకరించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *