February 23, 2024

పౌరాణిక రత్నం. . . పాండవ వనవాసం!

సేకరణ : మూర్తి ఎన్ జీడిగుంట

ఒక మహా ప్రస్థానాన్ని ఆరంభించినప్పుడు తొలి అడుగులు వేసే వ్యక్తి కొండలనూ. . గుట్టలనూ. . ముళ్లనూ రాళ్లనూ దాటుతూ దారి నిర్మించుకుంటూ ముందుకు సాగుతాడు. తన వెంట నడిచేవారికి అది మార్గాన్ని చూపుతుంది. తెలుగు చిత్రసీమలో తనదైన ముద్రను వేసి ఇతరులకు మార్గనిర్దేశం చేసిన పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు. దేవుళ్ల కళారూపాలు ఎలా ఉండాలో నిర్దేశించిన బ్రహ్మ ఈ కమలాకరుడు. పంచమ వేదంగా పరిగణించే మహాభారత ఇతిహాసంలోని అనేక ఘట్టాలు కమలాకర కామేశ్వరరావు చేతిలో రూపుదిద్దుకొని అనేక సినిమాలుగా విడుదలయ్యాయి. సెల్యూలాయిడ్‌ కావ్యం ‘నర్తనశాల’ తరువాత అత్యంత ప్రజాదరణకు నోచుకున్న మాధవీ ప్రొడక్షన్స్‌ పతాకంపై ఏఎస్‌ఆర్‌. ఆంజనేయులు నిర్మించిన ‘పాండవ వనవాసము’ చిత్రరాజం సంక్రాంతి కానుకగా 14 జనవరి 1965న విడుదలై 23 కేంద్రాల్లో విజయభేరి మోగించింది. స్వర్ణోత్సవం జరుపుకున్న ఈ చిత్ర విశేషాలు కొన్ని. . .

కమలాకర చిత్ర కథ
రాజసూయంలో వైభవాన్ని, మయసభలో జరిగిన పరాభవాన్ని తలచుకొని ప్రతీకారేచ్చతో రగిలిపోతున్న సుయోధనునితో ‘‘పాండవులను ద్యూతక్రీడకు ఆహ్వానిస్తే వారి సర్వస్వాన్ని హరించి నీ పాదదాసులను చేస్తాను’’ అని శకుని అనునయిస్తాడు. విదురునిచేత పాండవులను హస్తినకు రప్పించి శకునిచేత మాయాద్యూతంలో పాండవులు సర్వస్వాన్నీ కోల్పోయేలా చేస్తాడు సుయోధనుడు. ధర్మరాజు తనను, చివరకు తమ్ములను, ద్రౌపదిని కూడా పణంగా ఒడ్డి ఓడిపోతాడు. సర్వజన సమక్షంలో పాంచాలిని నిండుకొలువుకు ఈడ్చుకొచ్చి కౌరవులు అవమానిస్తారు. ఆ అవమానాలను చూచి సహించని భీముడు ఘోర సంగ్రామంలో సుయోధనుని తొడు విరుగకొడతానని, దుశ్శాసనుని వక్షస్థలం చీల్చి రక్తం తాగుతానని భీకర ప్రతిజ్ఞ చేస్తాడు. ద్రౌపదిని వివస్త్రను కావించేందుకు సిద్ధమైన దుశ్శాసనుని ప్రయత్నానికి అడ్డుకట్ట వేసి, దీనబాంధవుడైన శ్రీకృష్ణుడు అఖండ వస్త్రదానం చేసి ఆమెను రక్షిస్తాడు. ద్రౌపదికి జరిగిన పరాభవాన్ని ఆమెను శ్రీకృష్ణుడు అడ్డుకున్న విషయాన్ని తెలుసుకున్న దృతరాష్ట్రుడు జూదంలో కోల్పోయిన సర్వస్వాన్ని పాండవులకు తిరిగి ఇస్తాడు. శకుని కుయుక్తితో ధర్మరాజును మరలా జూదంలోకి దించి, వారిని ఓడించి, సుయోధనుని చేత పాండవులకు పన్నెండేళ్ల అరణ్యవాసము, ఒక యేడాది అజ్ఞాతవాసం విధింపజేసి కాననలకు పంపిస్తాడు. అరణ్యంలో ధర్మరాజు సూర్యభగవానుని ప్రార్థించి వనవాస కాలంలో పోషణకు అవసరమైన ఆహారపదార్థాలను సమకూర్చే అక్షయ పాత్రను పొంది అతిధులకు కూడా సంతర్పణ చేస్తూ, యజ్ఞ యాగాదులను నిర్వహిస్తూ సోదరులతో కలిసి ఉంటాడు. బ్రహ్మాండమనే కౌరవ గూఢచారి పాండవులకు తెలియకుండా వారి వెన్నంటి ఉంటూ, కిమ్మీరుడనే బకాసురుని తమ్ముణ్ణి పాండవులపై వుసిగొలిపితే భీముడు అతణ్ణి నుగ్గుచేసి చంపేస్తాడు. పాండువులున్న అటవీ ప్రాంతంలో కార్చిచ్చు ప్రబలినప్పుడు ఘటోత్కచుడు రక్షించి, వారిని ఆకాశమార్గాన గంధమాదన పర్వతాలకు చేరుస్తాడు. భీముడు హనుమంతుని సాయంతో సౌగంధికా పుష్పాలను సంపాదించి ద్రౌపది కోరిక తీసుస్తాడు. పాండవులు ద్వైతవనం చేరుతారు. ఘోషయాత్ర పేరుతో సుయోధనుడు తన పరివారంతో పాండవుల ఆశ్రమానికి దగ్గరలో విడిదిచేసి, చిత్రసేనుడనే గంధర్వరాజు చేత పరాభవింపబడితే, ధర్మరాజు ఆదేశంతో భీమార్జునులు సుయోధనుని బంధవిముక్తుని చేసి రక్షిస్తారు. అవమాన భారంతో ప్రాయోపవేశానికి సిద్ధమైన సుయోధనుని, శశిరేఖా పరిణయం పేరుతో నచ్చజెప్పి, ఆ ప్రయత్నాన్ని శకుని విరమింపజేస్తాడు. శశిరేఖా పరిణయ సన్నాహాలు జరుగుతుండగా, ద్రౌపదిని బలాత్కరించబోయిన సైంధవునికి భీముడు ప్రాశ్చిత్తం చేస్తాడు. భీముని చేతిలో గర్వభంగం పొందిన సైంధవుణ్ణి ఘటోత్కచుడు బంధించి పెళ్లి మంటపం ముందు పడేట్లు చేసి కౌరవుల నీచబుద్ధిని బలరాముడు గుర్తించేలా చేస్తాడు. పెళ్లి మంటపంతో సహా పెకలించి అరణ్యంలో ఉన్న పాండవుల వద్దకు శశిరేఖాభిమాన్యులను చేరుస్తాడు. శ్రీకృష్ణుడు అక్కడకు చేరి శశిరేఖా అభిమన్యుల వివాహం జరిపిస్తాడు. పాండవుల వనవాసం నిర్విఘ్నంగా పూర్తి కావడంతో పాండవులను శ్రీకృష్ణుడు అజ్ఞాతవాసానికి సంసిద్ధులను చేయడంతో తెరపై శుభం కార్డు పడుతుంది. ఈ సినిమాలో భీముడుగా ఎన్టీఆర్, దుర్యోధనుడుగా యస్వీఆర్, శ్రీకృష్ణుడుగా కాంతారావు, ద్రౌపదిగా సావిత్రి, ధర్మరాజుగా గుమ్మడి, అర్జునుడుగా బాలయ్య, విదురుడుగా నాగయ్య, ఘటోత్కచుడుగా సత్యనారాయణ, అభిమన్యుడుగా హరనాథ్, శశిరేఖగా ఎల్‌. విజయలక్ష్మి, శకునిగా ముదిగొండ లింగమూర్తి, దుశ్శాసనుడుగా మిక్కిలినేని ముఖ్యపాత్రలు ధరించగా, ఇతర పాత్రల్లో రమణారెడ్డి, పద్మనాభం, ధూళిపాళ్ళ, రాజనాల, ప్రభాకరరెడ్డి, ముక్కామల, అల్లు రామలింగయ్య, సంధ్య, ఋష్యేంద్రమణి, రాజసులోచన వంటి హేమాహేమీలు నటించారు. ఇంత భారీ తారాగణంతో నిర్మించిన పౌరాణిక చిత్రం బహుశా ఇదే కావచ్చు!

దర్శకత్వ ప్రజ్ఞానం
కమలాకర దర్శకత్వ ప్రతిభ ‘పాండవ వనవాసము’ సినిమాలో అడుగడుగునా మనకు కనపడుతుంది. ధృతరాష్ట్రుని దూతగా పాండవులను ద్యూతక్రీడకు ఆహ్వానించేందుకు విదురుడు వచ్చినప్పుడు ‘మహాత్మా! అన్నీ తెలిసిన మీరే మమ్ములను ద్యూతక్రీడకు ఆహ్వానించుట తగునా’ అని ధర్మరాజు ప్రశ్నిస్తాడు. అందుకు విదురుడు చెప్పే సమాధానం ‘నాయనా నేనిప్పుడు రాజదూతను. వారి ఆహ్వానాన్ని నీకు అందజేయడం నా విధి’ అంటాడు. ధర్మరాజు అందుకు అంగీకరించడం పాచికలాట అనే వ్యసనం మీదున్న అతనికి ఉన్న మక్కువను అణుచుకోలేకపోవడమనే గుణాన్ని దర్శకుడు ఈ సన్నివేశంలో చూపిస్తాడు. తనతోపాటు ధర్మరాజు తమ్ముల్ని పణంగా ఒడ్డి ఓడినప్పుడు ‘‘పాండవ శ్రీ పోయిందేకాని పాండవ స్త్రీ ఉందిగా’’ అని శకునిచేత అనిపించడం, ఆ మాటలు తనని కానట్లుగా సుయోధనుడు పట్టించుకోకపోవడం అతని రాజనీతికి దర్పణం పడుతుంది. నాడు మయసభలో తనకు జరిగిన పరాభవాన్ని చూసి కాంతాజనంతో సహా అపహసించిన ద్రౌపదికి ప్రతీకారం చేస్తానని సుయోధనుడు ప్రతీగామిని పిలిచి పాంచాలిని ‘దాసి’గా సంబోధిస్తూ తన సముఖానికి తీసుకొని రమ్మన్నప్పుడు, ద్రౌపది ‘‘పాండవాగ్రజుడు నన్నోడి తన్నోడెనో; తన్నోడి నన్నోడెనో; నేను ధర్మజితనో కాదో సభవారినడిగినానని చెప్పి సమాధానం తీసుకొని రా’’ అని ప్రతీగామిని వెనక్కు పంపుతుంది. ఆ తదుపరి వచ్చే వస్త్రాపహరణ సన్నివేశంలో సావిత్రిచేత దర్శకుడు అద్భుత నటనను రాబట్టుకున్నారు.
పాండవాగ్రజుని అందరూ ధర్మరాజని కీర్తిస్తుంటే ‘‘నీ సర్వ సంపదలను, రాజ్యాన్ని, తమ్ములనూ పణంగాపెట్టి ఓడిపోతే పోవచ్చు కానీ, మహా పతివ్రతామతల్లిని, నమ్మికొలిచే ఇల్లాలిని పణంగా పెట్టి ఓడిపోవడమా? ఇది అధర్మం. అట్టి అధార్మికుని చేతులు నరికినా తప్పులేదు’’ అంటూ అన్న మీదకు భీముడు లంఘించబోవడం, అర్జునుడు అడ్డుపడి ‘‘ధర్మమే మూర్తీభవించిన అన్నని అధార్మికుడనే నింద వేస్తావా. శాంతించు’’ అంటూ శాంతింపజేస్తాడు. అప్పుడు దుర్యోధనుడు ‘‘తెలిసిందా పాంచాలీ! నీవు ధర్మావిజితవే’’ అన్నప్పుడు వికర్ణుడు లేచి ‘‘ద్రౌపది ధర్మవిజిత కాదు. పాండవులందరికీ సమానదానమైన పాంచాలిని ఒడ్డడానికి ధర్మరాజు ఒక్కడికే హక్కులేదు’’ అని వాదిస్తాడు. రాజకీయాన్ని తలపించే యీ సన్నివేశాన్ని దర్శకుడు యెంత గొప్పగా చిత్రీకరించారో చెప్పలేం. సుయోధనుడు తన తొడమీదకు రమ్మని ద్రౌపదిని సైగ చేసినప్పుడు భీషణ ప్రతిజ్ఞ చేసేందుకు భీముడు ఉద్యుక్తుడయ్యే సందర్భంలో రౌద్ర రసాన్ని శ్రీ రాగంలో పలికిస్తూ ఘంటసాలచేత ఆంధ్ర మహాభారతంలో తిక్కన విరచించిన ‘‘ధారుణి రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ జూచి’’ అనే పద్యాన్ని పలికిస్తాడు కమలాకర. అయితే ఈ సందర్భంగా ఒక చిన్న పర్సనాలిటీ క్లాష్‌ ఎదురైంది. భీముడు చేసిన భీకర ప్రతిజ్ఞకు బదులుగా ఎస్వీ రంగారావు ‘‘హ్హ. . బానిసలు! బానిసలకింత అహంభావమా, నీ కన్నులముందే నీ భార్యను పరాభవించెదగాక’’ అని పలికే డైలాగులో ‘‘బానిస’’ పదం ఎన్టీఆర్‌కు నచ్చలేదు. స్క్రిప్టులోలేని డైలాగును యస్వీఆర్‌ పలికినట్లు రామారావు అనుకొని కినుక వహించినట్లు అనుకునేవారు. కమలాకర వారికి సర్దిచెప్పి షూటింగును కానిచ్చారట. ద్రౌపదిని నిండుసభలోకి ఈడ్చుకు వచ్చిన దుశ్శాసనుని చూసి వల్లించే ‘‘కరువృద్ధుల్‌ గురువృద్ధ బంధువలనేకులల్‌ చూచుచుండన్‌’’ పద్యాన్ని సందర్భోచితంగా వాడి భీముని పాత్రకు విశేషమైన గుర్తింపు తీసుకురావడం దర్శకుని పనితనానికి మచ్చుతునక. అలాగే హిమగిరి సొగసులు వర్ణిస్తూ ద్రౌపదికి భీమునితో యుగళగీతం పెట్టడం కూడా దర్శక ప్రతిభే! ఇక్కడ చాయాగ్రాహకుడు సి. నాగేశ్వరరావు పనితనాన్ని గురించి చెప్పుకోవాలి. ‘పాండవ వనవాసము’ సినిమా విజయానికి కామేశ్వరరావు చేసిన కృషి ఎంతో గొప్పది. ముఖ్యంగా మయసభలో జరిగిన పరాభవాన్ని తలచుకొని ప్రాయోపవేశానికి సిద్ధపడినట్లే, చిత్రసేనుని చేతిలో పరాభవం పొంది పాండవులు దాతృత్వంతో ప్రాణాలు దక్కించుకున్నప్పుడు కాలకూట విషంవలె రారాజును నరనరమూ దహించివేసే సన్నివేశంలో చిత్రీకరించిన విధానం కామేశ్వరరావు పనితనానికి మంచి నిదర్శనం. సుయోధనుడు నిస్పృహలో ఎదుటవున్న నిలువుటద్దాన్ని పగులగొట్టినప్పుడు పగిలిన శకలాలు రారాజును పరిహరిస్తూ ‘‘నీవు పరితప్త హృదయుడవు. అసమర్దుడవు. లజ్ఞావిహీనమైన జీవన్మరణముకన్నా మరణమే మేలు’’ అని గుర్తు చేసినప్పుడు ఛాయాగ్రహణం అద్భుతంగా ఉంటుంది. అలాగే ఘటోత్కచుని ఆగమనం, కిమ్మీరునితో పోరాటం, హనుమంతునితో సంభాషణం, ఏనుగు విన్యాసాలు ఇవన్నీ చిత్రీకరించిన విధానం కన్నుల విందు చేస్తుంది. నాగేశ్వరరావు తనయుడు విజయ్‌ సి. కుమార్‌ ఇప్పుడు కెమెరామన్‌గా తండ్రి అడుగుజాడల్లో పనిచేస్తూ శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన ‘ఆనంద్‌’, ‘గోదావరి’ వంటి సినిమాల్లో ప్రతిభను చాటుకుంటూ ముందుకెళ్లడం అభినందనీయం. ద్వైతవనానికి సుయోధనుడు సపరివార సమేతంగా వస్తున్నప్పుడు ‘మాయాబజార్‌’లో భళిభళి భళిభళి దేవా’ పాట మ్యూజిక్‌ వినిపించి ఘంటసాల ఆ పాట ప్రాశస్త్యాన్ని గుర్తుచేస్తారు. భీముడు నడిచినప్పుడల్లా గిటార్‌ వాద్యంతో గంభీరత్వాన్ని ప్రకటింపజేసిన విధం కూడా అద్భుతం. ఈ సినిమాలో పంచిన వినోదం కూడా సమర్ధనీయంగానే ఉంటుంది. శశిరేఖను కేవలం చిన్నతనంలో చూసిన లక్ష్మణ కుమారుడు ఆమె గుర్తుగా చిన్ని బొమ్మతో సరసాలాడటం, ‘శృంగార కళాపూర్ణ’ అంటూ లక్ష్మణ కుమారుని ఆటపట్టించడం, రమణారెడ్డి ‘బ్రహ్మాండం’ పాత్రలో అటు గూఢచారిలా, ఇటు విదూషకుడిగా హాస్యం పంచడం నచ్చే అంశాలు. ఇంత భారీ సినిమాని కేవలం ఐదు నెలల్లో పూర్తి చేశారంటే నమ్ముతారా! ఇది నిజం. ఈ చిత్ర నిర్మాత అడుసుమిల్లి సీతారామాంజనేయులు వాణీ ఫిలిమ్స్‌ పంపిణీ సంస్థలో భాగస్వామి కావడం, తన సహభాగస్వామి కాకర్ల వెంకటేశ్వరరావు ఆర్థిక సహకారానికి ముందుకు రావడం, విజయ-వాహినీతో బాటు మెజెస్టిక్‌ స్టూడియోల్లో సెట్టింగులు వేసి నిరంతరాయంగా షూటింగులు జరపడం, భారీ తారాగణమైనా కొందరిని చిన్న పాత్రలు కావడంతో ఒకటి లేక రెండు షెడ్యూళ్లలో వారితో పని పూర్తి చెయ్యడం అన్నిటికీ మించి సముద్రాల, నవశక్తి ఫిలిమ్స్‌ నిర్మాత పి. గంగాధరరావు నిర్మాణ పర్యవేక్షణ జరపడం సినిమా త్వరగా పూర్తికావడానికి దోహదపడ్డాయి. ఎన్టీఆర్‌ భీముడుగా నటించేందుకు ముందుకు రావడానికి కారణం ‘రాముడు-భీముడు’ సినిమాలోని అంతర్నాటకంలో ఆయన భీముని పాత్ర ధరించడమే! ఇక యస్వీఆర్‌ విషయానికొస్తే. . సుయోధనుని పాత్ర అతనిపై ఎంతటి ప్రభావాన్ని చూపిందంటే, ‘రారాజు’ పేరుతో సొంతంగా సినిమా తీస్తున్నానని పత్రికల్లో పూర్తి పేజీ ప్రకటన కూడా ఇచ్చారు. కానీ, ఎక్కువ సినిమాల్లో బుక్కయివుండడంతో ఆ ప్రయత్నానికి తెరపడింది. ఈ సినిమా పాటల అవుడ్డోర్‌ చిత్రీకరణ విజయా గార్డెన్స్‌లోనే జరపడం వలన సినిమా త్వరగా పూర్తయ్యింది. గ్రేట్‌ ఈస్టర్న్‌ సర్కస్‌ నుంచి రాధ అనే ఏనుగును తెచ్చి విన్యాసాలు చేయించారు. ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు ఈ చిత్రానికి సహాయ దర్శకునిగా పనిచేశారు. 23 సెంటర్లలో శతదినోత్సవం జరుపుకున్న ఈ సినిమా కలెక్షన్ల పరంగా కూడా రికార్డులు సృష్టించింది. విజయమాధవి పతాకంపై వి. శోభనాద్రితో కలిసి ఆంజనేయులు ఈ సినిమాను హిందీలోకి డబ్‌ చేశారు.

మేళవించిన రాగాలు
ఘంటసాల సంగీతం కూర్చిన ఈ సినిమాలో పాటలన్నీ సూపర్‌ హిట్లే. సంభాషణలతోబాటు సముద్రాల కొన్ని పాటలు కూడా రాశారు. విషాద గాంభీర్యంతో ఘంటసాల ఆలపించిన ‘అన్నదమ్ములలోన అతి ప్రియతముని నకులుని ధర్మనందనుడు కోల్పోయె’’ పాటకు కొనసాగింపే ‘‘విధివంచితులై విభవము వీడి అన్న మాట కోసం అయ్యో అడవి పాలయేరా’’ అనే సముద్రాల పాట. హిందుస్తానీ సంప్రదాయంలో ‘అహర్‌ భైరవి’గా పిలిచే చక్రవాక రాగంలో కరుణ ఉట్టిపడేలా ఈ పాటను ఘంటసాల స్వరపరచారు. సావిత్రి కౌరవ సభలో ఆలపించే మరొక సముద్రాల గీతం ‘‘దేవా! దీన బాంధవా! అసహాయురాలరా కావరా’’లో ఆర్తి, కరుణ రసం స్రవించేలా బీంపలాస్‌ రాగానికి అతి దగ్గరగా ఉండే పటదీప్‌ రాగంలో స్వరపరచడం ఘంటసాలకున్న స్వర వివేకానికి సూచిక. భీముడికి పాటలేవిటి అనుకునే ప్రేక్షకుడికి, పద్యాలుండగా పాటలుండవా అంటూ సముద్రాల ‘‘హిమగిరి సొగసులూ మురిపించునూ మనసులూ’’ పాటను రాస్తే ఆ స్వర పారిజాతాన్ని జయాజయవంతి (ద్విజావంతి) రాగంతో శృంగార చట్రంలో బంధించారు ఘంటసాల. ఈ పాటకు ముందు వినిపించే ఘంటసాల ఆలాపన, దానికి అనుబంధంగా సుశీల వినిపించే ప్రత్యాలాపన దానితోబాటు వినిపించే గిటార్‌ బిట్టు ఎంత శ్రావ్యంగా ఉంటాయో చెప్పలేం. ఈ పాట వచ్చే సమయంలో ఆకాశంలో యక్షులు నృత్యం చేయడం దర్శకుని సృష్టి. భీముడు సౌగంధికా పుష్పాల కోసం అలకాపురి చేరినప్పుడు రాజసులోచన యక్షినిగా చేసే నృత్యం కూడా అపూర్వం. ఈ పాటకు నృత్య దర్శకులు పసుమర్తి కృష్ణమూర్తి సమకూర్చిన నృత్యభంగిమలకు జేజేలు పలకవలసిందే. ఇది జానకి పాడిన నాలుగు రాగాల మేళవింపుతో కూడిన రాగమాలిక. పల్లవిని కాపీ రాగంతో, చరణాలు మధువంతి, మల్హర్, భాగేశ్వరి రాగాలతో మేళవించారు. ముఖ్యంగా ‘‘తాళలేరా మదనా’’ చరణంలో వాడిన భాగేశ్వరి రాగంలో ఉన్న విరహభావాన్ని జానకి అద్భుతంగా పలికించారు. ఇందులో ‘‘ఉరుకుల పరుగుల దొరా’’ చరణానికి వెస్ట్రన్‌ బీట్‌ వాడటం గొప్ప ప్రయోగం. శశిరేఖ, అభిమన్యుల ప్రేమగీతం ‘‘నా చందమామా నీవే భామా తారలే ఆన. . నీ నీడనే నా ప్రేమసీమా’’ సముద్రాల విరచితం. ఈ పాటను హరికాంభోజి రాగానికి దగ్గరగా ఉండే తిలాంగ్‌ రాగంలో స్వరపరచారు. ఆరుద్ర రాసిన ‘‘బావా బావా పన్నీరు బావకు మరదలు బంగారు’’ అనే చిలిపి పాట మాయా శశిరేఖ ఆలపించేది. కొసరాజు రాసిన ‘‘మొగిలిరేకుల సిగదానా మురిడీ గొలుసుల చినదానా’’ పాటకు ప్రత్యేకత ఉంది. ఆదుర్తి సుబ్బారావు వంటి దర్శకులే సినిమాలకు పనికిరాదని తేల్చేసిన డ్రీం గర్ల్‌ హేమామాలిని ఈ పాటకు నృత్యం చేసింది. పసుమర్తి శిక్షణలో స్వయంగా భరతనాట్య కళాకారిణి అయిన హేమను ఢిల్లీ నుంచి పిలిపించి ఈ సన్నివేశంలో నటింపజేశారు కమలాకర. ఆయనపై గౌరవంతోనే బాలీవుడ్లో ఓ వెలుగు వెలుగుతున్నప్పుడు కూడా హేమామాలిని ‘‘శ్రీకృష్ణ విజయం’’లో నాట్యం చేసి పలువురి మన్నలను పొందడం విశేషం .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *