April 25, 2024

మనసున సుగంధం నింపిన అక్షరపూదోట

సమీక్ష: సి. ఉమాదేవి

పోలాప్రగడ రాజ్యలక్ష్మిగారు జగమెరిగిన రచయిత్రి. వారి సాహితీప్రస్థానంలో బహుమతులు, బిరుదులు, పురస్కారాలు అనేకం అందుకున్న రచయిత్రి. సాహితీబాటలో వారందుకున్న సన్మానాలకు
తప్పక అభినందించాలి. వీరి కథలలో అంతర్లీనంగా ప్రవహించే సామాజికాంశాలు కుటుంబసభ్యులకు బాధ్యతలను, విలువలను, బంధాలను గుర్తుచేస్తాయి. వీరి అక్షరనావలో పన్నెండు నవలలు, ఆరు కథాసంపుటాలు నిక్షిప్తం గావించబడ్డాయి. వీరి రచనలపై పి. హెచ్. డి, ఎమ్. ఫిల్ పరిశోధనలు చేసిన వారున్నారు. లోపాముద్ర బిరుదు, రమ్యకథారచయిత్రి బిరుదులు వీరందుకున్నారు. బెజవాడ గోపాలరెడ్డిగారు తిక్కవరపు సుదర్శనమ్మ అవార్డు, నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి ఉన్నవ లక్ష్మీనారాయణ అవార్ఢు, తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఉత్తమ రచయిత్రిగా, మద్రాసు తెలుగు అకాడమీ సాహిత్య పురస్కారం, సుశీలా నారాయణ రెడ్డి అవార్డు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంనుంచి సాహిత్య పురస్కారం, మద్రాసునుండి గృహలక్ష్మి అవార్డు వీరందుకోవడం ముదావహం. రమ్యకథారచయిత్రి బిరుదును కూడా అందుకున్నారు.
ఇక వీరి కథాప్రయాణంలో మంచిమనసులు శీర్షికగా పదిహేడు కథలు ఈ కథాసంపుటంలో పొందుపరిచారు. విభిన్న కథాంశాలు మనమధ్యనే జరిగిన అనుభూతినందిస్తాయి.
కృష్ణలీలలు-బామ్మగారి బడాయి కథలో మనవడికి తన బాల్యం విశేషాలు, కృష్ణశతకం పద్యాలు, భాగవతంలో పద్యాలు చదివి వినిపిస్తుంటే మనవడు కిష్టప్ప నిద్రించేవాడు. మనవడు పెద్దవాడాయాక వారి మధ్య దూరంపెరిగింది. జీవితంలో తోడు, నీడా మనిషికి అవసరం. దంపతులు ఇద్దరు ఉన్నప్పుడు అది అదృష్టమే. కాని ఒక్కరే ఉండటం బ్రతుకు పరాధీనమవుతుంది అంటారు. చివరకు గుడిలో దేవుడికి వత్తులు చేసి, ఊరగాయలు తయారుచేసి తనకంటూ ఒక వ్యాపకాన్ని కల్పించుకోవడం ఆచరణీయమే. గోవు మహాలక్ష్మి మరో చక్కని కథ. నేటి జీవన విధానంలో
అపార్ట్మెంట్లు కార్లకేగాని ఆవులకు స్థలాన్ని ఇచ్చేందుకు ఒప్పుకోరు. ఆవు అంబా అరుపులు నిద్రాభంగం కావిస్తాయని, పైగా వాసనలు వస్తాయని చెప్పడంతో విధిలేక ఆవును కొన్నచోటనే అమ్మివేస్తాడు భర్త. ఆ సంగతి తెలిన భార్య తల్లడిల్లడం మనసును కుదుపుతుంది. గ్రామవాతావరణం పరిచయమైన వారికి కథ చదివాక అయ్యో అనిపించక మానదు. కాని నేటి నాగరిక సమాజాన్నీ వద్దనుకోలేని నిస్సహాయత మనల్ని వెంటాడుతూనే ఉంటుంది.
శ్రీరామ్మూర్తిగారిల్లు తమకనువైనదని ప్రక్కింటి వెంకటేశ్వర్లు కొనుక్కుంటాడు. మగపిల్లలు లేని ఇల్లు కొన్నందుకు నీకు మగపిల్లలు కలగరని వేంకటేశ్వర్లను భయానికి గురిచేస్తారు. అయితే శ్రీరామ్మూర్తి కూతురు, వేంకటేశ్వర్లునుండి ఆ ఇల్లును తిరిగి కొనుక్కుని ఆ ఇంటిని కళ్యాణమంటంపంగా తీర్చిదిద్దుతుంది. చక్కని ముగింపునందించిన కథ. మతాలకతీతంగా ఒకరినొకరు ఇష్టపడిన జంట పెళ్లిచేసుకుంటారు. మనుషులూ, మనసులూ, మమతలూ పంచుకుంటేనే ఆ జంట చిరకాలం సుఖంగా మనగలుగుతారు. ఈ చక్కటి సూత్రాన్ని చెప్పిన కథే షమ్మి నవ్వింది పువ్వులై విరిసాయి.
మగపిల్లలు సరదాగా ఏడిపిస్తున్నారని నల్లపూసలు కథలో కాలేజికి నల్లపూసలు ధరించివెళ్లే అమ్మాయికి ఆ అమ్మాయికి పెళ్లయిందన్న మిషతో వచ్చిన సంబంధం తప్పిపోతుంది. అయితే స్నేహితురాలి అన్న ఆమెను పెళ్లిచేసుకోవడానికి సిద్ధపడటం కథలోని కొసమెరుపు. అందరివీ మంచిమనసులైతే వచ్చే కష్టాల్నీ, ఇబ్బందులను ఎదుర్కోవడం ఎంతో సులువు అని చెప్పినకథ మంచిమనసులు. బాల్యంలో పెద్దలు, గురువులు పాటించేవారికి నడిచేబాట చక్కని రహదారవుతుంది. అలాంటి వ్యక్తే చంద్రం. కలెక్టరుగా ఉద్యోగంలో చేరినా చిన్ననాటి మధురస్మృతులు చక్కని జ్ఞాపకాలై అలరిస్తాయి. కాకి గూటిలో కోయిల కథ సాధారణంగా జరిగే కథే. అత్తగారు శాశమ్మ ఉనికిని సహించలేని కోడలు ఆమెను మాటలతో విసిగించడం మానదు. అయితే తన అత్తగారికి తోడుగా ఉంటుందనే ఆలోచనతో వచ్చిన జయమ్మ అనే ఇల్లాలు శాశమ్మను తన వెంటరావాలంటుంది. మంచితనానికి, స్నేహానికి విలువలు తెలిసిన వాళ్లు అంటూ జయమ్మ వెంట బయలుదేరుతుంది శాశమ్మ. కావ్యయాగంలో కాంతి హోమం, కొడుకులు-కొత్తబట్టలువంటి కథలున్న చక్కని కథాసంపుటం మంచి మనసులు చక్కటి కథలనందించిన పోలాప్రగడ రాజ్యలక్ష్మిగారికి అభినందనలు. అభివందనాలు

1 thought on “మనసున సుగంధం నింపిన అక్షరపూదోట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *