రచన: మంథా భానుమతి

“నువ్వెంతైనా చెప్పు, నీ వ్యవహారం నాకు నచ్చలేదబ్బాయ్.” భుజం మీది కండువా తీసి ఒక్క దులుపు దులిపి ఇంట్లోంచి బైటికి నడవబోయాడు అనంతయ్య.
“ఆగు నాన్నా! నే చెప్పేది పూర్తిగా విను. రైతు బిడ్డవి, స్వయంగా రైతువయ్యుండి కాస్తైనా ఓరిమి లేకపోతే ఎట్టా?” వినోద్ బతిమాలాడు.
“ఏందిరా వినేది? అంతంత మెరిట్ లో వచ్చి, పెద్ద చదువులు చదివి వచ్చిన అవకాశాన్ని వదులుకుంటా నంటే ప్రాణం ఒప్పట్లేదు. దారి ఖర్చులు దగ్గర్నుంచీ వాళ్లే ఇచ్చి బోలెడు జీతం ఇస్తా ఉంటే.. నకరాలు చేస్తన్నావు. మన అప్పులన్నీ ఇట్టే తీరి పోతయ్యని నేను సంతోషిస్తా ఉంటే.. ” అనంతయ్య గొంతులో ఏదో అడ్డు పడ్డట్టయి మాట ఆగిపోయింది. ఉత్తరీయంతో కళ్లు తుడుచుకున్నాడు.
వినోద్ రెండగల్లో తండ్రిని చేరుకున్నాడు.
“ఏం ఫర్లేదయ్యా! మనం రెండే రెండేళ్లలో అప్పులు తీర్చేస్తాం. నేను అనుకున్నట్లు చెయ్యలేకపోతే అప్పుడే ఉద్యోగంలో చేరతాను. నా చదువుకి ఎప్పుడన్నా, ఎక్కడన్నా పని దొరుకుతుంది. అప్పులన్నీ తీర్చే బాధ్యత నాది. నన్ను నమ్ము. ” నాన్న చేతిలో చెయ్యేసి చెప్పి, భరోసా ఇస్తున్నట్లుగా గట్టిగా కౌగిలించుకున్నాడు.
………………
అనంతయ్యకి యాభై ఎకరాల పొలం ఉంది వికారాబాద్ దగ్గర్లో. అనంతగిరి అడవులు చేరువలో ఉన్నా అదంతా మెట్ట భూమి కిందే వస్తుంది. దగ్గర్లోనే పెద్ద చెరువు ఉంది కానీ నేలలో వ్యవసాయానికి సరిపోయే నీరు ఉండదు. అయితే నల్ల రేగడి నేల కనుక తగినంత నీటి వసతి ఉండాలే కానీ, చాలా పంటలకి అనువుగానే ఉంటుంది.
తాతల కాలం నించీ పత్తి పంట వేస్తున్నారు ఎక్కువ పొలంలో, మిగిలింది మొక్కజొన్న, కందులు, పెసలు, మినుములు వంటి పంటలు. వరికి ఎక్కువ నీరు కావాలి. అందుకే మెట్ట భూముల్లో దాని జోలికి పోరు. మెట్ట పంటలు బాగా వాన నీరు మీద ఆధారపడతాయి.
మూడేళ్ల నుంచీ సమయానికి వానలు పడక పంటంతా పోయి చాలా నష్టపోయారు అక్కడి రైతులు. బాంకుల్లో అప్పులు తెచ్చుకుని ఎంతో శ్రమపడి దుక్కి దున్ని, విత్తులు చల్లటం.. మురిపించినట్టు మొలకలొచ్చి కాస్త పెరిగే వరకూ జల్లులు పడి ఆ పైన మేఘాల పారిపోటం. అప్పులలాగే ఉండగా కొత్త అప్పులు చెయ్యటం.. అదీ పరిస్థితి.
అనంతయ్య అందుకే కొడుక్కి వ్యవసాయం వదులుకోమని చెప్తున్నాడు. వినోద్ చాలా తెలివైనవాడు. ఐఐటిలో ఇంజనీరింగ్ చదివి, ఐఐయమ్ లో యమ్ బియే చేశాడు. కాంపస్ సెలెక్షన్ లో సింగపూర్ లో మంచి కంపనీలో లక్షల్లో జీతంతో ఉద్యోగం వచ్చింది. తన చదువుకి పదెకరాలు అమ్మేసినా అనంతయ్య అంత బాధపడలేదు. కానీ, ఉద్యోగంలో చేరకుండా, ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేస్తానంటే తట్టుకోలేక పోతున్నాడు, అందులో తల మునకలుగా మునిగున్నాడు కనుక. వినోద్ ఉద్యోగానికి వెళ్లే ముందు కొన్ని రోజులు అమ్మానాన్నలతో గడపాలని ఇంటికొచ్చి అంతా గమనిస్తున్నాడు.
……………….
“అనంతయ్యగారూ! నమస్తే. ” వినోద్ వ్యవసాయం చెయ్యాలని నిశ్చయించుకున్న మరునాడు నలుగురు పెద్ద మనుషులు ఇంటి తలుపు తట్టారు.
ఇద్దరి వయసు అరవై పైబడి ఉంటుంది. తెల్లని పంచలు లాల్చీలు, జరీ కండువాలు. మరో ఇద్దరు నలభైకి అటూఇటూ.. పాంట్, షర్ట్ వేసి టక్ చేశారు. లాల్చీలిద్దర్లో ఆ ఊరి సర్పంచ్ ఒకాయన.. అనంతయ్యకి బాగా తెసినవాడే.
అనంతయ్య అందరినీ కూర్చోపెట్టి, వినోద్ ని పరిచయం చేశాడు.
“సంతోషం బాబూ! మీరు కూడా ఇక్కడే ఉన్నారు. మా పని సులువైపోతుంది. ” వినోద్ చదువు, వచ్చిన ఉద్యోగం గురించి తెలిసిన సర్పంచ్ నవ్వుతూ అన్నాడు. విలన్ వేషంలో నటులు గుర్తుకొచ్చారు వినోద్ కి.
తనతో వచ్చిన వారిని పరిచయం చేసి వచ్చిన సంగతి చెప్పాడు సర్పంచ్.. అరగంట సేపు. చాయ్ తాగుతూ, మధ్యలో అనంతయ్య అదృష్టాన్ని పొగుడుతూ.
నలభై ఎకరాల పొలాన్ని ఎకరాకి యాభై లక్షలిచ్చి కొనటానికి వచ్చారు ఆ పెద్ద మనుషులు.
“ఇప్పుడు హైదరాబాద్ సివార్లలో గేటెడ్ కమ్యూనిటీలకి బాగా గిరాకీ పెరిగింది కదండీ. వీరు మనూర్లో కూడా వెంచర్ మొదలెడదామని.. ఇంక డెవలప్మెంట్ అయిందంటే.. సిటీలో కలసిపోతుంది. దాంతో విశాలమైన రోడ్లవ్వీ వచ్చేస్తాయి. ” సర్పంచ్ కాసేపు, ఈ వెంచర్ వల్ల తమ గ్రామానికొచ్చే లాభాలన్నీ వివరించాడు.
వినోద్ ఆయన తెలివికి ఆశ్చర్యపోయాడు. ఎలాగైనా పొలం అమ్మించెయ్యటానికి కంకణం కట్టుకుని వచ్చినట్లనిపించాడు. పైగా.. అంత తక్కువ ఖరీదుకి. ఇళ్ల స్థలాలంటే గజాల్లెక్కనుంటుంది ధర.
“వెంచర్ వచ్చాక నాలుగు విల్లాలు కూడా ఇస్తామండీ. ” ఏదో మేర్బాణి చేస్తున్నట్లు, మౌనంగా ఉండిపోయిన తండ్రీ కొడుకులని చూసి అన్నాడు, వచ్చిన వాళ్లలో ఇంకో లాల్చీ అతను.
“మాకు పొలం అమ్మే ఉద్దేశం లేదు. తరతరాలుగా ఉన్న ఎవసాయం వదులుకోలేం సర్పంచి గారూ! మీకు తెలవందేవుంది? తప్పని సరై ఆ పదెకరాలన్నా తీసిశాం. కట్టవో సుఖవో.. ఈ మనుగడిట్టా ఎల్లాల్సిందే. ” అనంతయ్య ఖచ్చితంగా చెప్పేశాడు.
“నీ మంచికోసవే చెప్తాన్నా అనంతయ్యా! అట్టా అప్పులు సేసుకుంటా ఎన్నాళ్లీడుస్తావు? మంచి బేరం వచ్చినప్పుడు తెలివిగా మసలుకోవాల. అందరూ అమ్మకాలు ఆరంభిస్తే రేటు పడిపోద్ది. ” ఇంకో అరగంట లాభాలన్నీ తన ధోరణిలో సాగదీశాడు సర్పంచి. కూడా వచ్చిన చిన్న వాళ్లిద్దరూ వినోద్ తో మాట్లాడాలని ప్రయత్నించారు.. కానీ వినోద్ అవకాశం ఇవ్వలేదు.
చివరికి నెమ్మదిగా లేచి కాళ్లీడ్చుకుంటూ ఇంట్లోంచి బైటికెళ్లారు సర్పంచి బృందం.
……………
“అవున్రా అబ్బాయ్! ఆళ్లెవురో అన్నారని కానీ.. పత్తి, జొన్న, కాయగూరలు.. ఏం వేసినా నష్టవే. అప్పులు తప్ప లాభాలు కళ్ల జూసి ఏనాడయిందో!” పొలంలో, ట్రాక్టర్ తో దుక్కి దున్నుతుండగా అన్నాడు అనంతయ్య.
“నీళ్లు లేకనేగా? దానికి బోర్లు తవ్వి స్ప్రింక్లర్లు పెడదాం. ” అనుభవం ఉన్న అనంతయ్య దగ్గర నేర్చుకోటమే కాకుండా, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్లతో, యూనివర్సిటీ అధ్యాపకులతో మాట్లాడుతూ, లైబ్రరీకి వెళ్లి పుస్తకాలు చదువుతూ తన విజ్ఞానాన్ని పెంచుకుంటున్న వినోద్ ఉత్సాహ పరచాడు.
“నీటి ఎద్దడి సరే అనుకో, పురుగు గోల మరీ ఎక్కువ. ఇంక విత్తనాలు కూడా మంచి గ్రేడు దొరకటంలా. ”
“అట్టయితే మనవే విత్తనాల పంట వేసుకుంటే పోలా? దానికి కావలసిన ఫార్మాలిటీలు కనుక్కుంటా రేపట్నుంచీ. ” వినోద్ సాలోచనగా అన్నాడు.
“చాలా కష్టంరా అబ్బాయ్. పదున్లు ఎక్కువ. ”
“చూద్దాం. ” అన్నట్టు గానే వినోద్, రెండెకరాల్లో విత్తనాల పంటకి ప్రయత్నాలు మొదలు పెట్టాడు, అన్ని పర్మిట్లూ తీసుకుని. సరిగ్గా అదే సమయంలో సిద్ధిపేటలో. ‘గ్లైనస్ హెచ్టి’ నకిలీ పత్తి విత్తనాలను, అక్రమంగా దాచి సరఫరా చేస్తూ, గత రెండేళ్లుగా పత్తి రైతులను ముంచేస్తున్న గాంగ్ పట్టుబడ్డారు. దాంతో ఇంక అనంతయ్య కూడా మనస్ఫూర్తిగా సహకరించాడు.
“ఏంటోరా! మా తాత, అయ్య వాళ్ల కాలంలో పొలంలో మావూలుగా పండిన విత్తుల్నే కొన్ని విడిగా తేమ ఎక్కువ లేని చోట దాచి పెట్టి వాడుకునే వోళ్లం. ఇప్పుడు ప్రత్యేకించి విత్తనాలు కొనుక్కోవలసి వస్తోంది, గవర్న్ మెంట్ రూలుతో. నాడెం ఎక్కువనీ.. గ్రేడు విత్తులనీ అంటన్నారనుకో!”
మొత్తానికి వినోద్ ప్రయత్నం ఫలించింది. విత్తన పంటలో మామూలు పంట కంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. దిగుబడి ఐన విత్తనాలను, తగు మోతాదులో విత్తన శుద్ధి చేసుకోవాలి.. అంటే నిర్దిష్ట సమయాలలో, నిర్దేశించిన రీతిలో కావలసిన మందులు విత్తనాల్లో కలుపుకోవాలి.
అన్ని జాగ్రత్తలూ తీసుకుని, విత్తనాలు పండే లోగా.. బిటి విత్తనాలను తెచ్చి చల్లారు అనంతయ్యా వినోద్ లు. బిటి విత్తనాలలో అంతర్గతంగా కొన్ని రకాల పురుగులు దరి చేరకుండా ఉండే మందులుంటాయి. వ్యవసాయ శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేసి ఆ ఇన్సెక్టిసైడ్స్ ను విత్తులలోకి జొప్పించారు.
బిటి విత్తనాలను జల్లినప్పుడు, 20 శాతం కమతం విస్తీర్ణంలో అదే రకం బిటిలేని పత్తి విత్తనాలను జల్లారు. దాన్ని రెఫ్యూజీ బెల్ట్ అంటారు. ఈ విధంగా వెయ్యటం వల్ల, పురుగుల నిరోధక శక్తి తగ్గి, మందులు బాగా పని చేస్తాయి.
విత్తనాలు జల్లే ముందు, వినోద్ మొలక శాతం కూడా చూశాడు. అంటే.. ఒక బట్ట పైన కానీ, చెక్క పెట్టలో కానీ, లెక్క ప్రకారం విత్తనాలు సహజ వాతావరణంలో జల్లి, ఎన్ని గింజలు మొలకెత్తాయో చూసుకోటం. దాని వల్ల నాటబోయే విత్తుల నాణ్యత తెలిసి పోతుంది.
బిటి విత్తుల మొక్కలు, మిగిలిన విత్తుల మొక్కల కంటె తక్కువ ఎత్తులో ఉంటాయి. వరుసలో దూరం తగ్గించటం వల్ల ఎక్కువ మొక్కలు నాటటానికి అవకాశం ఉంటుంది. దిగుబడి కూడా పెరుగుతుంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని, విత్తనాల ఎన్నిక, తేమ శాతం, తాపం తట్టుకోగల శక్తి చూసుకుంటూ, వాన నీటితో పాటు, వాలుగా నీరు చిందించే గొట్టాలు పెట్టి సాగు చెయ్యటంలో వినోద్ ప్రతిభ చూస్తూ అనంతయ్య ఆశ్చర్య పోయాడు. రసం పీల్చే పురుగులు, తెగుళ్లు, తెల్లదోమలు వంటి హానికర క్రిమి కీటకాలని మొదటి దశలోనే కనిపెట్టి తగు జాగ్రత్తలు తీసుకున్నాడు.
చివరికి.. శ్రమంతా ఫలించి అనుకున్న దానికంటే ఎక్కువే దిగుబడి వచ్చి వచ్చి లాభాలతో చాలా వరకూ అప్పులు తీర్చగలిగారు.
అనంతయ్య సలహాతోనే, అంతర పంటగా(పత్తి మొక్కల వరుస మధ్యలో పెసర విత్తులు జల్లి) పెసలు వేసి, సంవత్సరానికి సరిపడా, తమ ఖర్చులకి డబ్బు మిగుల్చుకున్నారు.
ఐదు సంవత్సరాలు అలాగే నడిచింది. వినోద్ కి పక్క గ్రామంలో రైతు, శంకరయ్యగారమ్మాయి శిరీషతో పెళ్లయింది. శిరీష అగ్రికల్చర్ బియస్సీ చదివింది. కావలసిన పేపర్ పనంతా తను చూసుకుంటుంది. నాలుగేళ్ల కొడుకు. ఆరో సంవత్సరం దుక్కి దున్నేటప్పుడు ఆగమన్నాడు వినోద్.
“ఏందిరా అబ్బాయ్?” అనంతయ్య కొంచెం అసహనంగా అడిగాడు. అతనికి పనికి అడ్డు తగుల్తే చిరాకు.
“మట్టి పరీక్ష చేయించాలి నాన్నా! జింకు, మెగ్నీషియమ్, బోరాన్ వంటి పదార్ధాల శాతం చూడాలి. అవి తగ్గి పోతుంటాయి. ఎంత తగ్గిందో చూసి దానికి ట్రీట్ మెంట్ ఇవ్వాలి. ”
“సెభాష్ రా అబ్బాయ్. ఎట్టా అయినా సదూకున్నోడు సదూకున్నాడే. ఏరా బుజ్జీ.. నిన్ను ఫారిన్ లో చదివిస్తారా. ఐతే ఒక్క షరతు.. ఎంత చదివినా వచ్చి పంట పండించాల్సిందే!” మనవడ్ని ఎత్తకుని అన్నాడు అనంతయ్య.
“ష్యూర్ తాతా!” చేతిలో చెయ్యి కలుపుతూ అన్నాడు చిన్న అనంత్.
“రైతు బిడ్డనిపించావురా తాతా” అనంతయ్య మురిపెంగా చూశాడు.

*————-*

By Editor

One thought on “రైతు బిడ్డ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వర్గాలు
భోషాణం
ఇటీవలి వ్యాఖ్యలు