April 24, 2024

అమ్మమ్మ – 16

రచన: గిరిజ పీసపాటి

నాగకు, పాపాయికి ఇరవై ఒకటవ రోజున పెద్ద పురిటి స్నానం చేయించారు. పిల్ల పుట్టిన ఇరవై నాలుగవ రోజు పీసపాటి తాతయ్య మక్కువ వచ్చి మర్నాడు మంచిరోజు కనుక, భార్యని, కోడలిని, మనుమరాలిని రాముడువలస తీసుకెళ్తానని, ఇన్నాళ్ళూ నాగను తమ ఇంట కన్న బిడ్డకన్నా ఎక్కువగా చూసుకుని పురుడు పోసినందుకు డాక్టర్ గారికి, వారి భార్యలిద్దరికీ కృతజ్ఞతలు తెలిపి, బారసాలకి తప్పకుండా రమ్మని ఆహ్వానించారు.
మర్నాడు అంటే ఇరవై ఐదవ రోజున నాగను, చంటి పిల్లను రాముడువలస తీసుకుని వచ్చారు. బారసాల ఏర్పాట్లు అన్నీ నాగ పెద్దత్తగారు, పెద మామగారు చూసుకోసాగారు. నాగ అత్తగార్ల అత్తగార్లు ఇద్దరూ వారికి సలహాలు ఇస్తూ ఏఏ వస్తువులు ఎంతెంత కావాలో చెప్ప సాగారు.
బారసాల రోజు రానే వచ్చింది. అసలే ఉమ్మడి కుటుంబం, దానికి తోడు దగ్గరి బంధువులు, పీసపాటి తాతగారి సహ నటులతో, ఊరి వాళ్ళతో పీసపాటి వారి ఇల్లు పెళ్ళి ఇల్లులా వైభవంగా ఉంది. మక్కువ నుండి డాక్టర్ గారు భార్యలిద్దరితో సహా వచ్చారు.
ఇంటి పెరటిలో తవ్వించిన మూడు గాడిపొయ్యలపై ఇంటి వంట మనిషి అప్పల నరసయ్య గారి ఆధ్వర్యంలో వంటల కార్యక్రమం జోరుగా సాగుతోంది. అప్పటికి టిఫిన్ పెట్టే సంప్రదాయం లేదు కనుక కాఫీ, హార్లిక్స్ ఒకటికి పది సార్లు అడిగినా విసుక్కోకుండా ఇస్తున్నారు.
ఒక పొయ్యి పూర్తిగా పాలు మరగబెట్టి, డికాషన్ తియ్యడానికే వదిలేసారు అప్పల నరసయ్య గారు. ఆడవాళ్ళు కూరలు తరిగి ఇస్తూ, ఆయనకు కావలసినవి అందిస్తూ బిజీగా ఉంటే, పీసపాటి తాతగారు ముహూర్తం వేళకి పూజా కార్యక్రమానికి అన్నీ అమరుతున్నాయో లేదో ఒక చెక్క కుర్చీలో కూర్చుని పర్యవేక్షిస్తున్నారు.
పెద్ద తాతయ్య మామిడి తోరణాలు కట్టించడం, భోజనాలకి అరిటాకులు తెప్పించడం, పనసకాయలు పొట్టు కొట్టించడం, అతిధులను ఆహ్వానించడం చేస్తున్నారు. పీసపాటి మామ్మ, చిట్టి మామ్మ (పెద్ద తాతయ్య భార్య) ఇద్దరూ కొత్తగా వచ్చిన మామ్మ హోదాలో పట్టు చీరలతో, నిండుగా నగలతో హుందాగా తిరుగుతున్నారు.

అవధాని గారు నాగను, పెద్ద బావను పీటల మీద కూర్చోబెట్టి దంపతుల చేత ముందు విఘ్నేశ్వర పూజ చేయించసాగారు.
బంధు మిత్రులంతా ఇంతలో గుసగుసలు ప్రారంభించారు. పీసపాటి వారి ఇంట చాలా కాలం తరువాత మరో తరానికి నాంది పలుకుతూ లక్ష్మీ దేవిలా పుట్టిన ఆడపిల్లకు ఏం పేరు పెడతారా!? అని అందరి కుతూహలం. ఆ సమయం రానే వచ్చింది.
పెద్ద బావ బియ్యం ఉన్న బంగారు పువ్వు వేయించిన వెండి పళ్ళెం చేతిలోకి తీసుకోగానే “ఏరా పెద్దాడా! పిల్లకు ఏం పేరు పెట్టాలనుకుంటున్నారు మీ భార్యాభర్తలు?” అని అడిగారు పీసపాటి తాతయ్య.
“నువ్వు ఏది చెప్తే అదే పెడతాం బాబూ!”
(బాబాయిని బాబు అంటాము మా ఇళ్ళలో. కన్న కొడుకులే అయినా పీసపాటి తాతయ్యను బాబు అని, మామ్మ ను పిన్ని అని పిలవడం అలవాటు వాళ్ళకి).
పెద్ద కొడుకు సమాధానం విన్న పీసపాటి తాతయ్య “అయితే మీ అమ్మ పేరు ‘పాపమ్మ’ కనుక పాప అని పెడదాం. ఎలాగూ నాగకు పుట్టిన సంతానానికి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి పేరు పెట్టాలి. లేకపోతే పిల్లలు దక్కరు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాపడు అనే పేరు కూడా ఉంది కనుక ఉభయతారకంగా ఉంటుంది” అన్నారు.
పెద్ద బావ సరేనని తలూపినా, నాగ మాత్రం మనసులో ‘ఇదేం పేరు? చిన్నపిల్లప్పుడు పరవాలేదు కానీ పిల్ల పెద్దదయ్యాక కూడా ‘పాప’ అని ఎలా పిలుస్తాం’ అనుకుంది. కానీ ఆ ఇంటి కోడలుగా అత్తగారి పేరు కనుక అభ్యంతరం చెప్పలేకపోయింది.
పీసపాటి వారి ఇంటి ఇలవేల్పు అయిన నరసింహ స్వామి పేరు, ఏడుకొండల స్వామి పేరు కలిపి పుట్టిన పిల్లకి ‘వెంకట నరస పాప’ అని నామకరణం చేసారు.
అందరూ పుట్టిన పాపాయిని, నాగని, పెద్ద బావని ఆశీర్వదించిన అనంతరం సత్యనారాయణ స్వామి వ్రతం చేయించారు అవధాని గారు. అనంతరం ప్రసాదం పంచారు.
బూర్లు, పులిహోర, ముద్ద పప్పు, ముక్కల పులుసు, స్వచ్ఛమైన నెయ్యి, కంద బచ్చలి కూర, పనసపొట్టు కూర, గారెలు, పెరుగు గారెలు, కొబ్బరి మామిడి పచ్చడి, అల్లం పచ్చడి, కొత్తావకాయ, అప్పడాలు, పేల వడియాలు, గుమ్మడి వడియాలు, ఊరు మిరపకాయలు, పెరుగు, మామిడి పళ్ళతో కమ్మని విందు భోజనం ఆరగించి గంట సేపు వేసవి తాపానికి సేద తీరారు అంతా.
సాయంత్రం మూడు అయ్యేసరికి నాగకు కొత్త నేత చీర కట్టించి, కప్పకు మొక్కించడానికి నూతి దగ్గరకు తీసుకెళ్ళారు. మూడు పుట్ట మన్ను బెడ్డలు తెచ్చి వాటిని పసుపు కుంకుమలతో పూజించిన అనంతరం నూతిలో చేదతో నీళ్ళు తోడించారు.
అప్పటి నుండి ప్రసవం అయిన స్త్రీ నూతి నీళ్ళు తోడడం, చెరువుకి వెళ్ళి నీళ్ళు తేవడం మొదలైన పనులు చెయ్యొచ్చని చెప్పడానికే ఈ ఆచారం.
నూతి నీళ్ళు తోడాక నాగ కోసం తయారు చేసిన ‘కాయపు ఉండలు’ ఇచ్చి తినగలిగినన్ని తినమన్నారు. కానీ నాగ ఒక్కటి కూడా పూర్తిగా తినలేకపోయింది. అది చాలా కారంగా, ఘాటుగా ఉంటుంది. మిరియాలు, సొంఠి, పిప్పళ్ళు వంటి వాటిని పొడి చేసి, వాటికి పాత బెల్లం కలిపి కాయాన్ని తయారు చేస్తారు.
ఇంతలో నాగ ఆడపడుచు అయిన ఏడేళ్ళ చిన్న (అసలు పేరు అన్నపూర్ణ కామేశ్వరి) వచ్చి “నాకు కావాలి అది” అని పేచీ పెడితే పెద్దవాళ్ళు నవ్వుతూ ఒక ఉండ తన చేతిలో వేసారు. తను ఆ ఉండ తినేసి ఇంకోటి ఇవ్వమని అడిగితే నాగ బిత్తరపోయి చూసింది ఆడపడుచు వైపు.
మరో రెండు ఉండలు తినేసి ఇంకో ఉండ కోసం మళ్ళీ చెయ్యి జాపిన చిన్నను పెద్దవాళ్ళు వేడి చేస్తుంది అంత తినకూడదని మందలించి “చిన్నపిల్లయినా అది తింటోంది కానీ, తినాల్సిన నువ్వు మాత్రం తినట్లేదు. ఇది తింటే వాతం కమ్మకుండా ఉంటుంది. పాలు బాగా పడతాయి. తిని తీరాల్సిందే” అనడంతో బలవంతంగా మూడు ఉండలు తింది.
తినడమైతే పౌరుషానికి తింది గాని, తరువాత మంటను తట్టుకోలేక నూతిలో నీళ్ళు తోడుకుని, చేదలోంచి దోసిట్లోకి వంపుకుంటూ గటగటా తాగేస్తున్న నాగను చూసి అంతా ఫక్కుమని నవ్వి “ఇంత సుకుమారిని ఎక్కడా చూడలేదు, పట్నం పిల్ల కదా” అంటూ మేలమాడారు.
తరువాత పట్టు చీరను ఊయలగా కట్టి పాపను ఊయలలో వేసారు. పాటలు వచ్చిన వాళ్ళు ఊయల పాటలు పాడారు. తరువాత పేరంటాళ్ళకు పసుపు రాసి, బొట్టు పెట్టి, గంధం పూసి, పన్నీరు జల్లి, తాంబూలంలో మామిడి పళ్ళు పెట్టి, నానవేసిన కొమ్ము శెనగలలో పంచదార చిలకలు చేర్చి నాగ చేత వాయినాలు ఇప్పించారు అత్తగార్లు ఇద్దరూ.
బారసాల విశేషాలు, పాపకు పెట్టిన పేరు వివరిస్తూ అమ్మమ్మకు ఉత్తరం రాసారు పీసపాటి తాతయ్య. అమ్మమ్మ కూడా ‘వియ్యపురాలి పేరు పెట్టినా, చివర వేరే ఏదైనా మంచి పేరు కలిపితే బాగుండేది కదా! మరీ ‘పాప’ అని పెట్టారేంటి’ అనుకుంది.

******* సశేషం *********

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *