March 19, 2024

అష్ట వినాయక మందిరాలు

రచన: నాగలక్ష్మి కర్రా

అష్టగణపతులు

పంచ ద్వారకలు, పంచబదరీలు, పంచప్రయాగలు, పంచపురాలు, అష్టాదశ పీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు లాగానే మహారాష్ట్రాలో అష్ట వినాయకులు ప్రసిద్ది. ఈ అష్టవినాయక మందిరాలు పూణె నగరానికి సుమారు 15 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల దూరంలో వున్నాయి. ఈ అష్టగణపతుల దర్శనం చేసుకోదలచిన వారు పుణె నగరం నుంచి మొదలుపెట్టుకుంటే సుమారు ఒకటిన్నర రోజులలో అన్ని గణపతులనూ దర్శించుకోవచ్చు.
ఒక్కో గణపతి పుణె నగరం నుంచి యెంతదూరంలోవుంది, కోవెల వర్ణన, స్థలపురాణం మీకు వివరంగా చెప్తాను, మొదటగా మహాగణపతి గురించి తెలుసుకుందాం.

1)మహాగణపతి ( రంజణ్ గావ్ )-
పూణే అహ్మద్ నగర్ రోడ్డుమీద పూణే నగరానికి సుమారు 50 కిమీ. .దూరంలో రంజణ్ గావ్ లో వుంది యీ మహా గణపతి ఆలయం.
మహా గణపతి అంటే అన్ని దేవీ, దేవతల శక్తిని పొంది మహా శక్తివంతునిగా మారిన వినాయకుడు అని అంటారు. ఉషః కాలానికి ప్రతీక అయిన సింధూర వర్ణము వాడు. నుదుటన అర్ధ చంద్రుని ధరించి శివుని వలే మూడు కన్నులు గలిగి, దశ తొండములు, ఇరవై భుజములు కలిగినటవంటి మహా ఆకారుడు యీ మహాగణపతి. విష్ణుమూర్తి ఆయుధమైన చక్రం, వరాహ అవతారంలో ఆయుధమైన గద, లక్షీదేవికి ప్రతీక అయిన తెల్ల తామర, పాశం, శృష్ఠి స్థితి లయలకి ప్రతీక అయిన దానిమ్మ పండు, మన్మధుని చెరుకు విల్లు, పృద్వికి ప్రతీకగా ధాన్యం కంకు, సంపదకు ప్రతీకగా బంగారు కలశం, నీలి కలువ మొదలయినవి చేతులలో ధరించి అష్ఠ ఐశ్వర్య ప్రదాత అనేదానికి ప్రతీకగా తామర పువ్వుపై కూర్చొని సిద్ధిని తొడపై కూర్చో పెట్టుకుని ఉంటుందీ మహా గణపతి విగ్రహం. ఈ విగ్రహాన్ని పేష్వా మాధవరావు కాలంలో కోవెలలోని నేల మాళిగలో దాచినట్లు చరిత్రలో వుండగా యిక్కడి పూజారులు అలాంటిదేమీ లేదని అంటున్నారు.

ఈ కోవెల తొమ్మిది లేక పదవ శతాబ్దానికి చెందిన కోవెల. ఈ కోవెల తూర్పు ముఖంగా వుంటుంది. ప్రతీ రోజు ఉదయిస్తున్న సూర్యుని కిరణాలు మహా గణపతి విగ్రహం మీద పడేటట్టుగా నిర్మాణం చేసేరు. సభా మండపంలో శివుని మందిరం వుంది. లోపలి కోవెల పేష్వా కాలం నాటి మందిరాలను గుర్తు చేస్తూ వుంటుంది. ఇక్కడ నిత్యాన్నదానం జరుగుతూ వుంటుంది. ఈ మధ్య కాలంలో కట్టిన సంతోషి మాత మందిరం కూడా చూడొచ్చు. నాలుగు సంవత్సరాల క్రిందట చేపట్టిన కోవెల పునః నిర్మాణపు పనులు యింకా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా పూణే అహ్మద్ నగర్ రోడ్డు పైకి వో పెద్ద ద్వారం కళాత్మకంగా నిర్మించేరు. ద్వారానికి రెండు వైపులా పెద్ద ఏనుగులు భక్తులను స్వాగతిస్తున్నట్లుగా నిర్మించేరు. ద్వారంపై అష్ఠ గణపతుల పేర్లు, కోవెల వున్న ప్రదేశం పేరు ఆయా గణపతుల బొమ్మల క్రింద రాసేరు.

ఇక్కడి స్థల పురాణం గురించి తెలుసుకుందాం. త్రిపురాసురుడు ముల్లోకాలను తన ఉత్పాతంతో భయ భ్రాంతులను చేస్తూ లోకకంటకుడిగా పరిపాలిస్తూ వుంటాడు. త్రిలోక వాసులు శివుని త్రిపురాసుని సంహరించి తమని రక్షింపమని వేడుకొనగా శివుడు త్రిపురాసురిని పైకి యుధ్ధానికి వెళతాడు. యుద్ధం మధ్యలో శివుని రధచక్రం విరిగిపోతుంది. శివుడు వోడిపోయే పరిస్థితి రాగా నారద ముని శివునికి యుధ్దానికి బయలుదేరినప్పుడు వినాయకుని పూజించని విషయం గుర్తు చేస్తాడు. శివుడు తన పొరపాటు తెలుసుకొని గణేషునికి మనస్సులోనే నమస్కరించి తిరిగి త్రిపురాసురునితో యుధ్ధం చేసి త్రిపురాసురుని సంరిస్తాడు. త్రిపురాసురుని సంహరించిన ప్రదేశమే భీమాశంకర్. శివుడు విజయుడైన పిదప రంజణ్ గావ్ మహా గణపతిని దర్శించుకొని పూజించుకొన్నాడనేది యిక్కడి స్థల పురాణం.

2 ) చింతామణి గణపతి ( థేవూరు).
పూణే నగరానికి సుమారు 20 కిమి. . ‘ థెవుర్ ‘ అనే పట్నం లో వుంది చింతామణి గణపతి కోవెల. ఈ ఊరిని కదంబ నగరం అని కూడా అంటారు.
ఉత్తరాభి ముఖంగా వున్న చిన్న ద్వారంలోంచి లోపలి వెళితే సభా మండపం వుంటుంది అక్కడ నుంచి తిన్నగా లోపలి వెళితే మధ్య మండపంలో వినాయకుని స్వయంభూ విగ్రహం వుంటుంది. మధ్య మండపం చుట్టూ చిన్న చిన్న మందిరాలలో మహాదేవుడు, విష్ణు లక్ష్మి, ఆర్క వృక్షాలు, దీప స్తంభం, ఆంజనేయుడి మందిరం వుంటాయి వెనుక వైపున ‘ పేష్వా వాడా ‘ వుంటుంది. పేష్వా రాజులలో మాధవరావు వినాయకునికి పరమభక్తుడు. పేష్వా మాధవరావు యుద్ధానికి వెళ్ళేటప్పుడు చింతామణి గణపతి దగ్గర అనుజ్ఞ తీసుకొని వెళ్ళేవాడు. యుద్ధం జయించిన తరువాత తిరిగి దేవుని దర్శించుకొనేవాడు. ఈ కోవెలకు పేష్వా మాధవరావు తరచూ వచ్చేవాడని అంటారు. అతను అక్కడ వుండే సమయంలో పెష్వా వాడాలో నివశించేవాడు. పేష్వా మాధవరావు చాలా జబ్బు చేసి తుది శ్వాస చింతామణి గణపతి సన్నిధి లోనే విడిచేడట. పేష్వా వాడాని ప్రస్తుతం ట్రస్టు వారు వారి దినవారీ అవుసరాలకి గాను వాడు కుంటు న్నారు. మధ్య మండపంలో పెద్ద గంట కనిపిస్తుంది. దీన్ని పేష్వా బాజీరావు –1 పోర్చుగీస్ వారిని జయంచిన తరువాత విజయ చిహ్నంగా తనతో తీసుకొని వచ్చి యీ కోవెలలో వుంచేడని ప్రతీతి. ఇది యీ కోవేలకి సంబందించిన చరిత్ర.
ఈ కోవేలకి సంబందించిన పురాణ కధ యిలా వుంది.
ముద్గల పురాణమ్ ప్రకారం, మహారాజు అభిజిత్ రాణి గుణవతి ల పుత్రుడు రాజకుమారుడు గణ. పూర్వ జన్మ పుణ్యం వలన అతను శివుని వద్ద అజేయుడుగను, మూడు గుణములు ( సత్వ, రజో, తామస ) ద్వారా జన్మించిన వారినుండి మరణము లేకుండు నట్లుగను వరములు పొందుతాడు. మిక్కిలి అసూయా పరుడు, మిక్కిలి దురాశను కలిగి ఉంటాడు. తన సైన్యముతో, శివుని వరప్రభావం తో ముల్లోకాలను జయించి ముల్లోకాలను పరిపాలిస్తూ ఉంటాడు. గర్వముతో మునులను, ఋషులను బాధిస్తూ ఉంటాడు. అతని బాధలు తట్టుకోలేని ప్రజలు అతనిని “గణాసురుడు” అని పిలువసాగేరు. కపిల మహర్షి వద్ద అన్ని కోర్కెలు తీర్చే అద్భుతమైన మణి గలదని ఆ మణిని చింతామణి అని అంటారని తెలుసుకున్న గణాసురుడు కపిల మహర్షి ఆశ్రమానికి వెళ్లి ఆ మణిని తనకు యివ్వమని కోరుతాడు. కపిల మహర్షి చింతామణిని యివ్వ నిరాకరిస్తాడు. గణాసురుడు పెద్దల మాట పెడ చెవిని పెట్టి కపిల మహర్షి ఆశ్రమానికి తన సైన్యముతో దండెత్తి వస్తాడు. కపిల మహర్షి వినాయకుని గణాసురుని బారి నుంచి రక్షింపమని వేడుకుంటాడు. అప్పుడు వినాయకుడు తనలోని శక్తి తో ‘ సిధ్దిని ‘ సృష్టిస్తాడు. సిధ్ది వేయి చేతులుగల ‘లక్షుడు ‘ అనే యోధుని సృష్ఠించి అతనిని గణాసురుని సైన్యం పైకి పంపుతుంది. ‘ లక్షుడు ‘ గణాసురుని సైన్యాన్ని అంతమొందిస్తాడు. వినాయకుడు గణాసురుని వధించి ముల్లోకాలకు ముక్తి కలిగిస్తాడు.
కపిల మహర్షి కోరిక మేరకు వినాయకుడు ఆ ప్రదేశంలో స్వయంభూగా వెలసి చింతామణి గణపతిగా భక్తుల పూజలందుకుంటున్నాడు. బ్రహ్మదేవుడు విచలిత మనస్కుడై యిక్కడకు వచ్చి తపస్సు చేసుకొని స్థిర చిత్తుడైనాడనేది మరో కధ, స్థిర అనే మాట కాలాంతరాన ‘ థెవూర్ ‘ గా మారిందని అంటారు. బ్రహ్మ దేవుడు తనలోని చింతలను యిక్కడ పోగొట్టుకున్నాడు కాబట్టి చింతామణి గణపతి అని పేరు వచ్చిందని కూడా అంటారు.
దేవతల రాజైన ఇంద్రుడు గౌతమ మహర్షి యిచ్చిన శాప విముక్తి కొరకు యీ వినాయకుని ఎదురుగా కదంబ వృక్షం కింద కూర్చొని తపస్సు చేసుకొని శాప విముక్తుడైనాడు. అందుకే యీ ఊరుని కదంబ నగరి అని కూడా అంటారు. ఇక్కడ ముఖ్యంగా భాద్రపద మాసంలో అమావాస్య మొదలుకొని ఏడురోజులు ఉత్సవాలు నిర్వహిస్తారు అందులో నాలుగో దినం వినాయక చవితిగా జరుపుకుంటారు.

మాఘ శుక్ల చవితినాడు గణేశజయంతి ఉత్సవాలు జరుపుకుంటారు.

ఇక మూడవది రమా మాధవ పుణ్యోత్సవం. చింతామణి గణపతికి పరమ భక్తుడైన మాధవరావు మరణించిన పిమ్మట పరమ సాధ్వి రమాబాయి సతీ సహగమనం చేసి భర్తతో పుణ్య లోకాలకు చేరుకుంది. ఆ పుణ్య దంపతుల జ్ఞాపకార్ధం వారి పుణ్య తిథిని యిక్కడ పండగలా జరపడం ఆనవాయితీ.

3)వరద వినాయకుడు ( మహాడ్ ) –
వరద వినాయకుని మందిరం మహారాష్ట్రలోని రాయ్ ఘడ్ జిల్లాలోని మహాడ్ బొంబాయికి సుమారు 80 కిమీ. . దూరంలోనూ, పూణే నుంచి సుమారు 130 కిమీ. లోనూ వుంది.

ఈ కోవెల తుర్పుముఖంగా వుంటుంది. ఈ కోవెల నాలుగువైపులా నాలుగు ఏనుగు విగ్రహాలు వుంటాయి. 25అడుగుల యెత్తైన గోపురం బంగారు శిఖరం వుంటాయి. గర్భగుడిలొ వరద వినాయకుడు తూర్పు ముఖంగా కూర్చున్న భంగిమలో వుంటాడు. తొండం ఎడమ వైపుకి తిరిగి, యిరువైపులా రిద్ధి, సిద్ది ల రాతి విగ్రహాలు వుంటాయి. మిగతా అష్ఠ గణపతుల మందిరాలలో గర్భగుడి లోనికి భక్తులను అనుమతించరు కాని వరద వినాయక కోవెలలో భక్తులకు గర్భగుడిలోకి ప్రవేశించి పూజాది కార్యక్రమాలు స్వయంగా నిర్వహించుకొనే అవకాశం కల్పించేరు.
ఈ కోవేలలో దర్శించు కొనవలసినది గర్భగుడి లో వుండే అఖండ దీపం. కొన్ని వందల సంవత్సరాలుగా అఖండంగా వెలుగుతూనే వుందిట. వరద వినాయకునికి మూడు పూటలా నిత్య పూజలు జరుగుతాయి.

వరద వినాయకుని స్థల పురాణం గురించి అడుగగా యిలా చెప్పేరు.
సంతానం కొరకై కౌండిన్య పురాన్ని పాలించే రాజు భీముడు, ధర్మపత్నితో తపస్సాచరించడానికి అడవికి వెళ్తాడు. అక్కడ విశ్వామిత్రుడు ని కలిసి అతని ద్వారా ఏకాక్షర గజానన మంత్రోపదేశం తీసుకొని ఆ మంత్ర ప్రభావము వలన పండంటి పుత్రుని పొందుతాడు భీముడు. ఆ బిడ్డకు రుక్మాంగదుడు అని నామకరణం చేసుకొని అల్లారు ముద్దుగా పెంచుకొని, సర్వ శాస్త్ర విద్యలు నేర్పించి, యుక్త వయస్కుడవగానే వివాహం చేసి పట్టాభిషిక్తుడను చేస్తాడు.

ఒకరోజు రుక్మాంగదుడు వేటకి వెళ్లి అక్కడకి దగ్గరగా వున్న వచక్నవి అనే ఋషి ఆశ్రమానికి విశ్రమించడానికి వెళ్తాడు. రుషి పత్ని ముకుంద యవ్వన వంతుడైన రుక్మాంగదుని చూచి మోహించి అతనిని తన కోరిక తీర్చమని అడుగుతుంది. ఆగ్రహించిన రుక్మాంగదుడు ఋషి పత్నిని వారించి అక్కడ నుంచి వెడలిపోతాడు. ముకుందను యెప్పటినుంచో మోహించిన ఇంద్రుడు రుక్మాంగదుని రూపంలో వచ్చి ముకుందతో గడుపుతాడు. జరిగిన మోసం తెలియని ముకుంద గర్భం దాల్చి ‘గ్రిత్సామద ‘ అనే పుత్రునకు జన్మనిస్తుంది. పెరిగి పెద్దవాడైన గ్రిత్సామదుడు తన జన్మ వృత్తాంతం తెలుసుకొని, ముకుందను అసహ్యించుకొని ఆమెను ముళ్ళతో కూడుకొని వుండే బదరిక వృక్షం ( రేగు చెట్టు) కమ్మని శపిస్తాడు. ఆ శాపానికి ప్రతిగా ముకుంద గ్రిత్సామదునకు రాక్షసుడుగా జన్మించాలని శపిస్తుంది. అంతలో ఆకాశవాణి గ్రిత్సామదుని జన్మానికి కారణం రుక్మాంగదుడు కాదని సాక్షాత్తూ దేవేంద్రుడేనని చెప్తుంది.

అవమానంతో కుంగిపోయిన గ్రిత్సామదుడు ఆ వనాన్ని విడిచిపెట్టి పుష్పక వనానికి వెళ్లి తన తపశ్శక్తితో గణేషుని ప్రసన్నుని చేసుకొని తల్లి వలన పొందిన శాపాన్నుంచి తప్పించమని కోరుతాడు. గణేశుడు తల్లి శాపాన్నుండి తప్పించే శక్తి యెవరికీ లేదని చెప్పి అతని పుతృనకు ఈశ్వరుని చేతిలో తప్ప మరెవరి చేతిలోనూ మరణం లేనట్లుగా వరం యిస్తాడు.

గ్రిత్సామదుడు, గణేశుడు తనను కరుణించిన పుష్పక వనములోనే స్థిరనివాసుడై భక్తులకు విజయ ప్రాప్తిని, జ్ఞానమును ప్రసాదింప మని కోరుతాడు.

గ్రిత్సామదుని కోరిక మన్నించి గణేశుడు స్వయంభుగా ఉద్భవించె ననేది యిక్కడి స్థల పురాణం. గ్రిత్సామదుడు గణెశునికి కోవెల కట్టించి భక్తుల కోర్కెలు తీర్చే వినాయకుడు కావున వరద వినాయకుడు అనే పేరుతో సేవించుకొని ముక్తి పొందుతాడు. పుష్పక వనం కాలాంతరాన భద్రకావనంగా పిలువబడ సాగింది.

వరద వినాయకునికి రోజు మూడు పూటలా నిత్య పూజలతొ పాటు, భాద్రపద, మాఘ మాసాలలో శుద్ధ పాడ్యమి నుంచి పంచమి వరకు ఉత్సవాలు నిర్వహిస్తారు.

గణేశ జయంతి, వినాయక చవితి విశేషం గా జరుపుతారు.

సంతానం లేని దంపతులు మాఘ ఉత్సవం ( శుద్ధ పాడ్యమినుంచి పంచమి వరకు ) లో పాల్గొని వినాయకునికి నైవేద్యం గా కొబ్బరికాయను సమర్పించి ఆ ప్రసాదాన్ని తినడం వల్ల వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందనేది స్థానికుల నమ్మకం.

4. శ్రీ భల్లలేశ్వర గణపతి — పాలి

” వేదో సంతువైభవో గజముఖో భాక్తాభిమానియో
భల్లలేరశ్య సుభక్త పాల నారద ”

అని భక్తులచే పిలువబడుతూ, బాల భక్తుడిని అనుగ్రహించేందుకు స్వయంభూగా వెలసిన శ్రీ భల్లలేశ్వర గణపతి ఆలయం మహారాష్ట్రలోని రాయఘఢ్ జిల్లాలో, సుధగఢ్ తాలుకాలో వున్న పాలీ గ్రామంలో వుంది. కర్జాత్ రైల్వే స్టేషన్ కి సుమారు 33 కిమీ దూరంలో వుంది. పుణె నగరానికి సుమారు 110 కిమీ. . దూరం.

సాధారణంగా ఏ కోవెల స్థల పురాణం విన్నా భగవంతుడు మహానుభావులనో, ఇతర దేవీదేవతలనో అనుగ్రహించేందుకు అవతరించడం వింటూ వుంటాము. కాని యిక్కడ వినాయకుడు బాల భక్తుని కొరకై యీ ప్రదేశంలో స్వయంభుగా అవతరించేడుట. ఆ కధ ఏమిటో తెలుసుకునే ముందర కోవెలని వొకసారి కనులారా దర్శించుకొని, ఆ పవిత్ర భావంతో స్థల పురాణం తెలుసుకుందాం.

ఈ పాలీ గ్రామం పుణ్య నదులైన సారసగఢ్, అంబా నదుల మధ్యన వుంది. భక్తుని పేరుమీదుగా స్వామి పూజలందుకొనే ఏకైక క్షేత్రంగా యీ క్షేత్రాన్ని లెఖ్కిస్తారు. ఇక్కడ గల మరో విశేషం యేమిటంటే వినాయకుని బ్రాహ్మణ వేషధారణ చేసి పుజిస్తారు. ఇది మరే కోవెలలోను కనిపించదు.
వెదురుతో నిర్మింపబడ్డ పురాతన కట్టడాన్ని 1760 సం. లో శ్రీ పడ్నీస్ ద్వారా రాతి కట్టడంగా మార్చ బడింది. కోవెల ప్రాంగణమంతా రాతి పలుకలు పరచబడ్డాయి. యీ కోవెల చుట్టూ సరస్సులు వుండడం మరో విశేషం. కుడివైపున వున్న సరస్సులోని నీరు అభిషేకాలు మొదలయిన పూజాది కార్యక్రమాలకు వినియోగిస్తూ వుంటారు.
ఈ ఆలయం తూర్పు ముఖంగా వుండి, దక్షిణాయనంలో సూర్యోదయం సమయంలో సూర్యుని కిరణాలు మూలవిరాట్టుపై పడేటట్టుగా నిర్మించేరు. గర్భ గుడికి వెలుపల పన్నెండు అడుగుల ఎత్తైన మూషికం మోదకాలను రెండు చేతులలో ధరించిన విగ్రహం వుంటుంది. దానిని దాటుకొని పదిహేను అడుగుల ఎత్తు కలిగిన విశాలమైన గర్భ గుడిలోకి ప్రవేశిస్తాము. 1910 సం. . క్రిష్ణాజీ రింజే ద్వారా సిమెంటులో సీసం కలిపి కట్టిన నలభై అడుగుల పొడవు యిరవై అడుగుల వెడల్పు కలిగి 8 చూడ ముచ్చటైన స్తంభాలు కలిగిన అతి పటిష్ఠమైన మండపంలోకి ప్రవేశిస్తాము. ఎడమ వైపుకి తిరిగిన తొండంతో తూర్పు ముఖంగా కూర్చొని వున్న వినాయకుడు మనస్సులకు ప్రశాంతతని కలుగజేస్తాడు. వినాయకుని రెండు కళ్ల స్థానాలలో రెండు వజ్రాలు పొదగబడి, రిద్ధి సిద్ధి లచే చామర సేవలందుకుంటున్న వినాయకుడు దర్శనమిస్తాడు.
పేష్వాల కాలంలో పొర్చుగీసు వారి తో పోరులో వాషి, సశ్తి లను గెలుచుకున్న విజయానికి చిహ్నంగా ” చిమాజీ అప్ప” ద్వారా బహుకరింప బడ్డ పెద్ద యురోపియన్ గంటను యీ కోవెలలో కూడా చూడొచ్చు.
ఇక్కడి స్థల పురాణం యీవిధంగా చెప్తారు.
గణేశ పురాణం ప్రకారం కృతయుగంలో యీ పాలీ గ్రామం సింధు ప్రాంతానికి చెందినదిగా వుండేది. ఈ గ్రామం లో కల్వాణుడు అనే వైశ్యుడు వుండేవాడు, అతను ఇందుమతి అనే కన్యను వివాహం చేసుకొని పూర్ణ చంద్రునివంటి పుత్రుని పొందుతాడు. ఆ పుత్రునకు భల్లాలుడు అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకోసాగేరు. ఆ బాలుడు అందరు పిల్లల వలె ఆటపాటలతో సమయము వెచ్చించక తన వద్దనున్న బొమ్మలను ఎదురుగా నున్న రాళ్లను పెట్టి వాటిని దేవతామూర్తులుగా భావించి భక్తి పారవశ్యంతో పూజ చేసుకొనేవాడు. భల్లాలుని చూచి అతని తోటి బాలురు కుడా అతని వలెనే రాళ్లనె దేవతా మూర్తులుగా భావించి పూజలు చేసుకొనే వారు.

అదే విధముగా ఓ రోజు పిల్లలందరూ వూరి బయట అడవిలోకి వెళ్లి అక్కడ వారికి కనిపించిన ఓ రాయిని వినాయకునిగా భావించి కొందరు పూజాది కార్యక్రమాలు నిర్వహించగా, మరి కొందరు ఆ రాయి పైన వెదుళ్ళు కట్టెలతో పందిరి నిర్మించిగా, మరికొందరు నాట్యగానములతో గణేశునకు వినోదము కలిగించుటకు ప్రయత్నిచాగా మరికొందరు గణేశుని కధలు గానం చేయ్యసాగేరు. భక్తి పారవవ్యం లో మునిగి వున్న పిల్లలకు ఆకలి దప్పులు, రాత్రి పగలు తెలియ రాలేదు. రోజులు గడచినను పిల్లలు యిళ్ళకు చెరక పోయేసరికి వారి వారి తల్లితండ్రులు యిది భల్లాలుని వల్లనే జరిగినదని భావించి కల్వాణుని యింటికి వెళ్లి భల్లాలుని వల్లనే తమ పిల్లలు తమ మాట వినుట లేదని ఆరోపించి పిల్లలను వెదుకుటకు వెళ్తారు. ఊరి బయట అడవిలో తమ పిల్లలు వున్నట్లు గుర్తించి యిళ్ళకు తీసుకొని వెళ్తారు. ఊరివారి మాటల ప్రభావానికి లోనైన కల్వాణుడు యింటికి మరలి రమ్మని భల్లాలుని కోరగా గణేశుని ధ్యానం లో మునిగి వున్న అతను వినిపించుకొడు. కల్వాణుడు క్రోధించి అతనిని రక్తము వచ్చునట్లు కొట్టి తాళ్ళతో చెట్టునకు కట్టి ” నీ దేవుడే నిన్ను కట్లు విప్పి రక్షించునని ” పలికి ఊరిలోకి వెళ్ళిపోతాడు. సరియైన ఆహారము లేక నెత్తురు కారుతున్న దెబ్బల వలన భల్లాలుడు స్పృహ కోల్పోతాడు. కొంత సమయానంతరము తెలివి వచ్చిన భల్లాలుడు తనకు సపర్యలు చేయుచున్నది స్వయంగా గణేశుడేనని తెలుసుకొని మిక్కిలి ఆనందము పొంది భగవంతునకు సష్ఠాంగ నమస్కారములు చేసి అనేక స్తోత్రములు చదివి తన్ను కాపాడి రక్షించి నట్లుగానే కలియుగానంతరము వరకు భక్తులను బ్రోవమని కోరెను. సంతోషించిన గణేశుడు అక్కడే స్వయంభూగా అవతరించి ఆ బాలభక్తుని పేరుమీదనే శ్రీ భల్లలేశ్వరునిగా పూజలందుకుంటున్నాడు.
ఇక్కడ గణేశ జయంతి, వినాయక చవితి, సంకష్ఠ చవితి విశేషం గా జరుపు కుంటారు. వినాయక చవితినాటి రాత్రి మహానైవేద్యం స్వయంగా వినాయకుడు వచ్చి స్వీకరిస్తాడని ప్రతీతి. ఆ నాడు ప్రసాదానికై లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి బారులు తీరడం ఒక నిజం.

5) విఘ్నహర గణపతి –
విఘ్నహర గణపతి పూణే జిల్లాలో జున్నార్ తాలుకాలో వున్న ఓఝర్ గావ్ లో కుకడి నదీ తీరాన వుంది. పూణే నాశిక్ హైవే మీద పూణే కి సుమారు 80 కిమీ. . దూరంలో వుంది. ఈ కోవెల తూర్పు ముఖంగా వుంటుంది. కోవెల చుట్టూ పెద్ద రాతి ప్రహారి గోడ వుంటుంది. ముఖద్వారం పైన డుండి విన్నాయకుని విగ్రహం, ముఖ్య ద్వారాలు ఉత్తర దక్షిణా ముఖాలు గా వుంటాయి. ముఖద్వారానికి ఇరువైపులా పెద్ద పెద్ద ద్వారపాలకుల విగ్రహాలు లోపలకు వెళితే రెండు పెద్ద రాతి దీప స్తంభాలు వుంటాయి. ద్వారానికి రెండు వైపులా ప్రార్ధనా గదులు వుంటాయి. ఇరవై అడుగుల గదిలో డుండిరాజ గణపతి, పదడుగుల గదిలో పాలరాతితో చెయ్యబడ్డ పెద్ద మూషికం వుంటాయి. రాతితో నిర్మింపబడ్డ గర్భగుడి, రాతి స్తంభాల సహాయంతో గోళాకారం గా నిర్మింప బడ్డ పైకప్పు. విఘ్నహర వినాయకుని విగ్రహం యిరు ప్రక్కలా ఇత్తడి సిద్ది బుద్ది విగ్రహాలతో కొలువై ఉంటాడు. అన్ని అష్ఠ గణపతి విగ్రహాలలాగే యిది కుడా స్వయంభూగా వెలసినది. అష్ఠ గణపతులకు గల మరో పోలిక ఏమిటంటే అన్ని గణపతులు సింధూరం పూసి వుంటాయి.

విఘ్నహర గణపతికి కళ్ల స్థానంలో జాతి పచ్చలు నుదుట, నాభి కి వజ్రాలు పొదగ బడి వుంటాయి. గర్భ గుడి బయట పరమేశ్వరుడు నంది కొలువై వుంటారు. కోవెల వెనుక తెల్ల జిల్లేడు మొక్కలు మానులుగా పెరిగి వుంటాయి. గర్భ గుడి శిఖరంపైన బంగారు రేకుతో తాపడం చేసి వుంటుంది. 1833 లో పేష్వా బాజీ రావు –1 కి అన్నదమ్ముడు, సైన్యాధి పతి అయిన చీమాజీఅప్ప పొర్చుగీసు పై యుద్ధం లో ‘ వాసై’ కోటను గెల్చుకొన్న విజయానికి చిహ్నం గా గర్భ గుడి శిఖరాన్ని బంగారు తాపడం చేయించేడు.

ఇక స్థల పురాణం తెలుసుకుందాం.
ముద్గల పురాణం, స్కంద పురాణం ప్రకారం గా హేమావతి రాజ్యాన్ని పరిపాలించే అభినందనుడు భూలోక శాంతికై యాగం చేస్తూ వుంటాడు. యాగానికి ముందు అందరు దేవీ దేవతలను పూజించిన అభినందనుడు ఇంద్రుని ప్పుజించడం మరచి పోతాడు. ఈ చర్యకు ఆగ్రహించిన ఇంద్రుడు ” కాలుడు” ని యాగభంగం చేసి రమ్మని పంపుతాడు. ” కాలుడు ” అన్ని రకములైన ఆటంకములను కలుగ జేస్తూ వుంటాడు. అందుకు అతనిని విఘ్నుడు అని పిలవడం మొదలు పెడతారు. అభినందనుడు విఘ్నేశ్వరుని కై తపస్సు నాచరించి వినాయకుని ప్రసన్నుని చేసుకొని తన యాగమునకు కలుగుతున్న విఘ్నాలను గురించి చెప్పి, తన యాగం నిర్విఘ్నంగా సంపన్న మయేటట్లు చేయమని కోరుతాడు. వినాయకుడు విఘ్ను ని తో యుద్ధం చేసి అతనిని ఓడించి అభినందుని యాగము సంపన్న మయేటట్లు చేస్తాడు.
ఓటమి వొప్పుకొన్న కాలునకు వినాయకుడు తన గణాలో స్థానం కల్పిస్తాడు. కాలుడు తన పేరు చిరస్థాయిగా నిలిచిపోయేటట్లు చేయమనగా విఘ్నహర వినాయకుడిగా అదే ప్రదేశంలో స్వయంభూగా వుద్భవించేడు.
ఈ కోవెలలో వినాయక చవితి, వినాయక జయంతి, సోమావతి అమ్మావాస్య లలో విశేష పూజలు నిర్వహిస్తారు.

6) సిద్ధటేక్ సిద్ధివినాయకుడు ( సిద్దటేక్ ) –
పూణే నగరం నుంచి సుమారు 55కిమి. . షోలాపూర్ రోడ్డు మీదుగా వెళ్తే భీమా నదికి ఉత్తర తీరాన అహ్మద్ నగర్ జిల్లాలో కర్జాత్ తాలుకాలో వున్న సిద్ధటేక్ గ్రామానికి ఒక కిలొమీటరు దూరంలో వో చిన్న గుట్టపై వుంది సిద్దివినాయక మందిరం.
ఇక్కడ సిద్దివినాయకుని తొండం కుడివైపుకి తిరిగి వుంటుంది. తొండం కుడివైపుకి తిరిగి వున్న వినాయకుడు అత్యంతశక్తులను కలిగి ఉంటాడని ప్రతీతి, అటువంటి వినాయకుని ప్రసన్నం చేసుకోవడం కూడా కష్ఠం అని కూడా అంటారు. ఈవినాయకుని పూజిస్తే సకల కార్య సిద్ధి లభిస్తుందని, సకల మంత్ర, తంత్ర శక్తులు సిద్ధిస్తాయని నమ్మకం. ఈ క్షేత్రాన్ని జాగృత క్షేత్రం అనిఅంటారు. ఇక్కడ వినాయకుడు జాగ్రదావస్థ లో వుండి భక్తుల కోరికలు తీరుస్తూ వుంటాడని ప్రతీతి.
18వ శతాబ్దంలో ఇండోర్ మహారాణి అహల్యాబాయి హోల్కార్ చే మందిరం, దీప స్థంభం నిర్మింపబడ్డాయి. తరవాత కాలాలలో లోపలి మండపాలు, నగారా మండపం మొదలయినవి నిర్మించ బడ్డాయి. 15అడుగుల యెత్తు, 10 అడుగుల వెడల్పు గల ద్వారం నుండి గర్భ గుడిలొకి ప్రవేశిస్తాము. ద్వారానికి యిటు అటు ద్వారపాలకులుగా జయ విజయులు, లోపల స్వయంభూ గణపతిని, వినాయకుని కాలు దగ్గర వినాయకుని భార్యగా చెప్పే సిద్ధిని చూడొచ్చు, మాములుగా పూల అలంకరణ, సింధూరం అలంకరణలలో సిద్ది విగ్రహం కప్పబడిపోతూ వుంటుంది. పూజారిని అడిగితే చూపుతారు. వినాయకునికి ప్రక్కగా ఇత్తడి విష్ణుమూర్తి ప్రతిమ వుంటుంది. గర్భగుడిలో పంచాయతనం ( శివుడు, వినాయకుడు, విష్ణుమూర్తి, మిగతా దేవీ దేవతలు సూర్యుడు ) వుంటుంది.

ఇక్కడి స్థల పురాణం ఏమిటో తెలుసుకుందాం. ముద్గల పురాణం, స్కంద పురాణం ప్రకారం కృత యుగం లోమహావిష్ణువు యోగనిద్ర లో యుండగా మహావిష్ణువు నాభి నుంచి పద్మవాహనుడిగా ఉద్భవించిన బ్రహ్మ బ్రహ్మాండాన్ని సృష్టిస్తూ వుండగా విష్ణుమూర్తి చెవులనుండి పుట్టిన మధు, కైటభులు అనే రాక్షసులు సృష్ఠికి ఆటంకం కలుగ జేస్తూ వుంటారు. ఋషులు, మునులను అనేక రకాలైన బాధలకు గురి చేస్తూ వుంటారు. ఋషులు, మునులు దేవీ దేవతలు అందరూ విష్ణు మూర్తి వద్దకు వచ్చి పరిపరి విధాలుగా స్తుతిస్తూ యోగనిద్రా భంగం కలిగిస్తారు.
యోగనిద్ర నుండి మేల్కొన్న విష్ణు మూర్తి విషయం తెలుసుకొని మధు కైటభులతో యుద్దానికి వెళతాడు. విష్ణు మూర్తి యెంత యుద్ధం చేసినా మధు, కైటభులను వోడించ లేకపోతాడు. వారిని వోడించ లేకపోవుటకు గల కారణం తెలుసుకొనగోరి పరమ శివుని ప్రార్ధించగా, శివుడు యుద్ధానికి ముందు వినాయకుని పుజించుట విష్ణు మూర్తి మరిచెననే విషయం చెప్తాడు. అప్పుడు విష్ణుమూర్తి వినాయకుని ” ఓం శ్రీ గణేశాయనమః ” అనే మంత్ర జపం తో ప్రసన్నుని చేసుకొని వినాయకుని వద్దనుండి అనేక శక్తులు పొంది తిరిగి మధు, కైటభుల పైకి యుద్ధానికి వెళ్లి వారిని సునాయాసంగా సంహరిస్తాడు. మధు కైటభుల కోరిక మేరకు విష్ణు మూర్తి యీ ప్రదేశంలో మందిరం నిర్మించి, శక్తులను సిద్ధింప చేసే వినాయకుడు కాబట్టి సిద్దివినాయకుడు అని నామకరణం చేసేడు.
గణపత్యం మతం ప్రాచుర్యంలో వున్నప్పుడు మౌర్య గోసాయి, నారాయణ మహారాజ్ లు ఇక్కడ వినాయకుని ఆరాధించుకొని ముక్తి పొందేరని స్థానికుల కధనం.
ప్రస్తుతం యీ మందిరం ” చించవాడ్ మందిర్ ట్రస్ట్ ” వారి ఆధ్వర్యంలో భక్తులకు తాత్కాలిక వసతులకు గదులు, నిత్యాన్నదానము, ఉచిత విద్య మొదలయినవి నిర్వహింప బడుతున్నాయి.
సిద్ధి వినాయకుని కోవెల వున్న కొండకి ఏడు ప్రదక్షిణలు చేసుకుంటే సిద్ది వినాయకుడు ప్రసన్నుడై భక్తుల కోరికలు తీరుస్తాడని భక్తుల నమ్మిక. ఈ కోవెలలో గణేశ జయంతి, వినాయక చవితి, దశరానవరాత్రులు, సోమావతి అమావాస్య ( సోమవారం అమావాశ్య అయితే ) విశేషంగా జరుపుతారు.

7) మయూరేశ్వర గణపతి ( మోర్గావ్ )-
మయూరగణపతి లేక మయూరేశ్వర గణపతిగా పిలువబడే గణపతి ఆలయం మహారాష్ట్రలో పుణే జిల్లలో కర్హ నదీ తీరాన ‘ మొర్గావ్ ‘ అనే ఊరిలో వుంది. పూణే షోలాపూరు రోడ్డు మీదుగా వెళ్తే సుమారు 65కిమి. . దూరంలో వుంది.
ఇక్కడ వినాయకుని వాహనం మయురం కాబట్టి, ఈ గణపతికి మయూరగణపతి లేక మయూరేశ్వర గణపతి అనే పేరొచ్చింది, ముయూర గణపతి వెలసిన వూరు కాబట్టి యీ వూరు మొర్గావ్ అయింది అనేది కొందరి అభిప్రాయం.
ఈ కోవెల చుట్టూ రా 50 అడుగుల నల్లరాతి గోడ కట్టి వుంటుంది. నాలుగు వైపులా నాలుగు ద్వారాలు. బయటి నుంచి చూస్తే మసీదు లా కనిపిస్తుంది. బహమనీ సుల్తానుల కాలం లో యీ కోవెలను నిర్మించారట. కోవెల నిర్మాణం లో ముస్లిం శిల్పకళ కనిపిస్తుంది. పేష్వాల కాలంలో యీ కోవేలకి కానుకలు, మాన్యాలు యిచ్చి కోవేలని పునరుద్ధరించేరు.
కోవెలకి వున్న నాలుగు ద్వారాలు నాలుగు పురుషార్ధాలకు ప్రతీకలు. ముందుగా వున్న తూర్పు ద్వారం దగ్గర బాలగణపతి, ఇద్దరు సేవకులతో వున్న విగ్రహాలు, మర్యాదా పురుషొత్తముడుగా పూజలందుకున్న విష్ణుమూర్తి అవతారమైన రాముడు, సీత లను చూడొచ్చు, దీనిని ధర్మ ద్వారం అంటారు. దక్షిణాన వున్న ద్వారం దగ్గర స్థితి కారకుడైన విష్ణు మూర్తి, వినాయకుడు, శివపారతీ సమేతుడైన గణపతి లను లయకారకుడైన చింతామణి శివుని విగ్రహంచూడొచ్చు. ఈ ద్వారం అర్ధానికి ప్రతీక. ఇక పడమర నున్న ద్వారం దగ్గర చెరకు విల్లుగా, తుమ్మెదల అమ్ములు కలిగిన మన్మధుడు అతని భార్య రతీదేవి విగ్రహాలని చూడొచ్చు. ఈ ద్వారాన్ని కామ ద్వారం అని అంటారు. ఉత్తర ద్వారం దగ్గర మహా గణపతి విగ్రహం వుంటుంది. ఈ ద్వారాన్ని మోక్ష ద్వారం అని అంటారు.

మోక్ష ద్వారం పక్కనే మహీ ( భూ దేవి ) సమేతుడైన వరాహావతారం, పక్కనే రెండు దీప స్తంభాలు వుంటాయి. మయూరేశ్వరుని గర్భ గుడికి యెదురుగా ఆరు అడుగుల వినాయకుని వాహనమైన మూషికాన్ని చూడొచ్చు. నగారా ఖానా ( నాగారాలు ఉంచే ప్రదేశం ) లో రెండు నగారాలు చూడొచ్చు. సభా మండపం చాలా విశాలంగా వుంటుంది. సభామండపం యొక్క పైకప్పు ఏకశీలానిర్మితం. సభా మంటపం లో వినాయకుని 23 రూపాలను తెలియ చేసే విగ్రహాలు వున్నాయి. వీటిని గణేశ అవతారాలు అని గణపత్యం అనుసరించేవారి అభిప్రాయం. ఇక్కడ వున్న కొన్ని విగ్రహాలు యోగేంద్ర ఆశ్రమానికి సంబందించినవి. ముద్గల పురాణం లో వివరించిన విధంగా ఎనిమిది దిక్కులలోనూ వరుసగా వక్రతుండ గణపతి, మహోదర, ఏక దంత, వికట, ధూమ్రవర్ణ, విఘ్నరాజ, లంబోదర గణపతులు కొలువై వున్నారు.
గర్భ గుడికి పక్కగా నగ్న భైరవ మందిరం వుంది. గర్భ గుడికి ఎదురుగా పరమశివుని వాహన మైన పెద్ద నంది విగ్రహం వుంటుంది. వినాయకుని వాహనమైన మూషికం కాకుండా నంది వుండడం ఆశ్చర్యాన్ని కలిగించక మానదు. కుతూహలంతో యిక్కడి పుజారులని విషయం అడుగగా, మయూరేశ్వరుని మందిరం పునరుద్ధరించక ముందు పక్క గ్రామం నుంచి మరో గ్రామానికి నందిని తరలిస్తూ వుండగా యీ ప్రదేశం చేరగానే నందిని తరలిస్తున్న బండి విరిగి పోవడంతో మరో బండిలోకి మార్చే క్రమంలో నంది విగ్రహాన్ని క్రింద పెట్టేరుట, తరవాత మరి ఆ విగ్రహాన్ని కదిలించలేకపోయేరట. ఎన్నిమార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో ఆ నంది విగ్రహాన్ని అక్కడే విడిచి పెట్టేరని చెప్పేరు.
ముందుగా నగ్న భైరవుని దర్శించుకున్న తరవాత మయూర గణపతిని దర్శించుకోవాలి. మయూర గణపతి కుడా స్వయంభూగా వెలసిన విగ్రహం. గర్భగుడిలోని మయూరేశ్వరుడు తలపైన పాము పడగ, నాలుగు చేతులు మూడు కళ్ళు కలిగి సిద్ధి, బుద్ధిలను చెరోవైపు కూర్చుండ పెట్టుకొని, పై నున్న రెండు చేతులలోను పాశం, అంకుశం పట్టుకొని, క్రిందనున్న చేతిలో మోదక్, మరో చెయ్య తొడపైన పెట్టుకొని, ఎడమ వైపుకి తిరిగిన తొండంతో ఉత్తరాభి ముఖంగా వుంటాడు. గణేశునికి నాభి, కళ్ల స్థానాలలో వజ్రాలు పొదగబడి వుంటాయి. మయూరేశ్వరుని దర్శనం తరువాత సాక్షి గణపతిని దర్శించుకోవాలి.
ఇక్కడ చాలా వైభవం గా జరిగే ఉత్సవం ‘ సోమావతి అమావాస్య ‘. సోమవారం, అమావాస్య కలిసిన రోజుని ‘ సోమావతి అమావాస్య ‘ అంటారు. ఇప్పుడు భక్తుల సందర్శనార్ధం వున్న విగ్రహం వెనుక అసలు విగ్రహం వుందని అంటారు. పాండవులు ఇసుక, ఇనుము, వజ్రాలతో చేసిన అసలు విగ్రహానికి రాగిరేకుతో కప్పి యిప్పటి విగ్రహం వెనుక గోడలో దాచిపెట్టేరని అంటారు.

8)గిరిజాత్మజ గణపతి –

గిరిజాత్మజ గణపతి ని లైణ్యాద్రి గణపతి అనికూడా అంటారు. లేణి అంటే గుహ అనిఅర్ధం, అద్రి అంటే రాతి కొండ అని అర్ధం. లైణ్యాద్రి అంటే రాతి కొండ గుహ అని అర్ధం. ఈ గుహలు వున్న పర్వత శ్రేణులని హటకేశ్వర పర్వత శ్రేణులు లేక సులేమాన్ పర్వత శ్రేణులు అని అంటారు. ఈ ప్రాంతాన్ని ‘ కపిచిత్త ‘ అనికుడా అంటారు. ఇక్కడకి దగ్గరగా వుండే జనావాసం ‘ జున్నారు ‘ అనే వూరు. ఇది జిల్లా కేంద్రం కూడా.
గిరిజాత్మజ గణపతి పూణే నగరానికి దగ్గర దగ్గర వంద కిలొమీటర్ల దూరం లో వుంది. సుమారు వంద అడుగుల యెత్తున అర్ధ వృత్తాకారం లో యీ గుహలు కనిపిస్తూ వుంటాయి. సుమారు 250 మెట్లు ఎక్కవలసి వుంటుంది. ఎక్క లేనివారి కోసం డోలీలు దొరుకుతాయి.
ఈ గుహలు ఒకటవ శతాబ్దం నుంచి మూడవ శతాబ్దానికి చెందినవి. ఈ గుహలు బౌద్ధ విహారాలు. ఇక్కడ సుమారు పాతిక గుహల దాకా వున్నాయి. మొదటి ఎనిమిది గుహలు విరిగిపోయిన మెట్లతో కొంచం కష్టం గా వెళ్ల గలుగుతాము. మిగతా గుహలు ఉత్సాహవంతులైన యువత వెళ్ళగలిగి నట్లుగా వుంటాయి. విహారాలు కాబట్టి గుహలు గదులలాగా వుంటాయి. శిల్పాలు, చిత్రాలు వుండవు. కొన్ని గుహలకి వెళ్ళే మెట్లు విరిగి పోయి నడవడానికి వీలుగా వుండవు.

ఏడవ గుహలో గిరిజాత్మజ గణపతి లేక గిరిజా గణపతి కొలువై వుంటాడు.

ఇనుము జాలీ తలుపులు కలిగిన గుహ. తలుపులలోంచి లోనికి వెళితే చాలా విశాల సభా మంటపం, ఆరు స్తంభాలు, రెండు అర్ధ స్థంబాలు కలిగిన గుహలోకి అడుగు పెడతాం. ఈగుహ దక్షిణ ముఖంగా వుంటుంది. గిరిజా గణపతి తూర్పుముఖంగా ఉంటాడు, ఇతని తొండం యెడమవైపుకి తిరిగి వుంటుంది. ఇదికుడా మిగతా అష్ఠ గణపతులలాగే స్వయంభూ, కుడి వైపు చూస్తున్నట్టు గా వుంటుంది కాబట్టి ఒకే కన్ను కనిపిస్తూ వుంటుంది. వినాయకునికి ఎర్రటి సింధూరం పూసి వుంచుతారు. ఈ స్తంభాలమీద ఏనుగులు, పులులు, మొదలయిన శిల్పాలు చెక్కబడి వున్నాయి. గోడల పైన గణపతి కి సంబంధించి న వివిధ పురాణ గాధలు, సతీసహగమనం చేసిన తొమ్మండుగురు సతులను గురించిన కధలు చిత్రీకరించేరు. కాని యీ చిత్రాలు 17 లేక 18 వ శతాబ్దానికి చెందినవిగా గుర్తించేరు. ఈ గుహలు భారత ప్రభుత్వపు ఆర్కియాలొజీ వారి సంరక్షణ లో వున్నాయి.

గణపతి గుహనుంచి హటకేశ్వర్ పర్వత శ్రేణులను, కిందన ప్రవహిస్తున్న కుక్డీ నదిని, కనుచూపు మేర పచ్చని ప్రకృతి మనసులని పులకింప చేస్తుంది. జునార్ గ్రామం లోని బ్రాహ్మణులు గిరిజా గణపతికి ఇత్తడి కవచం కానుకగా సర్పించేరు.

ఇక్కడి స్థల పురాణం తెలుసుకుందాం.

గణేష పురాణం ప్రకారం త్రేతాయుగములో కుక్డీ నదీ తీరాన గల జుర్నాపురం ( కాల క్రమాన యిది జున్నార్ గా వ్యవహరించాసాగేరు ) దగ్గర ‘ సింధు ‘ రాక్షసుని సంహారణార్ధం పార్వతీ పరమేశ్వరులు విశ్వరక్షకుడైన గణేశుని కొరకై తపస్సు చేస్తారు ( గణపత్యం మతం ప్రకారం గణపతే సర్వ శక్తి సంపన్నుడు, సర్వ విశ్వ రక్షకుడు అని నమ్ముతారు ). పార్వతీ దేవి మన్నుతో బొమ్మను చేసి పన్నెండేళ్ళు ఆ బొమ్మను పూజిస్తూ వినాయకుని మూల మంత్రమైన ‘ గమ్ ‘ అనే మంత్రం జపిస్తూ ఘోర తపస్సు చేస్తారు. ఆరు చేతులు, తెల్లని రంగు, నెమలి వాహనుడు అయిన వినాయకుడు వారి తపస్సకి మెచ్చి పార్వతీ, పరమేశ్వరుల పుత్రునిగా అవతరించి ” సింధు ” ని సంహరిస్తాననే వరం ప్రసాదిస్తాడు. పార్వతీ దేవి తాను పూజించిన బొమ్మలోనే గణపతిని నివాసముండమని కోరుతుంది. భాద్రపద శుక్ల చవితి నాడు వినాయకుడు పార్వతీ దేవి కోరికను మన్నించి పార్వతీ దేవి పుత్రునిగా జన్మిస్తాడు. ఈ ప్రదేశం లో పార్వతీ దేవికి మానస పుత్రునిగా జన్మించి గిరిజాత్మజ గణపతి అయ్యేడు.
శివపార్వతులు యితనికి గుణేశుడు అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకోసాగేరు. గుణేశుడు ఆరవయేట ఘోర తపస్సు చేసి విశ్వకర్మని ప్రసన్నం చేసుకొని పాశం. అంకుశం, పరశు, పద్మం లని పొందుతాడు. గుణేశుడు ఒకనాడు తోటి పిల్లలతో ఆటలాడుతూ మామిడి చెట్టు పై నున్న అండాన్ని పగులకొడతాడు, అందులోంచి గణేశుని వాహనమైన మయూరం ప్రత్యక్ష మౌతుంది. మయురాన్ని వాహనం గా చేసుకొని గుణేశుడు మయురేశ్వరుడయేడు.
రాక్షసుడు ” సింధు “, తనను సంహరించేందుకు గణేశుడు, గుణేశుడు గా అవతరించెనని తెలుసుకొని బాలకుడైన గుణేశుని సంహరించేందుకు క్రూరుడు, బాలాసురుడు, వ్యోమాసురుడు, కుశాలుడు అనే రాక్షసులను పంపుతాడు. గణేశుడు ఆ రాక్షసులను సంహరించి అనంతరం మొర్గావ్ ప్రాంతంలో “సింధు”ని సంహరిస్తాడు.
ఇక్కడ ముఖ్యంగా వినాయక జయంతి మరియు వినాయక చవితి పండుగలు చాలా వైభవంగా జరుపుకుంటారు.

ఇవండి అష్టగణపతుల వివరాలు, వీలుచేసుకొని దర్శించుకోండి.

1 thought on “అష్ట వినాయక మందిరాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *