March 19, 2024

ఆదిశేషుడు – వాసుకి

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు

గంజాయి వనములో తులసి మొక్కలలాగా కద్రువ సంతతి నాగులలో శ్రేష్ఠులు ధర్మనిరతి గలిగి శ్రీ మహావిష్ణువు, బ్రహ్మ, పరమశివులకు ప్రీతిపాత్రులైన వారు ఆదిశేషుడు, వాసుకి. . కశ్యప ప్రజాపతికిని కద్రువకును పుట్టిన పుత్రులలో జ్యేష్ఠుఁడు అది శేషుడు. కాని తల్లి దుస్సాహసము, తమ్ముల దుష్ట స్వభావమును భరించలేక వారికి దూరముగా తపోమూర్తిగా వెలుగొందాలని తలంచి గంధమాదనము, బదరికాశ్రమము, గోకర్ణము మొదలగు దివ్యక్షేత్రములయందు మహా తపమాచరింపఁగా, శరీరము శుష్కించిపోగా అప్పుడు బ్రహ్మఅతని సత్యనిష్ఠకును, ధర్మనిరతకు మెచ్చి “నీలాంటి వాళ్ళు చేయవలసినది ఆత్మత్యాగము, ప్రాయోపవేశము కాదు సద్ధర్మ సాధనము ” అని చెప్పి భూభారమును వహించునట్టి శక్తిని ప్రసాదించి గరుడునితో సఖ్యము గలిగి ఉండుము అని చెప్పెను. అతడు ఈశ్వర ప్రసాదముచే విష్ణువునకు పాల సముద్రములో పానుపై వేయిపడగలతో భూమిని మోయుచు నాగులకు అందఱకు రాజై ఉండును. అంటే పాలసముద్రంలో శ్రీ మహావిష్ణువు శయనించే శేషతల్పమే ఆదిశేషుడు.
ఈతని అంశలోనే త్రేతాయుగములో శ్రీరాముని సోదరుడు లక్ష్మణుడిగా జన్మించాడు. ఇతనికి భృగుమహర్షి శాపము వలన ద్వాపరయుగములో కృష్ణుని సోదరుడిగా బలరామావతారము కలిగెను. పురాణాల ప్రకారం సమస్త భూమండలాలు ఆదిశేషుడు తన పడగపై మోస్తున్నాడు. వేయి పడగల నుంచీ నిత్యం విష్ణు కీర్తి వినిపిస్తూ ఉంటుంది.
ఈ సర్పానికే అనంత శేషుడనే పేరు కూడా ఉంది భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక చోట సర్పాలలో ఆదిశేషుడు ఆయన అంశే అని చెబుతాడు. . తిరువనంతపురంలోని అనంతపద్మనాభ స్వామి ఆదిశేషుని మీద శయనిస్తున్న విష్ణుమూర్తి నేత్రానందకరంగా దర్శనమిస్తారు. తిరువళ్ళూరులో శ్రీ మహావిష్ణువు శేష పానుపుపై పయనించిన వీరరాఘవస్వామిగా దర్శనమిస్తాడు. నెల్లూరులో రంగనాయకుల స్వామి కూడా ఆదిశేషుడిపై శయనించినట్లుగా ఉంటుంది. ఆ మహనీయుని దివ్య సాహస చరిత్ర విన్నవారికి చదివిన వారికిసర్ప భయము ఉండదు. వారికి సకల సంపదలు ప్రాప్తిస్తాయని పురాణాలలో చెప్పబడింది.
వాసుకి కూడా కద్రువ కుమారుడే, నాగలోకానికి రాజు. ఇతడు హిందూ, బౌద్ధ పురాణాలలో పేర్కొనబడ్డాడు. ఇతని తలపై నాగమణి మెరుస్తుంటుంది. బెంగాలీ లు పూజించే మనసాదేవి ఇతని సోదరి. అష్ట నాగల (పాములు)లో మిగిలిన పాములు అనంతుడు, తక్షకుడు, శంఖపాలుడు కుశికుడు, పద్ముడు, మహాపద్ముడు, కర్కోటకుడు. పరమశివుడి కంఠము నందు వాసుకి సర్పము అలంకృతమై ఉంటుంది
భగవద్గీతలో శ్రీకృష్ణుడు నాగులలో వాసుకి తానేనని పేర్కొన్నాడు. క్షీరసాగర మథనం కోసం మందరగిరిని త్రవ్వి తీసుకొని రాగా అది మహాభారమైనదై క్రింద పడబోతే శ్రీ మహా విష్ణువు గరుడారూఢుడై వచ్చి, మందరగిరిని క్షీర సాగరములో వదిలాడు. వాసుకిని ప్రార్థించి అమృతంలో భాగమిస్తామని చెప్పి, ఒప్పించి దానిని రజ్జు (కవ్వము)గా చేసి పాలసముద్రాన్ని చిలకడం ప్రారంభించారు. ఆలా చిలకడం ప్రారంభించేటప్పుడు దేవతలు వాసుకి పడగ వైపు నడిచారు. దానితో రాక్షసులు కోపించి తోక వైపు నిలబడి చిలికే నీచులమా అని అనగా దేవతలు తోక పట్టుకొని చిలకడానికి అంగీకరించారు. ఆ విధంగా చిలుకుతుండగా ఆ మంధరగిరి క్రింద నిలిచే ఆధారము లేక క్షీరసాగరము లోనికి జారిపోతుండగా శ్రీ మహావిష్ణువు కూర్మావతారముఎత్తి, ఆ పర్వతాన్ని తన వీపు మీద ఉంచుకొన్నాడు
ఆ విధముగా అమృతమధనానికి కవ్వపు తాడు అయి సహాయపడినందుకు, వాసుకి బాధలను గమనించిన దేవతలు నాశము లేదని ఏ విధమైన ఉపద్రవాలు ఉండవని దేవతలు వరాలు ఇచ్చారు కానీ కన్నతల్లి కద్రువ ఇచ్చిన శాపము అతనిని కలత పెట్టేది. అతని భయము అనుమానాలు ఇతర నాగకుమారులలో ఎటువంటి భయాన్ని కలిగించలేదు. జనమేజేయుని యజ్ఞము పూర్తి కావాలి కదా? అని నాగకుమారుల సందేహము. నాగకుమారులు రకరకాల ఆలోచనలు చేస్తూ అవసర అనవసర చర్చలతో కాలయాపన చేస్తున్నప్పుడు ఏలా అనే నాగకుమారుడు, దేవతలతో బ్రహ్మ చెప్పిన విషయాన్ని చెపుతాడు. అది ఏమిటి అంటే సహజముగా నాగులు క్రూరులు కనుక వారు నాశనము అయినా ఫరవాలేదు. వీళ్లలో మంచివారిని ఆస్తీకముని రక్షిస్తాడు. ఆస్తీకముని వాసుకి చెల్లెలు, జరత్కార మహామునికి జన్మించి ఆపద సమయములో నాగవంశ రక్షణకు దోహదపడతాడు. కాబట్టి నాగవంశము నాశనమవుతుంది అని భయపడనక్కరలేదు అని దేవతలు చెపుతారు. మనలోని మహాత్ములకు బ్రతుకు భయము లేదని ఏలా కుమారుడు స్పష్టపరిచాడు. ఆ క్షణము నుంచి వాసుకి తన చెల్లెలు జరత్కారి వివాహము కోసము పుట్టబోయే మేనల్లుని కోసము ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ విధముగా తల్లి శాపము నుండి నాగ జాతిని రక్షించటానికి అహర్నిశలు తాపత్రయ పడ్డవాడు వాసుకి. .
ప్రతి ఋతువులో సూర్యునికి తోడుగా అతని రథములో ఇద్దరు ఆదిత్యులు, ఇద్దరు ఋషులు, ఇద్దరు గంధర్వులు, ఇద్దరు అప్సరసలు, ఇద్దరు రాక్షసులు, ఇద్దరు నాగులు ప్రయాణం చేస్తారు. మధు మాసము(చైత్రమాసం)లో ధాతా, హేతీ, వాసుకీ, రథకృత్, పులస్త్య, కృతస్థలీ అనేవారితో పాటుగా తుంబురుడు సూర్యరథంలో తిరుగుతారు

1 thought on “ఆదిశేషుడు – వాసుకి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *