March 29, 2024

” ఇస్పేటు రాజు ❤ ఆఠీను రాణి”

రచన: గిరిజారాణి కలవల

” కంచం ముందు కూర్చుని ఏం ఆలోచిస్తున్నావురా ? నెయ్యి వేసాను, ముక్కలు కలుపు” అంటూ కొడుకుని గదిమింది సావిత్రి.
” ఏంటీ ముక్కలు వేసావా? కోసిందెవరూ? జోకరేంటీ ? ” అన్నాడు రాజు.
” ఏడిసినట్టే ఉంది నీ జోకు.. జోకరట, జోకరు, పొద్దస్తమానం ఆ పేకముక్కల్లో పడి దొర్లుతూంటే, కంచంలో వేసినవి కూరముక్కలని కూడా తెలీకుండా ఉంది నీ బుర్రకి. నా ఖర్మ కొద్దీ దొరికారు ఆ తండ్రీ, ఈ కొడుకూ. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు ‘ అన్నారు. చేయకూడని ఏ దానమో చేసుంటాను కిందటి జన్మలో. అందుకే ఎందుకూ కొరగాని కొడుకుని కన్నాను. ఆ మనిషేమో కిమ్మన్నాస్తి. ఏమీ పట్టించుకోడు ” అంది సావిత్రి చెమ్మగిల్లిన కళ్ళు తుడుచుకుంటూ.
” బాధపడకే సావిత్రీ ! ఏది మంచో, ఏది చెడో, వాడే తెలుసుకుంటాడు. దేనికైనా టైము రావాలే. నేను మాత్రం పెళ్ళి కాకముందు కాస్త అల్లరి చిల్లరగా తిరగలేదూ ! ఇదిగో నీతో ముడిపడింది. బాధ్యతలు తెలిసాయా లేదా? అలాగే వాడికీ పెళ్ళయి బాధ్యతలు నెత్తిన పడితే అదే తెలిసొస్తుంది. ” అన్నాడు భర్త, హరిశ్చంద్రరావు.
“పదిమందిలోనూ వీడి గురించి తెలిసిపోయింది. తెలిసి తెలిసి ఏ పిల్ల చేసుకుంటుంది వీడిని? రోజూ ఆ చేతులు పేకముక్కల కోసం, ఆ నాలుక తాగుడు చుక్కల కోసం వెంపర్లాడడమే. ఆ వ్యసనాల నుంచి ఎలా బయటపడతాడో ఏంటో. కూర ముక్కలు కలపరా అంటే. పేక ముక్కలా, అంటున్నాడు. ఓకో తరగతీ రెండేళ్ల చొప్పున చదువుతూ ముక్కుతూ మూలుగుతూ డిగ్రీ పూర్తి చేసాడు. ఏదైనా అంటే పునాది గట్టిగా ఉంటుందని మీరు వాడిని వెనకేసుకు రావడమే తప్ప, వాడు నాలుగు రాళ్లు వెనకేసుకున్నది లేదు. కానీ, పెళ్ళీడు మాత్రం ముందుకు తోసుకు వచ్చేసింది. వీడి గురించి తెలిస్తే ఏ పిల్లా చేసుకోదు. ఏదో మా అన్నయ్య రికమండేషన్ తో వచ్చిన ఆ మేనేజర్ ఉద్యోగం ఉండబట్టి సరిపోయింది. లేకపోతే ఇక రోజంతా ఆ తొట్టి గేంగ్ తోనే తిరిగేవాడు. ” అంది నిష్టూరంగా.
” వాడికోసం ఎక్కడో పుట్టే ఉంటుందే, బంగారు పూలతో పూజ చేసుకుంటూ ఉండే ఉంటుంది మన కోడలు పిల్ల “.
” ఆ. ఆ. బంగారం పూలో, ఇత్తడి పూలో. అదీ చూద్దాం. ఆ పెళ్ళిళ్ళ పేరయ్య కి కబురు చేయండి. అటు మా అన్నయ్య చెవిన కూడా వేసాను. ఏదైనా సంబంధం చూడరా అని. వీడి ముక్కుకి తాడు వేసే లక్కు లక్ష్మీదేవి ఎప్పుడు మన గడపలో అడుగు పెడుతుందో? ఏంటో? ” అంటూ నిట్టూర్చింది సావిత్రి.
ఇక్కడ రాజు గురించి కాస్త చెప్పాల్సిందే. మనిషి స్వతహాగా మంచివాడే. కాకపోతే ఉన్న స్నేహితులే పెడతోవ పట్టించడంతో ఆ రెండు జంట వ్యసనాలని వంట పట్టించుకుని వదలలేకపోతున్నాడు. తల్లి పాపం నెత్తీ నోరూ మొత్తుకుంటే. అప్పుడు మాత్రం ఓ రెండు రోజుల పాటు వాటి జోలికి వెళ్ళడు. కానీ కుక్క తోక వంకరే.. ఆ వంకర సరి చేయాలంటే ముక్కుకి తాడేయకతప్పదుగా!

* * *

‘ కళ్ళాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదు’ కదా! మన హీరో రాజు, మేనమామ కి తెలిసిన సంబంధం ఏదో ఉంటే. ఆయన ఆడపిల్ల వాళ్ళ కి ఏం చెప్పాడో, ఏంటో మరి జాతకాలు కుదిరేసరికి ముహూర్త ఘడియ తోసుకు వచ్చేసింది. రాజు ముక్కుకి తాడేయడానికి, రాజుతో రాణి మెడలో పసుపుతాడు వేయించుకోవడానికి పెళ్ళి పీటలు ఎక్కింది.
రాజు భాషలో చెప్పాలంటే ‘ ఆఠీను రాణి’ లా ఉంది రాణి. ఇంటిపని, వంటపనిలోనూ నిష్ణాతురాలే. చదివింది ఇంటర్ వరకే అయినా, పుస్తక పరిఙ్ఙానం, తెలివితేటలు బాగా ఉన్నాయి.
ఇలా కుడికాలు లోపల పెట్టి, పదహారు రోజుల పండగ అయిందో లేదో భర్త అలవాట్లు పసికట్టేసింది. ముందు బాధ పడింది. తర్వాత భర్తని బతిమిలాడింది మానేయమని. అలిగింది, బుజ్జగించింది. అబ్బే, ఏదీ వర్కౌట్ కాలేదు.
పేకాట, తాగుడికి అలవాటు పడిన భర్తని ఎలా లొంగదీసుకోవాలో తాను చదివిన పుస్తకాలనన్నిటినీ ఓ సారి గుర్తు చేసుకుంది.
అంతే ‘ ఆపరేషన్ అదరహో ‘ అనే ఐడియా వచ్చింది. వెంటనే అమలు పరచడానికి అత్తగారితో కలిసి, ‘పండంటి కాపురానికి పదమూడు ముక్కలు ‘లాగా. తన మంగళ సూత్రం మీద ప్రమాణం చేసి నడుం బిగించింది.
” అత్తయ్యా! ఈ రోజు ప్లాన్ నెంబర్ వన్ మొదలుపెడుతున్నా! నన్ను దీవించండి. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు మన్నించండి.” అంటూ అత్తగారి కాళ్ల కి దండం పెట్టి ఆశీస్సులు తీసుకుంది.
” అయ్యో! భలేదానివమ్మా ! నా వల్ల కానిది నువ్వు చేసి, వాడిని మారుస్తానంటే, అంతకన్నా నాకు ఆనందం ఏముంటుందమ్మా! ఇన్నాళ్లూ వాడికి చేసాను. ఇప్పుడు నీకు చేస్తాను. ప్రొసీడ్. నా ఆశీస్సులు ఎప్పుడూ నీకుంటాయి ” అంటూ సావిత్రి కోడలికి వీర తిలకం దిద్దింది.

* * *

సాయంత్రం ఇంటికి వచ్చిన రాజు ఎదురుగా కనపడిన దృశ్యం చూసి నిశ్చేష్టుడయాడు.
డైనింగ్ టేబుల్ గదిలో మధ్యకి జరపబడి ఉంది. రాణి తో పాటుగా తన స్నేహితురాళ్ళు కాబోలు, టేబుల్ చుట్టూ కుర్చీలలో కూర్చుని ఉన్నారు.
అందరూ చా.. లా. మోడరన్ వస్త్ర ధారణతో ఉన్నారు. గట్టిగా నవ్వుతూ, అరుపులూ, కేకలతో. హాలు దద్దరిల్లిపోతోంది. అందరి చేతుల్లోనూ పేకముక్కలు కనపడ్డాయి. వచ్చిన రాజుని పట్టించుకోని స్ధితిలో ఉన్నారు.
” తొందరగా వెయ్యవే సుమతీ. ! ఈసారైనా మంచి ముక్కలు పంచు. ఇందాక ఫుల్ కౌంట్ అయింది నాకు” అంది ఓ లలనామణి.
” ఆ. అంతా నా చేతుల్లో ఉంటే. ఇంకేం. నాకూ ఇందాక ఒక్క సీక్వెన్స్ కూడా లేదుగా. ట్రిప్లెట్లే అన్నీను. నాదీ ఫుల్ కౌంటేగా” అంది ముక్కలు పంచుతున్న పడుచు.
” అబ్బ. ఈసారి కూడా లైఫ్ లేదే. నేను మిడిల్ డ్రాప్” అంటూ ఓ సుందరి తన చేతిలో పేకలు టేబుల్ మీదకి విసిరిపడేసింది.
” ఆడండే గబగబా! రాణీ వాళ్ళాయన వచ్చే టైమయిందేమో. చూసాడంటే బావుండదు. ” అంది మరో మహిళ.
” మరేం ఫర్వాలేదు, వస్తే రానీండే, మా ఆయన అలా ఏమనుకునే మనిషి కాదు. వస్తే తానూ ఆడుతాడు. అంతేకాదే, అసలే మా ఆయనది రైజింగ్ హేండ్ తెలుసా? సరే కానీ.. ఈవిడేంటీ, ఇందాకనగా పకోడీలు వేసి తెస్తానంది, ఇంకా తేదు. అత్తయ్యా! పకోడీలు వేయడం ఇంకా అవలేదా?జీడిపప్పు కాస్త ఎక్కువ వేయండి. నా ఫ్రెండ్స్ జీడిపప్పు లేందే తినరు. కాఫీ డికాషన్ స్ట్రాంగ్ గా వేసుంచండి. తినడం అయాక కాఫీలు వేడిగా ఇద్దురు గాని ” అంటూ ఓరగా భర్త ని చూస్తూ వంటింట్లో ఉన్న సావిత్రి కి ఆర్డర్ వేసింది.
ఇల్లంతా జీడిపప్పు పకోడీల ఘుమఘుమలు పాకిపోతూండగా
” ఇదిగో, వచ్చే, వచ్చే ” అంటూ సావిత్రి పెద్ద ప్లేటు తెచ్చి వాళ్ళ మధ్య పెట్టింది.
అది చూసి, ఉండడానికి నాలుగు జోకర్లు ఉన్నా, ఫుల్ కౌంట్ అయినవాడి మొహంలా పెట్టాడు రాజు.
అక్కడేం కక్కలేక, తల్లి వెనకాతలే. వంటింట్లోకి వెళ్లి,
” ఏంటమ్మా! ఈ అఘాయిత్యం, రాణికి పేకాట అలవాటుందా? మనకి ముందే తెలిస్తే చేసుకోకపోదును. పైగా అత్తగారివి నీతో పని చేయిస్తుందా? ఎంత ధైర్యం?” అంటూ తను షో చెపుదామనుకునేలోగా ముందువాడు ముక్కమూస్తే ఎగిరినట్టు ఎగిరాడు.
” ఇందులో తప్పేం ఉందిరా? నువ్వు ఆడడం లేదా ఏంటి? అలాగే ఈ పిల్లా ఆడుతోంది. నీ సంగతీ తనకి ముందే తెలిస్తే తనూ నిన్ను చేసుకోకపోయేదే అట. పోనీలే, ఇన్నాళ్లూ నీకు చాకిరీ చేసాను. ఇప్పుడు ఇద్దరికీ చేస్తాను అంతేగా. బావుందిరా, మీ జంట. మేడ్ ఫర్ ఈచ్ అదర్. సరిపోయింది జోడీ ” అంది సావిత్రి ఓపెన్ జోకర్ తీసుకున్నంత తాపీగా
” అత్తయ్యా! కాఫీ కలపలేదా. ఇంకా? తొందరగా తీసుకురండి. ఆట అయిపోవస్తోంది. వీళ్లు వెడతారట ఇక ” అంటూ కోడలి గొంతు విని. ” ఆ. రెండు నిమిషాలలో తీసుకొస్తానమ్మా “, అని జవాబిచ్చి కాఫీ కలపడంలో నిమగ్నమయింది.
కాసేపయాక స్నేహితులని సాగనంపి లోపలకి వచ్చింది రాణి.
“ఎంత సేపయిందండీ వచ్చి? చూడనేలేదు నేను. నా ఫ్రెండ్స్ ఈ ఊళ్లోనే ఉంటారు. నన్ను చూద్దామని వచ్చారు. రోజుకి ఒకరింట్లో కలుసుకుందామని అనుకున్నామండీ. మా అందరికీ పేకాట అంటే ప్రాణం. డబ్బులు పెట్టి ఆడుతోంటే ఆ మజానే వేరు, అయినా మీకు తెలియనిది కాదుగా. ఇంకా నయమే వీళ్ల కంపెనీ దొరికింది, లేకపోతే మీతో పాటే మీ క్లబ్బు కి తీసుకెళ్ళమని అడుగుదామనుకున్నాను. సరే, ఫ్రెష్ అయి వస్తాను. ” అంటూ రూమ్ లోకి వెళ్ళిన భార్య వెనకాలే కోపంగా వెళ్ళాడు రాజు.
” ఏంటిది రాణీ ? నువ్వు చేసేదేమైనా బావుందా? ఈ పేకాటేమిటి? నీ ప్రవర్తన బావులేదు. ” అనేసరికి.
” ఇదేం తప్పు కాదు కదండీ, మీరు రోజూ చేసేదేగా. నేనేదో రాంగ్ షో చేసినట్టు అంటారేంటీ. నాకు మా ఇంట్లో రోజూ అలవాటే. డబ్బులు పెట్టి రమ్మీ ఆడడం. పైగా నాది లక్కీ హేండ్. మీకు నా సంపాదన వేణ్ణీళ్లకి చన్నీళ్ళలా ఉంటుంది. ఎలాగూ మీరు సంపాదించేది పెద్ద ఎక్కువేం కాదుగా” అంది అటుతిరిగి నవ్వుకుంటూ.
ఏం జవాబు చెప్పాలో తెలీక కుక్కినపేనులా ఉండిపోయాడు రాజు. ఇక ఆ రోజు పేకాట పాపారావు ఫోన్ల మీద ఫోన్లు చేసినా లిఫ్ట్ చెయ్యలేదు. బయటకి వెళ్ళకుండా ముసుగు తన్ని పడుకున్నాడు.
మర్నాడు, రాణి తయారయి బయటకి వెడుతూ, ” అత్తయ్యా! నేను లతా వాళ్ళింటికి వెడుతున్నాను. నాకు వంట చేయకండి. “అంటూ హేండ్ బేగ్ తగిలించుకుంది.
” రాణీ ! రాత్రి చెప్పడం మర్చిపోయాను ఈ రోజు నిన్ను ఎగ్జిబిషన్ కి తీసుకువెడదామని ఆఫీసుకి సెలవు పెట్టాను. ఇప్పుడు నువ్వు బయటకి వెడితే ఎలా?” అన్నాడు రాజు.
” అయ్యో! ఔనా! నిన్న చెప్పకపోయారా? ఈ రోజు లత పుట్టినరోజు కూడాను. చిన్న మందు పార్టీ ఎరేంజ్ చేసిందండీ. నేను వెళ్ళకపోతే చాలా బాధ పడుతుంది. ఈరోజుకి నన్ను వదిలేయండి. మరోరోజు వెడదాం. సరేనా. ” అంటూ మరోమాటకి ఎదురుచూడకుండా వెళ్లి పోయింది.
ఈ మాటతో కొత్త పేకసెట్టులా పెరపెరలాడేవాడు కాస్తా మెతకపడిపోయి ముందుకు జరగని పాత పేకలా కూలబడ్డాడు రాజు.
‘ రాణికి మందు అలవాటు కూడా ఉందా? దేవుడా? నా స్నేహితులలో నా పరువేం కాను? ఇక అందరూ మమ్మల్ని తాగుబోతు దంపతులు అని పేరు పెట్టేస్తారు. ‘ అనుకున్నాడు.
వంటింట్లో ఉన్న సావిత్రి ఈ మాటలు విని ‘ చచ్చింది గొర్రె’ అనుకుంది కొడుకుని తలచుకుంటూ.
సాయంత్రం బాగా పొద్దుపోయాక ఇంటికి చేరిన రాణికి, అనుమానంగా కాస్త దగ్గరగా వచ్చి, కుక్క లాగా వాసన పీల్చేసరికి ముక్కు కి లీలగా మందు వాసన తగిలింది రాజుకి.
అంతకు ముందు తను తాగిన మత్తు అంతా ఆ దెబ్బతో దిగిపోయింది.
సామ దాన భేధ దండోపాయాలు ప్రయోగిద్దామనుకున్నాడు కానీ, ధైర్యం చాల్లేదు. లాభం లేదు. రాణిని తన దారిలోకి తీసుకురావడానికి, కాళ్ళబేరం తప్ప తనకి వేరే దారి లేదనుకున్నాడు.
” రాణీ. ! నా అలవాట్లు ఎంత చెడ్డవో నాకు తెలుసు. ఇన్నాళ్లూ అమ్మ ఎంత బాధ పడుతున్నా పట్టించుకోలేదు. ఇప్పుడు ఇంటి కోడలు కూడా ఇలా ప్రవర్తిస్తోందంటే అమ్మ భరించలేదు. ప్లీజ్, ఆ చెడు అలవాట్లు మానుకోవా. ఇవి చేతులు కాదు కాళ్ళనుకో” అన్నాడు.
” శ్రీవారూ! ఇంకా మీరు గుర్రం దిగినట్టు లేదు. మీరు పట్టుకున్నవి నా చేతులు కాదు, కాళ్ళే. ఓ సారి చూడండి ” అంది రాణి కవ్వింతగా.
చూసేసరికి నిజమే, రాజు చేతులు రాణి పాదాలని పట్టుకుని ఉన్నాయి.
” కాళ్ళో, చేతులో, ఏవో ఒకటి నువ్వు ఆ అలవాట్లు మానేస్తా. అనేదాకా వదలను ” అన్నాడు మరింత గట్టిగా పట్టుకుంటూ.
” అలా అయితే, ఒక ఒప్పందానికి రండి. నేను మానేయాలంటే మీరూ మానేయాలి. అలా అయితేనే ఒప్పుకుంటాను. సరేనా?” అంటూ బ్లాక్ మెయిల్ కి దిగింది.
” ఇన్నాళ్ళ నుండీ ఉన్న అలవాట్లు ఒక్కసారిగా ఎలా మానేయమంటావు రాణీ ! నావల్ల అవుతుందా? నెమ్మదిగా తగ్గించుకుంటాను. నన్ను నమ్ము. నీ మీదొట్టు. ” అన్నాడు.
దారిలోకి వస్తున్నాడు గురుడు, ఇనుము వేడి మీదున్నపుడే సాగతీయాలి అనుకుంటూ,
” నా మీద ఒట్టంటే అది గట్టు మీద పెట్టినట్టే, నేనొప్ప, నేనొప్ప. దేవుడి మీద వేయండి. ” అంది రాణి.
” అలాగే, ఆ శ్రీరాముడి మీద ఒట్టు. ఆయనలాగా నేను ఒకటే మాట, ఒకటే భార్య. కొంచెం టైమివ్వు రాణీ, తప్పకుండా మారతాను” అన్నాడు.
” అలాగయితే ఒక కండిషన్. మీరు బయటి వెళ్లి పేకాట ఆడకూడదు. ఇంట్లో మనిద్దరం మాత్రమే ఆడాలి. అలాగే మందు కూడా నెలకొకసారే తీసుకోవడానికి పర్మిషన్ ఇస్తాను. అదీ మన మధ్య ఓ ‘బుల్లి జాకీ’ గాడు వచ్చేవరకే. ఆ తర్వాత పూర్తిగా మానేయాలి. ఈ ఒప్పందం మీద మీరు సంతకం పెడితేనే. నేనూ మీ దారికి వస్తాను. లేదంటే ‘ మీకు మీరే. మాకు మేమే. ఎందుకీ నసనస, రుసరుస’ అంటూ పాడుకుందాం. సరేనా, చెప్పండి ”
” అలాగే. ఇక ఈ రాజు ఈ రాణి మాటకి జీ హుజూర్ ” అనడమే అన్నాడు ఆనందంగా.
ఆరునెలల్లో ఆ ఇంట్లోకి ఎంటరవబోయే ‘ బుల్లి జాకీ’ తలుచుకుంటూ, దిండు కింద దాచుకున్న చింతకాయని మునిపంట కొరుక్కుంటూ,
‘ హమ్మయ్య నా లైఫ్ ఆటకి లైఫ్ కార్డు పడింది’. అనుకుంది రాణి.

సమాప్తం.

2 thoughts on “” ఇస్పేటు రాజు ❤ ఆఠీను రాణి”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *