March 19, 2024

ఊరు

రచన: సునీత పేరిచర్ల

కాలంతో పాటు సాగే పయనంలో
చాలా ముందుకు వచ్చేసాను..
ఒక్కసారి వెనక్కి వెళ్లి కొన్ని జ్ఞాపకాలని
కొందరు ఆత్మీయులని పలకరించాలని
చిన్నప్పటి ఊరు వెళ్ళాను

ఊరు మొదట్లో గుల్మొహార్ చెట్టు నన్ను చూడగానే
ఆనందంతో తల పైకెత్తి ఆహ్వానించింది
ఒకప్పుడు ఎంత అందంగా నిండుగా ఉండేదో..
అప్పటి కళ లేదు …నిర్జీవంగా ఉంది
ఏమైంది నేస్తం ఇలా అయిపోయావ్ అని అడిగాను..
మొక్కలైనా , మనుషులయినా ఆత్మీయ స్పర్శ , పిలుపు
లేకపోతే ఇలాగే అయిపోతారు అంది..

ఒకప్పుడు నువ్వు నీ స్నేహితులు నా చుట్టూ తిరుగుతూ
నా నీడలో నా మొగ్గలతో, కాయలతో ఎన్నో ఆటలు ఆడుకునేవారు..
ఇప్పుడు ఎవరున్నారు నాతో ఆడుకోవడానికి
సూర్యుడు ఇంకా సరిగా రాకముందే బడికి వెళ్లి
సూర్యుడు అస్తమించేసరికి ఇంటికి వస్తున్నారు పిల్లలు
ఉన్న కాసేపు టీవీలు , ఫోను లు.
ప్రకృతిలో ప్రకృతితో కలిసి ఆడుకోవడం నీకు తెలిసినట్టు ఇప్పటి పిల్లలకు తెలియదు..

ఊరులో అందరూ బాగున్నారా నేస్తం… ?
ఉత్సవాలు అప్పట్లాగే వైభవంగా జరుగుతున్నాయా.?

ఊరు నువ్వు వెళ్ళాక బాగా మారింది నేస్తం
ఒకప్పుడు మగ్గం పై చీరలు నేస్తుంటే
వాటి శబ్దం లయబద్దంగా వినిపించేది..
నా కొమ్మలపై వాలే పిట్టలు కూడా శృతి కలిపేవి..
జాతరలు వస్తే ఊరు వైకుంఠంలా మారేది
ఏ ఇల్లు చూసినా కోలాహలంగా ఉండేది
ఇప్పుడు అవేమి లేవు

నేత పనులు చాలా వరకు మానేశారు
చాలా మంది పట్నానికి వలస వెళ్లిపోయారు
వాళ్ళు సొంతూరు వచ్చి వెళ్లినట్టే
వచ్చిపోతున్నాయి పండగలు , జాతరలు
చడీ చప్పుడు లేకుండా..
ఇప్పుడు మోటారు వాహనాల రణగొనధ్వనులు
ఆ వాహనాలలో పెట్టే అర్థంపర్ధం లేని పాటలు ఇవే వినిపిస్తున్నాయి
ఆ కాలుష్యానికే అనుకుంటా నా కొమ్మలపై
ఇంతకుముందులా పక్షులు కూడా వాలడం లేదు…అసలు కనిపించడమే లేదు.

కాలంతో పాటు మనుషులు మారుతున్నారు
ఒకప్పుడు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండేవారు
ఇప్పుడు రాజకీయాల పేరుతో
సమూహాల్లా విడిపోయారు..
నీకు ఎన్నో విలువల్ని నేర్పిన ఈ ఊరు
ఇక్కడి మనుషులు ఇప్పుడు వాటినే కోల్పోయారు..

గుల్మొహర్ చెప్పుకుంటూ పోయింది
నా మనసంతా కకావికలం అయిపోయింది..

వెళ్లి పలకరించిరా నేస్తం
నీ పలకరింపు వల్ల అయినా వాళ్లకు గతస్మృతులు గుర్తుకొచ్చి
వాళ్లలో వచ్చిన మార్పును గుర్తిస్తారేమో అంది…

గుల్మొహర్ దగ్గర సెలవు తీసుకుని
ఊరిలోకి బయలుదేరాను..
ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి..
రెండు దశాబ్దాల క్రితం ఊరికి ఇప్పటి ఊరికి
చాలా వ్యత్యాసం ఉంది…
తియ్యటి జ్ఞాపకాలను నెమరువేద్దాం అని వచ్చిన నాకు
చేదు జ్ఞాపకాలు ఎదురయ్యేలా ఉన్నాయి..
ఆలోచిస్తూ ముందుకు కదిలాను…
కనీసం మనుషుల్లో అయినా మునుపటి ఆత్మీయత కనిపిస్తుందనే ఆశతో….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *