March 19, 2024

కంభంపాటి కథలు – వాచీ

రచన: రవీంద్ర కంభంపాటి

దాలి నాయుడికి ఐదేళ్ల వయసున్నప్పుడనుకుంటా.. వాళ్ళ నాన్న చిట్టినాయుడు చేతికున్న రోలెక్సు స్మగుల్డు వాచీ చూసేడు. తళతళ మెరిసిపోతున్న ఆ వాచీని మెల్లగా వాళ్ళ నాన్న చేతినుంచి లాగడానికి చూసేడు గానీ చిట్టినాయుడు ఓ మొట్టికాయ మొట్టడంతో ఆగిపోయేడు.
అప్పటికైతే ఆగేడు గానీ.. ఆ దాలినాయుడి బుర్రలో ఆ వాచీ అలా ప్రింటైపోయింది. ఆ పై ఏడు, కాకినాడెళ్ళినప్పుడు చిట్టినాయుడు ఓ డూప్లికేటు కాసియో వాచీ కొనిచ్చినా పెట్టుకుంటే నీకున్నలాంటి వాచీ పెట్టుకుంటా తప్ప వేరే వాచీ పెట్టుకోనని తెగేసి చెప్పేసరికి, ఆరేళ్ళకే ఈడికి ఇంత పట్టుదలేంట్రా బాబూ అని ఆశ్చర్యపోయాడా చిట్టినాయుడు !
రోజులు గడుస్తున్నాయి.. దాలినాయుడు పిఠాపురం మహారాజా కాలేజీలో బీఎస్సీ చదూతున్నాడు. కుర్రాడు సరైన దార్లోనే ఉన్నాడు.. ఎదవలవాట్లు కూడా ఏం లేవు అనుకుని,’ఒరే బాబూ.. ఇది రోలెక్సు వాచీ.. చాలా ఖరీదైనన్ది.. ఇంత కాలం ఇలాంటి వాచీ తప్ప వేరేదీ పెట్టుకోనని మొండిగా ఉన్నావు.. ఇప్పటినుండీ ఈ వాచీ నీదే.. జాగ్రత్తగా అట్టేపెట్టుకో మరి ‘ అని చిట్టినాయుడు చెప్పగానే, వాళ్ళ నాన్న కాళ్ళమీదడిపోయి.. ‘నాన్నగారండీ.. ఇంక ఈ వాచీ పూచీ నాది..దీని గురించి మీకే బెంగా అక్కర్లేదు ‘ అనేసి దాలినాయుడు ఆ వాచీ తీసుకునెళ్లిపోయేడు.
ఆ దాలినాయుడు అన్నట్టే మాట నిలబెట్టుకున్నాడు. ఎవరినీ ఆ వాచీ మీద చెయ్యి వేయనిచ్చేవాడు కాదు. దానిమీద దుమ్ముదుతుందేమోనని బయటికివెళ్ళినప్పుడల్లా తప్పనిసరిగా పొడుగు చేతుల చొక్కా వేసుకునేవోడు .. ఓ వడ్రంగిని పిలిపించి ఆ వాచీ దాచడం కోసం ఓ బుల్లి చెక్కపెట్టి, దానికో తాళం చెవి చేయించేడు. ఆ పెట్టిలో వాచీ భద్రపరచడానికి ఓ చిన్న నీలంరంగు మఖమల్ గుడ్డ కూడా తెప్పించేడు.
కాకినాడలోనే గవర్నమెంటు ఉద్యోగం కూడా రావడంతో దాలినాయుడికి పెళ్ళిసంబంధాలు రావడం మొదలెట్టేయి. అడగర్ల బుల్లెబ్బాయి గారమ్మాయి మీనాకుమారితో పెళ్లి కుదిరింది. ఎలాగూ పెళ్లి కుదిరింది కదా అని ఇద్దరూ ఓ బైకు మీద ఉప్పాడ బీచి వేపు షికారెళ్ళేరు. అక్కడ ఒకళ్ళ చెయ్యొకళ్ళు పట్టుకుని నడుస్తూంటే ఆ మీనాకుమారి దాలినాయుడు చెయ్యి కేసి చూస్తా ‘ఈ మధ్యన వాచీల్లో కొత్త కొత్త మోడళ్ళు ఒచ్చేయి కదా.. ఇంకా ఈ పాత డొక్కు మోడలేంటండీ ?’ అని నవ్వుతూ అనేసరికి, అంత సేపూ కులాసాగా నడుస్తున్న దాలినాయుడు ఒక్కసారి ఆ పిల్ల చెయ్యి ఒదిలించేసుకుని మారుమాటాడకుండా తన బైకేసుకుని వెళ్ళిపోయేడు !
ఆ తర్వాత ‘మా పిల్లనలా ఊరుగానిఊళ్ళో వదిలేసొస్తాడా ‘ అని వాళ్ళూ, ‘ఆం.. ఎంతో అపురూపమైన నా వాచీని అంత మాటంటుందా ‘ అనీ దాలినాయుడు చాలా గొడవపడ్డారనుకోండి, కానీ చెప్పొచ్చే మాటేంటంటే.. ఆ పెళ్లి మటుకు క్యాన్సిలయ్యింది !
ఏదో కొంత వాచీ పిచ్చి ఉంది గానీ.. పిల్లాడు కుదురైనోడే కదా అని మెయిన్ రోడ్డులో షాపింగ్ కాంప్లెక్సులున్న బడేటి సూర్నారాయన గారి కూతురు కుసుమ లతతో సంబంధం కుదిరింది. దాలినాయుడి సంగతి ముందే చెప్పుంచడంతో ఆ కుసుమలత వాచీ గురించి ఎప్పుడూ కిక్కురుమనలేదు. దాంతో వాళ్ళ పెళ్లి ఏ గొడవా లేకుండా జరిగిపోయింది.
ఇద్దరి కాపురం బాగానే సాగుతూంది, ఓ కొడుకూ, కూతురూ పుట్టేరు. కొడుక్కి సంతోషని, కూతురికి సత్యశ్రీ అని పేరెట్టుకున్నారు.
రోజులు గడుస్తున్నాయి.. పదేళ్లకోసారి వాచీ సర్వీసింగ్ చేయించాలని ఎవరో చెబితే మధ్యలో ఓ రెండుసార్లు బొంబాయి వెళ్ళొచ్చేడు.. అక్కడ రోలెక్సు వారి సర్వీసింగ్ సెంటర్ ఉందట.
పిల్లలు పెద్దవాళ్లయ్యేరు.. తండ్రి దగ్గిర చనువు తీసుకుని ఇంకా ఈ వాచీ ఏంటి నాన్నా అని జోకులేస్తూ వెటకారం చేస్తున్నా దాలినాయుడు ఓసారి కోపంగా చూసూరుకుంటున్నాడే తప్ప ఏమీ అనడం లేదు.
ఆ రోజు ఆఫీసు నుంచి ఇంటికి బైకు మీద వస్తున్న దాలినాయుడు ఎందుకో నీరసంగా అనిపించడంతో రోడ్డు పక్కన బైకాపి ఓ కూల్ డ్రింకు తాగుదామని వెళ్తూ అలాగే పడిపోయేడు. ఎవరో తెలిసినవాళ్ళు కబురుచేస్తే కుసుమలత ఏడ్చుకుంటూ తీసికెళ్ళి కాకినాడ అపోలో ఆసుపత్రిలో జాయిన్ చేసింది.
పది రోజుల తరువాత కళ్ళు తెరిచిన దాలినాయుడు ఒక్కసారి తన చెయ్యి చూసుకుంటే వాచీ కనిపించలేదు. పక్కనే ఉన్న కుసుమ,’ మీ వాచీ జాగ్రత్తగా భద్రపరిచేనండి ‘ అంటూ ఆ చెక్క పెట్టి లోని వాచీ చూపిస్తే, చేతికి పెట్టమంటూ చెయ్యి చాచేడు.
ఓ వారం తర్వాత మెల్లగా కోలుకున్న దాలినాయుడు కొంచెం లేచి అటూ ఇటూ తిరగడం చూసిన డాక్టర్ రెడ్డి బాబు గారు ‘ఈయన్ని మీరు రేపు ఇంటికి తీసికెళ్ళిపోవచ్చండి.. నేను రాసిన మందులు మటుకు క్రమం తప్పకుండా వాడండి ‘ అంటూ చెప్పేరు
ఆ రోజు సాయంత్రం బట్టలు సర్దుతూ, ఓసారి బాత్రూంలోకెళ్ళొచ్చిన కుసుమకి దాలినాయుడు కనిపించలేదు. ఆదరాబాదరాగా ఆసుపత్రంతా వెతికింది గానీ ఎక్కడా కనిపించలేదు.. కంగారుపడి కూతురికి, కొడుక్కి ఫోన్ చేస్తే వాళ్ళు కూడా ఇంటికి రాలేదని చెప్పేరు.
ఓ రెండు గంటల తరువాత నింపాదిగా, ఎవరో ఆటో డ్రైవర్ సాయంతో ఆసుపత్రికి వచ్చిన దాలినాయుడిని డాక్టర్ గారు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడితే, అతను ఏమీ మాట్లాడకుండా తలవంచుకుని కూచున్నాడు.
మర్నాడు ఉదయం నిద్రలేచి, కాఫీ తాగి, పడక్కుర్చీలో కూచున్న దాలినాయుడు ఎంతకీ కదలకపోవడంతో కుసుమ వచ్చి చూసేసరికి,అప్పటికే ఓ పక్కకి వాలిపోయున్నాడతను. పిల్లల సాయంతో లేపి పడుకోబెట్టి,డాక్టర్ ని పిలిచేసరికి చెప్పాడాయన, అతనికి గుండె పోటు వచ్చిందనీ.. అప్పటికే పోయి అరగంట పైగా అయిందనీ !
ఏడుస్తూ అతని చేతికున్న వాచీ తీసి భద్రంగా దాయాలని, అతని చేతికున్న వాచీ తీస్తూంటే కనిపించింది.. అచ్చం అలాంటి వాచీ డిజైనుతో వేయించుకున్న పచ్చబొట్టు !

2 thoughts on “కంభంపాటి కథలు – వాచీ

  1. బాల్యంలో మొదలయిన అనుబంధాలు కొన్ని పుడకల వరకూ కొనసాగుతాయేమో! రోలెక్య్ చాలా ఖరీదు. కొన్ని పార్టులు బంగారంతో చేస్తారట! చాలా బావుంది రవీ !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *