March 19, 2024

కాసుకో నా రాజా – గుణపాఠము ఏకపాత్రాభినయం

రచన: కన్య

స్థలము: ఫేసుబుక్కు గోడ

వాచకుడు: సెల్ఫీ సార్వభౌముడు

(సెల్ఫీసార్వభౌముడు ఫేసుబుక్కులోని న్యూసుఫీడు వద్దకు యొచ్చి, కలయగ జూచి – ఆశ్చర్యానందముతో)

ఔరా! ఈ రోజటి న్యూసుఫీడు చమత్కృతి ఏమియో గాని, ఏ దినము ఏ మిత్రుడు ఏ పోష్టు వేయుదురోనన్న శంక లేకుండగ న్యూసుఫీడు నెల్ల యౌపోసన పట్టిన నా మానసమును సైత మాకర్షించుచున్నదే!

(పోష్టుల గెల పక్కకు జూచి)

ఈ పోష్టరులు, వాలు మిత్రులు నా మతిని, అందుండు శాంతిని తస్కరించరు గదా! ఆహ్! ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు? ఈరోజటి నా తలరాతయందు దరిద్రము చదవలెనని రాసియున్నయెడల దరిద్రము చదివెదను. అటుల మనసును కుదుటపరచకపోయిన యెడల ఆ మర్కటము జటాజూటాలతో అలరారుచున్న నా బోడిగుండి మీదటి నాలుగు వెంట్రుకలు కూడా పెరుకుకొని పోవును.

(అసూయతో, కోపముతో)

అయినను వారెవరో నాకు క్షోభ కలిగించుటేమి. వారికే నా ప్రతాపము చూపించెద. హహ, ఈయూహ వచ్చుట ఆలస్యము నా మానస మర్కటము గెంతులు వేయుచున్నది. అప్పనియందు దిగవలె ఈ క్షణముననే
(ఆనందముతో)

ఈ న్యూసుఫీడునందున్న ఇవియన్నియు చదవకమునుపు సెల్ఫీ స్టిక్కు తీసి ఎత్తిపట్టి స్క్రీను మధ్యలో కమలము వికసించినయటుల నేను నిలబడుకొని, అరువది నాలుగు దంతములూ కనపడునటుల ఇకిలించుచు సెల్ఫీ తీసుకొని ఫేసుబుక్కుయందలి నా గోడ మీద వేసెద. తరువాతి సంగతి తరువాత జూచుకొనెదము. లైకులు రానియెడల దుమ్మెత్తి పోసెద, లైకులు వచ్చిన యెడల ముఱిసి ముఱిగెదను. పోలిక దెచ్చిన కమలమూ బుఱదయందే వికసించును గదా! హ! హా హా! నాలో హాస్యతుణిక పొంగిపొఱలాడుచున్నది యీవేళ.

క్లిక్! క్లిక్! క్లిక్!

(ఉద్రేకముతో)

ఈ సెల్ఫీ నా వాలుయందు వేసి ఒక సెకను పైననే అయినది. యింతవరకూ ఒక్క లైకునూ రాలేదేమి ? యెక్కడ చచ్చినారో ఈ వాలు స్నేహితులంతా! దరిద్రులు. ఎవని గోడయందు కుప్పిగంతులు వేయుచున్నారో! మర్కటవారసులు! అయిననూ ఇలాగున వాలుయందు నేను పోష్టు వేసీ వెయ్యగనే, అలాగున వెయ్యి లైకులు వచ్చు సదుపాయము ఉన్నచో యెంత బాగుండును. ఛస్! ఈ ఫేసుబుక్కు అక్కవుంటు తీసిపాఱెయ్యవలె.

(నిరాశతో)

ఒరే ఎక్కడ చచ్చినారురా! లైకు కొట్టండిరా! సరే, ఇంత దైవప్రార్థన చేయుచున్ననూ లైకు కొట్టరా! ఈ నా కోపాగ్నికి అందరినీ బలి చేసెద! ఇక వారు లేదు, వీరు లేదు, పోష్టులు లేవు, పిండములు లేవు, మిత్రులు లేరు, మట్టిబెడ్డలు లేరు, చచ్చితిరే నా చేతియందీవేళ. వచ్చుచుంటిని కాచుకొనుము..

(ఆశ్చర్యముతో)

ఏమి, ఏమేమి? అదిగగిదో ఒక లైకు వచ్చినటుల యున్నది! అరెరె..ఒక కామెంటు కూడా వచ్చినటుల యున్నది! ఆ చివరన నోటిఫికేషనులో ఎర్రగా రెండు యను నంబరు ధగధగలాడుచున్నది. ఈ నా కోతి ముఖ సెల్ఫీ చిత్రమునకు లైకు కొట్టి కామెంటు పెట్టు మతిలేనివారు ఎవరై యుండును?

(నోటిఫికేషనును సమీపించి మెల్లగా క్లిక్కును)
ఏమీ ? ఎవరు వీరు? వీరి పేరు ఎన్నడు వినలేదే! కాసుకోనారాజా అను పేరు పెట్టుకొనినదే కాక ఆడువారి బొమ్మ, అదియును ఈనాటి మేటి ఐటముపాటల తారయగు ఆమె చిత్రము ప్రొఫైలునందు మెరయుచున్నదేమి ? ఇది ఏమి చిత్రము?

(కొలదిసేపు ఊరకుండి)

ఏమిది? ఈ ప్రొఫైలు మీద నొక్కవలెనా, వలదా ? నొక్కిన ఏమి ప్రమాదము వచ్చునో ? ఆహ్! ప్రమాదము వచ్చిన వచ్చినది పో, ఈ ఐటము సాంగు సుందరి సంగతి తేల్చెద. హహహ, జగమెరిగిన నాతోనా ఆటలు?

(క్లిక్కి ప్రొఫైలు బాగుగ పరీక్షించి)

నేనెంత భ్రమపడితిని? నిమేషత్వమే లేదు. ఈ ప్రొఫైలు చిత్తడి నేల. వీని మీద క్లిక్కులు ఖర్చుపెట్టిన చాలు, మతిభ్రమణము మనసునంత తడిపివేయును. ఒక్క పోష్టుయును లేదే. ప్రొఫైలు చిత్రము ఒకటేయున్నది ఇచట. మిత్రవిన్నపము పంపించి చూచెద. అప్పుడు పబ్లిక్ కాని ప్రైవేటు మిత్ర పోష్టులు కనపడునేమో. అరెరె, అరెరె! విన్నపము పంపిన వ్యవధి లేకుండగ నన్ను మిత్రునిగ అంగీకరించినదె?

(ఆశ్చర్యముతో)

ఏమి యీ విచిత్ర కల్పన! ఏమి ఈ పోష్టులు? ప్రతి పోష్టుయందు వంకాయ బొమ్మలున్నవేమి ? వంకాయనిన ఈమెకు అంత ఇష్టమా? క్రొత్త విషయము తెలసినది ఈరోజు.

(ఉద్రేకముతో)

ఐటము సుందరికి వంకాయ అనిన ఇష్టమని తెలసినది. రేపటి నుండి వంకాయ మీద వంకాయ పోష్టులె వేసెదను. అది ఆమె చూచి బిత్తరపోవలె. వంకాయ అనగా నాకన్నా ఇష్టమున్న వాడు ఈ ప్రపంచమున లేనటుల ప్రవర్తించెదను. ఆమె పడిపోవును. ఆ పైనుంచి శాపం పెట్టిన దేవకన్యవలె పడిపోవును. ఆమె యెడద నిండుగా వంకాయను మించి, నేను నిండిపోవలె. అహా! అది కదా అదృష్టమనిన. అయ్యది కదా కర్మపుణ్యమనిన. ఈ నటకులందరు నివసించు బొంబాయో, మదరాసో వెళ్ళినపుడు నేను వచ్చినానని వంకాయ కూర తెచ్చినానని మెసెంజరు ద్వారా మెసేజి పంపెద, అప్పుడు చచ్చినట్టు ఆమె నన్ను కలియును. అప్పుడు ఫుటోలు ఎడపెడగా దిగి నా గోడయంతా హల్ చల్ చేసెద. హహహ….హహహా….హహహహ….
( దీర్ఘముగ ఆలోచించుచు)

అంతర్జాలమునకెక్కి వంకాయ వండుట యెట్లానని వెతకెద. ముందు ఒక చక్కని వంకాయ చిత్రము పట్టవలె. ప్రొఫైలు చిత్రముగ పెట్టవలె. అరెరె, ఈ గూగులమ్మకూ యేమి రోగము వచ్చి చచ్చినది ? అతి పెద్ద వంకాయ బొమ్మ చూపించుమనిన 600 * 800 సైజు కల వంకాయ బొమ్మలే చూపించుచున్నది ? ఇంతకన్నా పెద్దది దొరకిన నా భాగ్యరేఖ బాగుండును. ఆ బొమ్మ నా ప్రొఫైలు చిత్రముగా పెట్టుకొని ఆమె మనసు కొల్లగొట్టవలెననన్న ఆశ ఈ గూగులమ్మ తెగటార్చినది. ఈ గూగులమ్మను నాశనమొనర్చవలె. ఛీ. ఏ 2400 * 3600 సైజు చూపించిన దీని సొమ్ము దొంగల పాలగునా యేమి ? దీని తద్దినము తగలెయ్యుట మంచిది. ఈరోజటికి 600 * 800 సైజు వంకాయ చిత్రమే దొరకినది. అదియే పెట్టుకొనెద.

(నిట్టూర్పు విడచి)

వంకాయ తొడిమె తీయుట యెట్లా నుండి మధ్యకు కోయుట యెలా వరకు అనిన సంగతుల మీద ఆయనెవరో విజయవాడ డాక్టరు ఇంతబారున పుస్తకగ్రంధరాజమే రాసినాడు కద. దానిలో కొన్ని తస్కరించి నా మాటలు కలపి పోష్టెద. అహ్హహహా. రాచిప్పలో రాచినట్టు రాచిపారవైచినాను. చదివిన కొలదీ చమత్కారము ఇబ్బడి ముబ్బడిగా పెరిగినట్లు తోచుచున్నది. ఇది పోష్టిన పిదప ఆమె చదివిన పిదప, పిట్ట ఆ గోడ నుండి ఈ గోడ మీదకు వాలిపోయి నా గోడను వదలక ఇచటనే తచ్చాడును.

(ఆనందముతో)

ఆహా పోష్టిన మరు నిమిషము ఆమె నుండి లైకు వచ్చినది. చాలా బాగున్నది అని కామెంటూ వచ్చినది. మన రొట్టె విరిగి నేతిన పడెరా సుబ్బరాయా! నేను ప్లాను గీచుట అది గతి తప్పుట జరిగితే ఉత్తరదక్షిణ ధృవములు ఒకటికాక మానవు. హ! ఏమనుకొంటివి ? శబ్బాసో! ఈవేళ కూరల సంతకూడా యున్నది. ఆ పక్కకు పోయి ఒక పెద్ద పచ్చడి వంకాయ కొని దానితో సెల్ఫీ దిగి పోష్టెద.. అహహహహ

(కెవ్వున అరచుచు)

ఆహా పడిపోయినది. పచ్చడి వంకాయ సెల్ఫీ పోష్టిన పిదప దెబ్బకు పడిపోయినది. లైకుతో మూడు కామెంట్లు వేసినది. అయినను నేను గంభీరముగ ఆమెను ఆమె లైకును కామెంటును పట్టించుకొనునట్లు ఉండవలె. అపుడు ఆమెకు ఉత్సుకత పెరగును. మరిన్ని లైకులు కామెంటులు ఎడపెడగా వేయును. అంతియే. సరియె కానీ, ఈమె ప్రొఫైలునందు ఇంకేమి చిత్రములు ఉన్నవో చూచెద
(ఆశ్చర్యముతో)

ఇది యేమి ? మా బావమరదిలా అగుపడుచున్నాడు. వాడేనా…ఆ సందేహము లేదు. వాడే! వీని ఫొటో ఇక్కడికి ఎటుల వచ్చినది ? వానికి, ఆ అప్రాచ్యునికి సినిమా పిచ్చయున్నదను సంగతి తెలయును కాని, ఈమెతో స్నేహమున్నదని వాడు ఎన్నడు చెప్పలేదె. ఈసారి పండుగకు మావ ఇంటికి పోయినపుడు అడగవలె వానిని. ఆహ్! ఆఫీసు కట్టివేయు సమయమాయెను. ఫేసుబుకు మూసి ఇంటికి పోవలెను. హతవిధీ! చస్! ఈరోజు ఆలస్యముగ భోజనమునకు వచ్చెదనని ఇంటిలో చెప్పెద. ఒక ఇరవది వంకాయ టెంకాయ పోష్టులు వేసెద. చిన్ననాటి వంకాయ సంగతులు చెప్పెద. యవ్వనపు వంకాయ వ్యధలు చెప్పెద. కల్పించి లేని పోని వన్ని రాసెద. ఈరోజుతోనే, ఈ ఆవకాయ రోజే అన్నప్రాసన చేసిపారెయ్యవలె. ఊం! అన్నప్రాసన రోజు ఆవకాయ పెట్టవలెనా? ఆవకాయ రోజున అన్నప్రాసన చేయవలెనా? ఏమో! ఏదైతే నాకేమి . పోష్టు పడవలె. అంతియే. ఇదిగో..

(పోష్టులు వేసి వేసి అలసి పోయి అర్థరాత్రికి సమీపమున ఇంటికి పోయిన పిదప)

ఇది యేమి, ఇంటిలో అన్ని దీపములు వెలుగుచున్నవి. గుమ్మము ముందు ఇన్ని చెప్పులున్నవేమి ? వింతగ యున్నదే. సంతజాతర జరిగినపుడు, మా ఇంట పెండ్లి పేరంటాలు జరిగినపుడు కూడ ఇన్ని చెప్పులు చూడలేదే మా గుమ్మము ముందు. ఏమిది ? ముందు జాగ్రతగా కిటికీ చువ్వలు పట్టుకు చూచెద.

(అనుమానముతో)

ఆశ్చర్యము. ఆశ్చర్యము. వీరిలో ఎవరు కూడ నాకు తెలియదె. వీరంతా ఎవరు? మా ఇంటికెందుకు వచ్చినారో! సరే చెవులు రిక్కించి మాటలు వినెదము

(నిర్ఘాంతపోయి…)

ఆ..ఆ..ఆ… నా వంకాయ పోష్టుల గురించి మాటలాడుకొనుచున్నారేమి ? వీరలకు ఎటుల తెలసినది ? మరల చువ్వలు పట్టుకు చూచెద. ఆ…ఆ..ఆ..ఆ ఆపిల్ మాకు బుక్కులో నా ఫేసుబుక్కు పేజి ప్రతిఫలిస్తున్నది యేమి ? ష్హ్..ష్హ్..నిశ్శబ్దముగానుండవలె…ఇంకేమి మాటాడుచున్నారో వినపడి చచ్చుటలేదు…ఆ..ఆ..ఆ..అంత పంచాయితి పెట్టి కళ్ళు పెద్దవి చేయుచు ఆడవారు అందరు నిర్ఘాంతపోవుచున్నారే?

(అనుమానముతో)
అవునూ మా యావిడకు కూడా వంకాయనిన ప్రాణము. హతవిధీ! కొంపదీసి ఇది అది కాదు కదా. నా గుట్టు పట్టుటకు ఐటము ఎర వేసినది. మా బావమరది కనపడినపుడె తెలిసియుండవలసినది నాకు. శంక లేదు. సందేహము లేదు. ఇది అదియే. ఐటము సుందరి ముఖచిత్రము చూచి కొత్తపిట్టయన్న యావతో మిత్రవిన్నపము పంపి మిత్రులమైపోతిమి. దేవుడా, మింగలేక కక్కలేకయన్నట్టు తయారు చేస్తివి ఈ దినము. ఇదిగో ఈరోజే నా దౌర్బల్యము వదలుకొని ఈ అకవుంటు డిలీటు చేసెద. నా గుణపాఠము నాకు ప్రసాదించితివి. నా కన్నులు విచ్చుకొన్నవి. ఇంతటి అపరాధము ఇక యెన్నడు చేయనని పోయి మా యావిడ కాళ్ళు పట్టుకొనెద. శాంతింపచేసెద.

(ఇంటిలోపలికి అడుగు పెట్టినాడు )

***

ఆ తరువాయి ఏమయినదీ అన్నది ఎవరికి ఎరుక?

1 thought on “కాసుకో నా రాజా – గుణపాఠము ఏకపాత్రాభినయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *