March 29, 2024

గిరిజా సదన్

రచన: ప్రభావతి పూసపాటి

“కాత్యాయిని” ప్రశాంతం గా వున్న “గిరిజాసదన్” లో ఒక్కసారి మారుమోగినట్టు వినిపించింది ఆ పేరు.
గిరిజాసదన్ స్థాపించింది నేనే అయినా అంతా తానే అయి చూసుకొంటున్నారు రామనాథంగారు. గిరిజాసదన్ కేవలం ఎవరి పిల్లలు ఉద్యోగరీత్యా విదేశాల్లో స్థిరపడిపోయారో అక్కడ జీవన విధానంలో ఇమడలేని వారి తల్లితండ్రులకి మాత్రమే ఆశ్రయం కల్పిస్తుంది. అందుకు ఇక్కడికి చేర వచ్చేవారి వివరాలు పూర్తిగా తెలుసుకొంటే కానీ వసతి కల్పించరు రామనాధంగారు. ఆ వివరాలు సేకరిస్తున్నారు.
“కాత్యాయిని” ఈ పేరు ఎందుకో మనసులో బాగా గుర్తుండిపోయింది. ఏవో పేపర్లు చూసుకుంటున్న నేను కుతూహలం కొద్దీ తల యెత్తి పక్కకి చూసాను. అవును ఆ కాత్యాయినియే. దాదాపు పాతికేళ్ల క్రితం విజయవాడ లో మా అత్తగారింట్లో అద్దెకి ఉండేవారు. అదే రూపం. అదే వాలకం కొంచెం వార్ధక్యం ఛాయలు కనిపిస్తున్నాయి. పక్కన అన్నగారు కాబోలు వివరాలు తెలుపుతున్నారు .
” ఇక్కడ చేరడానికి కారణం” అడుగుతున్నారు రామనాథం గారు.
“తమ తల్లిని తమతో వుంచుకోవడానికి కుదరదని ఎంత డబ్బైనా పరవాలేదు ఏదయినా ఆశ్రమంలో చేర్పించమని ఈమె పిల్లలు అంటే ఇక్కడ చేర్పించడానికి తీసుకు వచ్చాను” రామనాధం గారిని కన్వెన్స్ చేసే విధంగా మాట్లాడుతున్నారు కాత్యాయనిని తీసుకొచ్చిన వాళ్ళు.
నేను చూసిన కాత్యాయిని ఐతె మాత్రం పిల్లలు అన్నది సబబనేమో మనసు గతం లోకి పరుగులు తీసింది
* * * *
“కాత్యాయిని! కాత్యాయిని!” అని పెద్దగా ఎవరో పిలుస్తున్నారు పక్కవాటాలో ఎవరైనా కొత్తగా అద్దెకి వచ్చారా అత్తయ్య అడిగాను నేను వంటింట్లోకి అడుగుపెడుతూ .
“నెల్లాళ్ళైంది వచ్చి. తల్లి కొడుకు కోడలు ఇద్దరు పిల్లలు . కోడలిని పిలుస్తున్నట్లు వున్నారు సుభద్రమ్మగారు. . ఏమిటో పాపం ఈ వయసులో ఆవిడకి ఈ కష్టాలు . . . కట్నం ఎక్కువ వస్తోందని పిల్ల గురించి విచారించకుండా చేసుకొన్నారుట పిల్ల చూడటానికి బానే వుంది కానీ తన పని తప్పించి ఇంక ఏయే పని సొంతంగ చేయలేదుట . పిల్లలు కూడా యాంత్రికంగా జరిగిన పని ఫలితమేనట. తనవరకు చూసుకొని కూర్చుంటుంది. ప్రతిపనీ చెప్పి చేయించుకోవాలిట. భర్త పట్ల గాని పిల్లల పట్ల గాని సంసారం పట్లగాని ఎటువంటి భాద్యత లేదుట తాను వున్నంతవరకు పరవాలేదు తర్వాత పరిస్థితి ఏమిటో అని సుభద్రమ్మగారు వాపోతుంటారు” చెప్పుకుపోతున్నారు అత్తయ్యగారు. నాకు చూడాలనిపించి పక్కవాటాలోకి వెళ్ళాను. కుర్చీలో కూర్చొని తదేకంగా శున్యం లో కి చూస్తోంది పిల్లకి స్కూల్ టైం అవుతోంది జడలు వేయమని సుభద్రమ్మగారు పిలుస్తోంది.
అక్కడ వున్న వారం రోజుల్లో చాలాసార్లు మాట్లాడదామని ప్రయతించినా కాత్యాయనీ వైఖరి వల్ల అది సాధ్యపడలేదు. తాను ప్రవర్తించే తీరు ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది. తర్వాత ఉద్యోగరీత్యా మేము విదేశాలకి వెళ్ళిపోయాము ఒకటి రెండుసార్లు ఉత్తరాలలో కాత్యాయిని వాళ్ల కబుర్లు తెలిసాయి. పిల్లలు కాలేజీలకు వచ్చారని సుభద్రమ్మగారు కాలం చేసారని వాళ్ళు ఊరు వదిలి వెళ్లిపోయారని. మళ్ళీ ఇన్నాళ్లకు ఇక్కడ ఈ విధంగా. . .
తోట లో మట్టి అంతా సవరించేసారు పనివాళ్ళు వెళ్లిపోయారు అంటూ చేతులు తుడుచుకొంటూ వచ్చింది పార్వతి మా గదిలోకి. పార్వతి రాకతో నా ఆలోచన స్రవంతి కి అంతరాయం కలిగింది
“మీరు చెప్పిన కారణాలు మా నిబంధనలకు సరిపోవు వసతి కల్పించే విషయములో అమ్మగారితో మాట్లాడాలి. మీరు బయట కూర్చోండి. వారితో మాట్లాడి మీకు ఏ సంగతీ చెప్తాను” సవినయంగా వివరించి వాళ్ళను బయటకు పంపి నా టేబుల్ దగ్గరికి వచ్చారు రామనాధం గారు.
మేము అనుకొన్న నిబంధనలు చాలాసార్లు చాలా మంది విషయములో మార్చాల్సి వస్తోంది. పార్వతి విషయం లో కూడా అలా నిబందనలు మార్చవలసి వచ్చింది. కారణం . . . పార్వతి చిన్నతనం లోనే కన్నవాళ్ళని కోల్పోయింది. బంధువుల సాయం తో స్కూల్ ఫైనల్ పాస్ అయ్యింది. తనని ఇష్టపడినవాడిని పెళ్లి చేసుకొని అందరితో మంచిగా వుంటూ వారి అవసరాలు గుర్తించి ఆదుకొంటూ అందరిమన్ననలు పొందింది. తనకి సంతానం కలగక పోయిన నిరాశ పడకుండా చెల్లెలి పిల్లలిని సాకి పెంచి పెద్ద చేసింది. భర్త పోయాక తాను ఎవరికీ భారం కాకూడదని తన ఉనికి ఎవ్వరికి తెలియనీయకుండా ఇక్కడ ఉందామని వచ్చినప్పుడు మొదలు ఆమెని చేర్చుకోవద్దు అనుకున్నాము. కాని తన పరిస్తితి అంతా వివరించాక చేర్చుకోక తప్పలేదు. కాని చేరిన కొద్ది రోజులలోనే తన మంచితనం తో అందరికి తలలో నాల్కలాగా అయిపోయింది
పార్వతి నా గదిలోకి రావటం చూసి రామనాధాంగారు కూడా వచ్చారు.
“అమ్మగారితో నీ ప్రయాణం విషయం చెప్పేవా ?”అడిగారు రామనాధం గారు పార్వతిని.
ప్రయాణం ఏమిటి ?ఎక్కడికి? ఆశ్యర్యంగ అడిగాను.
“అవునమ్మా! పార్వతి వాళ్ల చెల్లిలిగారి అబ్బాయ్ పార్వతి గురించి వాకబు చేసి ఇక్కడ ఉన్నట్టు తెలిసికొన్నాడుట. అతను పార్వతిని తనతోపాటు తీసుకొని వెళ్తాడుట. తల్లిలాంటి పార్వతికి సేవ చేస్తే కొంతైన తమ ఋణం తీర్చుకోవచ్చు అని నిన్న నాకు ఫోన్ చేసాడు . . . . ఆ విషయమే మీతో చెప్పాలని” నీరు నిండిన నా కన్నులు చూసి చెప్పటం ఆపేసారు రామనాధాంగారు .
కుర్చీలోనుంచి లేచి ఆనందం తో పార్వతిని గుండెలకి హత్తుకున్నాను. “చాలా సంతోషం పార్వతీ. నీ మంచితనమే నీకు శ్రీరామ రక్ష అయింది. రామనాధం గారు . . . . మనం ఈ సదనం పెట్టింది ఉద్యోగ రీత్యా వేరే దేశాల్లో స్థిరపడిన పిల్లలకి తమ తల్లితండ్రులు అనాధలుగా జీవితం వెళ్లతీయకూడదు అన్న మంచి ఉద్దేశం తో తప్ప ధనార్జనకు కాదు. పిల్లలు లేని పార్వతి పిల్లలు విదేశాల్లో ఉన్న పేరెంట్స్ ఒకలాంటి వారే అన్న ఉద్దేశ్యం తో ఈమెని ఇక్కడ చేర్చుకోవడం జరిగింది కదా? ఇప్పుడు పార్వతి తన కొడుకు దగ్గరకి వెళుతోంది అనటం కన్నా కొడుకే తల్లిని ఇక్కడనుంచి తీసుకొని వెళుతున్నాడు అన్న భావం చాల సంతోషం కలిగిస్తోంది. విదేశాల్లో పిల్లలున్న తలితండ్రులకన్నా పార్వతి ఎంతో అదృష్టవంతురాలు. పార్వతి వెళ్ళడానికి తగిన ఏర్పాట్లు చూడండి” అని చెప్పి కన్నులు తుడుచుకున్నాను. “పార్వతీ మమ్మల్ని మర్చిపోకు” నవ్వుతూ టీజ్ చేసాను.
“అమ్మా! మిమ్మల్ని మర్చిపోతే నన్ను నేను మర్చినట్లే. మా పిల్లడి మాట కాదనలేక వెళ్తున్నాను. మీరే నన్ను అప్పుడప్పుడు రావడానికి అనుమతించాలి” వినయంగా బదులిచ్చింది పార్వతి.
రామనాధం గారు బయట వెయిట్ చేస్తున్న కాత్యాయిని విషయం గురించి చెప్పి ఏమి చెయ్యమంటారు అని అడిగారు.
“ఒకసారి ఆవిడను తీసుకొచ్చిన వాళ్ళను ఇలా రమ్మనండి రామనాధం గారూ”
“అలాగేనమ్మా!” చెప్పి బయటకు వెళ్ళి వాళ్ళను లోపలికి పంపించారు రామనాధంగారు.
“కూర్చోండి” లోపలికి వచ్చిన వాళ్ళను సాదరంగా ఆహ్వానించి కూర్చోమని చెప్పాను. అందరూ కూర్చున్నా నిర్లిప్తంగా ఎటో చూస్తూ నిల్చునే ఉన్న కాత్యాయనిని చూసి ఇన్నాళ్ళైనా ఈవిడ ఏమీ మారలేదనుకున్నాను. “కాత్యాయనిగారూ కూర్చోండి” ఆవిడకు ప్రత్యేకంగా చెప్పాను. వెంట వచ్చిన వాళ్ళు చేయి పట్టుకుని కూర్చోబెట్టారు.
“నా పేరు ప్రకాశం అమ్మా! నేను ఈవిడకు అన్నయ్యను. ఇదండీ ఈమె పద్దతి. మనలోకంలో ఉండదు. మొదట్లో తనపని తాను చేసుకునేది…కాని ఇప్పుడు చెప్తే కాని చెయ్యదు. అందుకని వాళ్ళ పిల్లలకి విసుగొచ్చి యెక్కడైనా చేర్చమన్నారు. నేను కాత్యాయనికి అన్ననవుతాను. మా ఇంట్లో కొన్నాళ్ళుంచుకున్నాము. కాని మేమూ పెద్దవాళ్ళమయ్యాము. ఇక పిల్లల మాట కాదనలేక మీ దగ్గరకొచ్చాను” కళ్ళు ఒత్తుకున్నాడు. “మా కాత్యాయని చెడ్డది కాదమ్మా! ఎంతమంది డాక్టర్లకో చూపించాము. ప్రాబ్లం ఏమీ లేదన్నారు. కాని ఎన్నేళ్ళైనా అదే పద్ధతి. అరిచినా కోప్పడ్డా అత్తగారూ భర్తా ఉన్నంతకాలం బానే గడిచింది. ఈమె పిల్లలకు పెళ్ళయ్యి భార్యలొచ్చాక ఇంట్లో అనవసర వస్తువయింది. ”
“కాని మా నిబంధనల ప్రకారం పిల్లలు ఇండియాలో ఉంటే చేర్చుకోము” సున్నితంగా చెప్పాను.
“నిజమే కాని ఈమెకి పిల్లలుండి కూడా విదేశాల్లో ఉన్నట్లే. మా అమ్మ మా గురించి ఏమీ చేయలేదు. ఇప్పుడు మేమెందుకు చేయాలి అంటున్నారు వెధవలు. కాకపోతే డబ్బిస్తాము అంటున్నారు. మీ దగ్గర అన్ని వసతులతో ఇంట్లో ఉన్నట్లుగానే ఉంటుందని విని ఇక్కడికొచ్చాను. మా చెల్లెలు ఒకర్ని ఇబ్బంది పెట్తే మనిషి కాదు. కాకపోతే మన లోకం లో ఉండదు. కాస్త ఆ కట్తె వేళ్లేదాక పెద్దమనసు చేసుకుని చేర్చుకోండి అమ్మా!” ప్రాధేయపడ్డాడు ప్రకాశం.
చెల్లెలి కోసం అతను పడుతున్న తాపత్రయం చూసి జాలి వేసింది. కాత్యాయనిని చూసాను. గోళ్ళు కొరుకుతూ తల వంచుకుని కూర్చుంది ఈ లోకంతో సంబంధం లేనట్లుగా. “రామనాధం గారూ! పార్వతి ఖాళీ చేసే గది ఈమెకి ఇప్పించి అన్ని ఫార్మలిటీలు పూర్తి చేయించండి” ఒక నిర్ణయానికి వచ్చి చెప్పాను రామనాధం గారితో.
సంతోషంతో నమస్కరించాడు ప్రకాశం. “ప్రకాశం గారూ చేర్చుకుంటున్నాము. కాని వాళ్ళ పిల్లలతో చెప్పండి. కనీసం మూడు నెలలకు ఒకసారైనా వచ్చి చూసి వెళ్తేనే ఇక్కడ ఉండడానికి అనుమతి ఉంటుందని. లేదంటే ఇంటికి పంపిస్తామని మీ మేనళ్లులతో గట్టిగా చెప్పండి. ” “అలాగేనమ్మా వెళ్ళొస్తాను” చెప్పి లేచి నించున్నాడు ప్రకాశం.
“భగవంతుని లీలలు చిత్రంగా ఉంటాయి. పిల్లలు ఉన్న కాత్యాయని తన నిర్లిప్త ధోరణి వల్ల ఆశ్రమంలో చేరింది. అందరినీ తనవారిగా ఆదరించే గుణం ఉన్న పార్వతి పిల్లలు లేకున్నా తన అనుకునే ఇంటికి వెళ్తున్నది. ఏది ఏమైనా “గిరిజా సదన్” తన బాధ్యత తాను నిర్వర్తిస్తున్నది”
రామనాధం గారి వెంట నిర్లిప్తంగా వెళ్తున్న కాత్యాయనిని “అమ్మా!” వెళ్ళొస్తా” అని చెప్పి సంతోషంగా వెళ్తున్న పార్వతిని చూస్తూ నిట్తూర్చాను.
వృద్ధాశ్రమాలు పెరగడానికి కారణం కేవలం పిల్లలే కాదేమో వాళ్లపట్ల నిర్లిప్త భావనతో ఉంటున్న తల్లితండ్రులది కూడా కారణమేమో ఆలోచించండి. . .

4 thoughts on “గిరిజా సదన్

  1. Chaalaa baagundi. Other side of the coin, which is relatively less-known. Congrats to the author for bringing out a new concept in a brief & crisp manner. Wish her all the best for penning (or, typing?) more stories.

  2. Every story in old age home has 2 sides to it. This is the first time a story is written showcasing the other side. Very well written!
    Looking forward to reading more stories!

  3. Nice narration..appudappudu tallulu nirliptanga undadam kuda pillala niradaranaku karanamavutundi annadi manam lokamlo chustune unnamu.. Congratulations…

Leave a Reply to Mani Cancel reply

Your email address will not be published. Required fields are marked *