March 29, 2024

చంద్రోదయం – 6

రచన: మన్నెం శారద

ఆ అమ్మాయి సారధి వైపు చూసి వూరుకుంది.
సినిమా జరుగుతున్నా తమకదేం పట్టనట్లు అమ్మాయిలంతా పెద్దగా జోక్ చేసుకుంటూ, రకరకాలుగా గట్టిగా నవ్వుతూ, పాప్‌కార్న్ నములుతూ సినిమా చూస్తున్నారు.
సారధికి అసహ్యంగా వుందా వాతావరణం. సినిమా బాగుంది. వాళ్ల అల్లరివల్ల సరిగా ఫాలో కాలేకపోతున్నాడు. స్వాతి వంక చూసేడు. ఆ అమ్మాయి ఏమీ పట్టనట్లు సినిమా చూస్తోంది.
ఇంటర్వల్‌లో చాలా అర్జెంటు పని వున్నట్లు అందరూ లేచారు.
స్వాతి లేవలేదు.
“స్వాతి, బయటకు రావూ?” ఓ అమ్మడు అడిగింది. స్వాతి రానన్నట్లు తల అడ్డం తిప్పింది.
“అది రాదులే. లెట్ హర్ ఎంజాయ్” బెల్ బాటం వంకరనవ్వు నవ్వుతూ బయటకు నడిచింది.
ఆ జోక్‌కి అందరూ విరగబడి నవ్వుతూ వెంబడించేరు. సారధి విస్తుబోయి చూసేడు.
ఆ తర్వాత “మీరు వెళ్లలేదేం?” అన్నాడు స్వాతితో పలకరింపుగా.
“అవసరం లేక” ఆమె నవ్వింది.
అలా నవ్వినప్పుడు అందమైన ఆమె పలువరుస తళుక్కున మెరిసింది. లైట్ల కాంతిలో ఆమెని పరిశీలనగా చూసేడు సారధి.
చామనఛాయలో చక్కని మొఖం ఆమెది. విశాలమైన కళ్ళు, చిన్న నోరు, పెద్ద జడ, తెల్లచీరలో ఆమె దిగి వచ్చిన దేవతలా వుంది.
“ఇందాక ఎందుకంత అల్లరి చేసేరు? నా పక్కన కూర్చుంటే నేనేం వాళ్లని కొరుక్కు తింటానా?” సారధి కోపంగా అడిగేడు.
“అందరూ మీలాగే వుండరు. కొందరు కోతిపనులు చేస్తారు. ఈ బాధంతా ఎందుకని ముందే జాగ్రత్త పడటం అంతే..” అంది.
“మరి మీకా భయం లేదా?” సరధి ఆసక్తిగ అదిగేడు.
“ఉంది. ముఖ్యంగా నేను టిక్కెట్టు తీసిచ్చేను మీకు. అందుకోసం ఏం జరిగినా నేనే భరించి తీరాలి. రెండవది మిమ్మల్ని చూస్తే అలాంటి వాళ్లనిపించలేదు నాకు”
“థాంక్స్” అన్నాదు సారధి.
“మీరంతా హాస్టల్ మేట్సా?” తిరిగి సారధి అడిగేడు.
“నేను కాదు. వాళ్లంతా హాస్టల్లోనే వుంటారు.
“తరచూ సినిమాలకొస్తుంటారా?” సారధి కుతూహలంగా అడిగేడు.
“నేనెక్కువగా రాను. కాలేజీలో ఒక విషయంలో బెట్ కాసేం. రాణి.. అంటే బెల్‌బాటమ్స్ వేసుకొందే ఆ అమ్మాయి ఓడిపోయింది. పందెం ప్రకారం ఆ అమ్మాయి మాకు సినిమా చూపించాలి. రమ్మని బలవంతం చేస్తే వచ్చేను.”
“మీకు సినిమాలు యిష్టం వుండదా?”
“ఉండదని కాదు. వాళ్లంతా డబ్బు, అధికారం వున్న వాళ్ల పిల్లలు. వాళ్లతో తిరిగితే నా పరిస్థితులు నేను మర్చిపోయి బాధపడాల్సి వస్తుంది.
ఇంతలో అమ్మాయిలు మళ్ళీ “మేత” పట్టుకొని బిలబిలలాడుతూ పౌల్ట్రీ కోళ్ళలా లోపలికి వచ్చేసారు.
స్వాతి సారధితో మాట్లాడటం చూసి ఓ అమ్మాయి గుండెల మీద చేతులు పెట్టుకొని “మైగాడ్!” అని అరిచింది.
“వాట్ హేపెండ్?” అంది మరో సుందరాంగి కావాలనే.
“దట్ హీరో యీజ్ కాన్వర్సింగ్ విత్ అవర్ హీరోయిన్!”
సారధి ముఖం ఎర్రబడింది.
స్వాతి గమనించనట్లు కూర్చుంది.
సెకండ్ హాఫ్ సినిమా సరదాగా వుంది.
సినిమా ముగిసేవరకూ వాళ్లు యేదో ఒకటి కామెంటు చేస్తూనే వున్నారు.
తెరమీద “శుభం” పలికింది.
లైట్లు వెలిగాయి. అందరూ పైకి లేచారు.
“మీ పక్కన కూర్చుని సినిమా చూడడం ఓ మంచి అనుభూతిగా గుర్తుంచుకొంటా”
సారధి చటుక్కున అనేసి వెనక్కి తిరిగేడు. అతని మాటలు స్వాతి విన్నదో లేదో అతనికి తెలియదు.
జన సందోహంలో సారధికి స్వాతి తిరిగి కన్పించలేదు.అతను ఆలోచనలతో పేవ్‌మెంట్ మీద నడుస్తున్నాడు.
“స్వాతి! స్వీట్ నేమ్!” అతని పెదవులపై చిరునవ్వొకటి మెరిసింది.
అతని పక్కనుంచి రిక్షాలు వెళ్తున్నాయి.
ఓ రిక్షా ముందుకి సాగటం, అకస్మాత్తుగా వెనుక కర్టెను పైకి తొలగి, ఓ రెండు కళ్లు తనని దీక్షగా చూడటం గమనించేడు సారధి.
సారధిని ఆ కళ్లు పాలకరించేయి.
సారధి ఓ విధయమైన ఆనందంతో చెయ్యి గాలిలో వూపేడు.
కర్టెను పడిపోయింది.
అతను హుషారుగా తాళాలు గాలిలోకి విసిరి అందుకొంటూ ముందుకి అడుగులు వేసేడు.
సారధి పెద్ద చెల్లెలు సునందకి పెళ్లి కుదిరింది.
పెళ్లికొడుకు ఎవరో కాదు. సారధి బ్యాంక్‌లోనే పని చేస్తున్నాడు. పేరు భార్గవ. ఈ పెళ్లి నిశ్చయం కావటంలోనూ శేఖర్ చేయి వుంది.
ఎప్పుడూ డబ్బుని నీళ్లప్రాయంగా ఖర్చు పెడుతూ జల్సాగా తిరిగే శేఖర్ యింత వ్యవహారవేత్త కాగల్గేడోనని వింతంగా వుంటుంది సారధికి.
“తన అదృష్టమే అతన్నిలా మార్చిందేమో!” అనుకుంటాడు. పెళ్లికి కావాల్సిన బట్టలు, యితర వస్తువులూ ఇద్దరూ కలిసే కొన్నారు. ఇంట్లో మొదటి పెళ్లి. సారధికి అనుభవం లేదు. ఆదుకొనే మరో పెద్దలు లేరు. అయినా శేఖర్ సహాయంతో సారధి అనుకున్న దానికంటే ఘనంగానే చేసేడు.
సునంద కాపురానికెళ్తుంటే సారధికి ఆనందం కల్గింది. చెల్లెలి జీవితం చక్కబరచగల్గినందుకు గర్వం కూడా కల్గింది.
నిజానికి యిదంతా తన గొప్పతనం కాదు. కేవలం శేఖర్ ఆదరణ, ఉదారత మాత్రమే.
పెళ్లి పనులన్నీ అయ్యేక సారధి తిరిగి వచ్చి డ్యూటీలో జాయినయ్యేడు. కష్టాలు వచ్చినా, సుఖాలు వచ్చినా అన్నీ వరుసగా వస్తాయంటారు. సారధికిది మంచి కాలం.
అతను ఎం. కాం. ఫస్ట్ క్లాసులో పాసయ్యేడు. అంతే కాదు. అతను బాంక్ టెస్ట్ పాసయి ప్రొబేషనరీ ఆఫీసరయ్యేడు.
ఆ రోజు శేఖర్ సారధిని గాలిలో ఎగరేసేడు.
“ఇంచుమించు నువ్వు జీవితంలో సెటిలయిపోయినట్లే. మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు?” శేఖర్ అడిగేడు.
సారధి నవ్వుతూ “అన్నగారి పెళ్లికాకుండా నేనెలా చేసుకుంటాను?” అన్నాడు.
“వాడెవడు?” శేఖర్ కళ్లెగరేస్తూ అడిగేడు.
“తమరే!”
“నేను పెళ్లి చేసుకోకపోతే నువ్వు నిజంగానే చేసుకోవా?” శేఖర్ అడిగేడు.
“ముమ్మాటికి” అతని గొంతు స్థిరంగా పలికింది.
“నేనసలు పెళ్లే చేసుకోకపోతే?”
“నీకు తోడై వుంటాను”
శేఖర్ కళ్లు ఆనందంతో మెరిశాయి.

ఇంకా వుంది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *