April 20, 2024

రాములమ్మ- బంగారు కమ్మలు

రచన: డా. కె. మీరాబాయి

నేను కాలేజీ నుండి వచ్చేసరికి అలవాటుగా మా ఇంటి గుమ్మం ముందు కూర్చుని ఎదురు చూస్తోంది రాములమ్మ. గేటు తాళం తీసి లోపలికి రాగానే కొబ్బరి పొరక చేతపట్టి ఇంటి ముందున్న కడప బండల మీద రాలిన సుంకేసుల చెట్టు ఆకులు వూడవడం మొదలు పెట్టింది.
” వచ్చి ఎంత సేపు అయ్యింది రాములమ్మా? అందరింట్లో పని అయిపోయిందా? ” ముందు గదికి వేసిన తాళం తీస్తూ యథాలాపంగా అడిగాను.
” ఇయాల మూడుగంటలకే పని అయిపోయిందమ్మా. టీచరమ్మ బజారుకు పోవాలని సెలవు పెట్టింది కదా. మాపటేళ పనికి రావొద్దనింది. అందుకే.. ” కసువు నూకడం ఆపకుండానే జవాబిచ్చింది.
రాములమ్మ గుడిసె వుండేది సి కేంప్ లో. అక్కడి నుండి కిలో మీటరు పైన నడిచి హౌసింగ్ బోర్డ్ కి వచ్చి నాలుగు ఇళ్ళలో పని చేసుకుని వెళ్ళేది.
” పొద్దున్న ఏడుగంటల లోపు ఇంటి ముందు వూడ్చి, నీళ్ళు జల్లి ముగ్గేయక పోతే ఎవరూ వూరుకోరు. అందుకే తెల్లారి అయిదింటికే లేచి బయలుదేరుతుంది.
అందరిళ్ళలో ఇంటిముందు ముగ్గు పెట్టి, గదులలో కసువు కొట్టి, అంట్ల గిన్నెలు కడిగి, ఇల్లంతా తడి గుడ్డతో తుడిచేసరికి మధ్యాహ్నం ఒంటిగంట. ఈ మధ్యలో ఒక ఇంట్లో కాఫీ, మరో చోట దొరికిన రోజున ఫలహారం, ఇంకో ఇంటిలో మిగిలిన నాలుగు మెతుకులతో పూట గడుపుకుంటుంది.
ఏ చెట్టుకిందనో, ఇంటి వరండాలోనో కాసేపు నడుమువాల్చుతుంది. మళ్ళీ మధ్యాహ్నం రెండు నుండి పని మొదలు. బండలు తుడవడం రెండో పూట వుండదు గనుక
తొందరగా పని అయిపోతుంది. ఇక నేను కాలేజి నుండి రావాలని కాచుకుని కూర్చుంటుంది.
అరగంటలో పని ముగించి ముగించి ఆరోజు ఎప్పటిలా ‘పొయ్యొస్తానమ్మా!” అనకండా గుమ్మం ముందు కూర్చుంది.
“ కాఫీ కావాలా రాములమ్మా?” అన్నా.
” రేపటినుండి పండగ కదమ్మా. ఆ మూడు రోజులు పనిలోకి రాను. ఆ మాటే చెప్పి పోదారని కూసున్నా” అంది.
” అవును రెండు రోజుల్లో క్రిస్మస్ పండుగ.
బీరువా తెరిచి సగం పాతబడ్డ ఎరుపు రంగుకు తెలుపు గళ్ళ అంచు వున్న సాదా పట్టు చీర, యాభై రూపాయల కాగితం తెచ్చి అందించి, ” మా గురించి కూడా ప్రార్థన చెయ్యి రాములమ్మా” అన్నా.
రాములమ్మ రంగు రవికెలు తొడగదు. తెలుపు జాకెట్టే వేస్తుంది. బహుశ ఆ పోయిన మొగుడి గురించేమో.
రాములమ్మకు పన్నెడేళ్ళకే పెళ్ళి చేసారుట. ఆ మొగుడికి అప్పటికే రెండు పెళ్ళిళ్ళు అయ్యాయి. మొదటి పెళ్ళాము అయిదేళ్ళు కాపురం చేసి అమ్మవారు పోసి పోయిందట. రెండో ఆవిడ నాలుగేళ్ళకే పసర్లు సోకి కన్నుమూసిందట. ఇద్దరికీ పిల్లలు లేరు.
రాములమ్మ కాపురానికి వచ్చిన రెండో రోజే చేపల పులుసు వండలేదని మొగుడు చావగొట్టాడట. ” మందు తాగినప్పుడు కొట్టేవాడు గానీ లేకుంటే బాగానే చూసేవోడు అంటుంది.
గట్టిగా రెండేళ్ళు కాపురం చేయకముదే ఏదో జబ్బుతో మంచాన బడ్డాడు.
మతం తీసుకుని ప్రభువును నమ్ముకుంటే మొగుడు బతుకుతాడని ఎవరో రాములమ్మకు నమ్మ బలికితే ఎవరికీ చెప్పకుండా వెళ్ళి నాలుక మీద పవిత్ర జలం వేయించుకుని, ప్రభువుకు దండం పెట్టుకున్నదట.
అయినా వారం రోజుల్లో మొగుడు పోయాడు. “ తాగి తాగి ఒళ్ళు గుల్ల అయినాక ప్రభువును కాపాడమంటే ఎట్లా? “ అంటుంది రాములమ్మ వేదాంతి లాగా.
“ ఒకసారి ప్రభువును నమ్మినాక కాదనుకుంటే నరకంలో పడిపోతాను కదా” అనే రాములమ్మ నాకు క్రిష్ణాష్టమికి ముందుగది గుమ్మం నుండి దేవుడి పటాలున్న గూడు వరకు నాప సున్నంతో బాల క్రిష్ణుడి పాదముద్రలు ముగ్గువేసేది.
తను పనిచేసే టీచరమ్మతో మందిరానికి వెళ్ళినా లోపల ఆమె పక్కన కూర్చోదట.
” పెద్దోళ్ళ పక్కన కూసుంటే మరేదగా వుండదు కదా. మీ కాలేజీలో పని చేసే మా మందిరం మేడం వొస్తే సోఫాలో కూసోమంటావు. అట్టాగని నేను ఆయమ్మ పక్కన కుసుంటానని అనకూడదు కదమ్మా”. అంటూ ఈ ప్రపంచంలో హావ్స్ హావ్ నాట్స్ అన్న రెండే కులాలన్న లోకజ్ఞానం చూపిస్తుంది రాములమ్మ.
పండుగ అయ్యాక వచ్చిన రాములమ్మ అరడజను అరటి పళ్ళు నా చేతిలో పెట్టి ” కోడి కోసే మా ఇళ్ళ్లలో వండిన పరవాన్నం మీ బాపనోళ్ళు తినరని పండ్లు తెచ్చినా” అంది నవ్వు ముఖంతో.
ఆహారపు అలవాట్లను కుల అహంకారంగా చిత్రించే విధ్యాధికులకన్న సంస్కారంలో రాములమ్మ ఒక మెట్టు పైన వుందనిపించేలా.
మరో రెండు నెలలకే నెల్లూరు ప్రయాణ మయ్యింది రాములమ్మ.
” మా మరిది కూతురుని సాపమీద కూసోబెట్టినారంట. చూసొస్తాను. లచ్చుమమ్మకు చెప్పినానులే పది దినాలు నీకు టయానికి పనిచేసిమ్మని. నాకో అయిదొందలు సద్దు తల్లీ. రెడ్డెమ్మ దగ్గర రెండొందలు తీసుకున్నా. మీది నెల నుండీ నెల నెలా పట్టుకో” అంటూ.
“ బావుంది రాములమ్మా. ఆరు నెలల ముందు మీ తమ్ముడికి బాగలేదని అప్పుచేసి పోయివచ్చావు. ఆ అప్పు పోయిన నెలదాకా కట్టావు. నీ గురించి ఆలోచించుకోవా? ఇంతకీ ఇప్పుడు ఈ డబ్బు దేనికి? కాస్త విసుగ్గా అడిగాను.
“నాదేముందమ్మా?ఒక్క పానం. సుబకార్యం అని పోతూ బోసి చెవులతో పోతే ఎవరు మరేద ఇస్తారు? మా మరిది పెద్దబిడ్డకు కానుపు ఖర్చుకు డబ్బు లేదని దేవులాడుతుంటే నా బంగారుకమ్మలు కుదువ బెట్టినా. అయిదొందలు అప్పు వడ్డీతో పదకొండు వందలయినాదంట ఎనిమిది వందలు కట్టేసినా. ఇంకో మూడొందలు కట్టి ఇడిపించుకోవాల. అందుకే”
“ఎట్లాగూ బస్సులో దొంగతనాలు అంటున్నారు కదా గిల్ట్ కమ్మలు పెట్టుకోరాదా?” రాములమ్మ ఏమంటుందో చూద్దామని అన్నా.
“ఎవుళైనా చూసి “ ఏంది రాములమ్మాఇంత బతుకూ బతికి ఇత్తడి కమ్మలెట్టుకున్నావా ?” అంటే నా గౌరవమేంగావాల? నీకు డబ్బు ఇబ్బంది అయితే ఆ కాపోళ్ళ ఇంటికాడ అడుగుతాలే” అంటూ లేచింది.
అదిగో ఆ పౌరుషమే రాములమ్మలో నాకు నచ్చేది. ఇదివరకు ఒకసారి చెప్పకుండా మూడురోజులు పని మానేసింది.
“ఇట్లా అయితే నేను ఇంకో మనిషిని కుదుర్చుకుంటాను రాములమ్మా. ” అన్నా.
వెంటనే చేతిలోని చీపురు కిందపారేసి “పెట్టుకోమ్మా. జ్వరం వచ్చి రెండు రోజులు పని మానేస్తే ఈ మాదిరి బెదిరిస్తే ఎట్లాగ అమ్మా? మీకైనా నాకైనా పానం బాలేకపోతే పని చెయ్యలేము కదా” అని తన టిఫిని డబ్బా తీసుకుని బయలుదేరింది.
నిజాయితీ, నిక్కచ్చితనం వుండేవాళ్ళకే ఆ పౌరుషం వుంటుంది.
“ఒళ్ళు బాగలేదని రాగానే చెపితే నేనుమాత్రం ఎందుకు అడుగుతాను?” అంటూ శాంతింపజేసాను. ఆ విషయం గుర్తొచ్చింది.
” నేను డబ్బులివ్వనన్నానా? కూర్చో వస్తాను. ” అని డబ్బుతోబాటు నేను కట్టకుండా పక్కన పెట్టిన రెండు పాలియెస్టర్ చీరెలు తెచ్చి ఇచ్చా.
“పొయ్యొస్తానమ్మా. లచ్చుమమ్మకు చెప్పిపోతాలే. నమస్కారమమ్మా. ” అని కదిలింది.
ఈ మన్నన, మర్యాద రాములమ్మలోని ప్రత్యేకత.
వేమన గారు చెప్పినట్టు కులము, గుణము, విద్య ఎన్ని వున్నా పసిడి ఉంటేనే మనిషికి విలువ కాబోలు. బంగారు కమ్మలు రాములమ్మకు గౌరవం తెస్తాయి. అవసరానికి అప్పు పుట్టిస్తాయి. మన దేశంలో ఆడవాళ్ళకు బంగారమే భరోసా. బంగారమే ఆపదకు ఆదుకునే బాంక్. “ అనుకుంటూ సాలోచనగా చూస్తుండి పోయా.
పదిరోజులు రానని చెప్పి వెళ్ళిన రాములమ్మ వారానికే తిరిగి వచ్చింది.
” అప్పుడే కర్నూలు మీదకి గాలి మళ్ళిందా రాములమ్మా ? ” నవ్వుతూ అడిగా.
” నాలుగు రోజులు మరేదగా చూసింది నా తోటికోడలు. శెట్టమ్మ ఇచ్చిన పది కేజీల జొన్నలు తీసుకుపోయినా కదా. అవి అయిపోయేదాక ఏడి ఏడి బువ్వ ఒండి పెట్టింది. తానానికి వుడుకు నీళ్ళు కూడా పెట్టి ఇచ్చింది. పిల్ల చేతిలో రెండొందలు పెట్టినాను కందా మళ్ళీ డబ్బులడిగితే లేవన్నా. అంతే మర్నాటినుండి చద్ది బువ్వ, గంజినీళ్ళు. వుండలేక బస్సెక్కి వచ్చేసినా. ”
” మంచిపని చేసావు”. అని రెండు దోసెలు పోసి ఇస్తే ఇష్టంగా తినింది.
” ఈ మాసికలు పడిన చీర కట్టుకున్నావేం? నేనిచ్చిన పాలియస్టర్ చీరెలు నచ్చలేదా? అనడిగా.
” అయ్యో ఆటికేం? బంగారమంటి చీరెలు. ఈడేరిన పిల్ల మా గౌరమ్మ ముచ్చట పడితే దానికి ఇచ్చేసానమ్మా. ఏమనుకోబాకు” అంది.
ఆ గౌరమ్మను ఈ మధ్యన కొన్నాళ్ళు తన దగ్గర పెట్టుకుని సాకింది రాములమ్మ. అది పక్కింటి పోకిరీ కుర్రాడి సరసాలకు దొంగనవ్వులు ఒలకబోస్తుంటే భయపడి ఆపిల్ల అమ్మా, అయ్యల దగరికి పంపేసింది. అయినా అదంటే అభిమానం.
పదేళ్ళ క్రితం రాములమ్మ మా ఇంట్లో పనికి చేరినప్పుడే నెరిసిన తల, ముడుతలు పడిన ఒళ్ళుతో యాభై ఏళ్ళకే, అరవైలలో వున్నట్టు వుండేది. ఇప్పుడు ఇంకా తీసిపోయింది. తరచు జ్వరం రావడం, పనిమానేయడం.
” ఇంతదూరం వచ్చి పోలేకుండా వున్నానమ్మా. రేపు ఫస్ట్ నుండి పని మానేస్తానని అందరితో చెప్పేసినాను. ఈ నెలా పనిచేసి మీ బాకీ వంద రూపాయలు తీరినాక పని ఇడ్చిపెడతా. ” అంది ఒక రోజు.
“ఆ వందా చెల్లుబెట్టక పోయినా ఫరవాలేదు గానీ నీ ఆరోగ్యం జాగ్రత్త. “అన్నా రాములమ్మ పని మానేస్తుందంటే బాధగా వున్నా ఆమె బాగుంటే చాలు అనుకుంటూ.
” అప్పుగా తీసుకున్న సొమ్ము తిరిగి కట్టక పోతే నా మాటకు ఇలువేం వుంటదమ్మా? ఈ నెలా చేస్తాలే. అంది.
విలువలకు కట్టుబడిన మనిషి. నా మాట వినదని వదిలేసా.
ఎప్పుడో నలభై ఏళ్ళ క్రిందట రెండేళ్ళు సంసారం చేసి ఆమెను విధవరాలుగా మిగిల్చి పోయిన ఆ తాగుబోతు మొగుడి తమ్ముడి బిడ్డలకు తన కష్టార్జితం ధార పోస్తుంది.
“తనకు మాలిన ధర్మం పనికిరాదని చెప్తే వినవు రాములమ్మా. మా తమ్ముడో, మా మరిదో అంటావు వాళ్ళు నీకు కష్టం వస్తే పలుకుతారా?” అని కోప్పడ్డాను కూడా.
మరి ఇప్పుడు మూలబడిన రాములమ్మను వాళ్ళు ఆదరిస్తారా?
ఆ మాటే అడిగాను.
“మీ మరిది ఇంటికా తమ్ముడి దగ్గరకా ఎక్కడకు పోతావు మరి? “ అనడిగా.
” నా కాలుచెయ్యి ఆడినంతదాకా ఒకళ్ళకు బరువు కానమ్మా. ఇంటి కాడే ఇస్కూలు దగ్గర జంగిడి పెట్టుకుని చెనిక్కాయలు, బటానీలు అమ్ముకుంటే నా కడుపు నిండక పోదు. ఆ పైన ప్రభువున్నాడు. ” అంది చెదరని ధైర్యంతో.
” పెద్దమ్మాయి పెళ్ళికి పిలుస్తాను తప్పక రావాలి. నెలకోసారి అయినా కనబడి పోతుండు రాములమ్మ అని చెప్పా ఆమె పని మానేసి పోతున్నప్పుడు.
“ అట్టాగేనమ్మా. ఆ పిల్లకు తలంటి నీళ్ళోసినదాన్ని. నేను రాకుంటే ఎట్టా? అంది ముఖమంతా నవ్వు నింపుకుని.
నిజమే. నా కూతుళ్ళు ముగ్గురికీ బారు జుట్టు. షాంపూలు అలవాటుకాని రోజులు. వారం వారం వాళ్ళ తలరుద్దడం నా వల్ల అయ్యేది కాదు. నేను కుంకుడుకాయ పులుసు పోస్తే రాములమ్మ తలరుద్దేది పాపం.
పిల్లలు పెద్దయ్యాక కూడా “ఏమ్మా తలకు పోయాలా? “ అని తమాషా చేసేది.
ఇచ్చిన మాట ప్రకారం నెలకోసారి ఒచ్చి కనబడేది రాములమ్మ. మా ఇంట్లో పనికి చేరినప్పుడు ఆమె జీతం ముప్ఫై రూపాయలే. ఇప్పుడు నెల నెలా వచ్చినప్పుడల్లా యాభై నోటు చేతిలో పెడితే “ఎందుకమ్మా? “ అని మొహమాటపడేది.
“ప్రభుత్వం మాకు పింఛను ఇస్తుంది రాములమ్మా. ఇది నీకు పింఛను అనుకో” అంటే సరేనమ్మా అని తీసుకుని, మేడ మీద వూడ్చడమో, బియ్యం బాగు చెయ్యడమో, నీళ్ళ గది కడగడమో ఏదో ఒక పని చేసిపెట్టి పోయేది. దయను స్వీకరించలేని స్వాభిమానం మరి.
—– —- —–
అనుకున్నట్టే అమ్మాయి పెళ్ళి కుదిరింది. రాములమ్మ ఇల్లు వెదుక్కుని వెళ్ళి పత్రిక ఇచ్చి తప్పక రావాలని పిలిచాను.
“పెళ్ళికి పెట్టుకోడానికి బంగారు కమ్మలు వున్నాయా?” అని హాస్యమాడాను.
” ఇంక తాకట్టు పెట్టేది లేదులే. నేను పోతే ఎవరు విడిపిస్తారు? అయినా బంగారు కమ్మలు పెట్టుకోకండా పెళ్ళికి ఎట్లా వస్తా? ” అంది నోటినిండా నవ్వుతూ.
అన్నట్టుగానే పెళ్ళికి వచ్చి స్టీలు గ్లాసులు రెండు మా అమ్మాయికి కానుకగా ఇచ్చింది.
“ఇవన్నీ ఎందుకు రాములమ్మా? ” అంది నా కూతురు.
“అమ్మా. నువ్వు వెయ్యేళ్ళు చల్లగా వుండాలి. ఈ ముసలిదాని మరిచిపోకు ” అంది రాములమ్మ చెమరిన కన్నులను పైట కొంగుతో ఒత్తుకుంటూ.
మంచి చీర పెడితే సంతోషంగా తీసుకుంది.
రెండు నెలలలో పెద్దమ్మాయి అత్తారింటికి వెళ్ళింది. మేము ఇచ్చిన సారెతోబాటు రాములమ్మ ఇచ్చిన స్టీలు గ్లాసులు కూడా తీసుకు వెళ్ళింది.
రాములమ్మ మరోసారి వచ్చినప్పుడు ఈ మాట చెబితే మురిసి పోయింది.
ఈ మధ్యన రాములమ్మ మా ఇంటికి వచ్చినప్పుడు లచ్చుమమ్మను వెంటబెట్టుకుని వచ్చింది. వాళ్ళిద్దరి ఇళ్ళూ ఒకచోటే కావడాన ఏన్నో ఏళ్ళ స్నేహం వాళ్ళది. రాములమ్మ ఈడుదే అయిన లచ్చుమమ్మ కూడా ఇంత దూరం వచ్చి పని చేయలేక ఇక్కడ మానుకుని, సి కాంప్ లోనే ఒకరింటిలో పని చూసుకుందట.
” మా గౌరమ్మకు తలంబ్రాలమ్మా. నెల్లూరికి పొయ్యొచ్చినంక మళ్ళొస్తా. “ అంది.
సాయంత్రం చేసిన ఉప్మా వుంటే ఇద్దరికి చెరి కాస్త ఇచ్చిటీ పెట్టి ఇచ్చా.
నమస్కారమమ్మా ” అంటూ వెళ్ళడానికిలేచింది.
అసలే అభిమానవతి. సహాయం అడుగుతుందా? అనుకుంటూ ” వుండు రాములమ్మా అని లోపలికి వెళ్ళి ఒక కొత్త చీర, కొంత డబ్బు తెచ్చి, ఆమె చేతిలో పెట్టి క్షేమంగా వెళ్ళిరా” అన్నాను.
“పని మానేసినా, వచ్చినప్పుడల్లా ఇస్తూనే వున్నావు వద్దు లేమ్మా అంటు మొహమాట పడింది రాములమ్మ.
“ఫరవాలేదులే” అని చేతిలో పెడితే తీసుకుంది.
లచ్చుమమ్మకు నేను కట్టకుండా పక్కన పెట్టిన చీర ఒకటి, ఇరవై రూపాయలు ఇస్తే సంతోషంగా తీసుకుంది.
” నెల్లూరు నుండి వచ్చినాక వస్తానమ్మా నమస్కారం” అని వెళ్ళింది.
అయితే ఈసారి మాట నిలబెట్టుకోలేదు రాములమ్మ. నెల తరువాత ఒక రోజు లచ్చుమమ్మ ఒంటరిగా వచ్చింది. మనిషి బాగా నీరసంగా వుంది.
” రాములమ్మ రాలేదేం లచ్చుమమ్మా? మనసులో రాములమ్మ బాగుండాలని కోరుకుంటూ అడిగా.
” నన్ను బతికించి రాములమ్మ దేవుడి దగ్గరకు వెళ్ళిపోయిందమ్మా. ” అంది కన్నీళ్ళు తుడుచుకుంటూ.
అయ్యో అంటూ కూలబడ్డాను.
“ఆయమ్మ మరిది కొడుకు వచ్చి పెళ్ళికి పిలుచుక పోయినాడు. నువ్విచ్చిన కొత్త చీర ఆ పిల్లకే పెట్టింది. రాములమ్మ కమ్మలు గౌరమ్మకు ఇమ్మని అడిగితే ఈయమ్మ ఈలేదంట. పెండ్లయిన మరునాడే బస్సెక్కించారు. ఇంతలో నాకు సుస్తీ చేసింది. డాక్టరు నా కడుపులో గడ్డ పెరిగిందని ఆపరేషన్ చేయాలని చెప్పిండు. ధర్మాసుపత్రి అయినా డబ్బులు కావాలి కదమ్మా. నాకెవరున్నారు ఆదుకునేకి? సరే నూకలు వున్నన్నాళ్ళు వుంటాలే అనుకున్నా. కానీ రాములమ్మ వూకోలే. చెప్పకుండా తన కమ్మలు అమ్మి డబ్బు నా చేతిలో పెట్టింది ఆపరేషనుకని. ఆయమ్మ పుణ్యమా అని నేను బతికి బట్టకట్టినా గానీ రాములమ్మ వారం ముందు రేతిరి నిద్రలోనే కన్నుమూసిందమ్మా” దుఖ్ఖంతో లచ్చుమమ్మ గొంతు వణికింది.
సాటి మనిషికి కోసం తనుప్రాణంగా చూసుకునే బంగారు కమ్మలు అమ్మి సహాయం చేసి అ రాములమ్మ మనిషితనానికి మారు పేరులా కనబడింది నా మనసులో.
——- ————. ———- ——-

1 thought on “రాములమ్మ- బంగారు కమ్మలు

Leave a Reply to మాలిక పత్రిక ఆగస్టు 2020 సంచికకు స్వాగతం… – మాలిక పత్రిక Cancel reply

Your email address will not be published. Required fields are marked *