March 28, 2024

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 50

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య

ఇది అన్నమయ్య సంస్కృత సంకీర్తన. శ్రీమహావిష్ణువు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని అవతారమెత్తినపుడు, కురుక్షేత్ర యుద్ధానంతరం అశ్వద్ధామ దుర్యోధనునికి ఇచ్చిన మాట మేరకు ద్రౌపదీ పుత్రులైన ఐదుమంది ఉపపాండవులను చంపివేస్తాడు. ఇది తెలుసుకున్న పాండవులు అశ్వత్థామను వెంబడిస్తారు. అర్జునుడు అశ్వత్థామతో యుద్ధానికి తలపడతాడు. అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ప్రతిగా అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ రెండూ ఢీకొంటే ప్రళయం తప్పదని భావించిన ఋషులు ఇద్దరినీ బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకోమంటారు. అర్జునుడు విజయవంతంగా బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకోగా అశ్వత్థామ అలా చేయలేక పోతాడు. కానీ ఆ బ్రహ్మాస్త్రానికి ఏదో ఒక లక్ష్యాన్ని చూపించాలి కనుక పాండవుల మీద ద్వేషంతో రగిలిపోతున్న అశ్వత్థామ పాండవ స్త్రీల గర్భాల మీదకు దారి మళ్ళిస్తాడు. వారిలో అర్జునుని కోడలు ఉత్తర కూడా ఉంది. ఆమె కడుపులో ఉన్నది. పాండవుల తర్వాత సింహాసనాన్ని అధిష్టించాల్సిన పరీక్షిత్తు. బ్రహ్మాస్త్ర ఫలితంగా పరీక్షిత్తు తల్లి గర్భంలోనే మరణిస్తాడు. కానీ కృష్ణుడు తన యోగమాయతో మృత శిశువును తిరిగి బతికిస్తాడు. కృష్ణుడు అశ్వత్థామను మూడు వేల సంవత్సరాలపాటు కుష్టు వ్యాధి గ్రస్థుడివి కమ్మని శపిస్తాడు. శ్రీకృష్ణుడు అప్పుడు ఒక శపధం చేస్తాడు. నేను ఆజన్మ బ్రహ్మచారినైనట్లైతే బ్రహ్మాస్త్రం ఉత్తర గర్భంలోని శిశువును తాకకుండు గాక అని ప్రతిజ్ఞ చేస్తాడు. ఈ సంఘటన అన్నమయ్యకు ఆశ్చర్యాన్ని కలిగించి..శ్రీనివాసుని చమత్కారంగా ఏమిటి స్వామీ నీ లీలలు అర్ధంకావు అంటూ రకరకాలుగా ప్రశ్నిస్తున్నాడు. అన్నముని ప్రశ్నలు మీరూ వినండి.
కీర్తన:
పల్లవి: హా సమీచీన మపహాసం తే
దాసై ప్రకాశితం దరిదం తు లోకే ॥పల్లవి॥

చ.1. ద్వారకాపట్టణే త్వం పురా చ స్వయదీక్షితస్తూ స్త్రియః
కేశముష్టిః కథం సారస కురువంతి సరసవేళాయాం ॥హా స॥

చ.2. వరశిశోరక్షణే త్వం పురా చ అహం బ్రహ్మచారి అథోచే స్తదేతి
గోపతరుణయః కిమితి వా తద్వసతి త్వం ॥హా స॥

చ.3. తత్తబృందావనే త్వం పురా చ శ్రియౌ వేంకటాద్రౌ ఇదం
నివ్విభాసి ఇదం చిత్తమిత్యమరాశ్చ ది సేవంతి సర్వే ॥హా స॥
(రాగం మాళవి; సం.2 సంకీ.368 – రాగిరేకు – 174-7)

విశ్లేషణ:
పల్లవి: హా సమీచీన మపహాసం తే
దాసై ప్రకాశితం దరిదం తు లోకే

స్వామీ! ఏమిటిది? నీ దాసులచే శృంగార గీతాలాపనలా? చూడ కడు విచిత్రమే! కానీ యుక్తియుతం కూడాను అంటున్నాడు అన్నమయ్య.

చ.1. ద్వారకాపట్టణే త్వం పురా చ స్వయదీక్షితస్తూ స్త్రియః
కేశముష్టిః కథం సారస కురువంతి సరసవేళాయాం
స్వామీ! పూర్వం ద్వాపర యుగంలో ఉత్తర గర్భంలోని పరీక్షిత్తును పరి రక్షించేందుకు “నేను ఆజన్మబ్రహ్మచారినైతే అతడు బ్రతుకుతా”డని ప్రతిజ్ఞ చేశావు కదా! అతడు బ్రతికాడు. కానీ బృందావనంలో నీ చుట్టూ గొల్లెతలు ఎందుకున్నారు? నీవు నిజంగానే ఆజన్మబ్రహ్మచారివైతే ద్వారకా నగరంలో అనేక మని యువతులు రతికేళిలో నీ కేశగ్రహణం చేసిన మాట ఏమిటి? అంటున్నాడు అన్నమయ్య చమత్కారంగా.

చ.2. వరశిశోరక్షణే త్వం పురా చ అహం బ్రహ్మచారి అథోచే స్తదేతి
గోపతరుణయః కిమితి వా తద్వసతి త్వం
నిజంగానే నీవు బ్రహ్మచారివైనట్లైతే అనేక మంది గొల్లెతలు బృందావనంలో ఉనారు కదా! వారి మాటేమిటి? అక్కడ నీ ప్రకాశమును చూసి దేవతాలోకమంతా నిన్ను సేవిస్తూ నీకు నీరాజనాలెందుకు అర్పించారు? సమాధానం చెప్పండి?

చ.3.తత్తబృందావనే త్వం పురా చ శ్రియౌ వేంకటాద్రౌ ఇదం
నివ్విభాసి ఇదం చిత్తమిత్యమరాశ్చ ది సేవంతి సర్వే
సరే! వదిలేద్దాం. అది ఆయుగం నాటి విషయం ఇప్పుడెందుకంటావా? కానీ…ఈ యుగంలో నీవు తక్కువ తిన్నావా? చెప్పండి. ఇప్పుడు శ్రీదేవితో కూడి ఉన్నావు. ఇది శ్రీనివాసుని చిత్తమని దేవతలంతా నిన్ను సేవిస్తున్నారు కదా! చెప్పండి.
ముఖ్యమైన అర్ధాలు:
సమీచీనం = యుక్తమైనది; కేశముష్టీ: = పిడికిళ్ళతో నీకేసగ్రహణమును; వరశిసో: = ఉత్తా గర్భమునందలి శిశువును; బ్రహ్మచారీతి = నేను బ్రహ్మచారినని; ఊచే: = పలికావు; గోప తారుణ్యా: = గొల్లెతలు; కిమితివా = ఎందుకోసం; వసంతి = నివశించారు; తద్బృందావనే = ఆ బృందావనంలో; ఇహ వేంకటాద్రౌ = ఈ వేంకటాద్రిపైనను; నిర్వాభాసి = మిక్కిలి ప్రకాశిస్తున్నావు; అమరా: సర్వేచ: = దేవతలందరు; సేవంతి = సేవిస్తున్నారు.
-0o0-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *