March 28, 2024

గిలకమ్మ కతలు – “అనేసుకుంటేనే ..అయిపోద్దా..ఏటి..!”

రచన: కన్నెగంటి అనసూయ

 

 

“..నువ్వేవనుకోనంటే నీ సెవ్లో ఓ..మాటేద్దావని…కాతంత పెందళాడే వచ్చేసేనే కోడలా..ఇట్టవున్నా లేపోయినా మనసులో.. ఓమూల  పడేసుంచు..ఎంతుకయినా మంచిది..ఏవమ్టావ్?” గుసగుసలుగా  నీల్లు నవిలింది  రావయ్యమ్మ..సరోజ్ని  భుజమ్మీద సెయ్యేసి సుతిమెత్తగా..ముందుకు తోత్తా..

ఎనభయ్యో నెంబరు నూల్తో నేసేరేవో..గెంజెట్టి ఇస్త్రీ సేసిన కాతేరు సంఘవోళ్ళ నేతసీర అక్కడక్కడా గెంజి మరకలు కనిపిత్తన్నా పెళపెళలాడ్తందేవో..దగ్గిరికంటా నొక్కుకుని మరీమడతేసిన ఎడంకాల్తో అణిసిపెట్టి…కుడికాలు మోకాల్నానుత్తా..గెడ్డన్కి సెయ్యాన్చి కూచ్చుని సరోజ్నీనే ఎగాదిగా సూత్తంది రావయ్యమ్మ ఆమాటొదిలేసి…ఏవంటదో సూద్దారని. ..

అప్పుడుదాకా ఇరుగూపొరుగోల్లు పేరంటానికని  వత్తా, ఎల్తా ఉన్నారేవో..ఆ మాటేదో సెవిలో ఏత్తాకి కుదరక ఆ మాటా ఈ మాటా అయ్యాకా..సెబ్దాంలేని..ఓపిగ్గా కూకుంది..వచ్చినోల్లనే గమనిత్తా..

అనుమానం రాపోలేదు..సరోజ్నికి..మాటకే దొరకని రామ్మామ్మ..ఈమట్నే కూకుందేటో అని.

అయినా అడిగితే మరీ బాగోదని..

వచ్చి కాసేపు కూకుని ఎల్తావని లేసినోళ్లందరికీ  గెంధం రాసి బొట్టెట్టి..కాళ్లకి పసుపు రత్తం అయ్యేకా….అప్పటికే కత్తిరిచ్చి అట్టె పెట్టుకుందేవో.. తలో బెత్తిడు సేవంతి పూల దండ  ఆళ్ళ జడల్లో తురివి..అలా తురుంతా తురంతా..” ఏటి జుట్టంతా..ఊడిపోయిందేటిలాగా? నల్లగా తాసుపావులాగ ఇంత పొడుగునుండేది. తల్లో కనకాంబరాల దండెట్టుకుని నడుత్తా కనుమరుగయ్యేదాకా సూత్తానే ఉండేదాన్ని..ఏదా జుట్తంతా…?” అని సరోజ్నంటే..

“..ఆ మీ తమ్ముడి సేతుల్లో ఊడుంటద..”ని  ఏలాకోలా లాడేవోల్ల నవ్వుల్లో మునిగి తేల్తా..అప్పటికే ….కాసిన్ని నానబెట్టిన పచ్చెనగలూ, రెండు తవలపాకులూ..పావుసెక్కా, రెండరిటి పళ్ళూ , రూపాయికాసూ ఏసుంచిన  పెలేటందిచ్చి గుమ్మవవతల్దాకా సాగనంపొచ్చి పూజకాడ అయ్యీ ఇయ్యీ సర్దుతా..

“…సర్లే ..! రామ్మామ్మెల్లేకా సదురుకోవచ్చు. ఇంకొచ్చేవోల్లు కూడా ఎవర్లేరు. అందరూ వచ్చెల్లినట్తే. గుమ్మాలోకెప్పుడూ రానే రాదు రామ్మామ్మ.. ఎప్పుడో అమాసకీ..పున్నానికీని…” అని మనసులో అనుకుని..సీర మార్సకుండానే…తీరిగ్గా  రావయ్యమ్మ దగ్గరకంటా సాప సరిగ్గాలాగి కూకుంటా..

“టీ సుక్కేవన్నా తగుతావుగానా..రామ్మామ్మా..సందలడింది గందా..ఎప్పుడనగానో ఒచ్చేవు పాపం..మాటిదాపోకుండాను..?” అనడిగింది..ఆవిణ్ణే సూత్తా..ఒకింత అభిమానంతో..

“..ఊరుకోవే అమ్మాయా..టీయా..ఏవన్నానా? నేనేవన్నా..పొరుగూరు దాన్నేటే? సుట్తాన్నా..టీలూ అయ్యీ తాగుతాకి. నాలుగడుగులేత్తే ఇల్లు. వద్దేబాబా….!..మీ ..ఆబాబు సూత్తా ఉంటాణ్ణాకోసం. వచ్చాక పెడతానన్జెప్పొచ్చేను..నీతో రెండు ముక్కలు మాట్తాడి..ఎల్లి టీబెట్టిత్తే..అలా టేసన్ దాకా పోయి కాసేపు కూచ్చునొత్తాడు..సందలడతంది కూడాను ” అంది సీర సర్ధుకుంటా సరోజ్నీనే ఎగాదిగా సూత్తా..

“ ఆబాబు..బాగా తిరుగుతున్నారా రామ్మామ్మా..”  అంది సరోజ్ని..సేతిక్కట్టుకున్న తోరానికున్న పూలు తగుల్తున్న సోట దురదగా అనిపిచ్చి గోక్కుంటా..

“ ఆ..ఏం బాగులే. మొక్కాల్నొప్పులు. కూచ్చున్నంతసేపు..పర్లేదంటాడమ్మాయా. లేసి తిరుగుతున్నప్పుడే పట్తేత్తన్నయ్యని మూలుగుతాడు. అక్కడికీ అమ్మాయి రమ్మంటంది “ రా..నానా ..! ఇక్కడైతే మంచి డాట్తర్లుంటారు..అప్పరేసన్ సెయిచ్చుతానని. ఈ మడిసి కదిల్తేనా? ఊరొదిలి ఎల్తాకి ఊపిరాగిపోయినంత  బాధపడిపోతాడు. తెల్లారేపాటికి అరుగు మీదడిపోవాల. లేపోతే తోచ్చావదు.  అలాగే నొప్పులు బరాయిత్తన్నాడు….” అని మల్లీ తనే..

“….సేసినన్నాల్లు సేసేడు నడుం ఎత్తకుండాను. కొడుకులిద్దరికీ సెరో..పదేసెకరాలూ ఇచ్చేసి మాకోసం..ఆరెకరాలు  అట్టి పెట్టుకున్నాం. మాకూ తింటాకుండాలిగందా? ఆ మాత్తారం లేపోతే సూత్తల్లేదే సరోజ్నే..నువ్వెన్నన్నా సెప్పు. అయ్యేల అయ్యలా రాయిచ్చుకున్నాంగాబట్టి ఇయ్యాల మా గిద్దెడూ మేవు వండుకుని గౌర్నంగా ఏదో ఎళ్లదీత్తన్నాం..ఒకరో మాటనకుండా..ఒకళ్లతో ఓ మాట పడకుందా.అంతుకే పంపకాల్నాడు పట్తట్టి..ఆ ఆరెకరాలూ…మినాయిచ్చేను. మేమ్మాత్తరం ఎన్నాల్లుంటాం సరోజ్నే..మేవేవన్నా పట్టుకెల్తావా? మాతదనంతరం ఆల్లే పంచుకుంటారలాగని..ఏక సెక్కే కావాలన్నాను. ఏటి?  మేం కాట్లో కూలబడ్దాకా కొట్టుకు సత్తారని..ముగ్గురికీ రెండేసెకరాలు పంచుకుంటే ఒచ్చేట్టు ..పైగా పడవటి పొలవని..తూరుపేపు పొలవని..లాక్కుంతాలూ పీక్కుంటాలూ లేకుండగా ఏకసెక్కైతే మంచిదని. పిల్లలేవల్నేదుగానీ  మీ ఆబాబు మాత్తరం సాధిచ్చినోడు సాధిచ్చినట్టున్నాడనుకో…

పిల్లదేదో..పిల్లకెప్పుడో పడేసేం.  పెళ్లప్పుడు అయిదేళ్లన్నాం. ఆ ఎన్నాల్లుంచుకుంటే మందవుతుదీ..ఇత్తానన్నాకా ఇచ్చేత్తేనే మంచిదని ఇంకో రెండేళ్ళున్నా వదిలేసేరు బాబూకొడుకులు మాట్టాడుకుని.  పిల్లదీ , మాదీ కూడా ఈల్లిద్దరే  సేత్తన్నారు ప్రెస్తుతానికి. గొడవల్లేవు. కోడల్లు కలిసొచ్చేరే అమ్మాయా..ఏమాటకామాట సెప్పుకోవాల. నా కోడల్లు..కల్సిరాబట్టి…. ఏటికింతని ఊళ్ళో ఎంతుందో కనుక్కుని  ఎంతొత్తే  అంతా అమ్మాయిన్రమ్మని..లెక్క గట్తేసి.సేతులో పెట్టేత్తారు.

కడాకరుకి..దాని సేలో..ఉన్న కొబ్బరి సెట్లక్కాసిన కాయల్కీ, మావిడికాయలిగ్గూడా  లెక్కసెప్పి అనా పైసల్తో సఆ..అప్పగిచ్చేత్తారు. కాతంత బాధపడద్ది తీసుకుంటాకి. మాకెంతుకంటారు నా కోడల్లు. ఆల్లకీ ఆట్తే  ఇట్టవుండదు…ఆడపిల్లలియ్యి మనకెంతుకంటారు..”

“ ..అంతే కదేటే రామ్మామ్మా!  ..”

“ ఏమోనే అమ్మాయా..! ఇప్పటివరకైతే బాగానే నడుత్తుంది..ఏదో…ఆ వర్లచ్చిం..దయొల్ల..” అంది

పూలూపళ్ళూ, బంగారాల్తో నిండా మునిగిపోయున్న కలశం వంకా, వర్లచ్చిం పోటో వంకా సూసి దణ్నవెడతా..

అయ్యాల శ్రావణమాసప్పూజ సేసుకుందేవో సరోజ్ని..తలంట నీళ్లోసుకుని పట్టుసీరగట్టి,  మెళ్ళో నగలూ..సేతుల్నిండా గాజులూ..కుడి సేతికి ..అంతకు ముందే ముడెట్టుకున్న  తోరం..నుదుట్న కుంకంబొట్టూ..తల్లో అచ్చింతలూ..మెడకిందంతా గెంధం..ఎటు కదిల్నా రాలిపడతన్న అచ్చింతల్తో..కాళ్లకి పసుపు..తో..కళకళ్ళాడతన్న సరోజ్నిని మజ్జమజ్జలో పరిశీలిత్తానే ఉంది  మెళ్ళో, సేతుల్కీ ఏవేసుకుందాని పరిశీలిత్తా..అయ్యన్నీ ఆవారా..పిల్లకేగందా అన్నట్టు రావయ్యమ్మ.

అయితే ఇయ్యేయీ గమనిచ్చని సరోజ్నీ  రావయ్యమ్మ..వచ్చాకా వచ్చినోల్లంతా తాంబూలాలుచ్చుకుని  ఎల్లనే ఎల్లేరు,  రావయ్యమ్మ మాత్రం అట్తే కూకుండిపోయేతలికి..ఏదో మాట్తాడాలనుకుంటన్నట్టు  అజవ్వనే అయ్యింది సరోజ్నీకి. అంతుకే…ఏం సెప్పుద్దాని ఆలోసిత్తా రావయ్యమ్మెనక్కి సూత్తానే ఉందేవో..అది కనిపెట్తేసి..రావయ్యమ్మంది..

“కాదే సరోజ్నే ..పొద్దున్న..నీ కూతురు…..

“ మాయమ్మ..సేవన శుక్రోరం పూజ్జేసుకుంటంది,  తాంబూలం పుచ్చుకుంటాకి రమ్మందని సెప్పి బొట్తెడతాకొచ్చిందొలే…ఎంతందంగుందనుకున్నా..పిల్లా.

రోజూ అయ్యేలకి గలాసుడు కాపీ పెట్టి ఇచ్చేత్తాను  మీ ఆబాబుకి. పెద్దోడికి పాడుంది. నాలుగ్గేదిలున్నయ్ లే. పొద్దున్నే ఓ లీటరు పాలంపుద్ది కోడలు. కాపీపెట్టిత్తే తాగేసి అరుగెక్కి కూచ్చుంటాడు ఎల్లీవోల్లనీ , వచ్చీవోల్లని సూత్తాను. ఆ మడిసికి అదో కాలచ్చేపవనుకో.

పొద్దెక్కేదాకా  అదేపని.  ఇంక లోనకొచ్చేద్దారి అనుకుంటుండగా  వచ్చిందట. ఎవరీ పిల్ల? పొడిసే పొడిసే పొద్దల్లే ఇంతందంగా ఉంది అనుకుని అట్తే సూత్తా ఉండిపోయేడంట..ఏవనుకుంటదో ఏటో అని కూడా అనుకోకుండాను.

కన్రెప్పలోల్చకుండా  అట్తే సూత్తా ఉన్నాడేవో….అమ్మోరు గజ్జల మోతలు మొగిత్తా..నడిసొచ్చేత్తన్నట్టు…తిన్నగా మీ ఆబాబు దగ్గిరకంటా వచ్చేసి.. “ తాతా..మామ్ముందా లోపల..? “ అందంట సిలకల్లేని. మీ ఆబాబుకైతే  మాటే రాలేదంట కాసేపు.

ఆట్తే సూత్తే దిట్టి తగులుద్దేవోనని..సూత్తం మానేసి..

“..లోపలెక్కడో ఉండుంటాదమ్మా..! సూసి రా..! ఎవరో గుత్తొత్తాలేదురా..సూసినట్తే అనిపిత్తందనుకో..” అన్నాడంట..అరుగు మీంచి దిగుతా..

సిలకలాగ గలగలా నవ్వేసి..

”నేనే తాతా..ఎంకటేస్సొర్రావుగారమ్మాయి..అదే..మాయమ్మపేరు సరోజ్ని..గిలకని పిలుత్తారుగదా నన్ను..తెల్దా..” అందంట..

“ఓరోరి..నువ్వేంట్రా..నిన్నగాక మొన్నటిదాకా..జానాబెత్తెడుండీదానివి మరి..ఇప్పుడేవో..లంగాజాకిట్టేసేతలికి ..ఇంతానతన్నావు..బళ్ళోకెల్తన్నావా..?” అన్నాడాపిల్లనే సూత్తా..

“ఎల్తన్నా తాత. ఇయ్యాలెల్లలేదు. అమ్మ పూజ్జేసుకుంటందని..”

“ అవున్లే..సాయం సెయ్యాలిగందా…” అని..

“ పదమ్మా…మీ ముసలి మామ్మేంజేత్తందో సూద్దారి..” అంటా పిల్లెనకే నడ్సుకుంటా లోనకొచ్చేసేడంట..ఆ కాసేపైనా పిల్లనొదుల్తుం ఇట్తం లేక..

నూ నమ్ముతావో లేదోగానీ..వణ్నందింటాగూడా పిల్ల కవుర్లేననుకో..మీ ఆబాబు.

పొడుగ్గా ఉన్న పట్టు పరికినీయంట..పొడుగాటి జాకిట్తంట..జాకిట్టు సేతులగ్గూడా సివర్ల కుచ్చులున్నయ్యంట. సివరకంటా అల్లి పైగ్గట్టిన జడల్లో..ఇంత బారున ఏలాడతన్నయ్యంట కనకాంబరం పూల దండలు. ఒకటే వర్నిత్తం. నొసట్న మెరిసే బొట్టెట్టి..ఆ బొట్టు మీదడద్దాన్నట్టు పైన పాపిట్లోంచి ఏలాడదీసిందట పాపిడిబొట్టు..ఒకటే మురిపెవనుకో ఆ మడిసిలో…

మాంచి రంగొచ్చిన బంగినపిల్లి మావిడికాయల్లే  బంగారం రంగులో మెరుత్తున్నాయంట కోలగా ఉన్న సెంపలు పచ్చగాను.

పిల్ల నడుత్తుంటే కాలి గజ్జలు గల్లుగల్లని మోగి అచ్చంగా అమ్మోరు వాకిట్టోకి నడిసొచ్చినట్తే అనిపిచ్చేసిందట..ఒకటే సెప్పనూ..మురవనూ..సెప్పనూ మురవనూ..

మామూలుగా ఒవళ్ళన్నా ఒత్తేని “లోనుందెల్లండ”ని లోపలకంపేసి మెదలకుండ కూకునుంటాడు అరుగు దిక్కుండాను బెల్లం కొట్టిన రాయల్లే.   ఆ వచ్చినోల్లు ఎతుక్కోవలిసిందే నేనెక్కడున్నానో..ఏటో అని. పోనీలెమ్మని..

“ఇదిగో..రావయ్యమ్మా..ఎవరో వచ్చార్సూడని ఓ అరుపరిత్తే ..అతని సొమ్మేం పోయే..ఉఉ ఉఉ ..అరవడు. అలాటిది..పిల్లొచ్చిందని..లోనకొచ్చేసేడు..నన్నెతుకుతాకి..” అని కాసేపు పక పకా నవ్వి..

” ఏ మాటకామాటే..సెప్పుకోవాలి…బొట్టెట్టి పిల్లెల్లాకా..అడిగేను..ఒవల్లన్నా ఒత్తే లోనకంపి ఊరుకుంటావు..ఈ పిల్లెకనమాల అలాగ లోనకొచ్చి మరీ నన్నెతికేవు….అంటే  ఏవన్నాడో తెలుసేటే  సరోజ్నే..ఎతుకుతా ఎతుకుతా ఆ పిల్లలసిపోద్దంట..”

రావయ్యమ్మ సెప్పేవన్నీ ఊకొడతా ఇంటానే తన్లోతను ముసిముసిగా నవ్వుకుంటూ సుట్టూ సూసింది సరోజ్ని..గిలకమ్మెక్కుడుందాని.

అప్పటికే  పేపరు ప్లేటుల్లో సర్ధేసుంచేరేవో..సీకటడిపోతంది..ఇంకెవరొత్తార్లేని  సెనగల్ని డబ్బాలో పోసేసి..ఏటికయ్యి ఏరుసేసి.. అరటిపళ్లని బుట్తలో ఏత్తందన్నమాటేగాని..ఓసెవ్విటేసినట్టు సరోజ్ని కనిపెట్లేపోతమేగాదు..రామ్మామ్మ..సెప్తుంటే గిలకెనక్కే కల్లప్పగిచ్చి సూత్తందేవో..కొత్తగా కనిచ్చినట్తయ్యింది సరోజ్ని కల్లకి కూతురు..

మోకాల్ల మీద కూకుని..పెద్ద సిల్వరుపళ్ళెంలొయ్యన్నీ డబ్బాల్లో పోత్తందేవో..

ఎనకంతా అడుగున్నరమేర పరుసుకున్న పట్టులంగా..అంచందాన్ని పదింతలు సేసిందనుకుంది..సరోజ్ని. మోకాళ్ల మీద ఆనిన సుబుకంతో..దూరాన్నించి సూత్తంటే అదేదో సిన్మాలో..ఈరోయిన్నా అనిపిత్తందని గూడా తన్లోతాననుకుని..

“పిల్లకి దిట్టి తగులుద్దేవో..బాబా..” అనుకుంటా తలతిప్పి..రావయ్యమ్మెనక్కి సూత్తా..

“ రామ్మామ్మా..రెండు బూర్లేవన్నా తింటావేట..”ని అడిగి ఆవిడేమ్జెప్పుద్దో ఇనకుండానే..

“ వంటింట్లోకెల్లి..రామ్మామ్మకి రెండు బూర్లెట్టుకురా. అదే సేత్తో..గలాసుతో మంచినీళ్ళుగూడా తెచ్చెయ్..తిరగక్కాలేదు..” అని గిలక్కినిపిచ్చేతట్తని..

“పొద్దున్నించి ఎంత పన్జేసిందో రామ్మామ్మా..నా పిల్లని అనుకుంటంకాదుగానీ…”

“ సేత్తది మరి. ఇవరవున్న పిల్లే నీ పిల్ల. తాతడిగినాటికన్నిటికీ ఎంతందంగా బదులిచ్చిందని..అదే మురిపం మీ ఆబాబుకి. పట్టుకోలేపోయేననుకో. మజ్జానం కునుకు తీత్తం అలవాటు. లేసాకా కూడా పిల్ల కవుర్లే..” అంటన్న రావాయమ్మ మాటలకడ్డొత్తా..

“..పచ్చెలక్కాయలకి పసుపూ, కుంకుం, మసిబొగ్గూ రాసి మూడు రంగులేసి..ఆటికి దారాలుగట్టి పాలవెల్లికి ఎన్ని వరసల్లో కట్తేసిందో..సూసేవా రామ్మామ్మా..! ఎక్కడ తెచ్చిందో ఏటో..అలాగెల్లి ఇలాగట్టుకొచ్చేసింది..మారేడు పత్రీ,  కాయలూను. రాత్రే సెప్పుంచింది ఆల్ల నాన్నకి కలవపూలట్రా నాన్నా..పొలాన్నించొచ్చేతప్పుడని. మర్సిపోయొచ్చేరీయన. ఊరుకుందనా? మల్లీ పంపింది తెత్తావా? సత్తావా అన్నట్టు. ఏం జేత్తారు.? సచ్చినట్టెల్లి పీక్కొచ్చేరు కూతురుగాబట్టి. ఇంకెవ్రు సెప్పినా సచ్చినా కదల్రు..ఇప్పుడేగందా పొలాన్నించ్చొచ్చింది అని సరిపెట్టేత్తారు. ..మావిడాకులు ఏయాకాయాకు ఇడదీసి  నాలుగు మూల్లా సీపురు పుల్లల్తో..గుచ్చుతుం చూసి..ఎంత మురుసుకున్నారో ఆళ్ల నాన్న..”

అంటన్న..సరోజ్నీ మాటలకడ్డొత్తా..

“ సిదిమి దీపవెట్టుకోవచ్చమ్మా..నీ..పిల్లని. అదే అంటన్నాడు మీ ఆబాబు..పొద్దుటేల్నించీ నీ కూతురు కవుర్లే మీ ఆబాబుకి. వణ్నం దిని పొలం ఎల్తా ఎల్తా ..పదకొమ్దయ్యాకా  కొడుకులొత్తే ఆల్లతోనూ ఇయ్యే ఊసులు.

నిలవనిత్తేనా నన్ను.. “ పిల్లొచ్చి మరీ సెప్పెల్లింది..పొయ్యిరా..పొయ్యిరా..అని. తరిమేసేడనుకో.

అయితే..ఓ మాట…మనసులో అట్టి పెట్టుకో..” అని గిలకెక్కడన్నా దరిదాపుల్లో ఉందేవోనని సుట్టూ ఓపాలి సూసి..

“ నా…మనవడు..ఫస్టు కలాసులో..పాసవ్వేడు వింటరు.  డాట్తరు సదివిచ్చాలని పట్టు ఆల్ల నాన్న. సిదివి సుక్కెట్టుకోవచ్చు. అలాగుంటాడు పిల్లోడు. నువ్వూ  సూసే ఉంటావ్..సెలవలకి వత్తా ఉంటాడు. మొన్నీమజ్జన పది రోజులు సెలవలిత్తే గూడా “ అమ్మమ్మగారింటికెల్తా..” అంటే అక్కడ బస్సెక్కిత్తే ఇక్కడ మా పెద్దోడెల్లి దింపి తీస్తెచ్చుకున్నాడు. వత్తావన్నమాటేగానీ..ఇంట్లో ఉంటాడా ఏవన్నానా..వత్తా వత్తా.. ఆ కిరికెట్టు బేట్టేదో..తెత్తాడు..మావోళ్ల పిల్లలూ..ఆల్లూ..ఈల్లూ అంతాబడి..ఆ బల్లోఆడుకుంటాకి ఉందిగదా..కాలీతలం..అక్కడికి పోతారందరూ కల్సి. ఏదన్నా పెట్తనేంట్రా అంటాను..పెద్దత్తెట్టిందనో..సిన్నత్తగారింట్లో తిన్నాననో..సెప్తాడు. పేరుకి అమ్మమ్మగారింటిక్కాని..ఉండేదంతా ఊళ్లోనూ..మేనమావలింటికాడే..ఏమాటకామాటే సెప్పుకోవాల సరోజ్నీ అప్ప కొడుకంటే..మేనమావలు కాలు కిందెట్తనియ్యరనుకో. మా గారం సేత్తార్లే..! ” అని మల్లీ ఓసారి  సుట్టూ..సూసి..
మడిసి నేలమీద పరిసిన కాల్ని.. ఒక్కడుగు సరోజ్నీ దగ్గరకంటా జరిపి..

“మనసులో..పడేస్కో..మీ ఆబాబే తనమాటగా సెప్పమన్నారు నీతో..ఆ మడిసిమాటే ఇది. నా మాటగాదనుకో. ఆడు..డాట్తరు సదివితే..ఆడికి నీ పిల్లన్జేసుకోవాలని..మేవనుకుంట్నాం..మరి నువ్వూ మీ ఆయన ఎంకటేస్పర్రావు ఆలోసిచ్చుకోండి. ఓ మాటనుకుంటే ..” అనేసి సరోజ్నొంక సూసుంది ఏవంటాదోనని..

“  ..ఊరుకో మామ్మా..! పిల్లింకా సిన్నది. సదుంకుంటంది.

సేనా టైవుంది. అప్పుడే కంగారేవచ్చింది. తిడతారుగూడాను మియ్యబ్బాయికి సెప్తేని…”

మనసులోనే మురిసిపోతా ఏదో అనాలిగాబట్టి పైకంది  సరోజ్ని..

“ ఆ..ఏవుంది తిడ్తాకి. నేన్జెప్పేనని సెప్పు. ఎక్కడన్నా ఆపిత్తే నోరారాపలకరిత్తాడు..” పిన్నే..ఏంజేత్తన్నారు?” అని. మేవంటే మా ఇదిగా ఉంటాడని ఈ మడిసి కూడా అంటాఉంటాడు.  ఓ మాటనుకుంటే తప్పేవుందిలే..! మనవేవన్నా..తాంబూలాలుచ్చుకుంటన్నావా ..కాయితాల మీద రాసుకుంటన్నావా? ఏవన్నానా? ఊరికే ..ఓ మాట సెవిలో..అంతే.. “ అని నవ్వుతా..మళ్ళీ తనే..

“ పొద్దుటేల్నించీ నిలవనిత్తేనా..మీ ఆబాబు..ఎల్లు అమ్మాయి సెవ్లో ఓ మాటేసిరా..” అని తరిమేసేడనుకో..ఏదో పెద్దోల్లం ..ఇలాగైతే బాగుంటదనుకున్నాం. మేవుండాగానే ఆ నాలుగచ్చింతలు ఏసెయ్యాలని మాకూ ఉంటదిగందా. నేనింకా కోడల్ల సెవిలో కూడా ఎయ్యలేదీ మాట. నోట జారితే కోట దాటుద్దంటారు గందా.అంతుకే నేనాల్లతో ఎల్తన్నాననిగానీ..మీ మాయ్య ఇలాగన్నాడనిగాని  ఒక్క ముక్క అంతే ఒట్తే అమ్మాయా.  మజ్జానం  ఉండిల్లోరింటికి పేరంటకానికెల్లి వత్తా వత్తా ఒకడుగేసేరిద్దరూను.  ఏట్నించెటొత్తాదోనని..మీ ఆబాబు సెప్తానన్నా నేనే వద్దూరుకొమ్మని ని కన్నిలిపేను. మా మనసులో మాట. మేవనుకున్నదీని. నీ మనసులో ఏత్తం..ఏసేసేను..తర్వాత మీ ఇట్తం.  అబ్బాయీ, నువ్వూ ఆలోసిచ్చుకొండి… “ అంది ఎల్తాకి లేత్తా..

“అలాగే రామ్మామ్మా.సెప్తాన్లే. సెప్తాకేవుంది…” అంటన్నంతలోనే..

“  ఇయ్యి తినవా మరి…? ఏటి అప్పుడే లేత్తన్నా..” అంటా పెలేటు నిండా బూర్లే…కాకుండా..రెండు గార్లేసి, పక్కనో కూసింత పచ్చడేసి..నాలుగు సిట్టి బూర్లేసుకునొచ్చింది..తింటేనేగానీ కుదరదన్నట్టు ఎదురుగా కూకుంటా..

“నీ ఇల్లు బంగారంగానూ..నేనెక్కడ తినగల్నే ఇయ్యన్నీని. అరిగి సత్తయ్యా..ఏవన్నానా? “ అంటా బూరొకటి సేత్తో పట్టుకుని లేసి నిలబడింది ..

రావయ్యమ్మ కళ్లకీ..నోటికీ కూడా పండగే అన్నట్టుందా ఇంట్లో ఉన్న   కాసేపూను.

రావయ్యమ్మనలా సాగనంపి..లోనకొచ్చి..కాల్లూ, సేతులూ, మొకవూ కడుక్కుని ..

ఆ సందేల..పూజకాడ అమ్మోరి ముందు దీపవెట్తాకా..

మెల్లగా సరోజ్ని పక్కమ్మటా..సేరి..ఏదో అడగాలనుకుని అడగలేక..లేత్తా..కూకుంటా..లేత్తా..కూకుంటా అక్కడక్కడే కాసేపు తచ్చట్లాడి..కడాకరుకి..
“ అమ్మా..! అన్నయ్యని పిల్సేను.పర్లేదా?” అనడిగింది అమాయకంగా గిలక ఆల్లమ్మని..

“ ఎవర్నే? ఎవర్ని పిలిసేవ్ అలాగని?” తెల్లబోతా అడిగింది సరోజ్ని.

“……”

కాసేపేం మాట్టాళ్ళేదు గిలక. అక్కడక్కడా సెల్లా..సెదురుగా పడ్డ అచ్చింతల్నీ , పూరెమ్మల్నీ  సీపురెట్టి ఊడవకూడదని..బట్తతో…ఓసోటకి సేరుత్తా..

“ అదే..ఇందాకా మామ్మొచ్చింది గదా. ఆల్లింటికి ఓయబ్బాయొచ్చేడు. అప్పుడెప్పుడో..కలిసాడుకున్నప్పుడు అలా పిల్సేన్నేనే. శీనుక్కూడా తెల్సు. ఆడూ సూసేడు..ఆయబ్బాయిని..”

సరోజ్నీకంతా అర్ధమైపోయి..

“పిలుత్తే..ఏటి? పిల్వాపోతే ఏటిగానీ ..నడు ..దిట్టితీత్తాను..” ఏమెరగనట్తే అంది..సరోజ్నీ దాన్నింకా సాగదీత్తే బాగోదని..వంటింటికేసి నడుత్తా..

ఎనకే గిలకాను.

——

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *