April 23, 2024

అతి పెద్ద పాద‌ముద్ర కొంద‌రికి హ‌నుమంతుడు, మ‌రికొంద‌రికి జాంబ‌వంతుడు… ఇంత‌కీ య‌తి ఉందా?

రచన: మూర్తి ధాతరం

భారతీయ సైనికులు ఆ మ‌ధ్య హిమాల‌యాల్లో భారీ మంచు మనిషి అడుగుల్ని గుర్తించారు. దానికి సంబంధించిన ఫోటోలను కూడా ఇండియన్‌ ఆర్మీ ట్వీట్‌ చేసింది. హిమాలయాల మంచుపై యతి అడుగులు ఉన్నట్లు ఆర్మీ వెల్లడించింది. భార‌తీయ‌ పురాణాల ప్రకారం యతి అనేది ఒక‌ భారీ మంచు మనిషి. నేపాల్‌, టిబెట్‌, భారత్‌తో పాటు సైబీరియాలోని మంచు ప్రాంతాల్లో అతిభారీ పాదాలు కలిగిన రాకాసి జీవులు ఉన్నట్లు కొన్ని పురాణ కథలు చెబుతున్నాయి. ఈ యతి పాద‌ముద్ర‌ 32 అంగుళాల పొడవు, 15 అంగుళాల వెడల్పు క‌లిగివుంది. నేపాల్‌లోని మకాలు బారున్‌ జాతీయ పార్క్‌ వద్ద ఈ ఆనవాళ్లను గుర్తించినట్లు స‌మాచారం. ఇంత‌కీ య‌తి… అంటే భారీ మంచుమ‌నిషి అనేది నిజంగా ఉందా?…. ఈ వివ‌రాలు తెలు‌సుకోవాలంటే ఈ వీడియో చూడండి.

మకాలూ పరిసర ప్రాంతాలలో మంచుమనిషి అడుగులు గతంలో కూడా కనిపించాయి. అందువల్ల మంచుమనుషులు ఈ మకాలూ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నార‌నే న‌మ్మ‌కం ఏర్ప‌డింది. అయితే ఒంట‌రిగా మానవులు జీవించలేరు, ఋషులు కానీ, రాక్షసులు కానీ, సామాన్య మానవులు కానీ, జంతువులు కానీ సముదాయాలుగానే జీవించడం ప్రకృతి స్వభావం. అందువల్ల మంచు మనిషి ఒక్కడు మాత్రమేకాక పోవచ్చ‌నే భావ‌న ఉంది. అంటే గతంలో కనిపించిన పాదముద్రలు… ఇప్పుడు మకాలూ పర్వత శిఖరాన్ని అధిరోహించడానికి యత్నిస్తున్న మన సైనికులకు కనిపించిన పాద ముద్రలు ఒకే మంచు మనిషివి కాకపోవచ్చు. అందువల్ల అనేకమంది మంచు మనుషులు మకాలూ ప్రాంతంలోనే కాకుండా హిమాలయ ప్రాంత‌మంతా విహరిస్తూ ఉండవచ్చ‌ని అంటున్నారు. మన సైనిక అధికారులకు కనిపించిన కాలి గుర్తులు మామూలు మానవుల పాదాల పరిమాణం కంటే మూడు రెట్లు పెద్దవిగా ఉన్నాయి. ఇంత పెద్ద అడుగులున్న మనిషి ఎత్తు ఎంత ఉంటుందో ఊహించ‌వ‌చ్చు.

కృత యుగంలో మానవుల శరీర పరిమాణాలు, జీవన వ్యవధి చాలా ఎక్కువ‌ని చ‌రిత్ర చెబుతోంది. ఇవి కృతయుగం నుంచి కలియుగం వ‌చ్చే వరకూ క్రమంగా తగ్గిపోయాయన్నది చారిత్రక పరిణామక్రమంగా భావిస్తున్నారు. అందువల్ల ఇంత పెద్ద శరీరం క‌లిగివున్న మంచు మనుషులు గత యుగాల నాటివారు కావచ్చు, కాకపోవచ్చు కూడా….!. సుప్రసిద్ధ జాతీయ చరిత్రకారుడు కోట వేంకటాచలం క్రీస్తుశకం 1940వ దశకంలో రచించిన ఆర్యుల ధ్రువనివాస ఖండనము అన్న చారిత్రక‌ గ్రంథంలో అతి మానవుల ఆనవాళ్ల గురించిన విశేషాలు ఉన్నాయి. ఇవన్నీ అప్పటి ప్రముఖ పత్రికలలో ప్రచురితమయినట్టు కోట వేంకటాచలం వివరించారు. మహారాష్ట్ర‌లోని కొల్హాపురి సమీపంలోని విశాలగ‌ఢ్ వ‌ద్ద పదహారు అడుగుల పొడవైన రాక్షస మహామానవ అస్థిపంజరం 1949లో బయట పడింది. అలాగే హిమాలయాలతోపాటు సైబీరియా, ఆఫ్రికాల్లో మాత్రమే య‌తి జాడ క‌నిపించింద‌ని, కొన్ని వందల ఏళ్ల నుంచి ఇది జీవిస్తోందనే కథలు ప్రచారంలో ఉన్నాయి. పురాణాల ప్రకారం హనుమంతుడే యతి అనే వాదనలు కూడా వినిపిస్తుంటాయ‌. చిరంజీవి అయిన హనుమంతుడు ఇప్పటికీ హిమాలయాల్లో ఉన్నారని, యతి పాదముద్రలు ఆయనవే అని పలువురు భక్తులు విశ్వసిస్తారు. జాంబవంతుడే యతి అని, ఆయనే హిమాలయాల్లో సంచరిస్తున్నాడని కూడా మరికొందరు వాదిస్తుంటారు. అది జంతువు కాదని, నేపాల్‌కు చెందిన అతి పురాతన ఆటవిక తెగకు చెందిన మానవులే యతులన్న వాదన కూడా ప్రాచుర్యంలో ఉంది.

సాధారణ మానవుల కంటే వీరు పరిమాణంలో భారీగా ఉంటారని, వీరి ఒళ్లంతా వెంటుకలతో నిండిపోయి ఉంటుందని, భారీ ఎలుగుబంటి కంటే కూడా పెద్దగా ఉండే వీరు హిమాలయాల్లో జీవిస్తుంటారని చెబుతుంటారు. అయితే, ఇందుకు సంబంధించి సరైన శాస్త్రీయ ఆధారాలు ఇంత‌వర‌కూ ల‌భ్యంకాలేదు. ఒకటో శతాబ్దంలోనే యతి గురించి ప్ర‌చారంలో ఉంద‌ని చరిత్ర చెబుతోంది. నేపాల్‌కు చెందిన షెర్పాస్ అనే తెగకు చెందిన వ్యక్తులు తొలిసారి యతిని చూశారని చెబుతుంటారు. ఇక యతి గురించి 18వ శతాబ్దంలోనే పాశ్చాత్త్య దేశాలకు తెలిసింది. తాను యతిని చూశానని, అయితే, ఫొటో తీసేలోపే అది వెళ్లిపోయిందని రాయల్ జియోగ్రాఫికల్ సొసైటీకి చెందిన ఎన్ ఏ టొంబాజ్ అనే ఫొటోగ్రాఫర్ 1925లో వెల్లడించారు. అది అచ్చం మనిషిలాగే ఉందని, వడివడిగా అడుగులు వేస్తూ మధ్య మధ్యలో ఆగుతూ ముందుకు వెళుతుండ‌టం తాను చూశానని చెప్పారు. కేవ‌లం నిమిషం పాటు అది కనిపించిందని, పొటో తీద్దామనుకునే లోగానే వెళ్లిపోయిందని వివరించారు. దీంతో దాని పాదముద్రలకు మాత్రం ఫొటో తీయ‌గ‌లిగాన‌ని ఆయన వెల్లడించాడు. ఇదిమొద‌లుగా యతి గురించి పరిశోధనలు అధిక‌మ‌య్యాయి. పలువురు ఔత్సాహిక పరిశోధకులు హిమాలయాల్లో యతి గురించి పరిశోధనలు సాగిస్తున్నారు.

1920 నుంచి 1950 మధ్యకాలంలో యతి గురించి పరిశోధన చేసే వారి సంఖ్య పెరిగింది. అయితే టెన్సింగ్ నార్కేతో కలిసి తొలిసారి ఎవరెస్ట్‌ని అధిరోహించిన‌ ఎడ్మండ్ హిల్లరీ… యతి ఉన్నదన్న వాద‌న‌ను కొట్టి పారేశారు. అక్క‌డ కనిపించిన పాదముద్రలు మనుషుల‌వేనని మంచు కరగటం వల్ల అవి వ్యాకోచించి ఉంటాయని అభిప్రాయపడ్డారు. విస్తృతమైన పరిశోధనలు జరిగితే కానీ యతి ఉన్నదా? లేదా అన్నది తేలడం కష్టమ‌ని స్ప‌ష్టం చేశారు. ఇదిలావుండ‌గా మంచుమనిషి నేపథ్యంలో హాలీవుడ్‌లో సినిమా కూడా వచ్చింది. డేవిడ్‌ హీవ్లెట్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2011లో విడుదలైంది. ఆర్కిటిక్‌లో ఉన్న విలువైన సంపదను చేజిక్కించుకోవాలని రెండు బృందాలు ఆ మంచు కొండల్లో వేటను ప్రారంభిస్తాయి. విపరీతమైన చలిలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని నిధిని వెతుకున్న వారికి మంచు మనుషుల రూపంలో ప్రమాదం ఏర్పడుతుంది. దానిని నుంచి వారు ఎలా బయటపడ్డారనే కథతో ఈ సినిమా సాగుతుంది.

యతి కోసం ఎక్కువగా వెతికిన వారిలో పర్వతారోహకుడు రెయిన్‌హోల్డ్ మెస్స్‌నెర్ ఒకరు. తాను 1980ల్లో తాను ఒకసారి యతిని చూశానని, అనంతరం ఆ మిస్టరీని ఛేదించేందుకు పదులసార్లు ప్రయత్నించానని తెలిపారు. ఆఖరికి యతి అనేది ఒక ఎలుగుబంటి అని తేల్చి చెప్పారు. అయితే యతివిగా భావించిన వెంట్రుకల శాంపిళ్లను బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన జన్యుశాస్త్ర నిపుణులు, రిటైర్డ్ ప్రొఫెసర్ బ్రియాన్ సైకెస్, తన బృందంతో కలిసి పరీక్షించారు. ఆ వెంట్రుకల డీఎన్‌ఏను, ఇతర జంతువుల జన్యువులతో పోల్చి చూశారు. ఆ శాంపిళ్లలో ఒకటి భారత్‌లోని లడఖ్ నుంచి, మరొకటి భూటాన్ నుంచి సేకరించారు. వాటిలోని జన్యువులు 40,000 ఏళ్ల క్రితం ఉనికిలో ఉన్న ధ్రువపు ఎలుగుబంట్ల జన్యువులను పోలి ఉన్నాయని వారి పరీక్షల్లో వెల్లడైంది. దాంతో హిమాలయాల్లో అరుదైన‌ ఎలుగుబంట్లు జీవిస్తున్నాయనే భావ‌న ఏర్ప‌డింది. మరోవైపు, 2011లో రష్యాకు చెందిన పర్వతారోహకుల బృందం యతి జాడకు సంబంధించిన వివరాలతో సహా త‌గిన‌ ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపింది. అయితే, అదే రష్యాకు చెందిన జంతుశాస్త్ర నిపుణులు, రచయిత డినెట్స్ మాత్రం యతి గురించి అంతా ప్రచార ఆర్భాటమే తప్ప వాస్తవం లేదని వ్యాఖ్యానించారు. యతికి సంబంధించి స్పష్టమైన ఆధారాలను ఎవ‌రూ కనిపెట్టలేదని అన్నారు.

యతి ఆకారానికి ప్రాచీన గ్రంథాల్లోనూ స్థానం క‌నిపిస్తుంది. నేపాల్‌లోని షెర్పా తెగకు చెందిన పురాణాల్లో యతికి ప్రముఖ పాత్ర ఉంది. తూర్పు నేపాల్‌లోని 12,000 అడుగుల ఎత్తులోని పర్వత ప్రాంతాల్లో షెర్పా తెగ ప్రజలు జీవిస్తున్నారు. శివ ధాకల్ ర‌చించిన‌ ‘ఫోక్ టేల్స్ ఆఫ్ షెర్పా అండ్ యతి’ అనే పుస్తకంలో 12 ఇతిహాసాలను ప్రస్తావించారు. ఆ కథల్లో యతిని ప్రమాదకరమైన జీవిగా అభివ‌ర్ణించారు. యతికి, షెర్పా తెగ ప్రజలకు మధ్య భీకరమైన పోరు నడిచేదని వివరించారు. యతి అంతకంతకూ ఎత్తు పెరిగిపోతుంటే, అది చూసిన మనుషులు స్పృహ, శక్తి కోల్పోయారని మరో కథలో రాశారు. అయితే యతి అనేది ఒక భయం మాత్రమేనని, పర్వత ప్రాంతాల ప్రజలు అత్యంత కఠినమైన వాతావరణంలో మరింత ధైర్యంగా ఉండేలా ఆ భయం వారిని దృఢంగా మార్చిందని చెబుతుంటారు. అయితే పర్వతారోహకులు హిమాలయాల్లో పర్యటించినప్పుడ‌ల్లా యతి ఉనికికి సంబంధించిన విష‌యాలు ప్ర‌స్తావించ‌డం చర్చనీయాంశంగా మారుతోంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *