April 23, 2024

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 51

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య

ఈ కీర్తనలో శ్రీవేంకటేశ్వరుని దివ్యమయిన రథాన్ని అన్నమయ్య అభివర్ణిస్తున్నాడు. వినండి.
కీర్తన:
పల్లవి: దేవదేవోత్తముని తిరుతేరు
దేవతలు గొలువఁగా తిరుతేరు ॥పల్లవి॥

చ.1. తిరువీధులేగీని తిరుతేరు
తిరుపుగొన్నట్లాను తిరుతేరు
తెరలించె దనుజులఁ దిరుతేరు
తిరిగె దిక్కులనెల్ల తిరుతేరు ॥దేవ॥

చ.2. ధిక్కిరించీ మోతలఁ దిరుతేరు
దిక్కరికుంభా లదరఁ దిరుతేరు
తిక్కుముత్తేలకుచ్చుల తిరుతేరు
తెక్కులఁబ్రతాపించీఁ దిరుతేరు ॥దేవ॥

చ.3. తీరిచెఁ గలకలెల్లఁ దిరుతేరు
ధీర గరుడవాహపుఁ దిరుతేరు
చేరి యలమేలుమంగతో శ్రీవేంకటేశ్వరుని –
తీరున నెలకొన్నట్టి తిరుతేరు ॥దేవ॥
(రాగం భౌళి; సం,4 సంకీ.320 – రాగిరేకు – 354-6)
విశ్లేషణ:
పల్లవి: దేవదేవోత్తముని తిరుతేరు
దేవతలు గొలువఁగా తిరుతేరు
దేవదేవోత్తముడు అయిన శ్రీ మహావిష్ణువు నారాయణుడు, పరబ్రహ్మ అన్ని కారణాలకీ కారణం వేంకటేశ్వరుడే! అటువంటి దేవదేవుని తేరు వస్తోంది. గమనించండి. చూడండి. ముక్కోటి దేవతలు కొలుస్తున్ డగా తరలి వస్తున్నదా రథం. భక్తులారా చూసి తరించండి అంటున్నాడు అన్నమయ్య.

చ.1. తిరువీధులేగీని తిరుతేరు
తిరుపుగొన్నట్లాను తిరుతేరు
తెరలించె దనుజులఁ దిరుతేరు
తిరిగె దిక్కులనెల్ల తిరుతేరు
ఆ తేరు తిరువీధుల్లో తిరుగుతున్నది. భగవంతుడు కేవలం తిరగడానికా అన్నట్టుగా సాగివస్తున్నది. ఆ తేరెలాంటిదో తెలుసా మీకు? దానిమీద ఎక్కి శ్రీమహావిష్ణువు దనుజుల పీచమడచిన తేరు. అంతటి మాహాత్మ్యం గలిగిన రథం నేడు తిరుమల తిరువీధులలో అన్ని దిక్కులలో ఊరేగి వస్తున్నది.

చ.2. ధిక్కిరించీ మోతలఁ దిరుతేరు
దిక్కరికుంభా లదరఁ దిరుతేరు
తిక్కుముత్తేలకుచ్చుల తిరుతేరు
తెక్కులఁబ్రతాపించీఁ దిరుతేరు
ఆ మేళతాళాల హోరు విన్నారా? భేరీలు బాకాలు, భజంత్రీలు, తప్పెటలు, కోలాటాలతో కూడిన ఆహోరు దనుజులతో యుద్ధంజేసే సమయంలో వచ్చే రణగొణ ధ్వని లాగా ఉంది కదా! ఆ స్వామి రథానికి ఇరువైపులా ఉన్న ఢక్కాలు (పెద్ద కంచు కుంభాలవంటివి) మోగిస్తుంటే వస్తున్న శబ్దానికి గుండెలదిరిపోతున్నాయి. ఆ రథానికి అన్ని వైపులా ముత్యాలతో కుట్టిన కుచ్చులు కట్టిన తేరు ఎంత మనోహరంగా ఉందో చూశారా! సమరంలో విజయానంతరం గర్వంతో ప్రతాపించిపోతున్నట్టు ఉంది అంటున్నాడు అన్నమయ్య.

చ.3. తీరిచెఁ గలకలెల్లఁ దిరుతేరు
ధీర గరుడవాహపుఁ దిరుతేరు
చేరి యలమేలుమంగతో శ్రీవేంకటేశ్వరుని –
తీరున నెలకొన్నట్టి తిరుతేరు
ఈ దివ్యరథం కోలాహలంగా కలకలాలన్నిటిని తీర్చి శుభములు చేకూర్చేటట్టుగా ఉన్నది. ఈ రథం గరుత్మంతుని వాహనంగా కలది. గరుడుడు తన తల్లికి దాస్యవిముక్తి కలిగించి, తాను శ్రీమహావిష్ణువుకు వాహనంగా ఉండిపోతాడు. సర్వ శక్తిమంతుడు అయి కూడా తల్లి మాటకోసం సవతి సోదరులను వీపున మోస్తూ, అవమానాలను భరించి, తల్లికీ, తనకూ కూడా ఉన్న దాస్యబంధనాలను ఛేదించుకొని ఉన్నత స్థానానికి వెళ్లిన గరుత్మంతుడు ప్రాతస్స్మరణీయుడు. సాధారణంగా విష్ణువు ఆలయాలలో మూలవిరాట్టు విగ్రహానికి అభిముఖంగా గరుత్మంతుని విగ్రహం ఉంటుంది. శ్రీవైష్ణవ చిహ్నాలలో ఊర్ధ్వపుండ్రాలకు ఇరుప్రక్కలా శంఖ చక్రాలు, వానికి ఇరుప్రక్కలా హనుమంతుడు, గరుత్మంతుడు బొమ్మలు చూపుతారు.
శ్రీవేంకటేశ్వరుడు అలమేలు మంగమ్మతో కూడి జగజ్జేయమానంగా తిరుగుతున్న తేరు చూడండి. నమస్కరించి. జన్మ రాహిత్యం పొందండి అని చెప్తున్నాడు అన్నమయ్య.

ముఖ్యమైన అర్ధాలు:
తిరుపుగొన్నట్లాను = దేవదేవుడు తిరుగుటకు ఏర్పాటు చేసినట్లున్నటువంటి; తెరలించు = గెలుచు; ధిక్కరించి ఉద్దేశపూర్వకంగా అతిక్రమించు, ఉల్లంఘించు; కుంభాలు = కుండలు, కంచు ఢక్కలు; తిక్కు ముత్తేల కుచ్చులు = చుట్టూ ముత్యాలతో చేసిన కుచ్చులవంటి అలంకార విశేషము; తెక్కు = గర్వము; కలకలు = కలకలాలు, ఆపదలు; నెలకొన్న = కూడుకొని యున్నట్టి.
-0o0-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *