June 25, 2024

అమ్మమ్మ – 17

రచన: గిరిజ పీసపాటి

ఆ రోజు పెద్దవాళ్ళు బలవంతం చేస్తే తిన్న మూడు ఉండలే తప్ప మళ్ళీ ఆ కాయం తిననే లేదు నాగ. అత్తగారు తన చేతిలో తినమని వేసిన మూడు ఉండలూ పనిలో ఉన్నానని సాకు చెప్పి, పక్కన పెట్టి, తరువాత రహస్యంగా చిన్న చేతిలో పెట్టేసేది. చిన్న కూడా ఎలాగూ పెద్దవాళ్ళు అడిగితే ఇవ్వరని మహదానందంగా ఆ కాయపుండలను తినేసేది.
నాగకు పసి పిల్లను సాకే వయసు లేకపోవడంతో పాప బాధ్యత అంతా నాగ పెద్దాడపడుచు (పెద మామగారి కూతురు) అమ్మలు తీసుకుంది. ఆవిడ భర్త ఒరిస్సా (ఇప్పటి ఒడిస్సా) రాష్ట్రం లోని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లో ఇంజనీర్ గా పని చేసేవారు. సునాబెడా అనే టౌన్‌షిప్ లో కాపురం.
ఆ టౌన్‌షిప్ కేవలం HAL ఉద్యోగుల కోసం మాత్రమే కట్టించారు. ఉద్యోగస్తుల స్థాయిని బట్టి క్వార్టర్స్ ఉండేవి. ఆవిడకు అప్పటికి ఒక కొడుకు, కూతురు. ఇంతలో ఆవిడ భర్తకు టిబి సోకి, బాగా ముదిరిపోవడంతో చాలా సీరియస్ చేసింది.
సునాబెడా లోని డాక్టర్స్ కొన్నాళ్ళు ట్రీట్‌మెంట్‌ ఇచ్చినా తగ్గకపోవడంతో పీసపాటి తాతయ్య మద్రాసు (ఇప్పటి చెన్నై) లోని పెద్ద డాక్టర్లకు చూపించగా వారు అర్జంటుగా అతనిని మదనపల్లె లో ఉన్న టిబి శానిటోరియమ్ లో చేర్పించమని, అక్కడ మాత్రమే మెరుగైన చికిత్సా విధానం అందుబాటులో ఉందని చెప్పడంతో ఆయనను అక్కడ చేర్పించారు.
కూతురిని, పిల్లలను సునాబెడాలో ఉంచడానికి ఇష్టపడక ఆయనకు తగ్గేవరకు రాముడువలస లోనే ఉంచారు. అక్కడ ఆయనకు లంగ్స్ కి ఆపరేషన్ చేసి ఒక లంగ్ పూర్తిగా తీసేసారు. తరువాత బతికినన్నాళ్ళూ ఆయన ఒక్క లంగ్ మీదే ఉన్నారు. మనిషి కూడా కొద్దిగా ఒక పక్కకు ఒరిగినట్లు నడిచేవారు.
పాప సంరక్షణ అంతా ఆవిడ (పెద్దాడపడుచు) చూసుకోవడమే కాకుండా, పిల్లలను ఎలా సాకాలో నాగకు నేర్పసాగారు. ఆవిడకు, నాగకు వయసులో బాగా తేడా ఉన్నప్పటికీ మంచి స్నేహితురాళ్ళు అయిపోయారు.
పాపకు మూడవ నెల రాగానే అప్పటికి తెనాలి తాతయ్య పోయి ఆరునెలలు అయినందున మంచి ముహూర్తం చూసుకుని నాగను, పిల్లను చూడడానికి రమ్మని ఉత్తరం రాసారు పీసపాటి తాతయ్య.
ఇక అమ్మమ్మ సంబరం అంతా ఇంతా కాదు. వెంటనే అన్నయ్యకు కబురు చేసి ఆయన దగ్గర దాచిన ₹800/- అడిగి తీసుకుని ముందు ట్రైన్ కి రిజర్వేషన్ చేయించుకుంది. తరువాత నాగకు, పాపకు, అల్లుడికి బట్టలు కొంది. పాప కోసం ప్రత్యేకంగా పావు కేజీ బరువు తూగే మట్టు ఉన్న వెండి గ్లాస్ కొంది.
బయలుదేరే ముందర రకరకాల మిఠాయిలు వండి, అన్నిటినీ పట్టుకుని ట్రైన్ ఎక్కింది. పెద్దన్నయ్య స్టేషన్ కి వచ్చి ట్రైన్ ఎక్కించాడు. విశాఖపట్నం లో ట్రైన్ దిగి, బొబ్బిలి బస్ ఎక్కింది. బొబ్బిలిలో బస్ దిగేసరికి పెద బావ ఆవిడను రిసీవ్ చేసుకుని రాముడువలస తీసుకెళ్ళారు.
వెళ్ళగానే అందరినీ పేరు పేరునా పలకరించి, స్నానం చేసాక పిండివంటలు తీసి వియ్యపురాలి ఒడిలో ఒక ముత్తైదువ చేత పెట్టించింది.
నాగకు, అల్లుడికి, పాపకి కొన్న బట్టలు, వెండి గ్లాస్ వారికి ఇప్పించింది. వసంత ఋతువులో పట్టింది కనుక పాప అనే పేరుకి ముందు ‘వసంత’ అనే పేరు చేర్చింది. పేరు పెట్టి ఊరుకోకుండా ఆవిడ పాపని ‘వసంత’ అనే పిలవసాగింది.
ఆ పూటకు ప్రయాణ బడలిక వల్ల విశ్రాంతి తీసుకుని మర్నాటి నుండి వియ్యపురాళ్ళిద్దరికీ పూర్తి విశ్రాంతిని ఇచ్చి వంట పనిలో మునిగిపోయింది. అక్కడ ఆవిడ ఉన్నన్నాళ్ళూ రెండు పూటలా వంట పని ఇంతమందికీ ఒక్కర్తే చేసి పెట్టేది.
తన చేత్తో వండి కూతురికి పెట్టాలని ఆవిడ ఆశ. పదిహేను రోజుల తరువాత పీసపాటి తాతయ్య అమ్మమ్మను పిలిచి, ఎల్లుండి మంచిరోజని మీకు రిటర్న్ జర్నీకి టికెట్ తెప్పించానని చెప్పి టికెట్ చేతిలో పెట్టేసరికి ఏమీ అనలేక మౌనంగా లోపలికి వెళ్ళిపోయింది.
కూతురిని, మనవరాలిని చూసుకుంటూ మరో వారం రోజులైనా ఉంటే బాగుండునని ఆవిడ ఆశ. కానీ వియ్యాలవారు వెళ్ళిపొమ్మని డైరెక్ట్ గా చెప్పాక కూడా ఇంక ఏమీ చెప్పలేక తిరిగి తెనాలి చేరుకుంది.
ఆవిడ తెనాలి చేరేసరికి ఆవిడ కోసం ఒక షాకింగ్ న్యూస్ ఎదురుచూస్తోంది. అమ్మమ్మ వంట చేసి పెడుతున్న దంపతులు తమ పిల్లల దగ్గరకు వెళ్ళిపోతున్న కారణంగా ఆవిడకు ఉన్న ఆ చిన్నపాటి ఆధారం కూడా లేకుండా పోయింది.
ఇక ఒక ఇంట్లోనే వంటకి కుదరడం అని కాకుండా ఎవరి ఇంట్లో పెళ్ళి, బారసాల, గృహప్రవేశం, తద్దినం ఇలా ఏ కార్యక్రమం ఎక్కడ ఉందని తెలిసినా వెళ్ళి వాళ్ళను కలిసి వంట బాధ్యత తనకు అప్పచెప్పమని అడగసాగింది.
అందరికీ ఆవిడ వంట బాగా చేస్తుందని తెలిసిపోవడంతో కాదనకుండా ఆవిడకే వంట బాధ్యత అప్పజెప్పసాగారు. వాళ్ళు చెప్పిన వంటలు వండి, ఎంత ఇస్తే అంతే పుచ్చుకొనేది తప్ప ఇంత అని డిమాండ్ చేసేది కాదు. దానితో అవకాశాలు బాగా వస్తున్నా నిత్యం పని ఉండేది కాదు. దానితో ఒక్కోసారి పస్తులు ఉండక తప్పేది కాదు.
ఇంతలో డాక్టర్ రాజేశ్వరమ్మ గారు కూడా హైదరాబాదులో ఉంటున్న మేనల్లుడి దగ్గరకు శాశ్వతంగా వెళిపోతున్నారని తెలిసి ఉన్న ఒక్క స్నేహితురాలూ దూరంగా వెళ్ళిపోతున్నందుకు బాధ పడింది.
డాక్టర్ రాజేశ్వరమ్మ గారు అవివాహిత. మేనల్లుడిని కన్న కొడుకు లాగే సాకి పెద్ద చేసారు. అతనికి కూడా మేనత్త అంటే ప్రాణం. వయసు పైబడుతున్న మేనత్త ఒక్కరూ తెనాలిలో ఉండడం ఇష్టపడక తన దగ్గరకు వచ్చి ఉండమని బలవంతం చేయడంతో ఆవిడ కూడా వెళ్ళిపోవడానికే నిశ్చయించుకున్నారు.
అమ్మమ్మ ఆవిడను కలిసి “మీరు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు. నాకు చాలా బాధగా ఉంది” అంది. అందుకావిడ “ఎందుకు రాజ్యలక్ష్మి గారూ బాధ పడతారు. నేను వెళ్తున్నానే గానీ, మీ సంగతి పట్టించుకోకుండా వెళ్తానని ఎలా అనుకున్నారు? నేను వెళ్ళి అక్కడ కాస్త పరిచయాలు పెరగగానే మిమ్మల్ని కూడా హైదరాబాదు తీసుకెళ్ళిపోతాను. మీరేం బెంగ పడకండి” అంటూ అమ్మమ్మకు ధైర్యం చెప్పారు.
“మీకు నా మనసులో ఆ మాత్రం అభిమానం ఉంది. అదే చాలు. నేను ఈ ఊరు వదిలి ఎక్కడికీ రాలేనండీ!” అని బదులిచ్చింది అమ్మమ్మ.
“మానింది మందు, బతికింది ఊరు రాజ్యలక్ష్మి గారూ! మీరు ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉండేకన్నా హైదరాబాదు లాంటి మహా నగరంలో అయితే చేతి నిండా పని ఉంటుంది. ఒక్కరోజు కూడా ఖాళీ ఉండదు సరికదా మీరే మరో నలుగురికి పని ఇవ్వొచ్చు. నా మాట మీద నమ్మకం ఉంచండి. నెల రోజులలో మిమ్మల్ని హైదరాబాదు రప్పించి, చేతి నిండా పని ఇప్పించే పూచీ నాది” అన్నారు డాక్టర్ రాజేశ్వరమ్మ గారు.

****** సశేషం *******

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *