April 23, 2024

ఆదిగురువు

రచన: డా. తంగిరాల. మీరాసుబ్రహ్మణ్యం

“ఇదిగో విశాలా మాట” రాధమ్మ పిలుపు విని విసుగ్గా ముఖం చిట్లించి ఆమె దగ్గరకు వచ్చింది రెండో కోడలు విశాల.
“చక్రపొంగలిలో పచ్చ కర్పూరం వేయడం మరచి పోవద్దని వంటాయనకు చెప్పు. ” గుర్తు చేసిందామె.
” వాళ్ళకు తెలియదా ఏమిటి? మనం ప్రత్యేకం చెప్పాలా? ” అనేసి పట్టు చీర రెప రెప లాడించుకుంటూ వెళ్ళిపోయింది విశాల.
ఆమె చేతికి వున్న అరడజను బంగారు గాజులు మట్టి గాజులతో కలిసి గల గల నవ్వాయి.
జారుముడి వేసిన నెరిసిన జుట్టు, నలిగిన నేత చీర, మెడలో దారంలో గుచ్చిన పగడాల తావళం, ముఖాన విభూది బొట్టు- ఈ అవతారంలో నట్టింట్లో దిష్టిబొమ్మలా కూర్చున్న రాధమ్మ వైపు తిరస్కారంగా చూసిన విశాల చూపులు ముసలావిడ పట్టించుకోలేదు.
డెబ్భై అయిదేళ్ళు దాటిన రాధమ్మ నడవలేక ఒక చోట కూర్చున్నా, ఆమె మనసు చురుకుగా ఇంట్లో జరుగుతున్న ఏర్పాట్లను గమనిస్తూంది.
అంతలో హడావిడిగా లోపలికి వెడుతున్న రాఘవ కనబడ్డాడు ఆమెకు.
“రాఘవా” అంటు పెద్ద కొడుకును పిలిచింది.
“ఏవిటమ్మా త్వరగా చెప్పు అవతల చాలా పనులున్నాయి” నిముషం కూడా ఆగలేనట్టు తొందర పడ్డాడు రాఘవ.
” అదే నాయనా స్వామిజీకి పంచలు తెప్పించావా అని గుర్తు చేద్దామని ” అన్నదామె పట్టుపంచ, కండువాలో, ముఖాన పొడుగ్గా దిద్దుకున్న కుంకుమ బొట్టుతో వున్న కొడుకును కళ్ళనిండా చూసుకుంటూ. ఈ స్వామీజీ దక్షిణగా తాంబూలంలో పది రూపాయలు పెట్టి ఇచ్చినా తీసుకోరు. ఏ రూపంగానూ ధనం స్వీకరించరు.
“అబ్బా అన్ని విషయాలూ నీకే కావాలి. అవన్నీ మేము చూసుకుంటాము కదా. మాట్లాడకుండా కూర్చోలేవూ?” కసురుకున్నట్టుగా అనేసి విసవిసా నడుస్తూ లోపలికి వెళ్ళాడు రాఘవ.
ముఖం చిన్నబుచ్చుకోలేదు రాధమ్మ. ” పిచ్చితండ్రి అలసిపోయాడు” అనుకుంది ప్రేమగా.
కోడలు వెళ్ళి మొగుడితో ఏమి చెప్పిందో గానీ రాధమ్మ రెండో కొడుకు మాధవ గబగబ ఆమె దగ్గరకు వచ్చాడు “అమ్మా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఇటే వస్తారు. నువ్వు ఆ పక్కగదిలో కూర్చుందువు పద. ” అంటూ ఆమె సమాధానం కోసం చూడకుండా, చేయి పట్టుకుని లేవదీసి, హాలుని ఆనుకుని మూలగా వున్న ఆవిడ గదిలోకి నడిపించాడు.
” నువ్వు మాటికీ కొడుకులను, కోడళ్ళని పిలుస్తూ వుండకు. అందరం తలమునకలు పనిలో వున్నాము. స్వామీజీ వచ్చే వేళ అయ్యింది. ” గట్టిగా చెప్పాడు.
” అదికాదురా ముత్తైదువులకు పెట్టాల్సిన చీరలు అవీ సిద్ధం చేసారేమో కనుక్కో ” అందామె గదిలోనుండే బయటకు తొంగి చూస్తూ.
“ముసలిదానివి ఒక మూలన పడి వుండక అన్ని విషయాలూ నీకే కావాలంటావు. అవన్నీ నీ కోడళ్ళు చూసుకుంటారులే. ” అనేసి మాధవ వెళ్ళిపోయాడు.
రాధమ్మకు ఆమె తండ్రి స్త్రీధనంగా ఇచ్చిన స్థలంలో, అల్లుడికి ఆయన ఇచ్చిన కట్నం డబ్బుతో డాబా ఇల్లు కట్టాడు రాధమ్మ మొగుడు నారాయణ.
పైన మేడ మీద ముగ్గురు కొడుకులకు మూడు గదులు, అతిధుల కోసం ఒక గది వున్నాయి
నారాయణ దంపతుల పడకగది, ఆయన ఆఫీసు గది కిందనే. ప్లీడరుగా మంచి పేరు సంపాదించుకున్నాడు నారాయణ. రాధమ్మ ఆ ఇంటికోడలిగా వచ్చిన వేళా విశేషమేమోగానీ ఆయన వకాల్తా పుచ్చుకుని వాదించిన వారందరినీ గెలుపు వరించేది. లక్ష్మీదేవిలా రాధ తన నట్టింట నడయాడుతుండబట్టే తనకు సిరిసంపదలు చేకూరుతున్నాయని మురిసి పోయేవాడు నారాయణ. ఆయన పోవడంతోనే రాధమ్మ వైభవం ముగిసింది. అప్పటిదాకా అత్త చాటు కోడళ్ళుగా వున్న వాళ్ళు ఇంటి పెత్తనం అందిపుచ్చుకుని, ఆమెను మూలన కూర్చోబెట్టారు. ఆయన పోయాక తలిదండ్రుల గదిని పూజ గదిగా మార్చేసారు కొడుకులు. రాధమ్మకు ఒక మూలగది కేటాయించారు.
తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని, ఆ పరపతితో మంచి ప్లీడరుగా ఎదిగిన మూడో కొడుకు ఆయన ఆఫీసు గది వాడుకుంటున్నాడు.
పట్టుపరికిణీ ఓణీలో వున్న మనవరాలు నడుముకి వున్న వడ్డాణం సర్దుకుంటూ అటు రావడం చూసి ఆ పిల్లను పిలిచింది రాధమ్మ.
“లక్షణంగా పట్టు చీర కట్టుకోక చిన్నపిల్లలా లంగా వోణి వేసుకున్నవేమిటే ? కాబోయే పెళ్ళికూతురువి కూడా ” అంది.
“నీకెందుకు నాయనమ్మ? గమ్మునుండు”. అని విసురుగా వెళ్ళిపోయిందా పిల్ల.
స్వామీజీ వచ్చి వెళ్ళిన తరువాతే ఆ అమ్మాయికి ఫారిన్ సంబంధం కుదిరింది. అది ఆయన దయ వలననే అని రాఘవ గట్టిగా నమ్ముతున్నాడు.
శోభాయమానమైన అలంకరణలో వెలిగిపోతోంది ఆ ఇల్లు.
ఇంటిముందు సప్త వర్ణాలతో నిండిన రంగవల్లి ఆహూతులకు స్వాగతం పలుకుతోంది.
గుమ్మానికి కట్టిన పచ్చని మామిడి తోరణాలు బాగున్నారా అంటూ అతిధులను పలుకరిస్తున్నాయి.
పసుపు పూసుకుని, కుంకుమ బొట్లు అలంకరించుకున్న గడపలు నిండు ముత్తైదువల వలె వచ్చినవారిని లోపలికి రండి అంటూ పిలుస్తున్నాయి.
విశాలంగా వున్న హాల్లో కాస్త ఎత్తుగా ఏర్పాటు చేసిన వేదిక మీద పట్టు వస్త్రాలు కప్పివున్న కుర్చీ స్వామీజీ రాక కోసం ఎదురుచూస్తోంది.
వేదిక మధ్యలో వెండి రేకు తాపడం చేసిన ఎత్తైన పీట మీద నిలువెత్తు లలితాపరమేశ్వరి చిత్రపటం పూలమాలలతో అలంకరించి వుంది. అమ్మవారు చిరునవ్వు చిందిస్తూ కరుణ నిండిన చూపులతో అందరినీ అనుగ్రహిస్తున్నట్టు అభయ మిస్తున్నది.
వేదిక ముందు వైపు వరుసగా చిరు చాపలు పరిచి వాటిముందు పసుపు, కుంకుమ, పువ్వులు, తమలపాకులు, అమ్మవారి బొమ్మ వున్న వెండి నాణెం వున్న ఇత్తడి పళ్ళేలు పెట్టారు.
లోపలికి వచ్చిన దంపతులు జంటలుగా చాపల మీద కూర్చుంటున్నారు. ఆ రోజు కార్యక్రమంలో అమ్మవారికి నవావరణ పూజ, మణిద్వీప వర్ణన పఠనం, లలితాసహస్ర నామార్చన జరగ వలసి వుంది.
గురువుగారి రాకకోసం అందరూ ఎదురుచూస్తున్నారు. వుత్తరప్రదేశ్ నుండి విచ్చేసిన గురువుగారి మహిమల గురించిన కథలు గుసగుసగా చెప్పుకుంటున్నారు కూర్చున్న అతిధులు. ఆయన హిందీ, తెలుగు, తమిళం, కన్నడం, ఇంగ్లిష్ భాషల్లో ధారాళంగా మాట్లాడగలరు.
ఏడాది ముందు ఆ గురువుగారు వీరింటిలో ఒక మాసం బస చేసి వెళ్ళాక పట్టింది బంగారంగా వుందిట ఈ ఇంటివారి అదృష్టం అని అనుకుంటున్నారు.
చిన్న వయసులోనే సన్యసించిన మహామహిమాన్వితుడైన ఆ స్వామీజీకి లలితాదేవి పిలిస్తే పలుకుతుందిట. అందుకే గురువుగారు అడుగు పెట్టిన ఇంట సిరులు కురుస్తాయిట.
ఇంతలో వీధి గుమ్మం ముందు మేళాలు మోగడంతో రాఘవ, మాధవ ఇద్దరూ భార్యా సమేతంగా వెండి పళ్ళెలు, చిన్న వెండి బిందెలో నిండుగా నీరు
నింపిన పూర్ణ కలశంతో స్వామీజీకి ఎదురువెళ్ళి స్వాగతం పలికారు. తన ఇల్లాలు సుధ వెండి బిందె లోని నీరు పోస్తుంటే రాఘవ స్వామివారి పాదాలు కడిగాడు.
విశాల అందించిన కొత్త తువాలుతో స్వామివారి పాదాల మీది తడి ఒత్తాడు మాధవ.
స్వామీజీని దగ్గరవుండి పిల్చుకు వచ్చిన మాధవ తమ్ముడు ఆయన మెడలో పూలహారం వేసాడు.
మెడక్రింది దాకా వున్న నెరిసిన జుత్తు, గుండెలను తాకుతున్న తెల్లని గడ్డం, పొడవుగా, కఠిన నియమాల వలన అరవై ఏళ్ళ వయసులోను కడ్డీలా వున్న దేహం, విశాలమైన నుదుటి మీద విబూది రేఖల నడుమ శివుని మూడవ కన్నులాగా వున్న కుంకుమ బొట్టు, ఒక విధమైన తేజస్సుతో వెలుగుతున్న తీక్షణమైన కళ్ళు -చూసే వారికి ఆయన పట్ల గౌరవాన్ని కలిగిస్తున్నాయి.
కాషాయ వస్త్రాలలో నిరాడంబరంగా వున్న స్వామీజీ ప్రశాంత వదనంలో చిరునవ్వు తొంగి చూస్తుండగా వారి వెంట లోపలికి నడిచారు.
కూర్చున్నవారంతా లేచినిలబడి భక్తిగా నమస్కరిస్తుండగా వేదిక మీదవున్న కుర్చీలో ఆశీనులయ్యారు.
పూజ మొదలయ్యింది.
వచ్చిన వారందరికీ ముసలామె కనబడకుండా గుమ్మానికి వున్న తెరను పూర్తిగా లాగి వెళ్ళింది మనవరాలు. రాధమ్మ కుర్చీని ముందుకు జరుపుకుని, తెరను పక్కకు తప్పించి తొంగి చూస్తోంది.
కుంకుమార్చన, నైవేద్యము, హారతి అయ్యేసరికి ఒంటిగంట అయ్యింది. అమ్మవారికి, గురువుగారికి సాష్టాంగ ప్రణామం చేసారు రాఘవ, అతని తమ్మూళ్ళూ, ఇంటి కోడళ్ళు. రెండుచేతులు జాపి వారిని అనుగ్రహించారు స్వామీజీ.
రాధమ్మకు నీరసంతో శోష వస్తున్నట్టు వుంది. కాసిని మంచినీళ్ళు గొంతులో పోసుకుని, ఎవరన్నా ఇటు వస్తారా అని చూస్తొంది ఆమె.
వచ్చిన వారందరిలో వయో వృద్ధులు అయిన దంపతులను కూర్చోబెట్టి సువాసినీ పూజ చేసి, బట్టలు చదివించి, నలుగురు కొడుకులూ, కోడళ్ళు వారికి నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు.
భోజనానికి వేళ మించుతోందని గబ గబ హాలు శుభ్రం చేసి అరటాకులు వేసారు.
ఈలోగా రాఘవ పెద్ద వెండి గ్లాసులో పచ్చకర్పూరము, కుంకుమ పువ్వు, చక్కర వేసిన గోరు వెచ్చని పాలు తెచ్చి గురువుగారికి భక్తితో అందించాడు. గ్లాసు చేతిలో పట్టుకుని గురువుగారు విశ్రాంతి కోసం తన కోసం సిద్ధం చేసిన గదివైపు నడిచారు.
వడ్డన మొదలవ బోతోంది అన్నదానికి సూచనగా పులిహోర, చక్రపొంగలి, పాయసం ఘుమఘుమలు ఇల్లంతా వ్యాపించాయి
ఆ వాసనలతో ఆకలితో, నీరసంతో వున్న రాధమ్మకు కళ్ళు తిరుగుతున్నట్టు అయ్యి, ముందుకు వాలింది.
అదే సమయంలో పాలగ్లాసు పట్టుకుని ఆ గది ముందునుండి నడుస్తున్న స్వామీజీ గుమ్మానికున్న తెరను తప్పించి లోపలికి తొంగిచూసారు.
గభాలున ఒక అడుగు లోపలికి వేసి ముసలావిడను పడిపోకుండా భుజం పట్టి ఆపారు.
ఆమెను చూడగానే ఆయనకు అర్థమయ్యింది ఆకలికి, నీరసంతో ఆవిడకు శోష వచ్చిందని.
“అమ్మా! ఈ పాలు కొంచం తాగు” అంటూ తన చేతిలోని గ్లాసును ఆమె నోటి దగ్గరగా పెట్టి ఆమె పెదవుల మీదకి పాల చుక్కలు తగిలేలా వంచారు.
అసంకల్పితంగా నోరు తెరిచి ఆ పాలను రెండు గుక్కలు మింగింది రాధమ్మ. ఆమెను పొదివి పట్టుకుని ఆ పాలు తాగించాడు ఆయన.
స్వామీజీ వెనుకనే గదిలోకి వచ్చిన రాధమ్మ పెద్ద కొడుకు రాఘవ మాటలు రానట్టు నిలబడ్డాడు.
తేరుకుని కళ్ళు తెరిచిన రాధమ్మ చూపులు కొడుకు మీద వాలాయి.
“అయ్యో అంత బడలికగా ఉన్నావేం నాయనా? పనిలో పడితే ఆకలిదప్పులు మరచిపోతావు. కొంచం పాలు అయినా తాగక పోయావా?” అన్నది ఆమె అంత నీరసంలోను.
అప్పుడు చూసిందామె గురువుగారిని.
“స్వామీజీ ఈ మసలిదాన్ని చూడడానికి తమరు నా దగ్గరకు వచ్చారా? ” సంభ్రమంగా అంటూ చేతులు జోడించింది రాధమ్మ.
స్వామీజీ రాఘవ వైపు చిరునవ్వుతో చూసారు. ” అమ్మ ప్రేమ అంటే ఇదే. ఆమెను నువ్వు పట్టించుకోక పోయినా అమ్మ నీ ఆకలి గురించి తపన పడుతూంది చూసావా? ” అన్నారు.
రాఘవ తప్పు చేసినట్టుతలవంచుకున్నాడు.
“పద అమ్మా! అందరూ భోజనాలకు కూర్చుంటున్నారు. ” అని రాధమ్మకు తన చేయి ఆసరాగా ఇచ్చి లేవదీసారు.
ఇక్కడ ఎదో జరుగుతోందని ఆ గదిముందు గుమిగూడి తొంగి తొంగి చూస్తున్న వాళ్ళంతా వెనక్కి నడిచారు.
రాఘవ ముందుకు వచ్చి అమ్మను మరో వైపు పట్టుకున్నాడు.
స్వామీజీ రాధమ్మను నెమ్మదిగా వేదిక మీదకి ఎక్కించి, లలితాదేవి పటం వున్న పీటకి కాస్త దూరంలో వున్న కుర్చీ మీద కూర్చోబెట్టారు.
నిశ్శబ్ధంగా కూర్చున్న అతిధులను వుద్దేశించి ఇలా పలికారు:
“అమ్మ అంటే ఆది గురువు. నవమాసాలు మోసి, పురిటి నొప్పులు పడి కన్న బిడ్డను గుండెలో పొంగిన ప్రేమను స్తన్యంగా ఇచ్చి పెంచే అమ్మ ఆ బిడ్డకు మాటలు నేర్పి, వ్రేలుపట్టి నడిపించి నడక నేర్పే మార్గదర్శి మాత్రమేకాదు కాదు, మంచి నడత నేర్పే గురువు కూడా.
అందుకే ఎవరికైనా అమ్మే ఆది గురువు. ముల్లోకాలను పాలించే ఆ లలితాదేవిని అమ్మవారు అని నమస్కరిస్తున్నాము. మన కంటికి కనిపించే ఆ దైవమే అమ్మ.
నేను నెలల పిల్లవాడుగా వున్నప్పుడే మా అమ్మా, నాన్నా నదిలో మునిగి పోయారు. నేనొక అనాథశ్రమంలో పెరిగాను. అక్కడ ఆనందీబెన్ అనే ఆయమ్మ నన్ను కన్నబిడ్డలా పెంచింది. పదో క్లాస్ వరకు చదివించిన ఆశ్రమం వాళ్ళు తరువాత మా దారి మమ్ము చూసుకోమన్నారు. పై చదువుల మీద శ్రద్ధ లేని నేను ఒక సాధువుల గుంపు వెంట వెళ్ళిపోయాను. వారణాసిలో వారి వెంటే వుంటూ సన్యాసం స్వీకరించి ఆధ్యాత్మిక సాధనలో పడ్డాను. తరువాత అలహాబాదులో ఒక పీఠాధిపతి వారసుడిగా చేరదీసారు.
నా ముప్పైరెండో ఏట ఆనందీబెన్ కోసం మావూరు వెళ్ళాను. ఆమె లేదని తెలిసింది. నాకు తెలిసి ఆమెనే మా అమ్మ. ఆమె ఫోటొ అడిగి తీసుకుని వెనక్కి వెళ్ళిపోయాను. ఇదిగో ఈ నా పూజ పెట్టెలో అమ్మవారితో బాటు మా అమ్మ ఫోటొ వుంటుంది. వుదయం లేవగానే లలితాదేవితో బాటు అమ్మకూ నమస్కరించి రోజు మొదలు పెడతాను.
ఇదిగో ఇక్కడ కూర్చున్న రాధమ్మ పుట్టింది మడకశిరలో, పెరిగింది పెనుగొండలో, అత్తవారింట మెట్టింది ఈ అనంతపురంలో. అత్తమామలను తలిదండ్రులుగా ఆదరించిన ఈ కడుపు చల్లని తల్లి సుమంగళిగా కల కల లాడుతున్నఫ్ఫుడు నేను వీరింట ఆతిధ్యం అందుకున్నాను. అప్పుడు ఆమె కొడుకులు ఇంకా భక్తి బాట పట్టలేదు గనుక వారికి గుర్తు లేదు. తన తరువాత కూడా తన కుటుంబానికి నా అశీస్సులు వుండాలను కోరిన నారాయణగారి కోరిక మేరకే నేను మళ్ళీ వీరింటికి వచ్చాను.
ముగ్గురు కొడుకులను, కూతురును ప్రయోజకులుగా తీర్చిదిద్ది, మనుమలను, మనుమరాళ్ళను పెంచిన మూడు తరాల మూలపుటమ్మ ఈ రాధమ్మ. ” అని ఆగారు. వింటున్న రాధమ్మ కళ్ళు చలమలే అయ్యాయి.
” స్వామీ నా మనుమడు బెంగుళూరు నుండి మీ దర్శనానికి రావలసింది. మనుమరాలికి నెలలు నిండాయి అందుకో ఏమో రాలేదు. ” గురువుగారికి నమస్కరించి అన్నదామె.
“నీ ముని మనవడిని తీసికుని వస్తాడులేమ్మా” స్వామి కంఠం మృదు గంభీరంగా పలికింది.
ఆయన పక్కనే నిలబడివున్న రాఘవ సెల్ మోగింది. పక్కకు జరిగి రెండు నిముషాలు మాట్లాడి వచ్చిన రాఘవ ముఖం సంభ్రమాశ్చర్యాలతో విప్పారి వుంది.
“శుభవార్త అందిందా?” చిరునవ్వుతో అడిగారు స్వామీజీ.
రాఘవ ముందుకువచ్చి తల్లికి నమస్కరించాడు” అమ్మా గురువుగారు ఇప్పుడు పలికినట్టే నీకు ముని మనవడు పుట్టాడు. ” అని సంతోషంగా చెప్పాడు. తరువాత స్వామీజీకి పాదనమస్కారం చేసాడు.
స్వామీజీ తన ప్రసంగం కొనసాగించారు.
“మా అమ్మను మేము పోషిస్తున్నాము అనుకోకండి. అమె వున్నన్నాళ్ళు మీ క్షేమం గురించి పలవరిస్తుంది. మీ యోగ క్షేమాలకై ఆమె పడే తపన మిమ్మల్ని రక్షిస్తూ వుంటుంది. వంశానికి మూలవేరు వంటి అమ్మ ఉండవలసింది మూలగదిలో కాదు. మీ గుండె గదిలో. భగవంతుడు భక్తికి మాత్రమే కట్టుబడతాడు. కానీ దేవకినందనుడు అమాయకమైన యశోదమ్మ తల్లిప్రేమకు కట్టుబడి పోయాడు. కవ్వం చిలికే తాడు ఆయన పొట్ట చుట్టు కట్టి, రోటికి కడితే కాదనక కట్టించుకుని దామోదరుడనిపించుకున్నాడు. అపర శంకరుడిగా భావించబడే శ్రీ శంకరాచార్యులవారు తన ఎనిమిదవ ఏట అమ్మ అనుజ్ఞ తీసుకుని సన్యసించినా, అమ్మ కిచ్చిన మాట ప్రకారం ఆమె అవసాన దశలో వచ్చి యోగాగ్నితో ఆమెకు అంత్యక్రియ జరిపించారట. అదీ మాతృభక్తి. ఎంతటి గురువుకైనా ఆదిగురువు అమ్మే అని మరచిపోకండి. “ మాట్లాడడం ముగించారు స్వామీజీ.
గురువుగారి భాషణ విన్న వారందరూ ఆత్మావలోకనంలో పడినట్టు తరువాతి అయిదు నిముషాలు ఆ హాలులో నిశ్శబ్ధం ప్రతిధ్వనించింది.
స్వామీజీకి ప్రత్యేకంగా ఆసనం వేసి భోజనం ఏర్పాటు చేసాక, కోడళ్ళు ముగ్గురు రాధమ్మను వేదిక నుండి దింపి, భోజనాలకు కూర్చున్నవారి బంతిలో మొదటి స్థానంలో ఆమెకు కుర్చీ వేసి కూర్చోబెట్టి, ఆమె ముందు బల్ల మీద అరిటాకు వేసి అక్కడినుండే వడ్డన మొదలు పెట్టారు.
పూజలు అందుకున్న అమ్మవారు మధుర దరస్మిత వదనంతో అందరి మీద కటాక్ష వీక్షణాలు ప్రసరిస్తోంది.

————— ————-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *