April 22, 2024

కథాపరిశోధనలో సామాజికాంశాలకు ప్రాముఖ్యతనొసగిన కథలు – ఔను .. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు

సమీక్ష: సి. ఉమాదేవి

 

గౌతమి సత్యశ్రీ సాహిత్యానికి సమయాన్ని కేటాయించి తన వృత్తిధర్మాన్ని నెరవేరుస్తూనే ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు శీర్షికతో కథాసంపుటిని తీసుకుని రావడం ముదావహం. పదహారు కథలున్న ఈ కథాసంపుటిలో ప్రతి కథకు సమాజంలో జరిగే సంఘటనలే నేపథ్యం. మంచి చెడుల విశ్లేషణలో కథలలోని పాత్రలు పలికే పలుకులు అందరినీ ఆలోచింపచేస్తాయి.
ఆమెలాగా ఎందరో కథ ప్రకృతి నేర్పిన పాఠమే. లక్ష్మమ్మ భర్త ఆమెను వదిలేసి వెళ్లిపోయినా భీరువై దుఃఖపడక తను కూర్చున్న చెట్టునీడే పాఠమై ఆమెలో ధైర్యాన్ని నింపుతుంది. ప్రకృతికి, స్త్రీకి ఉన్న అవినాభావసంబంధమిదే అనిపించకమానదు. పరిశీలనాశక్తి ఉండాలేగాని మన చుట్టూ ఉన్న ప్రకృతినుండే పాఠాలు నేర్చుకోవచ్చు అన్న రచయిత్రి మాటలు అక్షరసత్యం.
ఇక పునాదిరాళ్లు కథ చదివితే స్నేహపు విలువలు అర్థమవుతాయి. వేసవి సెలవులకు పెద్దమ్మ రాజేశ్వరి దగ్గరకు వచ్చిన ప్రసన్న, మంచి స్నేహం అంటే ఎలా ఉంటుంది పెద్దమ్మా అని అడిగినప్పుడు రాజేశ్వరి తన డైరీ తీసి ఇచ్చి చదవమంటుంది. కథ ముగింపులో తీర్చిదిద్దిన అక్షరాలు అలరిస్తాయి. స్నేహమన్నది అనేక రూపాలుగా, భావాలుగా ఉంటుంది. ఎలా ఉన్నా దాని ప్రధాన ఉద్దేశ్యంమాత్రం ఎటువంటి ఆర్భాటాలు, కుత్సితాలు లేకుండా స్వచ్చంగా, ఆత్మీయంగా, స్వార్థరహితంగా ఒకరి భావాలను మరొకరితే పంచుకోవడమే స్నేహం. ఈ మాటలు నిజంగా స్వర్ణాక్షరాలే.
పేరు చూసి కిక్కో-కిక్కు సరదా కథగా అనిపించినా తీరిక ఉన్న మనిషిగా విమలచేత తమ పనులు చేయించుకున్నవారు చివరకు విమల చిత్రకారిణిగా స్థిరపడినప్పుడు ఆమెకు కనీసం అభినందనలైనా అందించరు. తన కళకు తగ్గ ప్రశంసలే అసలైన కిక్కు అని విమల భావించడంతో కథ ముగింపు బాగుంది.
చైతన్య సీత మరో చక్కని కథ. సీత సూర్యం భార్యాభర్తలయాక తన కుటుంబంలోని వత్తిళ్లకు లోనవుతాడు సూర్యం. కేవలం ధనాన్ని మాత్రమే ఆశించేవారి కోరికలకు అడ్డుకట్ట వేయలేకపోతాడు. అయితే సీత స్వేచ్ఛావాయువుని పీల్చుకుని తన జీవితంలో అద్భుతాలు జరుగుతాయన్న ధీమాతో అడుగు ముందుకేస్తుంది.
అలా మొదలైంది కథ వినూత్నతను సంతరించుకున్న కథ. భార్య జూలీ మరణించడంతో రాజ్ మానసికంగా కృంగిపోతాడు. అయితే భర్త గతించిన జెన్నీని చర్చిలో వివాహం చేసుకుంటాడు. లైఫ్ ఈజ్ ఫర్ లివింగ్ అనే సందేశమిచ్చిన కథ. మనసులో చోటు ఆలోచింపచేసే కథ. నిర్లిప్తతతో ఉండే భర్తలో మార్పుగాంచిన ఇల్లాలి సంతోషం మనకు ఆనందదాయకమే.
ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు కథ ఇరు కటుంబాలను ఒక్కటిగా చేసే పెళ్లి ఎలా ఉంటే బాగుంటుంది అని విశ్లేషించడం కొసమెరుపు. ముసుగు కాస్త పెద్ద కథే అయినప్పటికీ కుటుంబాలలో జరిగే సంఘటనలకు అద్దం పట్టింది. మనం శిక్షార్హులం కథ మనసును కుదుపుతుంది. మార్పు, ఉగాది, హృదయబంధం, దేవుడే గెలిచాడు వంటి ఎన్నో మంచి కథల సమాహారంఈ సంపుటి. ఇష్టపడి చదవాల్సిన కథలనందించిన శ్రీసత్యగౌతమికి అభినందనలు.

4 thoughts on “కథాపరిశోధనలో సామాజికాంశాలకు ప్రాముఖ్యతనొసగిన కథలు – ఔను .. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు

  1. నా కథలను చదివి చక్కటి సమీక్షను పాఠకులకు అందించినందుకు ధన్యవాదాలు మీకు. మార్కెట్ లోకి బుక్ రిలీజ్ అయిన మొదటి నెలలోనే వచ్చిన మూడవ సమీక్ష ఇది.

      1. Thanks to you Umadevi గారూ. మీరు వాడిన మాటలు ‘స్వర్ణాక్షరాలు, అక్షరసత్యం’ లాంటివి మనసుకు హత్తుకున్నాయి. ఒకరు వ్రాసిన పుస్తకాన్ని చదివి, రచయిత్రి భావజాలాన్ని అర్ధం చేసుకొని నిజాయితీగా సమీక్షించడం అంత ఈజీ కాదు. థాంక్యూ వెరీమచ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *