April 20, 2024

కాలాన్ని ఓడించే నీ జ్ఞాపకాలు

రచన: సునీత పేరిచర్ల

ఎప్పటిలానే నిద్రలేచి‌
ఆఫీస్ కి రెడి అవుదామని లేచి కూర్చుంటే
పొద్దుపొద్దున్నే వానా గట్టిగానే పడుతుంది..
ఆ నిద్ర కళ్ళతోనే ఉన్నట్టుండి సడెన్ గా
నువ్ గుర్తొచ్చావు
ఇంతకుముందు రోజులు ఎలాఉండేవి
ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయో
ఊహించుకుంటుంటేనే నిద్రమత్తు
ఒక్కసారిగా వదిలింది
ఆ రోజుల్లో‌ ఇద్దరిలో
ఎవరు ముందు లేస్తే వారు
మిగిలిన వాళ్లని‌ నిద్ర లేపేవాళ్ళము
ఇద్దరికీ ఇష్టమైన ఫుడ్ ఎదైనా కనిపిస్తే
ఖచ్చితంగా షేర్ చేస్కునేవాళ్ళం
ఒకరి డైరీ ఇంకొకరికి బాగా తెలుసు.
ఈ సమయంలో ఏం చేస్తుంటావా అని అనుకుంటూ..
కాల్ చేయగానే తిట్టుకుంటూ పలకరించుకుంటూ..
సముద్రం దగ్గరికి వెళ్ళేపుడు ఖచ్చితంగా నీ జ్ఞాపకాలనీ,
నువ్వు పక్కన ఉన్నావనే అనుభూతుల్ని తీస్కెల్లేదాన్ని..
దాదాపుగా మన ఆహారపు అలవాట్లు
వ్యాపకాలు.. ఆలోచనలు అన్నీ ఒక్కటే..
అందుకేనేమో‌ అసలేమీ ఎరుగని పరిచయం
ఆజన్మ బంధంలా‌ నిలబడి మనగలుగుతుంది..
నీకు గుర్తుందో‌లేదో
మనం ఏకీభవించే విషయం లో‌ కూడా కావాలనే వాదించుకునే వాళ్ళం
చివరికి నువ్వే గెలుస్తావనుకో..
హ హ ..అది వేరే విషయం..
నువు కోపంతో తిట్టే తిట్టుకూడా
ఎంత కోపంలో‌ ఉన్న నన్ను నవ్వుకునేలా చేస్తుంది..
కానీ..
ఎందుకో‌ మరి కాలం గిల్లి మరీ
నిన్ను దూరం పెట్టింది.
అయినా దాని భ్రమ కాకపోతే
నిన్ను నన్ను వేరు చేయగల‌
వస్తువేమైనా ఉందా రా బంగారం ఈ లోకంలో ..
వాన ఆగిపోయింది..
ఈలోపు ఎదో ఫోన్ వచ్చింది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *