March 4, 2024

తామసి – 1

రచన: మాలతి దేచిరాజు

సూర్యోదయమైన కొన్ని గంటలకి,
సిటీ అవుట్ స్కర్ట్స్ లో ఒక విల్లా…
“జగమంత కుటుంబం నాదీ… ఏకాకి జీవితం నాదీ!” అంటూ మోగుతోంది రింగ్ టోను.. దుప్పటిలో నుంచి చేయి బయట పెట్టి ఫోన్ అందుకున్నాడు గౌతమ్.

“హలో.. ” అప్పుడే నిద్రలో నుంచి లేవడంతో బొంగురుగా ఉంది అతని గొంతు.

“హలో నేను…”అమ్మాయి స్వరం
ఆ స్వరం వినగానే అతని నాడీ వ్యవస్థ అప్రమత్తమైంది. ఉదయాన్నే చెవిలో అమృతం పోసినట్టు ఉందా గొంతు మధురంగా. ” ఇంకా నిద్ర లేవలేదా? ట్రైన్ మౌలాలిలో ఆగింది, ఇంకాసేపట్లో సికింద్రాబాద్ వస్తుంది. నువ్వొస్తావా స్టేషన్ కి? లేదా.. నేను క్యాబ్ లో వచ్చేయనా?” ఆపకుండా టకటకా వినిపించాయి మాటలు అట్నుంచి.

“ఎప్పుడూ ఎలా వస్తావో అలాగే రా ” బదులిచ్చాడతను.

“సరే, అయితే తొందరగా వచ్చేయ్ లేట్ చేయకు.. ఎప్పుడూ ఎలా వస్తావో అలా.. హా హా హా.. ” అని నవ్వి కాల్ కట్ చేసింది.

మెరుపు వేగంతో లేచాడు గౌతమ్ మంచంపై నుంచి.. బ్రష్ చేయడం, డ్రెస్ మార్చడం, తల దువ్వుకోవడం, కార్ కీస్ తీసుకుని గుమ్మం దాటడం క్షణాల్లో జరిగిపోయాయి. పదిహేను నిమిషాల్లో రైల్వే స్టేషన్ కి చేరుకున్నాడతను.

“దయచేసి వినండి ట్రైన్ నంబర్ ఒకటి, ఏడు, సున్నా, ఒకటి, అయిదు(17015) విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ రావలసిన విశాఖ ఎక్స్ ప్రెస్ మరి కొద్దిసేపట్లో ఆరవ నెంబరు ప్లాట్ ఫామ్ మీదకు వచ్చుచున్నది”

అప్పటికే మొదటి ప్లాట్ ఫామ్ మీదకు చేరుకున్న గౌతమ్ అనౌన్స్ మెంట్ వినగానే ఆరవ ప్లాట్ ఫామ్ వైపు పరుగు తీసాడు. ట్రైన్ ప్లాట్ ఫామ్ ని సమీపిస్తోంది (S6) అని ఉన్న సైన్ బోర్డ్ దగ్గర నిలుచున్నాడతను. ట్రైన్ వచ్చి ఆగింది S6 లో నుంచి జనం ఒక్కొక్కళ్ళు దిగుతున్నారు, అటూ, ఇటూ వెతుక్కుంటున్నాడు గౌతమ్. ఓ అయిదారుగురు దిగిన తరువాత కనిపించింది అతనికి చిరునవ్వు నవ్వుతూ ‘సీమా’. ఆమె తనని చూడగానే చేయి ఊపాడతను. సీమా కిందకి దిగి గౌతమ్ ని సమీపించింది. చుట్టూ ఎవరున్నారు, ఏంటీ.. అన్న ధ్యాస లేకుండా గౌతమ్ ని కౌగలించుకుంది తను. అతనూ ఆమెని కౌగలించుకున్నాడు. జనం చూసీ చూడనట్టు చూస్తూ వెళుతున్నారు.. ఇద్దరూ స్టేషన్ నుంచి కారులోకి చేరుకున్నారు.

“ఎలా గడిచాయి ఈ పది రోజులూ?”
డ్రైవింగ్ లో నిమగ్నమై ఉన్న గౌతమ్ ని అడిగింది సీమా.

“కూల్ “.. బదులిచ్చాడు కూల్ గా.

“అదేంటి నేను లేననే బెంగ కుంచెం కూడా లేదా! నేను అలిగాను.. పో. “అంది తను బుంగమూతి పెట్టి.

“నువ్వు లేవు అనే ఫీలింగ్ నాకుంటే కదా బెంగ పెట్టుకోడానికి!” అంటూ గేరు మార్చాడు.

“మనం కలిసి తినే డైనింగ్ టేబుల్, మనం కూర్చుని కబుర్లు చెప్పుకునే బాల్కనీ, మనం నాటిన మొక్కలు, వాటికి పూసే పూలు, ఆ పూల నవ్వులు ఎప్పటికప్పుడు నువ్వు నాతోనే ఉన్నావని గుర్తు చేస్తుంటాయి. ఇక నాకెందుకు బెంగా?” అని ఆమె వైపు ఒక లుక్ ఇచ్చాడు కొంటెగా.

గౌతమ్ భుజం పై రెండు చేతులతో దబదబా గుద్దుతోంది సీమా.

“రాక్షసుడా.. ఎక్కడ దాచి పెట్టుకున్నా తీసేస్తావ్ నా డైరిని.. “అంటూ ఇంకా.. కొట్టసాగింది.

ఆమె దెబ్బలకు తన చేతిని ఆడ్డు పెట్టి ఒక చేత్తో స్టీరింగ్ కంట్రోల్ చేస్తున్నాడతను.

“సారీ.. సారీ.. నేను కావాలని తీయలేదు ఆఫీస్ పేపర్స్ కోసం వెతుకుతుంటే అనుకోకుండా కంటపడింది… సరే… నీదే కదా అని తీసి చూసాను.. చూసాక చదవాలనిపించింది, చదివాను.. ఏం… నేను చదవకూడదా?” ఆ హక్కు తనకు లేదా, అన్నట్టు అడిగాడతను. అప్పటికే కొట్టడం ఆపేసింది తను.

“హే.. అలా ఏం కాదు.. ఎప్పటికైనా అవి నువ్వు చదవాల్సినవే.” ఆప్యాయంగా అంది.

“కానీ ఇలా ఎప్పుడుపడితే అప్పుడు కాదు.. ” అని అర క్షణం ఆగింది… తనేం చెబుతుందా అని ఆత్రంగా ఉంది గౌతమ్ కి.

“నీ పక్కన ఎవరూ లేనప్పుడు, నీకు నువ్వు కూడా గుర్తు లేనప్పుడు, నేను తప్ప నీకు వేరే ధ్యాస లేనప్పుడు, నా ధ్యాస తప్ప నీతో నేను కూడా లేనప్పుడు, నాతో మాట్లాడాలని, నా మాటలు వినాలని నీకు అనిపించినప్పుడు… అప్పుడు… అప్పుడు చదవాలి. ”

ఆ మాటలు పూర్తి అవుతుండగానే ఆమె కళ్ళలో నీళ్ళు చూసి ఓదార్చబోయాడు గౌతమ్.

“హే.. ఏంటిది? ఎందుకింత ఎమోషన్ అవుతున్నావ్. ఈజ్ ఎనీ థింగ్ రాంగ్ “. అన్నాడు.

“ప్చ్.. నథింగ్ “… కళ్ళు తుడుచుకుని చిన్నగా నవ్వింది తను.

“నీకో విషయం తెలుసా?” టక్కున అడిగాడతను.

“ఏంటి?”

“జనరల్ గా ఎవరైనా ప్రేమిస్తున్నామని నోటితో చెప్తారు లేదా లెటర్ లో రాస్తారు. కానీ నువ్వు మాత్రం కళ్లతోనూ, కన్నీళ్ళతోనూ చెప్తావ్. నీలో నాకు బాగా నచ్చేది అదే…”అన్నాడు.

ఆ మాటకి గౌరవమైన చూపు చూసింది సీమా అతని వైపు. అతను ఆమె చూపుకి బదులివ్వకుండా డ్రైవింగ్ చేస్తూనే ఉన్నాడు.. తల తిప్పి కారు లోంచి ఆకాశాన్ని చూస్తూ..

“అబ్బాయిలకి, అమ్మాయిల మనసు
అర్థం చేసుకోడం రాదని అంటుంటారు. నిజానికి అర్థం చేసుకోగలిగితే ఆడదాని మనసు కంటిపాపంత. అలాంటి కళ్ళని వదిలేసి ఒళ్ళంతా చూస్తారు చాలా మంది మగాళ్ళు. ప్చ్ ! ఆ మాటకొస్తే గౌతమ్ దొరకడం తన అదృష్టం కాదు.. వరం!” అనుకుంది మనసులో.

కార్ విల్లాస్ లోకి ఎంటర్ అయ్యింది. పార్క్ చేసి దిగారు ఇద్దరు. లిఫ్ట్ లో మూడో ఫ్లోర్ చేరుకున్నారు. కాలింగ్ బెల్ నొక్కాడు గౌతమ్. లోపలి నుంచి తలుపు తెరిచింది షీబా…

షీబా ని చూడగానే ఆనందంతో ఉత్సాహంగా హత్తుకోబోయింది సీమా.

“హాయ్ డియర్.. హౌ యు.. మిస్ యు రా.”అంటూ షీబా కూడా నవ్వుతూ పలకరించింది తనని.

“ఏంటి పదిరోజులకే ఇలా చిక్కిపోయావు?” అడిగింది షీబా.

“నీ మీద బెంగతో.”బదులిచ్చింది సీమా నవ్వుతూ.

“సరే, సరే ఫ్రెష్ అయ్యి రా టిఫిన్ చేద్దువు గాని.. నువ్వు కూడా “అంది గౌతమ్ వైపు చూసి.

పది నిమిషాల్లో ఫ్రెష్ అయ్యి వచ్చారిద్దరూ… ముగ్గురూ కలిసి టిఫిన్ చేయసాగారు.

“ఇంకేంటి సీమా, కబుర్లు? ఇంట్లో అందరూ బావున్నారా?” అడిగింది షీబా.

“మ్.. ఫైన్..”నోట్లో ఇడ్లీ ముక్క నములుతూ చెప్పింది.

“రంజాన్ ఎలా జరిగింది?”

“యాజ్ యూజ్వల్.. ఇంతకీ నీ సంగతేంటి.. ? రిజల్ట్స్ ఎప్పుడు?”

“నెక్స్ట్ మంత్.. ఈ సారి జాబ్ కన్ఫాంలే”

“హే ఈవినింగ్ విల్ గో అవుట్.. షాపింగ్ చెయ్యాలి!”సీమా అలా అనగానే కంగారు పడి, “దయచేసి ఆ కార్యక్రమానికి నన్ను కాస్త దూరంగా పెట్టగలరని మనవి.”దండం పెడుతూ అన్నాడు గౌతమ్.

“నీతో పని లేదులేవోయ్.. మేం వెళ్తాం గానీ…” అంది సీమా, షీబా వైపు చూసి కన్ను కొడుతూ

“థ్యాంక్స్” అని లేచి వెళ్ళిపోయాడు గౌతమ్…. షీబా నవ్వింది.

**********

GAYATRI PUBLIC SCHOOL HYDERABAD

సూర్య కాంతి సైన్ బోర్డు మీద పడటంతో మెరుస్తున్నాయి అక్షరాలు.

స్కూల్ మొదలై దాదాపు రెండు గంటల పైనే అయ్యింది. నాలుగో పీరియడ్ నడుస్తోంది.

“అట జని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ…”అని ప్రవరుని స్వగతంలోని పద్యం పాడుతోంది సీమా. పిల్లలు శ్రద్ధగా వింటున్నారు. తరగతి గది అంతా ఆమె స్వరమే నిండి ఉంది. ఆమె స్వరం అలాంటిది. ఆ పద్యం ఏమైనా తక్కువా మరి!

అద్భుతమైన సమాసాలతో కూడిన పద్యం అది. సీమా పద్యం పాడుతుంటే పక్క తరగతి టీచర్లు పాఠం ఆపి మరీ వింటారు. అంత దివ్యంగా పాడుతుంది తను. పేరుకి ముస్లిం అమ్మాయి అయినా ఆమె ఉచ్చారణ చూస్తే అసలు ఆమె ముస్లిం అమ్మాయి అని ఎవరూ అనుకోరు. తెలుగు భాష మీద మమకారంతో ‘యం.ఏ.’ తెలుగు లిటరేచర్ చేసింది. ఎలాంటి పద్యాలైనా అవలీలగా పాడుతుంది. వృత్యానుప్రాసాలంకారంతో కూడిన పద్యాలైనా స్పష్టంగా పాడుతుంది.

అప్పుడప్పుడు కవితలు కూడా వ్రాస్తూంటుంది. అలా తను డైరీలో వ్రాసుకున్న కవితని చదివాడనే కారులో వచ్చేటప్పుడు గౌతమ్ ని కొట్టింది…

లంచ్ బెల్ మోగింది. పిల్లలు క్యారేజీలు విప్పి కబుర్లు చెప్పుకుంటూ తింటున్నారు. టీచర్లు స్టాఫ్ రూమ్ లో తింటున్నారు. సీమా, అరుణ ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు. గత మూడేళ్ళుగా వాళ్ళు కలిసే తింటున్నారు.

“ఏంటి, ఈ రోజు స్పెషల్?” అడిగింది అరుణ బాక్స్ ఓపెన్ చేస్తూ.

“టమాటా పప్పు, కాకరకాయ ఫ్రై!”అని అరుణ బాక్స్ లో కొంచెం ఫ్రై వేసింది సీమా.

కాకరకాయ తో అన్నం కలిపి ముద్ద నోట్లో పెట్టుకుంది అరుణ. కమ్మని రుచికి ఆమె కళ్ళు పెద్దవైయ్యాయి.

“కాకరకాయ కూడా ఇంత బాగా వండొచ్చు అని ఇప్పుడే తెలిసింది.” అన్నం ముద్ద నోట్లో ఉండగానే అంది ఆ మాట.

సీమా సన్నగా నవ్వింది.

“ఎలా చేసావ్? రెస్పీ చెప్పవా నాక్కూడా?”

“చేసింది నేను కాదు. షీబా “అంది, ముద్ద కలుపుతూ.

“ఓ! చాలా బాగా చేసింది.”

ఇద్దరూ తింటున్నారు.

“సీమా.. ఒకటి అడుగుతా చెప్తావా?” అంది అరుణ.

“అడుగు.. ”

“గౌతమ్ కి నువ్వంటే ఇష్టమా?… షీబా అంటే ఇష్టమా?” నాన్చుతూ అడిగింది.

“షీబా అంటే ఇష్టం!” క్షణం జంకు లేకుండా సీమా చెప్పిన సమాధానం విని ఆశ్చర్యంగా చూసింది అరుణ.

ఆమె ఇంకా తేరుకోకుండానే.. “నేనంటే ప్రేమ!” చెప్పింది సీమా..అరుణ మరింత ఆశ్చర్యపోయేలా.

“అదేంటే! ఇదేం సమాధానం?”

“నువ్వు అడిగావు.. నేను చెప్పాను.. అంతే” భుజాలెగరేసింది.

అయోమయంగా చూస్తోంది అరుణ. అన్నం కూడా తినాలనిపించట్లేదు. తనకి ఎంతైనా స్నేహితురాలు. ఇలాంటి సమాధానం విని ఎలా జీర్ణించుకోగలదు? అందుకే ఉండబట్టలేకపోయింది.

“నువ్వూ, గౌతమ్ ముందు నుంచి ప్రేమించుకున్నారు. తను మధ్యలో వచ్చింది. తన దారి తనని చూసుకోమని చెప్పి మీరిద్దరూ పెళ్ళి చేసుకుని హాయిగా ఉండచ్చు కదా?”బాక్స్ కడుగుతూ అన్నది అరుణ.

“పెళ్ళి చేసుకుంటేనే హాయిగా ఉండగలమా? ఇప్పుడు కూడా మేం హాయిగానే ఉన్నాం!”తాపీగా చెప్పింది తను.

“అది కాదే.. నా మాట విను. నలుగురూ నాలుగు రకాలుగా అనుకుంటారు. అం….”

తన మాట పూర్తి కాకుండానే చేయి చూపించింది సీమా చాలు అన్నట్టు.
అరుణ విస్తుపోయి, “నీ… మంచికే… కదా?” అంది నెమ్మదిగా…

“మంచి చెప్పాలి.. చెప్పిందల్లా మంచి అనుకోకూడదు!”అంది సూటిగా సీమా.
అరుణ మారు మాట్లాడలేకపోయింది. మరి ఆ మౌనం సీమా మాటలు అర్థమయో, అవకో అన్నది ఆమెకే తెలియాలి!!!

*

CYBER GATE BAY

అనేక సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉండే పెద్ద భవనం అది. గౌతమ్ ఆఫీసు కూడా అందులోనే ఉంది. సమయం ఒంటి గంట కావొస్తుంది మీటింగ్ హాల్ లో కుర్చుని ఉన్నారు స్టాఫ్ అంతా.

హెచ్. ఆర్ మాట్లాడుతున్నాడు.
“మై డియర్ లేడిస్ అండ్ జెంటిల్ మెన్!
నెక్స్ట్ వీక్ ఫ్యామిలి డే ఉంది. సో అందరూ మీ మీ ఫ్యామిలీస్ తో రావాలి. ప్లీజ్ డోంట్ స్కిప్!” అన్నాడు.

“ఇది వార్నింగా, రిక్వెస్టా?” గొణుగుతూ అన్నాడు శరత్. గౌతమ్ నవ్వాడు. మీటింగ్ ముగిసింది.

అందరూ బయటకి వచ్చి సరాసరి లంచ్ కి వెళ్ళిపోయారు.

“ఈ మధ్య ఈ డేస్ ఎక్కువైపోతున్నాయిరా…” కొద్దిగా విసుగు తో అన్నాడు శరత్.

“దేని గురించి రా?” క్యాజువల్ గా అడిగాడు గౌతమ్.

“లేకపోతే ఏంట్రా? మదర్స్ డే, ఫాదర్స్ డే, ఫ్రెండ్షిప్ డే, లవర్స్ డే, ఉమెన్స్ డే, ఆ డే, ఈ డే, అని ఉన్నవి చాలక ఇప్పుడు ఫ్యామిలీ డే అంట కొత్తగా! ఛీ.. ఛీ!! ఇప్పుడు ఈ డే కి రావడానికి మా ఆవిడ ఎంత షాపింగ్ చేస్తుందో, ఏం హింస పెడుతుందో ద్యావుడా…” అని పైకి చూసి చేతులు జోడించాడు.

గౌతమ్ నవ్వసాగాడు.

“నవ్వరా రేయ్ నవ్వు.. నాదింకా బెటర్ ఒకత్తే ఉంది! తమరసలే ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు… తమరి సంగతి చూస్కోండి మరి!” అన్నాడు వ్యంగ్యంగా.

గౌతమ్ నవ్వు ఆగిపోయింది. ఇప్పటివరకు ఏదైనా ఫంక్షన్ కి వెళ్తే ఒక్కడే వెళ్ళేవాడు. సీమా తరఫున ఫంక్షన్ అయితే తనతో.. షీబా తరఫున అయితే తనతో. కానీ ఈ సారి తానుచిక్కులో పడ్డాడు. ఆఫీసులో పెళ్ళి అయ్యింది అని చెప్పుకున్నాడు కానీ ఎప్పుడూ ఎవరికీ తన ఫ్యామిలీని పరిచయం చేసింది లేదు. ఆ అవసరం, అవకాశం రెండూ రాలేదు. తనకి బాగా క్లోజ్ అయిన వాళ్లకి మాత్రమే తన గురించి తెలుసు. ఇప్పుడేం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి!

దాదాపు ఆరు నెలలుగా గౌతమ్, సీమా, షీబా సహజీవనం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఎదుర్కోలేదు. బహుశా ఇదే వాళ్ళ మధ్య ఉన్న బంధానికి సరైన నిర్వచనం చెప్పే సందర్భమేమో! మరి ఇది అతనికి పరీక్ష అవుతుందో, శిక్ష అవుతుందో చూడాలి.

**********

డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చుని భోజనం చేస్తున్నారు ముగ్గురూ..

గౌతమ్ ‘ఎవర్ని తీసుకెళ్ళాలి, ఎవర్ని తన భార్యగా ప్రపంచానికి (తన చుట్టూ ఉన్న వాళ్లకి) పరిచయం చేయాలి’ అనే సందిగ్ధంలో ఉన్నాడు.

“ఏంటి గౌతమ్ అలా ఉన్నావు.. ఒంట్లో బాలేదా?”ప్రశ్నించింది సీమా.

“అబ్బే, ఏం లేదు.”

“మరి కలుపుతున్నావు గాని తినవేం?”
తినడం మొదలుపెట్టాడతను.

ఏదైనా ఉంటే తనే చెప్తాడు కదా అనుకున్నారు ఇద్దరూ.

“నెక్స్ట్ వీక్ ఆఫీస్ లో ఫ్యామిలీ డే ఉంది. అందరూ ఫ్యామిలీతో రావాలంట. ” చెప్పాడు.

“అందులో ఏముంది వెళ్దాం ” అని షీబా వైపు చూసింది సీమా.

షీబా కూడా చూస్తోంది. ‘ముగ్గురం వెళ్దామా,’;అన్నట్టుంది షీబా చూపు..

దానికి సమాధానంగా,
“తప్పేముంది? ఫ్యామిలీతో రావాలన్నది కాన్సెప్ట్.. మనం కూడా ఫ్యామిలీయే కదా!” అంది సీమా.

ఆమె చెప్పినంత తేలిగ్గా సమాజం దీన్ని ఒప్పుకోదు. ఈ సంగతి ముగ్గురిలో ఆమెకే బాగా తెలుసు కానీ ఆమె సమాజాన్ని ఖాతరు చేయడం మానేసి కొన్ని ఏళ్ళయ్యింది.

“మనం అనుకున్నంత ఈజీ కాదు కదా సీమా?” అన్నాడు గౌతమ్.

“ఇంతకీ ఈవెంట్ ఎప్పుడు?” అడిగింది సీమా.

“నెక్స్ట్ ఫ్రైడే”

“నాకు ఎలాగూ స్కూల్ ఉంటుంది.. సో.. మీరిద్దరూ వెళ్లి రండి.”

గౌతమ్ విస్తుపోయి చూస్తున్నాడు.
“అదెలా సీమా?”

“గౌతమ్ ప్లీజ్… ఇష్యూని కాంప్లికేట్ చేయొద్దు… ఇలాంటి పరిస్థితుల్ని పాజిబిలిటీస్ ని బట్టి హ్యాండిల్ చెయ్యాలి.” గట్టిగా చెప్పింది…

గౌతమ్ ఏమీ మాట్లాడలేదు. ఈ మెలోడ్రామాలో తనది ప్రేక్షక పాత్ర అనుకుని షీబా కూడా ఏమీ మాట్లాడలేదు. ఇలాంటి పరిస్థితి మళ్ళీ రాకూడదు అనుకుంది. కానీ అంతకు మించినదేదో రాబోతుందని ఆ క్షణం ఆమెకి తెలీదు.

ముగ్గురి భోజనం ముగిసింది మౌనంగా. ఎవరి బెడ్ రూమ్ లోకి వాళ్ళు వెళ్ళారు.

కాస్సేపటికి సీమా గదిలోకి వచ్చాడు గౌతమ్..

అతని రాకను గమనించి ఏదో పుస్తకం చదువుతున్న సీమా, “ఏంటి గౌతమ్?” అనడిగింది..

“ఫ్రైడే పబ్లిక్ హాలిడే సీమా!” అన్నాడు.

తను అనాలోచితంగా స్కూల్ వంక పెట్టి వాళ్ళిద్దర్నీ వెళ్ళమని చెప్పిన మాటలు గుర్తొచ్చాయి సీమాకి.

“గౌతమ్… నేను నీ సొంతం అని నీకు, నాకు తెలిస్తే చాలు.. ప్రపంచానికి తెలియాల్సిన పని లేదు.. అందుకే అలా అన్నాను.”

కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయాడు.

“నువ్వు మనస్పూర్తిగానే తనని తీసుకెళ్ళమంటున్నావా.. ?”

“మ్… ”

“అక్కడ అందరూ తనే నా భార్య అనుకుంటారు.. నా భార్యగానే తనని గౌరవిస్తారు.. అలాంటి గౌరవం పొందాలని నీకు లేదా.. ?” ఆమె చేయి పట్టుకుని అడిగాడు…

కన్నీళ్లను దిగమింగుతూ, అతని చేతిని గట్టిగా పట్టుకుని ముద్దు పెట్టింది.

“నాకు.. నీ స్నేహం ముఖ్యం.. నీ ప్రేమ ముఖ్యం.. నీ వాత్సల్యం ముఖ్యం.. నీ పక్కన భార్య అనే స్థానం కన్నా
నీ మనసులో నాకున్న స్థానం ముఖ్యం.. నా జీవితానికి ఎలాంటి గుర్తింపు అక్కర్లేదు. నువ్వు నన్ను గుర్తుంచుకుంటే చాలు గౌతమ్… ” అంటూ అతని ఎదపై వాలి కన్నీళ్లు పెట్టుకుంది…

ఆమెని హత్తుకుని ఓదారుస్తూ… “నిన్ను మర్చిపోవడం అంటే.. ఊపిరి తీసుకోకుండా బతకాలనుకోవడమే సీమా…”

ఆ మాట అతని పెదాలపై నుంచి వచ్చినప్పటికీ, ఆమెకి మాత్రం అతని గుండె చప్పుడులో వినిపించినట్టుగా ఉంది…

*

బాల్కనీలో నిలబడి వెన్నెల్ని చూస్తోంది షీబా..

నిండు పున్నమి.. చుట్టూ చుక్కలు.. నల్లని ఆకాశం..

చీకటి తన గతమైతే, వెన్నెల తన నిజం.. చుక్కలు మాత్రం అప్పుడప్పుడు వచ్చే కన్నీళ్లు.

ప్రకృతిని తన పరిస్థితితో పోల్చుకుని, ఆనందానికి, బాధకి మధ్య ఉన్న సన్నని రేఖపై ఊయలూగుతోంది.. ఆమె మనసు..

తన వెనక వచ్చి నిలుచున్న గౌతమ్ ని గమనించి అడిగింది.

“ఎంత సేపైంది వచ్చి.. ?”

“లెక్కగట్టి చెప్పలేనంత సేపు..” చిరునవ్వుతో చెప్పాడు.

“ఒకటి అడుగుతా చెప్తావా.. ?” అంది, వెన్నెల వైపు చూస్తూ.

“అడుగు.. ”

“తను చెప్పింది కాబట్టి నన్ను తీసుకు వెళతావా? లేక నీకు అనిపించి తీసుకు వెళతావా?”

“ఇది ప్రశ్నా? అనుమానమా?”

“అనుమానిస్తున్నానా, అని నన్ను నేను వేసుకునే ప్రశ్న.. ప్రశ్నించే అంత ధైర్యం చేయగలనా, అని నా మీద నాకు అనుమానం అనుకో..” అతను నవ్వాడు..

“ఎందుకు నవ్వు… ?”

“నువ్వు కూడా తనలాగే మాట్లాడుతున్నావ్… అందుకు..”

ఇప్పుడు ఆమె నవ్వింది.

“ఇదే ప్రశ్న.. నేనడిగితే… ఏమంటావ్.. ?”

“కొన్ని సార్లు అభిప్రాయాలు చెప్పడం కన్నా.. మౌనంగా ఉండటమే మంచిది..” అని వెళ్ళిపోయింది షీబా..

ఆమె అలా ఎందుకు అన్నదో ప్రస్తుతానికది అప్రస్తుతమైనదిగా అనిపించినా.. ఆ మాటకి అర్ధం అతనికి త్వరలోనే తెలియబోతుంది..

*
అనురాగ్ గాంధి ! ఈ పేరు తెలియని వారుండరు. పుస్తకాలు, నవలల ప్రభావం తగ్గి సినిమాలూ, డైలీ సీరియల్స్ రాజ్యం ఏలుతున్నప్పటికీ, తన రచనలతో పాఠకులకు చేరవువుతూనే ఉన్న రచయిత.

ఇటీవలే అతను రాసిన ‘నీరెండ’ నవలని సినిమాగా రూపొందించారు. అది కూడా సూపర్ హిట్. యదార్థ సంఘటనల ఆధారంగా రచనలు చేయటంలో అతనిది అందెవేసిన చెయ్యి. ‘నీరెండ’ కూడా అలాంటిదే. ప్రేమించిన వాడ్ని పెళ్ళి చేసుకోడానికి ఒక అమ్మాయి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది? ఎలాంటి సాహసాలు చేసిందీ? చివరికి ఆ ప్రేమించినవాడే తనని తార్చడానికి సిద్ధపడితే అతన్ని చంపి, ఎలా చట్టం కళ్ళు గప్పి తప్పించుకుంది అన్నదే ఆ కథాంశం.

మధురై లో జరిగిన ఒక యదార్థ సంఘటనకి, తనదైన శైలిలో కాల్పనికత జోడించి వ్రాసిన ఆ నవల పాఠకుల హృదయాలు దోచుకుంది. క్లైమాక్స్ లో ఆద్యంతమూ ఉత్కంఠాభరితంగా సాగిన అతని రచన చూస్తే పాఠకులందరూ ఆశ్చర్య పోవాల్సిందే! సినిమాలో చూసినా అంతే ఉద్వేగం కలుగుతుంది.

చేతన్ భగత్, యండమూరి, తరవాత ఇతని నవలలే ఎక్కువగా సినిమాలుగా రూపు దాల్చాయి…

అలా ఆయన కొత్త నవల ఏదైనా రాసి ఉంటే, దాన్ని సినిమాగా తీద్దామనే ఉద్దేశ్యంతో అతని కోసం హాల్ లో ఎదురు చూస్తున్నాడు ప్రొడ్యూసర్ రామనాధం.. లోగడ అతను తీసిన రెండు సినిమాలు ఘోర పరాజయం పాలైయ్యాయి..

ఈసారైనా విజయం వైపు పరుగులు తీయాలని గాంధీని ఆశ్రయించాడు.. మెట్లు దిగుతూ హుందాగా నడిచొస్తున్నాడు గాంధీ..

అతన్ని చూడగానే నమస్కరించాడు రామనాధం.. తిరిగి నమస్కరించి, అతనికెదురుగా సోఫా లో కూర్చున్నాడు గాంధీ.

“గాంధీ గారూ.. పరిస్థితి ఏమీ బాలేదు సుమండీ.. కొత్త కథలు లేక, రచయితలు, దర్శకులు కొత్తగా రాయలేక, వేరే దిక్కు లేక మిమ్మల్ని ఆశ్రయించాను సుమండీ.. కావున తమరు నా యందుదయుంచి… ” అంటుండగానే ఒక లుక్ ఇచ్చాడు గాంధీ. రామనాధం మారు మాట్లాడకుండా కూర్చున్నాడు..

“కొత్తగా ఇంకేం మొదలు పెట్టలేదు.. మొదలు పెట్టి, పూర్తయితే నేనే కబురు చేస్తాను.. వెళ్లి రండి.. ” అని దండం పెట్టాడు గాంధీ.

“ఆ మాట అన్నారు చూడండి.. అది చాలు.. సుమండీ.. “అని వంగి వంగి దండాలు పెడుతూ వెళ్ళిపోయాడు రామనాధం.

తన రైటింగ్ రూమ్ లోకి రాగానే టేబుల్ మీద ఉన్న ఇన్విటేషన్ లెటర్ చూసి అందుకున్నాడు గాంధీ.

కళ్ళతోనే ఇన్విటేషన్ చదివాడు… ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో జరిగే ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా ఆహ్వానిస్తూ వచ్చిన ఇన్విటేషన్ అది.. చూపు తిప్పి గోడకున్న క్యాలండర్ వైపు చూసాడు.

శుక్రవారం!

గాంధీ వెళుతున్న ఈవెంట్, గౌతమ్ తనతో షీబాని తీసుకెళ్ళబోతున్న ఈవెంట్ రెండు ఒకటే!

*

ఇంకా వుంది

12 thoughts on “తామసి – 1

  1. Wow Aunty really Appreciable, mee story loni characters…. Vaalla alochanaatheeru chaala baagundi, oka manchi movie naa kallamundhu choosthunnanu e story tho.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *