April 23, 2024

దండోపాయం

రచన: వి ఎస్ శాస్త్రి ఆకెళ్ళ

సుబ్బారావు, ఇరవై రెండేళ్ల జీవితంలో సింగల్ బెడ్ నుండి డబల్ బెడ్ కి మారిన కొత్త రోజులు. ప్రక్కన మల్లెపూల సువాసనలు. పదిహేను రోజులుగా అలవాటు పడిన సహవాసం. రెండు రోజుల వ్యాపార ప్రయాణం తరువాత, నిద్రాదేవత గాఢ పరిశ్వంగం.
అర్ధరాత్రి తలుపు చప్పుడు. పాపం ఎంత సేపటి నుండి కొడుతున్నారో, కొండచిలువలా చుట్టుకున్న పావనిని విడిపించుకుని సుబ్బారావు మంచం మీద నుండి లేచి కూర్చున్నాడు.
ఇంత అర్ధరాత్రి వచ్ఛేదెవరు. కళ్ళు నులుముకున్నా, కనిపించని రేడియం డయల్ గడియారం సంఖ్యలు. నెమ్మదిగా లేచి , నిద్ర మత్తు తగ్గేవరకూ, మంచమ్మీదే కూర్చుని తరవాత సుబ్బారావు తలుపు తీయడానికి లేచేడు.
అప్పుడు గడియారం సంఖ్యలు కనిపించేయి. రాత్రి రెండున్నర. సుబ్బారావు గది తలుపు దగ్గరగా చేరేసి, వరండా లైటు వేసి వీధి తలుపు తీసేడు.
ఎదురుగ గోవర్ధన్, చిన్ననాటి మిత్రుడు దీర్ఘ రోగిలా వున్నాడు. జుట్టు, గడ్డం బాగా పెరిగి, గుంతలు పడిన కళ్ళతో చాలా రోజులుగా నిరాహారంగా ఉన్న వాడిలా చిక్కి శల్యంగా కనిపిస్తున్నాడు.
తలుపు తీసి తియ్యగానే, గోవర్ధన్ సుబ్బారావుని కాగలించుని పెద్దగా ఏడవటం మొదలెట్టేడు. సుబ్బారావు గాభరా పడ్డాడు. గోవర్ధన్ అసలే కాస్త జులాయిగా ఉండేవాడు, ఏమిటి చేసి కొంప మీదకి తెచ్చేడో అనుకుంటూ.
“ముందు ప్రశాంతంగా కూర్చో, మంచినీళ్లు తెస్తానుండు” అంటూ సుబ్బారావు కుర్చీ చూపెట్టేడు.
“ఇక్కడ వద్దు, బయట వీధి అరుగు మీద కూర్చుందాం.
“క్షమించరా ఈటైంలో వచ్చి నిన్ను ఇబ్బంది పెడుతున్నందుకు. నా చిన్నప్పటి నుండి నా అన్ని విషయాల్లో ఓ గురువులా సహాయంగా వున్నావు. ఇప్పుడు కూడా నువ్వే ఆదుకోవాలి” అంటూ గోవర్ధన్ ఇంట్లోకి రాకుండా వీధి అరుగు మీద కూర్చున్నాడు.
సుబ్బారావు మంచినీళ్ల గ్లాసు గోవర్ర్దనానికి ఇచ్చి, అరుగు మీద కూర్చున్నాడు.
* * *
విషయంలోకి వెళ్లేముందు సుబ్బారావు – గోవర్ధన్ మిత్రత్వం గురించి కొంచెం చెప్పుకోవాలి.
గోవర్ధన్ తండ్రి రైల్వే టికెట్ కలెక్టర్. ఆరుగురు సంతానంలో ఇతగాడు ఐదోవాడు.ఇద్దరు అక్కల తరవాత అన్న, మరొక అక్క , వీడు ఆఖర్న చెల్లి. చాలీచాలని జీతం. వీళ్ళ అమ్మ ఒద్దికగా సంసారాన్ని నడుపుకొస్తున్నది. ఆడ పిల్లలు అన్న అంటే ఆవిడకి చాలా చాలా ప్రేమ. వీడి దురదృష్టమో ఏమో కానీ, ఇంట్లో నాన్న తప్ప మరెవరూ అభిమానంగా – ప్రేమగా ప్రవర్తించరు.
గోవర్ధన్ చదువు మున్సిపల్ బడిలోనే. హై స్కూల్ గవెర్నమెంటుదే. వాళ్ళ నాన్న నేర్పిన సంస్కారం ఒద్దికగా పొదుపుగా ఉండటమే. ఇంటర్మీడియట్ పరీక్షలో అరవై మంది పిల్లల్ని రూంలో ఓ చిన్న కాగితమ్ముక్క దొరికిందని డిబార్ అయ్యిన వాళ్ళల్లో ఇతడు కూడా ఉండటం.
సహవాసం బలపడాలంటే సమయం ఉండాలి. సుబ్బారావు – గోవర్ధన్ జంటగా తిరగటం వలన అది అభేద్య మిత్రత్వంగా రూపు దిద్దుకుంది. ఓ దిశా నిర్దేశకుడులా, గురువులా. సమవయస్సు ఐనా, సుబ్బారావుని ఓ గురువులానే గోవర్ధన్ భావిస్తాడు.
సుబ్బారావుకి గోవర్ధన్ నచ్చుబాటుకి కారణం, నిష్కల్మషమైన మాట తీరు, మన్నన చూపటం. అన్నిటికి మించి, ఇచ్చిన సలహాని తూ చ తప్పకుండా చెయ్యటం.
రోజూ ఊరు చివరన వున్న ఆంజనేయుడి గుడికి ప్రతీ సాయంత్రం వెళ్ళటం మిత్రులిద్దరికి అలవాటు. ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా.
ఇంటర్ పరీక్షలు అవగానే ఓ రోజు “ఈ ఖాళీ సమయం చాలా బోర్ కొట్టేస్తున్నది, ఏదైనా సలహా ఇవ్వరా సుబ్బూ.” అంటూ గోవర్ధన్ మొరపెట్టుకున్నాడు.
“నీకు బాగా నచ్చిన సబ్జెక్టు ఎదో చెప్పు” సుబ్బారావు.
“మెషిన్ దగ్గర పని చెయ్యటం చాలా ఇష్టం. ఎందుకు?” గోవర్ధన్ సమాధానం.
“ఒకప్పుడు ఇంటర్ పాస్ అయ్యి, మళ్ళా ఇంకో మూడేళ్లు డిగ్రీ చదవాలి కదా. తరువాత ఉద్యోగ ప్రయత్నం. న్నేళ్లకి దొరుకుతుందో చెప్పలేం. అదే ఏ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉందనుకో మీ అన్న బియ్యే బీఈడి అయ్యేలోపు నువ్వు వుద్యోగం సంపాదించొచ్చు. మీ నాన్న ఒప్పుకుంటారా? అడిగిచూడు”. సుబ్బారావు గోవర్ధన్ గోల పడలేక చీకట్లోకి ఓ అస్త్రం సంధించేడు.
రెండురోజులు సుబ్బారావుకి గోవర్ధన్ కనిపించలేదు. ‘హమ్మయ్య’ అని సుబ్బారావు అనుకునే లోగానే చేతిలో అడ్మిషన్ కాగితంతో గోవర్ధన్ ప్రత్యక్షమయిపోయేడు.
“గురూ అద్భుతం ఐటీ ప్రిన్సిపాల్ దయతలచి సీటు ఇస్తానన్నాడు. మానాన్న ఏ మూడ్లో వున్నారో గాని, విషయం చెప్పగానే ఊం అన్నారు. ఈ విషయం ఇంకా ఎవరికీ చెప్పలేదు. ట్రైన్ దిగి నీదగ్గరకే వస్తున్నా నాన్న డబ్బులు ఇస్తే రేపు వెళ్లి జాయినింగ్ ఫీజు కట్టేస్తా. నన్ను ఆశీర్వదించు.” అంటూ గోవర్ధన్ సుబ్బారావు కాళ్ళని చేత్తో తాకేడు.
“డబ్బులకి అవసరమైతే నా దగ్గరకి రా. మొహమాటం వద్దు. అల్దిబెస్ట్” అంటూ గోవర్ధన్ని ఆలింగనం చేసుకున్నాడు సుబ్బారావు చెమరుస్తున్న కళ్ళతో.
అంతే, మెషినిష్ట్ ట్రేడ్ ట్రైనింగ్ రెండేళ్లు సుబ్బారావు ప్రశాంతంగానే వున్నదని చెప్పుకోవాలి. మళ్ళీ గోవర్ధన్ గోల మొదలు. ఇంటర్ రిజల్టు కూడ రాలేదు. అంటే మొత్తం సెక్షన్ని విత్ హెల్డ్ చేసేరు.
సుబ్బారావు డబ్బులు ఇచ్చి, ఇంటర్ పరీక్షలకి గోవర్ధన్ ని మళ్ళీ కట్టించేడు. పుస్తకాలకి, నోట్స్ లకి ఏర్పాటు చేసేడు. ఈలోగా ఐటిఐ పాస్సయ్యేడు గోవర్ధన్. పావలా ధరవున్న ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ తో కుస్తీ మొదలు పెట్టించేడు సుబ్బారావు, అప్రెంటిస్ ట్రైనింగ్ ఉద్యోగాలకి. ఇంటర్ లాంగ్వేజెస్ పూర్తయ్యేలోగా రెండు మూడు ఇంటర్వ్యూలు అయ్యేయి. అవకాశం రాలేదు. గ్రూప్ సబ్జెక్టులకు రెండోవిడతగా ఫీజు కట్టించేడు.
అదృష్టవంతుడిని చెడిపేవాళ్ళుండరు. గోవర్ధన్ విషయంలో వాళ్ళ అమ్మ శాపనార్ధాలున్నాలాంగ్వేజెస్ పాస్సయ్యేడు. రాష్ట్ర శాఖలో ఒక ఇంజనీరింగ్ విభాగంలో నెలకి నూటయాభై స్టైపెండ్ మీద రాజధానిలో కూలికి ఉద్యోగంని దొరికింది. పేరుకే ఒక సంవత్సరం, కానీ, మూడేళ్లపాటు రాచి రంపాన పెట్టేరు. సందడిలో సందడిగా గ్రూప్ మూడు సబ్జెక్టులలో రెండు పాసయ్యి ఒకదానిలో తప్పెడు.
గోవర్ధన్ వాళ్ళ నాన్న రిటైర్ అయ్యేలోగా పెద్ద ఆడపిల్లలకి పెళ్లిళ్లు జరిపేరు. ఇద్దరు అన్నదమ్ముల పెళ్లిళ్లకు చెరో అమ్మాయిని ప్రహారిగా నిలిపి.
పావలా ఎంప్లాయిమెంట్ న్యూస్ ధర అర్ధరూపాయి తరువాత రూపాయీ అయ్యే సమయానికి గోవర్ధనం ఉద్యోగం కేంద్ర ప్రభుత్వ సంస్థ అప్పోయింట్మెంట్ దగ్గర ఇలా ఇక్కడ ఆగింది.
అంటే ఇప్పుడు చెబుతున్న కధ ఇంచుమించుగా నలభై సంవత్సరాల క్రితంది. ఇప్పుడు కథలోకి ముందుకి పోదాం.
* * *
“జాయినింగు డేట్ నాలుగురోజులుంది. మా జీఎం రిజైన్ చేస్తా అంటే ఒప్పుకోవడం లేదు. భోజనం కూడా లేదు. నీ పెళ్ళికి వచ్చి వెళ్లిన వెంటనే జాబ్ఆఫర్ వచ్చింది. ప్రతీరోజూ కాళ్లుపట్టుకు బ్రతిమాలుతున్నా, ఏమిటి చెయ్యాలో తోచటం లేదు. ఏదైనా సలహా ఇస్తావని నీ దగ్గరకి వచ్చా. మా చిన్నక్కకి పెళ్లి కుదిరిందని నాన్న చెప్పేరు. ఇంకో ఘోరమైన వార్త ఏంటంటే మా భయ్యాగాడు ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. మా వాళ్ళు వాడిని ఇంట్లోంచి గెంటేశారు” గోవర్ధన్ వాక్యం వాక్యానికి రొప్పుతూ చెప్పేడు.
“మా జీఎం కి నలుగురు ఆడపిల్లలు. ఐనా ఇంత పట్టుదల, ‘నువ్వు ఉద్యోగం చూసుకుని వెళ్ళిపోతే ఎలాగోయ్. ఇంజనీరింగ్ సెక్షన్ లో నీకు మంచి పేరు వుంది. మళ్ళీ నీలాంటివాడు మాకు ఎక్కడ దొరుకుతాడు. ప్రభుత్వమ్ కూడా ఇప్పుడు అప్రెంటిస్ ఎంపిక మీద నిషేధం పెట్టింది’ అంటున్నాడు.
“పోనీలే కనీసం ఇక్కడికైనా వచ్చేవు. ముందు ప్రశాంతంగా వుండు. నన్ను ఆలోచిన్చానియ్యి. ఈలోగా నీకు తినడానికి ఏమైనా లోపల నుండి తెస్తాను” అంటూ సుబ్బారావు ఇంట్లోకెళ్ళి రెండు ఆపిల్స్ ఓ నాలుగు అరటిపళ్ళు తెచ్చేడు.
“సంస్థకి ఎంతో చేసేస్తున్నానన్న ఫీలింగ్. అలాగే కనియ్యమను. ఒక సంవత్సరం అప్రెంటిస్ కి మూడేళ్లు వుంచుకున్నారుగా, పోనీ ఎక్కడికి వెళ్ళను. నన్ను కంఫర్మ్ చెయ్యండి అని అడగలేకపోయావా? ఏమైనా ఖర్చులు ఇచ్చుకుంటానని చెప్పలేదా?” సుబ్బారావు సలహా మాత్రంగా అన్నాడు.
“అదీ అడిగా. చాలా ముక్కుసూటి మనిషి. లోంగే రకం కాదు గురు. అన్ని డిపార్టుమెంట్ల హెడ్డులు ఝడుస్తారు ఈయన్ని చూడగానే” గోవర్ధన్ తన బంతిని మళ్ళీ – వైపుకి గిరాటేసాడు.
అప్పటికే సుబ్బారావు మెదడు వేడెక్కిపోయింది. ఓ పావుగంట నిశ్శబ్దంగా ఉండిపోయేడు.
“సామ, దాన, భేద ఉపాయలన్ని అయ్యేయన్నమాట. ఇక దండోపాయమే. కింద వాడి ఇబ్బందులని చూడని వాడు అసలు అధికారానికే పనికిరాడు. వెళ్ళు, వెళ్లి ఓ ధమ్కీ ఇచ్చేయి. తెలివైనవాడైతే, నువ్వు ఆఫీస్ ప్రహరీ దాటకుండా రిలీవింగ్ సర్టిఫికెట్ ఇస్తాడు. లేదా ఇక్కడికి వచ్చేయి” అంటూ గోవర్ధన్ ముఖంలోకి సాలోచనగా చూసేడు.
అమాయక ప్రాణి, పనయ్యిందా మంచిదే. లేకుంటే నాకూ ఓ కొత్త దారి దొరుకుతుంది. చేస్తున్న వ్యాపారం తిరగటం ఎక్కువయ్యి, పైసలు కనిపించటం లేదు.
“గురు, నువ్వు చెప్పేవు, నేను పాటిస్తా. మంచో చెడో. బెడిసికొడితే నువ్వు మాత్రం ‘స్వయం ఉపాధి కింద లోన్ కి రెడీ అవ్వు” అంటూ గోవర్ధన్ యుద్ధభేరి మోగించేడు.
“శుభమస్తు” అంటూ సుబ్బారావు అభయ హస్తం ఇచ్చేడు. జేబులోంచి నోట్లకట్ట గోవర్ధన్ చేతిలోపెడుతూ, “ఇది అప్పుగా ఇస్తున్నా. మొదటి జీతం రాగానే నాకు పంపించెయ్యి”.
“నేనొస్తున్నట్టు ఎవరికీ తెలియదు. నేను మళ్ళీ వెనక్కి వెళ్తున్నా. నువ్వు కూడా ఎవరికీ చెప్పకు” గోవర్ధన్ సుబ్బారావు ని గాఢ ఆలింగనం చేసుకుని తూరుపు రేఖ వస్తున్న దిశగా నడక సాగించేడు.
గట్టిగా నిట్టూర్చిన సుబ్బారావు, మిగిలిన సగం నిద్ర పూర్తి చెయ్యడానికి ఇంట్లోకి వెళ్ళిపోయేడు.
నాలుగురోజుల తరువాత ఒక పోస్టుకార్డు గోవర్ధన్ దగ్గర నుండి సుబ్బారావుకి వచ్చింది. “డ్యూటీలో జాయిన్ అవుతున్నాను. స్టేషన్కి ఫలానా ట్రైన్ కి రా. మిగిలిన విషయాలు ముఖస్థం.”
ఎదో సినిమా లో డైలాగ్ “భయపడే వాడే బేరానికి వస్తాడు” అని.
ఇందులో నిజం ఉందొ లేదో తెలియదు కానీ భయపెట్టకపోతే పనులు జరగవన్నది సత్యం.

—————————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *