March 4, 2024

ప్రేరణ

రచన: లలితా వర్మ

“అక్కడ సీటుంది కూర్చోండి.” తన వెనకగా వినబడిన చిరపరిచితమైన కంఠస్వరం తల వెనక్కి తిప్పేలాచేసింది.
వెనుదిరిగిన వాసంతి తన వెనకాల నిలబడిన వ్యక్తిని చూసి సంభ్రమానికి గురైంది. అప్రయత్నంగా ఆమె పెదవులు వుచ్చరించిన పేరు “ప్రభాకర్.”
కదులుతున్న బస్ లో ఒకచేత్తో పాపని యెత్తుకుని, మరో భుజానికి బరువైన హాండ్ బాగ్ వేలాడుతుండగా డ్రైవర్ వెనకాలవున్న రాడ్ ని ఆనుకుని నిలబడిన వాసంతికి అడుగు తీసి అడుగు వేయడం కష్టంగా వుంది.
సందేహిస్తూ అలాగే నిలబడిన వాసంతి చేతిలోని పాపని చొరవగా తన చేతుల్లోకి తీసుకుని సీటువైపు కదిలాడు ప్రభాకర్.
అతని వెనకాలే నాలుగు సీట్లవతలికి వెళ్లిన వాసంతి ప్రభాకర్ చూపించిన సీట్లో కూర్చోబోతుండగా ” ఆ బాగ్ యిటివ్వండి ” అంది ఆ సీట్లో కూర్చున్న అమ్మాయి ఇంకాస్త పక్కకి జరుగుతూ యెంతో మృదువుగా. బాగ్ ఆ అమ్మాయికిచ్చి తను కూర్చోగానే పాపని తన ఒళ్లో కూర్చోబెట్టి నిలబడ్డాడు ప్రభాకర్.
“మీరు వాసంతి కదా మా వారు చెప్పారు” పలకరించిందా అమ్మాయి.
“వూ” అని తలాడించి ప్రభాకర్ భార్య కాబోలు అనుకుని, పాపకి వేసిన స్వెటర్, టోపీ సవరిస్తూనే ఆ అమ్మాయిని క్రీగంట పరీక్షగా చూసింది వాసంతి.
కోల మొహం చామనఛాయ, పెద్ద కళ్లు, కోటేరేసినట్లున్న ముక్కు, మెడలో మంగళ సూత్రం గొలుసుతోపాటు, సన్నని నల్లపూసల దండ, చేతులకి రెండేసి బంగారుగాజుల మధ్య ఎర్రని మట్టిగాజులు, బెంగాలీ కాటన్ చీర, సింపుల్ గా, డిగ్నిఫైడ్ గా అందంగానేవుంది అనుకుంది వాసంతి.
ఎందుకో కాస్త అసూయ కలిగింది. బహుశా ఆ అమ్మాయి అనాకారి అయివుంటే తన మనసుకి సంతోషం, తృప్తి కలిగివుండేవేమో! మానవనైజమే అంత!
తను నిరాకరించిన ప్రభాకర్ తనకు యే మాత్రం తీసిపోని అమ్మాయిని చేసుకోవడం వాసంతిలో అసూయను కలిగించింది. అవివేకంతో తాను చేజార్చుకున్న వజ్రాన్ని దక్కించుకున్న ఆ అమ్మాయిని చూస్తుంటే ఈర్ష్యతో మనసు రగిలి పోతుంది.
ప్రభాకర్ తనని మర్చిపోకుండా అనుక్షణం గుర్తు చేసుకుంటూ, తను దక్కితే బాగుండునని బాధ పడుతూ వుంటే, తనకి తృప్తిగా వుండేదేమో! ఇపుడు తను అనుభవిస్తున్న బాధకి కాస్త ఉపశమనం కలిగేదేమో
“ఎక్కడుంటున్నారు? పాప ఒక్కతేనా?” అడుగుతుంది ప్రభాకర్ భార్య.
“ఎర్రమంజిల్ కాలనీ, వూ… ఒక్కతే” ముభావంగా సమాధానమిచ్చింది వాసంతి.
“మీ పేరేంటి?” వాసంతి ప్రశ్న.
“అరవింద” అందా అమ్మాయి అరవిచ్చిన పెదవులపై చిరునవ్వు కదలాడగా.
‘ప్రభాకర్, అరవింద బాగున్నాయి’ మనసులోనే అనుకుంది వాసంతి.
ఆ తర్వాత తను వేసే ప్రశ్నలకి వూఁ ఆఁ అంటూ ముక్తసరిగా సమాధానాలిస్తున్న వాసంతి ని గమనించిన అరవింద మాట్లాడకుండా కిటికీ లో నుండి బయటకు చూస్తూ కూర్చుంది.
అరవిందని నఖశిఖపర్యంతం పరిశీలించిన వాసంతి ప్రభాకర్ వైపు చూపు సారించింది. ఆరేళ్ల క్రితం చివరిసారిగా తను చూసినపుడెలావున్నాడో అలాగేవున్నాడు, అనుకోగానే వాసంతికి ఆనాటి సంఘటనలు గుర్తొచ్చాయి.
……………
“ఇదంతా నువ్విచ్చిన అలుసు కదూ! లేదంటే అంత ధైర్యంగా నా మనవరాల్నే అడుగుతారా ? స్థాయిని బట్టి స్నేహాలు చేయాలని వూరికే అన్నారా! పొద్దూకులూ సావిత్రి సావిత్రి అంటూ పూసుకుని తిరిగావు కదా, కొంపమీదకే తీసుకొచ్చారు పీడాకారాన్ని!” నాన్నమ్మ పెద్దగా కేకలేస్తుంటే, అమ్మ దోషిలా నిలబడింది.
నాన్న వులుకూ పలుకూ లేకుండా వాలు కుర్చీలో కూర్చున్నాడు యోగిలా.
వాసంతికీ అమ్మ మీద కోపంగానే వుంది, ఆరోజు సావిత్రి ఆంటీ తనని వాళ్ళింటి కోడలి గా చేసుకోవాలనుందని చెప్పిందని తెలిసినప్పటినుండీ. సావిత్రి ఆంటీ వాళ్లు తమ పక్కింట్లో అద్దెకుండేవారు.
వాళ్ళాయన యేదో ఆఫీసులో గుమాస్తాగా చేసేవాడు. వాళ్ల ఒక్కగానొక్క కొడుకు ప్రభాకర్.
సావిత్రి ఆంటీ కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ, స్వెటర్లు అల్లడం, క్రోషియా, లాంటి వాటిలో చాలా నైపుణ్యం కలిగి వుండేది. దాంతో ఆ కాలనీ ఆడవాళ్లు చాలా మంది ఆవిడ దగ్గర వాటిని నేర్చుకోవటానికి తీరిక సమయాల్లో వెళ్తుండేవారు. అలాగే వాసంతి తల్లి పద్మావతమ్మ కూడా వెళ్లేది.
ఏ ముహూర్తాన పరిచయమైందోకానీ పద్మావతమ్మకు సావిత్రికీ బాగా దోస్తీ కుదిరింది.
సావిత్రికి వచ్చిన విద్యలన్నీ పద్మావతమ్మ నేర్చేసుకుంది. ఓ కుట్టుమిషను కూడా కొనుక్కుని అత్తగారికి, తనకీ, జాకెట్లు కుట్టడం, వాసంతికి చక్కని డ్రెస్ లు కుట్టడం, పాత చీరలను ఒకదానికొకటి అతుకులు వేసి అందమైన డిజైన్ వచ్చేలా దిండు గలేబులు కుట్టడం, ఇంటిల్లిపాదికీ స్వెట్టర్లు అల్లడం, ఇవన్నీ చేస్తుంటే మురిసిపోయింది అత్తగారు. అంతవరకూ బాగానే వుంది కానీ సావిత్రి కొడుక్కి తన మనవరాలిని యిమ్మని అడగటమే ఆవిడకి తిక్కరేపింది.
మేమెక్కడ,వాళ్లెక్కడ, అడగటానికి నోరెలావచ్చింది? అంటూ చుట్టుపక్కల ఇళ్లలో వాళ్లకి వినబడేలా యాగీ చేసింది. కూతురు, సావిత్రికి కోడలయితే సుఖపడుతుందని, అబ్బాయి చాలా మర్యాదస్తుడని, ఆడవాళ్లను గౌరవించే స్వభావం వుంది కాబట్టి పిల్లని సంతోషంగా వుంచగలడని నచ్చచెప్పింది పద్మావతమ్మ.
అత్తగారు ససేమిరా అంది.వంతపాడాడు భర్త.
తాను చూసిన సంబంధమే నిశ్చయం చేయాలని పట్టుబట్టిన అత్తగారిని ఒప్పించలేక, కూతుర్ని మెప్పించే ప్రయత్నం చేసింది పద్మావతమ్మ. అదీ విఫలమే అయింది. వాసంతికి బాల్యంనుండే నాన్నమ్మ ప్రభావం యెక్కువ.
తామేదో పేద్ద, గొప్ప వంశంనుండొచ్చామని, తాతగారి దానధర్మాలమూలంగా ఆస్తంతా పోగొట్టుకుని, యిలా అలగా జనాలుండే యీ కాలనీలో వుండాల్సిన కర్మ పట్టిందని, లేకపోతే యెక్కడో వుండేవారమని నూరిపోసింది.
ఆ మాటల ప్రభావం వాసంతి పై బాగా పడింది.చిన్నప్పటి నుండే తాను గొప్పింటిబిడ్డననే అహంకారం ఆమెలో పాతుకుపోయింది. ఆఫ్ట్రాల్ బట్టలు కుట్టుకునే ఆవిడకి యెంత ధైర్యం తనని కోడలిగా చేసుకోవాలని అడగటానికి అని కోపంతో వూగిపోయింది వాసంతి.
తల్లినే తప్పుబట్టింది. నువ్విచ్చిన అలుసే యిది అని.
పద్మావతమ్మ చాలా రకాలుగా కూతురికి నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. ఫలితం శూన్యం.
ఎవరడ్డుచెప్పినా ఎదిరించో వొప్పించో కూతురి పెళ్లి ప్రభాకర్ తో చేయాలనుకున్న పద్మావతమ్మ, కూతురే కాదనటంతో చేసేదేమీ లేక, అత్తగారు చూసిన దూరపు బంధువుల సంబంధం చేయటానికి ఒప్పుకోక తప్పలేదు. అలా వాసంతి “మిసెస్ కేశవ వర్మ” గా మారింది.
మొదటి చూపులోనే అతని అందానికి ఆకర్షితురాలైన వాసంతి, పెళ్లయిన కొద్ది రోజులకే, బాహ్యసౌందర్యమే తప్ప అతనిలో అంతఃసౌందర్యం మచ్చుకైనా లేదని తెలుసుకుంది. మూర్తీభవించిన పురుషాహంకారం తన భర్త, అని గ్రహించడానికి ఎక్కువ రోజులు పట్టలేదు.
నా కొడుకు సుగుణాలరాశి, ఏ దురలవాట్లూ లేవని మురిసిపోయే అత్తగారు, అడుగడుగునా దర్పాన్ని వొలకబోస్తూ ఆభిజాత్యాన్ని ప్రదర్శించే మామగారు, ఆయన్ని అనుసరించే భర్త, చిరాకేసేది వాసంతికి. నిజమే భర్తకి దురలవాట్లేవీ లేవు.
ఆడదాన్ని,అందునా భార్యని చెప్పుకింద తేలులా పడి వుండమనే దుర్బుద్ధి మాత్రమే వుంది. భార్యే కాదు భార్య తరఫు బంధువులెవరైనా, చివరికి కన్న తల్లిదండ్రులైనా గౌరవానికి అర్హులు కారు వారి దృష్టిలో.
తాను దిగాల్సిన స్టేజ్ రావడంతో ఆలోచనలకు బ్రేక్ వేసి, పాపని చంకనేసుకుని లేచి బాగ్ కొరకు చేయి చాపిన వాసంతిని వారిస్తూ “మీరు పదండి ” అంటూ బాగ్ తను పట్టుకొని ఆమె వెనకాలే డోర్ వరకూ వెళ్లి, ఆమె దిగాక బాగ్ అందించిన ప్రభాకర్ కి థాంక్స్ చెప్పి ముందుకు కదిలింది.
తన దగ్గరగా వచ్చిన ఆటో మాట్లాడుకుని ఎక్కి కూచుంది.
అరవిందకి థాంక్స్ కూడా చెప్పలేదు కనీసం వెళ్లొస్తానని కూడా చెప్పని తన అహంకారాన్ని తల్చుకుని తనలో తానే సిగ్గుపడింది. తనకెందుకు చెప్పటానికి మనస్కరించలేదు..
తను సంస్కారహీనురాలా? మరి తనకీ, తన భర్తకీ తేడా యేముంది. ఆలోచిస్తున్న వాసంతికి అమ్మ చెప్పిన విషయాలన్నీ గుర్తొచ్చాయి. బహుశా ఈనాటి తన ప్రవర్తనకి అదే కారణమనుకుంటా!
ఆరేళ్లుగా వింటుంది అమ్మ నోట. అరవింద్ పెళ్లి చేసుకున్నాట్ట. పేదింటి అమ్మాయిని పైసా కట్నం తీసుకోకుండా చేసుకున్నాట్ట.
అమ్మాయి టీచరట.. తల్లితో ఒక ఇన్సిట్యూట్ పెట్టించాట్ట. చాలామంది ఆవిడ దగ్గర, కుట్లు అల్లికలు, వగైరాలలో తర్ఫీదు పొందుతున్నారట. ఇన్టిట్యూట్ కి ప్రభుత్వ గుర్తింపు లభించిందట.
తను పుట్టింటికి వెళ్లినపుడల్లా తల్లి వాళ్ల విజయగాధల్ని యేకరువు పెడుతూనే వుంది. వాళ్లంత సక్సెస్ సాధించడమే తన అసూయకి కారణమా ?
వారిని దూరం చేసుకుని, ఒక అహంకారికి భార్యయై అడుగడుగునా మనసుకు తగిలే గాయాలతో బాధపడుతూ బ్రతుకు గడుపుతున్నతనకి, విజయపథంలో దూసుకుపోతున్న తల్లీ కొడుకులను తలచుకుంటే సహజంగా కలిగే ఈర్ష్యా? తను పోగొట్టుకున్న స్థానాన్ని పొంది ఆనందంగా వుందని అరవింద పైన ద్వేషమా?
ఈ కారణాలవల్లే అరవిందతో తను మాట్లాడలేకపోయిందా? వాసంతిలో ఆత్మ సంఘర్షణ ప్రారంభమైంది.
ఆటో దిగి గడపలో కాలుపెట్టిందో లేదో.. “అయినాయా సంబరాలు అపుడే వొచ్చేశావేం యింకో నాలుగు రోజులుండకపోయావా?” వెటకారంగా దీర్ఘాలు తీసింది అత్తగారు.
“వుండేదాన్నే రేపు కాలేజీ తెరుస్తారుగా అందుకే వొచ్చేశా ” చురుగ్గా సమాధానమిచ్చింది వాసంతి.
లోపలి గదిలో బిజినెస్ కి సంబంధించిన ఫైల్స్ చూస్తున్న కేశవ, పని ఆపి ” ఏం పెట్టి పంపారేంటి మీ పుట్టింటోళ్లు?” అడిగాడు గొంతులో వెటకారం నింపుకుని.
“హుఁ అంతోటి భాగ్యం కూడానా ! మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి అంటుంది వాళ్ల నాన్నమ్మ వాళ్లేం పెడతారూ..” సాగదీసింది అత్తగారు.
నిద్రపోతున్న పాపని మంచం మీద పడుకోబెట్టి,భర్తకి సమాధానం ఇవ్వకుండా ఓ సారి కళ్లెత్తి చూసి బాత్రూమ్ లో దూరింది వాసంతి. ఛీ ఏం మనుషులు పాపతో ప్రయాణం యెలా సాగింది. ఎప్పుడు బయలుదేరావు లాంటి పరామర్శలు లేకపోగా వెటకారాలు!! ఎప్పుడు పుట్టింటికెళ్లివొచ్చినా యిదే ధోరణి. కేశవ తన వెంట రాడు.
తిరిగి పిల్చుకు రావడమూ చేయడు. తనవాళ్లెవరైనా దిగబెట్టడానికొస్తే ఏదోవొకరకంగా అవమానించి పంపుతారు. అందుకే తనవారినెవ్వరినీ రమ్మని పిలవదు వాసంతి. సిటీలోనేవున్న పుట్టింటికి తనకి వీలయినప్పుడల్లా వెళ్లొస్తుంది.
ఫ్రెషప్పయి, పాపకి పాలు కలిపేలోగా పాప లేవటంతో, పాపకి పాలు పట్టిస్తూ కూచున్న వాసంతితో “తొందరగా తెమిలి వంటేమైనా చేస్తావా?” నడ్డిమీద చేయిపెట్టుకుని అడుగుతోంది అత్తగారు.
పాపకి పాలు కలిపేటపుడు వంట గదిలో చూసింది వాసంతి. ఉదయం వంట చేసుకున్న దాఖలాలేమీ కన్పించలేదు. అన్నీ వండాలిపుడు. అదే అంది అత్తగారితో.
“ఎవడు వండుతాడనుకున్నావు? మీ బాబు పంపిన వంటవాడెవడైనా వున్నాడేంటి. ఇంటికి దగ్గరుంది కాబట్టి నా కూతురు యీ నాల్రోజులూ వొచ్చి కాస్త వుడకేసి పెట్దింది. నాకు నడుం నొప్పని, పాపం చేసుకోలేననీ, కూతురు గాబట్టి ఆలోచించింది. ఈవేళ దాని కొడుక్కి జ్వరం, అందుకే రాలేదు. బయట నుండి కారేజీ తెప్పించుకు తిన్నాం. నీకేమైనా ధ్యాస యేడిస్తేగా.”
అత్తగారి వాక్ప్రవాహానికి అడ్డు కట్ట వేస్తూ “సర్లెండి పాపని కాసేపు భుజాన వేసుకోండి” అంటూ పాపని అందిస్తుంటే అయిష్టంగానే అందుకుని మొహం ముటముట లాడిస్తూ కూర్చుందావిడ. వంట చేస్తున్నంత సేపూ అత్తగారి ధోరణిని తిట్టుకుంటూనే వుంది.
‘ఈవిడకి నడుం నొప్పైతే కూతురొచ్చి వంట చేస్తే మహోపకారం. నేను మాత్రం తల్లికి జ్వరంగా వుంటే వెళ్లి సహాయం చేయటం మహాపరాధం!’ అనుకుంది మనసులో. ఈ మాట ముఖాన్నే అనేసేదే, కానీ పతి దేవులవారు చేసే రాద్ధాంతం తెలుసు కాబట్టి ఆ పని చేయలేదు.
అందుకే మనసులోనే తిట్టుకుంటూ అక్కసు అంతా వెజిటబుల్ కట్టర్ పైన చూపిస్తుంటే వేలు తెగింది.
‘అబ్బా’! అని అరిచినా ఏమైందని అడగని భర్తని తిట్టుకుంటూ ఆ వేలిని పసుపుతో కాసేపు వొత్తిపట్టి తన పని తాను చేసుకుంది.
పెళ్లయిన కొత్తలో యిలాగే చెయ్యి కాలితే ‘నువ్వు ఆడదానివేనా చెయ్యెట్లా కాల్చుకున్నావ్? అన్నాడు భర్త. అందుకే యే గాయమైనా అతనికి చెప్పటం యిష్టం లేదు. చెప్పి మనసుకీ గాయం చేసుకోవటం యెందుకన్పించింది వాసంతికి.
అడుగడుగునా మనసు చివుక్కుమనేలా వుంటాయి తల్లీ కొడుకుల మాటలు. మామగారు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లే వుంటారు. ఆడపడుచు దీ తండ్రి పోలికే. ప్రక్కింటిలోనే వున్నా ఏదీ పట్టించుకోదు.
వాసంతికి మాత్రం ముళ్ల పంజరంలో యిరుక్కున్నట్లుగా, వూపిరి ఆడనట్లుగావుండేది మొదట్లో. తండ్రీకొడుకులు బయటకెళితే, అత్తగారు కూతురింటికి వెళితే, పంజరంలోనుండి బయటపడిన విహంగంలా, స్వేచ్ఛావాయువులు పీల్చుకునేది. కానీ అది తాత్కాలికమే. ఈ విషయాలేవీ పుట్టింటివారికి చెప్పదలచుకోలేదు వాసంతి
ఒక్కోసారి యిల్లువదలి వెళ్లిపోవాలన్పించేది. అది పరిష్కారం కాదని తనకు తానే సమాధానం చెప్పుకునేది. ఇంట్లోనే వుంటే పిచ్చెక్కుతుందని గ్రహించి, తను డిస్కంటిన్యూ చేసిన ఎమ్.కాం. పూర్తిచేయాలని సంకల్పించి సీరియస్ గా చదివింది.
ఎమ్.కాం.పరీక్షలవగానే పాప పుట్టడంతో, పాపకి నాలుగోనెల పూర్తయాక ఓ ప్రైవేటు కాలేజీలో లెక్చరర్ గా చేరింది. తొలిచూలు మగ పిల్లాడు కావాలని అత్తగారు, భర్త కోరుకున్నారు.
వాసంతి మాత్రం తనకు ఆడపిల్లే పుట్టాలని వెయ్యి దేవుళ్లకి మొక్కుకుంది. ఈ పురుషాహంకార వంశానికి మరో వారసుణ్ణి కనడం ఆమెకిష్టంలేకపోయింది. ఆడపిల్లని కన్నదని, అదీ తన తప్పే నన్నట్లు మాట్లాడినా పట్టించుకోలేదు వాసంతి. తన కోరిక నెరవేరినందుకు కలిగిన సంతోషంలో వారి మాటలు పెద్దగా బాధపెట్టలేదు. రోజులు గడుస్తున్నాయి.
………………..
ఆ రోజు ఆదివారం. టీవీ లో ప్రసారమయ్యే మట్టిలో మాణిక్యాలు కార్యక్రమం వాసంతికి చాలా యిష్టం. పనులన్నీ పూర్తిచేసుకుని టీవీ ఆన్ చేసుకుని కూర్చుంది వాసంతి.
“ఈనాటి మట్టిలో మాణిక్యాలు కార్యక్రమంలో ఒక మహిళా ఎంటర్పెన్యూర్ ను పరిచయం చేస్తున్నాం. సాధారణ గృహిణి నుండి పారిశ్రామికవేత్తగా యెదిగి, రాష్ట్రప్రభుత్వం నుండి ఉత్తమ పారిశ్రామికవేత్త అవార్డుకు ఎంపికైన మహిళా ఎంటర్పెన్యూర్ మన స్టూడియోలో వున్నారు. మరి ఆవిడ విజయానికి,ఆవిడ చేసిన కృషి యేమిటో, యెవరి సహకారంతో ఆవిడ యీ స్థాయికి చేరుకోగలిగారో తెలుసుకుందాం” అంటూ యాంకరమ్మ ఉపోద్ఘాతం ముగించింది.
“నమస్తే అండీ”.
“నమస్తే” అంటూ ప్రతి నమస్కారం చేస్తున్న ఆవిడవైపు తిరిగింది కెమెరా. ఒక్క క్షణం ఆశ్చర్య పోయింది టీవీ చూస్తున్న వాసంతి. అవార్డు గ్రహీత సావిత్రి ఆంటీ. అలాగే స్థాణువయి చూస్తూండిపోయింది.
“చెప్పండి సావిత్రి గారూ మీ ఇన్టిట్యూట్, మీ స్వస్థలం, మీ ప్రస్థానం గురించి” అడిగింది యాంకరమ్మ.
“మాది ప్రేరణ ఇన్టిట్యూట్ కం. స్టోర్ అండీ. ఎస్.ఆర్ నగర్ లో వుంది. మాది కరీంనగర్ జిల్లాలో చిన్న పల్లెటూరు. మా నాయన చేనేత కార్మికుడు. అమ్మ యింట్లోనే బట్టలు కుట్టేది, కుట్లు అల్లికలు అన్నీ అమ్మ దగ్గర్నుంచే నేర్చుకున్నా.”
“మీరెంతవరకు చదువుకున్నారు”?
“నేను అయిదు వరకే చదివిన. మా వూర్ల బడిలో అంతవరకే వుండింది. పక్క వూరికి పంపించే శక్తి లేదు. మేమిద్దరం అక్కా చెల్లెళ్లం అక్కకి పెండ్లి చేయటానికి యిల్లు తాకట్టు పెట్టిన్రు. అప్పులు తీర్చలేక నాయన ఆత్మహత్య చేసుకున్నాడు. నన్ను గవర్నమెంటు కొలువు చేసెటోనికే యిచ్చి చేయాలని అమ్మ దినమూ రాత్రి కష్టపడి హైదరాబాద్ ల వుద్యోగం చేసే ఆయనకిచ్చి పెండ్లి చేసింది.అట్లా హైదరాబాద్ కు వచ్చిన.”
“ఓహో! ఇలా ఇన్టిట్యూట్ కం.స్టోర్ పెట్టడానికి ఇన్సిపిరేషన్ యెవరైనా వున్నారా ” అడిగింది యాంకరమ్మ.
“వున్నారమ్మా. మేమున్న కాలనీలో అన్ని రకాల మనుషులున్నరు. ఆఫ్ట్రాల్ బట్టలు కుట్టే ఆమె అని చిన్నచూపు చూసినవాళ్లున్నారు. అటువంటప్పుడు నాకు పట్టుదల యెక్కువయేది. ఇంకా కష్టపడి యేదైనా సాధించాలి అన్పించింది. ఇప్పటి నా స్థితికి వాళ్లు కూడా కారణమే.ఇక నేను యింత సాధించడానికి ముఖ్య కారణం నా స్నేహితురాలు. కాలనీలో అందరికీ ఫ్రీగా నేర్పించే బదులు ఒక స్కూల్ మాదిరిగా పెట్టుకోమని చెప్పింది. మా నాయన దగ్గర నేర్చుకున్న అద్దకం పని కూడా మొదలుపెట్టి చీరల అద్దకం, సేల్స్ మొదలుపెట్టమని ఆమెనే నన్ను ప్రోత్సహించింది. నాకు బ్యాంక్ నుండి లోన్ కూడా యిప్పించింది. ఆమె మేలు మరువలేను.ఆమె చెప్పినట్లే మొదలు పెట్టిన. నా కొడుకు కోడలు చాలా సహాయం చేస్తున్నారు. చిన్న తరహా పారిశ్రామిక మంత్రి గారు మా ప్రేరణ ఇన్టిట్యూట్ కం.స్టోర్ ని చూసింరు. ఒకరోజు ఫోన్ చేసి అవార్డు వచ్చిందని చెప్పిన్రు.” సావిత్రి చెప్పకుపోతోంది.
“చాలా సంతోషమమ్మా! మీ స్నేహితురాలి పేరు మాతో పంచుకుంటారా” అడిగింది యాంకరమ్మ.
“అవునమ్మా ఆమెకు టీవీ ద్వారా ధన్యవాదాలు చెప్తున్నా ఆమె పేరు పద్మావతమ్మ. బ్యాంక్ ఆఫీసర్ మహేంద్రవర్మ గారి భార్య.” వింటున్న వాసంతికి మరో షాక్ ! అమ్మ! యింత అభ్యుదయ భావాలు గలదా? అర్థమయిందిపుడు ప్రభాకర్ ని చేసుకోమని తనకెందుకు నచ్చచెప్పిందో.
“చివరగా మీరు సమాజానికి, ముఖ్యంగా యువత కి యేమైనా సందేశం యిస్తారా? యాంకర్ ప్రశ్న.
“ఏ పనైనా మనకు యిష్టమైన పని, చిన్నదా పెద్దదా అని చూడకుండా కష్టపడి చేసుకుంటే ఆ పనిలో విజయం తప్పక సాధిస్తాము. ఇంగ్లీషులో చెప్తారు కదమ్మా అదేంటో ” అని ఆపేసిన సావిత్రి కి
“డిగ్నిటీ ఆఫ్ లేబర్ ” అందించింది యాంకర్.
“ఆ ఆ అదే, పనిని గౌరవించాలి. చేయాలని సంకల్పం గట్టిగా వుండాలి.అపుడు దేవుడు ఏదో వొక రూపంలో ఆదుకుంటాడు. నేను నమ్మిన సత్యం యిదే నా జీవితంలో నిజమైంది యిదే ” అంటూ ముగించింది సావిత్రి. టీవీ ఆఫ్ చేసి ఆలోచనలో పడింది వాసంతి.
నిజమే అత్తగారన్నట్లు ” మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి ” అన్నట్లు యేనాడో వున్న వైభవాన్ని గుర్తు చేసుకుంటూ వాస్తవం పట్ల అవగాహన లేని నాలాంటివాళ్ళకు బాధ తప్పదు. అమ్మలా అభ్యుదయంగా తను ఆలోచించగలిగితే ఈనాటి మనోవేదన వుండేది కాదు కదా ! అనుకుంది వాసంతి.
రేపు తన బి.కాం. విద్యార్థినులను సావిత్రి ఆంటీ వాళ్ల ఇన్స్టిట్యూట్ కి తీసికెళ్లి, ఆంటీతో ఇంటరాక్ట్ కల్పించాలని, ఆంటీ కి సారీ చెప్పాలని, అరవిందతో మాట్లాడాలని నిశ్చయించుకున్న వాసంతి ఫోన్ తీసి తల్లికి డయల్ చేసింది.

**********

13 thoughts on “ప్రేరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *