April 16, 2024

మామ్మగారి వంటామె

రచన: రమా శాండిల్య

“ఓరి ఓరి ఓరి. . . .
ఓ చడీలేదు, చప్పుడూలేదు
అజా, ఆనవాలూ మచ్చుక్కి లేవు. . చుంచుమొహంది. . హేంత పనిచేసింది నంగానాచి మొహంది. . . ”
హాల్లోని చెక్క ఉయ్యాలలో కూర్చుని గీత చదువుకుంటున్న రంగనాధం తాతగారితో వంటమ్మాయి ‘లక్షుమమ్మ’ గురించి గొంతు తగ్గించి గుసగుసగా చెప్పింది సీతమామ్మా. . .
“మరే! శుద్ధ చలితేలు వాటం. . . దీని దుంప తెగ, చేతివాటం చూపించడంలో స్థూవర్టుపురం చొరశిఖామణులను మించిందే ఈ ముసలికుంక. . ఆ!” అంటూ మళ్ళీ సాగదీసింది మామ్మ.
గీత పారాయణంలో మునిగి మాట వినిపించుకోని తాతగారిని చూసి తలకొట్టుకుంటూ. . “ఖర్మ , ఖర్మ
ఈ మనిషి నా మాట అస్సలు వినిపించుకోరు.
మళ్ళీ ఏదైనా తెమ్మని చెబితే ‘మొన్నేగా తెచ్చాను అప్పుడే అయిపోయిందా? ‘ అని అంతెత్తున లేస్తారు. . . అంటూ ముక్కు చీదుతున్న మామ్మను చూసి, తాతగారు ‘ఏం జరిగింది’అంటూ మాట సాగదీశారు.
“అయ్యో రామా! ఇంతసేపటి నుంచి అరుస్తుంటే ఏమైంది అని చిన్నగా అడుగుతున్నారా?”
“మన వంటమనిషి లక్ష్మమ్మ గురించి, ఆమె చెయ్యి వాటం గురించి . . . చెపుతున్నాను “అంది మామ్మా
“ఓ చీరకట్టినా కొండెలక వాటంది. . . ఆ చుప్పనాతి కాంతం! చెప్పనే చెప్పింది లక్ష్మమ్మ చెయ్యి వాటం గురించి. ‘అందుకే దాన్ని తన్ని తగలేశామ్’ అని కూడా నీకు చెప్పింది. ‘దానికి నువ్వు కాంతం చుప్పనాతి తనంతో చెప్పుంటుంది’. . . అని పనిలో పెట్టుకుని ఇప్పుడు ఇలా గోల పెడితే నేనేం చెయ్యను”. అన్నారు తాతగారు. మళ్లీ ఆయనే. . .
“నా అధికారమేమైనా ఉందా ఈ ఇంట”. మన పెళ్ళైన కొత్తలో కూడా నువ్వన్తే బెండకాయ వండమంటే చేమ దుంప వండేదానివి , అదేంటి బెండకాయ కదా నెనొండమన్నది అంటే. అది జిగురు అనేదానివి. మరి చేమదుంప జిగురు కాదా? అని నేనడిగితే ‘మీది మరీ చోద్యమండి!’. . అని నామాట కొట్టేసే దానివి. ” అని తాతగారనంగానే మామ్మ. . .
“మీరేమైన తక్కువా? సంచి పట్టుకుని బజారుకెళుతూ ఏమీ కావాలి అని అడిగేవారు? నేనో పిచ్చిదానిలా కవలసినవన్ని చెప్పి ఎదురుచూస్తూ కూర్చుంటే. . . మధ్యాహ్న్నాం భోజనం టైముకి ఖాళీ సంచితో తయారయ్యేవారు. మీతో నేను కనుక కాపురం చేస్తున్నాను వేరే ఎవతైనా అయితే శంకరగిరి మాన్యాలు పట్టిపోయేవారు” అని మరొకమారు కొంగులో ముక్కు చీదేసింది మామ్మ.
దానికి తాతగారు “ఇప్పుడు నన్నేం చేయమంటావు. నీకా వంటపనీ, ఇంటిపనీ చేసుకునే ఓపికలేదు, పిల్లలతో ఉండలేవు, మధ్యే మార్గంగా పెద్దవాడు ఒక వంటవాడొకడ్ని ఏర్పాటు చేస్తే వాడ్ని మూడురోజుల్లో పంపేశావు. ” తాతగారి మాట పూర్తవకుండానే ఆయన నోట్లోంచి మాటందుకుని మామ్మ
“ఆ! సంబడం బావుంది. . . . అని ఒకధీర్ఘం తీసి
“వాడికి వంటయింటికి, పాకిదొడ్డికి తేడాతెలీదు. అసలే అతిమూత్ర వ్యాధి ఆ పిల్లకుంకకి, చెయ్యికడుక్కోడు కాళ్ళుకడుక్కుంటే జలుబుతో మూడురోజులు ఎందులో తుమ్ముతాడో తెలియక వాడి వెనక్కాలే తిరిగి, వాణ్ణి కూర్చోపెట్టి వాడుచేసే ఎంగిలిమంగలం వెధవ పనులన్నీ చూస్తూ ఎక్కడవాడిచేతి కూడు తినాలో అని. . . ఆ కూడు తినడంకంటే. . . “ఆజన్మ” ఉపోషాలూ మొక్కేసుకోడం మంచిది భగవంతుడికి పుణ్యం, పురుషోత్తం ఆ వంకతో చచ్చిపోయినా మోక్షం కూడా వచ్చేది. ” అంటూ ధీర్ఘం తీసింది మామ్మ.
“మరందుకేగా ఈ లక్ష్మమ్మని ఏర్పాటు చేసుకున్నావు. ఇప్పుడు ఈమె గురించి ఎలాతెలిసింది నీకు. ”
“ఎలా తెలియడమేంటి? వారం క్రితం మీరు పచారి కొట్టు నుండి తెచ్చిన సామాన్లు అన్ని అయిపోయాయి. వారం క్రితం ధాన్యం మిల్లులో పట్టించుకొచ్చిన బియ్యం సగం బస్తాకూడా లేవు, “బియ్యమేమిటి ఇంత తగ్గాయి డబ్బాలో అని నేనడిగితే ‘పందికొక్కులు తినుంటాయి. నన్నడిగితే నేనేం చెబుతాను’అంటూ నన్నే ఎక్కిరించి మాట్లాడిందండి”.
“ఇనప డబ్బాలో పందికొక్కులేలావచ్చాయంటసలు” లా పాయింట్ లాగారు తాతగారు.
” అవునండోయ్ నాకాఆలోచనే రాలేదు సుమా! “అని బోలెడంత ఆశ్చర్యపోయిసింది బామ్మ
“ఇంతకీ నిజంగా పట్టుకెడుతోందంటావా? ఊరికే అనుమానిస్తే పాపం కూడాను” అన్నారు తాతగారు.
“ఆ మన గోడమించి వీధిలోకి సంచీలు విసురెస్తుంటే వీధివీధి చూసారు. వీధులూడ్చే కనకం దగ్గరనుంచి. . . పక్కింటి మాష్టారు భార్య పార్వతమ్మ వరకు సాక్ష్యం చెబుతామన్నారు. అందరూ చూసారు. ”
“సర్లే! నెమ్మదిగా మాట్లాడుదాము. దెబ్బలాడకు. నేనే వీలుచూసుకుని మాట్లాడుతాను. ఏమాటకామాటే చెప్పుకోవాలి వంటచేసి వడ్డించిందంటే అపర అన్నపూర్ణమ్మే, అంత రుచికరమైన వంట శుచిగా శుభ్రంగా చక్కగా పనిచేసి పెడుతోంది. మానిపిస్తే మళ్లీ నువ్వే ఇబ్బంది పడిపోతావు అందుకే జాగర్తగా మాట్లాడదాం” అన్నారు.
“అలాగే! మీరు బాధ్యత తీసుకుంటే నాకింకేమి భయం” అనుకుంటూ సాయంత్రం దేముడు దీపారాధనకు స్నానం చేయడానికి లేచింది మామ్మ.
మర్నాడు ప్రొద్దున్నే వంటకోసం లక్ష్మమ్మ రానే వచ్చింది. చేతిలో పెద్ద గోనెపట్టాతో కుట్టిన సంచిలో మడికోసం నేత చీరొకటి పెట్టుకుని. ఎప్పుడు లేనిది తాతగారు గమనిస్తూనే వున్నారు లక్ష్మమ్మని.
మంచి పోపువాసనలతో వంట చేసేసింది. వంట చేస్తున్నంత సేపు ఏదోఒక కీర్తన కూనిరాగం తీస్తున్నట్లు పాడుకుంటూ ఉంది. గిలకలా బావిదగ్గరనుండి వంటగదికి, వంటగదినుండి కొట్టుగదికి తిరుగుతూఉంది. ఉన్నట్టుండి చేతిలో ఉదయం తెచ్చిన సంచీ బరువుగా ఏదో నింపేసి వీధి వైపుకెళ్లి గోడమీంచి జారవిడవడానికెడుతుంటే తాతగారు గట్టిగా ‘లక్ష్మమ్మా!’ అని కేక పెట్టే సరికి ఉలిక్కిపడి సంచి వెనక్కి దాచి. . .
“బాబుగారు ఏం కావాలండి?” అని అడిగింది.
“నాకేమి అక్కర్లేదు నువ్వు దాస్తున్నదేంటి?” అనే సరికి “అదా! అది నేను మడికోసం తెచ్చుకున్న చీరబాబుగారూ” అనేసరికి
తాతగారు” చీరెంటి మొయ్యలేని బరువెక్కింది దానికి రుబ్బురోలేమైన కట్టి పట్టుకెడుతున్నావా?” అనిగదమాయించి ఆడిగేసరికి బోరున ఏడవడం మొదలెట్టింది.
“అయ్యయ్యో! అదేమీ అగాయచ్చమ్! చేసే వెధవపన్లు చేసేసి ఎదురెడుస్తావేంటమ్మాయి ఆపు ఆపు ” అంటూ గట్టిగా కోప్పడేసరికి తీసిన మూట బయటపెట్టింది లక్ష్మమ్మ!. . .
మూటనిండా పప్పులు, ఉప్పులు వాడని చిన్నచిన్న ఇత్తడి గిన్నెలు ఒకటనేమిటి పట్టదు కానీ ఇంటినే పెట్టేసును ఆ సంచిలో.
సితమ్మామ్మా, తాతగారు. . . లక్ష్మమ్మను కూర్చోబెట్టి “నువ్వు మా పిల్లలాంటి దానవు. నీకేం కర్మ ఇలాంటి పనులు చేయడానికి. ఆ కాంతం నీగురించి చెబితే కూడా. . . నిన్ను నమ్మి పనిలో పెట్టుకున్నాము! నువ్వేమో ఇలాంటి పనిచేశావు ” అనేసరికి పెద్దవాళ్ళిద్దరి కాళ్ళు పట్టుకుని
“మరొక్కసారి ఇలాంటి పనిచేయనమ్మా! . . . ఇంట్లో వారికి తిండి సరిగాలేదు అందుకే బుద్ధిగడ్డి తిందమ్మా! ” అనేసరికి మళ్లీ పనిలో పెట్టుకున్నారు పెద్దవాళ్ళిద్దరు.
చూడాలి మళ్ళి ఏంచేస్తుందో మన చుంచెలక లక్ష్మమ్మ!. . . .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *